6, జులై 2015, సోమవారం

సాధనాసోపనం --- చక్రశుద్ధి -ఆనందసిద్ధి{రెండవభాగం}

క్రిందటి టపాలో మొదటిచక్రమైన మూలాధారం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవచక్రమైన స్వాధిష్టానం గురించి తెలుసుకుందాం -

స్వాధిష్టానచక్రం :-



ఐం హ్రీం శ్రీం కాం సోహం స్వాధిష్టానదేవతాయై కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్యైనమః 

ఈ కమలం ఆరు దళాలుగల అగ్నితత్త్వం కలది. అధిదేవత కాకిని. ఈమె బ, భ, మ, య, ర, ల అను యోగినులచే సేవించబడుతున్నది. వాహనం మొసలి. 'మేధోనిష్టా మధుప్రీతా బందిన్యాది సమన్వితా / దధ్యాన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణీ // మేధోదాతువునకు అధిష్టానదేవతయైన ఈమెకు పెరుగన్నం ప్రీతి.  
స్వాధిష్టానం (స్వ + అధిష్టానం) తనను తానుగా సమాజంలో నిరూపించుకోవడానికి అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. అనేకజన్మలనుండి వెంటతెచ్చుకునే పాపపుణ్యాలను అనుభవంనకు తీసుకొచ్చే చక్రమిది. 

జననేంద్రియము వెనుకభాగమున వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 11,664 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఇది స్త్రీలల్లో ఓవరీస్ కు, పురుషులలో టెస్టిస్ కు ప్రాణశక్తినిస్తుంది. గర్భస్థశిశువుకు ప్రాణశక్తినిచ్చే చక్రమిదే.  జీవునకు తల్లి గర్భమునందు స్థానమేర్పడుటకు మూలాధారచక్రం కారణం కాగా, అటు తర్వాత పిండం భౌతిక శరీరంగా ఏర్పడుటకు కావాల్సిన ప్రాణశక్తిని ఈ చక్రమే ఇచ్చుచున్నది. 
ఈ ప్రాణశక్తి వలనే శరీరవ్యాపారాదులు నడుచుచున్నవి. శరీరంలోని ఉష్ణోగ్రత ఈ చక్రంనకు సంబంధించినదే. జీర్ణశక్తి అధికమవ్వడానికి తోడ్పడుతుంది. ప్రాణవాయువు ఊపిరితిత్తులనిండా వ్యాపించటానికి ఈ చక్రం సహాయకారి అవుతుంది. ఈ చక్రంకు పంచకోశాలలో ప్రాణమయకోశంతో సంబంధం. శారీరక వ్యవస్థలోని విసర్జక వ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం కన్ను. రాజస తామస గుణాలతో వుంటుంది. పునరుత్పత్తి కు సహాయకారి.  దీనిలోశక్తి  చైతన్యరూపంలో మనిషిలో ప్రవహిస్తూ ప్రాణమయ కోశానికి శక్తినందిస్తుంది

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - 
శారీరకంగా పాండురోగం, కంటిజబ్బులు, గర్భకోశ వ్యాదులు, జ్వరాలు లాంటి రుగ్మతలకు కారణమౌతుంది. 

ఈ చక్ర మానసిక స్వభావం -
మూసుకుపోవడం వలన మితిమీరిన కామవాంఛ. విషయసుఖాలపై ఆసక్తి, అపరాధభావన, దురాశ, క్రోధం, అనుమానం, ఉద్రేకం జూదరితనం, వివాదాస్పదతత్త్వం, నిరాశనిస్పృహలు.  
స్వాధిష్టానం తెరుచుకుంటే సత్యం అవగాహన అవుతుంది.  జీవియందలి 'నేను' అను వ్యక్తిగత ప్రజ్ఞయే అహంకారం. అట్టి అహంకారంవలన జీవుడు తనను తానూ పరమాత్మ నుండి వేరుచేసుకొనుచున్నాడు. ఇది జీవియందు నేనున్నాను అను సంకల్పంగా పనిచేయుచున్నది. తానేమిటో మర్చిపోయిన మనిషి ఆ మరిచిపోయిన సత్యానికై బయట దొరుకుతుందని వెదుకులాడుతూ తపన చెందుతున్నాడు, బాహ్యంగా గోచరిస్తుందని భ్రమిస్తున్నాడు, బయట నుండి సంపాదించవచ్చని ఆరాటపడుతున్నాడు, బాహ్యంగా దర్శించవచ్చని తాపత్రయపడుతున్నాడు. ఓ చర్యలో, సంఘటనలో, సన్నివేశంలో, పరిచయంలో ఈ సత్యం లేదని, అది బయటనుండి రాదనీ, మనలోనుండే రావాలని, అంటే తనలో తానై ఈ సత్యం వుందన్న అవగాహనయ్యేది  ఈ చక్రశుద్ధి వలనే .  
ప్రాణశక్తి చక్కగా ఆవిర్భవిస్తుంది. ఈ చక్రాన్నిఅధిగమిస్తే ఇంద్రియాలన్నింటిపైన నియంత్రణ కల్గుతుంది. 
అలానే ఈ నాడీకేంద్రం  అంతర్గత సంస్కారానికి వేదిక. 

మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం ???
శాస్త్ర ప్రకారం పరిశీలిస్తే - 
ఈ చక్రంనకు కాకిని దేవత.  మేధోదాతువునకు అధిష్టానదేవతయైన ఈమెకు పెరుగన్నం ప్రీతి.  ఈ చక్రం బలహీనంగా ఉంటే పెరుగన్నంను బలం కలుగుటకు స్వీకరించాలి. కాచిన పాలలో అన్నం వేసి తోడుపెట్టి ఉదయముననే ఆ పెరుగన్నం తినవలెను.వ్యాదులనుబట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ,  బీజాక్షరం "వం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు. 

ఈ  చక్రంలో జాగృతి తీసుకురావాలంటే - 

కరుణ, వాత్సల్యం, ప్రేమ, అనురాగం, మైత్రిల్లాంటి సద్గుణాలను అలవర్చుకోవాలి. అలాగే అహింసా వ్రతం(ఏ ఒక్కర్నీ మాటలతోగానీ, చేతలతోగాని నొప్పించి,బాధించే ప్రవృత్తి లేకుండా వుండడమే అహింస) ఆచరించాలి. 
అలాగే ఈ చక్రమునకు అధిపతి శుక్రుడు. ఉల్లాసనికీ, మర్మాంగలకు, కామప్రకోపానికీ అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు విశేషించి స్త్రీల జబ్బులకు కారణభూతుడు. ఈ గ్రహం సానుకూలంగా వుండాలంటే - 
హాయిగా నవ్వాలి. ఆనందంగా సంతోషంగా వుండాలి. సంగీతం, నాట్యం, రచన, హాస్యచతురత ఈ గ్రహపరిధిలోనివే. అందుచే యాంత్రికతకు భిన్నంగా మనస్సును రంజింపజేసే వినోదకార్యక్రమాలు, లలిత కళలలో పాల్గొంటూ, ఒకింత కళాపోషణ అలవర్చుకోవాలి. గాయత్రీ మంత్రాన్ని జపించడం, తాను నొవ్వక ఎదుటివార్ని నొప్పించక జీవించడం, మన భావాలు మరొకరికి భారం కాకుండా, బాధ కల్గించకుండా చూసుకోవడం లాంటివి ఆచరించగలిగితే శుక్రగ్రహం అనుగ్రహంతో స్వాధిష్టానం అనుకూలించి జాగృతి అవుతుంది. 




ముఖ్య గమనిక :-
కొందరు ఈ చక్రం జలతత్త్వం గలదిగా అనుకుంటారు. కానీ ఈ చక్రం అగ్ని తత్త్వంకు సంబంధించినది. శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరి లో తెలిపిన  పద్యం ఓసారి గమనిస్తే ఇది అగ్నితత్త్వం గలదిగా నిర్ధారణ చేసుకోవచ్చు. 
తవస్వాదిష్టానే హుతవహ మధిష్టాయ నిరతం 
తమిళేసంవర్తం జనని మహతీంతాం చ సమయాం 
యదాలోకేలోకాన్ దహతి మహతి క్రోధకలితే 
దయార్ద్ర యాదృష్టి: శిశిర ముపచారం రచయితి 
అగ్ని తత్వానికి ఉత్పత్తి స్థానమగు స్వాదిష్టాన కమలమున ప్రళయాగ్ని జ్వాలారూపమైన శక్తి ద్యానింప తగినది. ప్రళయాగ్ని శక్తుల వలన జగములు భస్మమగును. భస్మములైన లోకములు మణిపూరక కమలమునందున్న భగవతి కృపచేత నిలుచుచున్నవి.

తదుపరి మణిపూరక చక్రం గురించి తదుపరి టపాలో ...

2 కామెంట్‌లు: