http://www.sodhini.com

28, నవంబర్ 2012, బుధవారం

ప్రకృతి ద్వారా పరమాత్మ సందేశాలు

ప్రకృతిలో పరమాత్మతత్త్వం ప్రతిబింబిస్తుంది. ప్రకృతిలో ప్రతీది సృష్టికర్త నియమానుసారం నడుస్తూ, సృష్టికర్త సందేశాన్ని సకల మానవాళికి అందిస్తుంది. ప్రకృతితో సహజీవనం చేసే పశుపక్షాదులు కూడా భగవంతుడు తమని సృష్టించినప్పుడు ప్రాసదించిన సహజగుణంలోనే ఉంటూ, సృష్టికర్త సందేశాన్ని తెల్పుతాయి. అవన్నియూ ఎలా జీవించాలో, ఏం నేర్చుకోవాలో మానవునికి తెలియజేస్తునే వుంటాయి. 
భూమి, ఆకాశం, సూర్యచంద్రులు, నీరు, అగ్ని, గాలి, నది, సముద్రం, పక్షులు, చెట్టు,పువ్వు............... అన్నీ మానవావళి శ్రేయస్సుకీ, మానవజన్మ సార్ధతతకు కావాల్సిన సందేశాలను తమ మనుగడ ద్వారా ఇస్తూనే వుంటాయి. అది ఎలాగో ఓసారి పరిశీలిద్దాం. 
                                                               భూమి
          
             గుండెలో గుచ్చినను భరించి ప్రతిఫలంగా పంటలను, పుష్ప ఫలవృక్షాలను, ప్రాసాదిస్తూ, అలానే, మలమూత్రాలను విసర్జించినను, త్రొక్కివేస్తున్నను, ఎంతో నష్టం కష్టం కల్గిస్తున్నను క్షమత్వంతో సహనంగా ఉండడం ద్వారా - క్షమత్వమును, ఓర్పునూ, భూతదయను కల్గివుండాలన్న సందేశం "భూమి"ది.

                                                             ఆకాశం

            వచ్చి పోయే మేఘాల వలన మలినపడకుండా, సూర్యచంద్రులు, నక్షత్రాలు, వాయువు తనతో ఉన్నా, వాటితో ఎలాంటి సంగత్వం ఏర్పరుచుకోకుండా, నిర్మలంగా ఉండడం ద్వారా - మానవుడు కూడా వచ్చే పోయే ఆలోచనలతో అంతఃకరణమును మలినపరుచుకోకుండా స్వచ్ఛంగా ఉండాలని, ఎన్ని బంధాల మద్య ఉన్నా  వాటితో సంగత్వం కల్గియుండక నిర్మలంగా వుండాలన్న సందేశం "ఆకాశము"ది. 

                                                             సూర్యుడు

             ఒక చిన్న మడుగైనా, పిల్లకాలువైనా, నదైనా, మహాసముద్రమైనా అన్నింటిలో ఒకేలా ప్రతిబింబిస్తూ, అలానే, నీళ్ళ కుండలలో ప్రతిబింబించి అనేక సూర్యులుగా కన్పించడం ద్వారా - మానవుడు సమత్వదృష్టి కల్గియుండాలని, అలానే పరమాత్మ ఒక్కడే అయినా అనేక శరీరములయందు ఆత్మగా గోచరిస్తాడన్న జ్ఞాన సందేశము "సూర్యుడు"ది.

                                                             చంద్రుడు

             వెలుగూచీకటలతో వృద్ధిక్షయాలను పొందడం ద్వారా - జీవితంలో సుఖదుఃఖాలు సహజమనే సందేశం "చంద్రుని"ది.
                                                               నీరు

           ఎటువంటి మలినాలైనను వాటిని శుద్ధిచేసి తాజాదనమును, నిగారింపును తీసుకురావడం ద్వారా - మానవుడు కూడా మనోమాలిన్యాలను తొలగించుకొని శుద్ధత్వము కల్గియుండాలన్న సందేశం "నీటి"ది. 
                                                                అగ్ని

            స్థూల మాలిన్యాలని హరింపజేసి, ప్రకాశిస్తూ, కారణ రూపాన్ని విడిచిపెట్టడం ద్వారా - మానవుడు కూడా కర్మపాశాలను హరింపజేసుకొని భక్తిజ్ఞానంలతో ప్రకాశించాలన్న సందేశం "అగ్ని"ది. 

                                                              గాలి

         అన్నిచోట్ల తిరిగినను, అన్నింటిని స్పృశించినను అన్నింటిని ఎక్కడికక్కడే విడిచిపెట్టేస్తూ, అంతటా ఉన్ననూ ఏదీ అంటించుకోకుండా స్వచ్ఛంగా ఉంటూ, అలానే తను ఉన్నచోట వాతావరణమును చల్లగా, ఉల్లాసంగా ఆహ్లాదంగా మార్చుతూ, అందరిలో జీవాన్ని నింపడం ద్వారా - మానవుడు కూడా అహంకారరహితంగా ఏదీ అంటించుకోకుండా తామరాకుపై నీటిబొట్టులా నిస్సంగుడై జీవించాలని, అలానే ఉన్నచోట అందరిని ఆనందంగా వుంచుతూ, ఉల్లాసంగా జీవించాలనే సందేశం "గాలి"ది.
                                                              నది

       తాను ఎక్కడ యున్నదో పట్టించుకోక పర్వతమైన, లోయైనా, వంకలైనా, డొంకలైనా, రాళ్ళరప్పల సందులైనా ఏమాత్రం తేడా లేకుండా ప్రవహిస్తూ, తనకి మూలమైన సముద్రాన్ని చేరేంతవరకు ప్రయాణిస్తూనే వుంటూ, పత్రపుష్పాదులు, చెక్కముక్కలు, చెత్తా చెదారములు, చిరు చిరు ప్రాణులు ప్రవాహంలో తనతోపాటు తీసుకువెళ్తూ, తనలో పాలుపోసినా, చెత్తను పడేసిన సముద్రంలో కలిసేంతవరకు ప్రవహించడమనే తన సహజలక్షణమును వదలకపోవడం ద్వారా - మానవ జీవితం కూడా పరవళ్ళుతో ప్రవహించే తనలాంటిదేనని, ఎన్ని అడ్డులు ఉన్నా వాటిని పట్టించుకోక గమ్యం చేరేంతవరకు గమనమును సాగించాలన్న సందేశం "నది"ది.

                                                            సముద్రం

            అలుపు లేకుండా తీరాన్ని తాకాలని ప్రయత్నించే అలలు ద్వారా, మరియు ఎన్ని నదులు తనలో ప్రవేశించుచున్ననూ పొంగిపోర్లిపోకుండా, అలానే నదులు తనలో చేరక ఎండిపోయినను తాను వట్టిపోకుండ ఉండడం ద్వారా - ఎన్ని సంపదలు తనని చేరుతున్న పొంగిపోక, అలానే ఏ సంపదలు చేరకపోయినా కృంగిపోకుండా హెచ్చుతగ్గుల స్థితి యందు స్థితప్రజ్ఞతో గంభీరుడై, అనుకున్నది సాదించాలనే పట్టుదలతో మానవుడు ఉండాలన్నది "సముద్ర" సందేశం.
                                                          పక్షులు

          కిలకిలారావాలతో ప్రతిక్షణం ఆనందంగా హాయిగా స్వేచ్ఛగా పరిపూర్ణంగా జీవించడం ద్వారా మానవుడు కూడా ప్రకృతి లోనే ఉంటూ, ఆనందంగా పరిపూర్ణంగా జీవించాలన్న సందేశం "పక్షుల"ది.

                                                          చెట్టు

         తన చెంతకు ఎవరొచ్చినా తరతమ భేదం లేకుండా, హెచ్చుతగ్గుల భేదం లేకుండా వచ్చింది పశుపక్షాదులా, మానవులా అన్న తారతమ్యం లేకుండా నీడను, పండ్లను ఇవ్వడం ద్వారా మానవుడు నిస్వార్ధ సేవాపరుడై ఎలా ఉండాలన్న సందేశం "చెట్టు"ది.

                                                           పువ్వు

          మొక్కపై అలరారుతూ అందంగా వికసించి, తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ పరిమళాన్ని ఇచ్చి ఆనందమును కల్గిస్తూ, వాడిపోయక హాయిగా రాలిపోతూ సరళంగా ఉండడం ద్వారా - మానవుడు కూడా అంత ఆదర్శంగానే సరళంగా జ్ఞానవంతంగా జీవించాలన్న సందేశాన్నిస్తుంది "పువ్వు".

కానీ, మానవుడు వీటిని ఎంతవరకు గుర్తిస్తున్నాడు?
అన్నీ కాకపోయినా ఇందులో ఒకటైనా జీవితాంతం ఆచరిస్తే చాలని పెద్దల వాక్కు.

25, నవంబర్ 2012, ఆదివారం

నాకు తెలిసినంతలో "భక్తి"

ఉదయాన్నే ఓ స్నేహితురాలినుండి ఫోన్...
నీతో మాట్లాడాలి, పది గంటలకు వస్తున్నానని!
అన్నట్లుగానే తన రాక.
కుశలప్రశ్నల అనంతరం -
తనేం అడిగిందో, తన మాటలలోనే ...
భారతీ, నేను నాగురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నాకు కొన్ని సందేహాలున్నాయి. గత కొద్దిరోజులుగా నాలో ఎన్నో భావాల సంఘర్షణ. నా మనో సంఘర్షణనే నీకు చెప్తున్నాను.
శాస్త్ర సహిత పూజాదికాలు, షోడశోపచారాలు, నామస్మరణలు, జపధ్యానాదులు, ఆలయసందర్శనలు, అర్చనాదులు, క్షేత్రదర్శనాలు, తీర్ధయాత్రలు............ ఇత్యాదులన్నీ ఆధ్యాత్మిక గమనంలో భగవంతునిపై భక్తి కుదురుకోవడానికి ప్రధమసోపానాలని కొందరు అంటారు. వీటిని దాటి వెళ్ళే సాధన చేయాలని అంటారు. అందుకు రాజయోగం, హఠయోగం, క్రియాయోగం, కర్మయోగం .......లాంటివి ఉన్నాయిగా, ఏదో ఒక యోగమార్గమును అనుసరించు అని అంటారు. అన్నింటికంటే జ్ఞానయోగం ఉత్తమోత్తమైనదని, జ్ఞానం మాత్రమే ముక్తిని ప్రసాదిస్తుందని కొందరంటున్నారు. వేదశాస్త్రాలు చదివి అనితరసాధన చేసి, జ్ఞానమంటే ఏమిటో తెలుసుకొన్న జ్ఞానవంతులుకేనా ముక్తి? జ్ఞానమార్గంలో ఎంతో అవగాహన, ప్రజ్ఞ, ప్రతిభ, శ్రద్ధా, దైర్యం, దీక్షా, ఆత్మవిశ్వాసం, ఆత్మబలం, ఆత్మభావనలతో అనుక్షణం 'ఎరుక'లో ఉండాలి. నేను నా సంసారబాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఏ క్షణం కా క్షణం జ్ఞానస్థితిలో ఉండడం నాకు అసాధ్యంగా ఉంది. అభ్యాసం కొలది అదే అలవడుతుందని చెప్పకు. అకుంఠితపట్టుదలతో ప్రయత్నిస్తే ఫలితముంటుందని చెప్పకు. ఇవన్నీ నేనున్న స్థితిలో నాకు ఆచరణలో కష్టం. అలానే కర్మలాచారిస్తూ, ఆ కర్మఫలాన్ని ఆశించకుండా ఈశ్వరార్పణ చేయాలంటారు. చేస్తున్న ప్రతీపనిని భగవతార్పణ భావంతో అనుక్షణం ఉండలేను. అంతటి ధార్మిక పరిణితి నాకింకా అలవడలేదు. చేసే ప్రతీ పనిని భగవతార్పణ బుద్ధితో ఆచరించలేను. ముందుగా చెప్పినట్లు నేను నాగురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అలాగని భగవంతున్ని విడిచిపెట్టలేను. భగవంతుడంటే అపారనమ్మకం. బట్ అంతటి సాధన నేను చేయలేను. నాకు భగవత్ ప్రాప్తి కావాలి. వేదశాస్త్రాలు ఇప్పుడు చదవలేను, కంటిదోషం వలన. గురువులను ఆశ్రయించలేను, కుటుంబ నేపద్యంవలన. సత్సంగాలకి వెళ్ళలేను, సమయాభావం వలన. మరి నాకు భగవత్ దర్శనం కాదా? భారతీ! నన్ను, నా తత్వాన్ని, నా తపనని అర్ధం చేసుకొని ఏదైనా సులభమార్గం చెప్పు...... ఆపై దుఖంతో ఏమీ మాట్లాడలేకపోయింది. 

అప్పడు నాకు తెల్సింది ఇలా చెప్పాను - 
ఉంది, మనలాంటి వారికి ఓ సులభమార్గముంది. అదే భక్తిమార్గం. పరమావధిని పొందడానికి సులభమైన సరళమైన సహజమైన మార్గం, భక్తిమార్గమే. పండిత పామర భేదరహితంగా సర్వులకు సాధ్యమైనది భక్తియే. వేదాలు చదవనవసరం లేదు. కుటుంబం అడ్డుకాదు, సత్సంగాలకు వెళ్ళనవసరం లేదు. విద్య, అవిద్య, శాస్త్ర పరిజ్ఞానం, వేదజ్ఞానం ఇవేవి అవసరం లేదు. నీలో భగవంతునిపై అపారప్రేమ అర్పణాభావం ఉంటే చాలు. చైతన్యమును అనుభవంలోనికి తీసుకువచ్చేవి సద్గుణాలే. భగవంతుడిని గొప్పవాడని నోటితో స్తుతించేకంటే ఆ దైవగుణాలలో (సమత్వం, శాంతి, దయ, ప్రేమ, క్షమ, వాత్సల్యం, ఔదార్యం......) కొన్నయినా అలవరచుకుంటూ చేతల్లో ఆచరించడం చేస్తే చాలు. 
గాఢభక్తితో 'శ్రీ' 'కాళ' 'హస్తి' (సాలీడు, పాము, ఏనుగు) తరించలేదా? కన్నప్ప జ్ఞాని కాదుగా, అయినా తరించాడు, తన ప్రగాఢ భక్తిచేతలవలన. భక్తియోగంతో పాటు కర్మ, క్రియా, హఠ, రాజ, జ్ఞాన యోగాలాంటి మార్గాలను కూడా మహర్షులే సూచించారు. ఏ మార్గమును ఎవరు అనుసరించిన, ఈ మార్గల లక్ష్యం ఒక్కటే. అదే జీవ బ్రహ్మైక్యం. 
ఇక భక్తి అంటే -
భగవంతునిపై ఉండే అన్యచింతన లేని అనన్య ప్రేమ. అదో నిరంతర స్మృతి. బ్రహ్మభావన చేత దేహగతమైన 'నేను' అన్న భావనను తొలగించుకుంటే మిగిలింది ఆత్మే. ఆత్మభావనలో ఉండడమే ఉత్తమభక్తి. ఆత్మానుభవం పొందడానికి ఏ విషయాలైతే ఆటంకాలుగా ఉన్నాయో వాటిని వదిలించుకోవడమే భక్తి. అంటే ఆత్మానుభవం పొందడానికి ఆటంకపరిచే దుర్గుణాలను తొలగించుకోవడమే భక్తి. 
సర్వప్రాణులను స్వాత్మయందు, సర్వప్రాణులయందు ఆత్మను చూడడమూ భక్తే. ఇక్కడ ఓసారి నీవు చెప్పిన ఓ విషయం జ్ఞాపకం వస్తుంది. సత్యసాయిబాబా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బాబా అన్న కొన్ని మాటలు నీవే చెప్పావ్. "మట్టిలో ఎన్ని మలిన పదార్ధాలు చేరిఉన్నా, దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు, అప్పుడు మట్టిని చూడరు, మీ ఇష్టదైవాన్నే చూస్తారు. అట్లే ప్రతీమనిషిలోని మంచిని మాత్రమే చూడండి, చెడుని చూడకండి" అని. ఇటువంటివి చదివి ఆచరించడం భక్తి, అనుక్షణం ఎరుకలో ఉంచుకోవడం జ్ఞానం.

నీలో తపన ఉంది, కావున.... అన్య చింతన మాని అనన్య భక్తితో పరమాత్మను తెలుసుకో. భక్తి రసామృతమును గ్రోలి ముక్తినే వద్దనుకునే భక్తులున్న (రామదాసు లాంటివారు) పుణ్యభూమి మనది. జ్ఞానమార్గం ద్వారానే కాదు భక్తిత్వం ద్వారా ముక్తిత్వం పొందవచ్చు. ఇది నేనంటున్నది కాదు. భక్తి వైశిష్ట్యం గురించి ఎందఱో చెప్పారు. 
భగవాన్ రమణమహర్షి వద్దకు ఒకరు వచ్చి రామ, కృష్ణ విగ్రహాలు తెచ్చి ఇవ్వగా - "జ్ఞానం గురించి ఎంతైనా చెప్పగలం, భక్తి గురించి ఏం చెప్పగలం?" అని కన్నీరు పెట్టుకున్నారు. 'జగత్తు - జీవుడు - ఈశ్వరుడు' మనఃకల్పితం అని చెప్పిన శ్రీ రమణుల నోటినుంచి వచ్చిన పలుకులివి. చూశావా......ఇది భక్తి పారవశ్యం.
వివేకానందుడు కూడా ఓసారి ఇలా చెప్పారు - "కర్మకంటే, జ్ఞానంకంటే యోగం కంటే భక్తి అత్యున్నతం. కారణం, ఇవన్నీ ఏదో ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించినవి. భక్తి అంటే దానికదే ప్రతిఫలం, అదే సాధన, సాధ్యమూ" అని.
అలానే  కాకభుశుండి భక్తిమార్గ వైశిష్ట్యం గురించి ఇలా చెప్తారు - 
భక్తి మహిమను ఎరింగియు, దానిని విస్మరించి, కేవలం జ్ఞానమునకై శ్రమలతో సాధన చేయువారు తమ ఇంటిలోని కామధేనువుని కాదని, పాలకై జిల్లేడుచెట్టును వెదుకుచు తిరుగువారగుదురు, అని! వివరంగా ఆ కధనం చెప్పనా?


కాకభుశుండిని ఓసారి గరుత్మంతుడు, 'జ్ఞానంతో సమానముగా ఏదియును లేదనియు, సజ్జనులు, మునులు, వేదపురాణాలు తెల్పుట సువిదితం. ఓ కృపానిధీ! భక్తిజ్ఞానమార్గముల భేదమేమి? అది నాకు వివరింపుడు అని కోరగా -
అంతట కాకభుశుండి ఇలా చెప్తారు -
"ఓ ఖగశ్రేష్టా! ఈ రెండునూ సంసారిక దుఃఖములను బాపును. కాకపొతే ఈ రెండింటి మద్య కొంత భేదమున్నది. అది సావధానంగా వినుము. 
జీవుడు ఈశ్వరుని అంశయే. కావున జీవుడు శాశ్వతుడు, చేతనుడు, నిర్మలుడు, స్వభావతః సుఖనిధానం. అట్టి జీవుడు మాయావశుడై, చిలుకవలె, కోతివలె తనకు తానే బంధంలలో చిక్కుపడుచుండును. ఈవిధంగా జడచేతనములు ముడివడియున్నవి. ఈ ముడినుండి బయటపడి ముక్తిని పొందుట మిక్కిలి కష్టము. ఆ కారణమున జీవుడు జననమరణచక్రములో చిక్కుపడును. జీవుని హృదయంలో మోహమనెడి అజ్ఞానాంధకారం దట్టముగా అలుముకొనియుండును. అందువలన ఆ ముడి కనబడదు, విడవడదు. 
భగవత్కృపచే సాత్వికశ్రద్ధ అనెడి అందమైన ఆవు హృదయమనెడి ఇంటిలో నివసించినచో, అది వేదోక్తమైన జపతపోవ్రతయమనియమాది కల్యాణప్రదమైన ధర్మాచరణమను పచ్చగడ్డిని మేసినప్పుడు ఆస్తికభావమనెడి దూడలను పొంది, దాని పొదుగునుండి పాలు రాసాగెను. నివృతి మార్గం (విషయవాసనా ప్రపంచంనుండి విముక్తి) ఆవు వెనుక కాళ్ళకు కట్టుత్రాడు. విశ్వాసమే దోహనపాత్ర. నిర్మలమైన మనస్సుయే పాలను పితికెడిదాసుడు. ఖగరాజా! ఈ విధంగా పరమధర్మమయపాలను పిదికి, వాటిని నిష్కామభావమనెడి 'మంట'పై బాగుగా కాగబెట్టవలెను. క్షమసంతోషములనెడి వాయువులు ఆ పాలను చల్లార్చును. ధైర్యం శమం వాటిని పెరుగుగా చేయును. తత్త్వవిచారమనెడి కవ్వమునకు దమమనెడి స్థంభమును ఆలంబనముగా జేసి, ప్రసన్నత్వమనెడి కుండలో ఆ కవ్వమును చేర్చి, సత్యం, మధురవచనములనెడి త్రాడును ఆ కవ్వమునకు చుట్టవలెను. పిదప ఆ త్రాడు సహాయమున కవ్వంతో ఆ పెరుగును మధింపవలెను. అప్పుడు దానినుండి వైరాగ్యమనెడి శుద్ధమనోహర పవిత్రమైన వెన్న వచ్చును. అప్పుడు యోగాగ్ని యందు సత్కర్మలనెడి ఇంధనములతో ఆ వెన్నను కాచవలెను. మమతయనెడి మురికి మాడిపోయి, జ్ఞానమనెడి నెయ్యి మిగులును. అప్పుడు నిశ్చలబుద్ధితో దానిని చల్లార్చవలెను. విజ్ఞానరూపమైన బుద్ధి స్వచ్చమైన ఆ నెయ్యిను పొంది, చిత్తమను ప్రమిదలో నింపవలెను. సమతయను సెమ్మను సిద్ధపరచి, దానిపై ఆ ప్రమిదను భద్రముగా నుంచవలెను. జాగ్రత్స్వప్నసుషుప్త వ్యవస్థలును, సత్త్వరజోస్తమోగుణములును అనెడి ప్రత్తినుండి తురీయావస్థ యనెడి శుభ్రమైన దూదిని తీసి, దానితో చక్కనివత్తిని సిద్ధపరచవలెను. ఆ వత్తిని జ్ఞానమనెడి నేతితో తడపవలెను. ఈ విధంగా తత్త్వజ్ఞానమనెడి తేజోమయమైన దీపమును వెలిగించవలెను. దానిని సమీపింపగానే అరిషడ్వర్గములనెడి శలభములు (దీపపు పురుగులు) మసియై పోవును. 'సోహమస్మి' (పరబ్రహ్మమే నేను) ఇది అఖండమైన జ్యోతి. అదియే జ్ఞానదీపముయొక్క ప్రచండదీపశిఖ. ఆత్మజ్ఞానమనెడి సుఖప్రదమైన సముజ్జ్వలప్రకాశం వ్యాపించినప్పుడు సంసారబంధములకు మూలకారణమైన భేదరూపభ్రమలు తొలగిపోవును. అవిద్య యొక్క ప్రబల పరివారమైన మోహం మొదలగు తమస్సులు పటాపంచలగును. అప్పుడు ఆ విజ్ఞాన రూపమగు బుద్ధి ఆత్మానుభవ ప్రకాశమును పొంది, హృదయమనెడి ఇంటిలో కూర్చొని, జడచేతనముడిని విప్పివేయును. అంతట జీవుడు కృతార్ధుడు అగును. కానీ, ఖగరాజా! ఆ ముడి విడిపోవుచున్నట్లు తెలియగనే మాయ మరల అనేక విఘ్నములను కల్పించును. అది సిద్ధులనెడి పెక్కు అంతరాయములను పంపును. అవి వచ్చి బుద్ధిని ప్రలోభపరుచును. ఆ ప్రలోభములు తమ కొంగుగాలితో జ్ఞానరూపశిఖను ఆర్పివేయును. ఒకవేళ జీవుని బుద్ధి వికసించి ఈ ప్రలోభాలకు లొంగనిచో, దేవతలు విఘ్నములను సృష్టించెదరు. హృదయమనెడి గృహమునకు ఇంద్రియములనెడి కిటికీలు కలవు. అట్టి ప్రతీ కిటికీపై దేవతలు కూర్చుందురు. విషయములనెడి వాయువులు వచ్చుటను గమనింపగానే వారు ఈ కిటికీలను పట్టుబట్టి బలంగా తెరచెదరు. ఈ గాలులువలన విజ్ఞానదీపం ఆరిపోవును. ముడి విడిపోదు సరికదా, ఆత్మానుభవప్రకాశం కూడా ఆరిపోవును. విషయపవనములచే బుద్ధి వికలమైపోవును. చేసిన సాధన అంతయూ వమ్మైపోవును. ఏలననగా ఇంద్రియములకును, వాటి అధిష్ఠానదేవతలకును జ్ఞానం రుచింపదు. వారికి విషయభోగముల యందే సర్వదా ఆసక్తి మెండు. బుద్ధియు విషయభోగములచే కొట్టబడినచో జ్ఞానదీపం ఆరిపోవును. ఈ దీపం ఆరిపోవుటవలన జననమరణపరంపర క్లేశాలు తప్పవు. ఈవిధంగా ఘణాక్షరన్యాయమున జ్ఞానం ప్రాప్తించినను దానిని రక్షించుకొనుటలో అనేక కష్టములు ఉన్నవి. ఓ ఖగేశా! ఈ మార్గమునందలి సాధకుల దీక్ష ఏ క్షణమైనను సడలవచ్చును. ఈ మార్గమును నిర్విఘ్నముగా అనుసరించువారే అతిదుర్లభమైన పరమపదమును చేరుదురు. జ్ఞానమార్గమున కైవల్యమును పొందుట అత్యంత క్లిష్టకార్యం. కానీ, ఓ ఖగరాజా! దుర్లభమైన ఆ ముక్తియే సరళమైన భక్తిమార్గమున పొందవచ్చును. ఎట్టి యత్నమూ, శ్రమయూ లేకుండగనే జననమరణ పరంపరకు కారణమైన అవిద్య భక్తితత్పరులనుండి దూరమగును. భక్తి మహిమాన్వితమైన సుందరచింతామణి. దీనిని హృదయమున ధరించువారు స్వయంగా అహర్నిశలు ప్రకాశమానులగుదురు. వీరికి నెయ్యి, వత్తి, దీపమూ అవసరం లేదు. మోహమనెడి దారిద్యం వీరిని సమీపించలేదు. ఏలననగా ఈ చింతామణి స్వయంప్రకాశం. లోభమనెడి వాయువు దానిని ఆర్పజాలదు. దానికాంతితో అవిద్య అనెడి గాఢ అంధకారం పటాపంచలగును. మదాది దీపపుపురుగుల సమూహము పరాజితమగును. భక్తి పరిపూర్ణహృదయుని చెంతకు కామక్రోధాదిదుష్టులు రానేరారు. లోకమును పీడించునట్టి మానసజాడ్యములు ఈ మణిని ధరించువారిని పీడించవు. ప్రేమతో అన్వేషించువారే ఆనందనిధియైన ఈ భక్తి మణిని పొందగలరు" అని.
ఇలా నా అవగాహన మేరకు, నాకు తెలిసినంతలో భక్తి గురించి తనకి చెప్పాను. తను వెళ్ళాక దీనినే మరోసారి స్మరిస్తున్నాను, ఇలా స్మరణ లో -

నిజమే కదా .....  
లోపల ఉన్న సద్ వస్తువుతో అనుసంధానం చేసేది భక్తే. సద్ వస్తువును సదా స్మరించడమే సద్భక్తి. ప్రగాఢమైన భక్తే పరిణామక్రమంలో జ్ఞానంగా ఫరిడిల్లుతుంది.


భక్తిరసామృతం గ్రోలిన భక్తులు భగవత్ప్రేమానందంలో తేలియాడుతూ ఇలా కోరుకుంటారు -
న ధనం న జనం న సున్దరీం 
కవితాం వా జగదీశ కామయే 
మమ జన్మని జన్మ నీశ్వరో 
భవతా ద్భక్తి రహైతుకీ త్వయ 
                               (శ్రీకృష్ణచైతన్య విరచితం, శిక్షాష్టకం) 
(నాకు ధనం వద్దు, జనం వద్దు, సుందరులు వద్దు, కవిత్వం వద్దు, జన్మజన్మాంతరాలలో నీపట్ల అహేతుక భక్తే నాకు కావాలి)


19, అక్టోబర్ 2012, శుక్రవారం

ప్రయత్నిస్తేనే ప్రగతిపధం.

ఉదయం పద్మ (చాకలామె) బట్టలు ఉతుకుతూ- అమ్మా! దగ్గర సంబంధమని, నేనేదో సుఖపడిపోతానని పెళ్లి చేశారమ్మ మా అమ్మా నాన్నలు. కానీ, పొద్దు కుంకితే చాలమ్మా, తాగేసి వచ్చి నానా రగడ చేస్తాడమ్మ. తాగనంతసేపు మంచోడే, తాగితేనే రాక్షసుడు, ఉట్టి అధముడమ్మ............అని బాధగా చెప్పగా -
నీవే మంచిగా, నెమ్మదిగా, ప్రేమగా చెప్తుండు, త్రాగుడు మానేయమని. మారేంతవరకు సహనంగా ప్రయత్నించు....... తప్పకుండా మారతాడు అని కాస్తంత దైర్యం చెప్తూ అన్నాను.

నిజమే! మనిషి యొక్క స్వాభావిక గుణకర్మల బట్టి పెద్దలు మానవులును మూడు విధములుగా పేర్కొన్నారు -
ఉత్తములు, మధ్యమములు, అధమములుగా!

ఉత్తములు:-  లోకహితార్ధమే నిష్కామభావంతో వేదవిహిత స్వధర్మ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ, నిశ్చయాత్మక బుద్ధితో స్థితప్రజ్ఞులై, విషయాసక్తి లేనివారై, అహంకార మమకార రహితులై, సకలభూతములయందు సర్వేశ్వరున్నే కాంచుచూ, నిత్య ఆనందమయులై ఉంటారు.
మధ్యములు:- సంసార బద్ధులై, స్వభావము బట్టి కర్మలను ఆచరిస్తూ, ప్రాపంచిక వ్యవహారంలతో బంధనములు ఏర్పరచుకొని కొంతకాలం గడిపినను క్రమేపి సంస్కార ఫలితంగా దైవమునందు భక్తి కలిగి, సకల భూతములయెడ స్నేహం, ప్రేమ, దయను కలిగియుండి అహంకార రహితులై, క్షమాశీలురై, సుఖదుఃఖముల ప్రాప్తియందు సమత్వం కలవారై, రాగద్వేషాలకు లోనుకాకుండా మోహరహితులై,
పరమాత్మయందు భక్తిప్రపత్తులతో దాన యజ్ఞయాగాది వంటి శుభకర్మలను ఆచరిస్తూ, సజ్జనులతో సద్గోష్టి జరుపుతూ సంతుష్టులై ఉంటారు.
 అధమములు:- అహంకారం, మూర్ఖం, గర్వం, దర్పం కలిగి కామ క్రోధ లోభ పరాయణులై, దయారహితులై, అన్యాయధనార్జనాపరులై, మోహజాలమందు చిక్కుకొని అపవిత్రులై ఉందురు. డాంభికమైన ఆడంబరాలు కొరకై  దానయజ్ఞాది కర్మలు ఆచరిస్తూ, స్వార్ధపరులై ఉంటారు.
ఎవరైనా సరే, త్రికరణశు
ద్ధితో ప్రయత్నిస్తే ప్రగతిపధంవైపు పయనించగలరు.
 

ఇక పారమార్ధిక కోణంలో వీరిని నిత్యులు, ముక్తులు, బద్ధులని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొన్నారు. నిత్యులు:- జన్మతః మహాత్ములుగా పుట్టి, బాల్యంలో కూడా యే అపరాధములు నెరుగక, స్వాచార్యుని వలె సత్యము నెరిగి, ఎల్లప్పుడూ ఆత్మభావమున ఉండువారు నిత్యులు. వీరు పరమానందమయులు. నిత్య భక్తమయులు. ఇందుకు ఉదాహరణము ప్రహ్లాదుడు.
ముక్తులు:- పుట్టుకతో సామాన్యుడిగా యుండి, సంస్కారఫలితంగా తన స్వంత ఆలోచన వలననో, లేక ఇతరుల ప్రభావం వలననో, ఆచార్యుని వాత్సల్యముననో, భక్తి ప్రపత్తులవలననో సంసార వ్యసన బంధములనుండి మానసికంగా బయటపడి, అరిషడ్వర్గముల నుండి విముక్తుడై, అన్నింటా సంస్కరింపబడినవాడై దేహాత్మభావనను వీడి సత్పురుషుడిగా మారి, ఆత్మభావమునకు వచ్చువారు ముక్తులు. ఇందుకు వాల్మీకి ఉదాహరణ.
బద్ధులు:- సంసారమున చిక్కుకొని, వ్యసనాలు, అరిషడ్వర్గములకు లొంగిపోయి, వానినుండి బయటపడలేక, పరమాత్మ విషయం పూర్తిగా నెరుగక, పాపులుగానే కడపటివరకు జీవించువారు బద్ధులు. మహిరావణుడు ఉదాహరణ.
ఎవరైనా సరే, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే పరమాత్మను కాంచగలరు.

16, అక్టోబర్ 2012, మంగళవారం

లేవండి! మేల్కోండి! గమ్యాన్ని చేరుకోండి! (స్వామి వివేకానందుని ప్రబోధాలు)

సమస్త విశ్వంలోను ఉత్తమోత్తమైన శరీరం ఈ మానవదేహమే. మానవుడే సర్వోత్తమ జీవి. సర్వోత్తమ జీవితం విజయవంతంగా గడపగలిగే శక్తి మానవునికే ఉంది. అందుకే మనం ఎలా జీవించాలో మనమే నిర్ధేసించుకోవాలి. 
ముందుగా ఒక ఆదర్శవంతమైన లక్ష్యాన్ని తీసుకోండి.ఆ లక్ష్యాన్నే జీవితంగా గడపండి. ఆ లక్ష్యాన్నే సదా భావించండి, ధ్యానించండి, జీవనాడిగా చేసుకోండి. మీ మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతిభాగాన్ని ఆ లక్ష్యంతో మమేకం అయ్యేటట్లు చేయండి. ఇదే విజయరహస్యం. దేనినైన మనం సాదించగలం. ముందుగా ఆత్మవిశ్వాసం కలిగియుండాలి. ఇదే పరిపూర్ణ వికాస మంత్రం. ఆత్మవిశ్వాసమే వ్యక్తిలోని దివ్యత్వాన్ని, చైతన్యాన్ని వెలికితీస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకో. శక్తి అంతా నీలోనే ఉంది. అది తెలుసుకొని ఆ శక్తిని బయటికి తీసుకురా. ప్రతీపనినీ, ఏ కార్యానైన నేను సాదించగలనన్న సంకల్పబలాన్ని పెంచుకో. నీ సంకల్పం గట్టిదైతే పాము విషం కూడా నిన్నేమి చేయలేదు.
ఒకటి ముందుగా గుర్తించండి - 

మనమున్న ప్రస్తుతస్థితికి మనమే బాధ్యులం. ఏం కావాలని మనం అభిలాషిస్తామో ఆ ప్రకారంగా మనల్ని మనం రూపుదిద్దుకోగలం. ఆ సామర్ధ్యం మనకుంది. ఇప్పుడు మనమున్న వర్తమానస్థితికి మన పూర్వ కర్మలు కారణమైతే, అదే కారణాన్ని బట్టి, మనం కోరిన విధంగా మన భవిష్యత్తును ప్రస్తుత కర్మల ఫలితంగా మనం రూపొందిన్చుకోవచ్చును. అందుచేత మనం ఏ తీరుగా నడుచుకోవాలో మనమే నిర్ణయించుకొని ప్రవర్తించాలి. మిమ్మల్ని మీరు ఏ విధంగా తీర్చుదిద్దుకుంటారో, ఆ విధంగా ఎదుగుతారు. బలహీనులుగా భావించుకుంటే బలహీనులుగానే మిగిలిపోతారు. బలవంతులని భావించుకుంటే బలవంతులే అవుతారు. బలహీనతకు పరిష్కారం బలహీనతను చింతించటం కాదు; బలాన్ని గురించి ఆలోచించటమే! మీలో నిబిడీకృతమై ఉన్న బలాన్ని గుర్తించండి.బలమే ప్రాణం. బలహీనతే మరణం. బలమే ఆనందం, శాశ్వతం, అమృత జీవనం. బలహీనతే ఎడతెగని ప్రయాస, దుఃఖం, నరక సదృశ్యం.
అపజయాలకు వెనకంజు వేయకండి. లక్ష్యసాదనను అంటిపెట్టుకొనే ఉండండి. ప్రయత్నంలో వెయ్యిసార్లు అపజయం ఎదురైనా పట్టువదలక మరోమారు ప్రయత్నించండి. విజయాన్ని సాధించలంటే అద్భతమైన పట్టుదల, సంకల్పశక్తిని కల్గియుండి పనిచేయాలి.అప్పుడే మీ గమ్యాన్ని మీరు తప్పకుండ చేరుతారు. పవిత్రత సహనం పట్టుదల వీటన్నిటికి మించిన ప్రేమ విజయసాధనకు అత్యంతావసరం. సంపూర్ణ ప్రేమభావం కలిగియుండాలి. ప్రతిజీవిలోను భగవంతుడు ఉన్నాడనే పరమసత్యాన్ని అవగాహన చేసుకోవాలి. ఎవరు జీవారాధకులో వారే నిజమైన దైవారాధకులు. పవిత్రంగా, ప్రేమగా ఉండటం, పరులకు మంచి చేయడం - ఇదే పూజలన్నింటి సారాంశం.
ధనార్జనలోగాని, దైవార్చనలోగానీ లేక ఏ ఇతర కార్యాచరణలోగాని ఏకాగ్రతాశక్తి  ఎంత బలవత్తరంగా వుంటుందో కార్యసిద్ధి అంత బాగా సమకూరుతుంది. ఈ ఏకాగ్రత ద్వారానే సత్త్వరజస్తమో గుణాత్మకమైన మనస్సు జయింపబడి, అవలయున్న జ్ఞానకాంతి వెల్లువలా ప్రసరిస్తుంది. మంచి చెడు ఆలోచనల సముదాయమే మనస్సు. మనం పవిత్రులమై మంచి ఆలోచనలకు తగిన ఉపకరణాలుగా మారితే అవి మనలో ప్రవేశించి ఘనకార్యాలను సాధిస్తాయి. ఒక్క క్షణమైనా లేదా ఏ ఒక్క విషయంపైనైనా మనస్సును నిగ్రహించలేని మనం స్వతంత్రులమా??? స్వేచ్ఛాజీవులమా........ఆలోచిం
చండి. 
నిగ్రహం లేని మనస్సు పతనదిశగా పయనింపజేసి వినాశనానికి దారి తీస్తుంది. నిగ్రహించబడ్డ మనస్సు మనల్ని సంరక్షిస్తుంది. సర్వస్వతంత్రులను చేస్తుంది. మనిషి మనస్సు యొక్క శక్తి అపారం. అది ఎంత ఏకాగ్రత నొందితే, అంత శక్తివంతమౌతుంది. ఇదే మనస్సు మర్మం. సంకల్పశక్తితో మనస్సుని తుచ్చమైన ప్రాపంచిక సుఖాలకోసం కాకుండా, అంతరంగిక వికాశానికి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి వినియోగించాలి. ఈ ప్రపంచం మనకు కనబడేతీరు మన మానసిక పరిస్థితి మీద ఆధారపడియుంటుంది. ఈ ప్రపంచం మనపట్ల ఎలా వుందని భావిస్తామో, ఆ భావాన్ని రూపొందించేది మన స్వకీయ మానసిక దృక్పధం మాత్రమే. పచ్చకామెర్లు వాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. వస్తువులను అందంగా, అందవికారంగా కనిపింపజేసేవి మనభావనలే. ఈ ప్రపంచమంతా మన మనస్సులోనే ఇమిడివుంది. అందువల్ల సమ్యక్ దృష్టిని అలవర్చుకోవాలి. స్వప్రయత్నంతో మన ఔనత్యం కోసం మనమే సచ్చీరులుగా మారాలి. అటులనే లక్ష్యంపై ఉండే శ్రద్ధ సాధనపైన ఉండాలి. గమ్యంపై మనకు ఎంత శ్రద్ధ వుంటుందో, దాని గమనం పై అంతే శ్రద్ధ ఉండాలి. 'శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్'.
నీవు గతంలో పొరపాట్లు చేయవచ్చు. నీలో దోషాలు ఉండవచ్చు. ఐతే ఏం? ఇకపై ఆ పొరపాట్లు మరల చేయకుండా నీ దోషాల్ని నీవు సంపూర్ణంగా సరిదిద్దుకోగల్గితే భవిష్యత్తులో నీవే భగవత్సరూపంగా పరిణమించవచ్చు. మానవులు సాధారణంగా తమ దోషాలను సాటివారి మీద మోపుతారు. అలా ఇతరుల మీద నెట్టడానికి వీలుకాకపోతే ఆ నెపాన్ని దైవం మీద కానీ, తాము సృష్టించిన విధివ్రాత అనే భూతం మీద కానీ నెట్టేస్తారు. విధి అనేది ఎక్కడ ఉంది? విధి అంటే ఎవరు? ఎవరు చేసుకునే కర్మ వారు అనుభవించక తప్పదు. మన విధిని మనమే రూపొందించుకుంటున్నాం. పిరికివారు, పనికిమాలిన మూర్ఖులు మాత్రమే 'ఇది విధి వ్రాత' అంటారు. "నా కర్మకు నేనే కర్తను" అనేవాడే ధీశాలి, విజయశీలి! ఈ దుఃఖమంతా నా కర్మఫలితమే. అందుచే దీన్ని తొలగించటం కూడా నా చేత మాత్రమే జరగాలని(సాధ్యమని) గ్రహించిన వారే బలవంతులు. మనకు కావాల్సిన బలం, సహాయం, సమస్తమూ మనలోనే ఉన్నాయి.
నీవు మోక్షం పొందకపోయినంతన మాత్రాన మునిగిపోయినదేమిటి? పవిత్రతాపూర్ణులై, మనసా వాచా కర్మేణా త్రికరణశుద్ధిగా తమ పరోపకార్యాలద్వారా పరులను సంతోషపరచడం, ఇతరులలోని సౌశీల్యాన్ని పరమాణువంతటి దాన్నైనా పర్వతమంతగా పెంచి శ్లాఘించడం....... ఇత్యాది మంచి లక్షణాలు ద్వారా తమ హృదయాలను వికసింపజేసుకునే వారే మహాత్ములు. భగవంతుడుపై నమ్మకం లేనివాడు నాస్తికుడు కాడు; తనపై తనకి నమ్మకం లేనివాడే నాస్తికుడు.
నా ప్రియమైన సోదరీ సోదరులారా!
లేవండి!
మేల్కోండి!
గమ్యాన్ని చేరుకోండి!
  

12, అక్టోబర్ 2012, శుక్రవారం

చిత్తుకాగితమే అనుకున్నా........ కానీ, చిరు కధనే తెలిపింది

ఉదయం ప్రక్కింటి ఆమె ఓ కాగితంలో కొన్ని పువ్వులు పంపారు. ఆ కాగితంను డస్ట్బిన్లో పడేయబోతు చూశాను. చిత్తుకాగితమే అనుకున్నా........ కానీ, చిరు కధనే తెలిపింది.
ఆ కధ ఏమిటంటే -

పూర్వం ఓ మహారాజుగారికి ఓ సందేహం వచ్చింది. అది ఏమిటంటే - మహత్వపూర్ణమైన సమయమేదీ? మహత్వపూర్ణమైన పని ఏమిటీ? మహత్వపూర్ణమైన వ్యక్తి ఎవరు? రాజుగారికి సందేహం రావడంతోనే వెంటనే సభని ఏర్పర్చమని ఆదేశించించడం జరిగింది. మంత్రులు, పండితులు, ఆస్థాన విద్వాంసులు....... తదితరులతో సభ కొలువై వుండగా, రాజుగారు పై మూడు ప్రశ్నలడిగారు. ఎవ్వరు ఎన్నివిధాలుగా సమాధానలిచ్చిన రాజుగారు వాటితో ఏకీభవించక అసంతృప్తి వ్యక్తం చేయగా, అప్పుడు మహామంత్రివర్యులు లేచి, రాజా! మన రాజ్యం బయట ఓ యోగిపుంగవుడు ఉన్నాడు. అతను మీ సందేహాలను తీర్చగలని నా నమ్మకం అని చెప్పగా -
మరునాటి ఉదయమునే ఆ యోగి ఉన్న ఆశ్రమానికి కొంతమంది అంగరక్షకులతో కల్సి బయలుదేరాడు. ఆశ్రమం కొంతదూరంలో ఉండగానే, తను మాత్రమే వెళ్తానని, మీరంతా ఇక్కడే ఉండండీ అని అంగరక్షకులను ఆదేశించి ఆశ్రమమును చేరతాడు. ఆశ్రమమునందు ఆ యోగి రాజుగారు వెళ్ళే సమయానికి పలుగుపారలతో చెట్ల మొదలు తవ్వుతూ చదును చేస్తున్నాడు. రాజు ఆ యోగికి నమస్కరించి తన సందేహాలను తెలిపి సమాధానం చెప్పమని కోరుతాడు. కానీ, ఆ యోగి మాత్రం మౌనంగా తన పని తాను చేసుకుంటున్నాడు. అంతట రాజు యోగి చేతిలోని పలుగు తీసుకొని చదును చేయనారంభిస్తూ మరల పై ప్రశ్నలు అడుగుతుండగా... శరీరం నిండా గాయాలతో, రక్తం కారుతుండగా, భయంతో ఓ వ్యక్తి ఆశ్రమంలో ప్రవేశించి సృహతప్పి పడిపోతాడు. వెంటనే ఆ యోగితో పాటు ఈ రాజు కూడా ఆ పడిపోయినవ్యక్తికి సపర్యలు చేయడం ప్రారంభిస్తారు. రాజు నీటిని తెచ్చి, తన తలపాగా చించి రక్తం కారకుండా గాయాలను శుభ్రపరుస్తూ కట్లు కడుతుండగా ఆ పడిపోయిన వ్యక్తికి సృహ రాగా, తనకి సేవలు చేస్తున్న రాజుని గుర్తించి, తనని క్షమించవలసిందిగా కోరాతాడు. ఆ వ్యక్తి ఎవరో తెలియని రాజు నీవెవరవు అని ప్రశ్నిస్తాడు. అప్పుడా వ్యక్తి మీరెప్పుడూ నన్ను చూడలేదు. కొంతకాలం క్రితం జరిగిన యుద్ధంలో నా సోదరుడు మీ చేతిలో చంపబడ్డాడు. అందుకు నేను ప్రతీకారం తీర్చుకోవడానికై మిమ్మల్ని వెంబడించాను. మీ అంగరక్షకులు నన్ను పసిగట్టి చుట్టుముట్టి గాయపరచగా తప్పించుకొని ఈ ప్రదేశమునకు చేరుకున్నాను. నాకు మీరిప్పుడు సపర్యలు చేస్తున్నారు. మీరు ఎంత ఉత్తములో, ఎంత దయగలవారో అర్ధమైంది. నా అపరాధాన్ని క్షమించండి అని అనగా, అతనిని క్షమించి విడిచిపెట్టేస్తాడు. కాసేపటికి మరల ఆ రాజు తన సందేహాలను తీర్చమని ఆ యోగిని కోరగా -
రాజా! ఈ సంఘటనల ద్వారా నీకు సమాధానం దొరికింది, గ్రహించు. నీవు మొదట ఈ ప్రశ్నలు అడిగినప్పుడు నేను మౌనంగా ఉన్నానని నీవు వెళ్ళిపోకుండా పాదులు తీశావు. అలా కాకుండా వెళ్ళిపోయినట్లయితే ఆ వ్యక్తి నిను వధించడానికి ప్రయత్నించేవాడు. కాబట్టి ఇది నీకు మహత్వపూర్ణమైన సమయం. ఇక ఆ వ్యక్తికి నీవు సేవ చేయడమే మహత్వపూర్ణమైన పని. ఎందుచేతనంటే సేవ చేసి ఇతనిని బ్రతికించక పోయినట్లయితే నీ మీద శత్రుత్వంతో మరణిస్తాడు. మీ మధ్య అప్పుడు జన్మజన్మల శత్రుత్వం సాగుతుంది. ఇప్పుడు నీ సేవలవలన అతను పశ్చాత్తాపపడి, తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఇక మహత్వపూర్ణ వ్యక్తిని నేనే. ఎందువల్లనంటే నావలన నీ ప్రశ్నలకు జవాబు లభించి నీవు శాంతచిత్తంతో తిరిగి వెళ్తావు. మహారాజా! ఇప్పుడు దీనిని సరిగ్గా అర్ధం చేసుకో. మహత్వపూర్ణ సమయమంటే వర్తమాన సమయం. దాన్ని చక్కగా ఉపయోగించడం నేర్చుకోవాలి. మహత్వపూర్ణమైన పని అంటే వర్తమానంలో నీవు చేయవలసిన సత్కర్మ. ఆ పనిని ఏకాగ్రతతో, సావధానంగా చేయాలి. మహత్వపూర్ణమైన వ్యక్తి అంటే వర్తమానంలో నిను సన్మార్గంలో నడిపించేవాడు. అతనితో సముచితంగా వ్యవహరించాలి. దీనినే ఆధ్యాత్మికపరంగా అవగాహన చేసుకో. 
'అధాతో బ్రహ్మ జిజ్ఞాస' అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అదే మహత్వపూర్ణమైన సమయం. అంటే మనల్ని మనం తెలుసుకోవాలనే సంకల్పం చేసిన సమయమే మహత్వపూర్ణమైన సమయం.
నీలోనికి నీవు పయనించు యోగమే మహత్వపూర్ణమైన పని.
అది ఉపదేశించే సద్గురువే మహత్వపూర్ణమైన వ్యక్తి.

13, సెప్టెంబర్ 2012, గురువారం

*శుద్ధ ఆహారము*


భగవంతుడు, ప్రారబ్ధం వదిలించుకొని పరమాత్మ యందు ఐక్యం కావడానికే మానవ దేహం ప్రసాదిస్తాడు. కానీ; మన ఇంద్రియాలద్వారా వివిధ అపవిత్రమైనకార్యాలు చేస్తూ, అశుద్ధఆహారాన్ని స్వీకరిస్తూ, చివరికి ఈ పవిత్రమైన దేహాన్ని మట్టికే అంకితమిచ్చి, ప్రారబ్ధాన్ని పోగొట్టుకోలేక, మరింత పోగుచేసుకొని మరిన్ని దేహాల్నీ మరల మరల పొందుతూ జనన మరణ చక్రములో పరిభ్రమిస్తూ, శ్రమిస్తూ దుఃఖితులమౌతున్నాం. 
అందుకే అలా కాకుండా 
ఈ దేహం యొక్క ప్రాముఖ్యతను గుర్తిద్దాం,
సత్కర్మలు ఆచరిస్తూ, సద్భావనతో చరిద్దాం,
ఆరోగ్యకరమైన శుద్దాహారమునే స్వీకరిద్దాం,
తద్వారా తరిద్దాం.

మనకి తెలుసు - మానవుని జీవనాభివృద్ధికి ఆరోగ్యవంతమైన శరీరం అవసరమని, ఆ శరీరానికి పుష్టికరమైన శుద్ధఆహారం అత్సవసరమని, ఈ శరీరము ఆహరముచే ఏర్పడుచున్నదని. 
దానికి తగ్గట్లుగా భగవంతుడు ఎవరికి తగ్గ ఆహారమును వారికి ఏర్పరిచెను.
దేవానామమృతం నృణామృషీణాం చాన్న మోషధీ: / 
దైత్యరక్షః పిశాచాదేర్దత్తం మద్యామిషాది చ //
బ్రహ్మదేవుడు సృష్టిలో దేవతలకు అమృతమును, మానవులకును ఋషులకును అన్నము సస్యములు అనగా ఫలమూలములను, పశువులకు తృణపత్రములను, దైత్య రాక్షస పిశాచాదులకు మద్యము, మాంసం మొదలగునవి ఆహరములుగా సృష్టించెను.

మనం భుజించెడు ఆహారంలో గల సారం రసమై, రక్తమై, మాంసమై మేదస్సు మొదలగు సప్తధాతువులుగా పరిణమించి, దీనియొక్క సూక్ష్మాంశం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంగా మారును. కావున మనశ్శాంతి, మనోనిర్మలత, కారుణ్యహృదయం, వైరాగ్యాంతఃకరణం కలగాలంటే శుద్ధఆహారం తప్పనిసరి.

మరి ఈ శుద్ధఆహారం అంటే ఏమిటీ?
ఆహరవిషయములో వస్తుశుద్ధి (తీసుకునే పదార్ధము శుభ్రతగా ఉన్న మాత్రమే చాలదు, అది ఎటువంటి ధనముచేత, లేక యే విధంగా వచ్చిందో ఆ మార్గము శుద్ధముగా ఉండవలెను), పాత్రశుద్ధి ( వండే, తినే పాత్రలశుద్ధి), వాహక శుద్ధి (వండేవారు, వడ్డించేవారు శుద్ధత కలవారై) ఉండాలి. పాపపు సొమ్ముచే గానీ, పాపపు పనులచే గానీ వచ్చిన వస్తువు మంచిదైనను అది పాపాహారమే యగును. అలాగునే ఇతరులు కష్టపడి మనకై చేసినపనికి తగిన ప్రతిఫలం ఇవ్వక సంపాదించిన సొమ్ముచే భుజించెడు అన్నం పాపాన్నమే యగును. ఇట్టి ఆహారమును తీసుకున్నవారి మనస్సు నిర్మలముగా ఉండదు. శాంతి, దయ, వైరాగ్యాదులు వీరికి కలగవు. 
అటులనే ప్రతిఒక్కరూ వారు స్వభావములు అనుసరించి తీసుకునే ఆహారములో సాత్త్వికం, రాజసము, తామసము అను భేదములు కలవు.
సాత్త్వికాహారము సత్త్వగుణమును వృద్ధి చేయును. సత్త్వశుద్ధిచే చిత్తశుద్ధి కలుగును. చిత్తశుద్ధిచే ఆత్మజ్ఞాన ప్రాప్తి కలుగును. 
శ్రీ మద్భగవద్గీత యందు పదిహేడవ అధ్యాయంలో తెలిపింది ఇదే -
ఆయుస్సత్వ్త్వ బలారోగ్యసుఖప్రీతివివర్ధనాః /
రస్యాస్స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాస్సాత్త్వికప్రియాః 
ఆయుస్సును, మనోబలమును, శరీరబలమును, ఆరోగ్యమును, సుఖమును, ప్రీతిగా బాగుగా అభివృద్ధి నొందించునదియు, రసము గలదియు, చమురుతో కూడినదియు, దేహమందు చాలాకాలమునుండి సత్తువ నిచ్చునదియు, మనోహరమైనదియు సాత్త్వికాహార మనబడును. ఈ ఆహారమును సాత్త్వికులు ఇష్టపడుదురు. 
కావున విజ్ఞులు ఇట్టి ఆహారమును స్వీకరించవలెను.
కట్వామ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః /
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకా మయప్రదాః //
అమితముగా చేదుగాను, పులుపుగాను, ఉప్పుగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, చమురులేనివిగాను, దాహము కలుగజేయునవిగాను, మనఃక్లేశం కలుగజేయునట్టి ఆహరం రాజసాహారం అనబడును. ఈ ఆహారమును రాజసులు ఇష్టపడుదురు. ఈ విధమైన ఆహారం దుఃఖశోకరోగములను కలిగించును. 
ఇటువంటి ఆహారమును త్యజించవలెను.
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ /
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ //
సారం నశించి పాచిపోయినట్టి పదార్ధమును, ఒకరు తినగా మిగిలిపోయినదియును, అశుద్ధముగా ఉన్నటియు (భగవంతునికి నివేదనచేయనటువంటివి) ఆహారము తమోగుణమును పెంచును. ఈ విధమైన ఆహారమును తామసులు ఇష్టపడుదురు. 
ఇటువంటి ఆహారమును స్వీకరించరాదు. 
అన్నదోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్ /
కలుషీకృత చిత్తానాం ధర్మస్సమ్యక్ న భాసతే //
అన్నదోషముచేత మనస్సు కలుషితం అయి చిత్తమునందు ధర్మరహస్యం ప్రకాశింపదు.  కావున ఆహరవిషయమును సామాన్యమని తలంచరాదు. ఆహారశుద్ధి తప్పనిసరి.
ఇక భగవంతునికి నివేదన చేసి భగవంతున్ని స్తుతిస్తూ ఎందుకు భోజనం చేయాలంటే - మనం తీసుకున్న మిశ్రమాహారమందలి నిరుపయోగమైనదానిని మలమూత్రస్వేదములుగా బహిర్గతమొనర్చి, సారమును మాత్రమే గ్రహించి, అందలి పిండిపదార్ధములను విడగొట్టి గ్లూకోజ్ గా  మార్చి దేహములోని సూక్ష్మాణువులకు అందించి, కొవ్వుపదార్ధములను వేరుచేసి చర్మమునకు, కీళ్ళ సందువులకు అందించి, అందలి కాల్షియమును ఎముకలకు అందిస్తూ...... ఇలా సప్తధాతువులకు ఆహారం అందడానికి కారణం -
 
మనం భుజించే ఆహారంను జీర్ణమయ్యేటట్లు చేస్తున్న "జఠరాగ్ని". ప్రతీ ప్రాణి ఉదరములోనూ ఉండి, ఆహరపదార్ధములను జీర్ణమయ్యేటట్లు చేస్తుంది ఈ జఠరాగ్నే!
ఈ విధంగా మనం తీసుకున్న ఆహరం,
 జఠరాగ్ని
 
చే పక్వంకానిచో, రక్తాదులద్వారా శరీరమంతటను వ్యాపింపలేదు. కావున జఠరాగ్ని శరీరమున కీలకస్థానం ఆక్రమించుకొని యున్నది. అంతటి కీలకమైన జఠరాగ్నిరూపమున భగవానుడే ఉండి, శరీరమునకు పుష్టిని చేకూర్చుతున్నట్లు గీత యందు పదిహేనేవ అధ్యాయమున పద్నాలుగవ శ్లోకం ద్వారా తెలుస్తుంది.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః /
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ //
(నేను వైశ్వనరుడను జఠరాగ్నిగానయి ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి, ప్రాణాపాన వాయువులతో కూడుకొని నాలుగువిధములగు అన్నమును వచనము చేయుచున్నాను.
నాలుగు విధములగు అన్నము :- 1) భక్ష్యమనగా దంతములచే కొరికి తినెడు గారెలు మొదలగు ఘనపదార్ధములు. 2) భోజ్యమనగా దంతములతో కాస్తా నమిలి  భుజించెడు క్షీరాన్నాదులు లాంటివి. 3) లేహ్యమనగా నాలుకచే చప్పరించి తినెడు పచ్చడి లాంటి పదార్ధములు 4) చోష్యమనగా నాలుకచే చప్పరించకనే ఆహారముగా తీసుకొనెడు క్షీరం లాంటి పానాదులు).
అందుకే భోజనంకు ముందు ఈ శ్లోకమును మరియు  బ్రహ్మార్పణం బ్రహ్మ....... క్రింద వివరించిన ఈ శ్లోకమును కూడా పఠించి, 
జీవులకు ఇంతటి మహోపకృతి నొనర్చుచున్న ఆ పరమాత్ముణ్ణి స్తుతిస్తూ, భగవంతునికి నివేదన చేసిన ఆహరమునే దైవభావముతో భుజించడం పరమోత్తమం. 
{ఇందుకే పూర్వం ఆహారమును భుజించుటకు ముందు  భగవంతునికి నివేదన చేసిన పిమ్మట దేహమును క్షేత్రముగాను, ఆత్మను క్షేత్రమందు గల సర్వేశ్వరునిగాను భావన చేయుచు, ఆ ఆహారమును స్వీకరించే ఆచారముండేది. ఇటువంటి ఆచారములవలన క్రమేపి శివ జీవైక్య జ్ఞానం కలుగుతుంది. 
ఇక్కడ నా చిన్నప్పటి విషయం ఒక్కటి జ్ఞాపకం వస్తుంది. మా చిన్నతనంలో మా అమ్మమ్మ మాకు అన్నం తినిపిస్తూ ఇది మనూరి బంగారమ్మతల్లి ముద్ద అనీ, ఇది బెజవాడ కనకదుర్గ ముద్ద అనీ, ఇది రాయగడ మజ్జిగౌరమ్మ ముద్ద అనీ, ఇది కంచి కామాక్షిది, ఇది కాశీ విశాలాక్షిది, ఇది తిరుపతి వెంకన్నది, ఇది భద్రాది రామన్నది, ఇది శ్రీశైలం మల్లన్నది, ఇది సింహాద్రి అప్పన్నది........అంటూ ఒకొక భగవన్నామముతో అన్నం ముద్దలను పెట్టడం బాగా జ్ఞాపకం. కానీ అలా తినిపించడంలో పరమార్ధం కొంతకాలం క్రితం వరకు నాకు తెలియలేదు. చిన్నప్పటినుండి దైవ స్మరణ చేయిస్తూ పెద్దలు ఈ రీతిలో మనకు అన్నం తినిపించడంలో ఓ మంచి ఆధ్యాత్మిక బోధ ఉన్నదని తెలియక నా పిల్లలకు నేనలా చేయలేకపోయాను. నా పిల్లలు అన్నం తినమని మారాం చేసినప్పుడు, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్నది, ఇది అక్కది, ఇది అమ్మమ్మది, ఇది నానమ్మది, ఇది తాతయ్యది,  ఇది పిన్నది, ఇది అత్తది.......... అనీ సన్నిహిత బంధువుల పేర్లు చెప్తూ తినిపించేదానిని. నాలా తెలియని తల్లులు ఎందఱో ఉండవచ్చు. కానీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను - అప్పటి ఆచారవ్యవహారాల్లో ఉన్న గొప్పతనమునూ మరియు మన పూర్వీకులు, పెద్దవారు వారి వారి పనులద్వారా ఉగ్గుపాలనుండియే తత్త్వబోధ చేసేవారని. అది గ్రహించక అజ్ఞానంలో నేనున్నానని. ఇక్కడ మరొక అనుభవపూర్వక విషయమును కూడా నేను చెప్పాలనుకుంటున్నాను - ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారా ఏర్పడిన అవగాహన వలన మన ఆచారవ్యవహారాల్లో ఉన్న అంతరార్ధం అర్ధమై, వాటిని ఆచరణలో పెట్టడంతో గతంలో కంటే  నాదిప్పుడు ఎంతో సరళమైన ప్రశాంతకర జీవనమైంది}
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ /
బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా //
హోమసాధనములు {సృక్ (సృక్ అనగా హోమములో, కొయ్యతో చేయబడిన గరిటివంటి యే పాత్రచే హవిస్సు అన్నాదులు హోమింపబడునో దాని పేరు), స్రువం (స్రువమనగా హోమములో, కొయ్యతో చేయబడిన యే పాత్రచే ఘ్రుతమును ఎత్తి హోమింతురో దానియొక్క పేరు) మున్నగునవి}, హోమద్రవ్యములు (అన్నం, నెయ్యి మొదలగునవి), హోమాగ్ని, హోమం చేయువారు, హోమం చేయబడింది....అన్నియును బ్రహ్మస్వరూపములే అన్న బ్రహ్మభావమును కలిగి బ్రహ్మార్పణ భావంతో ఈ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు..... క్రమేపి బ్రహ్మస్వరూపమును పొందగలడు.
ఈ శ్లోకమందు హోమం గురించి చెప్పబడినప్పటికిని సమస్త కార్యములందు ఈ ప్రకారమే, అంటే సమస్తమూ బ్రహ్మమయమే అన్న భావనతో చేసినచో - ప్రతీ కార్యమందునూ చేయువారు, చేయబడింది బ్రహ్మస్వరూపములే యగును. 'సర్వం ఖల్విదం బ్రహ్మ' అని చాందోగ్యోపనిషత్ తెలిపిన విధంగా ఈ సమస్తమూ బ్రహ్మమే అను భావమును దృఢపరచుకొని సర్వకార్యాలు నిర్వర్తించువాడు బ్రహ్మస్వరూపమే పొందును. ఈ ప్రపంచమున సమస్తమూ బ్రహ్మస్వరూపమేకానీ, అన్యం కాదు. ఈ విషయం సదా జ్ఞప్తియందు ఉంచుకొని, చిత్తమందు బ్రహ్మభావన, దైవభావన కలిగియుండి అన్నాదులు స్వీకరించినచో, ఈ స్వీకరించనెడి ప్రక్రియ ఓ యజ్ఞమే యగును, భుజించు పదార్ధము అమృతమే యగును. 
పూజితం హ్యశనం నిత్యం బలమూర్జం చ యచ్ఛతి /
అపూజితాం తు తద్భుక్తముభయం నాశయేదిదమ్ //
దైవభావముతో భుజించెడు అన్నం సత్త్వగుణమును, బలమును, దివ్యమైన ఓజస్సును కలుగజేయును. అట్లుకాక భుజించెడు ఏ పదార్ధమైనను ఆత్మబలమును, తేజస్సును నశింపజేయును.
బ్రహ్మభావనతో భుజింప అభ్యసించువారికి ఈ దేహం దేవాలయముగాను, ఆత్మ పరబ్రహ్మ స్వరూపముగాను బోధపడును. 
అటులనే భోజనం చేయునప్పుడు ఇట్టి భావంతో మౌనంగా భుజించువారు ఉత్తమ సాత్త్వికులు. భోజనం చేయునప్పుడు వ్యర్ధ విషయములు మాట్లాడుచు భుజించువారు రజోతామసతత్త్వం కలవారగుదురు. 

మానేన భోజయిత్వా తు స్వర్గం ప్రాప్తో న సంశయః /
ప్రజల్పన్ భుజంతే యస్తు తేనాన్న మశుచిర్భవేత్ //
పాపం న కేవలం భుంక్తే తస్మాన్మౌనం సమాచరేత్ /
ఉపవాసనమం భోజ్యం జ్ఞేయం మౌనేన నారద! //
మౌనంతో భుజించువారు స్వర్గమును పొందగలరు. దీనియందు సందేహం లేదు. మాట్లాడుతూ భుజించిన అన్నము అశుచి అగుతున్నది. వ్యర్ధవిషయాలు మాట్లాడుచు భుజించు అన్నం అన్నమే కాదు, పాపరూపమే యగును. మౌనంతో భుజించిన భోజనం ఉపవాస సమానమే అగుచున్నది. ఉపవాసం వలన ఎంత ఆత్మశుద్ధి కలుగునో అంత పుణ్యం మౌనంగా భుజించడం వలన కలుగును.

ఈ రీతిలో సాత్త్వికమైన ఆహారమును మౌనముగా దైవానికి నివేదనచేసి, దైవమును స్తుతిస్తూ తీసుకున్న ఆహారం శుద్ధాహారం అవుతుంది. 
శుద్ధ ఆహరముచే మనస్సు నిర్మలమవును. శాంతి, దయ, వైరాగ్యం, దైవచింతన, బ్రహ్మభావన కలిగి పరబ్రహ్మప్రాప్తి పొందవచ్చును. 
పుత్రోత్పత్తికి హేతువగు శుక్లశోణితం ఏ అన్నపానీయములచే స్త్రీపురుషులకు ఏర్పడునో అట్టి అన్నము శుద్ధముగా ఉన్నచో - దైవ, మాతాపితరులయందు, గురువులయందు, వేదశాస్త్రాలయందు, సాదు సత్పురుషులయందు విశ్వాసం గల ధర్మాతులైన వంశోద్ధారక సంతానం కలుగుదురని శాస్త్రవచనం. 

3, సెప్టెంబర్ 2012, సోమవారం

ఆ నాలుగు ఏమిటంటే.........

మొన్న మా అమ్మాయి (అనుషా) ఓ ప్రశ్న అడిగింది. 
అమ్మా! సత్యయుగం(కృతయుగం)లో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది అని అంటారు కదా. ఆ నాలుగు పాదాలు ఏమిటమ్మా?
ఆ నాలుగు ఏమిటంటే.........
కృతే ప్రవర్తతే ధర్మశ్చతుష్పాత్తజ్జ నైర్ధ్రతః /
సత్యం దయా తపో దానమితి పాదాని భోనృప //
(ఈ శ్లోకం మహాభారతం లోనిదని జ్ఞాపకం)
కృతయుగమందు ౧.సత్యం ౨.దయ ౩.తపస్సు ౪.దానం అనునవి నాలుగు పాదములు. 
మా అమ్మాయి అడిగిన ఈ ప్రశ్నతో మరో జ్ఞాపకం నా మదిలో కదలాడుతుంది. అది -
ఓ మూడు నాలుగు సంవత్సరముల క్రితమనుకుంటాను (సరిగ్గా జ్ఞాపకం లేదు), తెలుగుచలనచిత్రరంగ ఉత్సావాలప్పుడు ప్రముఖనటుడు రాజేంద్రప్రసాద్ గారు ఇలా అన్నారు -
కృతయుగంలో మంచే తప్ప చెడు అనేదే లేదు, త్రేతాయుగంలో మంచి సముద్రానికి ఇవతల, చెడు సముద్రానికి అవతల ఉండేవి, ద్వాపరయుగంలో మంచి చెడు ఒకే కుటుంబంలో, ఒకే ఇంట ఉండగా, కలియుగంలో ఈ రెండూ ప్రతీ ఒక్కరిలో ఉన్నాయి అని! ఈ కార్యక్రమం టి.వి లో చూస్తూ 'ప్చ్..... కృతయుగంలో పుట్టిన బాగుండును, దురదృష్టం కొలది ఈ కలియుగమందు పుట్టాను కదా' అని నేను అంటుండగా, ప్రక్కనే ఉన్న మావారు  "అలా ఎందుకనుకోవడం? ఈ యుగమందైన సత్యయుగంలో ఉన్నట్లు ఉండవచ్చు. ఏ యుగమందు ఉండాలనుకుంటున్నావో ఆ యుగమునకు చెందిన ధర్మం ప్రకారం మన ప్రవర్తన మార్చుకుంటే సరిపోతుందని" అన్నారు.
నాకు అర్ధం కాలేదు మావారి మాటలు. కాస్త వివరంగా చెప్పండి అని అడగగా -
కృతయుగమందు ధర్మం - సత్యం, దయ, తపస్సు, దానం అను పాదాలపై నడిచేది. ఈ నాలుగు గుణములు కలవారు ఏ యుగమందున్నను సత్యయుగంలో ఉన్నట్లే.
త్రేతాయుగమందు ధర్మం - సత్యం లోపించి దయ, తపస్సు, దానములనెడి పాదములపై నడిచేది. ఈ మూడు గుణములు కలవారు ఏ యుగమందున్నను త్రేతాయుగంలో ఉన్నట్లే.
ద్వాపరయుగమందు ధర్మం -సత్యం, దయ లోపించి తపస్సు, దానములనెడి పాదములపై నడిచేది. ఈ  రెండు గుణములు పరిపూర్ణముగా కలవారు ఏ యుగమందున్నను ద్వాపరయుగమందు ఉన్నట్లే.
ఇక కలియుగమందు ధర్మం - సత్యం, దయ, తపస్సులు లోపించి కాస్తంత దానగుణం పైనే నడుస్తుంది. 
ఏ యుగమునందు నీవు ఉండాలనుకుంటున్నావో ఆ యుగమునకు చెందినట్లు నీ గుణసంపత్తిని పెంచుకో... 
అని వివరంగా మావారు చెప్తూ ఈ విషయాలన్నీ భారతంలో ఉంటాయి చదువు అని భారతమును నా చేతిలో పెట్టడం ఓ మధురమైన జ్ఞాపకం.

భారతంలో అనుశాసనికపర్వంలో ధర్మరాజు యుగములను గూర్చి అడిగిన ప్రశ్నకు భీష్ముడిట్లు సమాధానమిచ్చెను -
'మానవుల అంతఃకరణలను బట్టియే యుగములు మారును గానీ యుగమునుబట్టి మానవుల అంతఃకరణములు మారవు'.