31, జులై 2012, మంగళవారం

"మాటే మంత్రం"

కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్వలా 
న స్నానం నవిలేపనం నకుసుమం నాలం కృతామూర్థజా 
వాణ్యేకా నమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే 
క్షియన్తే ఖిల భూషణానిసతతం వాగ్భూషణం భూషణమ్ 

కిరీటాలు, భుజకీర్తులు, సూర్యచంద్రహారాలు, ఇతరత్ర నగలుగాని, పరిమళ భరితద్రవ్యాలతో స్నానం గాని, చందన సుగంథ వస్తువులు శరీరానికి అద్దుకోవడం వల్లగాని, సువాసనభరిత పుష్పహారాలు ధరించడం లేదా చిత్రవిచిత్ర రీతులలో కురులను దువ్వుకోవడం వల్లగాని పురుషోత్తమునికి అలంకారాలుగా అందాన్నివ్వవు. శాస్త్ర సంస్కారం చేత మధురమైనట్టి వాక్కు ఒక్కటే అతనికి గొప్ప అలంకారమై ప్రకాశిస్తుంది. 

అన్నింటి కంటే ఉత్తమజన్మ మానవజన్మ. సమస్త జీవరాశులలో మాట్లాడేశక్తి మానవునికే ఉంది. మానవుడు సంఘజీవి. అందరితో చక్కని సంబంధ భాంధవ్యాలు కలిగియుండి సామరస్యముగా ఉండడం చక్కటి సుగుణం. ఇందుకు కావాల్సింది ప్రధానంగా మృదుభాషణం.  
మనిషి యొక్క నిత్యమైన సత్యమైన వ్యక్తిత్త్వమును తెలియజెప్పేది అతని వాక్కే. అందుకే సంభాషణలో సభ్యత, సరళత, సంస్కృతి ఉండాలి. మన చుట్టూ ఉండే వాతావరణంను మన మాటలవైఖరి ద్వారానే నిర్మించుకుంటున్నాం. మన మాటలబట్టే మన చుట్టూ ఉన్నవారి ప్రవర్తన ఉంటుంది. 'ఈటెలపోటు కన్నా మాటలపోటు లోతైన గాయం చేస్తుంది'. కనుకనే పెద్దలంటారు 'నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందని'.
స్నేహంగానీ, వైరంగానీ, నిర్మలత్వంగానీ, కళంకంగానీ, పుణ్యంగానీ, పాపంగానీ, శాంతిగానీ, అశాంతిగానీ, ఔనత్యంగానీ, నీచత్వంగానీ, మంచిగానీ, చెడుగానీ అన్నీ మాటలబట్టే వస్తాయి. మాట మనస్సును నొప్పించనూ గలదు, ఒప్పించనూగలదు. 'గొడ్డలితో నరకబడిన చెట్టు మరల చిగిరిస్తుంది గానీ మాటలచే ముక్కలైన మనస్సు మరల అతుక్కోదు' అన్నది అనుభవజ్ఞుల మాట. ఉద్వేగం, ఉద్రేకం, హేళన లేకుండా ప్రియంగా మాట్లాడితే మనకీ దుఃఖముండదు ఎదుటివారికీ దుఃఖముండదు. ఎవ్వరినీ నొప్పించని వాక్కే మధురవాక్కు. మధురమైన వాక్కు మనుషుల హృదయాలను రంజింపజేస్తూ వశీభూతం చేసుకుంటుంది. కనుకనే 'మాటల చేత మన్నన పొందవచ్చు' నన్నది లోకోక్తి.
ఓ వ్యక్తి యొక్క సామాజిక అస్తిత్వ ఉత్ధాన పతనాలకు ప్రధాన కారణం ఆ వ్యక్తి మాటతీరే. మన వేదంలో, సనాతన ధర్మంలో "మంచి మాట" ఓ అంశమై ఉన్నది. 'భద్రం కర్ణేభి శృణుయామ దేవాః' (మా చెవులతో మంచి మాటలనే విందుము గాక). ఎలా జీవిస్తే, ఎలా ఆలోచిస్తే, ఎలా మాట్లాడితే కర్తృత్వబుద్ధిరూపంలో ఉన్న మాయనుండి విడుదల పొందగలమో అట్టి జీవనవిధానంను మన సనాతనధర్మం నేర్పుతుంది. చేతితో మంచిపనులు చేయాలి, నోటితో మంచిమాటలు మాట్లాడాలి.  చేసేపని, మాట్లాడేమాట ఎలా ఉండాలంటే అది మనకి శాంతినివ్వాలి, ఎదుటివారికి శాంతిని కలుగజేయాలి. ఆలోచనల్లోగానీ, పనిలోగానీ, మాటల్లోగానీ రాగద్వేషముల ప్రభావం ఉండకూడదు. అంతరంన చెడుభావనలు తొలగించుకుంటూ, మంచి తలపులు వచ్చేలా చూచుకుంటూ రాగద్వేషాలకు చోటులేకుండా మాట్లాడడంవలన అంతఃకరణశుద్ధి జరుగుతుంది. నిర్మలత్వం వస్తుంది. అప్పుడే వాక్శుద్ధి కలుగుతుంది. ఈ వాక్శుద్ధి ఆత్మసిద్ధికి దారి చూపిస్తుంది. ఆత్మజ్ఞానమనేది అంతఃకరణశుద్ధివలనే ప్రాప్తిస్తుంది. అంతఃకరణశుద్ధికి ప్రధమ సోపానం మధురవాక్కే. మృదువుగా సంభాషించడం సత్యాన్వేషకుడికి ముఖ్యాతిముఖ్యం.
శరీరానికి రోగాలు వచ్చినట్లే మనస్సుకీ కోపం, ఉద్రేకం, అసూయ అనే రోగాలు వస్తుంటాయి. మనస్సులో ఈ రోగాలున్నప్పుడు మాటల్లో అశాంతియే ఉంటుంది. శరీరానికి వచ్చే రోగాలు ఆ శరీరం మరణించినప్పుడు పోతాయి. మనస్సుకి వచ్చే రోగాలు మరుజన్మకు కూడా వచ్చేస్తాయి. అందుకే లోపలికి వెళ్ళే ఆహార విషయంలోనూ, బయటికి వచ్చే మాటల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులోనైనా, పొగడ్త విమర్శలప్పుడైనా నిలకడగా ఉండి ప్రసన్నంగా మాట్లాడడమే సాధనాబలం, సద్గుణం, సుసంస్కారం. గంగానదిలో నిప్పురవ్వలు వేసినా చల్లార్చుకొని గంభీరంగా సముద్రంలో కలిసిపోతుంది. అలాగే జీవనగమనంలో విమర్శలు, కోపోద్రిక్త సంఘటనలు వస్తూ ఉంటాయి. వాటిని అంటకుండా నిర్మలంగా ఆలోచిస్తూ, నిశ్చలంగా పనిచేస్తూ, నిదానంగా సరళంగా సహృదయతతో మాట్లాడగలిగినప్పుడు రజోగుణమును జయించి దేహతాదాత్మ్యపుభావన పోయి ఆత్మజ్ఞానం అందుతుంది. 
ప్రియంగా మాట్లాడితే అందరూ ఆనందిస్తారు. అటువంటప్పుడు మాటల్లో దారిద్యం ఎందుకు? (ప్రియవాక్య ప్రదానేనా సర్వేతుష్యంతి జంతవః / తస్మాత్ తదేవ వక్తవ్యం, వచనే కా దరిద్రతా //) పెదవులపై చిరునవ్వు చెరగకుండా పలికే మృదువైన మాట విశ్వాన్ని సైతం జయిస్తుంది. సరళమైనమాట స్నేహితులను సమకూర్చుతుంది. మృదువాక్కే ఇద్దరు వ్యక్తుల మధ్య స్తబ్థతను చీల్చి సాన్నిహిత్యమును పెంచుతుంది. మాట మాత్రమే మనిషిని మనీషిని చేస్తుంది. "వాజ్మాధుర్యాత్ నాన్యదస్తి ప్రియత్వం" వాజ్మాధుర్యమును మించి ప్రియమైనది లోకంలో మరొకటి లేదు. అందుకే ధర్మరాజు కూడా యక్షప్రశ్నల సందర్భంలో అంటాడు - "ప్రియవచన వాదీ ప్రియోభవతి" ప్రియవాది అయినవాడే అందరికీ ప్రియమైనవాడౌతాడు. అందుకే మనమూ మాట్లాడుదాం - నేర్పుగా, ఓర్పుగా, ప్రియంగా, హితంగా, మితంగా మాట్లాడుదాం.
అంతరంగ ఆలయాంతరంలో ఆ అనంతుడు ఆసీనుడై ఉండగా ఆ ఆలయకవాటాలుగా పెదవులున్నాయని, మనం మాట్లాడే మాటలన్నీ ఆ అనంతుని సన్నిధిలోనుండే వస్తున్నాయన్న భావన మనలో నిత్యమూ ఎరుకలో ఉంటే మృదుమధురభాషణ అలవడుతుంది. 
"మాటే మంత్రం" మహర్షుల నోటంటా వచ్చే ప్రతీమాట ఓ మంత్రమే. అంటే మనం జపిస్తున్న ప్రతీమంత్రం వారి నోటంట వచ్చిన పుణ్యమాటే. 
"మాటే స్తోత్రం" సద్భావనతో, ఆత్మీయంతో, ఆనందంతో, అమితభక్తితో, ఆరాధనతో అంతర్యామికై మాట్లాడే మాటలే భగవంతునికి స్తోత్రాలు. 

3 కామెంట్‌లు:

  1. nice post. I would have preferred sanskrit poems/comments be written in sanskrit (devnagari) script. Otherwise, very good post.

    రిప్లయితొలగించండి
  2. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణపూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ. ఆకట్టుకునేలా మాట్లాడటం ఓకళ. అయితే,ఆమాటలను ఎప్పుడు మొదలుపెట్టాలో,ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్పకళ. మాటలే మంత్రాలు. మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి. బలమైనవి కనుక సున్నితంగా వాడాలి. ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి.

    రిప్లయితొలగించండి