2, జులై 2012, సోమవారం

వ్యాస పూర్ణిమ - గురుపూర్ణిమ

ఆత్మను పరమాత్మను అనుసంధానం చేస్తూ, శిష్యుణ్ణి తరింపజేసేమార్గములో నడిపిస్తూ జీవైక్యస్థితిని అనుగ్రహించే సద్గురువులను పూజించేపండుగ "గురుపౌర్ణమి". గురుపౌర్ణమినాడు గురువుకు పాదపూజ చేయడం ముక్కోటిదేవతల్నీ ఒకేసారి పూజించడమౌతుందని శాస్త్రవచనం. 


శ్రీమహావిష్ణువు మొదట బ్రహ్మదేవునికి అందించిన సనాతనమైన, శాశ్వతమైన, జగత్సృష్టికి జగత్ర్స్తష్టకు ముందే ఉన్న పరమపావనమై అనాదిగా వున్నా ధార్మిక వేదవిజ్ఞానాన్ని మానవాళికి కూడా అందించాలన్న దివ్య సంకల్పంతో తన మనస్సు నుండి అపాంతరతముని సృష్టించాడు. అపాంతరతముడనగా లోపల ఉన్న చీకటిని (అజ్ఞానమును) పోగొట్టేవాడని అర్ధం. ఈ అపాంతరతముడే సకల వేదవిజ్ఞానమంతా మానవాళికి ప్రబోధించడానికి, సకల సూక్ష్మధర్మాలను తెలిపి ముక్తులను చేయడానికి, సమస్త విశ్వజనావళికి సనాతన ధర్మమార్గమును చూపించి పరమాత్మ వైపు దిశనిర్దేశం చేయాలని  శ్రీమహావిష్ణువు ఆదేశం మేరకు ప్రతీ మన్వంతరంలో ద్వాపరాంతంనందు జన్మిస్తున్నాడు. ఈ రీతిలో విష్ణువు దివ్యసంకల్పంచే కారణజన్ముడైన అపాంతరతముడు బ్రహ్మదేవును ద్వారా వేదాలను గ్రహించి, జగత్కల్యానంకై ఆ వేదాలను విభజించడం వలన వేదవ్యాసుడుగా ప్రసిద్ధితుడు అయ్యాడు. 'వేదాన్ వివ్యాస యస్మాత్ప వేదవ్యాస ఇతి స్మృతః' వ్యాసుడన్నది వ్యక్తినామం కాదు, అది ఆ వ్యక్తి చేసినపనులబట్టి ఏర్పడిన దివ్యనామం.

సుషువే యమునాద్వీపే పుత్రం కామమివాపరమ్ 
స్కాపి సత్యవతీ మాతా సద్యో గర్భవతీ సతీ //
యమునాద్వీపమున సత్యవతి సద్యోగర్భంలో మహాజ్ఞానతేజస్సంపన్నుడైన మహర్షి జన్మించాడు. ఈ ద్వీపంనందు జనించడం వలన కృష్ణద్వైపాయనుడుగా పేరు పొందాడు. సత్యవతీ, పరాశరుల పుత్రుడగుట వలన సాత్యవతేయుడు, పారాశర్యుడుగా పిలవబడ్డాడు. ఈ కృష్ణద్వైపాయనుడు హిమాలయాలలోని బదరికాశ్రమంలో సుదీర్హకాలం గొప్ప తపస్సు చేసినకారణంగా బాదరాయణుడుగా ప్రసిద్ధి పొందాడు. 

ఓం నమశ్శ్రుతిశిరః  పద్మషండమార్తాండమూర్తయే 
బాదరాయణసంజ్ఞాయ మునయే శివవేష్మనే //
వేదాంతములనెడు తామరల మొత్తములకు సూర్యబింబమైనవాడును, శుభకరమైన తేజమునకు ఆలయమైనవాడునగు, బాదరాయణుడను నామధేయము గల మునివర్యునకు నమస్కారం.
  
