http://www.sodhini.com

30, జనవరి 2013, బుధవారం

ఆహా... వారు మరింత చతురులు కదా !

ఆహా ..... ఎంతటి చతురుత అన్న టపా చదివిన ఓ మిత్రురాలు ఈ రోజు ఉదయాన్నే ఫోన్ చేసి ఇలా అంది ...
భారతీ! గురువులు కూడా ఎంతో చమత్కారంగా మాట్లాడతూ, శిష్యుల తప్పులను సున్నితంగా సరిదిద్దుతూ నీతిబోధలు చేస్తుంటారు. అందుకు ఉదాహరణంగా నేను విన్నది,  
'శ్రీ రమణులది' చెప్తాను విను-

విదేశీయులూ శ్రీ రమణుల దర్శనార్ధం వచ్చేవారు. ఓసారి అలా రమణాశ్రమమునకు వచ్చిన ఓ విదేశీ స్త్రీ క్రింద కూర్చోలేక కూర్చోలేక కూర్చుని భగవాన్ కూర్చునే సోఫా వైపుకు కాళ్ళు చాచింది. ఇది అక్కడే ఉన్న భగవాన్ శిష్యుడొకరికి సహింపరానిదిగా తోచి, అమ్మా! కాళ్ళు ముడుచుకొండని చెప్పడాన్ని చూసిన మహర్షి; "సరి సరి, ఆమె క్రింద కూర్చోటానికే కష్టపడుతుంటే కాళ్ళు ముడుచుకోవాలా?" అన్నారు నవ్వుతూ. అంతట ఆ శిష్యుడు భయపడుతూ 'లేదు లేదు, ఇక్కడి మర్యాద ఆమెకు తెలియదని చెప్పాను, అంతే' అని బదులివ్వగా; "ఓహో... అట్లాగా... మర్యాద కాదా? అయితే వాళ్ళవైపు కాళ్ళు చాపటం నాకున్నూ మర్యాద కాదు కదా మరి. ఆ మాట నాకున్నూ తాకి వస్తుంది కదా" అని నవ్వుతూ మందలించి కాళ్ళు ముడుచుకున్నారు శ్రీ రమణులు. ఆ మరుసటి రోజు కూడా ఎంతో కాళ్ళు నొప్పులున్న రమణమహర్షి, కాళ్ళు చాచటం, అంతలోనే మర్యాద కాదు కాబోలు అని కాలు ముడుచుకోవడం చేయగా..., ఇది చూసి దుఃఖితుడైన తన శిష్యుణ్ణి చూసి నవ్వేస్తూ కాళ్ళు చాచి ఎప్పటిలా కూర్చుంటూ, "మీరంతా కూడా ఇలా కూర్చోండి ఓ రెండు కధలు చెప్తాను, వినండి" అంటూ అవ్వయార్ కధను, నామదేవ్ కధను చెప్పారట భారతీ... 

శ్రీ రమణులు చెప్పిన అవ్వయార్ కధ -

కైలాసంనుంచి వచ్చిన తెల్లఏనుగును ఎక్కి సుందరమూర్తి వెడుతుంటే చూసి చేరరాజు అశ్వం చెవులో పంచాక్షరి మంత్రమును చెప్పి, దానినెక్కి తానూ వెళ్ళాడట కైలాసానికి. వాళ్ళిద్దరూ వెళ్తున్నారని గణపతిపూజ చేస్తున్న అవ్వయారుకి తెలిసి తానూ పోవాలని తొందరపడుతుంటే ఆ గణపతి అవ్వను చూసి 'అవ్వా! తొందరపడకు, పూజ సావకాశంగా కానియ్యి, నేను వాళ్ళకంటే ముందు నిన్ను కైలాసంకు చేరుస్తాలే' అని అన్నాడట. సరేనని భక్తితో పూజ పూర్తిచేయగానే "అవ్వా! కళ్ళు మూసుకో" అన్నాడు. అంతే, కళ్ళు తెరిస్తే కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల ఎదుట కూర్చొని ఉంది. సుందరమూర్తీ, చేరరాజూల కంటే తన భక్తి వలన ముందుగానే వచ్చింది. అవ్వ పాపం పెద్దదాయే. పరమేశ్వరున కెదురుగా ఇట్లా నాలాగే కాళ్ళు చాచి కూర్చున్నది. ఇది చూసిన పార్వతీదేవికి పట్టరానిబాధ. పరమేశ్వరునికి ఎదురుగా కాళ్ళు చాచిందే, ఇది అపరాధం కదా అన్న దిగులుతో 'నేను చెప్పనా అవ్వతో' అని పరమేశ్వరునికి మనవి చేయగా, "అమ్మో, మాట్లాడకు, ఆమెనేమీ అనరాదు" అని అన్నాడట ఈశ్వరుడు. అయినా ఆ అమర్యాదను సహించలేక చెలికత్తెతో చెప్పగా, ఆ చెలికత్తె అవ్వను సమీపించి 'అవ్వా అవ్వా, కాళ్ళు ఈశ్వరుని వైపు పెట్టకు అని అన్నాదట. 'అట్లాగా అమ్మా, ఈశ్వరుడు ఎటులేడో చెప్పు, ఇటు తిప్పానా?' అని కాళ్ళు ఇటు తిప్పితే ఇటు, అటు తిప్పితే అటు పరమేశ్వరుడు తిరగవలసి వచ్చింది. అప్పుడు పార్వతిని చూసి, "చూసావా? నేను చెబితే విన్నావు కాదు, ఆమె ఇప్పుడు నన్నెలా తిప్పుతుందో చూడు, అని ఈశ్వరుడు అనగా అంతట  అవ్వని క్షమించమని అడిగింది  పార్వతీదేవి. ఇట్లాగే ఉంటుంది కాలు చాపవద్దనటం.....!

శ్రీ రమణులు చెప్పిన రెండవ కధ నామదేవునిది -

స్వామి విఠల్ తనయందే ఎక్కువ మక్కువగా ప్రీతిగా ఉన్నాడని నామదేవ్ గర్విస్తే, జ్ఞానదేవాదులొకసారి ఘోరా కుంభారునింటికి నామదేవున్ని విందుకు తీసుకువెళ్ళి, విందనంతరం ఇష్టాగోష్టిలో ఘోరాకుంభారునీతో 'ఏమోయ్! నీవు కుండలు బాగా చేస్తావ్ కదా, మరి ఈ మా కుండల్లో పక్వమైనవి ఏవో, కానివేవో నాణ్యం చూసి చెప్పవోయ్...' అని చమత్కరించగా -
వారి ఒక్కొక్కరి తలమీద రెండు మొట్టికాయలు వేస్తూ పరీక్షించడం మెదలుపెట్టారు ఘోరాకుంభారులవారు. అక్కడున్న వారంతా తలవంచి నమ్రతతో వూరుకోగా, నామదేవుడు మాత్రం 'ఏమిటేమిటీ, నన్నే కొట్టవస్తావా?' అని ఎదిరించగా; వెంటనే ఇది పక్వంలేని కుండ అని ఘోరాకుంభారులవారు అనగానే అందరూ పక్కున నవ్వారు. ఇక వెంటనే ఉక్రోషంతో, అవమానభారంతో నామదేవుడు లేచి, విఠల్ దగ్గరకు వచ్చి విలపించగా -
"అందరూ కొట్టినప్పుడు నమ్రతగా ఉన్నప్పుడు నీవెందుకు అలా ఉండలేకపోయా"వని విఠల్ ప్రశ్నించగా; మీకు ఎంతో చేరువైన నేనూ, వారూ ఒకటేనా? నన్నా కొట్టేది అని నామదేవుడు బదులివ్వగా -
"అదే అహంకారం. వాళ్ళంతా నా యదార్ధ స్వరూపం తెలుసుకొని స్వస్థచిత్తులై మౌనంగా వున్నారు. ఓ పనిచేయ్... ఇక్కడికి సమీపంలో ఉన్న అడవిలో ఓ దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఉన్న సాధువును సేవించి యదార్ధం తెలుసుకో" మన్న స్వామి విఠల్ మాటలు విని అక్కడికి వెళ్ళిన నామదేవునికి లింగంపై కాళ్ళుపెట్టి పడుకున్న సాధువు కనబడగానే, 'అయ్యయ్యో... స్వామీ అపరాధం, అపరాధం; దేవుడినెత్తిన కాళ్లేమిటీ?' అని కపించిపోతూ అనగా, 'ఓహో... నామదేవా... విఠల్ పంపాడా?' అని ఆ సాధువు అడగడం చూసి, ఆశ్చర్యపడిన నామదేవుడు ఆవేదనతో 'అయ్యా! లింగం మీద కాళ్లేమిటీ?' అని మరల అడగగా; 'అట్లాగా నాయనా! నాకు తెలియదే, కాళ్ళు ఎత్తలేకుండా యున్నాను, కాస్తా అవతల పెట్టవయ్యా' అంటే; సరేనని, కాళ్ళు ఎత్తి ఎటు పెడితే అటు లింగం కన్పించడంతో తనపై పెట్టుకుంటే తానూ లింగంలా గోచరించేసరికి విభ్రాంతితో నిలిచాడు. ' హు... తెలిసిందా ఇప్పుడు' అని సాధువు ప్రశ్నించగా 'తెలిసింది స్వామీ' అంటూ జ్ఞానేశ్వరుల శిష్యుడైన ఆ విశోబాకేశునకు నమస్కరించి ఇంటికి వెళ్లి గదిలో కూర్చొని ధ్యానమగ్నుడై విఠోబా వద్దకు వెళ్ళడం మానాడు నామదేవ్.
కొన్నాళ్ళకు విఠల్ పరుగెత్తుకొని వచ్చి, "నామా! నామా! నీవు రావటం లేదేమీ?" అని ఆర్తిగా అడగగా, 'ప్రభూ! నీవు లేని చోటేది? నిన్ను సదా ఇక్కడే, నాలోనే చూస్తున్నా'ని అనగా ఆనందంతో స్వామి విఠల్ అంతర్ధానమయ్యాడు...అని మహర్షి చెప్పి తన శిష్యునికి జ్ఞానోదయం చేసెనట. 
భారతీ!  రమణమహర్షి ఎంత చమత్కారంగా తన శిష్యుల తప్పులను సరిదిద్దుతూ జ్ఞానబోధ చేసేవారో కదా ... ఆహా... వారు మరింత చతురులు కదా !

27, జనవరి 2013, ఆదివారం

ఆహా.....ఎంతటి చతురత!

క్రిందటి గురువారం ఓ స్నేహితురాలు కోరిక మేరకు తనతో కల్సి షిర్డీ సాయి గుడికి వెళ్లాను. పూజాది కార్యక్రమములు పూర్తయ్యాక బయల్దేరుతుండగా - 'బాబా! ఇంటికి బయల్దేరుతున్నాం, వెళ్ళుటకు అనుమతి ఇవ్వు' అని తను అడగడం చూసి ఒకింత ఆశ్చర్యానందములకు లోనయ్యాను. బాబా ఉన్నప్పుడు షిర్డీ వెళ్ళినవారు తిరిగి వస్తున్నప్పుడు బాబా అనుమతి కోరేవారని చదివాను. కానీ, ఇప్పటికీ ఇలా ఎంతో భక్తీనమ్మకాలతో దానిని ఆచరించేవారు ఉండడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆటోలో తిరిగి వస్తుండగా తనతో అదే చెప్తూ గతంలో పెద్దలు దగ్గరకు, మహర్షుల దగ్గరకు, గురువుల దగ్గరకు వెళ్ళినవారు తిరిగి వస్తున్నప్పుడు అనుమతి కోరేవారని చదివానని చెప్తుండగా, ఎప్పుడో చదివిన శ్రీరమణమహర్షి వారి కాలంలో జరిగిన ఓ చమత్కారపు ఘటన గుర్తుకొచ్చింది. 

తెనాలి దగ్గర పెద్దపాలేం వాస్తవ్యులు కృష్ణయ్య అను నతను తను రచించిన "ధనుర్దాసు చరిత్ర" అనే పద్యకావ్యాన్ని రమణాశ్రమమునకు వచ్చి శ్రీ రమణులకు అంకితమిస్తూ ఇలా వ్రాసారట -
బహుమతులన్నిటిలోనికి కన్యనివ్వటం ఉత్తమమైనది కాబట్టి ఈ కావ్యకన్యకను పెండ్లియాడమని  భగవాన్ రమణులకు సమర్పించుచున్నాను. నాకు తెలుసు, మీరింతకు ముందే ముక్తికాంతను పెండ్లాడినారు. దయచేసి ఈ కావ్యకన్యకను కూడా స్వీకరించి తప్పులు దిద్ది, ఈమె బలహీనతలను క్షమించి బాగా చూచుకోండి. నా వైష్ణవ కన్యకకు భగవాన్తో ఈ వివాహం జరగడం వాళ్ళ అద్వైతానికీ విశిష్టాద్వైతానికి పెండ్లి జరిగినట్లయింది. మీరు నా అల్లుడైనప్పటికీ మా ఇంటికి రండని అడుగలేను. ఎందుకంటే మిమ్మల్ని చూడడానికి ఎంతోమంది రాజులు, గొప్పవారు, సాధకులు ఎప్పుడూ వస్తూనే ఉంటారు కదా" అని, 

వీడుకోలును అంతే చమత్కారంగానే అడిగారట -

"చూసినవారందరూ పరవశించేలాగా, ఈ నీ రూపంలో ఏ మాయలు దాచావ్? 
అందరి శ్రమను పోగొట్టేలా, ఈ గాలిలో ఏ శక్తిని పొందుపరిచావ్?
అన్ని రోగాలను అణచివేయగల్గేలా, ఇక్కడి నీటిలో ఏ మందు కలిపావ్?
వచ్చినవాళ్ళు తిరిగి వెళ్ళుటకు అయిష్టపడేలా ఏ మత్తుమందు ఈ చుట్టుపక్కలా వెదజల్లావ్?
పురుషోత్తమా! మాలాంటి సామాన్యులకు రకరకాల కోరికలు కలుగుతుంటాయి. కొన్ని సఫలమౌతాయి, కొన్ని కావు. నా అన్ని కోరికలు ఇక్కడ తీరాయి. అందులో ఒకటి, ధనుర్దాసు చరిత్రను పద్యకావ్యముగా వ్రాయాలని; రెండు, బంధుమిత్ర  సపరివారంగా వచ్చి నా కావ్యకన్యక చేతిని మీకందివ్వాలని; మూడవది, ఈ పెండ్లి విందును మీతో కలిసి తృప్తిగా ఆరగించాలని; నాల్గవది, ఇక్కడ కొన్ని రోజులుండి మీ దర్శనంతో నా కనులకు విందు చేయాలని. మీ కృపవలన నా ఈ కోరికలన్నీ తీరాయి.
పురుషోత్తమా! నీ గొప్పతనాన్ని నీవు మాత్రమే తెలుసుకోగలవు, మేమెంత కాలం ఇక్కడ ఉన్నా, తిరిగి వెళ్ళుటకు మా పాదాలు కదలవు. నేనేమి చేయగలను?
ఓ పావనుడా! నేను వెళ్ళడానికి మీ అనుమతిని దయచేసి ఇవ్వండి."

నాకు జ్ఞాపకం వచ్చిన ఈ ముచ్చటని నా స్నేహితురాలికి చెప్పగా, తను అన్నదిలా - 
ఆహా.....ఎంతటి చతురత!

17, జనవరి 2013, గురువారం

అమ్మా! నాకో సందేహం.....


ఓం... నమో నారాయణాయ
 రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
 దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
 రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
 దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
 హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదులే
 అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే
 వంకర కన్నుల మీరు శంకర కింకరులు
 వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులు.....

ఉదయం ఈ పాటను మా అమ్మాయి అనూష పాడుతూ - 
అమ్మా! నాకో సందేహం... హరి హరులు వేరు వేరా? భగవంతుడు ఒక్కడే అంటారు కదా. మరి ఇన్ని రూపాలెందుకు? ఇన్ని బేధాలెందుకు? మానవుల మద్య ఈ విబేధాలెందుకు?
అమ్మా! నాకో సందేహం..... అంటూ నాలుగు ప్రశ్నలు సంధించింది. నాకు తెలిసినంతలో జవాబు చెప్పాను ఇలా -
హరి హరులు వేరు కాదమ్మా...
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే /
శివస్య హృదయం విష్ణు ర్విష్ణోశ్చ హృదయం శివః //
                                                    - స్కందోపనిషత్తు
శివుని యొక్క రూపమే విష్ణువు. విష్ణువు యొక్క రూపమే శివుడు. శివుని హృదయమే విష్ణువు. విష్ణు హృదయమే శివుడు. 

భగవంతుడు ఒక్కడే. 
"ఏకం సత్ విప్రా బహుధా వదంతి" అన్నది శ్రుతి వాక్యం. 
సత్స్వరూపమైన పరబ్రహ్మ ఒక్కటే అయినను జగత్తు యొక్క సృష్టి స్థితి లయాదులను బట్టి అనేక స్వరూపాలుగా, పలు పేర్లుగా పిలవబడుచున్నది.

పరమాత్ముడు ఒక్కడైనను, ఆ కాలమందున్న జనుల యొక్క మనఃపక్వతను అనుసరించి ఒక్కొక్క కాలమందొక్కొక్క అవతారం వహించెను.
బహునా త్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ /
అనేక భేదాభిన్నస్తు క్రీడతే పరమేశ్వరః //
ఈ జగమంతయూ బ్రహ్మమే. ఆ బ్రహ్మమగు పరమేశ్వరుడు అనేక విధములుగా అవతరించి క్రీడించుచున్నాడు.

సృష్టిస్థిత్యంత కరణీం బ్రహ్మవిష్ణు శివాత్మికామ్ / 
స సంజ్ఞాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్దనః //
సృష్టి స్థితి లయ కారణముల కొఱకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పేర్లు వహించిన పరమాత్మ ఒకటియే గాని అన్యం లేదు.

నారాయణశ్శివో విష్ణుశ్శంకరః పురుషోత్తమః /
ఏతేషు నామాభిర్బ్రహ్మపరం ప్రోక్తం సనాతనమ్ //
నారాయణ, శివ, విష్ణు, శంకర, పురుషోత్తములను నామములన్నియు సనాతనమైన పరబ్రహ్మము యొక్క పేరులే గానీ వాటి మద్య బేదం లేదు.

మానవుల అజ్ఞానం కొలదే ఈ విబేధాలు. పూర్వం ఈ విబేధాలు ఎక్కువగా ఉండేవి. ( ఈ మద్యనే ఓ పుస్తకం చదివాను. శైవం కంటే వైష్ణవ మతం గొప్పదని ఓ ఆచార్యులవారి ప్రబోధం. తదుపరి టపాలో దీనిని ప్రస్తావిస్తాను) ఈ అజ్ఞానమును వీడమని, అంతా పరబ్రహ్మమయమేనని శాస్త్రవచనం. అంతా ఒకటేనని మహర్షుల మాట. ఏకం సత్ అన్నది గురువుల ప్రబోధం. 
యో సౌ విష్ణుస్స్వయం బ్రహ్మాయో బ్రహ్మా సౌ మహేశ్వరః /
వేదత్రయే చ యజ్ఞే స్మిన్ పండితేష్వేష నిశ్చయః //
ఎవ్వడు విష్ణువో, వాడే స్వయంగా బ్రహ్మదేవుడు. ఎవ్వడు బ్రహ్మదేవుడో, వాడే మహేశ్వరుడు. ఈ రహస్యం మూడువేదముల యొక్క, యజ్ఞాదుల యొక్క, పండితుల యొక్క నిశ్చితాభిప్రాయం. 
గతంలో ఓ పోస్ట్ లో ప్రస్తావించిన పరమానందయ్య అనే గురువుగారు తన శిష్యులకు జ్ఞానోదయం కల్గించిన కధను మరోసారి మా అమ్మాయికి గుర్తుచేశాను.
పరమానందయ్య శిష్యుల కధలు చాలావరకు అందరికీ తెలుసు. శిష్యుల అమాయకత్వం, ఆ అమాయకత్వంలో వారు చేసే పనులు, గురువుగారి బోధలు ...... వీటినీ పరిశీలిస్తే మనల్ని ఉద్ధరించే  సందేశాత్మకమైన ఆధ్యాత్మిక ప్రభోదాలే ఉంటాయి. (పరమానందయ్య శిష్యులు అజ్ఞానపు అమాయక చేష్టలు మన చేష్టలకు ప్రతిబింబాలే)
పూర్వం శివుడే గొప్పయని శైవులు, విష్ణువే గొప్పయని వైష్ణువులు పరస్పర నిందలతో, కొట్లాటలతో అవివేకంగా ప్రవర్తించేవారు. శివుడైనా, విష్ణువైన ఒకే పరబ్రహ్మమునకు చెందినవారని, ఒకే చైతన్య స్వరూపులని, అవివేకంతో ప్రవర్తించక ఈ రెండు రూపాలు మనిషి ఆధ్యాత్మిక జ్ఞానత్వమునకు ముఖ్యమే అని తెలుసుకొని అజ్ఞానమును వీడమని.... తెలియజెప్పే కధనమిది.
ఓ రోజు విశ్రమిస్తున్న పరమానందయ్యగారి కాళ్లు ఇద్దరు శిష్యులు పడుతూ, నేను పడుతున్న కుడికాలు గొప్పని ఒకరు, నేను పడుతున్న ఎడమకాలు గొప్పదని మరొక శిష్యుడు వాగ్వివాదం చేసుకుంటూ, చివరికి గురువుగారి కాళ్ళునే మరచెంబుతో ఒకరు, పానపాత్రతో మరొకరు కొట్టడం మొదలుపెట్టారు. ఆ బాధకి గురువుగారికి మెలుకువ వచ్చి ఆ రెండు కాలు తనవే నని, మీరు చేసిన ఈ అజ్ఞానపుపని నన్నే గాయపరిచిందని, మనిషి మనుగడకు రెండు కాళ్లు ముఖ్యమే కాబట్టి రెండు కాళ్లు గొప్పవేయని, మానవుల మనఃపక్వతను బట్టి వారిని ఉద్ధరించడానికే అనేక రూపాల్లో అవతరించిన భగవంతుడు ఒక్కడే అని, అది గ్రహించి అజ్ఞానమును వీడమని.

హరిం హరం విధాతారం యః పశ్యేదేకరూపిణమ్ /
స యాతి పరమానందం స యోగీ బ్రహ్మ ఉచ్యతే //
బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఏకరూపంగా ఎవరు చూచుచున్నారో, అట్లున్న యోగి శాశ్వతానంద పొందే బ్రహ్మమని చెప్పబడుదురు.

28, డిసెంబర్ 2012, శుక్రవారం

ధ్యాని - దర్శనం



సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని /
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః //

ధ్యానయోగపరుడు సర్వభూతములయందు ఆత్మను, ఆత్మయందు సర్వభూతములను సమానముగా దర్శించును. 



ధ్యానయోగపరులు అందరూ, అంతా ఆత్మస్వరూపమే అన్నభావన కల్గివుందురు. ఈ భావనే ఏకాత్మభావన. ఇదే ఏకీభావస్థితి. చరాచర ప్రాణులయందు అఖండాత్మ చైతన్యమును ధ్యాని మాత్రమే దర్శించగలడు.

ధ్యాని తను సంకల్పించిన ప్రతీపనిని దైవభావనతో చేయడం వలన అది భగవత్సేవే అవుతుంది.
ధ్యాని తను సంభాషించిన ప్రతీమాట మృదుభావనతో మాట్లాడడం వలన అది భగవత్ సంకీర్తనమే అవుతుంది.ధ్యాని తను చూసినదంతా స్వాత్మభావనతో దర్శించడం వలన అది భగవత్ దర్శనమే అవుతుంది.

సృష్టికర్త తన సృజనలో - ప్రతీది పరమాత్మభావనతో మనం చూడాలనే, ప్రతీ జడచేతనాలలో తానై యుండి దైవత్వాన్ని దర్శించుకోమన్నాడు. ధ్యానిలా జీవించమన్నాడు. 

మొక్క, చెట్టు, వనం, అడవి, తోట మొదలగు వాటిపేర్లు వేరైనను వీటి బీజమూలం ఒక్కటే. అది అర్ధం చేసుకోమనే వీటి యందు కూడా పరమ'ఆత్మ'గా తానే ఉన్నానని భగవంతుడు తెలియజేస్తున్నాడు. అందుకు కొన్ని ఉదాహరణలు - తులసిమొక్క నిత్యపూజలందుకునే దేవతామూర్తి కాగా, రావిచెట్టు విష్ణుమూర్తి స్వరూపముగా భాసిల్లగా, వేపచెట్టు మహాలక్ష్మి స్వరూపమైంది.

ఇక బావి, చెరువు, కాలువ, నది, సముద్రం అని వేర్వేరు పేర్లతో పిలవబడినను వీటన్నింటిలో ఏకమై ఉన్నది నీరు ఒక్కటే. వీటన్నంటి యందు ఉన్నది ఒకే చైతన్యం. అది అర్ధంచేసుకునే గంగా యమున మొదలగు నదులను దేవతాస్త్రీలుగా కొలవడం.

అలానే పాము సుబ్రహ్మణ్యస్వామిగా, కుక్క కాలభైరవుడుగా, గోమాత సకలదేవతలకు నిలయమైన దేవతామూర్తిగా, సూర్యాది గ్రహాలూ దైవస్వరూపాలుగా గుర్తించి ఆరాదిస్తున్నాం.
ఇక హిమాలయాది పర్వతశ్రేణులు, భద్రాది కొండలు, గుట్టలు మిట్టలు భగవంతుని నివాసాలుకాగా, పంచభూతాలూ పరమాత్మస్వరూపాలై అంతటా ఉన్నది పరమాత్మే అన్న భావనను దృఢపరుస్తున్నాయి. 
ఇలా సృష్టిలో అణువణువున భగవంతున్ని దర్శించడం, సమస్తమునూ పరమాత్మ స్వరూపముగా భావించడమూ, పవిత్రభావంతో పూజించడం - ఇదే భారతీయ దార్శినికత్వం - ఇదే మానవుడుని మాధవుడుగా మార్చగలిగే దార్మికత్వం -ఇదే సర్వత్రా, సర్వదా సర్వమూ అఖండాత్మ చైతన్యరూపమునకు దర్పణం. 
సమస్త సృష్టికి ఆధారభూతుడు పరమాత్మయే! ఆణువణువూ వ్యాపించి వున్నది ఆ భగవంతుని తత్త్వమే. ప్రతీ జడచేతనలు యందు ఉన్నది పరమాత్మ అంశయే! 

దీనినే ధ్యానయోగమందు ధ్యాని దర్శిస్తాడు. ఏకాత్మభావనతో సర్వాత్మను దర్శిస్తాడు.

                                చిల్లగింజ నీటిని, మంచిమాట మనసుని తేటపరుస్తాయి  

27, డిసెంబర్ 2012, గురువారం

ధ్యానం ద్వారా దివ్యత్వం

ధ్యానం - అహంభావాన్ని చేదించి అతీతమానసమై అంతర్లయగా సాగేది.
ధ్యానం - దివ్యజీవనమునకు దోహదకారి.
ధ్యానం - ఆత్మాన్వేషణకై చేసే అంతర్యానం.
ధ్యానం - అంతరాన్న ఆత్మాపరమాత్మల అనుసంధానం.
ధ్యానం - ఆత్మ స్మృహ.
ధ్యానం - ఆత్మ దర్శనం.

ధ్యానంలో - అహంభావం అంతరిస్తుంది.
ధ్యానంలో - అహంకారం అడ్డుతొలగిపోతుంది.
ధ్యానంలో - ఆభిజాత్యం ఆవిరైపోతుంది.
ధ్యానంలో - అనుమానాలు అదృశ్యమౌతాయి.
ధ్యానంలో - అజ్ఞానం అంతర్దానమౌతుంది.
ధ్యానంలో - అంతర్యామియందు అపరిమితమైన అపేక్ష అంకురిస్తుంది.
ధ్యానంలో - అంతర్భూతంగా ఆధ్యాత్మికత అవతరిస్తుంది.
ధ్యానంలో - ఆరాధన అంతర్వాహినవుతుంది.
ధ్యానంలో - అభ్యాసంచే అన్నివేళలా అన్నింటా అంతటా ఆత్మభావం అలవడుతుంది.
ధ్యానంలో - మనసు అచలమై ఆత్మా ఆవిష్కృతమవుతుంది. 

                                                అన్నింటా విశ్వాసంతో వుండు 
                               విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు.

22, డిసెంబర్ 2012, శనివారం

వైరాగ్యం

                 నీ మనస్సు భగవద్విలీనం కాలేదంటే నీలో దృఢమైన వైరాగ్యం లేనట్లే - బాబా.

వైరాగ్యం అంటే -
                 విరాగం. రాగం లేకుండుట. దృశ్యమాన ప్రపంచమందు రాగం లేకుండుట.
                 శరీరము, ప్రపంచమందు విషయములు అనిత్యమైనవని గ్రహించి, ఇహ పరలోకములయందు ఏ విధమైన కోరికలు లేకుండా ఉండటం. 

అలాగని తాముచేసే పనిని, తమకుగల బాధ్యతలను, స్వధర్మాన్ని వదిలివేయడం వైరాగ్యంకాదు, తాము సాధించదలిచిన లక్ష్యానికి అడ్డుగా వచ్చే వాటినన్నిటినీ వదలడమే వైరాగ్యం.

[గృహస్థుడగు పురుషుడు సహధర్మిణితో నుండి తల్లితండ్రులను, బిడ్డలను చక్కగా పోషించి అతిధి సత్కారపరుడై గృహకృత్యములలో లోటు గలుగక చూచుకుంటూ జ్ఞాననిష్ఠుడై ఉండవలెను. అలానే స్త్రీ గృహధర్మం నిర్వర్తిస్తూ, పెద్దలకు పతికి శుశ్రూషలు చేస్తూ, పిల్లలను చక్కగా పెంచుతూ, అతిధి అభాగ్యులను ఆదరిస్తూ, బ్రహ్మనిష్ఠను అభ్యసించవలెను. ఇదియే గృహస్థులు చేయవలిసిన పంచమహాయజ్ఞములలో గల గొప్ప బ్రహ్మయజ్ఞమని మహర్షులు చెప్తారు] 

వివేకం వలన, విచారణ వలన వైరాగ్యం కలుగును. ఏది నిత్యమో, ఏది అనిత్యమో; ఏది సుఖమో, ఏది దుఃఖమో; ఏది మంచో, ఏది చెడో....... ఇత్యాదులను గ్రహించడమే వివేకం. దృక్కును, దృశ్యమును పరీక్షించుచుండుట విచారణ. విచారణ అనేది అంతరంగిక అన్వేషణ. ఈ విచారణయే వైరాగ్యంనకు దగ్గరదారి. సద్విచారణ వలెనే అనిత్యపదార్ధములయందు అనాసక్తి ఏర్పడుతుంది. ఇట్టి సద్విచారణ జనితమైన అనాసక్తి పేరే వైరాగ్యం.

అలాగే ప్రతికూల పరిస్థితిలో విషయాసక్తి విడిచిపెట్టడం వైరాగ్యం కాదు, అనుకూల పరిస్థితిలో కూడా విషయాసక్తి లేకపోవడం వైరాగ్యం. 

వైరాగ్యంనందు మూడవస్థలు గలవి. అవి 1. వైరాగ్యం యొక్క హేతువు, 2. వైరాగ్యం యొక్క స్వరూపం, 3. వైరాగ్యం యొక్క కార్యం.

దోషదృష్టిర్జిహాసా చ పునర్భోగేష్వదీనతా /
అసాధారణ హేత్వాద్యా వైరాగ్యస్యత్రయోప్యమీ //
విషయములయందుగల అనిత్యత్వ సాతిశయత్వాది దోషదర్శనమే వైరాగ్యమునకు హేతువు. విషయభోగములను విడుచుటయే వైరాగ్యస్వరూపం. మరల భోగేచ్చ కలుగకపోవుటయే వైరాగ్యము యొక్క కార్యమగును.

అలానే మనుజులలో కదిలాడే భావాలబట్టి వైరాగ్యమందు వైవిద్యాలున్నాయి. కొన్ని వైరాగ్యాలు తాత్కాలికమైనవి. అందులో కొన్ని -
1. మందవైరాగ్యం:- 
                         సంసార బాధలు వచ్చినప్పుడో, మహాత్ముల మాటలు విన్నప్పుడో, దైవిక గ్రంధములు చదువునప్పుడో, సత్సాంగత్యం కలిగినప్పుడో దైవకార్యంలో ప్రవేశించాలన్న భావన కలిగి, ఏదైనా నొక తరుణోపాయమగు ధ్యానమునో ధ్యాసనో ఏర్పరచుకునే తలంపు చేయడం మందవైరాగ్యం. (కొద్దిరోజులే ఈ సాధన. మరల ప్రాపంచికజీవనంలో పడిపోతారు)
2. శ్మశానవైరాగ్యం:-
                         ఆత్మీయులో, తెలిసినవారో మరణించినప్పుడు 'ఎవ్వరికెవ్వరొ, ఎన్నాళ్ళు ఉంటారో, ఎప్పుడు రాలిపోతారో తెలియదు. మరణం తప్పదని తెలిసినా బంధాలను పెంచుకోవడం, భార్యాపుత్రాదులకై, బందుమిత్రులకై పరితపించడం, కష్టపడి సంపాదించడం, చివరికి ఏదీ తోడురాక ఒంటరిగా కాటికి చేరుకోవడం....... ఏమిటిదంతా? ఇంతటిదానికి ఎందుకింత ప్రాకులాడడం........ ఇత్యాది ఆలోచనలతో వైరాగ్యభావంకు లోనుకావడం శ్మశానవైరాగ్యం. (కొలదిరోజుల్లోనే సంసారమునందు మునిగిపోతారు)
3. ప్రసూతివైరాగ్యం:-
                         ప్రసవవేదన పడుతున్నప్పుడు ఈ బిడ్డ ఒక్కరు చాలు, చాలు. ఈ నొప్పులు మరల మరల పడలేను..... అని ఆ బాధను తాళలేక అనుకోవడం ప్రసూతివైరాగ్యం. (మరల సంతోషంగా మరోసంతానికి సిద్ధం కావడం జరుగుతుంది)

4. పురాణవైరాగ్యం:- 
                         పురాణాలు వింటున్నప్పుడూ, పఠిస్తున్నప్పుడు దైవంనందు భక్తిభావం కుదిరి మోక్షం పొందేయాలి అని ఆక్షణమునే భావించి త్వరపడడం పురాణవైరాగ్యం. 
[ఈ పురాణవైరాగ్యం గురించి ఎప్పుడో ఎక్కడో చదివిన ఓ కధ జ్ఞాపకం వస్తుంది. 
ఒకరాజు తన ఆస్థాన గురువుద్వారా ప్రతీరోజు భాగవత శ్రవణం చేయుచుండెను. ఏడురోజుల్లో పరీక్షిత్తు మహారాజునకు శుకమహర్షి భాగవతమును తెలిపి మోక్షమును కలుగజేసినట్లు గ్రహించి, తనకును భాగవతసారమంతా ఏడురోజుల్లో తెలిపి మోక్షమును కలుగజేయమని, అలా కలుగజేయనిచో వంద కొరడా దెబ్బలు మరియు రాజ్య బహిష్కరణ తప్పవని శాసించెను. గురువుగారు ఆరురోజులవరకు ఎంతో శ్రద్ధతో చెప్పినను మహావ్యాకులతతో ఉండడం చూసిన పరమభక్తుడైన గురువుగారి సేవకుడు 'దీనికేల వ్యాకులత చెందుతారు? ఏం భయపడకండి, రేపటిదినమున నేను మీ బదులుగా రాజుగారి దగ్గరకు వెళ్లి భగవత్కృప వలన అన్నిటిని చక్కబరిచి వచ్చెద'నని చెప్పెను. 
ఆ సేవకుడు మరుసటిరోజు ప్రాతఃకాలమున రాజుగారిని దర్శించి, మా గురువుగారు ఈ దినం తమను ఉపవాసముగా ఉండమనియు, ఈ దినం ఏడవరోజు అగుటచే పూజలు జరిపించమని తెలపమనిరి, అని చెప్పెను. అంతట ఆ రాజుగారు దినమంతయు ఉపవాసముండి నాలుగవయామమున పురాణ శ్రవణంనకు నిరీక్షించుచుండెను. ఆ సేవకుడు రాజమందిరం ప్రవేశించుసరికి జరగబోవు రాజుయొక్క ముక్తిని చూడవచ్చిన జనులతో క్రిక్కిరిసివుంది. తమ ఆచార్యులు ఈ దినం రాజాలరనియు, మోక్షధర్మము యొక్క రహస్యమును తమకు తెలుపుటకు తనాజ్ఞాపించి పంపిరనియు, ఈ చిన్నవిషయమునకు తానెలా రావలసియున్నదనియు గురువు చెప్పి పంపినట్లు సేవకుడు తెలిపెను. అంతట అచ్చట ఉన్న పండితులందరూ రాజుగారితో ఎవరైనను మనకేమి? ప్రయోజనము కలిగిన చాలునని చెప్పగా రాజు దానికి అంగీకరించెను. అప్పుడు ఆ భక్తుడగు సేవకుడు 'ఉపదేష్ట ఎవడైనను వారి వాక్యములను గురువాక్యముగా నమ్మవలయును. వినువాడెవడైనను శిష్యభావము గలిగియుండవలెను నని చెప్పగా రాజు సరే అనగా, ముహూర్తం దగ్గరకు వచ్చినది, రాజుగారి ముందట ఒకబల్లపై పంచభక్ష్యపరమాన్నములుంచి భాగవత పూజలు జరపవలసిందని చెప్పి, రాజుగారి రెండు చేతులు, కాళ్ళను సింహాసనమునకు కట్టివేసి, 'ఓ ప్రభువా! లగ్నం వచ్చినది, అయిదు నిముషముల లోపల పుష్కర ముహూర్తం కలదు, దీనిలోపల ఉపవాస విరమణ జరగవలెను. కావున ఈ పదార్ధములన్నియు వెంటనే భుజించినచో ముక్తి కలుగును' అని చెప్పగా; చేతులు, కాళ్ళు కట్టుబడినందుచే రాజు తినలేకపోయెను. ఈ కారణంచే ముక్తి అనుభవం కలుగలేదని ఆ సేవకుడు అని ఇలా వివరించెను - కాళ్ళు చేతులు బందింపబడి యున్నందున కంటికి కన్పిస్తున్న పదార్ధములను తినలేకపోయారు. అలానే మా గురువరుడగు పౌరాణికుడు, దివ్యోపదేశముల నన్నిటిని, భాగవత సారమంతయు మీకుపదేశించినను మీరు మీ మనస్సును భగవద్విలీనము చేసుకోలేక ఆశాపాశంలచే కట్టుబడియుండుటచే ముక్తానుభవం కలుగలేదు. సమస్త బంధనములనుండి విముక్తి పొందినవారికే బ్రహ్మానుభవం కలుగును తక్కినవారికి వేదాంతశ్రవణం ఈ మోస్తారుగానే ఉండునని చెప్పెను. ఈ విషయం తెలిసుకున్న గురువుగారే ఆ భక్తసేవకునికి సేవకుడు అయ్యారన్నది వేరే విషయం. స్థిరమైన వైరాగ్య అభ్యాసలున్డాలి. కేవలం శాస్త్ర శ్రవణ పఠన వైరాగ్యాలు ఫలితాన్నివ్వవు] 
అంధకారమును పోగొట్టుటకు దీపం వెలిగించాలంటే ప్రమిద, తైలం, వత్తి ఎలా అవసరమో, అలానే అజ్ఞానాంధకారమును పోగొట్టుటకు సంపూర్ణవైరాగ్యమను తైలం, అనన్యభక్తియను వత్తి, పూర్ణమైన ప్రబోధం అనెడి పాత్ర (ప్రమిద) ఉన్నప్పుడే జ్ఞప్తి జ్ఞానమనెడు జ్యోతి వెలుగును. 

వైరాగ్య తైలసంపూర్ణే భక్తివర్తిసమన్వితే /
ప్రబోధపూర్ణపాత్రే తు జ్ఞప్తిదీపం విలోకయేత్ //
                                                - దక్షిణామూర్త్యుపనిషత్ 


కొన్ని స్థిరముగా నిలిచే దృఢమైనవైరాగ్యాలు. అందులో కొన్ని -            
1. మృదువైరాగ్యం:-
                         ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని, అందుకై గురువును ఆశ్రయించాలని, పరమార్దసిద్ధిని పొందాలని, పరితాపంతో ప్రయత్నించడం మృదువైరాగ్యం.
2. తీవ్రవైరాగ్యం:-
                         ఇదంతా మిధ్యాప్రపంచమని గ్రహించి, ప్రాపంచిక విషయలాలసను విడిచి, దేనియందు ప్రీతి లేకుండా పరమాత్మకై ప్రయత్నించడం తీవ్రవైరాగ్యం.
3. తీవ్రతరవైరాగ్యం:-
                         అనన్యదైవభక్తితో బ్రహ్మజ్ఞానామృతం గ్రోలడానికి ఒకే ధ్యాసలో మోక్షమనెడు సర్వేశ్వరప్రాప్తికై అవిశ్రాంతకంగా ప్రయత్నించడం తీవ్రతరవైరాగ్యం.
4. అతి తీవ్రతమవైరాగ్యం:-
                         జ్ఞానతాపంచే తపిస్తూ ఆత్మోపలబ్ధికొరకు ఆజన్మాంతం ప్రయత్నించడం అతి తీవ్రతమవైరాగ్యం. 


వైరాగ్యం ఎప్పుడూ మనస్సులోనే కలుగుతుంది. కాని, అరణ్యానికో, నిర్జనప్రదేశానికో, స్వధర్మాన్ని విడిచిపెట్టి ఏకాంత వాసానికో వెళ్ళడం వైరాగ్యం కాదు. 

                            దేవాలయంలో దేవునిమూర్తిని దర్శించాలంటే బాహ్యశుద్ది చాలు 
                               దేహాలయంలో దేవుణ్ణి దర్శించాలంటే అంతరశుద్ధి కావాలి

16, డిసెంబర్ 2012, ఆదివారం

గుప్పెడంత గుండెలో ...

ఈ రోజు శ్రీమద్భగవద్గీత చదవాలనిపించింది. పనులన్నీ అయ్యాక గీత తీసాను. పద్దెనిమిది అధ్యాయములలో ఏది చదవాలి? కళ్ళు మూసుకొని కృష్ణుడును తలచుకుంటూ ఓ పేజీ తెరిచాను. తెరిచిన పుటలో కళ్ళకు ఎదురుగా ఉన్న శ్లోకమును చదివాను. 

అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేబరమ్ /
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః //

అంత్యకాలమందు ఎవడు నన్నే స్మరించుచూ దేహమును విడిచిపెట్టునో, వాడు నా స్వరూపమును పొందుచున్నాడు. ఇందులో సందేహం లేదు.

హమ్మయ్య....... మరణించేముందు కృష్ణున్ని తలుచుకుంటే చాలు. కష్టపడకుండా, ఇతరత్రా సాధనలు చేయకున్న ముక్తిని పొందేయవచ్చు.... అని మనస్సు మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంతలోనే కన్నయ్య నా బుద్ధిని మేల్కొపి, మదిని మాయను తెలిపి, 'ముకుందమాల'లో ఓ శ్లోకాన్ని గుర్తుచేశాడు.

కృష్ణ త్వదీయపదపంకజపంజరాన్తమ్ 
      అద్యైవ మే విశతు మానసరాజహంసః 
ప్రాణప్రయాణసమయే కఫవాతపిత్తై:
       కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే 

ఓ కృష్ణా! ఈ క్షణమే నా మానసరాజహంస నీ పాదపద్మతూళ్ళ వల యందు ప్రవేశించుగాక. మరణసమయమున గొంతు కఫవాతపిత్తములతో పూడుకుపోయినప్పుడు నిన్ను స్మరించుట నా కెట్లు సాధ్యపాడగలదు?

నిజమే కదా - 
అసలు మరణం ఎప్పుడొస్తుందో తెలియదు. తెలిసిన మరణసమయమున ఏ అనారోగ్యం చేతనయినను కృష్ణుడిని తలచుకోలేకపోవచ్చు, తలుచుకోవాలన్న జ్ఞాపకం కూడా రాకపోవచ్చు. అంతవరకు జీవించినకాలంలో స్మరణలో లేనిది ఆ క్షణంలో స్పురణకు ఎలా వస్తుంది? ఊహు.... రాదుగాక రాదు. అందుకే అంతా సవ్యంగా ఉన్నప్పుడే భగవంతుని పాదారవిందాలను పట్టుకోవాలి.

అరవిందం అంటే ఒకానొకప్పుడు గురువల్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలు లీలగా గుర్తుకొస్తున్నాయి -
ఓసారి గురువుగారు తన ప్రవచనంలో...
ముఖారవిందం, హస్తారవిందం, పాదారవిందం అని ఎందుకంటారో తెలిపారు. 
అరవిందం అంటే పద్మం. ఈశ్వరుని పాదాలను, చేతులను ముఖమును ఈ అరవిందాలతో (పద్మాలతో) ఎందుకు పోల్చుతారంటే -
షట్పది అంటే తుమ్మెదని అర్ధం. ఆరుపాదములు గల తుమ్మెద పద్మం కనిపించగానే మకరందంకై వెళ్లి పట్టుకుంటుంది. అలానే పంచేద్రియములు + మనస్సు అనే ఆరింటితో పద్మాల్లాంటి ఈశ్వరుని పాదాలను ఆశ్రయించాలని కవులు వర్ణిస్తారని చెప్పారు.


అయ్యబాబోయ్......... నా గుప్పెడంత గుండెలో కరుణారసామృతుడైన నా చిట్టి కిట్టయ్య లేకపోతే ఇవేవీ నాకు జ్ఞాపకం రాక, నేనీ మనోమాయలో పడిపోదును కదా.

ఓ కృష్ణా! ఈ మనోమాయలో పడకుండా నీవే సదా మము రక్షించుగాక!


                                         శరీరం దైవదత్తం - మనస్సు మానవ కల్పితం 
                                           బుద్ధిని శుద్ధి చేసుకుంటే మోక్షసిద్ధి తధ్యం