1, మార్చి 2013, శుక్రవారం

"రామానుగ్రహం" ... నా ఆనందక్షణాలు


ఈ మద్య క్రమం తప్పకుండా శ్రీ శ్యామలీయం గారి "పాహి రామప్రభో" చదవడం అలవాటైంది. నిన్న రాత్రి -
తరచుగ నల్ప దుఃఖముల తాకిడికే తలక్రిందులై సదా
పరమ దయాబ్ధి మీ‌చరణపంకజయుగ్మము లంటి యుండి స
త్వరమె విముక్తి గాంచి కడు ధన్యుల మౌదుము మీకు గాక నె
వ్వరి కెరుకౌను దుఃఖబడబానలతీవ్రత జానకీపతీ
!
(శ్యామలీయం గారి అనుమతి లేకుండా వారి పద్యాన్ని స్మరణలో స్మరించుకుంటూ పెట్టినందుకు మన్నించమని అభ్యర్ధిస్తున్నాను) అన్న వారి రచనను చదివి, దానినే స్మరించుకుంటూ పడుకుంటున్నప్పుడు పదే పదే అన్పించింది రామునికి సంబంధించిన పుస్తకం (రామాయణం గానీ, శ్రీ యోగ వాశిష్టం గాని) చదవాలని! ఉదయం లేస్తూనే చదవాలనే తపనతో ఈరోజు పనులు త్వరగా ముగించుకొని రామాయణం తీద్దామని పుస్తకాల అలమర దగ్గరకు వెళ్ళాను. రామాయణం ప్రక్కనే రెండు రోజుల క్రితం నా స్నేహితురాలు పంపిన శ్రీ సుందర చైతన్యనంద వారి వ్యాఖ్యానంతో కూడిన ఆత్మబోధ (శంకరభగవద్పాదుల వారిది) అన్న పుస్తకం ఉంది. ఆత్మబోధని చదవమని మనస్సు ప్రేరేపిస్తున్న ముందుగా నా రామున్ని గురించే చదవాలని రామాయణాన్నే చేతిలోనికి తీసుకున్నాను. ఏ పుస్తకమైనను చదివేముందు కొద్దినిముషాలు కళ్ళుమూసుకొని రామధ్యానం (రామనామ స్మరణం) చేసి చదవడం అలవాటు ఉన్న నేను ఇప్పుడు కూడా అలానే రామధ్యానంకు ఉపక్రమించగా -
ఊహు ... మనస్సు రామనామం యందు లగ్నం కాదే ... కళ్ళ ముందు ఆత్మబోధ పుస్తకమే కదలాడుతుంది. దానినే చదవమని మనో ప్రేరణకు తలవంచక తప్పలేదు. కానీ; అంతరాన్న ఏదో బాధ... 'రామా! ఏమిటిది? నిన్నే స్మరించుకుంటూ నీగురించి చదవాలని రాత్రి నుండి తపిస్తుంటే, ఇలా జరుగుతుంది ఏమిటీ? ఈ మనోమాయను నేను జయించలేను, మనో నియంత్రణ నాకింకా అలవడలేదు, అది నీకూ తెలుసు. మరి నీవే కదా, ఈ మనో మాయలో నుండి నన్ను బయటపడేయవల్సింది. అలా బయటపడేయకుండా ఆ మాయలో నన్నిలానే వదిలేస్తావా? ఇదేనా నీ అనుగ్రహం ..... ' ఇత్యాది భావాలు అంతరమున కదులుతుండగా, రామున్నే స్మరించుకుంటూ ఆత్మబోధలో ఓ పుట తెరిచి, ఎదురుగా ఉన్న శ్లోకాన్ని, వ్యాఖ్యానాన్ని చదువుతుండగా ...  ఆనందంతో నిరుత్తరాలినయ్యాను. ఏదో తెలియని అలౌకికస్థితి లోనికి వెళ్ళిపోయాను. ఆ స్థితి అవర్ణ్యం. ఆర్తితో తపించాలేగాని రాముడు లేనిదెక్కడ? రామాయణమైతేనేం ...  ఆత్మబోధ అయితేనేం ...  అన్నింటా ఉన్నది నేనే అని తెలియజెప్పడానికే ఇలా చేశావు కదా రామయ్యా! 

ఈనాటి ఈ నా ఆనందక్షణాలు అమూల్యం. ఈ నా అనుభూతిని స్మరణలో పెడదామని సిస్టం ఓపెన్ చేయగానే-
డెస్క్ టాప్ బ్యాక్ గ్రౌండ్ గా మా అబ్బాయి అనుదీప్ పెట్టిన చిత్రం నాకు మరింత ఆనందమును కల్గించింది. ఆ చిత్రమిదే -
                                 
ఓ ... చెప్పనే లేదు కదా..... ఆత్మబోధలో నేను చదివిన శ్లోకం, వ్యాఖ్యానం యధాతధంగా  -
తీర్త్వా మోహార్ణవం హత్వా
రాగాద్వేషాది రాక్షసాన్ /
యోగీ శాంతి సమాయుక్తః
ఆత్మా రామో విరాజతే //

భావం: ఆత్మజ్ఞాని మోహ సాగరమును దాటి, రాగాద్వేషాది రాక్షసులను సంహరించి, అటు పిమ్మట శాంతిని పొంది ఆత్మారాముడై వెల్గొందుచున్నాడు. 
ఈ శ్లోకమునకు స్వామి సుందర చైతన్యనంద వారి వ్యాఖ్యానం -
ఆత్మయైన తాను జీవుడని భ్రమ చెందుటయే మోహము. మనస్సులో మోహముదయించగనే ప్రశాంతత అనుభవించు చుండిన అంతఃకరణ అశాంతికి నిలయమగును. మోహపూరితమగు వాని మనస్సు రాగద్వేషములతో  నిండియుండును. ఇవి సుఖదుఃఖములనెడి ద్వంద్వములను కల్పించి అనంత దుఃఖమును, అసంఖ్యాకమైన జన్మలను అందించును. 
మోహము సాగరము వంటిది. అందుచే మోహార్ణవమని శ్రీ శంకరులువారు తెలియజేశారు. ఈ మోహము సాగరమువలె అనంతము, అగాధము అని భావం. రాగద్వేషాదులు రాక్షసుల వంటివి. రాక్షసుల ముందు జీవించువానికి ప్రాణభయం తప్పదు. రాగద్వేషాల మధ్య కొనసాగువానికి ప్రతిక్షణమూ మరణమే., ప్రతిక్షణమూ జననమే. విచారణ ద్వారా మోహసాగరమును దాటి, రాగద్వేషాది రాక్షసులను హతమార్చిన వానికి శాంతి లభించును. శాంతస్వరూపుడైనవాడు ఆత్మవిదుడై, ఆత్మారాముడై వెల్గొందును. 
ఈ శ్లోకమును చదువగానే దీని అంతరార్ధం - రామాయణ వైభవము అని అర్ధమౌతుంది. 
రామునికి దూరమై సీత లంకలో వున్నది. సీతలేని రాముడు శాంతిలేని జీవుడు. రాముడు దాటినా సాగరమే జీవుడు దాటవలసిన మోహమహార్ణవము. రామునిచేత వధించబడిన రావణ కుంభకర్ణాది రాక్షసులే, జీవునిచేత వధించబడవలసిన రాగద్వేషాదులు. సీత రామున్ని చేరినట్లు, శాంతి జీవున్ని సమీపించాలి. పట్టాభిషిక్తుడైన రాముడు అయోద్యరాముడు. సాక్షాత్కారము నొందిన జీవుడు ఆత్మారాముడు. 
                                                    'సర్వేషు రమన్తే ఇతిరామః '
                                    'అందరిలో రమించు దివ్య చైతన్యమే శ్రీరామచంద్రమూర్తి' 
ప్రతి ఒక్కరూ ఆత్మారాములై తరించాలన్నదే వేదాంతాశయము. 10 కామెంట్‌లు:

 1. దుర్గేశ్వర గారు!
  శ్రీరామరక్ష సర్వజగద్రక్ష ...
  జై శ్రీరాం

  రిప్లయితొలగించండి
 2. అమ్మా! మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో తెలియడం లేదు కాని మీ ఈ పోస్ట్ చదువుతూంటే నాకు కూడా అలౌకికమైన అనుభూతి ఏదో కలిగి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అంటా శ్రీరామచంద్రుని అనుగ్రహం అనుకుంటాను తల్లీ.
  శ్రీరామ జయరామ జయజయ రామ.

  రిప్లయితొలగించండి
 3. సురేష్ బాబు!
  అమ్మా! అన్న సంబోధన ఆనందాన్నిచ్చింది. అంతా రామానుగ్రహం.
  ధన్యవాదాలు బాబు.
  శ్రీరామ జయరామ జయజయ రామ.

  రిప్లయితొలగించండి
 4. పరమ పావన 'రామపాదాలు' సోకి
  భరత ధాత్రి పవిత్ర చరిత యయ్యె

  'రామ రామా' యన్న నామాక్ష రాలతో
  నిలువెల్ల నేల పునీత యయ్యె

  'రాముని తిరునాళ్ళ' రమణీయతల దేలి
  ఊరువాడల పుణ్య ముత్సహించె

  'రామ కళ్యాణ' పర్వాల నిర్వహణచే
  నా పల్లె పల్లె ధన్యతలు గాంచె

  మనసు రామయ్య తలపుతో తనివి తీర
  తడిసి ముద్దయ్యె 'స్మరణ వ్రాతలు' గనంగ
  కనులు చమరించె 'రాముని కథ' వినంగ
  భారతీ ! మీరు ధన్యులు ! భక్తి ధనులు !

  రిప్లయితొలగించండి
 5. మాస్టారు గారు!
  మీ స్పందన చదువుతుంటే ...
  మనసంతా రామమయం కాగా, ఆనంద ఉద్వేగాలతో కళ్ళు చమర్చుతున్నాయి.
  మీకేమని బదులివ్వాలో తెలియని భక్తిపారవశ్యం.
  మీకు నా హృదయపూర్వక వందనములండి.

  రిప్లయితొలగించండి
 6. (వితాళ చతుష్పద)
  రాముని నామము వినబడి నంత
  రాముడు మదిలో మెదలే నంట
  రాముని స్మరణము చేసిన యంత
  రాముని రక్షణ దొరకే నంట

  అభినందనలు భారతిగారూ, మీ‌ టపా చదివి చాలా ఆనందించాను. బొమ్మలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. సర్వదా శ్రీరామకటాక్షప్రాప్తిరస్తు.

  రిప్లయితొలగించండి
 7. రాముని నామము వినబడి నంత
  రాముడు మదిలో మెదలే నంట
  రాముని స్మరణము చేసిన యంత
  రాముని రక్షణ దొరకే నంట

  సర్!
  ధన్యురాలిని. మీ ఈ స్పందన రామానుగ్రహం. "పాహి రామప్రభో" చదువుతున్నప్పుడంతా, అంతా రామమయంగా గోచరిస్తుంటే భక్తి తన్మయత్వంతో కళ్ళు వర్షిస్తుంటాయి. రామరక్షాస్తోత్రంతో పాటు ప్రతినిత్యం పాహి రామప్రభో చదవడం కూడా అలవాటైందండి.
  మీకు నా హృదయపూర్వక నమస్కారములు.

  రిప్లయితొలగించండి
 8. రఘురాముడి వైభవాన్ని ఎ౦త కొనియాడినా తనివి తీరదు. సకలచరాచర జగత్తులో ప్రకాశి౦చే ఆ పురాణ పురుషుడు భక్తుల భయాన్ని హరి౦చివేస్తాడు. పోరాట౦లో ఎ౦త పౌరుష౦గా విరాట్ రూపాన్ని చూపిస్తాడో, ప్రియభక్తులను అ౦త ప్రేమగా తరి౦పజేస్తాడు. అ౦దుకే ’జయ జయ రామా, సమర విజయ రామా, భయహర నిజభక్త పారీణ రామా, లోకాభిరామా’.....ఎ౦త రాసినా తనివి తీరదు....

  రిప్లయితొలగించండి
 9. వేద గారు!
  నిజమే ... మీరు అన్నట్లుగా రాముని గురించి ఎ౦త రాసినా తనివి తీరదు....
  మీ స్పందనకు ధన్యవాదాలు!

  రిప్లయితొలగించండి