15, జులై 2015, బుధవారం

సాధనా లక్ష్యం --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి {మూడవభాగం}

గత రెండు టపాల్లో మూలాధారం మరియు స్వాధిష్టాన చక్రాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మూడవ చక్రమైన మణిపూరక చక్రం గురించి తెలుసుకుందాం -


మణిపూరకచక్రం :-
ఐం హ్రీం శ్రీం వాం హం సస్సోహం మణిపూరాధిష్టానదేవతాయై లాకినీ సహిత వైష్ణవ స్వరూపిణ్యాంబాయై నమః 

ఈ కమలం పది దళములు గల జలతత్త్వం కలది. అధిదేవత లాకిని. ఈమె డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ అను యోగినులచే ఆరాధింపబడుచున్నది. వాహనం పొట్టేలు.  'గుడాన్నప్రీతిమానసా /సమస్త భక్తసుఖదా లాకిన్యాంబ స్వరూపిణీ/ సర్వజనులకు సుఖాలు ఇచ్చే ఈ అధిదేవతకు బెల్లపు పొంగలి ప్రీతి. 

బొడ్డునకు మూలంలో వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 4,536 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది.ఈ చక్రమందు ఉద్భవించే శక్తి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరంనకు అందిస్తుంది. ఈ చక్రంనకు పంచకోశాలలో ప్రాణామయకోశంతో సంబంధం. శారీరకవ్యవస్థలోని జీర్ణవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం నాలుక. పుట్టుట, జీవించుట, మరణించుట అను మూడు బిందువులతో కూడిన త్రికోణమే జీవసృష్టి. అట్లే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అను మూడు కేంద్రాలతో ఒక త్రికోణం ఏర్పడుచున్నది. ఈ త్రికోణమే భౌతికసృష్టికాధారం. ఈ మూడు చక్రాలు భౌతిక జీవితం సజావుగా సాగడానికి సహకరిస్తాయి. 

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - 
అవయవములయందు నీరు చేరుట, నోటికి సంబందినవ్యాదులుకు కారణమౌతుంది. నియమాలు లేని ఆహారపు అలవాట్లువలన జీర్ణశక్తి మందగించి అజీర్తి, గాస్ట్రిక్ సమస్యలు కల్గుతాయి. ఉదరకోశ వ్యాధులు, గుండె బలహీనత, నిద్రలేమి, తలబరువు, కాలేయవ్యాధులు, అతిమూత్రవ్యాధి, రక్తక్షీణత, నేత్రవ్యాధులు కల్గుతాయి. 
ఈ చక్ర మానసిక స్వభావం -
మూసుకుపోవడం వలన కీర్తికండూతి, పెత్తనం చెలాయించాలనే అహం, అసూయ, అసహనం, దుడుకుతనం, క్రూరత్వం, కటుత్వం, స్వలాభపరులు, స్వార్ధపరులు.  తనను గురించి తాను తక్కువగా ఆలోచిస్తూ కుంగిపోవడం. 

తెరుచుకుంటే లక్ష్యసాధన, ఆశయసిద్ధి, వ్యవహార దక్షత, ఉత్సాహం, ధనాపేక్ష, తన్ను తాను గౌరవించుకోవడం, ఆత్మవిశ్వాసం కల్గివుండడం, జీవితంలో అన్నింటా ముందడుగు. 
ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది. అనుమానాల్ని నివృత్తి చేసుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ, అన్నింటినీ అవగాహనతో విశ్లేషించుకుంటూ, విశ్వాస, వివేక జ్ఞానంలను అలవర్చుకుంటూ ముందుకు సాగాలి. మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం, అపనమ్మకం రెండూ ఏర్పడేది దీనివలనే. 

లక్ష్యసాధనకు ఉపయోగపడే చక్రం. లక్ష్యసాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ వుంటాయి. పరాజయాలు పలకరిస్తుంటాయి. ఇది సహజం. సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఆశావాదం పెంచుకొని, నిరాశావాదాన్ని మదినుండి తరిమివెయ్యాలి, చిన్న చిన్న అనారోగ్యాలని, అవరోధాల్ని, అవమానాల్ని కుంటిసాకులుగా చెప్పుకొని ఆగిపోక ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. ఓటమి అన్నది గుణపాఠమే గానీ, అంతిమతీర్పు కాదని గ్రహించాలి.   

మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం???
శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రమునకు లాకిని దేవత. సర్వజనులకు సుఖాలునిచ్చే ఈ దేవతకు బెల్లపు పులగం ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే బెల్లపు పులగంను స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "రం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు. 

ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే - 
అనుభూతులను (ఆనందంగానీ, విచారం గానీ, దుఃఖం గానీ, ఆవేశం గానీ... ) లోపల దాచుకోకుండా సహజంగా బయటకు వెళ్లనీయాలి. దీర్ఘంగా శ్వాసించడం చేయాలి. 
అలాగే ఈ చక్రంకు అధిపతి గురుడు. ఆరోగ్యంగా వుండాలన్న, సంపదలు కలిగి వుండాలన్న, సుఖంగా వుండాలన్నా, ఈ చక్రం బలంగా వుండాలి. సప్తచక్రాలలో ఈ చక్రం ప్రత్యేకంగా ప్రతిపత్తి కలది. అదే మాదిరిగా నవగ్రహాలలో గురుగ్రహం ఓ ప్రత్యేకమైన శుభగ్రహం. బ్యాంక్ బాలెన్సు నుండి మెంటల్ బాలెన్సు వరకూ ఆధిపత్యం ఈ గురుగ్రహనిదే. 
చెడు అలవాట్లు జోలికి పోకుండా, ముందొకటి వెనుకొకటి మాట్లాడక, నాస్తికత్వం వదిలి, చక్కటి వ్యక్తిత్త్వంను అలవర్చుకుంటే ఈ గ్రహం, చక్రం సక్రమంగా పనిచేస్తాయి. 

ముఖ్యగమనిక :-
కొందరు ఈ చక్రం అగ్నితత్త్వం గలదిగా అనుకుంటారు. కానీ ఈ చక్రం జలతత్త్వంనకు సంబంధించినది. శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో చెప్పిన వర్ణన బట్టి ఇది జలతత్త్వం గలదిగా నిర్ధారణ చేసుకోవచ్చు. 

తటిత్వం తం శక్త్యాతిమిర పరిపంథి స్పురణయా 
స్పురన్నానారత్నాభరణ పరినద్ధేంద్రధనుషమ్ 
తమశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్ 
నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనమ్ 

మణిపూరకమందున్న మేఘం శ్యామవర్ణము కలది. అనిర్వాచ్యమైనది. అంధకారంను పోగొట్టు మెరుపుతో గూడినది. నానావిధ రత్నాభరణములచేత చేయబడిన ఇంద్రధనస్సు కలది. ప్రళయాగ్నిచే తప్తంలైన ముల్లోకములను చల్లపరుచును. 

తదుపరి చక్రం 'అనాహతం' గురించి తదుపరి టపాలో ... 


1 కామెంట్‌: