http://www.sodhini.com

19, జూన్ 2015, శుక్రవారం

చక్రశుద్ధి - ఆనందసిద్ధి

ప్రతీ సాధకుడు ముందుగా ఈ విషయాల్ని గ్రహించాలి - 'ప్రాపంచికం, పారమార్ధికం వేరు వేరు కాదు, రెండింటి మేళవింపే జీవితం' అని. 'సానుకూలదృక్పదం, ఏకాత్మతా భావం, శాంతి సహనాలు, భగవత్ స్పృహ ... వీటన్నిటి సమాహారమే ఆధ్యాత్మికత' అని. 'మానసిక కాలుష్యాన్ని తొలగించడమే ఆధ్యాత్మిక సాధన' అని. ఇహ పరంలో దేనిని సాధించాలన్న ఆరోగ్యం చక్కగా ఉండాలి. 
ఇక్కడ మరో విషయం గ్రహించాలి - ఆరోగ్యం  అన్నది శరీరానికి మాత్రమే సంబంధించినది కాదు, మనస్సుకీ, మనుగడకీ కూడా! ఇక ఈ విషయంలో మన ప్రాపంచిక, పారమార్ధిక జీవన గమనంలో సప్తచక్రాలు ఎలా పనిచేస్తున్నాయో ఓసారి పరిశీలిద్దాం -

ఒకానొక ఆదిశక్తి నుండి సృష్టించే శక్తి, పెంచి పోషించే శక్తి, లయించే శక్తి ఉద్భవించి, అందులో నుండి మరెన్నో కోట్లాది శక్తులు ఆవిర్భవిస్తూ ఈ సృష్టి కొనసాగుతుంది. 
విశ్వమునందు, సౌరమండలమునందు, భూమియందు, మానవదేహమునందు ఏడు ప్రజ్ఞామయ కేంద్రములు పనిచేయుచున్నవి. విశ్వమునందలి ఏడులోకములకు (సత్యలోకం, తపోలోకం, జనోలోకం, మహర్లోకం, సువర్లోకం, భువర్లోకం, భూలోకం)సప్తర్షిమండలం అధ్యక్షత వహించుచుండగా, సౌరమండలమునందలి ఏడులోకములకు ఏడుగ్రహములు (రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని)అధిపతులుగా వున్నవి. మానవదేహమునందు ఏడు ప్రజ్ఞామయకేంద్రాలుగా వెన్నెముక వెంబడి శిరస్సులోనికి వ్యాపించియున్న సప్తచక్రాలకు (మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారచక్రములు) పరాశక్తులు ఏడుగురు (సాకిని, కాకిని, లాకిని, రాకిని, డాకిని, హాకిని, యాకిని) ఆధిపత్యం వహించుచున్నారు. 
ఈ సప్తలోకాలంటే ఏమిటో, శక్తిచక్రాలంటే ఏమిటో, సప్తగ్రహాలంటే ఏమిటో, అవి శారీరక ఆరోగ్యానికీ, ఆధ్యాత్మిక పరిణితికీ ఏ విధంగా దోహదపడతాయో తెలుసుకుందాం. 
మన శరీరంలోని సప్తచక్రాలు సప్తలోకములతో ఏయే స్థానాల్లో ఏయే గ్రహాలతో సంధానింపబడిందంటే - 
7. సహస్రారం - సత్యలోకం - ప్రమాతస్థానం - రవి 
6. ఆజ్ఞాచక్ర - తపోలోకం - జీవాత్మస్థానం - చంద్రగ్రహం 
5. విశుద్ధ చక్రం- జనలోకం - ఆకాశభూతస్థానం - కుజగ్రహం 
4. అనాహతం - మహర్లోకం - వాయుభూతస్థానం - బుధగ్రహం 
3. మణిపూరకం - సువర్లోకం - 
జలభూతస్థానం - గురుగ్రహం 
2. స్వాధిష్ఠానం - భువర్లోకం - అగ్నిభూతస్థానం - శుక్రగ్రహం 
1.  మూలాధారం -  భూలోకం - పృథ్వీభూతస్థానం - శని గ్రహం 

విశ్వచైతన్య శక్తి మానవశరీరములోనికి ఏడుచక్రాలు ద్వారా ప్రవహిస్తుంది. ఈ ఏడు దేవతా శక్తుల ఆధీనంలో పనిచేస్తున్నాయి.  ఒక్కో శక్తిచక్రం ఒక్కోతత్త్వంతో సంబంధం కలిగియుంటుంది. ఈ చక్రాలు శారీరక వ్యవస్థలతోనూ, మానసిక స్థితులతోనూ సంబంధం కలిగియుంటాయి. అలానే ప్రతిచక్రానికీ శారీరక మానసిక లేక ఆధ్యాత్మిక విధులు ఉంటాయి.పూర్వజన్మలలోని పాపపుణ్యాలు(ప్రారబ్దాలు) బట్టి ఈ చక్ర, గ్రహ దేవతలు విశ్వచైతన్యశక్తిని ఆయాచక్రాల ద్వారా శరీరంలోనికి సరఫరా చేయడం జరుగుతుంది. పూర్వజన్మలోని పాపపుణ్యాలకు అనుగుణంగా  జరిగే ఈ శక్తి పంపకంలోని హెచ్చుతగ్గులు వ్యక్తీ మనస్సు పైనా, శరీరం పైనా పనిచేస్తూ జీవితగతిని నిర్దేశిస్తుంది. 



మూలాధారచక్రం :-
ఐం హ్రీం శ్రీం సాం హంసః మూలాధిష్టాన దేవతాయై సాకినీసహిత గణనాధ స్వరూపిణ్యైనమః 
మూలాధారంబుడా రూఢ పంచవక్త్రాస్థి సంస్థితా 
అంకుశాది ప్రహరణా వరదాది నిషేనితా 
ముద్గౌదనా సక్త చిత్తా సాకిన్యం బాస్వరూపిణీ 
ఈ కమలం 4 దళాలు కలది. పృధ్వీతత్త్వం కలది. రక్తవర్ణం కలది. అధిష్టానయోగిని దూమవర్ణం కలిగి పంచవక్రాలు త్రినేత్రాలు కలిగి సృణి,కమలం, పుస్తకం, జ్ఞానముద్ర ధరించి, ఆస్థిధాతువునాకు అధిపతియై యున్నది. ముద్గాన్నప్రీతి కలది. వ శ ష  స అను యోగినీ శక్తులచే సేవించబడే ఈమె సాకినీశక్తిగా ఆరాధించబడుచున్నది. నల్లని ఏనుగు ఈమె వాహనం. 

వెన్నెముక చివరిభాగంలో అంటే మలరంద్రానికి సుమారు రెండు అంగుళాల పైభాగాన విలసిల్లే మూలాధారచక్రం మనలో 7,776నాడులతో సంధానింపబడి వుంటుంది. భౌతిక శరీరానికి శక్తికేంద్రం మూలాధారచక్రం. ఇదే మొదటిచక్రం. కుండలినీ శక్తి దాగి వున్నది ఇందులోనే. ఇతర శక్తులన్నింటికి మూలం ఇదే. మూలమైన ఆధారం ఇదే కనుక మూలాదారకేంద్రమన్నారు. మూలాధారచక్రంకు పంచకోశాలలో అన్నమయకోశంతో సంబంధం. శ్వాసకోశవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం 'ముక్కు'. జన్మకూ, పునర్జన్మకు ఇది మూలస్థానం. ఈ మూలాధారంలోని శక్తి రెండు విధములుగా (సృష్టి, ప్రతిసృష్టి) పనిచేస్తుంది. అంటే మనిషి జన్మించేది ఈ శక్తివల్లనే. జన్మరాహిత్యం కలిగేది ఈ శక్తివల్లనే. ఒకటి జన్మతః కలిగే శక్తి. రెండవది యోగంతో ఆర్జించుకున్న శక్తి. ఇది సరిగ్గా పనిచేయకపోతే పునసృష్టి జరగదు. ఈ చక్రప్రేరణ వలెనే ప్రతిజీవి సృష్టికార్యం చేస్తుంది. రెండవశక్తి జన్మరాహిత్యం కలిగించే శక్తి. ఇది బ్రహ్మచర్యం వలన సాధ్యమౌతుంది. బ్రహ్మచర్యం అంటే సంసారజీవితమును త్యజించడం కాదు, సంభోగేచ్ఛను అణుచుకోవడం కాదు. బ్రహ్మత్వసిద్ధికి అవసరమైన శక్తిని ధ్యానయోగం ద్వారా సాధించడం. ఇందుకు నీతి, నియతి, నిగ్రహం పాటించాలి. బ్రహ్మచర్యం గురించి మరింత వివరణకై  ఇక్కడ చూడండి. 

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - 
శారీరకంగా అర్ద్రైటిస్ వెన్నెముకకు సంబంధించిన సమస్యలు, ఎముకల బలహీనత, రక్తంలో మార్పుల వలన జనించే రుగ్మతలు, బోన్ కేన్సర్, లుకేమియా వంటి వ్యాధులు, ఎలర్జీ, రోగనిరోధకశక్తి లోపించడం, గాయాలు సరిగ్గా మానకుండా ఉండడం లాంటి రుగ్మతలకు కారణభూతమౌతుంది.  
ఈ చక్ర మానసిక స్వభావం - 
మూసుకుపోవడం వలన భయం, ఆందోళన, అభద్రతాభావం, ఆక్రమణతత్త్వం, అస్థిరత్వం, ఆత్మహత్య ప్రలోభం, స్వార్ధం. తమోగుణం. ప్రాపంచిక సౌఖ్యాలవైపు మోజు కలిగియుండి పరధ్యానస్థితిలో వుంటుంది. 
తెరుచుకుంటే ధైర్యం, స్థిర సంకల్ఫం, పవిత్రత, నిస్వార్ధం, జీవితం మీద మమకారం, పారమార్ధికజ్ఞానం కల్గుతాయి. 
అలానే ఈ నాడీ కేంద్రం నేను నాది అనే అహంకారానికి వేదిక. 
మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం???
శాస్త్ర ప్రకారం పరిశీలిస్తే - 
ఈ చక్రమునకు సాకిని దేవత. ఈ పరాశక్తి  ఎముకలపుష్టిని అనుగ్రహిస్తుంది. ఈ దేవత 'ముద్గౌదనా సత్తా చిత్తా' అని వర్ణింపబడింది. అనగా ఈ దేవతకు పులగం ఇష్టమని చెప్పుదురు. దీనికర్ధమేమనగా శరీరం నందు ఎముకల పెరుగుదల చక్కగా లేనివారు ఆహారమందు ఈ పులగంను ప్రధానాహారంగా స్వీకరించినచో సర్దుబాటగును. వ్యాదులనుబట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ,  బీజాక్షరం "లం" ధ్యానించువారికి ఈ బాధలు నివారణ కాగలవు. 
శారీరక వ్యాధి కానివ్వండీ, మానసిక వ్యాధి కానివ్వండీ అవన్నీ పుట్టుకొచ్చేవి మన లోపల్నుంచే. మనకు బయటసంఘటనలకంటే మన అపవిత్రత వలెనే దుఃఖం వస్తుంది. మన బాధలన్నింటికీ సృష్టికర్తలం మనమే. బాధలు రెండు రకాలు. ఒకటి సముచితమైనవి. ఇవి ప్రారబ్ధవశాత్తు వచ్చేవి. రెండవది  అసంగతమైనవి. పరిస్థితికి ఎంతమాత్రం పొంతన లేని ఆలోచనలు. ఊహలు ఇవే అసంగతమైన బాధలు.
చాలావరకు మనబాధలకు కారణం - మనలో మనకే తెలియని, తెలుసుకోలేని నెగిటివ్ నెస్. అందుకే మన పూర్వీకులు అంటుంటారు - 'మంచిగా ఆలోచించు, ఆనందంగా వుండు'. 'మన ఆలోచనలే మన జీవితం'. 'శుభాన్ని కోరుకో, సుఖంగా జీవించు'. 'మన ఆలోచనలే మన అనుభవాలు'. 'మతి బట్టే గతి'... అని! అలానే చెడు, కీడుల గురించి మాట్లాడటాన్ని వారెప్పుడూ వారిస్తుంటారు. అలాగే మానవాళి శ్రేయస్సుకై పెద్దలు ఎన్నో సూక్ష్మ సరళ పద్ధతులను బోధించారు. మనిషిని శారీరకంగా, మానసికంగా, సుఖవంతంగా, ప్రశాంతంగా ఉంచడంకోసం ఎన్నో చిట్కాలను ప్రతిపాదించారు. వారు సూచించిన పద్ధతులు ఏమిటంటే - 
మూలాధారచక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
నేలపై కూర్చోవడం, భూమిని తాకడం, చెప్పులు లేకుండా నడవడం, మొక్కలు చెట్లును కౌగిలించుకోవడం, కన్నతల్లితో కలసి వుండడం, ధ్యానం చేయడం.  
మూలాధారచక్రంనకు అధిపతి గ్రహం శనిమహాత్ముడు. ఈ దేవతతో సరైన సంబంధం లేకుంటే బ్రతుకుకు ఆధారమే లేదు. కష్టించి పనిచేసే విధానానికి, శ్రమశక్తికి ప్రతినిధి శని. అలానే ముసలివాళ్ళకు రోగులకు ఆకలిగొన్నవాళ్ళకు ఈయనే ప్రతినిధి. బద్ధకస్తులను ముదుసలివారిపట్ల, రోగులపట్ల, ఆకలిగొన్నవారియందు అలక్షంగా వున్నవారిని తీవ్రంగా దండిస్తాడు. కాబట్టి  కష్టించి పనిచేసే తత్త్వం, సేవాతత్వం అలవర్చుకోవడం వలన శనిమహాత్ముని అనుగ్రహం పొందవచ్చు. ఈ చర్యలతో మూలాధారంను జాగృతి పరచవచ్చు. 
ధ్యానం, సేవ అనేవి రెండు శక్తివంతమైన సాధనములు. ధ్యానం లేని సేవ, సేవ లేని ధ్యానం పూర్ణజ్ఞానసిద్ధిని కల్గించలేవు. సేవ, ధ్యానం రెండు కూడా మనోశుద్ధి ప్రక్రియలు, పాపనాశన సాధనములు. (పాప ప్రక్షాళన సాధనములు) సేవ స్థూలంగా మనస్సుని శుద్ధి చేస్తే, ధ్యానం సూక్ష్మంగా మనస్సును శుద్ధి చేస్తుంది. సేవ చేస్తేగాని ధ్యానం చేసే శక్తి కలగదు, ధ్యానం చేస్తేగాని సేవ పవిత్రంగా జరగదు. చక్కగా ధ్యానం చేస్తే, చేసే సేవ పవిత్రంగా వుంటుంది. చక్కగా సేవ చేస్తే చేసే ధ్యానం నిశ్చలంగా వుంటుంది. ప్రశాంతంగా వుంటుంది. 
సేవ వలన చిత్తశుద్ధి చేకూరుతుంది. అహంకార నిర్మూలన జరుగుతుంది. అహంకారాన్ని జయించటమే ఈ చక్రాన్ని జయించటమౌతుంది. 

తదుపరి చక్రం 'స్వాదిష్టానచక్రం' గురించి తదుపరి టపాలో ... 

24, మార్చి 2015, మంగళవారం

ఒకప్పటి మధురజ్ఞాపకం "శ్రీశైల శిఖరదర్శనం"లో అంతరార్ధం

క్రిందటి టపాకు కొనసాగింపు ... 

అపారమైన భక్తివిశ్వాసాలుంటే తప్పకుండా తరిస్తాం ... అని అంటూ, అందుకు ఉదాహరణగా మాస్టారుగారు  చెప్పిన కధ ఇది -

మహాశివరాత్రి రోజున పార్వతిదేవి పరమశివుణ్ణి ఇట్లడిగెను - సర్వేశ్వరా! 'శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే' అను శాస్త్రవాక్యమొకటి కలదు కదా. శ్రీశైలశిఖరమును దర్శించినవానికి పునర్జన్మ లేదని చెప్పినది నిజమైనచో, ఈ  దినం ఎన్నియో  వేలమంది జనులు శ్రీశైలపర్వతంనకు వచ్చియున్నారు. వీరందరికీ శిఖరదర్శనం అయినది. మరి వీరందరూ ముక్తులయ్యెదరా? అని ప్రశ్నించగా -
సంపూర్ణ విశ్వాసం వుండిన అట్లగును. ఈ విషయమై రేపటిదినం నీకు చూపెదను. నేను మిక్కిలి ముదుసలి బ్రాహ్మణ రూపమును ధరించెదను. నీవు అతి వృద్ధురాలగు బ్రాహ్మణి వేషమును పూనవలసినది. ఈ రాత్రి శిఖరదర్శనం చేసి ఈ జనులు వెళ్ళుచుండెడు దారిలో బురదమయమగు నొక కోనేటిలో నేను పడియుండి ప్రాణం పోయేలాగున నటించెదను. వచ్చిన వారందరినీ పతిభిక్ష పెట్టవలసినది, వేదములు కడవరకు చదివి, వేదార్ధమును చక్కగా నెరిగిన ఈ వృద్ధబ్రాహ్మణుడు నా పతిదేవుడు. ఈయన లోతైన ఈ గుంటలో స్నానార్ధమై వెళ్ళి పడిపోయెను. ఈయనను రక్షించండి అని ప్రార్ధించు. ఎవరైనా నన్ను బయటకు తీయుటకై దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యలారా! ఆయన పాపం నశించినవారు. పాపం గలవారెవరైనా ఆయనను తాకినచో వారపుడే మరణించెదరని చెప్పవలసిందిగా పరమశివుడు తెలిపెను. 
మరునాడు ఉదయం గుంపులు గుంపులుగా వచ్చుచుండు జనసమూహమును జూచి, భవానిదేవి రోదిస్తూ, తన భర్తను రక్షించి, పతిభిక్ష పెట్టమని  వేడుకుంటుండగా, కొందరు ఆ వృద్ధబ్రాహ్మణుని రక్షించుటకై దగ్గరకు వెళ్ళునప్పుడు, ఈయన పాపం నశించిన పుణ్యాత్ముడు, పాపం గలవారు తాకినచో అప్పుడే చనిపోవుదురని చెప్పగా, దగ్గరకు వెళ్ళినవారు మనకి ఎందుకులే అనుకుంటూ, తిరిగి వెనక్కి వెళ్ళిపోయేవారు. ఆ సమయంలో కళావంతులలో చేరిన పరిశుద్ధాత్మరాలగు నొక నారీమణి వృద్ధురాలగు ఆ బ్రాహ్మణస్త్రీతో 'నీవు దుఃఖపడవలదు, నాకు ఈత వచ్చును, నేను మీ పతిని దరిచేర్చేదను' అని చెప్పి రక్షించుటకు వెళ్ళబోవునప్పుడు, ఈ బ్రాహ్మణి పై చెప్పిన మాటలను చెప్పగా, ఛ ఛ, నీకు శాస్త్రవచనాలు యందు విశ్వాసం లేదు, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అను శాస్త్రవాక్యం పట్ల నీకున్న నమ్మకం ఇదేనా? నాకు ఇక పాపమెచట? నేను నిన్నటిరోజున శివరాత్రి ఉపవాసముండి, జాగరం చేసి, శివపూజ చేసి, శ్రీశైల శిఖరదర్శనం చేసి, పాపరహితురాలినై వచ్చుచున్నానని చెప్పి, ఆ గుంటలో దుమికెను. దూకి వృద్ధబ్రాహ్మణుని రక్షించాలని పరమశివుణ్ణి తాకగానే, ఆయన సాక్షాత్తు శంకరరూపమున దర్శనమిచ్చి, ఆ యువతిని విమానం నెక్కించుకొని కైలాసమునకు తీసుకుపోవునట్లు కధ చెప్పిరి. 
ఏమిటీ, కళావంతుల స్త్రీకి అంతటి యోగమా? అని అత్తయ్యగారు ప్రశ్నించగా -
వృత్తిని కాదు చూడవలసినది, ఆమె భక్తిని, శాస్త్రవచనాలు పట్ల అణుమాత్రమైన అపనమ్మకం లేని అపారమైన నమ్మకాన్ని. అందుకే అంటారు, భగవంతుడు విత్తం కాదు చిత్తంను చూస్తాడని. మనిషిని కాదు మనస్సుని గమనించు. బహుశా ఆమె పూర్వజన్మ సుకృతం వలన ఆమెలో అపారమైన భక్తివిశ్వాసములు ఏర్పడ్డాయి. అందుకే ఇంతటి యోగం ప్రాప్తించింది అని మాస్టారుగారు చెప్పగా ... 
బాగుందండీ, మరి ఆన్నిటికీ అంతరార్ధం ఉందంటారే, మరి ఈ శిఖర దర్శనంకు అంతరార్ధం కూడా చెప్పండి అని మరల అత్తయ్యగారు ప్రశ్నించగా -
ఆ... వుంది, ఉందనే పెద్దలు చెప్తుంటారు. శ్రీశైలశిఖరం దర్శన మాత్రంచే జన్మరాహిత్యం కల్గితే ఇన్ని సాధనలు ఎందుకు? వెళ్లి చూసిస్తే సరిపోతుంది కదా, అది కాదు అసలు నిజం. యదార్ధం ఏమిటంటే, శిఖరమంటే గుడిగోపురం కాదు. శిరశ్శిఖర ముచ్యతే అన్న మాటను ప్రామాణికంగా పరిశీలిస్తే, శిరస్సే శిఖరం. ఎవరైతే తన శిరస్సునందు శ్రీశైలున్ని దర్శిస్తారో వారికి పునర్జన్మ వుండదని ఆ వాక్యానికి అర్ధం. ఇది నిజమైన సాధన. ఇది నిజమైన యోగం. మనస్సునూ, మనో ప్రక్రియలను కట్టి వేస్తే యోగసాధన సాధ్యమై పరమేశ్వరుణ్ణి దర్శనమై జన్మరాహిత్యం కల్గుతుంది అని చెప్పారు. చక్కటి విషయాలు తెలిపిన మాస్టారుగారికి నమస్సులు. 




28, ఫిబ్రవరి 2015, శనివారం

ఒకప్పటి మధురజ్ఞాపకం 'త్రివేణీ సంగమం'

గతపోస్ట్ చదివిన శైలజగారు అడిగిన ప్రశ్నతో నా మనసులో మరుగునపడిన విషయం మరుపుకురాకుండా మరల జ్ఞాపకం వచ్చేటట్లు చేసిన తనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ -
కాశీయాత్ర ( ఈ టపా వివరములకై  ఇక్కడ  క్లిక్ చేయండి) గురించి మాస్టారుగారు చెప్పిన మరుసటిదినమే ఈ త్రివేణీసంగమం గురించి కూడా ఆయన వివరించారు. 
మా అత్తయ్యగారు (మాస్టారుగారి భార్య) త్రివేణీ సంగమంలో మూడుసార్లు మునకలేస్తే చాలట కదండీ, ముక్తిపొందడానికి అని మాస్తారుగార్ని అడిగినప్పుడు - 
మూడుసార్లు ఎందుకు ఒక్కసారి మునక వేస్తే చాలు ముక్తి పొందవచ్చు అని నవ్వుతూ ఇలా వివరించారు. 
నాకు గుర్తున్నంతవరకు ఆ పద్యాలు, వివరణ చెప్తాను కానీ, పద్యాలలో ఒకటిరెండు అక్షరదోషాలు, వివరణలో చిరులోపం వుండవచ్చు. మన్నించాలి మరి.

మీనః స్నానపరః ఫణీ పవనభుజ్మే మేష్కోస్తి పర్ణాశనః 
నీరాశీ ఖలు చాతకః ప్రతిదినం శైలే బిలే మూషికః 
భస్మోద్దూళిత విగ్రహస్తు శునకో ధ్యానాధిరూడో బకః 
ఏతేషాం ఫలమస్తి కిం న హి న హి జ్ఞానం పరం కారణమ్ 

గంగాది తీర్దములలో మత్స్యకచ్చపాదులు సదా నివచించుచుండును. నాగసర్పం వాయుభక్షణం గలిగియుండును. మేకలు ఆకులనే తినుచుండును. చాతకపక్షికి జలమే ఆహరం. ఎలుకలు కొండగుహలలో నివచించియుండును. శునకం దిగంబరియై బూడిదలో పడియుండును. కొంగ మౌనంతో ధ్యానాధిష్టానముతో నుండును. వీటియన్నిటికిని ఎలాంటి విశేషఫలమును లేదు. కావున బాహ్యచేష్టలతో భ్రమనొందక పై జెప్పిన వాటియొక్క గుణములతో కూడియుండు అంతరంగనిష్ఠ సంపూర్ణముగా కలిగియున్డవలయును. ఎట్లున్డినను జ్ఞానమొకటి చేతనే జీవుడు తరిస్తాడు. 

మనం ఈ విషయాన్ని సదా గుర్తుపెట్టుకోవాలి. గతంలో చెప్పినట్లుగా పుణ్యక్షేత్ర దర్శనాలతో భక్తి పెరిగి , భగవంతున్ని స్మరిస్తూ చేసే తీర్ధస్నానాలతో పుణ్యం వస్తుంది. కానీ ఆ పుణ్యఫలం ప్రారబ్ధంలోనికి వచ్చిన తర్వత జననమరణాలు తప్పవు. అంతే తప్ప ముక్తి రాదు అని అంటూ ఇంకా ఇలా వివరించారు -

మన దేహంలో మూడు ప్రధాన నాడులున్నాయి. అవి ఇడా పింగళ సుషుమ్నాలు. ఈ మూడింటి సంయోగస్థలం భ్రూమధ్యం. అందుకే ఈ స్థానమును త్రివేణీ సంగమనియు, మేరు స్థానమనియు యోగులు చెప్పుదురు. కాబట్టే భ్రూమధ్యమున మనస్సును స్థిరంగా నిలిపి చేయు ధ్యానం శ్రేష్ఠం. ధ్యానంచే ఈ త్రివేణీ సంగమందు ఒక్క మునకవేసిన చాలును, ముక్తిపొందడానికి. 

ఇడా భాగీరధీగంగా పింగళా యమునానదీ 
తయోర్మధ్య గతా నాడీ సుషుమ్నాఖ్యా సరస్వతీ  
త్రివేణీ సంగమో యాత్ర తీర్ధ రాజ స ఉచ్యతే 
తత్ర స్నానం ప్రకుర్వీత సర్వ పాపై ప్రముచ్యతే 

ఇడానాడే గంగానది. పింగళనాడి యమునానది. ఈ రెండింటి మధ్యలో ఉన్న సుషుమ్నానాడి సరస్వతీనది. ఈ మూడు నాడులు భ్రూమధ్య స్థానంలో ఆజ్ఞాచక్రంలో సంగమిస్తాయి. దీనినే త్రివేణిసంగమం అని అంటారు. దీంట్లో స్నానం చేస్తే జీవుడు అనేక జన్మలలో తాను చేసిన పాపములనుండి, ప్రారబ్ధములనుండి ఒక్కమాటలో చెప్పాలంటే క్రియలనుండి విముక్తి పొంది ముక్తుడౌతాడు. 
బాగుందండీ, మీరు చెప్తున్న దానిబట్టి నాకు అర్ధమౌతుంది .... బాహ్యముగా ఏమైతే ఉన్నాయో, ఏం చేస్తే తరిస్తామో, అవి అన్నీ మనలోనే ఉన్నాయని, మనలోనే చూసుకొంటే తరిస్తామని. కానీ, కోడికూయక ముందే లేస్తాను, గొడ్లచావిడికి వెళ్లి లక్ష్మిని (ఆత్తయ్యగారు ప్రేమగా పెంచుకుంటున్న ఆవుని) పలకరించి, కాస్త పేడను తీసుకొని వాకిట్లో కల్లాపి జల్లి, పొయ్యి అలికి ముగ్గులెట్టి, కసుపు తుడిచి, స్నానపూజాదికాలు పూర్తయ్యాక పొయ్యి రాజేస్తానా ... అప్పుడు అంటించిన పొయ్యి నడినెత్తిన సూర్యుడొచ్చేంతవరకు వెలుగుతునేవుంటుంది. కాసేపైన స్థిమితంగా కూర్చొనే సమయముండదు. మధ్యాన్నం మీరందరి భోజనాలు అయ్యాక, కాస్త తిని, వత్తులు చేసుకుంటునో, పప్పు విసురుకుంటునో, బియ్యం ఏరుకుంటునో, ఈనో పేనో చూసుకుంటునో ...  ఆ సమయంలో కష్టసుఖాలు చెప్పుకోవడానికో, కాలక్షేప కబుర్లు చెప్పుకోవడానికో వచ్చే ఇరుగుపొరుగువారితో మాట్లాడుతూ చిన్న చితక పనులు చక్కబెట్టుకునేసరికి సాయంత్రమైపోతుంది. ఇక మరల మొదలు ఇల్లు ఊడ్చడం, వంటావార్పులు, వడ్డనలు. మీరందరూ పడుకున్న తర్వాతే నా నిద్ర. అంతవరకు పట్టుమని పదినిముషములైన నడుం చేరేయడానికి లేదు. మరి నాలాంటిదానికి కుదురుగా కూర్చోవడం, జపమో తపమో ధ్యానమో ఎలా అవుతుంది చెప్పండి... 
మరి నాలాంటి వారు తరించే మార్గమే లేదా? అని అత్తయ్యగారు అనగా -
ఓహో ... ఎందుకు లేదూ,  నన్ను చక్కగా అర్ధం చేసుకొని నాకు అనుగుణంగా మసులుకుంటున్నావు. అలుపు తెలవనివ్వని చిరునవ్వుతో ఓర్మితో అందరితో ఆత్మీయంగా, అందరికీ ఆసరాగా వుంటున్నావు. నీకు సాధ్యమయ్యేంతలో బీదవార్ని ఆదరిస్తున్నావు. ఓ ఇల్లాలిగా గృహస్థుధర్మమును చక్కగా నిర్వర్తిస్తున్నావు. నీ ఈ ధర్మవర్తనంకు మరింత భక్తివిశ్వాసములు జతైతే ఈ జన్మలోనో, మరుజన్మలోనో తప్పక తరిస్తావు... అని మాస్టారుగారు చెప్తుండగా -
అది కాదండీ, మరి త్రివేణీసంగమంలో మునకలేస్తే ముక్తివస్తుందన్న పెద్దలమాట అసత్యమా అన్న ఆమె ప్రశ్నకు... 
లేదు లేదు, పెద్దలమాటలు, శాస్త్రవచనాలు ఎప్పటికీ అసత్యం కాదు. కాకపోతే వాటి అంతరార్ధమును గ్రహించి పాటించాలి. లేదా వాటిపై అణుమాత్రమైన అనుమానం లేకుండా అపారమైన భక్తివిశ్వాసములుంటే, దానికి పూర్వజన్మసుకృతం తోడైతే తప్పకుండా ఈజన్మలోనే తరిస్తాం. అది ఎలాగంటే ... 
అంటూ ఓ చక్కటి కధను, అంతరార్ధమును వివరించారు. ఆ వివరాలు తదుపరి టపాలో ... 

15, ఫిబ్రవరి 2015, ఆదివారం

ఈ మంత్రమే ఎందుకు మృత్యుంజయ మంత్రమైందీ ???

మహా మృత్యుంజయ మంత్రం:
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం /
 ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ //

అర్ధం :-
అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదను గాక! 

ఉదయం తెలిసినామె మా యింటికి వచ్చారు. మాటల మద్యలో...  ఈ మద్య ఒకరి సూచన ప్రకారం 'మహా మృత్యుంజయ మంత్రం' రోజూ పదకొండుసార్లు చదువుతున్నానండి. కానీ, కొన్ని సందేహాలున్నాయండి. ఎప్పుడో ఒకప్పుడు అందరం మరణించాల్సిందే కదా, మరి ఈ మంత్రమును చదివితే మృత్యువును జయించి ఎల్లకాలం బ్రతికి ఉండలేం కదండీ... మరి అలాంటప్పుడు ఈ మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రమంటారు? అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు? అసలు దోసపండుకు, మృత్యువుకు ఏమిటి సంబంధమో తెలియడం లేదు. అది అడుగుదామనే వచ్చానండీ ... అన్న ఆమెకు, నా అవగాహన మేరకు నేనిచ్చిన బదులిది - 

మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదండీ, పునర్జన్మ లేకపోవడం.అంటే ఇకముందు జననమరణాలు లేకపోవడం. అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం. ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి వుండగానే పొందాల్సిన స్థితి. ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం. అది ఎలాగంటారా? 
ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి. సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది. జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు. అంటే మాయనుండి విడివడతాడు. పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన వున్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను దేహ ప్రారబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై వుంటాడు. (జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే వున్నను, మాయ విడివడడంతో ఇవి ఏవీ అంటక అత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుండే వ్యక్తి) ముక్తస్థితిలో వుంటాడు. ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు. పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కదండీ. 
ఈసరికే మీకు అర్ధమై యుంటుంది, దోసపండుతో ఎందుకు పోల్చారోనన్నది. 
ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. ఆ ఆరాధన  ఎలాగుండాలంటే  - 
జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం. 
మీకు తెలుసు కదా, ఆదిగురువు శివుడు అన్న విషయం.  ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి. అందులో వున్న ఆధ్యాత్మిక రహస్యాలను శోదించండి. శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు -
పంచభూతాత్మకుడు :- శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.  
త్రయంబకుడు :- శివుని మూడుకన్నులు కాలాలను (భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు. 
నామము :- శివనామం లోని మూడుగీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు, మధ్యబిందువును తురీయావస్థలకు చిహ్నం. అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్ధాలు చెప్తుంటారు, ఈ జగత్తంతయూ త్రిగుణాత్మకమని, మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్మూ, అని సూచిస్తుందని అంటుంటారు. అటులనే శివవిష్ణ్యాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా త్రిమూర్త్యాత్మకమని (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) మధ్యబిందువు ద్వారా మువ్వురూ ఒకటేనని తెలుసుకోమన్న సూచనుందని కొందరంటుంటారు. 
విభూతిదారుడు :- సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. అంటే భస్మంగాక తప్పదు. నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం. 
త్రిశూలం :- సత్వ రజో తమోగుణాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, మానసిక  శారీరక, ఆధ్యాత్మికశక్తులకు, ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం.  
నాగాభరణుడు :- సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం. అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు. అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు. 

శివున్ని బోళాశంకరుడు అంటారు. ఎందుకంటే, సులభంగా అనుగ్రహిస్తాడు. ఈ అనుగ్రహం కూడా రెండు విధాలు. సంసారబద్ధుడై భోగాలను ఆశిస్తూ ఆరాదించినవారికి వాటిని అనుగ్రహిస్తాడు. జననమరణ చక్రభ్రమణంలో పడిపోకుండా సంసారంనుండి విముక్తిని కోరేవారికి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రాసాదిస్తాడు. పై మంత్రమును మామూలుగా చదివితే అకాలమృత్యువునుండి  ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. అలా కాకుండా పారమార్ధిక సాధనగా గ్రహించి ఆరాదిస్తే ముక్తస్థితి లభిస్తుంది. అందుకే శివున్ని లయకారుడు అంటారు. లయకారుడు అంటే లీనం చేసుకోవడం లేదా తనలో కలుపుకోవడం. 
  
 శివుణ్ణి ఆరాధించడమంటే శివుని పటంను అలకరించి కాసేపు పూజించడం కాదు. శివుని దివ్యరూపం వ్యక్తపరుస్తున్న ఈ ఆధ్యాత్మిక అంతరార్ధములను అవగాహన చేసుకొని ఆరాధించాలి. ఆ ఆరాధనా కూడా ఏ రీతిలో వుండాలో శివరూమే తెలుపుతుంది. సాధారణంగా శివుడు ధ్యానంలో ఆసీనుడైనట్లు దర్శనమిస్తుంటాడు. ఆ రూపం ద్వారా నిరంతరం బాహ్యప్రపంచమును కాంచే కనులను గట్టిగా కాకుండా అంటి అంటనట్లు మూసి వుంచి, దృష్టిని భ్రూమధ్యాన లగ్నం చేసి అంతర్ముఖులై సత్యంను దర్శించమన్న సూచనను గ్రహించి సాధన చేసినట్లయితే జీవుడు శివుడవుతాడు.  
తన రూపం ద్వారా జ్ఞానబోధ చేస్తున్న శివమంత్రం ఎందుకు మృత్యుంజయ మంత్రమైందో ఇప్పుడు మీకు అర్ధమై వుంటుంది. 
మనం తరుచుగా వింటుంటాం, మనసెరిగి నడుచుకో, చిత్రాన్ని కాదు చిత్తాన్ని చూడు, శోధించి సాదించు అన్న మాటలను. 
ఇలాంటి అంతరార్ధములను తెలుసుకుంటున్నప్పుడు అర్ధమౌతుంటుంది - పెద్దలు పలికే పలుకుల్లో పరమార్ధం. 

విన్నపం :- ఆమె ప్రశ్నలకు నేను విన్న, చదివిన వాటివలన నా అవగాహన మేరకు నాకు అన్పించినది ఇలా చెప్పాను. ఈ టపా చదివినవారు ఇందులో ఏమైనా సవరణలు గానీ, ఇంకా ఏమైనా సూచనలు గాని ఉంటే తెలపగలరని ఆశిస్తున్నాను. 


16, డిసెంబర్ 2014, మంగళవారం

శివయ్యకు చలా?????

నిన్న ప్రక్కింటావిడ, వాళ్ళ అమ్మాయి హారిక మా ఇంటికి వచ్చారు. ఈరోజు హారిక పుట్టినరోజండి, అందుకే తెల్లవారుఝామునే శివాలయంకు వెళ్లి అభిషేకం చేశామండి ... అని చెప్తూ, తెల్లవారక ముందే లేచి, చన్నీళ్ళు స్నానం స్వాములు ఎలా చేస్తారో గానీ, ట్యాంక్ లో నీళ్ళతో స్నానం చేసేసరికి వణికిపోయానండి చలితో, అని ఆవిడ చెప్తుండగా ... హారిక నవ్వుతూ, మరి నీళ్ళను , ఫ్రిడ్జ్ లో పాలును శివలింగం మీద పోస్తున్నప్పుడు శివునికి చలెయ్యదా ఏమిటీ? అని ఆ అమ్మాయి అంటే, శివయ్యకు చలా????? అని నేను అనుకుంటుండగా చాలా సంవత్సారాల క్రితం ఓ మాసపత్రికలో చదివిన ఓ భక్తుని చమత్కారపు భావన గుర్తుకొచ్చింది.
ఆ భక్తుని చమత్కార భావన ఇదే -
ఇదెక్కడి విపరీతమయ్యా స్వామీ! నెత్తిమీద చల్లని చంద్రుణ్ణి పెట్టుకున్నావ్. అక్కడితో ఆగావా? అంతకన్నా చల్లనైన గంగమ్మను నెత్తికెక్కించుకున్నావు. ఆపైన తాకితే జివ్వుమనిపించే చల్లని పాముల్ని నగల్లా అలకరించుకున్నావు. అవన్నీ చాలవన్నట్లు మంచుకొండ కూతుర్ని ప్రక్కన కూర్చోబెట్టుకున్నావు. నీ చోద్యపు చిన్నెలకు అంతెక్కడ? గజగజలాడించే కార్తిక మార్గశిరమాసాలలో బ్రహ్మీ ముహూర్తము నుంచే ధారపాత్ర కింద తిష్టవేస్తావు. అభిషేకం పేరుతో ఎప్పుడూ నీళ్ళక్రింద నానుతుంటావు. నీ భక్తులూ నీకు తగినవారే, ఈ శీతలోపచారాలకు తోడు నీ ఒళ్ళంతా చల్లని విభూది చందనాలను పూస్తూ ఉంటారు. అయినా నీకు చలెయ్యదా మహానుభావా? అని ఓ భక్తకవి శివున్ని ప్రశ్నించాడు. అంతలోనే ఆయనకే సమాధానం తట్టి, 'నా అమాయకత్వంకానీ, నీకు చలేమిటయ్యా? తాపత్రయాలతో సలసల కాగిపోతున్న నా హృదయంలోనే కదా నీవున్నావు' అన్నాడట. 

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

గృహస్థులకు బ్రహ్మచర్యమా ???

గత టపాను చదివిన శైలజగారు, గృహస్థులకు బ్రహ్మచర్యం వర్తించదేమో, గృహస్థులకు బ్రహ్మచర్యం ఎలా సాధ్యమౌతుందని ప్రశ్నించారు. 
ఆ ప్రశ్నకై నేను విని, చదివి తెలుసుకున్నంతలో ఈ చిరు వివరణ - 

ముందుగా బ్రహ్మచర్యం అంటే ఏమిటో తెలుసుకుందాం -

బ్రహ్మభావే మనశ్చారో బ్రహ్మచర్యం పరం తధా 
బ్రహ్మ భావనమందు మనస్సును సర్వదా చరింప జేయుటయే బ్రహ్మచర్యం. 

బ్రహ్మణీ చరతీతి బ్రహ్మచారీ, తస్యభావః బ్రహ్మచర్యం
పరబ్రహ్మయందు చరించువాడు బ్రహ్మచారి, వానిభావం బ్రహ్మచర్యం. 

ఇక సామాన్యముగా ఆలోచిస్తే -

మైధునస్యాప్రవృత్తిర్హి మనోవాక్కాయకర్మణా /
బ్రహ్మచర్యమితిప్రోక్తం యతీనాం బ్రహ్మచారిణామ్ //
మనోవాక్కాయకర్మలచే స్త్రీ సంబంధ విషయములనుండి నివృత్తి యేది కలదో అదే బ్రహ్మచర్యం. ఇది యతులకును బ్రహ్మచారులకును వర్తిస్తుంది. 

అయితే -

మానవునికి త్రివిధ దేహములు (స్థూల సూక్ష్మ కారణ) యున్నట్లే బ్రహ్మచర్యం కూడా మూడు విధములై యున్నది. 

తద్భేదం త్రివిధం వక్ద్యే స్థూలం సూక్ష్మం చ కారణమ్ /
వ్యాయామః ప్రధమః ప్రోక్తః మనోనైర్మల్యకం తధా //
ఆత్మశుద్ధిన్త్రుతీయా చ మోక్షస్సిద్ధ్యతి తే నఘ /
త్రివిధం బ్రహ్మచర్యం చ సాధనీయం సదా జనై: //

బ్రహ్మచర్యం కూడా స్థూలం, సూక్ష్మం కారణం అని మూడు విధములై ఉంది. స్థూలబ్రహ్మచర్యమును వ్యాయామముద్వారా, సూక్ష్మబ్రహ్మచర్యమును మనోనిర్మలత ద్వారా, కారణబ్రహ్మచర్యమును ఆత్మశుద్ధి ద్వారా పరిశుద్ధత గాంచును. 

పైన చెప్పిన వ్యాయామ, మనోనిర్మలత, ఆత్మశుద్ధులు ఎలా కల్గుతాయంటే -

యోగాసనం చ వ్యాయామే ప్రాణాయామశ్చ మానసే /
పరమాత్మ స్వరూపస్య విదుర్జ్జ్ఞానం తృతీయకే //

వ్యాయామ బ్రహ్మచర్యంలో యోగాసానాదులున్ను, మానస బ్రహ్మచర్యంలో ప్రాణాయామాదులున్ను, ఆత్మశుద్ధి బ్రహ్మచర్యంలో పరమాత్మ స్వరూపజ్ఞానమును కల్గుతాయి. 

మరల ఈ బ్రహ్మచర్యమును మూడువిధములుగా పేర్కొంటారు. అదేమిటంటే -

1. మానసికం :-  మనస్సున ఎలాంటి విషయ సంకల్పములు లేకుండుట. 
2. వాచికం :- వాక్కుతోను విషయాభిలాష ప్రయుక్తాలాపములు లేకుండుట. 
3. కాయికం :- క్రియారూపేణా శరీరముతో సంబంధం లేకుండుట. 

అటులనే ఈ బ్రహ్మచర్యమును మరో మూడువిధములుగా శాస్త్రము చెప్పుచున్నది. అవి ఏమిటంటే - 

1. నైష్టికము :- 
                    జన్మించిన మొదలుగు మరణపర్యంతం ఎలాంటి విషయ దోషములు లేకుండా ఆచరింపబడు బ్రహ్మచర్యం. ఇందులకు దృష్టాంతం - శుకమహర్షి, సనకాదులు, ఆంజనేయుడు, గార్గి మరియు సులభాయోగినులు భీష్ముడు, మొదలగువారు. కలియుగమున రమణమహర్షి, అరవిందులవారు తదితరులు. 
2. గార్హస్థ్యం :- 
                   ఋతుకాలమునందు మాత్రమే విషయములయందు ప్రవర్తించి ధర్మబద్ధుడై అనుష్టించు బ్రహ్మచర్యం. ఇందులకు దృష్టాంతం - జనకుడు, చూడాలా, శిఖిధ్వజ, మదాలస మొదలగువారు. 
3. వైదురము :- 
                      భార్యవియోగము లేక భర్తవియోగం కల్గిగాని, లేక భార్యాభర్తలకు ఆత్మశుద్ధి గలిగి విషయములలో విరక్తి కలిగి బ్రహ్మచర్యము ఆచరించురో అది విధురబ్రహ్మచర్యం. ఇందులకు దృష్టాంతం - యాజ్ఞవల్క్య మైత్రేయీ, విశ్వామిత్రుడు మొదలగువారు. కలియుగమున గురునానక్, శ్రీకృష్ణచైతన్యాదులు కలరు. 

అసలు బ్రహ్మచర్యమునకు ఆహరమునకు సంబంధం ఏమిటంటే -

ఆహరస్సత్త్వజనకం కరుణా భక్తివర్ధినీ /
బ్రహ్మభావనయా స్వస్మిన్ స్వయం బ్రహ్మాత్మనిశ్చయః //

సత్త్వగుణాభివర్ధకమగు సాత్త్వికాహారం సేవించుటయు బ్రహ్మచర్యమే యగును. భక్తిని వృద్ధి చేయు కరుణయు బ్రహ్మచర్యమే. స్వాత్మయందు బ్రహ్మభావనయు బ్రహ్మచర్యమే. 

మరి గృహస్థుల విషయంలో ఈ బ్రహ్మచర్యమును పరిశీలిస్తే - 

ఏ విధమైన వ్రతములు గాని, యజ్ఞాదిక్రియలుగాని, మండలం రోజుల పూజాదీక్షలుగాని చేసినప్పుడు బ్రహ్మచర్యం గృహస్థులు పాటించడం ఓ నియమంగా పెట్టుకుంటారు. 
కానీ, గృహస్థు బ్రహ్మచర్యమంటే - 

కాయేన మనసా వాచా నారీణాం పరివర్జనమ్ /
ఋతౌ భార్యాం వినా స్వస్య బ్రహ్మచర్యం తదుచ్యతే //
మనోవాక్కాయ కర్మాదులచే పరస్త్రీలతో సంసర్గం లేకుండుట, ఋతుకాలంలో మాత్రమే స్వపత్నితో జేరుటను గృహస్థ బ్రహ్మచర్యమనబడును. అటులనే మనోవాక్కాయ కర్మాదులచే పరపురుషచింతన లేనిదై, ఋతుకాలమందు మాత్రమే సంతానాభిలాషగలదై పతితో చేరు స్త్రీయు బ్రహ్మచారిణియే యగును.  

ఋతుకాలాభిగామీ యః స్వదారనిరతశ్చయః /
స సదా బ్రహ్మచారీ హి విజ్జ్ఞెయస్స గృహశ్రమీ //
ఋతుకాలమందు మాత్రం స్వభార్యయందు చేరు గృహస్థుడు ఎల్లప్పుడును బ్రహ్మచారియే అగును. అలాంటి నారీమణియు బ్రహ్మచారిణియే యగును.  

ఇక శాస్త్రము తెలుపుతున్న ఋతుకాల వివరణ -

ఋతుస్స్వాభావికః స్త్రీణాం రాత్రయః షోడశస్మృతాః /
చతుర్భిరితరైస్సార్ధమహోభిస్సద్విగర్హితై: //
స్త్రీలకు స్వాభావికముగా పదునారు దినముల వరకు ఋతుకాలము. అందు మొదటి నాలుగు దినములు వర్జనీయములు. 

తాసామాద్యాశ్చతస్రస్తు నిందితైకాదశీచ యా /
త్రయోదశీ చ శేషాస్తు ప్రశస్తా దశ రాత్రయః //
ఈ ఋతుకాలదినములలో మొదటి నాలుగు దినములను, పదకొండవ, పదమూడవ రాత్రియు నిందితములు. మిగిలిన పదిరాత్రులు ప్రశస్తములు. 

నింద్యాస్వష్టాసు చాన్యాసు స్త్రీయో రాత్రిషు వర్జయన్ /
బ్రహ్మచార్యేవ భవతి యత్ర తత్రాశ్రమే పసన్ //
పైన చెప్పిన నిషిద్ధములైన మొదటి నాలుగు దినములను, పదకొండవ, పదమూడవ దినములను, అమావాస్య పున్నమ వ్రత దినములను వదిలిపెట్టి తక్కిన రాత్రుల పత్నితో కూడినవాడు గృహస్థాశ్రమము నందున్నను బ్రహ్మచారియే యగును. అలాంటి స్త్రీయును బ్రహ్మచారిణియే యగును.  

బ్రహ్మచర్యం అవలంబించడం వలన ప్రయోజనమేమిటంటే - 

ఆయుస్తేజో బలం వీర్యం ప్రజ్ఞా శ్రీశ్చ మహద్యశః /
పుణ్యం చ మత్ప్రియత్వం చ లభ్యతే బ్రహ్మచర్యయా //
బ్రహ్మచర్యముచే పూర్ణాయువు, తేజస్సు, దేహేన్ద్రియములకు బలం, ఓజస్సు, ప్రజ్ఞా, జ్ఞానసంపద, యశస్సు, పుణ్యం, భగవత్ప్రీతియు కలుగును. 

శాన్తిం కాన్తిం స్మృతిం జ్ఞానమారోగ్యం చాపి సన్తతిమ్ /
య ఇచ్ఛతి మహద్ధర్మం బ్రహ్మచర్యం చరేదిహ //
ఈ జగత్తున శాంతి, కాంతి, స్మృతి, జ్ఞానం, ఉత్తమ సంతానం కోరువారెల్లరు సర్వోత్కృష్ట ధర్మమైన బ్రహ్మచర్యవ్రతమును తప్పక పాటించవలెను.


8, సెప్టెంబర్ 2014, సోమవారం

శుద్ధ ఆహారం (ద్వితీయ భాగం)





ఆహారశుద్ధి గురించి, వాని నియమములు గురించి, అలానే మాంసాహారం హింసాపూర్వక ఆహారమయినచో, శాకాహారంలో కూడా జీవముంటుంది కదా, మరి అది ఎందుకు హింసాపూర్వక ఆహరం కాదు? అలానే సాత్త్విక ఆహారం భుజించిన వారంతా ఎందుకు ధ్యానులు, జ్ఞానులు కాలేదని శైలజగారు గతంలో నేను పోస్ట్ చేసిన "శుద్ధ ఆహరం"  చదివి తన సందేహాలను అడిగారు. 


నాకు తెలిసినంతవరకు ఆ సందేహాలకు వివరణ ఇక్కడ ఇస్తున్నాను. 

అన్నదోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్ /
కలుషీకృతచిత్తానాం ధర్మస్సమ్యజ్న భాసతే //
ఆహారదోషంచే సర్వదా చిత్తమునకు కల్మషం కలుగును. కల్మషచిత్తం కలవారికి ధర్మరహస్యమైన జ్ఞానం ప్రకాశింపదు. 

అందుకే ఆధ్యాత్మిక సాధకులకు ఆహరశుద్ధి, ఆహారనియమములు తప్పనిసరి. 

మాంసాహారమునకు శాకాహరమునకు గల భేదం -

శాకాదులయందు జీవశక్తి యున్నప్పటికీ అవి జడములు. వాటికి ఇంద్రియములు లేవు. ఇంద్రియములు లేకపోవడం వలన వాటికి సుఖదుఃఖములు కలుగుటకు అవకాశం లేదు. 
జంతువులు మనుష్యులవలె స్త్రీపురుష సంయోగంచే నుత్పత్తి యగును గాని, సస్యముల వలె నుద్భిజ్జములు కావు. సస్యవర్గములు భూమి, నీరు మొదలగువాటి సహాయముతో పాటు, ఎక్కువగా సూర్యశక్తిని గ్రహించి, సూర్యశక్తిచే వృద్ధి అగుచున్నందున సూర్యుని యందున్న శక్తి సస్యాదులయందధికముగా యున్న కారణంచే వాటిని భుజించువారికి శుద్ధత్త్వం కలుగును. సత్త్వగుణం అలవడును. సూర్యుడు తమస్సును నాశము జేయునట్లు, శాకాహారంచే తమోగుణం నాశన మగును. 

ఆహార శుద్ధౌ సత్త్వశుద్ధి: సత్త్వశుద్ధౌ ధ్రువా స్మృతి: /
స్మృతిలాభే సర్వగ్రంధీనాం విప్రమోక్షః //
సాత్త్వికమైన శుద్ధాహారంచే మనఃశుద్ధియు, మనఃశుద్ధిచే దృఢమైన ప్రజ్ఞయు గల్గును. దృఢప్రజ్ఞచే సర్వగ్రంధులు నిశ్శేషముగా నాశంపొందును. 

ద్యానమూ, జ్ఞానమూ ఎప్పుడు అలవడతాయంటే - 

మానవునికి స్థూల, సూక్ష్మ, కారణలనెడి దేహములు కలవు. శుద్ధమైన సాత్త్వికాహారముచే స్థూలదేహము ఇంద్రియములు మాత్రమే శుద్ధములగును. సూక్ష్మ దేహానికి ఈ ఆహారం కొంతమాత్రమే సహాయపడును. కరుణ, శాంతం, సత్యం, అధ్యయనం, ప్రేమ, దైవభావం, సమత్వం, ఏకాత్మభావనం, దేవోపాసన  బ్రహ్మచర్యం గురు, దేవ, పూజయుక్తమైన సాత్త్వికాహారం ప్రాణాయామాది యోగములచే స్థూలదేహ శుద్ధి గలుగును. అటుపై కారణదేహశుద్ధతకు పై రెండు శుద్ధతవలన జ్ఞానం అలవడి పవిత్రమగును.  

సాత్త్వికాహారులందరూ ఎందుకు జ్ఞానులు కాలేకపోతున్నారంటే - 

ఆహరశుద్ధి అంటే తీసుకున్న ఆహరం సాత్త్వికముగా ఉంటే చాలదు. ఆ ఆహారం వచ్చిన మార్గము కూడా సత్యముగా ఉండవలయును. సత్యముగా సంపాదించిన ఆహారమును యుక్తముగా, నియమముగా దైవారాధన చేసి భుజించవలెను. 
శ్రీశంకరభగవత్పాదుల వారు చెప్పినట్లు -
జిహ్వతో భుజించెడు ఆహారమే ఆహరం కాదు. కర్ణ, త్వక్, చక్షు, ఘ్రాణముల ద్వారా స్వీకరించేది కూడా ఆహారమే అవుతుంది.
ఇక ఆహారశుద్ధి యొక్కటే చాలదు, ఆత్మశుద్ధియు కలిగి యుండవలయును. అలానే ఆత్మశుద్ధి గలిగిన చాలదు, ఆహారశుద్ధియు కలిగి యుండవలయును. పైన చెప్పినట్లు స్థూల సూక్ష్మ దేహాలలో శుద్ధతా లోపము వలననే కొందరికి శుద్దాహారము కలిగియుండినను ఆత్మజ్ఞానం కలుగకపోవుటకును, అలానే ఆత్మ శుద్ధమైనది జ్ఞానమైనదని విచారణచేత తెలుసుకొనినను ఆత్మజ్ఞానం అనుభవమునకు రాకపోవుటకున్ను కారణమని గ్రహించాలి. కావుననే "శుద్ధిద్వయం మహత్కార్యం దేవానామపి దుర్లభం" అని శాస్త్రం వక్కాణిస్తుంది. 
 
ఈ సూక్ష్మ కారణ దేహములను శుద్ధపరుచుట తెలియకపోవుటచేతనే స్థూలమైన సాత్త్వికాహారమును భుజించువారందరిలో ధ్యానం, జ్ఞానం అలవడడం లేదు. 

ఇక గృహస్థులు ఎంత హింసారహితముగా ఉందామనుకున్నను అనివార్యమైన ఐదు విధములైన హింసలు వచ్చుచుండును. 

అవి - 

పంచసూనా గృహస్థస్య చుల్లీ పేషణ్యుపస్కరః /
కండనీ చోదకుంభశ్చ బధ్యతే యాస్తు వాహయన్ //

1. చుల్లీ :- కట్టెలు మొదలగువాని వలన వండునప్పుడు కట్టెలలో గల చెదలు మొదలగు క్రిములు నాశం. 
2. పేషణి :- విసరుచున్నప్పుడును, నూరుచున్నప్పుడును కలిగెడు ప్రాణహింస. 
3. ఉపస్కరః :- ఇతర గృహకృత్యములు చేయునప్పుడు కలిగెడు ప్రాణహింస. (బూజులు దులుపుట, తుడుచుట, చిమ్ముట, అలుకుట మొదలగు గృహ శుభ్రత పనులు, అలానే సస్యములలో నాగలితో దున్నుతున్నప్పుడు, పారతో చెక్కుతున్నప్పుడు కొన్ని క్రిములకు కలుగు ప్రాణహింస)
4. కండనీ :- ధాన్యాదులు దంచుతున్నప్పుడు కలుగు హింస. 
5. ఉదకుంభః :- నీరు మరిగించినప్పుడు కలుగు ప్రాణహింస. 

అందుకే ప్రతిదినం పంచయజ్ఞపరాయణులై యుండవలయునని మనుస్మృతి చెప్తుంది. 
పైన తెలిపినవి లేకపోతే మానవునికి మనుగడ కష్టం కాబట్టి,  ఇటువంటి అనివార్యమైన హింసల నివృత్తి కొరకు పంచయజ్ఞములు విధింపబడినవి. 

అవి - 

అధ్యాపనం బ్రహ్మయజ్ఞః పితృయజ్ఞస్తు తర్పణమ్ /
హోమో దైవో బలిర్భౌతో నృయజ్ఞో తిధిపూజనమ్ // 

1. బ్రహ్మయజ్ఞము :- వేదోపనిషద్భగవద్గీత పారాయణము లేదా ప్రణవాది మంత్రజప భగవత్కీర్తన పూజాదులలో ఏదో ఒకటి ఆచరిస్తూ భోజనం చేయడం. 
2. పితృయజ్ఞము :- తర్పణాదులచే పితరులను తృప్తి పరచుట. 
3. దైవయజ్ఞము :- అగ్ని యందు వ్రేల్చుహోమము (వైశ్వదేవము). 
4. భూతయజ్ఞము :- కుక్క, పిల్లి, కాకి మొదలగు చిరుప్రాణులకు ఆహారమిడుట. 
5. మనుష్యయజ్ఞము :- అతిధిసత్కారం (బ్రహ్మచారులకు, సన్యాసులకు, సాధువులకు, తీర్ధయాత్రికులకు పూజ్యభావంతో భోజనం పెట్టుట, రోగులు, అంగహీనులు, నిస్సహాయులకు కరుణతో అన్నదానం చేయుట. 

ఆహార నియమములు -

హితం మితం సదాశ్నీయాద్యత్సుఖే నైవ జీర్యతే /
దాతు: ప్రకుప్యతే యేవ తదన్నం వర్జయేద్యతి: /
ఎల్లప్పుడూ ఆహరం మితంగాను, శుద్ధమైనదిగాను, ప్రీతికరమైనదిగాను ఉండవలెను. సుఖముగాను త్వరితముగాను జీర్ణమగునట్టి ఆహారమునే భుజించవలయును. ధాతుప్రకోపం కల్గించునట్టి అన్నమును భుజించరాదు. 

అన్నమని చెప్పుటచే బియ్యపు అన్నము అని అనుకోకూడదు. 'అద భక్షణే' అన్న దాతువునుండి అన్న శబ్ధమేర్పడినది. కనుక భక్షించున దంతయు అన్నమనియే భావించవలెను. 

ద్వౌ భాగౌ పూరయేదన్నైస్తోయేనైకం ప్రపూరయేత్ /
మారుతస్య ప్రచారార్ధం చతుర్ధమవశేషయేత్ //
సాధకులు అందరూ ఉదరమును సగభాగము అన్నము చేతను, పాతికభాగము జలము చేతను నింపి, మిగిలిన పాతిక భాగము గాలి సంచారార్ధముగా నుంచువారు బ్రహ్మనిష్ఠ యందు సర్వదా యుండగలరు. వీరికి వ్యాధులు రావు. 

సాయం ప్రాతర్మనుష్యాణామశనం దేవనిర్మితమ్ / 
నాన్తరం భోజనం దృష్టముపవాసీ తధా భవేత్ //
మనుష్యులకు దైవనిర్మితమగు భోజనము - ఉదయము, సాయంకాలము రెండుసార్లు మాత్రమే యేర్పడినది. అనగా మధ్యాహ్నం లోపల ఒకసారియు, సాయంకాలమున ఒక పర్యాయము మాత్రమె యుండవలయును. అట్టివారికి ఎలాంటి వ్యాదియు ఉండదు. ఈ రెండువేళల తప్ప ఇతర సమయములలో నేమియూ భుజింపనివారు ఉపవాసఫలమును పొందుదురు. 

మోక్షధర్మేషు నియతో లఘ్వాహారో జితేన్ద్రియః /
ప్రాప్నోతి బ్రాహ్మణః స్థానం తత్పరం ప్రకృతేర్ధ్రువమ్ //
మోక్షమార్గమందు ప్రవర్తించువారు నియమశీలులై, యుక్తాహారులై జితేన్ద్రియులై యుండినచో ప్రకృతికి పరమై, శాశ్వతమై యుండు పరబ్రహ్మస్థానమును పొందుదురు. 

ఆహారశుద్ధౌ చిత్తస్య విశుద్ధిర్భవతి స్వతః /
చిత్తశుద్ధౌ క్రమాత్ జ్ఞానం త్రుట్యన్తి గ్రంధయస్పుటమ్ //