'వ్యాసో నారాయణో హరి:' వ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. 
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః 

జనులందరినీ ధన్యుల్ని చేయుటకై , ధర్మ, భక్తి, జ్ఞాన ఇత్యాది అమూల్య సంపదలను ఒసగిన వ్యాసమహర్షికి శతధా వందనములు.ఆదికాలంలో వేదం అనేక శాఖలతో ఒకేరాశిగా 'ఏకాయనం' పేరిట విరాజిల్లుతూ వుండేది. కలియుగంలో మానవుల బుద్ధిశక్తిని, ఆయుష్షును పరిగణలోనికి తీసుకొని అందరికీ శ్రేయస్సు కల్గించేరీతిలో కలియుగవాసుల సౌలభ్యంకై బ్రహ్మ పరంపరాగతమైన ఏకాయనమైన వేదరాశిని కృష్ణద్వైపయానుడు తన తపఃశక్తితో 1131 శాఖలతో ఉన్న వేదరాశిని ఋగ్వేదం (21 శాఖలు), యజుర్వేదం (101 శాఖలు), సామవేదం (1000 శాఖలు), అధర్వణవేదము (9 శాఖలు)లుగా విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. తన శిష్యుల (పైలుడు, జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు) ద్వారా అందరికీ అందించాడు. అలానే సూతమహర్షి ద్వారా సకల పురాణసంపదను, శుకయోగి ద్వారా భాగవతాన్ని మానవజాతికి అందించాడు. మనం స్మరిస్తున్న ఈ కృష్ణదైపాయనుడు ఇరవైఎనిమిదవ వ్యాసుడు. అంతకుముందు గడిచిన 27 మన్వంతరాలలో వ్యాస పదవిని అలంకరించినవారు- 
౧.స్వయంభువు ౨.ప్రజాపతి ౩.ఉశనుడు ౪.బృహస్పతి ౫.సూర్యుడు ౬.యముడు ౭.ఇంద్రుడు ౮.వశిష్టుడు ౯.సారస్వతుడు ౧౦.త్రిధాముడు ౧౧.త్రివృషుడు (వృషభుడు) ౧౨.భరద్వాజుడు ౧౩.అంతరిక్షుడు ౧౪.ధర్ముడు ౧౫.త్రయారుణి ౧౬.ధనుంజయుడు ౧౭.కృతంజయుడు ౧౮.సంజయుడు ౧౯.అత్రి ౨౦.గౌతముడు ౨౧.హార్యాత్మకుడు ౨౨.వేణుడు (వాజిశ్రవుడు) ౨౩.సోముడు ౨౪.తృణబిందుడు ౨౫.భార్గవుడు ౨౬.శక్తి మహర్షి ౨౭.జాతుకర్ణుడు.


వేదంలో నిగూఢముగా ఉన్న విషయములను సర్వజనావళి శ్రేయస్సుకై సులభతరం చేసి అందించిన అనంతజ్ఞాన మహామహితాత్ముడైన వ్యాసమహర్షి పాదారవిందాలచెంత ప్రణమిల్లుతున్నాను. ఈ సమస్త ధార్మిక ఆధ్యాత్మికవిద్య అంతయూ వ్యాసుని నోటినుండి వెలువడిందే. 'వ్యాసోచ్చిష్టం జగత్సర్వం'.
వ్యాసుడు జన్మించిన ఆషాడ శుద్ధ పూర్ణిమను "వ్యాసపూర్ణిమ" / "గురుపూర్ణిమ" గా ఋషులు నిర్ణయించిన ఈ ఉత్కృష్ట పారమార్ధిక పర్వదినమునాడు,  ప్రశస్తమైన ప్రాచీనమునుండి వస్తున్న గురువులను సేవించుకునే ఆచార సాంప్రదాయాన్ని స్మరించుకుంటూ, అనంతమైన వైదిక ధార్మిక ధర్మసత్యాలను  అందించిన వ్యాసమహర్షికిని, వాటిని అవిచ్చిన్నంగా తరతరాలుగా సకలజనావళికి అందిస్తూ వస్తున్న గురుపరంపరలకు ప్రణమిల్లుతున్నాను. అందరూ సద్గురు కృపకు పాత్రులుకాగలరని ప్రార్ధిస్తూ - జగత్తుద్ధరణకై జ్ఞానవిజ్ఞాన సంపదను సమస్త జనావళికి అందించిన వ్యాసభగవానుకి నమస్కరిస్తున్నాను.

మునిం స్నిగ్దాంబుదాభానం వేదవ్యాసమకల్మషమ్
వేదవ్యాసం సరస్వత్యావాసం వ్యాసం నమామ్యహమ్ // 
                  
                  అందరికీ వ్యాసపూర్ణిమ (జూలై 3) శుభాకాంక్షలు! కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి