8, ఫిబ్రవరి 2022, మంగళవారం

ఏమోయ్! కోడలకు ఏమిస్తావ్...

మూడు మాసాల క్రితం కార్తీకంలో - 

నా స్నేహితురాలు శారద వాళ్ళ అబ్బాయి నిశ్చితార్థం సందర్భంగా, స్నేహితులమంతా కలవడం జరిగింది. నిశ్చితార్థం వేడుక ముగిసాక, అందరం కబుర్లలో మునిగాం. శారద తన కోడలికి ఆరోజున పెట్టిన దశవతారాల హారంతో పాటు, వివాహం రోజున తను పెట్టాలనుకుంటున్న నగలు గురించి చెప్పగా, ప్రియంవద అనే మరో మిత్రురాలు సడన్ గా 'ఏమోయ్ భారతీ, నీవూ కోడలు అన్వేషణలో వున్నావు కదా, నీవేమిస్తావు కోడలికి' అని అడిగింది. పేరుకు తగ్గట్లుగా, ప్రియంగా తాను విన్న, చదివిన కధలతో సందర్భోచితంగా చక్కటి చర్చలు చేసే తను, ఇలా అడిగిందంటే, ఏదో చెప్పాలనుకుంటుదన్న విషయం అర్ధమై, 'నీవే చెప్పు, ఏమివ్వమంటావు' అని అడిగా నవ్వుతూ.

'అయితే నేను విన్న ఒక కధ చెప్తాను వినండి ముందు' అని తను అనగానే, అందరం ఉత్సాహంగా ''ఊఁ" కొట్టాం. కధలంటే అందరికీ ఆనందమే. 
తను చెప్పిన కధ యధాతధంగా - 
ఒక రాజుగారు తన కుమారునికి వివాహం చేసి కోడలుకై అనేకనేక వజ్ర వైడూర్య స్వర్ణాభరణములు సమకూర్చి ఇచ్చినా, కోడలు ముఖంలో పూర్ణానందమును కానరాక, మరి ఏమిస్తే ఆనందంగా వుంటుందో నని ఆలోచిస్తూ, ఒకరోజు కొలువుదీరిన సభలో ప్రశ్నించగా, అక్కడ వున్నవారు స్వర్ణాభరణాలు, మంచి మంచి వస్త్రాలు, విలువైన బహుమతులు సూచించగా, ఈ సమాధానాలు సరికావని అనుభవంతో నెఱిగిన రాజు అసహనంతో, తన మహామంత్రిని రేపు సభలో సరైన సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ, లేకుంటే కారాగారవాసం తప్పదని హెచ్చరించెను. ఆనాటి రాత్రి సమాధానం తట్టక, నిద్ర రాక ఆలోచిస్తూ వీధుల వెంబడి దిగులుతో ఆ మంత్రివర్యులు తిరుగుతుండగా, ఊరి బయట చెరువు చెంత ఓ  యువతి ఏడుస్తుండడం గమనించి, ఆ యువతి దగ్గరకు వెళ్ళి, ఎవర్నీవు... అని ఆరా దీయగా, తను ఎవరో తెలుపుతూ, అనాకారితనం వల్ల తనకి వివాహం కాకపోవడం, అందరి హేళనకు గురికావడం, వృద్దాప్యంలో వున్న తల్లితండ్రులు తనకై బెంగపడ్తూ ఆనారోగ్యగ్రస్థులవ్వడం... తదితర విషయాలు వివరించి, తన తల్లితండ్రులను ఎలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేటట్లు చేయాలో తెలియడం లేదని చెప్పగా, ఆ యువతికి తన తల్లితండ్రులపై ఉన్న ప్రేమను, మాట్లాడే విధానంలో సంస్కారమును గుర్తించి, అమ్మాయి! నేను ఈ రాజ్యపు మహామంత్రిని, నిన్ను నా కోడలుగా చేసుకుంటానని చెప్తూ, రేపు బహుశా నేను కారాగారవాసిని కావొచ్చును కనుక, నీ తల్లితండ్రులను తోడ్కొని ఇప్పుడే మా ఇంటికి వెళ్దామని చెప్పగా, ఆ యువతి నమస్కరించి, ఎందుకు మీరు శిక్షింపబడుతున్నారని అడగడం, జరిగింది మహామంత్రి గారు చెప్పడం, దానికి ఆ అమ్మయి సమాధానం చెప్పడం, ఆశ్చర్యానందాలకు లోనై, రేపు మీ అమ్మానాన్నలతో సభకు రా...రాజుగారి సమక్షంలోనే నిన్ను నా కోడల్ని చేసుకుంటాను, ఆ పిమ్మట నీవే  ఈ సమాధానం రాజుగారికి చెప్దువు గానీ, అని చెప్పడం జరిగింది.
మరునాడు సభలో జరిగింది రాజుగార్కి చెప్పి, వారి అనుమతితో ఆ యువతిని తన కోడలుగా చేసుకోవడం, ఆ అమ్మయినే  సమాధానం చెప్పమనడం, ఆ యువతి 'క్రొత్తగా అడుగెట్టిన కోడలకు స్వేచ్ఛ నివ్వండి, తనకి నచ్చినట్లుగా తనని వుండనిస్తే చాలు' అని సమాధానము చెప్పేసరికి సభ అంతా హర్షధ్వానలతో దద్దరిల్లింది. అయితే ఇక్కడ ఓ ట్విష్ట్ ఉంది... ముందురోజు రాత్రి ఆ మంత్రిగార్కి, యువతికి జరిగిన సంభాషణ విన్న ఇద్దరు గంధర్వులు కూడా ఆ సభకు వచ్చి, జరిగింది చూసి, ఆనందంతో అశరీరవాణిగా పలికిరిలా...
ఓ మంత్రివర్యా! నీ మంచితనం, నిజాయితి, నీ కోడలు తెలివి బహు ముచ్చటగా నున్నాయి. నీకో వరం ఇద్దామనుకుంటున్నాం, నీ కోడలు పగలంతా అనాకారిగా, రాత్రి అందంగా... లేదా పగలు అందంగా, రాత్రి అనాకారిగా ఉండేటట్లు వరమిస్తాం. ఈ రెండింటిలో ఏం కావాలో కోరుకోమని అడగగా, తను ఎలా ఉండాలనుకుంటున్నదో కోరుకునే స్వేచ్ఛను నా కోడలికే ఇస్తున్నానని మహామంత్రివారు అనగానే, చెప్పింది ఆచరణలో చూపినందుకు మెచ్చి, ఇకపై అనాకారితనం పోయి, అందంగా ఉంటుందని అనుగ్రహించి ఆశీర్వదించారు ఆ గంధర్వులు...అని కధ ముగించింది. 
అయితే కోడలకు స్వేచ్ఛనివ్వాలంటావు...అదే ఇస్తే వాళ్ళకి వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అయి, మన నెత్తి నెక్కి ఊరేగరా? మన పద్దతులు, ఇక్కడ ఎలా వుండాలో చెప్పకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది...అని కొంత సందేహంతో ప్రశ్నిస్తున్న శారదకు బదులిస్తూ, మనం ఏమీ నేర్పనవసరం లేదు ఈ కాలం పిల్లలకు...వాళ్ళే తెలుసుకుంటారు నెమ్మది నెమ్మదిగా.  ఈ తరం పిల్లలు స్వేచ్ఛాయుతులు ఆలోచనాపరులు కాబట్టి వారికి నచ్చినట్లు వారిని ఉండనిస్తే చాలు. అంతగా ఏదైన చెప్పాలనుకుంటే స్నేహపూరితంగా చెప్పాల్సిన రీతిలో చెప్తే సరి. ఇక వాళ్ళు కాదు మనం ఎలా వుండాలో ముందుగా తెలుసుకోవాలి. అందరికీ ఓ వీడియో ఫార్వార్డ్ చేస్తున్నాను...చూడండంటూ వాట్సాప్ కు ఈ వీడియో పంపింది ప్రియంవద.
                


పై వీడియో పంపించాక, నా వంక చూస్తూ,ఏమిటాలోచిస్తున్నావు భారతీ, అని ప్రశ్నించిన తనతో...ఏం లేదు, కొద్దిరోజుల క్రితం వాట్సాప్ గ్రూప్ లో ఈ స్వేచ్ఛ గురించి చర్చ జరిగింది. విశాల అనే మిత్రురాలు మీరు ఎవరికీ లోబడకుండా స్వేచ్ఛగా ఉన్నారా అని ప్రశ్నించింది. తను స్వేచ్ఛగా లేనని, బాధ్యతలు బంధాలుకు పరిమితమై ఉన్నానని, అందరికీ నచ్చేలా లోబడి వుండడమే బెటర్ అన్న విశాల అభిప్రాయాలు నేను చెప్తుండగా ...
ఊఁ...విశాలగారే కాదు...చాలమంది బాధ్యతలకు, బంధాలకు లోబడే ఉన్నారు. అది తినవద్దు, ఇది తినవద్దు, ఆరోగ్యానికి మంచిది కాదు...బయట తిరగవద్దు, ఏది కావాలన్న మేము సమకూర్చుతాం, టైముకు తింటున్నామా పడుకున్నామా...ఇత్యాది విషయాల్లో పిల్లల ప్రేమైక ఆంక్షలు...మనకి నచ్చింది స్వేచ్ఛగా తినడానికి లేదు, తిరగాడానికి లేదు...ఒకోసారి కొన్ని విషయాల్లో బేధాభిప్రాయాలు, కొందరి విషయంలో పిల్లల నిర్లక్ష్యం, కుటుంబ ఒత్తిళ్లు...వీటి కారణంతో అన్నింటికీ లోబడే ఉంటున్నాం అనుకోవడం కంటే, వాళ్ళకి మనపై, మనకు వాళ్ళపై ఉన్న ప్రేమను, బంధంను గుర్తిస్తే, ఈ లోబడే అనే భావం మనలో రాదు. ప్రేమ ఎప్పుడూ బంధనం కాదు, అది మరింత స్వేచ్ఛనిస్తుందని ప్రియంవద అంటూ, మరి నీవేం చెప్పావని అడగగా -
                 

    
నీవన్నట్లుగా బాధ్యతలు, ప్రేమైక బంధాలు అందరికీ ఉన్నావే. అటు, కుటుంబపరంగా ఒకింత ఒడిదుడుకులున్నప్పటికీ అవగాహనతో  అన్నింటినీ  సరళంగా సమన్వయపర్చుకుంటూ, సంతృప్తికరంగా
ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాను. ఇటు, అంతరాన ఆధ్యాత్మిక చింతనలతో, ఏ చింత లేకుండా,  ఆనందంగా, స్వేచ్ఛగా ఉన్నాను అని చెప్పానని చెప్తుండగా -  
అనుకుంటాంగానీ, ఎక్కడో చోట మనస్సు బందీగానే ఉంటుంది. నిజంగా నీవు పూర్తి స్వేచ్చగా ఉన్నావా? అదెలా సాధ్యమని అక్కడే ఉన్న ఝాన్సీ అనే స్నేహితురాలు అడగగా...అవును, నా మనస్సు చాలా స్వేచ్ఛగా ఉందని దృడంగా చెప్తూ, కాస్త వివరించానిలా. 
ఇదే ప్రశ్న ఓ సంవత్సరం ముందు విశాల అడిగివుంటే, నా సమాధానం ఎలా వుండేదో గానీ, మీకు తెలుసు కదా,  ఆగష్టు 2020 లో కోవిడ్ బారిన పడడం...నేను సీరియస్ కండీషన్ లో ఉండడం... ఆ క్షణంలో "ఉంటే రాముడిచ్చిన కుటుంబంలో, లేకుంటే రాముని పాదాల చెంత"...అంతేకదా...అని నేను అనుకోగానే, నాలో ఎంతో ధైర్యం...పద్నాలుగు రోజుల పాటు యూరిన్ ద్వార రక్తం పోతుండేది...ఉలిక్కిపడేలా నా గుండె సడి నాకినిపించేది...అయినా చలించక, ఇంటిల్లుపాది కోవిడ్ బారిన పడడంతో వారితో, ఫోన్ చేసి పలకరించే ఆత్మీయులతో మాట్లాడుతున్ననూ... ఆ పద్నాలుగు రోజులూ పడుకున్నా, మగతలో వున్నా, మెలుకువగా వున్నా, నిరాటంకంగా "రామ నామ జపం నాలో". రామ స్మరణ ఓ ధారణ... అప్రయత్నంగా ఓ యజ్ఞంలా సాగే జపం...ఆ రాములోరే చేయించుకున్నారు...లేకుంటే ఆ శక్తి నాకెక్కడిది? అప్పుడే అమ్మవారి స్వప్న దర్శనం...చిత్రంగా రామానుగ్రహంతో పదిహేనవరోజు నుండి నార్మల్ కు వచ్చాను. ఆరోజు నాకు వైద్యమిచ్చిన డాక్టర్ గారు, 'అమ్మా! ఏ దైవాన్ని కొలిచావమ్మా...మిమ్మల్ని నేను గానీ, ఈ మందులు గానీ బ్రతికించలేదు...మీరు నమ్మిన ఆ దైవమే మిమ్మల్ని కాపాడింది అని అన్నారు. 
ఆ మాటలతో నేను ఏ స్థితిని దాటివచ్చానో, రాముని కృప ఎంతలా నామీద వుందో అర్ధమై మూగబోయాను. 
                   

ఆ తర్వాత నుండే, నిరంతరం గాడీ తప్పుతూ ప్రాపంచికత వైపు పరుగులు తీసే నా మనస్సు - ఏ స్థితిలో వున్నా, ఎలా వున్నా "రామ" అనుకోవడం, బాధ్యతలు బంధాలతో ఉరుకులు పరుగులు తప్పకున్నా, తప్పని రామ జపం, ఎవరితో మాట్లాడుతున్నా, మాట మాటకి నడుమ రామ స్మరణం అలవర్చుకుంది. ప్రాపంచిక గమనంలో చిన్న చిన్న ఎత్తుపల్లాలు, చిరు ఒడిదుడుకులున్నను, అన్నింటికీ మించి నాకంటే1.5 సం|| పెద్దయిన చిన్నన్నయ్య అకాల మరణం...అంతరాన్ని బలంగా తాకినను, కొద్దిసేపు మాత్రమే ఆ దుఃఖ స్పర్శ. వెన్వెంటనే మనస్సు రామ స్మరణంతో ఇవేవి మోయక, యదేచ్ఛగా ఆనందంలో ఓలలాడడం...ఏదో అలౌకిక శాంతి... ఇప్పటికీ అన్నయ్యని తలుచుకోగానే వేదనతో భారమౌతుంది మనస్సు...కానీ అది కొన్ని క్షణాలు మాత్రమే...రామ స్మరణతో వెంటనే తేలికైపోతుంది...ఇది అప్రయత్నంగా జరుగుతుంది. గతంలో మంచి అమ్మాయి కోడలుగా రావాలని, కుటుంభీకుల గురించి ఆశ, ఆరాటాలు వుండేవి...ఇప్పుడు అవేమీ లేవు...అంతా భగవదేచ్చ అన్న నిశ్చింత...
ఇలా వుంది నా అంతర గమనం... అటు ఇటు (ప్రాపంచికం, పారమార్ధికం) రెండింటి కలయికే జీవితం...ఇలా సాగుతుంది ప్రశాంతంగా నా జీవనం... ఇప్పుడు చెప్పండి, నేను స్వేచ్ఛగా ఉన్నానా...లేదా? 
                   

కొన్ని క్షణాల మౌనాన్ని బ్రేక్ చేస్తూ, నెమ్మదిగా చెప్పాను - అయితే అందరం ఒక విషయాన్ని అర్ధం చేసుకోవాలి. మన అభిప్రాయాలే మనల్ని ఇబ్బందికి గురిచేస్తుంటాయి. మన ఆలోచనలే అడ్డంకులు. కొన్నింటికి లోబడి ఉన్నామన్నది మన భావనే. మన హృదయంలో సరైన భావనే మన జీవితాల్ని నిర్ధేశిస్తుంది. ముందుగా మనం  ఇతరుల అభిప్రాయాలు అనుభవాలతో ముడిపడి వుండక, మనకు ఏం కావాలో అన్న స్పష్తమైన అభిప్రాయంకు రావాలి. దానికి బలమైన పూనిక ఉండాలి. మనలో మనం నిజాయితిగా ఉన్నామా, లేదా అని గమనించుకోవాలి. మనం మన అంతరంగంలో నిజాయితిగా లేనప్పుడు, పరాయిధ్యాసని అనుభవిస్తున్నట్లే. మన నిజమైన స్థితిని విడిచి, పరాయి స్థితిలో ఉన్నట్లే. ఈ పరాయి స్థితి నుండి స్వస్థితి లోనికి పయనించాలంటే నిరవధిక ప్రార్ధన వలనే సాధ్యమౌతుంది. ప్రాపంచిక బంధాలనుండి మానసిక విడుదల ప్రసాదించేదే భక్తి. ఈ భక్తే స్వేచ్ఛను ప్రజ్వలింపజేసే ఆయుధం. ఈ భక్తే హృదయమందిరంలో పూర్ణంగా మనస్సు లయమయ్యేలా జేసి, లౌకిక ఆనందాన్ని ఇస్తుంది. 
                       

ఆనందం స్వేచ్ఛ అనేవి బాహ్యవనరులలో కాదు, అంతరాన ఉంటాయి. త్రికరణశుద్ధిగా భగవంతునికి శరణాగతమైనప్పుడు మనస్సు దానికదే అదుపులోనికి వస్తుంది. మనస్సుని పవిత్రంగా వుంచుకోవాలి. మనస్సుని పవిత్రంగా వుంచుకోవడమంటే బాహ్యంగా మంచిగా ప్రవర్తించడం కాదు, హృదయంలో మనం మనలా స్వేచ్చగా, పరధ్యాస లేకుండా వుండడమే పవిత్రత...ఇదే చిత్తశుద్ధి.
                      

జీవితం అంటే - నేను, నా కుటుంబం, నా వాళ్ళు, నా సంపాదన, నా హోదా, భేదాలు, ఖేదాలు మోదాలేనా?
ఏదో బ్రతికేసాం అని కాకుండా జీవితం సార్ధకమయ్యేలా అంతరం తృప్తి పడేలా, స్వేచ్ఛగా జీవించేలా సాధనతో చిలికేద్దాం...అమృతం అందుకునేంతవరకు.

స్వేచ్ఛాజీవనమంటే పిల్లలు చెడిపోరా? పెద్దలమైన మనమైన స్వేచ్ఛ అనుకుంటే సంసారంలో కలతలు రావా? అని ప్రశ్నించిన మరో మిత్రురాలికి -
                     

సంసారంలో కొంత సర్దుబాటుతత్త్వం ప్రేమతో అలవర్చుకున్నవారికి స్వేచ్ఛ స్పర్శ అనుభూతమౌతుంది. 
"స్వేచ్ఛా జీవనమంటే అజ్ఞానం, అహంకారం, పెత్తనం, హద్దు మీరడం లాంటి గుణాలతో ఇష్టం వచ్చిన రీతిలో యదేచ్ఛగా నడుచుకోవడం కాదు, ఎంతో కొంత క్రమశిక్షణను అలవర్చుకోకపోతే నిత్య జీవితంలో మనకూ, మూగజీవాలకూ తేడాయే ఉండదు. సహజ సుందరమైన జీవితం క్రమశిక్షణ ఫలితంగానే నడుస్తుంది. విచక్షణ, క్రమశిక్షణలతో కూడుకున్నదే నిజమైన స్వతంత్ర జీవనం. వివేకారాహిత్యంతో యిష్టారాజ్యంగా ప్రవర్తించడం స్వేచ్ఛాజీవనం కాదు" అన్న రామకృష్ణ మఠంకు చెందిన స్వామి చెప్పిన మాటల్ని గుర్తుచేసింది రజిని అన్న మిత్రురాలు. 
ఇంతలో అక్కడే ఉన్న సంధ్య అనే సత్సంగ మిత్రురాలు, అవునవును... నాకు కొన్నిరోజులు క్రితం స్వేచ్ఛ గురించి ఓ మెసేజ్ వచ్చిందంటూ ఈ క్రింద మెసేజ్ షేర్ చేసింది. 

💦✨ స్వేచ్ఛ. 

మాటల్ని వల్లించడం సత్యం కాదు. శాస్త్రాల్ని తెలిసి ఉండడం సత్యం కాదు. మనిషి మాటల్లో మునిగిపోయాడు. మనిషి బంధాల నడుమ బంధీలా ఉన్నాడు. సంతోషంగా ఉన్నానంటాడు గానీ, తాను స్వేచ్ఛగా లేనని అనుకుంటున్నాడు. 
అట్లాంటి మనిషికి స్వేచ్ఛ ఇచ్చినా, అతను దాన్ని అనుభవించలేడు. 

బంధపాశాలకు కట్టుబడితే మనిషికి స్వాతంత్య్రమిచ్చినా స్వీకరించలేడు. వాదాలతో, శాస్త్రాలతో, మాటలలో సత్యం మరుగున పడిపోయింది. అందువల్ల మనం వాటికి అలవాటు పడిపోయాం. 
సత్యాన్ని గుర్తించే అర్హతను కోల్పోయాం. దీన్ని బట్టి ఎవరయితే అస్థిత్వాన్ని గుర్తించలేరో, తమ లోలోతుల్లోకి వెళ్లి తమ అసలు స్వరూపాన్ని చూడలేరో వాళ్లు సత్యాన్ని గ్రహించలేరు.

ఒక పర్వతం మీద ఒక సత్రం ఉండేది. దూర ప్రయాణాలు చేసేవాళ్లు అందులో బస చేసేవాళ్లు. పుణ్యక్షేత్రాలు దర్శించుకునే వాళ్లు ఆ మార్గం గుండా వెళ్ళే వాళ్లు. ఎందుకంటే ఆ పర్వతం మీద గొప్ప ఆలయముంది. ఆలయాన్ని సందర్శించాలనుకున్న వాళ్లు ఆ సత్రంలో దిగేవాళ్లు.

ఆ సత్రం యజమాని దగ్గర ఒక చిలుక ఉండేది. దాన్ని పంజరంలో పెట్టి సత్రం ముందు పంజరాన్ని వేలాడదీశాడు. దాన్ని ఎంతో ముద్దుగా చూసుకునేవాడు. దానికి ఫలాలు తినిపించేవాడు. దానికి స్వేచ్ఛ అన్నమాట నేర్పించాడు. అది ఎప్పుడూ ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటల్ని వల్లిస్తూ ఉండేది. సత్రంలో దిగిన వాళ్లకు గొప్ప వినోదంగా ఉండేది. వాళ్ళు కూడా దానికి తినడానికి ఏమైనా పెట్టేవాళ్లు. వాళ్ళు పెట్టినది తింటూ, అది ‘స్వేచ్ఛ,స్వేచ్ఛ’ అని అరుస్తుండేది. రాత్రయినా పగలయినా అవే మాటల్ని వల్లిస్తూ ఉండేది. నిజానికి ఆ పక్షికి స్వేచ్ఛ అనే మాటకు అర్థం తెలీదు. అది ఉన్నది పంజరంలో. తను స్వేచ్ఛగా లేనని, పంజరంలో ఉన్నానని, స్వేచ్ఛ అనే మాటకు తనకు అర్థం తెలీదని దానికి స్పృహ లేదు.

ఇలా ఉండగా, ఒక సారి వివేకవంతుడయిన ఒక వ్యక్తి ఆ సత్రంలో దిగాడు. చీకటిపడుతుండగా ”స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటలు వినిపించడంతో చుట్టూ చూశాడు. సత్రం ముందు పంజరంలో చిలుక ఆ మాటలు వల్లిస్తున్నట్లు తెలుసుకుని విస్తుపోయాడు. పంజరం దగ్గరకు వచ్చి నిలుచున్నాడు. అతన్ని చూసి చిలుక ”స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అంది. అది స్వేచ్ఛగా లేదని, ఆమాటకు దానికి అర్థం తెలీదని, అది పంజరంలో ఉందని అతనికి తెలుసు. అతనికి స్వేచ్ఛ అంటే ఏమిటో  తెలుసు. అతను వెంటనే పంజరం తలుపు తెరచి చిలుకను బయటకు లాగడానికి ప్రయత్నించాడు. ఆ చిలుక బయటకు రావడానికి ఇష్టపడలేదు. అతను బలవంతంగా బయటకు తీసి వదిలిపెట్టినా, మళ్లీ పంజరంలోకి వెళ్లింది. ఎప్పటిలా ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అని అరవడం మొదలుపెట్టింది. రెండుమూడు సార్లు అతను ప్రయత్నించాడు. చివరకు నాలుగోసారి దాన్ని పట్టుకుని, దూరంగా వెళ్లి ఆకాశంలోకి వదిలిపెట్టాడు. అది ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అంటూ ఎగిరిపోయింది.

ఆవ్యక్తి ఆనందంతో సత్రానికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. తెల్లవారు జామునే ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటలు వినిపించి, నిద్రమత్తు వదిలించుకుని, లేచి సత్రం ముందుకు వచ్చి చూశాడు. చిలుక పంజరంలో దూరి ‘స్వేచ్ఛ!స్వేచ్చ!’ అంటూ ఉంది.
ఇది చదివాక నిజమే కదా...కొందరు స్వేచ్ఛ స్వేచ్ఛ అంటారే గానీ, బంధనాల్లోనే ఉండడానికి ఇష్టపడతారు ఆ చిలకలా! ...అని అనుకున్నాం. 
ఒక మూడు రోజులు క్రితం మరల ఇదే టాపిక్ వాట్సాప్ గ్రూప్ లో రావడం... రుక్మిణిజీ అనే మిత్రురాలు 'బాధ్యత లేకపోవడం స్వేచ్ఛ కాదు, స్వేచ్ఛ అనేది పూర్తిగా అంతరంగికమైనది, మన బాధ్యతలలో భగవంతుడు తోడునీడగా ఉంటాడనే పూర్ణ విశ్వాసం మనలో ఉన్నప్పుడు అంతర్లీనంగా అనుభవమయ్యే పరమానందమే స్వేచ్ఛ' అని చెప్పి, కొన్ని ప్రశ్నలు వేయడంతో గతంలో జరిగిన ఈ చర్చ గుర్తుకు వచ్చి స్మరణలో పదిలపర్చుకుంటున్నానిలా...

పై కథా రచయితలకు నమస్సులు.

అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారు కోణంలో  - "స్వేచ్ఛ" ...
తదుపరి టపాలో... 

38 కామెంట్‌లు:

  1. జై శ్రీరామ్ 🙏

    సంసారంలో ఉంటూనే కష్టసుఖాల స్పర్శ తగలకుండా దైవస్మరణలో తగుల్కొని ఉండేటట్లు చక్కటి తర్పీదునిచ్చారు మనస్సుకి.
    మంచి కధనాలతో చక్కటి చర్చ సాగించారు 👌

    రిప్లయితొలగించండి
  2. స్వసంప్రదాయ సంస్కార విద్యావిజ్ఞాన వైభవమ్|
    విధితో రక్ష్యతే యత్ర తత్ స్వాతంత్ర్యముదీరయేత్||

    ఏ దేశంలో సాంప్రదాయాలు, సంస్కారాలు, విద్య, విజ్ఞాన సంపద నియమ పూర్వకంగా రక్షింపబడుతాయో దానినే స్వాతంత్ర్యము అంటారు.

    ఎంత చక్కటి చర్చాగోష్టి.
    మీరందరూ ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తారు.
    యస్. విశ్వనాథ్

    రిప్లయితొలగించండి
  3. ఒక చేతితో సంసారాన్ని, మరో చేతితో భగవంతుని పాదాలను పట్టుకోమన్న శ్రీ రామకృష్ణ పరమహంస గారి మాటలు అందరికీ ఆచరణీయం.
    నైస్ పోస్ట్ భారతీగారు.
    ఈసారి మీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు నన్ను పిలవరా... మీ చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్మ గారు,
      తప్పకుండా పిలుస్తాను.
      కల్సిన ప్రతీసారీ, ఈరీతిలో చర్చలు జరగకపోయినా, కాస్తో కూస్తో ఆధ్యాత్మిక సంభాషణ ఉంటుంది. సుమారుగా అదే అభిరుచి ఉన్నవాళ్ళం.
      ధన్యవాదాలండి.

      తొలగించండి
  4. సంప్రదాయాలు అంటే ఎవేవో కూడా శలవివ్వండి. బాల్య వివాహాలు, సతీ సహగమనం, అంతరానితనం లాంటి లక్షల సాంప్రదాయాలు మళ్ళీ మొదలేసి మన సంస్కృతిని కాపాడుకుందామా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంప్రదాయాలు అంటే,
      కొన్ని అనాగరికపు ఆచారాలు కాదు,
      బలమైన ఆధ్యాత్మిక పునాదితో పటిష్టంగా అనుసంధానింపబడ్డవి. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, శ్రేయస్సుకరమైన, శ్లాఘింపబడేవి బహుళంగా ఉన్నాయి. తెల్లని కాగితంపై చిన్న మచ్చనే చూస్తామో, శ్వేతాన్నే చూస్తామో మన దృష్టి బట్టే ఉంటుంది.
      యస్.విశ్వనాధ్

      తొలగించండి
    2. అజ్ఞాతగారు మీరు ప్రస్తావించిన ఈ ఆచారాలు ఆది నుండి వచ్చే మన సంప్రదాయాల్లో లేవు. మధ్యలో పుట్టుకొచ్చినవి ఇవి. కారణం తురకుల దండయాత్రలు...అప్పుడే మన ఆడపిల్లలు తురకుల బారిన పడకుండా కాపాడుకునే ఉద్దేశంతో ఆ అచారాలు కట్టుబాట్లు వచ్చాయి. ఇది మీరు గుర్తిస్తే బాగుండును. కావాలంటే ఈ లింక్ పరిశీలించండి.
      http://www.teluguyogi.net/2022/02/1.html?m=1

      తొలగించండి
  5. ధర్మో రక్షతి రక్షితః
    వేదవాక్కు.
    ధర్మాన్ని ఆచరించు, ధర్మం రక్షిస్తుంది. అంటే నీ కర్తవ్యం నిర్వర్తించు,అదే నిన్ను కాపాడుతుంది. నేడు హక్కులగురించే చర్చ,బాధ్యతల మాటే మరచారు.హద్దులలో ఉన్న స్వేఛ్ఛ ముద్దు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. There is no absolute freedom for any body either a man or a woman. The limit to freedom is to be decided by the people themselves.

      తొలగించండి
    2. కరెక్ట్ గా చెప్పారండి...
      హృదయపూర్వక నమస్సులు...

      తొలగించండి
  6. చక్కని టపా.

    రాముని దయయే చాలును
    రామస్మరణమె చాలును

    ఈక్రమం ఎందుకంటే రాముని స్మరణం కూడా రామానుగ్రహంతోనే లభిస్తుంది కాబట్టి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శక్తి చాలునా మాంబోట్లకు నిను చక్కగ పొగడగ సీతారామా
      భక్తి కొలదిగ భజనచేయుదుము పావననామా సీతారామా
      రక్తి గొలుపు నీనామము విడువము రాత్రులు పవళులు సీతారామా
      ముక్తిప్రదమది మధురమధురమది మోహాంతకమది సీతారామా
      *****
      నీనామ మెపుడును మరువక చేసిన నిలచేనేమో నీదయ
      అనోట నీనామ మాడుచు నుండగ నాశీర్వదించవయా
      *****
      రామా రామా మేఘశ్యామా రామా రామా మేఘశ్యామా శ్రీమదయోధ్యాపురధామా తామసహర భవతారకనామా ధర్మస్వరూపా శ్రీరామా

      ఇవి మీ కీర్తనలలో చరణాలే శ్యామలీయం గారు.
      ఎంత చదివినా తనివి తీరదు...మనస్సు ఆనందమయమౌతుంది.
      మీకు నా నమస్సులు

      తొలగించండి
    2. రామకీర్తనలను మీరు ఆనందిస్తున్నందుకు సంతోషం భారతి గారూ.

      తొలగించండి
  7. స్వేచ్ఛ గురించి ఇధమిధ్ధంగా అభిప్రాయ వ్యక్తీకరణలో విభిన్నత కనిపిస్తూ ఉంటుంది. ఇది సహజం కూడా. జిడ్డు క్రిష్ణారావు,ఓల్గా,రమణమహర్షి,మల్లాది వారు,ఇలా మనకి తెలిసిన, తెలియని ఎంతోమంది ఈ విషయమై వారి వారి స్వానుభవ అభిప్రాయాలను తెలిపిన విషయం అందరికీ విదితమే.ఇదే విధంగా మన మన సంప్రదాయ,కుటుంబ సంక్షేమం దృష్ట్యా స్త్రీల యొక్క మరియు పురుషుల యొక్క అభిప్రాయ వ్యక్తీకరణ లో చాలా అంతరం ఉంటుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మంచి కధలతో "స్వేచ్ఛ" సబ్జెక్టు ని అందంగా వ్యక్తీకరించిన భారతిగారికి అభినందనలు...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ వ్యాఖ్యకు హృదయపూర్వక ధన్యవాదాలు రుక్మిణి జీ...
      మీరు గ్రూప్ లో అడిగిన ప్రశ్నలే ఈ టపాకు కారణం.

      తొలగించండి
  8. అజ్ఞాత గారు.. భారతిగారు చెప్పని విషయాల గురించిన కామెంట్ ఇక్కడ అనవసరం కద.. ఇలా అన్నాను అని ఏమీ అనుకోవద్దు.

    రిప్లయితొలగించండి
  9. బాహ్యంగా జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ, మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతగగల్గితే అంతకంటే గొప్ప స్వేచ్ఛా జీవితం లేదు.

    రిప్లయితొలగించండి
  10. థాంక్యూ రుక్మిణిదేవి గారు. మీ బ్లాగ్ ఇప్పుడే చూసాను. చాలా బాగుంది. మరి ఎందుకు బ్లాగింగ్ ఆపేసారు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Thank you Vasundhara garu..manchi rachayita,rachayitrulu ఎందరో.. అందుకే వ్రాయడము కన్నా చదవడం ఇష్టం అనిపించింది..

      తొలగించండి
  11. మీ చర్చ ఒక కోణంలోనే సాగింది. దీనికి రెండో పార్శ్వం కూడా పరిశీలించండి.

    నేటి అమ్మాయిలకి స్వతంత్ర భావాలెక్కువ. ఇది గ్రహించిన పెద్దవారు చాలావరకు సర్దుకుపోవడమే చేస్తున్నారు.

    కోడలికి కొడుకును ఇస్తున్నారు. వంశాన్ని వృధ్ధి చేయమని ఆశీర్వదిస్తూ, ఇకపై అన్నీ నీవే చూసుకోవాలమ్మా అంటూ,
    ఎంతో ప్రాధన్యతను ఇస్తూ, అత్త మామలు స్వేచ్ఛ నిస్తున్నారు. కానీ, వీరు నా భర్త, నా పుట్టింటివారు అనుకునేంతగా, నా అత్తింటివారు అని అనుకోరు.

    నేను చూసినంతలో -
    చాలామంది తల్లి తండ్రులు వారిని(పిల్లల్ని) ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వారిని విడిగా ఉంచి సరదాగా ఉండనీ అనుకుంటున్నారు.

    కానీ ఈ తరం కోడళ్ళు దానిని స్వార్థంగా మలుచుకుని భర్త ఒక్కడే తనవాడు..అత్త మామలు పరాయివారు అన్నట్లు వ్యవహరిస్తారు. వారిని విడిగా వీరు వుంచకపోతే వారే విడిగా వెళ్లేంతవరకు చిరుబురులు...

    నిజానికి అంతవరకు కొడుకుతో ఎంతో ప్రేమగా ఉన్న తల్లి తండ్రులు పరాయివారుగా మిగిలిపోవడం, స్వేచ్ఛను కోల్పోవడం, మూగగా బాధను అణచుకొని సర్దుకుపోవడం ముదావహం.

    ఏదైనా పొరపాటున చిన్న మాటకే విడాకుల వరకూ వ్యవహారం... వివాహ విలువలు తెలియని స్వేచ్ఛ... దానివల్ల జీవితంలో వత్తిడి.. అసహనం.. వారి..లో

    ఇటువంటివారి స్వేచ్ఛానందాలు గురించి కూడా మీరు చర్చించండి. శర్మగారిలాంటి పెద్దలు తగు సూచనలు యిస్తే తెలుసుకోవాలని వుంది. 🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమేనండి... ఒక్కడే కొడుకు... వివాహం చేసాం. కూతురు వొచ్చిందన్న ఆనందంతో ఎంత ప్రేమగా చూసుకున్నా, మాతో కల్సి ఉండడం అమ్మాయికి ఇష్టం లేదు...కొడుకు ముఖంలో కళ లేదు. కష్టంగా ఉన్నా, వారిద్దరూ ఆనందంగా ఉండాలని దూరంగా ప్లాట్ కొని ఇచ్చి, వారిద్దరు హేపీగా ఉంటే చాలనుకున్నాం. బాబు మాతో మాట్లాడుతున్నాడేమో, మాకు ఏమైన ఇస్తున్నాడేమో, మమ్మల్ని కలుస్తున్నాడేమో... ఈ అనుమానాలతో నరకం చేసేస్తుంది జీవితాల్ని. మా ఆయన రిటైర్డ్ టీచర్. పెన్షన్, వస్తున్న ఇంటి అద్దెలు మాకు చాలు...ఈ వయస్సులో ఇంత దు:ఖం మోయలేకపొతున్నాం. వద్దనుకున్న బిడ్డల గురించి ఆలోచించకుండా ఉండలేం. అమ్మాయి తల్లితండ్రులు కూడా మంచి చెప్పక కూతురికే సపోర్ట్... ఎక్కడుంది ధర్మం? ఎక్కడుంటుంది ప్రశాంతత. పేర్లు కూడా చెప్పుకోలేని సంకోచం.

      తొలగించండి
    2. నా నరకం పగవాడికి కూడా వద్దు .
      అమ్మాయి బాగుంది అని ఎగబడి చేసుకున్నాను . చేసుకున్న దగ్గర నుండి నరకం చూస్తున్నాను . కొడుక్కి పేరు కూడా వాళ్ళే డిసైడ్ చేసేసుకుని , పేరు పెట్టేటప్పుడు పంతులు గారు చెప్తే అప్పుడు తెలిసింది మాకు.
      మాది పల్లెటూరు , కోడలు రాకపోతే అది మాకు చాల అప్రతిష్ట అని , నీకు ఇష్టం లేకపోయినా ఒక రెండు రోజులు ఉంది పొమ్మని చెప్పినా , అది పెద్ద గొడవ . ఎక్కడో దూరంగా ఉంటున్నాం , అమ్మ నాన్నల తో ఫోన్ లో తప్పిస్తే , తరుచుగా వెళ్ళలేను . వెళితే కోడలు ఎక్కడ అని అడుగుతారు అని భయం . చిన్నప్పటి నుండి విపరీతమైన గారాబం తో పెరగడం, కనీసం బంధువులు తో ఎలా మాట్లాడాలో కూడా తెలియకపోవడం , ఒక వేళ చెప్తే అది పెద్ద గొడవ . ఇలాంటి గొడవలతో , ఇంట్లో నాన్న కరోనా తో బాధపడుతూ , మేము దగ్గరలేకపోవడం, హాస్పిటల్ కి లేట్ వెళ్లడం తో ,ఆయన మాకు దక్కకుండా పోయారు . చదువు లేకుండా , మట్టిపని చేసినంత కష్టం చేసి మమ్మల్ని పెంచిన మా నాన్న ని , ఇలా అనాథలా వదిలేసాను అన్న బాధ రోజు నాకు నిద్రపట్టకుండా చేస్తుంది .
      పలకరించడానికి కూడా రాని ఆ జనాలని చంపాలన్న అన్నంత కోపం . నా వైఫ్ , మా అమ్మకి ఇంత బాధలో కూడా కనీసం ఒక్క ఫోన్ చేయలేదంటే నమ్ముతారా ?

      తొలగించండి
    3. నమ్ముతామండీ. మారుతున్న సామాజికపరిస్థితులను గమనిస్తున్నాను. కుటుంబవ్యవస్థ దాదాపుగా విఛ్ఛిన్నం ఐనది. నేటి యువతరానికి పెద్దలతో కలిసి ఉండే పరిస్థితి లేదు - వివిధ కారణాలు - ఉద్యోగరీత్యా దూరంగా ఉండటమూ, అన్నీ వేరుకాపురాలే కావటమూ, నిత్యం పని వత్తిడితో‌సతమమతం అవుతూ ఉండటమూ వంటివి. వారి ఉరుకులపరుగుల జీవితాల కారణంగా పిల్లలనూ తగినశ్రధ్ధతో పెంచలేకుండా ఉన్నారు. ఆపిల్లలు వివాహాలు చేసుకున్నాక సరైనకుటుంబవ్యవస్థలో పెరుగకపోవటం వలన, తామూ సంసారాలు సరిగా నిర్వర్తించలేక పోతున్నారు. ఫలితంగా ఎవ్వరికీ నేడు సంప్రదాయాలపట్ల అవగాహన కాని గౌరవం కాని ఉండటం లేదు. ఒకప్పుడు వ్యక్తులు మానవత్వం, దేశం, సమాజం, కుటుంబం అన్నవి ప్రాథాన్యతాక్రమంగా భావించే వారు - ఆఖరుదే వ్యక్తిగతస్వాతంత్రం. ఇప్పుడు అంతా తలక్రిందులైనది. అందరూ వ్యక్తిగతస్వాతంత్రం మాత్రమే మొదటి మరియు చివరి ప్రాధాన్యత అనుకుంటున్నారు. సమాజం లేదూ మానవత్వం లేదూ. ఇంక పెద్దల గురించి వీళ్ళకు ఏమీ ఆలోచన ఉండదు. అమ్మాయిలకు తామూ, తమ శ్రీవారూ, తన పిల్లలే ముఖ్యం - మిగతావారంతా అనవసపు చుట్టాలే. కాని చిన్నప్పటినుండి కొంత సాన్నిహిత్యం కారణంగా అమ్మానాన్నలు మాత్రం పనికివస్తారు. అబ్బాయిలలోనూ చాలా మంది తన కుటుంబమే ముఖ్యం అనుకుంటూ‌ అమ్మానాన్నలను కేవలం చుట్టాలను చేసి పక్కనబెట్టే వాళ్ళ సంఖ్య అపరిమితం ఐపోయింది. ఏఅమెరికాలోనో‌ ఉంటూ‌ ఏడాదికో ఆర్నెల్లకో కాని అమ్మానాన్నల్ని పలకరించని వారు ఎందరో నేదు. ఇటువంటి ధోరణులు ఇతరులకు కలిగించే మనస్తాపాన్ని వారు గుర్తించలేరు - అటువంటి సున్నితత్త్వం వారికి ఎలా వస్తుంది? అమ్మానాన్నలు చదువుచదువు అని తోముతూ ఎంతసేపూ‌ డబ్బూ స్టేటస్ వంటివి మాత్రమే బుఱ్ఱలకు ఎక్కిస్తున్నారు కదా? బయట ప్రపంచం కూడా తమ డబ్బూ స్టేటస్ వంటివి మాత్రమే చూస్తున్నాయి కదా.

      ఈసమాజంలో ఇంక పెద్దలు ఒకవిషయం గ్రహించాలి. పిల్లలను పెంచటం తమ బాధ్యత. వాళ్ళకు వారు ఇవ్వగలిగినవి అన్నీ ఇవ్వాలి. కాని వారు ఏమీ ఆశించకూడదు. ఆశాభంగం చెందటం అనవసరం. ఉద్యోగస్థుడయేదాకా ఆబాల్యం బేబీ కేర్ సెంటర్లలో హాస్టళ్ళలో పరాయి ఊళ్ళలో పెరిగిన అబ్బాయిలు తమకుటుంబం తమకు వచ్చాక ముసలి అమ్మానాన్నల్ని వృధ్ధాశ్రమాల్లో వదిలిపెడుతుంటే అందులో నాకు వింత యేమీ కనిపించటం లేదు.

      ఇక వయస్సులో ఉన్నవారు కూడా గ్రహించాలి, నేడు అన్ని సంబంధాలూ డబ్బు సంబంధాలే. అందరూ స్వతంత్రులే - కట్టుబాట్లను సంప్రదాయాలపట్ల ఆదరాన్ని ఆశించకూడదు ఎవరినుండీ. అందచందాలో డబ్బో చదువో కుటుంబగౌరవమో చూసి పెండ్లిళ్ళు చేసుకోవటం సరే - కాని అన్ని విషయాలూ తప్పకుండా ముందే నిష్కర్షగా మాట్లాడుకోవాలి. తప్పదు. అమ్మాయిలైతే "మీ అమ్మానాన్నా కూడా మనతో ఉంటారా? ఐతే ఒప్పుకోం" అని కొందరు ముందే చెప్తున్నారు. సామాజిక కౌటుంబికమైన అంశాలూ, పిల్లలూ, ఆర్ధికపరమైన ప్రణాళికలూ, కెరీర్, ఆశయాలూ అశలూ అన్నీ విపులంగా చర్చించుకోకుండా ఎవ్వరూ ముందడుగు వేయకూడదు వివాహబంధాలకు.

      ఈకలికాలం ఇలా ఉండబోతోందని తెలిసే బాపూ గారి ఒక కార్టూన్లో కాప్షన్ "పుస్తకంలో అన్నం వండటానికి ముందుగా బియ్యం కడగాలని రాసారూ. సబ్బెట్టి కడగాలా?‌ సర్ఫెట్టి కడగాలా" అని ఒకమ్మాయి ఎదురింటి పిన్ని గారిని అడుగుతున్న మాట.

      ఆన్నీ నేడు మనం యూట్యూబ్ చూసీ గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకుంటున్నాం. మనుషులతో సంబంధాలు మృగ్యం. సాటిమనుషులంటే సోషల్ మీడియాలోనూ ఆఫీసుల్లోనూ ఉండేవాళ్ళుగా ఉంది పరిస్థితి.

      కలిసిరాని మనుష్యులు పూర్వం లేరని కాదు. ఇప్పుడు మన నాగరికతావికాసం ఇలా అఘోరించబట్టి అసలు మనుషులతో వ్యవహరించే విధానం మనలో మనకి తెలియటం బాగా తగ్గిపోయింది!

      తొలగించండి
    4. నేటి పరిస్థితులను, నేటివారు చేస్తున్న తప్పిదాలను చక్కగా వివరించారు. అందరూ స్వీయ పరిశీలన చేసుకునేదగ్గ మాటల్ని తెలిపారు.ధన్యవాదాలండీ...

      తొలగించండి
  12. ప్రపంచెంలో మనం చేసే పనులన్నింటికీ కట్టుబాట్లు ఉన్నాయి, ఉద్యోగం, షాపింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఇంతెందుకూ మనకి కావలసిన వాటినన్నీ ఇంకొకళ్ళు మనకి ఇవ్వాల్సిందే అవి కావాలంటే ఇచ్చే వాళ్ళ నిబంధనలు పాటించాల్సిందే.మనస్సులో ఇష్టంలేక ఇంకో మార్గంలేక ఆ నిబంధనలన్నీ పాటిస్తున్న వాళ్ళు బలహీనమని తోచిన వాళ్ళ దగ్గర విజృంభిస్తారని నా అనుమానం.

    రిప్లయితొలగించండి
  13. స్వేచ్ఛ అనే పేరుతో బలహీనత్వం మీద దాడిచేస్తారని నా నమ్మకం.

    రిప్లయితొలగించండి
  14. లక్కరాజు శివ రామకృష్ణారావు గారు,
    తాడిగడప శ్యామలరావు గారు,
    వేదశ్రీ గారు,
    మరి ఈ సమస్యలకు సొల్యూషన్ ఏమిటో, ప్రశాంత జీవితముకై ఏం చేయాలో తెలియజేయండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇవి మానుకోవాలి -

      అతిగా అనుబంధం పెంచుకోవడం
      ప్రేమ అభిమానం ఎక్కువగా ఆశించడం.
      నాకు అన్యాయం జరిగిపోయింది అని నిరంతరం బాధ పడడం

      ఇవి అలవాటు చేసుకోవాలి -

      మనకు నచ్చిన పనులలో నిమగ్నం అవడం
      యోగా ప్రాణాయామం వ్యాయామం, నడక చేయడం
      ప్రతీకార వాంఛ తగ్గించుకోవడం
      వీలయితే ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలులో పాల్గొనడం.

      తొలగించండి
    2. సమాజంలో జరిగేవాటిని వనితావనిగారు, శ్యామలీయంగారు, కొందరు అజ్ఞాతలు చక్కగా తెలిపారు. ఇది వాస్తవానికి సత్యమే అయినప్పటికీ ఇది మాత్రమే సత్యం కాదు. చెడుని మాత్రమే కాదు, మంచిని కూడ తెలిపితే అది సమగ్రమైన వివరణ అవుతుంది.
      మేం ముగ్గురుం అప్పచెల్లిండ్రులం. మా ముగ్గురికి ఒకరికి ముగ్గురు, నాకూ మా చెల్లికి ఒకొక్క కోడళ్ళున్నారు. ఎవరి కొడుకు కోడళ్ళతో వాళ్ళు ఆనందంగా కల్సి మెల్సి వున్నాం. చిన్న చిన్న స్పర్ధలొచ్చిన సర్ధుకుపోయే తత్త్వం, అర్ధం చేసుకునే గుణం వుంటే ఏదీ దుఃఖాన్నివ్వదు.
      పై కామెంట్ల చర్చ చూసాను. నేను నా వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడకులను చూసాను.
      నా కుమార్తె అత్తింటిలో పడే సంఘర్షణలు చూసాను. ఈ జన్మలో నేను చెడ్డదానిని కాను కానీ, ఏ జన్మలో నేను ఏమి చేసానో, ఏమిటన్నది నాకు తెలియదు. కర్మ సిద్ధాంతం నమ్మినదానిని. ప్రారబ్ధానుసారం వచ్చే సమస్యల్ని భూతద్దంలో చూడకుండా వాటిని యాక్సెప్ట్ చేస్తూ, నిలబడేశక్తినివ్వమని పరమాత్మను వేడుకుంటూ, ముందుకు సాగడమే తప్ప, అమ్మో అని చతికిల పడలేదు. జీవితమంటేనే ద్వంద్వాలు. మంచి చెడు, సుఖ దుఃఖాలు, పగలు రాత్రి, బొమ్మ బొరుసు ...ఇది పెద్దలు చెప్పిన మాటే కదా...అది గ్రహించండి. ఏదీ శాశ్వతం గా ఉండదు. ఒకదాని వెంబడి ఒకటి...సహజం. పైన అజ్ఞాత గారు చెప్పినట్లు కొన్ని మానుకొని, కొన్ని అలవాటు చేసుకోవడం...ఆమోదయోగ్యం, ఆచరణీయం, ఆనందదాయకం. సానుకూల భావనలతో సంతృప్తిగా ఉందాం.


      తొలగించండి
    3. మీ వీడియో కి థాంక్స్. చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ప్రేమా అభిమానాలు ఎక్కువగా ఆశించి ఆభరణాల లాంటివి ఇవ్వటం మంచిది కాదేమో !

      తొలగించండి
  15. నరహరి శాస్త్రి18 ఫిబ్రవరి, 2022 4:24 PMకి

    ఇక్కడ మనమ్మాయే అక్కడ మరొకరి ఇంట్లో కోడలు. ఆ కోడలు విలన్ గా అవ్వటానికి కారణాలు విశ్లేసిస్తే బాగుంటుంది. మనం సంస్కారవంతంగా మన కుటుంభాలను తీర్చుదిద్దితే, మంచి చెడు పిల్లలకు నేర్పితే, పిల్లలూ సంస్కారవంతులై తమ సంసారాలను సజావుగా సజీవంగా చక్కబెట్టుకుంటారు. పెద్దల ప్రభావమే చాలావరకు పిల్లలపై వుంటుంది. మన ప్రతిబింబాలే వారు. అలాగే మనం సంస్కారవంతంగా పద్దతిగా పెంచినా మన పిల్ల అక్కడ అత్తింటిలో ఆరళ్ళు పడితే అది ఆ అత్తింటివారి సంస్కారం. అందుకే మన పెద్దలు అంటారు...అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని. అందుకే పెద్దలు మాటలు వినాలి. కానీ వినం. మన కుటుంబ వ్యవస్థని మనమే విచ్ఛిన్నం చేసుకుంటున్నాం. కూర్చున్న కొమ్మనే నరికేస్తున్నాం. ఇక భద్రమెక్కడ? సుఖమెక్కడ? మన పిల్లల్ని చక్కగా పెంచండి. మనింట్లో అడుగుపెట్టిన అమ్మాయిని ఆదరించండి. హుందాగా ఆదర్శవంతంగా పెద్దలు ఉండండి. అలాగే పెద్దల్ని గౌరవిస్తూ మీకు వారిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగ పరచకుండా వారిపట్ల అభిమానముతో పిల్లలుండాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rao S Lakkaraju గారు,
      ప్రేమా అభిమానాలు ఎక్కువగా ఆశించి ఆభరణాల లాంటివి ఇవ్వటం మంచిది కాదేమో...
      మీ ఈ అభిప్రాయం సరైనది.
      మీ వ్యాఖ్యలకు మనసారా ధన్యవాదములు

      తొలగించండి
  16. మా స్నేహితుల సద్గోష్ఠికి కొనసాగింపుగా వివిధ వ్యాఖ్యాలు...
    మరో కోణం నుండి నేటి వాస్తవస్థితులు గురించి వేదశ్రీ గారు తదితరులు ప్రస్తావించగా, దానికి ప్రతిస్పందిస్తూ
    శ్యామలీయంగారు నేటి ఈ పరిస్థితులకు కారణాలను చక్కగా వివరించారు. అలాగే పెద్దలు మరియు అజ్ఞాతలు తమ తమ అనుభవాలను, తగు సూచనలను తెలిపారు. స్పందించిన అందరికీ ధన్యవాదములు. ఈ టపా మరియు వ్యాఖ్యల ద్వారా వ్యక్తమైన అభిప్రాయాల్లో మంచిని మాత్రమే గ్రహించాలని, అలాగే అన్ని కుటుంబాలు సఖ్యతతో విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ.... ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాను.

    రిప్లయితొలగించండి