23, మార్చి 2013, శనివారం

నా జీవనగమనంలో ..... శ్రీ బుద్ధ భగవాన్!సకల జనావళిని అజ్ఞానంధకారంలోంచి జ్ఞానకాంతిలోకి తీసుకురావడమునే తన జీవిత ఆశయంగా పెట్టుకొని, 'సిద్ధి పొందుగోరువారికి నేను రక్షకుడును, ముక్తి కోరువారికి నేను మార్గదర్శకుడును, దుర్వార సంసార సాగరాన్ని దాటదలిచినవారికి నేను సేతు బంధనమును, నిర్లక్ష్యం చేయబడ్డవారికి నేను విశ్రమించు పాన్పును, నా సన్నిధి కోరువారికి నేను మిత్రుడును' అని భావించి, సమ్యక్ సంబుద్ధిని, నిర్వాణ పధం ప్రభోదములను చేసిన అనంతకారుణ్యమూర్తి - "శ్రీ బుద్ధ భగవాన్'.
నాకు ప్రశాంతజీవనం అలవడడానికి, నన్ను నేను చూసుకోవడానికి, సరిచేసుకోవడానికి దోహదపడిన
బుద్ధభగవాన్ బోధలలో కొన్ని -
                                                  
కర్మ చేయకుండా ఎవరూ ఉండరు, ఉండలేరు. ప్రతీ కర్మకు ఫలితం వుంటుంది. కర్మకు కారణం వున్నంతవరకు, దాని ప్రతిఫలం అనుభవించక తప్పదు. కర్మలు మూడు విధములు. అవి కాయక కర్మ, వాచక కర్మ, మానసిక కర్మ. కర్మ బయటనుండి వచ్చేది కాదు. ఏ దైవం చేతనో అది మన మీద విధింపబడేది కాదు. అది మన స్వభావం వలనే జరుగుతుంది. మన మానసిక అలవాట్లు, అభ్యాసాలు, ఊహలు, భావాలు, అభిప్రాయాలు, ఆలోచనలు, సంబంధాలు, ఆపేక్షలు, కోర్కెలు, ఇష్టాలు ... వీటి ఫలితమే కర్మ. మనగతమంతా కర్మ ఫలితమే, ఈ కర్మే మన వర్తమానాన్ని ఏర్పాటు చేస్తుంది గనుక, వర్తమాన జీవితం కర్మలచేత బంధింపబడి యుంటుంది. వర్తమానంలో చేసే కర్మల ఫలితమే భవిష్యత్తులో తటస్థపడుతుంది. ఆ ఫలితాలే భవిష్యత్తులో మన స్థితిగతుల మీద తమ ప్రభావాన్ని చూపుతాయి. కర్మలలో వ్యత్యాసం వలనే మనుష్యులందరూ ఒకే విధంగా జీవించలేరు. కానీ, నిష్కామముతో కర్మలాచరించే వారిని ఏ కర్మఫలితమూ బంధించదు. కర్మ కాంక్షతో చేసినప్పుడే అది బంధహేతువు అవుతుంది. అది మనోమాయకు, దుష్కర్మకు దారి తీస్తుంది. తత్ఫలితమే దుఃఖం. అందుకే మనం సదా సత్కర్మాచరణే  గావించాలి.
                              
             * * *
మనసే మనిషిని బద్ధున్ని లేదా బుద్ధున్ని చేస్తుంది.
                              
             * * *
ధర్మమార్గం, సమదృష్టి, దృఢసంకల్పం, సత్కర్మాచరణ, మితభాషణ, సహజీవనం ఇవే సత్యప్రాప్తికి సాధనాలు.
భోగభాగ్యాలపై, సుఖాలపై వాంఛలేకుండా, మనోప్రక్షాళనం చేసుకొని స్వధర్మంలో పయనించాలి. విషయాలు విషం వంటివి. విషయవాసనలనుంచి విరమణ వలన మనస్సు నిర్మలం, నిశ్చలం అవుతుంది. నీ చీకటిని నువ్వే పారద్రోలుకునేందుకు, నీ సంరక్షణ బాధ్యత నీకు నువ్వే స్వయంగా తీసుకునేందుకు, నీకు నువ్వే జ్యోతిగా నిలిచి వెలిగేందుకు ... బయట దేనితోను సంబంధం పెట్టుకోక, దేన్నీ ఆశ్రయించక, అనుకరించక, అనుసరించక; నీలోనే ఆ ఆశ్రయమో, రక్షణో తీసుకో!
                              
          * * *
తనను తాను తెలుసుకుంటే, ఇంక తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. తనని తాను, తాను తెలుసుకోక, ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. ప్రవర్తన వినయంగా వుండేకొద్దీ మేలు అధికంగా, బహుముఖంగా వుంటుంది. దానికి సోమరితనం పనికిరాదు, కాలం వృధా చేయకూడదు, వర్తమానంలో జీవించాలి.
                              
          * * *
ధ్యానం అంటే - నిజజీవితం నుండి పలాయనం కాదు, నిజజీవితం లోకి ప్రవేశం.
ధ్యానం అంటే - ఒక అనుభవం కాదు, ఆ క్షణంలో సాక్షికి ఎరుకలో వుండటం.
ధ్యానం అంటే - సంకల్పరహిత స్థితి. అకర్మ స్థితి.
మనసు ఎక్కడ ఎప్పుడు అంతం అవుతుందో, అప్పుడు అక్కడ ధ్యానం ఆరంభమౌతుంది.
                              
            * * *
జన్మ ఒక అల లాంటిది. అది తిరిగి మహాసముద్రంలో కలిసి, మరో అలలా పైకి లేస్తుంది. అవిరామంగా, అనంతముగా జననమరణాలు రెండూ మానవజీవితంలో ఎడతెగకుండా అలలు మాదిరిగా వస్తూ పోతూ ఉంటాయి. ఆ జీవన ప్రవాహం అవిచ్ఛన్నంగా సాగిపోతూ వుంటుంది. 'అజ్ఞానం' జీవితంలో పేరుకుపోయినంతకాలం జననమరణాలు తప్పవు.అజ్ఞానం పోయి స్వస్వరూప జ్ఞానం కలిగితే పునర్జన్మలు ఉండవు. "నేను" అనే అహంభావం వుంటే, కోర్కె కలగడం సహజం. ఆ కోర్కె వలన కర్మ చేయడం సహజం. కోర్కె ఆగి, స్వస్వరూప జ్ఞానం కలిగిన క్షణమునే జీవనసాఫల్యత!
                              
          * * *
దైవంకోసం, దేవతానుగ్రహంకోసం ఎప్పుడూ ఎదురు చూడకుండా, బైటనుంచి ఎటువంటి సహాయం కోసం చూడకుండా, ఎప్పడూ దేనికీ ... ఎవరిమీద దేనిమీద దేనికోసం ఆధారపడకుండా, ప్రతిఒక్కరూ ప్రతిక్షణం తమను తాము ఏ అరమరికా లేకుండా, ఎటువంటి దురాభిమానం పక్షపాతం, స్వార్ధం లేకుండా, లోపల బైటా పరిశీలించుకోవాలి... పరీక్షించుకోవాలి... పరిశోధించుకోవాలి. పాపం, హింస, వాంఛ, మోహం, స్వార్ధం మొదలగువాటికి జీవనగమనంలో చోటులేకుండా, దయ, ప్రేమ, కరుణ, సమానత్వం కలిగి... అందరూ అంతా ఒకటే, సమానమే ఆన్న ఏకత్వభావంతో, దృఢసంకల్పంతో సాధన చేస్తూ సన్మార్గవర్తనులై జీవించాలి. ఇదే 'అంతర్వీక్షణ'.
                              
         * * *
జీవితం సత్యాన్వేషణతో సాగాలి గానీ, కోర్కెలతో కాదు.
                              
         * * *
ఇతరుల మాటకో, భావానికో, అభిప్రాయానికో ... దేనికో ఒకదానికి నువ్వు కోప్పడి, బాధపడితే అది నీ దుర్భలత్వం. వారు మనస్సుతో గాక, స్వేచ్ఛగా అనాలోచితంగా అనినా, చేసినా ... నువ్వు దానికి ప్రతిస్పందించి, ప్రతిక్రియ చేయడం అది నీ మనోదాస్యం. ఇది తగదు.
                              
        * * *
దుఃఖరహితంగా జీవించాలంటే, విషయలోలత్వం కోర్కెలు స్వార్ధచింతన పూర్తిగా నశించాలి. ఇందుకు అష్టాంగ సూత్రాలును అనుసరించాలి. అవి - సరైన ఆలోచన, సదవగాహన, నిర్మల మనస్సు, సత్కర్మ, సరైన యత్నం, సత్ప్రవర్తన, బుద్ధిసూక్ష్మత, ఏకాగ్రత.
                              
       * * *
మీరు దేనిమీద ఆధారపడక, మీ కాళ్ళమీద మీరు నిలబడండి. ప్రార్ధించి, బేరమాడినంతమాత్రాన పాపపరిహారం కాదు. శీలం, సమాధి, ప్రజ్ఞ అనే మూడూ జీవితంలో ముఖ్యంగా అలవర్చుకోవాలి.
శీలమంటే పవిత్ర అలోచనాలు, సమాధి అంటే సరైన ఏకాగ్రత, ప్రజ్ఞ అంటే సంపూర్ణ ఎరుక.
                              
       * * *
ధర్మ శబ్దం విపులార్ధం కలది. అది గంభీరమైనది. కేవలం భాషా పాండిత్యం వాళ్ళ అది తెలిసే సంగతి కాదు. అచంచలమైన ధర్మనిష్ఠ, ధర్మనిరతి, సత్యవంతమైన నిర్మలమైన అంతరంగం, సాత్విక ప్రవృత్తి, శమం (అంతరింద్రియ నిగ్రహం), దమం (బాహ్యఇంద్రియ నిగ్రహం), భూతదయ, ఓర్పు, నమ్రత దానికి అవసరం. అప్పుడే ధర్మ స్వరూపాన్ని దర్శించగలరు.
                              
      * * *
నదీ ప్రవాహంలో అనేక వస్తువులు, చెత్త చెదారం అంతా, అన్నీ కొట్టుకుపోతాయి. ఏవో రెండు వస్తువులు ఆ ప్రవాహంలో కలుసుకొని, కొంతదూరం కలిసి ప్రయాణించి, ప్రవాహతాకిడికి ఎక్కడో విడిపోతాయి. సంసారంలో ఈ జీవులస్థితి ఆ విధంగానే వుంటుంది. గతంలో ఎక్కడెక్కడో వున్నవారో, వచ్చి ఒకచోట చేరి, ఒక కుటుంబంగా వుండి, కొంతకాలం తర్వాత తిరిగి ఎవరిదారినవారు పోతారు. కాబట్టి విజ్ఞులగువారు ఇట్టి సంయోగ వియోగాలకు బాధపడరు.
                              
      * * *
ఈ ప్రపంచంలో లాభనష్టాలు, దూషణ భూషణలు, కష్టసుఖాలు, బాధా సంతోషాలు ఎప్పుడూ వుండేవే. వివేకులు వాటిని నిగ్రహించుకోవాలి. అవి ఎట్లా వస్తాయో, అట్లానే పోతాయి.
                              
      * * *
పాపం చేయకపోవుటయే 'పుణ్యం'.
                              
      * * *
జీవితంలో ఏ విషయంలోనైనా సరే 'అతి'ని వదలాలి. మధ్యేమార్గం అవలంభించాలి. ఆ మార్గం జ్ఞానవంతుల్ని చేస్తుంది. నిర్వాణస్థితికి చేరుస్తుంది. ఈ స్థితిని పొందడానికి పది సంకెళ్ళుతో కూడిన భవచక్రమును దాటాలి. ఆ పది సంకెళ్ళు ఏమిటంటే - 1. అహాన్ని ఆత్మగా భావించరాదు. 2. ధర్మం విషయంలో సంశయం పనికిరాదు. 3. కర్మాచరణ విషయంలో మూఢఆచారాలు పోవాలి. 4. విషయ వికారాల్ని జయించాలి. 5. సమత్వం వుండాలి. 6. ప్రాపంచికత యందు అనాసక్తత. 7. సుఖాపేక్ష ఉండరాదు. 8. గర్వం ఉండరాదు. 9. దంభం నశించాలి. 10. అజ్ఞానం తొలగాలి.
                              
    * * *
శారీరకంగా కోర్కెలనే బంధాలనుండి విముక్తి పొందటం, మానసికంగా 'నేనే' అనే అహంభావం విసర్జించడం. నైతిక దృష్ట్యా కామ, క్రోధ మోహాదులు, విద్రోహ విద్వేషాలు, అజ్ఞానం వదలడం ... దీనినే నిర్వాణస్థితి అంటారు.
                              
   * * *
రాగం శాంతిస్తే దోషాగ్ని శాంతిస్తుంది. దోషాగ్ని శాంతిస్తే అభిమానాది సకలదోషాలు ఉపశమిస్తాయి. అప్పుడే మానవునికి శాంతి.
                              
     * * *
యోగమంటే చిత్తవృత్తి నిరోధం. చిత్తం చలించుటయే బంధం. స్థిరంగా వుండుటే మోక్షం. యోగి, వాక్కును మనస్సులో, మనస్సును బుద్ధిలో, బుద్ధిని సాక్షి యందు లయింపజేసి, ఆ సాక్షిని అసలు సత్యంగా గుర్తిస్తాడు. యోగమార్గం - అంతఃపధం. అంటే అంతర్భాగంలో మనోదారణే యోగం. యోగద్వారం - హృదయం. యోగగమ్యం - పరబ్రహ్మం. అంటే హృదయమందు జీవనం.
                              
    * * *
యజ్ఞయాగాది క్రతువుల పేరుతో జరిగే జంతుబలుల్ని ఆపమని చెప్పి, అసలు యజ్ఞం అంటే ఏమిటో తెలియజెప్పిన బుద్ధ ప్రబోధమిదే -
నోరులేని పశువులను బలిచేయడం కాదు, మనలో ఉన్న అజ్ఞానపశువును జ్ఞానవేదికపై బలిచేయడమే నిజమైన యజ్ఞం. సర్వప్రాపంచిక భావాలను, స్వార్ధ అహంకార పశువాసనలను బ్రహ్మాగ్ని కుండంలో ఆహుతి చేయడమే బ్రహ్మయజ్ఞం. మానవునిలోని అరిషడ్వర్గములనే పశువులను సంహరించి, పరిశుద్దులగుటయే యజ్ఞం. నియత కర్మలన్నీ ధర్మభావనతో చేస్తే, అదే యజ్ఞం!
                              
   * * *
జన్మతః అందరూ జ్ఞానులే. జీవించేకొద్దీ చాలా ఎక్కువమంది అజ్ఞానులుగా మారతారు. అజ్ఞానాన్ని గుర్తించి, ఆగి, ఆలోచించినవాడే నిజమైన అన్వేషకుడు.
                              
   * * *
మనలో వెలిగే అంతరజ్యోతే జ్ఞానం. ఆ జ్ఞానజ్యోతిని ఎవరికివారు దర్శించడమే, అంతిమ సత్యం.
                              
  * * *
జీవితంలో నిరాకరించవలసినవి ఐదు వున్నాయి, అవి - జీవితం కోసం కాంక్ష, అహంకారం, అవిద్య, కామం, ద్వేషం. జీవితంలో ఆహ్వానించదగినవి ఐదు వున్నాయి, అవి - విశ్వాసం, జాగృతి, నీతివర్తన, ధ్యానం, జ్ఞానం.
                               * * *
అజ్ఞానాన్ని తొలగించకుండా, మానసిక బలహీనతల్ని అధిగమించకుండా, ఎవరూ భవసాగరాన్ని దాటలేరు, విముక్తి పొందలేరు.
                               * * *
ముక్తి అనేది మరణించాక వచ్చేది కాదు, బతికుండగానే సంపాదించుకోవలసినది.
                              * * *
మనిషి ప్రకృతి నుండి ఎంతో నేర్చుకోవాలి.
మట్టి : అమృతం, విషం రెంటినీ స్వీకరిస్తుంది. మన మనస్సులోకి వచ్చే మంచి చెడు ఆలోచనలను మనం సమంగా స్వీకరించాలి.
నీరు : నీళ్ళలో ఎంత మురికి చేరినా స్వీకరిస్తుంది. స్వచ్చంగా వుంటుంది.  జ్ఞాని అలానే ఉండాలి.
నిప్పు : అన్నింటినీ కాల్చివేస్తుంది. మంచి చెడు పదార్ధాలని చూడదు. అలానే జ్ఞానంతో అన్ని మాలిన్యాలను దగ్ధం చేయాలి.
గాలి : సుగంధాలను దుర్గంధాలను తనలో కలుపుకొని పోతుంది. జ్ఞాని అంతే, దేనినీ తప్పుపట్టక సాగిపోవాలి.

12 కామెంట్‌లు:

 1. బుద్ధధర్మాన్ని ఎంతబాగా చెప్పారండి. నాకు చాలా నాచ్చింది.

  రిప్లయితొలగించండి
 2. జయ గారు!
  బాగున్నారా? బహుకాల దర్శనం. 15 జనవరి 2012 న స్మరణను సందర్శించి స్పందించిన మీరు మరల ఇంతకాలానికి స్మరణను సందర్శించి స్పందించినందుకు ఆనందంగా ఉంది. మీకు ఈ పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములండి.
  జయ గారు, మీ Introduction లో వాక్యాలు నాకెంతో స్పూర్తిదాయకం ... "మనిషికి పెట్టని కోట వంటిది వ్యక్తిత్వం, దానికి మించిన ప్రతిభ మరేది లేదు. విజయాల వెనుక వేరే రహస్యమేమీ లేదు. కష్టించి పని చేయటమే ".

  రిప్లయితొలగించండి
 3. భారతి గారు, ఈ పోస్ట్ చాలా చాలా నచ్చింది. కనీసం రోజుకొక్కసారైనా, భగవంతుని స్మరించకపోయినా, ఫర్వాలేదేమో కాని, ఈ పోస్ట్ / లేదా ఈ పోస్ట్ లో విషయాలు స్మరణ చేసుకుంటే ఎంతో మంచి జరుగుతుందని నా అభిప్రాయం. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి విషయాలు మా అందరితో మీరు పంచుకోవాలని నా కోరిక.

  రిప్లయితొలగించండి
 4. భారతి గారు చక్కటి విషయాలను తెలియజేశారండి.

  రిప్లయితొలగించండి
 5. అయ్యయ్యో...నిజమా!!! ఇంక చూడండి మీరు వద్దనేదాకా వస్తూనే ఉంటాను:) థాంక్సండి.

  రిప్లయితొలగించండి
 6. జయ గారు!
  నిజమా ... :-) ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించండి
 7. అనూరాధ గారు!
  మీ స్పందనకు ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించండి
 8. జలతారువెన్నెల గారు!
  మహాత్ముల బోధల గొప్పతనం అదేనండి. వాటిని స్మరించుకుంటే చాలు, ప్రశాంత జీవనం అలవడుతుంది.
  మీకు పోస్ట్ నచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించండి
 9. భారతి గారు .. అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ చదువుతున్నాను .

  మీరు చెప్పిన విషయాలు మీరు అనుభవించి చెప్పినవి. అలాంటి ఆత్మ జ్ఞానం లభించాలని కోరుకుంటూ మరల మరల చదువుతూ ఉన్నాను. అర్ధం అవుతూ ఉంది ఆచరణ మాత్రం అంత సులభం కాదు

  మంచి విషయాలని ఓపికగా వివరిస్తున్నందుకు మనసారా ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 10. వనజ గారు!
  అర్ధం చేసుకోవాడానికి ప్రయత్నిస్తూ చదువుతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి. ఆధ్యాత్మిక మార్గం వైపు నా దృష్టి మరలిన తర్వాత ప్రతీది అవగాహన చేసుకుంటూ, వాటిని పదేపదే మననం చేసుకోవడంతో ఒకవిధమైన ప్రశాంతజీవనం అలవడినదండి.

  రిప్లయితొలగించండి