17, ఏప్రిల్ 2012, మంగళవారం

సాధన -సాధకులు

                                                     సాధన
అంతరదృష్టితో అంతర్ముఖమై ఆంతర్యంలోనికి పయనిస్తేనే ఆత్మజ్ఞానం అలవడుతుంది. ఆత్మజ్ఞానం అలవడితేనే ఆత్మసాక్షత్కారం అవుతుంది. ఆత్మసాక్షత్కారం పొందుటకు చేసే ప్రయత్నమే "సాధన".
ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని, అనంతుడుని తెలుసుకోవాలన్న జిజ్ఞాస ప్రారంభమయ్యాక ఎన్నో సంఘర్షణలు, సందేహాలు. ఎలా పయనించాలి, ఏం చేయాలి, ఎలా సాధించగలను, ఎవర్ని ఆశ్రయించాలి.......ఓహో.... ఎన్నో ప్రశ్నలు. 
అయితే తమ తమ సంసారధర్మాలను, గృహధర్మాలను, లౌకిక భాధ్యతలన్నింటిని నిర్వర్తిస్తూ, పరమగమ్యంను చేరగోరు గృహస్థభక్తులుకు తమ దైనందికకార్యంలలో ఆధ్యాత్మిక సాధన  ఓ అంతర్భాగమై ఉండాలి.  
సాధనకు కావాల్సింది మొదటిగా మనో నియంత్రణ. వ్యవహారికంలో పూర్తి భావజాగృతిలో ఉంటూ, ప్రతీక్షణం ప్రతీ చిన్నపనిలో కూడా నాచే ఇది భగవంతుడే చేయిస్తున్నాడన్న భావనతో ఎరుకలో ఉండగలిగినప్పుడే మనోరహితస్థితి కల్గుతుంది. 
అటుపై కావాల్సింది అంతఃకరణశుద్ధి. ఇది  అలవడాలంటే అందుకు కావాల్సింది వివేకం (బ్రహ్మ సత్యం, జగత్తు మిధ్య అను సత్య దృఢ నిశ్చయజ్ఞానమే వివేకం. అనిత్యమైన ప్రపంచవిషయాలను విడిచిపెట్టి నిత్యమైన ఆత్మగురించి ఆలోచించడమే వివేకం), వైరాగ్యం (ఇహపర భోగాలపట్ల అభిలాష లేకపోవడం), శమం (మనోనిగ్రహం), దమం (చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహం), ఉపరతి (స్వధర్మానుష్టానం), తితిక్ష (శీతోష్ణ సుఖదుఃఖంలను సహించుట), శ్రద్ధ (దేనిచేత సద్వస్తువు తెలియబడునో అట్టి శాస్త్రంనందును, గురువాక్యంలందును సంపూర్ణ విశ్వాసం), సమాధానం (చిత్తంను ఏకాగ్రతలో ఉంచుట), ముముక్షత్వం (మోక్షం కావాలనే తీవ్ర కోరిక) భక్తి (స్వ స్వరూప అనుసంధానం అంటే నిదిధ్యాస), ధ్యానం (సత్యమైన ఏకవస్తువును  చింతించడం), సేవ (పరోపకారజీవనం), సమత్వం (శత్రుమిత్రులయందు, మానావమానములయందు, సుఖదుఃఖంలయందు, సర్వ పరిస్థితులయందు సమభావంతో ఉండుట), శౌచం (జ్ఞానవైరాగ్యంలనెడి మృత్తిక చేత మదిని క్షాళ నం కావించి, వాసనాత్రయంను నశింపచేసుకోవడం), దయ (దుఃఖితులయందు కృప), సజ్జనసాంగత్యం (భగవత్తత్త్వాన్ని గ్రహించే వారితో సాంగత్యం), ఋజువర్తనం (చక్కటి నడవడిక) ఏకాత్మభావన (అందరూ ఆత్మస్వరూపులే అన్న భావం) అభ్యాసం చేయాలి. ఈ అభ్యాస సమయంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, ఆనందాలు, ఆవేదనలు, సమస్యలు, సంఘర్షణలు, అనుభవాలు, అయోమయాలు..... అన్నీ ప్రాపంచిక జీవితానికి అన్వయింపబడి అగమ్యగోచరంగా, అలజడిగా అన్పించిన, ఎంతో అంతర్మధనం జరుగుతున్నా, ఇవన్నీ పారమార్ధిక జీవనంలో వైరాగ్యాన్ని, వివేకాన్ని, భక్తిని, పరమాత్మునిపై పరమప్రేమను పరిక్షించడానికి ఈశ్వరుడు పెట్టే పరిక్షలుగా భావించి సంకల్పమును చెదరనీయక, క్రుంగక, ప్రయత్నం వీడక ఫలితం ఆశించక, పయనం ఆపక, మరింత శ్రద్ధతో, పట్టుదలతో, సంయమనంతో, సమర్ధవంతంగా, ధీశాలిగా ముందుకు పోవడమే సరైన సాధన. బంగారానికి పుటం పెడితేగానీ ఆభరణం తయారుకాదు. పాత్రశుద్ధి ఉంటేగానీ పాలు కాచలేం. ఉలిదెబ్బలు పడితేగానీ విగ్రహం చేయడం కుదరదు. అలానే అనేక పరీక్షలు నెగ్గి సాధన చేస్తేగానీ అంతఃకరణ శుద్ధి కాదు. ఎవరికి వారే వారివారి సంస్కారముల ఆధారంగా సాధనామార్గంలను అనుష్టించి ఆత్మసాక్షాత్కారం కలిగేంతవరకు నిర్విరామ సాధన చేయాలి. అప్పుడే భవం నుండి భవ్యం వైపు వెళ్ళగలరు. 
                                                          సాధకులు  
త్రికరణశుద్ధిగా పై సాధనను ఆచరించినవారే సాధకులు. సదా సర్వప్రాణులను స్వాత్మ(తన ఆత్మ) యందు చూచునో, సర్వప్రాణులయందు ఆత్మను చూచునో వారే సాధకులు.  అనంతుని స్మరణ, ఆధ్యాత్మికతత్వ అవగాహన, అన్యవిషయ విస్మరణ, అనన్య చింతన, ఆత్మ విచారణ, అంతా ఆత్మయేనన్నఅచంచల భావనలను అలవర్చుకొని, అవరోధాలను అధిగమిస్తూ ఆజన్మ సాధన అహర్నిశలు చేసేవారే నిజమైన సాధకులు.  సత్కర్మలు, సదాచారణములు, సత్ శీలం , సత్ప్రవర్తన, సత్ వాక్కు, సన్మార్గం, సాత్వికాహారం, సమదృష్టి, సంయమనం, సందేహరహిత సాధన సాధకునికి అవసరం.

సత్ సంకల్పంతో, సద్గ్రంధంలు పఠనం  శ్రవణం మననం చేస్తూ,  సదా సత్యవస్తువుస్మరణ తోడుగా సద్గురువు సన్నిధిలో సాధన సక్రమంగా సాగించే సాధకునికి ఆత్మసాక్షాత్కారము సంప్రాప్తిస్తుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి