http://www.sodhini.com

7, ఏప్రిల్ 2016, గురువారం

ఉగాది పండుగ - పరమార్ధం



భారతీయ సంస్కృతికి దర్పణం పండుగలు. భారతీయ జీవనగమనం నుండి ఈ పండుగలు విడదీయలేనివి. ఆరోగ్యవంతమైన ఆచారాలతో, ఆధ్యాత్మిక సందేశాలతో, ఓ చక్కటి ఉన్నత జీవనశైలిని అలవడేలా చేస్తాయి మన ఈ పండుగలు.  
మానవాళికి ప్రాపంచిక విజ్ఞానాన్ని, పారమార్ధిక జ్ఞానాన్ని అందించి, శారీరక మానసిక శక్తులను యినుమడింపజేస్తూ, మనలో చైతన్యంను సంఘటితం చేసి, విశ్వశాంతి కోసం, మానవజన్మ సార్ధకత కోసం, ఇహ పర శ్రేయస్సుల కోసం, ఎన్నెన్నో అత్యంత ఉన్నత ఆచారముల పేరిట ఆచరణకు శ్రీకారం చుట్టేవే మన పండుగలు.
ఈ పండుగలు ఆహ్లాదభరితంగా వుంటూ, 
ఇటు ... యాంత్రిక ప్రాపంచిక జీవనం నుండి సేద తీర్చే విధంగా, శారీరకంగా ఆరోగ్యంను ప్రసాదించే ఆచారాలతో...  
అదే సమయంలో అటు ... అంతర్గత జీవితసత్యాలను ప్రబోధిస్తూ, ఆధ్యాత్మిక తత్త్వాన్ని తెలుపుతూ, మనస్సును పారమార్ధికం వైపు మళ్లిస్తాయి. ముఖ్యంగా ఈ పండుగలన్నీ మానవజన్మ పరమార్ధాన్ని చాటిచెప్పేవే.

యుగస్య ఆది: ఉగాది అని శాస్త్రం తెలుపుతుంది. యుగం ఆరంభమైన మొదటిరోజు యుగాది లేదా ఉగాది. 
చిత్త చిత్ర అనే పేర్లు కలిగిన నక్షత్రమున పూర్ణిమ వచ్చే మాసం చైత్రమాసం. 
చైత్రశుద్ధ పాడ్యమినాడే బ్రహ్మ సృష్టిని ఆరంభించడంచే ఆ రోజునే ఉగాదిగా పెద్దలు పేర్కొన్నారు.
ఉగాది వసంత ఋతువులో వస్తుంది. వసంతాగమనం శుభకరమైన నూతన ఆశయాలకు, సంకల్పాలకు స్పూర్తిదాయకంగా చెప్తారు.
'వసంతి సుఖం యధా తధా అస్మిన్నితి'... వసంతంలో ప్రజలు సుఖంగా వుంటారని భావం.
కోయిలలు కుహు కుహురావాలతో, అత్యంత రమణీయ శోభాయమానమైన ప్రకృతితో రంజింపజేసే కాలమిది. ఈ వసంతంలో ప్రకృతి నూతనత్వాన్ని సంతరించుకుంటూ పచ్చదనంతో చిగురిస్తూ, ఆహ్లాదభరితంగా శోభాయమానంగా వుంటుంది.
అదేరీతిలో అంతరంగికంగా మన మానసిక జగత్తును పారమార్ధిక జ్ఞానంతో చిగురింపజేస్తే ... మన జీవనం ఆనందమయంగా, ఆధ్యాత్మికభరితముగా ఇహ పర తృప్తినిస్తుంది. 
ప్రకృతిలో భాగమైన మానవుడు నిర్మలమైన అంతఃకరణంతో, మానవత్వంతో కూడి వున్నప్పుడే నిజమైన మనిషి అవుతాడనే శుభాసందేశాన్ని తెలుపుతుంది ఉగాది.
నిశితంగా పరిశీలిస్తే ... పండుగ దినాల్లో పాటించాల్సిన నియమధర్మాలు, ఆచార వ్యవహారాల్లో ప్రాపంచిక పారమార్ధిక ప్రగతే వుంటుంది.


ఈ ఉగాదినాడు ఆచరించవలసిన ముఖ్య విధులు... 

అభ్యంగే నూత్న వ స్త్రే పంచాంగ శ్రవణే ద్విజాత్ / షడృచే నింబపుష్పేచ యుగాదౌ నివసామ్యహమ్ //

అభ్యంగనం :-
పర్వదినాల్లో మహాలక్ష్మి నూనెలోనూ, గంగాదేవి జలములోను ఉంటారని ప్రతీతి. సూర్యోదయంనకు ముందే అభ్యంగస్నానం చేయాలి.
శారీరక ఆరోగ్యం దృష్ట్యా తైలాభ్యంగనం. 
నువ్వులనూనె మర్దనం ఉష్ణాన్ని వెలికితీసి, వాతాన్నీ, చర్మదోషాల్ని హరిస్తుంది. దేహపుష్టినిస్తుంది, దేహంపై వున్న సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. అలానే ఈరోజున మఱ్ఱి, మామిడి, నేరేడు, మేడి, జువ్వి ఆకుల్ని నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళతో తలస్నానం చేయడం వలన దేహవర్చస్సుతో పాటు కళ్ళకు మంచిదని ఆయుర్వేద శాస్త్రం తెలుపుతుంది. 
అలానే,  మానసిక ఆరోగ్యం దృష్ట్యా హృదయాభ్యంగనం చేస్తే -
తైలమర్దనం ద్వారా శరీర జడత్వమును తొలగించుకున్నట్లే ...
 ప్రేమ, దయ, కరుణ శాంతి, సహనం క్షమత్వం, అవగాహన, విశ్వాసం పరోపకారం.....ఇత్యాది సద్గుణంలతో అభ్యంగనం... మానసిక వర్చస్సుని పెంచడమే కాకుండా యిది పారమార్ధిక ప్రగతికి సోపానమని ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలుపుతున్నాయి. 

నూతన వస్త్రధారణ :-
పాతదుస్తులనువిడిచి నూతనవస్త్రధారణచేయడం శుభప్రదం. ఈ ప్రక్రియ ఉత్సాహాన్ని, సంతోషాన్నిస్తుంది. 
పాత దుస్తులను విడిచిపెట్టినట్లు ... చెడును అహాన్ని వర్జించి సద్భావన ధారణ చేయడం మానవజన్మకు సార్ధకతను చేకూర్చుతుంది. 

'సంకల్పాదీ నూతన సంవత్సర నామ కీర్తనం'. 
చైత్రశుద్ధ పాడ్యమినాడు తైలాభ్యంగనము చేసి ఆ తర్వాత నూతన సంవత్సరము పేరు చెప్తూ, సంకల్పం మార్పుచేసి చెప్పాలి. అటుపై కాలస్వరూపుడైన పరమాత్మ అనుగ్రహంను కోరుతూ దైవపూజ చేయడం... ధూప దీప నైవేద్యాలు పూర్తిచేసుకొని నైవేద్యంగా పెట్టిన వేపపూత ఉగాది పచ్చడిని సేవించాలి.

నింబకుసుమ భక్షణం / ఉగాది పచ్చడి సేవనం :-
ఈ రోజున షడ్రుచులతో అలరారే ఉగాది పచ్చడిని సేవించడం ప్రధానమైనది. ఆరు ఋతువుల తత్త్వాన్ని ఆరు రుచుల పదార్ధంగా మలచి, కాలస్వరూపుడైన పరమాత్మునికి నివేదించి, ఆరగించడం ఆచారం.
                                 


ఆరుఋతువులకు ఆరు ధర్మాలున్నాయి. వాటిలో కొన్ని సుఖానికి, కొన్ని దుఃఖానికీ కారణమౌతున్నాయి. ఆయా ఋతువుల్లో అనుభవించబోయే సుఖదుఃఖాలని ఉగాది పచ్చడి రుచులలో నేడే చవిచూసి సుఖాలకు పొంగక, దుఃఖాలకు క్రుంగక ధైర్యంగా వుండడం అలవర్చుకోవాలనే ఈ పచ్చడి సంకేతం. ఆరోగ్య ప్రదాయిని అయిన ఉగాది పచ్చడిని సుఖదుఃఖ సమ్మిళతమైన మానవజీవితానికి సంకేతంగా పరిగణిస్తారు.
శతాయుర్వజ్రదేహృయు: సర్వసంపత్కచ రాయచ / సర్వారిష్ట వినాశాయ, నింబ కుసుమ భక్షణం //
ఈ వేప పూత పచ్చడి సేవనం...  
సర్వమైన అనగా చెడుగ్రహాలు, విపత్తులు, అనారోగ్యదాదులును నివారించి, సర్వ సంపదలను కల్గించే అదృష్టాన్ని వృద్ధిచేసి, దీర్ఘాయువును, వజ్రము వంటి దేహదారుడ్యము ప్రసాదిస్తుంది.
'మధురామ్ల లవణ తిక్తకటు కషాయాః' అని అంటుంటారు. మధురం(బెల్లం), ఆమ్లం(మామిడికాయ, చింతపండు), లవణం(ఉప్పు), తిక్తం(వేపపూవు), కటు(మిర్చి), కషాయం(మిరియం). 
కొన్ని ప్రాంతాలలో ఈ పచ్చడి తయారి కొంత భిన్నంగా వున్నప్పటికీ, వేపపూవు తప్పనిసరిగా వుంటుంది. అలానే ధర్మసింధు లాంటి శాస్త్రాలలో అశోక పల్లవాన్ని కూడా ఈ క్రింది శ్లోకం చదువుతూ సేవించమని తెలుపుతుంది. అశోక పల్లవం దుఃఖ నివారకం.
త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ/ నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు //
ఓ అశోక కలికమా! జీవితంలో శోకాలతో బాధింపబడుతున్న నేను నిన్ను సేవించుచున్నాను. మధుమాసంలో చిగిర్చిన అశోకమా నీవు నన్ను శోకములు లేకుండా చేయుదువుగాక.
వేప క్రిమిసంహారిణి, ఆరోగ్య వర్ధిని. వేపపువ్వు రక్తశుద్ధిని చేసి, రోగానిరోధకశక్తిని పెంచుతుంది. మామిడి, చింతపండు ఆలోచనాశక్తిని, బుద్ధి సూక్ష్మతను పెంపొందిస్తుంది. మిగిలినవి శరీరపుష్టిని, మంచి ఆరోగ్యాన్ని, ఉష్ణ ఉపశమనాన్ని కల్గిస్తాయి. అంతే కాకుండా తీపి (బెల్లం) గురుగ్రహ అనుగ్రహాన్నిస్తుంది. రాహు కేతు కుజాది గ్రహాల పీడలకు ఔషదం మిరియాలు. కాబట్టి వీటిని సేవించడం ద్వారా గ్రహానుకూలతలు కూడా లభిస్తాయని పెద్దల వాక్కు. 

పంచాంగ శ్రవణం :-
అనంతమైన కాలాన్ని భగవంతుడిగా భావించి, ఆరాదించడం ఉగాది పండుగలో ఓ విశేషాంశం. కాలగణనకు ఓ నిర్దిష్ట రూపం పంచాంగం.
అనంతమైన కాలాన్ని మన వ్యవహార నిమిత్తం నామరూపాత్మకంగా విభాగించారు మన పూర్విజులు.
ఈ కాలాన్ని సూర్యసంచారాన్ని బట్టి - క్షణాలు, నిముషాలు, గంటలు, పగలు, రాత్రి, దినాలు, పక్షాలు, నెలలు,ఋతువులు, ఆయనాలు, సంవత్సరాలుగా విభజించారు. దీనిని తెలియజేస్తూ  పంచాంగమును రూపొందించారు. ఈ విధంగా కాలగణనను చేసి మొదటి ఋతువు అయిన వసంతంలో మొదటిమాసమైన చైత్రంలో మొదటి పక్షంలో మొదటిరోజైన పాడ్యమిని ఉగాదిగా జరుపుకోవడం ఆనవాయితి.   సృష్టి ఆరంభం, రాబోయే మార్పులు, భవిష్యత్ కాలగమనం, మంచిరోజులు, చెడుకాలం, కష్టాలు నష్టాలు, లాభాలు, నక్షత్ర గమనాలు, సూర్యోదయ అస్తమయ సమయాలు, నవగ్రహ సంచారాలు ... ఇత్యాది విషయాలు తెలియజేసేది పంచాంగం.
కాలగణనం మూడువిధాలుగా శాస్త్రం తెలుపుతుంది. అవి - 1సౌరమానం (సూర్యుని ఉదయాస్తమయాలను ఆధారంగా చేసుకొని నిర్ణయించేది)
2. చాంద్రమానం(చంద్రుని ఉదయాస్తమయాలు, వృద్ధి క్షయాల ఆధారంగా చేసే కాలనిర్ణయం)
3. బార్హస్పత్య మానం (గురుగ్రహంఅంటే బృహస్పతి గ్రహం యొక్క చలనమాధారంగా చేసే కాలగణన) మనం పాటించేది చాంద్రమానం.

పంచాంగం - ఐదు అంగములు. అవి ... తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం. 
కాలస్వరూపుడైన 'దైవం' నివసించి ఉండేది 'తిధి'లో. నవగ్రహాలు ఆ దైవాన్ని సేవిస్తూ ప్రదక్షిణం చేసేదినం వారం. క్షతం కాకుండా కాపాడేది నక్షత్రం. చంద్రుడు నక్షత్రంతో కలిసివుండే కాలం యోగం. కరణ మంటే సాధనలో కార్యసాఫల్యత. అందువలన కాలస్వరూపుడైన పరమాత్ముణ్ణి పంచాంగ రూపంలో  పూజించడం, పెద్దల చెంత శ్రవణం చేయడం ఓ సంప్రదాయం.
తిధేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్య వర్ధనమ్
నక్షత్రార్ధరతే పాపం, యోగాద్రోగ నివారణమ్
కరణాత్కార్య సిద్ధిస్తు, పంచాంగ ఫల ముత్తమమ్
కాల విత్కర్మా కృద్దీయాన్ దేవతానుగ్రహం లభతే
పంచాంగ శ్రవణంచే తిధివల్ల సంపదయును, వారము వలన ఆయుష్షును, నక్షత్రం వలన పాపపరిహారమును, యోగము వలన వ్యాధినివృత్తియును, కరణము వలన కార్యానుకూలతయును కలుగును. కావున కాలము దెలిపి కర్మము చేయువారు భగవదనుగ్రమును పొందుదురు. ఈ ఐదును కాలదేవత అంగాలుగా చెప్తారు.
పంచాంగ శ్రవణం ఉగాది నాటి విశేష ఆచారం. ఈ రోజున పంచాంగ శ్రవణం గంగాస్నానంతో సమానమైన ఫలాన్నిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
తిధిర్యారం చ నక్షత్రం యోగః కరణఏవచ / పంచాంగస్య ఫలం శ్వణ్వన్ గంగాస్నాన ఫలం లభేత్://
పెద్దల ద్వారా పంచాంగ శ్రవణం చేయడం, వారి ఆశిస్సులు పొందడం, కష్టసుఖాలను, ఏది మంచో చెడో తెలుసుకుంటూ... వాటిని అధిగమించే ప్రయత్నం చేయడం... ఇదో శుభపరిణామంనకు నాంది. 
ప్రపాదానం :-
సేవాభావం, సాటి ప్రాణుల యందు దయ లాంటి సద్గుణాలు అలవడాలని బాటసారులకై, సర్వప్రాణులకై ... ఉష్ణశాంతిని, దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మన శాస్త్రాలు ఉద్భోదిస్తున్నాయి. దీనినే ప్రపాదానమని అంటారు.
సమాజసేవకై చలివేంద్రాల ఏర్పాటు ... 
ఇక్కడ ఓ విషయం జ్ఞాపకం వస్తుంది. ఈ మధ్యనే నా ప్రియనెచ్చలి 'విశాల' వాట్సఅప్ లో ఓ సందేశం పంపింది - 
                                        
ఓ చిన్ని గిన్నిలో నీరు పోసి పక్షుల దాహార్తిని తీర్చడమ్... ఇదికూడా ప్రపాదానమే
ఈ ప్రపాదానము వలన పితృదేవతలు సంతృప్తులై సుఖశాంతులను ప్రసాదిస్తారని, మనోరధములన్నీ సిద్ధిస్తాయని పెద్దలు చెప్తుంటారు. ఈ ప్రక్రియ సేవాభావాన్ని, మానవత్వాన్ని మేల్కొలుపుతుంది. 

 గురు రాజ మిత్ర బంధు సందర్శనం :- 
గురువులను, పెద్దలను, బంధుమిత్రులను కలుసుకొని అత్మీయాతానుబంధాలను పెంచుకోవడం ... నేను, నా కుటుంబం అని అనుకోకుండా వ్యక్తులమధ్య సన్నిహిత సంబంధాలను మెరుగుపరుచుకోవడం ... మంచి భావనతో, మంచి సంకల్పంతో, మంచి ఆకాంక్షతో శుభాకాంక్షలు తెలుపుకోవడమనే అద్భుత ప్రక్రియలను పెద్దలు పెట్టడానికి కారణం... ఈ విధమైన విధివిధానములు బాహ్యంగా దేహాన్ని, అంతరంగికంగా హృదయాన్నిశుద్ధి చేస్తాయి. 'నా' సంకుచితభావం నుండి 'మన' అని అనుకునే సద్భావన సహృదయత అలవడుతుంది. 
ఒక్క మాటలో చెప్పాలంటే - "మనలో వున్న స్వభావదోషాలను వదులుకొని సరిక్రొత్తగా సరైనరీతిలో మనల్ని తీర్చుదిద్దుకోవడమే ఉగాది అంతరార్ధం". 
                                     

ఈ ఉగాది అందరిలో...  
సత్సంకల్పానికి నాంది పలుకుతూ,  వినూత్న జీవనానికి క్రాంతులను వెదజల్లుతూ ఆయురారోగ్య ఆనందాలను నింపుతుందని కాంక్షిస్తూ ... 

అందరికీ నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. 

29, ఫిబ్రవరి 2016, సోమవారం

'అమ్మమ్మ ఆకాంక్ష'.

సరస్వతీ సమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా... 

మాఘ పౌర్ణమి -
మాఘ పౌర్ణమిన నా మనుమరాలు చిట్టితల్లి శ్రీమాన్వికి బాసరలో "జ్ఞాన సరస్వతి అమ్మ" అనుగ్రహంతో, అందరి ఆశీస్సులతో అక్షరాభ్యాసం జరగడం ఆనందదాయకం.
మన జీవితంలోని వివిధ దశల్లో జరిపే షోడశ సంస్కారాలలో ముఖ్యమైన సంస్కారం "అక్షరాభ్యాసం".



యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా
సామాం పాతు సరస్వతి భగవతీ నిశ్శేష జాడ్యాపహా!!

అక్షరాభ్యాసం :-
అక్షర - అభ్యాసం ... అక్షరాలను సాధన చేయడం.
అక్షరం ... క్షరం కానిది... అంటే నాశనం కానిది. నాశనం కానటువంటి విద్యను అభ్యచించడానికి నాంది అక్షరాభ్యాసం.
ఈ అక్షరాభ్యాసం ... వ్యక్తిత్వం, సామర్ధ్యం, జీవన నైపుణ్యతలతో కూడిన విద్యకు నాంది.

విద్య ...

మాతేవ రక్షతి పితేవ హితే నియుంక్తే
కాన్తేవ చాభిరమయత్యపనీయ ఖేదమ్ ।
కీర్తిం చ దిక్షు వితనోతి తనోతి లక్ష్మీం
కిం కిం న సాధయతి కల్పలతేవ విద్యా ॥
విద్య తల్లివలే రక్షించును, తండ్రివలే ధర్మమునుపదేశించును, భార్యవలే ఆపత్కాలమున శ్రమను శమింపచేయును, దశదిశలలో కీర్తిని కలుగజేయును, ఐశ్వర్యము సమకూర్చును, ఇన్ని మాటలెందుకు? కల్పవృక్షం వలే సమస్త కోరికలను ఇచ్చునది విద్య యొక్కటే.

విద్యా నామ నరస్య రూప మధికం ప్రచ్చన్నగుప్తం ధనం
విద్యా భోగకరీ యశఃసుఖకరీ విద్యా గురూణాం గురు: ।
విద్యా బందుజనో విదేశగమనే విద్యా పరా దేవతా
విద్యా రాజసు పూజ్యతే న హి ధనం విద్యావిహీనః పశు: ॥

మానవునికి విద్య అతి మనోహరమగు సౌందర్యం. విద్య దొంగలచే అపహరింపబడని ధనం, విద్య అన్ని భోగములను, యశస్సుఖములను నొసంగునది. విద్యయే సద్గురువు. విదేశ గమనమందు బంధువువలే సహకరిస్తుంది. విద్య పరాదేవత. రాజుపూజితం. విద్యను మించిన ధనం లోకమున వేరు లేదు, విద్యాధనమే ధనము. విద్య లేనివాడు పశువుతో సమానమని భర్తృహరి విద్య గురించి శ్లాఘిస్తాడు.

న చోరహార్యం న నృపేణ దండ్యం న బంధుభాజ్యం నకరోతి భారమ్ ।
వ్యయే కృతే వర్దత ఏవ నిత్యం విద్యాధనం సర్వధనప్రదానమ్ ॥
ఈ విద్యాధనం చోరులచే అపహరింపబడునది కాదు, రాజులకు పన్ను కట్టవలసిన ధనం కాదు, బంధువులకు భాగమివ్వవలసినది కాదు, మోయుటకు భారం లేనిది, వ్యయం చేస్తున్నకొలది వృద్ధియగునది. అంతేగాక ఈ విద్యాధనం  సర్వధనముల {యశస్సు, కీర్తి, భోగభాగ్యాలు, జ్ఞాన వైరాగ్యాలు ...} ప్రదాయిని.


విద్యావంతుల వలన  ఎంతోమందికి ఉపయోగముంటుంది, వారి బతుకు ఎంతో మందికి బతుకునిస్తుంది.
జన్మించాక .... బ్రతకడం కాదు చక్కగా జీవించగలగాలి. అందుకు చక్కటి విద్య అవసరం. విద్యను చక్కగా అభ్యసించినవారు తాము చక్కగా జీవించడమే కాదు, ఎందరినో ఉన్నతంగా జీవించేలా మార్గదర్శకులు కాగలరు.

విద్య ...
ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తే -
దేనియందు అవిద్య లేదో ... అదే విద్య.
ఏది క్షరం గాక సత్తు అయి యుండునో దానియందు గల అభ్యాసమే అక్షరాభ్యాసమని ఆధ్యాత్మిక కోవిదుల వాక్కు.

శాస్త్రరీత్యా విద్య రెండు రకములు - 
ద్వే విద్యే వేదితవ్యే తు శబ్దబ్రహ్మ పరం చ యత్ /
శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్ఛతి //
మానవుడు రెండు విద్యలు నేర్చుకొనవలయును. 1. శబ్దబ్రహ్మము 2. పరబ్రహ్మము. 
శబ్దబ్రహ్మమనగా శాస్త్రము. పరబ్రహ్మమనగా ఆత్మజ్ఞానం. అయితే శబ్దబ్రహ్మమందు నిష్ఠ కలిగినవారు మాత్రమే పరబ్రహ్మమును పొందగల్గును అని శృతి బోధించుచున్నది. (అమృత బిందూపనిషత్తు).

ప్రాకృతవిద్య అలవడిన అప్రాకృతమైన  బ్రహ్మవిద్యను అభివృద్ధి చేసుకొనవచ్చును. మండుచుండు అగ్నికి వాయువెంత సహాయమో, అటులనే ఆధ్యాత్మిక జ్ఞానవిద్యకు ఈ ప్రాకృతమైన విద్య అత్యవసరం.
జన్మ సార్ధకతకు విద్యను అభ్యసించాలి. ఆ విద్యారంభంకు అక్షరాభ్యాసమనే సంస్కారం తప్పనిసరి.

విద్య గురించి కొందరు మహానుభావుల భావాలు ...
అత్యున్నత మేధాశక్తి పట్ల, సత్యం పట్ల ప్రగాఢమైన ప్రేమను రగిలించడానికి స్పూర్తినివ్వడమే విద్య లక్ష్యం.                                                                                                    - జాన్ స్టూవర్ట్ మిల్
విద్య అంటే మెదడులోకి బలవంతంగా ఎక్కించే సమాచారం కాదు. శీల నిర్మాణానికి తోడ్పడాలి. సమాచారాన్నే విద్యగా పరిగణిస్తే గ్రంధాలయాలే ప్రపంచంలో గొప్ప రుషులయివుండేవి. 
                                                                                                   - స్వామి వివేకానంద
విద్య అంటే ఓ వ్యక్తిని జీవితం కోసం తయారు చేయడం కాదు, వాస్తవానికి విద్యే జీవితం. 
                                                                                                                   - జాన్ డ్యూయీ
విద్య అంటే నిప్పును రగిలించడమేగానీ ఏదో ఒక మట్టికుండను నీటితో నింపడం కాదు. అదో ఆలోచనాజ్వాల.                                                                                                  - సోక్రటీస్
విద్య నేర్చుకోవడం సృజనాత్మకతకు దారి తీస్తుంది. సృజనాత్మకత స్వతంత్రంగా ఆలోచింపజేస్తుంది. ఆలోచన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానమే మనల్ని ఉన్నతుల్ని చేస్తుంది. 
                                                                                        - అబ్దుల్ కలామ్

                                              
                                                                          శ్రీమాన్వి

చిట్టితల్లి శ్రీమాన్వి!
ఉన్నత విద్యలను చక్కగా అభ్యసించి ఇహసుఖమును, పరసుఖమును, పరాత్పరసుఖమును జ్ఞాన సరస్వతి అమ్మ అనుగ్రహంతో, అందరి ఆశీస్సులతో పొందాలన్నదే 'అమ్మమ్మ ఆకాంక్ష'. 


22, డిసెంబర్ 2015, మంగళవారం

"సత్య"సాధన

                                                   "సత్యమేవ జయతే"
                        సత్యమేవ జయతే అనేది భారత ప్రభుత్వం స్వీకరించిన ధ్యేయవాక్యం. 


సత్యంకు ఇంతటి ఘనత ఎందుకు? అసలు సత్యమంటే ఏమిటీ?

పరబ్రహ్మ స్వరూపమే సత్యము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తైత్తిరీయోపనిషత్ లో చెప్పబడింది.
అటులనే ముండకోపనిషత్ సత్యమేవ జయతి (సత్యమే జయిస్తుంది)అని వక్కానిస్తుంది. 
బ్రహ్మసత్యం జగత్ మిధ్య (బ్రహ్మమే సత్యమని, జగత్తే మిధ్య)అని శ్రీ శంకరాచార్యులవారు చెప్పారు.

సత్యమే అత్యున్నత సద్గుణం.
సత్యమే సకల సుగుణాలకు మకుటం.
సత్యమే సాధకునికి ఆలంబనం.
సత్యమే సత్య వాదులకు లక్ష్యం. 
సత్యమే పరమపదం.
సత్యమే పరమాత్మ.
సత్యమే సత్ సాధకులకు అత్యుత్తమ అనుష్టానం. 

సత్య పధంలో సాధన, సాధ్యం రెండూ కూడా 'సత్యమే'.

"మంచి నడవడిక అనేది ఒక మహాసాగరం. ఆ సాగరం నుండి తరింపజేసేందుకు ఓడలాగా ఉపయోగపడేది సత్యవాక్యం" అని తెలియజెప్తుంది విదురనీతి.  

"సత్యానికి సరి సమానమైన తపస్సు లేదు.అసత్యాన్ని మించిన పాపము లేదు.ఓ దేవా! ఎవరు సత్యాన్ని అనుష్థిస్తారో వారి హృదయంలో నీవు నెలకొని వుంటావు" అని సత్యం యొక్క ఔనత్యాన్ని కీర్తిస్తాడు కబీర్ దాసు.

"యవ్వనం, సౌందర్యం అదృశ్యమౌతాయి; జీవితం, సంపద మాయమౌతాయి; పేరు, ప్రఖ్యాతి అంతరిస్తాయి; పర్వతాలు సైతం దుమ్ము ధూళిగా మారతాయి; సౌభ్రాతృత్వం, ప్రేమ అంతరిస్తాయి; సత్యం ఒక్కటే శాశ్వతంగా నిలుస్తుంది" అని నినదించారు వివేకానందులవారు. 

మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మనాం అన్న సుభాషితం ప్రకారం మనస్సులోని భావన, మాట, చేత ఈమూడు ఒకేరీతిలో వుండడం సత్యవ్రతుని లక్షణం. ఇలా మనస్సు, వాక్కు, కర్మల సమన్వయంలో చేసిన సాధనే సత్యవంతమైన జీవితానికి 'అత్యావశ్యకం '.

సత్యానుసారిణీ లక్ష్మీ: కీర్తి స్త్యగానుసారిణీ
అభ్యాస కారిణీ విద్యా బుద్ధి: కర్మానుసారిణీ
సత్యం మానవుణ్ణి తరింపజేస్తుంది. గౌరవం, సంపద మొదలైనవి సత్యాన్ని అనుసరించి వస్తాయి.

శ్రీ వసిష్టవారు దిలీప మహారాజుతో దేనివలన జనన మరణ భవసాగరము తరింపబడునో, దానికే తీర్ధమని అంటారని, మానసాది తీర్ధంలను గురించి వివరిస్తూ మొదటగా చెప్పింది ... సత్యము గురించే! సత్యమే ఓ తీర్ధమని... ఇలా తెలిపారు -

సత్యాదీనాంచ తీర్దానాం లక్షణం శృణు పార్ధివ/
యస్య శ్రవణ మాత్రేణ సర్వస్నాన ఫలం లభేత్//
అనుద్వేగ కరం హృద్యం సజ్జనానంద కారణమ్/
ఏవం లక్షణ సంయుక్తం సత్యం ప్రాహుర్మ నీషిణః //
సత్యం బ్రూయాత్ప్రియం బ్రూయాన్న బ్రూయాత్సత్యమప్రియమ్/
ప్రియం చ నానృతం బ్రూయా దేష ధర్మస్సనాతనః //
ఓ రాజా! సత్యాది తీర్ధముల కధనమును వినిన మాత్రమునే సమస్త తీర్ధముల యందును స్నానం చేసిన ఫలం లభించును. మనస్సుకు ప్రియమైనది, ఇంపైనది, సత్పురుషులకు ఆనందం కలుగజేయునదియు ఏదియో,  అది సత్యమని మహాత్ములు  చెప్పుదురు. ఓ రాజా! ఎల్లప్పుడూ సత్యమునే పలకవలెను. ఆ సత్యమునే ప్రియంగా హితంకల్గేలా చెప్పవలెను. ఇదే అనాది ధర్మమని  పెద్దలు చెప్పుదురు... అని వసిష్టులవారు చెప్పగా -

అనుద్వేగ కరంవాక్యం సత్యం ప్రియం హితం చ యత్ అన్నది గీతాచార్యుని బోధన.

సత్యం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం
ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏషధర్మ స్సనాతనః
సత్యం చెప్పినా అది ఎదుటివారికి ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని కలిగించకుండా ప్రియంగా చెప్పగలగాలి. అలా చెప్పలేని సత్యమైతే, అట్టి సత్యాన్ని చెప్పకుండా నిగ్రహించుకోవాలని మనుస్మృతి తెలుపుతుంది.
అంటే ... సత్యం చెప్పడం వలన ప్రాణి హింస,  ప్రాణాంతకమైన స్థితి వస్తే, హింసకు తావీయకుండా సత్యంను  వెల్లడి చేయకుండా నిగ్రహించుకోమనే శాస్త్రం చెప్తుంది.
ఇక్కడ ఎప్పుడో చదువుకున్న ఓ కధ గుర్తుకొస్తుంది -
పూర్వం సత్యవ్రతుడనే మహాపురుషుడు ఉన్నచోటుకు ఓ జింక పరుగెత్తుకొని వచ్చి దాక్కుంది. దానిని తరుముకొని వచ్చిన వేటగాడు 'స్వామీ! ఈ వైపు జింక పరుగెత్తుకొచ్చిందా' అని అడుగగా -
నిజం చెబితే జీవహింసలో తనకూ భాగం ఏర్పడుతుంది, లేకుంటే అసత్యదోషం వస్తుంది, అందుకని చాలా జాగ్రత్తగా మృదువుగా 'చూసిన కంటికి చెప్పేశక్తి లేదు, చెప్పగల నోటికి చూసేశక్తి లేదు' అని బదులిచ్చి ఊరుకోగా... ఆ బోయకు ఈ మాటలు అర్ధంకాక తనదారిన తాను వెళ్ళిపోయాడు. 

ఇక; సత్యం చీర కట్టుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగివచ్చింది, సత్యం చెప్పులేసుకొని బయల్దేరేలోపు అసత్యం వాడవాడలా తిరిగివచ్చింది ... అని లోకోక్తి. 
సత్యవాది లోక విరోధి, సత్యాన్ని చెప్పినా వినేవారు ఎవరు... విలువ ఇచ్చేవారు ఎవరు ... ఒకోసారి కోరి కష్టాలను తెచ్చుకోవడమే అనేవారు వున్నారు.  
నిజమే ... సత్యనిర్వహణ చాలా కష్టమైన విషయం. కానీ, సత్యసంధతదే అంతిమ విజయం ... శాశ్వత విజయం! సత్యాన్ని త్రికరణశుద్ధిగా ఆచరిస్తే విజయం తధ్యం. నెమ్మదిగానైనా సరే, మనం జయించక తప్పదు.

చిన్నప్పుడు చదువుకున్న సత్యసంధత పాఠమొకటి గుర్తుకొస్తుంది -
పులివాత పడిన ఒక గోవు తన లేగదూడకు పాల్లిచ్చి తిరిగి వస్తానని ప్రమాణం చేసి వచ్చి, దూడకు పాలిచ్చి పులి ఆహారంనకై మరల తిరిగివెళ్ళిన గోవు తన సత్యసంధతతో ఆపదనుండి బయటపడినది.    

ఇక సత్యం విలువను తెలిపే మరో ఘటన -
నుతజల పూరితంబులగు నూతులు నూరింటి కంటె సూ
న్నతవ్రత! యొక బావి మేలు; మఱి బావులు నూరింటి కంటె నొక్క స
త్ర్కతువది మేలు; తత్త్కతు శతంబున కంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు చూడగన్
                                                                 -నన్నయ్య (మహాభారతం)
తియ్యటి నీటితో నిండిన నూరు నూతుల కంటే ఒక దిగుడుబావి మేలు. ఆ దిగుడుబావులు నూరింటికంటే ఒక యజ్ఞం గొప్పది. అటువంటి నూరు యజ్ఞాలు కంటే, ఒక కొడుకు గొప్ప. అటువంటి నూరుగురు కుమారులు కంటే ఒక సత్యవాక్యం మిన్న ... అని శకుంతల దుష్యంతునికి చెప్పిన ఈ మాటలు సత్యవాక్య విలువను తెలుపుతుంది.  

సీతమ్మను అపహరించడానికి రావణుడు, మారీచుని సహాయం కోరినప్పుడు ... మారీచుడు, 
రావణా! ధర్మమూర్తి అయినా రామునితో వైరం పెట్టుకోవద్దు, నీతో పాటు నీ వంశమంతా నాశనమౌతుంది అని చెప్తూ ... 
సులభాః పురుషాఃరాజన్ సతతం ప్రియవాదినః
అప్రియస్యచ పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః // అని అంటాడు. 
రాజా! నీకు ప్రియవచనాలతో, స్తోత్రవ్యాక్యాలతో సంతోషం కల్గించేవాళ్ళు చాలామంది వున్నారు. కానీ, నీకు వినడానికి అప్రియంగా వున్నా, హితకరమైన సత్యమైన మాట చెప్పేవాళ్ళు దొరకరు. చెప్పినా వినేవాళ్ళు దొరకరు...

సత్యమును మారీచుడు చెప్పిన గ్రహించక ధర్మాన్ని తప్పిన రావణుడు సత్యవాక్కు పరిపాలకునిచే సంహరింపబడ్డాడు.
అసత్యం చెప్పదగిన సందర్భాలు శుక్రాచార్యుడు ఉదహరించిన వినక మానధనులు మాటతిరగరాదని, సత్యహీనున్ని కాలేనని, సత్యవాక్కుకు కట్టుబడిన బలిచక్రవర్తి ....
అటులనే -
విశ్వామిత్రుడు కల్పించిన అనేక కష్టాలను ఎదుర్కొన్న సత్యదీక్షను విడవకపోవడంతో సత్యవాక్పాలకుడు అయిన హరిచంద్ర చక్రవర్తి ...
ఎంతటి ఘనకీర్తిని పొందారో జగద్వితితమే.

సత్యపధగాములందరూ తమ మాటలలో, నడవడికలో బహు జాగ్రత్త వహిస్తారు. ఈ రకమైన నియమపాలన సహజంగానే మనిషిని నిరంతరం జాగరూకతలో ఉండేలా చేస్తుంది.ఇది తీవ్రమైన తపస్సుగా, అనుష్ఠానంగా రూపుదిద్దుకుంటుంది.ఈ విధంగా సాధకుని 'సత్య సాధన ' అతని మనోప్రపంచంలో నూతన పరిధిలను ఆవిష్కరించుకునేలా చేస్తుంది.

అలానే, ఒక వ్యక్తి సత్యానుష్ఠానం వల్ల సత్యసంధుడు అయినప్పుడు అద్భుతమైన సంకల్పశక్తిని సంతరించుకుంటాడు.

ఇక మన జ్ఞానేంద్రియముల పరిధిలోనికి వచ్చే విషయాలను యధాతధంగా చెప్పడం వ్యవహారిక సత్యం కాగా, కొన్ని కొన్ని సందర్భాల్లో అసత్యమైనవి సత్యంగా భ్రమింపజేస్తాయి. దీనిని ప్రాతిభాషిక సత్యమంటారు. శాస్త్రం ఇటువంటి భ్రాంతిని 'రజ్జు సర్ప భ్రాంతి'గా పేర్కొంటుంది.  ప్రాపంచిక వ్యవహారాల్లో ఇటువంటి భ్రాంతులకు లోను కాకూడదనే పెద్దలు కళ్ళతో బాగుగా పరిశీలించి,
సత్యమును గ్రహించి మనస్సులో వడబోసిన మాటనే పలకాలి... అని చెప్తారు. ఇక బ్రహ్మ సత్యం, జగత్ మిధ్య అనే పారమార్ధిక సత్యమే అసలైన సత్యం. ఈ పారమార్ధిక సత్యంకై చేసే సాధనే "సత్య"సాధన. 

అటువంటి సాధనకై -  
సత్యవంతమైన జీవితాన్ని గడిపిన హరిశ్చంద్రుడు, శ్రీరాముడు, యుధిష్ఠరుడు మొదలైన వారి జీవితం, సందేశాలను పఠించి,తద్విషయముపై ధ్యానించాలి.........

ఎంతసేపు పురాణ పురుషులనే ఉదాహరణలుగా చూపడమే గానీ, అటుపై అన్యులెవరూ లేరా ... ఇది నేను ఈ పోస్ట్ టైపు చేస్తుండగా వెనక నిల్చొని చదివిన ప్రక్కింటి అమ్మాయి ప్రశ్న ... 
లేకేం ... సత్యము, అహింస అను  రెండు సద్గుణములును పాటిస్తూ, భారతీయ పతాకమును ఎగురవేసి, మన ఖ్యాతిని పెంచిన జాతిపిత మహాత్ముడు బాపూజీ ఉన్నారు. అలానే దేశ విదేశాలలో మన భారతీయ ఔనత్యాన్ని, తానూ నమ్మిన సత్యాన్ని చాటిచెప్పి మన స్థాయిని చిరస్థాయిగా నిలిపిన వివేకానందుడు ఉన్నారు.... 




29, నవంబర్ 2015, ఆదివారం

మాతృమూర్తులకు ఆహార నియమావళి

హిందూ సంస్కృతిలో మాతృస్థానం మహోన్నతమైనది. మాతృదేవోభవ  అని వేదమే మాతృస్థానంను శ్లాఘిస్తుంది. ఓ బిడ్డకు జన్మమిస్తున్న స్త్రీ మూర్తిని దైవంగా కొనియాడే శాస్త్రాలు ఆ పుట్టబోయే బిడ్డ మంచిగా మేధావిగా ప్రజ్ఞా ధీశాలిగా జనించాలంటే గర్భవతి అయిన ఆ స్త్రీ ఏం చేయాలో కూడా శాస్త్రాలు తెలుపుతున్నాయి .
మాతృమూర్తి గర్భంలో ప్రవేశించిన జీవకణం క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది.  అట్టి శిశువుని మొదటిమాసం నుండి నవమాసముల వరకు, వరుసగా ఒక్కొక్క మాసం వివిధ దేవతాశక్తుల రూపేణా లలితా అమ్మవారు ఎలా పరిరక్షిస్తూ వుంటారో లలితా సహస్ర నామములయందు చక్కగా తెలపబడింది. ఆయా మాసముల యందు ఆయా దేవాతశక్తులకు ప్రీతికర ఆహారమును గర్భవతులు అయినవారు స్వీకరిస్తే, ఆయురారోగ్య తేజోవంత సత్సంతానంను పొందుదురు.

మాతృమూర్తులగు స్త్రీలకు ఆహార నియమావళి -
                                                   

మాతృమూర్తులగు స్త్రీలకు లలితా సహస్ర నామం నందు వరుసగా 98 వ శ్లోకం నుండి 110 వ శ్లోకం వరకు ఎటువంటి ఆహరం తీసుకోవాలో చక్కగా తెలపబడింది. వాటిని ఓసారి పరిశీలిద్దాం.


విశుద్ధి చక్రనిలయా,‌ రక్తవర్ణా, త్రిలోచనా |
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా || 98 ||
పాయసాన్నప్రియా, త్వక్‍స్థా, పశులోక భయంకరీ |
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ || 99 ||
అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలా,‌உక్షమాలాధిధరా, రుధిర సంస్థితా || 100 ||
కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా |
మహావీరేంద్ర వరదా, రాకిన్యంబా స్వరూపిణీ || 101 ||
మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా |
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా || 102 ||
రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా |
సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ || 103 ||
స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా |
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,‌உతిగర్వితా || 104 ||
మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా |
దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ || 105 ||
మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా,‌உస్థిసంస్థితా |
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా || 106 ||
ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ |
ఆఙ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా || 107 ||
మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా |
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ || 108 ||


సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా |
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ || 109 ||
సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ |
స్వాహా, స్వధా,‌உమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా || 110 ||


పై శ్లోకాలను అదే వరుసక్రమంలో పరిశీలిస్తే మాతృమూర్తులగు గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి అవగతమౌతుంది 

మొదటినెల -
విశుద్ధి చక్రంలో శ్రీ లలితా పరాదేవతయే డాకినీ దేవతగా కొలువై వుంది. ఈ దేవత ఎర్రని ఛాయతో త్రినేత్రాలు కలిగి వుంటుంది. ఈమె ఖట్వాంగాన్ని, ఖడ్గాన్ని, త్రిశూలాన్ని ఆయుధాలుగా ధరించి, మొదటినెలలో గర్బస్థ శిశువునకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా పిండవృద్ధి జరిగేలా సంరక్షిస్తుంది. ఈమె త్వక్ స్థ. ఈమె చర్మమనే ధాతువునకు అధిదేవత. ఏ విధమైన చర్మరోగాలు సోకకుండా తేజోవంతమైన చర్మాన్ని శిశువునకు అనుగ్రహిస్తుంది. ఈమెకు పాయసాన్నం ప్రీతి. బియ్యంను పాలల్లో ఉడికించి, బెల్లం జోడించి, తదుపరి ఆవునెయ్యిని కలిపిన పాయసాన్నప్రసాదమును లలితా సహస్ర నామ పారాయణం చేసిన పిమ్మట నివేదనను చేసి, దానిని పవిత్రభావనతో గర్భిణీ స్త్రీ మొదటినెలలో స్వీకరిస్తే, చక్కగా పిండాభివృద్ధి జరుగుతుంది.

రెండవ నెల -
అనాహత చక్రంలో శ్రీ లలితా పరాదేవత రాకిని దేవతగా కొలువై వుంది. ఈమె శ్యామ వర్ణంలో రెండు ముఖాలతో, అక్షమాల, శూలం, డమరుకం, చక్రాలను ధరించి యుంటుంది. ఈమె రుధిర సంస్థిత. రక్తం అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు స్నిగ్ధానం అంటే నేతి అన్నం ప్రీతి. ఆవునెయ్యితో కలిపిన అన్నప్రసాదంను భక్తిశ్రద్ధలతో లలితా పారాయణం చేసిన పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, సద్భావనతో గర్భిణీ స్త్రీ రెండవనెలలో స్వీకరిస్తే, శిశువు చక్కగా రక్తపుష్టితో వృద్ధి చెందుతుంది.

మూడవ నెల -
మణిపూర చక్రంలో శ్రీ లలితా పరాదేవత లాకిని దేవతగా కొలువై వుంది. ఈమె రక్తవర్ణంలో మూడు శిరస్సులతో వజ్రం, శక్తి, దండం, అభయముద్రలను ధరించి యుంటుంది. ఈమె మాంస నిష్ఠ. మాంసం అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు గుడాన్నం అంటే బెల్లపు పొంగలి ప్రీతి. అన్నం,  బెల్లం, ఆవునెయ్యిలతో తయారుచేసిన పొంగలి ప్రసాదంను లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి, భక్తితో గర్భిణీ స్త్రీ మూడవనెలలో స్వీకరిస్తే, శిశువు దేహంలో మాంసవృద్ధి గావిస్తుంది.

నాల్గవ నెల -
స్వాదిష్టాన చక్రంలో శ్రీ లలితా పరాదేవత కాకిని దేవతగా కొలువై వుంది. ఈమె బంగారు ఛాయలో నాలుగు ముఖాలతో, శూలం, పాశం, కపాలం, అభయముద్రలు ధరించి యుంటుంది. ఈమె మేధో నిష్ఠ. మేధ అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు దద్ధ్యన్నం అంటే పెరుగన్నం ప్రీతి. అన్నంలో ఆవుపాల పెరుగుతో కలిపిన ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి ప్రీతిగా నివేదన చేసి, సద్భావనతో గర్భిణీ స్త్రీ నాల్గవ నెలలో స్వీకరిస్తే, శిశువునకు మేధావృద్ధి కలుగుతుంది.

ఐదవ నెల -
మూలాధార చక్రంలో శ్రీ లలితా పరాదేవత  సాకిని దేవతగా కొలువై వుంది. ఈమె ఐదు ముఖాలతో, అంకుశం, కమలం, పుస్తకం, జ్ఞానముద్రలను కలిగి యుంటుంది. ఈమె ఆస్థి సంస్థిత. ఎముకలు అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు ముద్గౌదన అంటే కట్టుపొంగలి ప్రీతి. పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవునెయ్యితో కలిపిన అన్నప్రసాదాన్ని లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, భక్తితో గర్భిణీ స్త్రీ ఐదవ నెలలో స్వీకరిస్తే, శిశువునకు దృఢమైన ఎముకలు వృద్ధి చెందుతాయి.

ఆరవ నెల -
ఆజ్ఞా చక్రంలో శ్రీ లలితా పరాదేవత హాకిని దేవతగా కొలువై యుంటుంది. ఈమె శుక్రవర్ణంలో ఆరు ముఖాలుతో శోభిల్లుతుంది. ఈమె మజ్జా సంస్థ. మజ్జ అంటే ఎముకల లోపలున్న గుజ్జు.  ఈమె మజ్జా దాతువునకు అధిదేవత. ఈమెకు హరిద్రాన్నం అంటే పులిహారం ప్రీతి. ఈ పులిహార ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, భక్తి విశ్వాసంలతో గర్భిణీ స్త్రీ ఆరవనెలలో స్వీకరిస్తే, శిశువు ఎముకలలో మజ్జాధాతువు వృద్ధి చెంది పరిపుష్టి పొందుతుంది.

ఏడవ నెల -
సహస్రార చక్రంలో శ్రీ లలితా పరాదేవత యాకిని దేవతగా కొలువై యుంటుంది. ఈమె సర్వ వర్ణాలతో, సర్వాయుధాలను ధరించి యుంటుంది. ఈమె శుక్ల సంస్థిత. జీవశక్తికి అధిష్టాన దేవత. ఈమెకు సర్వోదన అంటే పాయసాన్నం, నేతి అన్నం, గుడాన్నం, దద్ధ్యన్నం, కట్టుపొంగలిహరిద్రాన్న ప్రసాదంలు ప్రీతి. ఈ ప్రసాదాలను వరుసక్రమంలో ఆరురోజులు లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి, సద్భావనతో అమ్మను స్మరిస్తూ గర్భిణీ స్త్రీ ఏడవ నెలలో స్వీకరిస్తే, శిశువు సంపూర్ణమైన దేహాకృతిని దాల్చి, పరిపూర్ణంగా వృద్ధి చెందుతుంది.

ఇక ఎనిమిదో నెల నుండి శిశు జననం వరకు -
సంపూర్ణ భక్తి విశ్వాసాలతో శ్రీ లలితా అమ్మవారిని ఆరాధిస్తూ, క్షీరాన్నాన్ని నివేదన చేస్తూ, స్వీకరిస్తే,చక్కటి ఆయురారోగ్యాలతో ప్రజ్ఞావంతులైన తేజోమయ సంతానం కలగడం తధ్యం. 

15, నవంబర్ 2015, ఆదివారం

మిత్రమా! నీతోనే వుంటాను, నీలోనే వుంటాను ... కడదాక!

మిత్రమా!
నీతోనే వుంటాను, నీలోనే వుంటాను ... కడదాక!
ఆహా ... ఎంతటి భరోసా, ఎంతటి సౌఖ్యత, ఎంతటి భద్రత...
ఏ బంధము ఇవ్వగలదు... ఇంతటి హాయిని. ఇది ఒక్క స్నేహమునకే చెల్లుతుంది.

నిన్న వుదయం నా మిత్రురాలు 'హరిప్రియ' వస్తూనే అడిగిన ప్రశ్న 'భారతీ, స్నేహమంటే ఏమిటీ'?

అంతరంగమున అదో ఆత్మీయస్పర్శ, హృదయాన్ని తాకే ఆనందవీచిక, అపురూపమైనది, అమృతతుల్యమైనది, మదిని మురిపించే, మరిపించే మధురభావన. అంతా తానై లోలోన ఆత్మీయంగా కదిలాడే ఆ అవాజ్యనురాగభావం అనిర్వచనీయం. ఎంతచెప్పినా తక్కువే అయ్యేటటువంటి ఆ అద్భుతబంధంగురించి ఏమని చెప్పగలను... అందుకే  దానిని ఆస్వాదించగలనే తప్ప, వ్యక్తం చేయలేనురా అన్నదే నా ప్రత్యుత్తరం మయింది. అప్పుడు చూశా... తన కళ్ళలో కన్నీరు. ఏమైందిరా అని అనునయంగా అడగగా అడగగా ...
ఎంతో ఆధ్యాత్మిక అవగాహన, వాక్పటిమ, మంచిమనస్సున్న తన సత్సంగమిత్రురాలు ఓ విషయంలో సరైన మార్గంలో వెళ్ళడం లేదని, అందుకే తన శ్రేయస్సును కోరుకుంటూ, ఆ విషయమై వారిస్తూ, తప్పనిసరై పరుషంగా తనతో మాట్లాడానని, దానికై తను నాకు స్నేహమంటే ఏమిటో తెలియదని, స్నేహానికి వున్న విలువను గుర్తించడం నాకు చేతకాదని, ఇకపై నాతో మాట్లాడానని, నా స్నేహమే వద్దనేసింది... అని చెప్పింది.
అందర్నీ అర్ధం చేసుకుంటూ, అందరితో ఆత్మీయంగా మసులుకుంటూ, ఎవ్వరినీ, ఎప్పుడూ నొప్పించని స్వభావం నా ప్రియాకు పెట్టని ఆభరణం. అలాంటిది తనే పరుషంగా, చెలిమిలో స్పర్ధ కలిగేటట్లు మాట్లాడడమా ... ఆశ్చర్యంగా అన్పించి అదే అడిగాను. తన మేలు కోరి, తప్పక కటినంగా మాట్లాడానని అన్నది. స్నేహమనే కాదు, ఏ బంధంలోనయినా కటినంగా మాట్లాడితే ఆ బంధం బలహీనపడదా? అలా ఎందుకు చేశావమ్మా ... అని అడగగా, గతంలో సరళంగా చెప్తే తను విన్పించుకోలేదు, కాబట్టి కాస్త కరుకుగ్గా చెప్పాను, ఏం ... నీవు కూడా నాకు స్నేహం తెలియదని, స్నేహధర్మాలు తెలియవని, తప్పు చేశానని అంటావా అని అంటుంటే ...
లేదు నాన్న, నిజమైన స్నేహం అమ్మలా లాలిస్తుంది, ప్రేమిస్తుంది. నాన్నలా ఆదరిస్తుంది, రక్షిస్తుంది. గురువులా బోధిస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. ఈ మువ్వురిలా తప్పుచేస్తే శ్రేయస్సు కోరి దండిస్తుంది. నీవు తన హితాన్ని కోరి ఇలా చేశావని తప్పక తను గ్రహించి, మరల నీదరి చేరుతుంది. బాధపడకురా, తాత్కాలిక మనస్పర్ధలు ఎదురైనా ఉత్తమమైత్రి బలపడుతూనే వుంటుందిరా...  అని నేననగా, తను నన్ను అర్ధంచేసుకున్నా, లేకున్నా; నాతో మాట్లాడినా, మాట్లాడకపోయినా ... పర్వాలేదు భారతీ, నేను కోరుకున్న మంచి తనకి జరిగితే చాలు అని అంటున్నా ప్రియను చూస్తూ మనస్సులో ఇలా అనుకున్నా ... "ఎవరుంటారు మిత్రుల కంటే శ్రేయోభిలాషులు".

ప్చ్ ... తనను తననుగా గుర్తించి, అభిమానించి, ఆత్మసములుగా భావించి, ఆత్మీయంగా స్వీకరించే స్నేహితులుతో చిరు బేదాభిప్రాయం వచ్చిందనో, పరుషంగా మాట్లాడిందనో ఆ స్నేహంను వదులుకునే ముందు నన్ను నన్నుగా అభిమానించే ఫ్రెండ్ ఎందుకు అలా మాట్లాడిందో అవగాహన చేసుకోవడం మిత్రధర్మం.

కృష్ణ కుచేలల మైత్రి, రామసుగ్రీవుల మైత్రి చిరస్మరణీయాలు. ఒక్కసారి వారి వారి స్నేహాలను గమనిస్తే, మిత్రులు ఎలావుండాలో. మిత్రధర్మాలు, మిత్రలక్షణాలు అవగతమౌతాయి.
ఉదాహరణకు రామ సుగ్రీవ మైత్రిని పరిశీలిద్దాం -
వాలిని సంహరించి, తన మిత్రుని కష్టాన్ని తొలగించి వానరరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. కొన్ని నెలల అనంతరం (వానాకాలం ముగిశాక) సీతాన్వేషణ జరిపి, ఆమెను సంపాదించడంలో నీవు చేసే ప్రయత్నంలో సహకరిస్తానని మాట ఇచ్చిన సుగ్రీవుడు ఆ మాట మరిచాడు. తన మిత్రుడు మాట తప్పాడని నింద పడకూడదని, తన వాగ్ధానమును తనకి గుర్తుచేయాలని భావించి, లక్ష్మణుని పంపి సుగ్రీవుణ్ణి హెచ్చరించాల్సివచ్చింది. ఎంతటి ఉదాత్తమైన ఆలోచనిది.
వానరులంతా సేతునిర్మాణం చేసుకొన్నా మొదటి రాత్రి, వానరులతో కలిసి ఒక ఎత్తైన పర్వతం ఎక్కిన రాముడు లంకానగరపు నిర్మాణక్రమాన్ని గమనిస్తుండగా, అదే సమయంలో లంకానగరంలో ఓ ఎత్తైన మేడపై తిరుగుతున్నా రావణుని గమనించిన సుగ్రీవుడు, నా మిత్రునికి ఇంత కష్టాన్ని కలిగించినది ఈ రాక్షషుడే అని అనుకుంటూ, తన శక్తియుక్తులను మరిచి, ఒక్క ఉదుటన ఆకాశంలోకి ఎగిరి, రావణుని పై దూకి, పిడిగుద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసి, తిరిగి రక్తసిక్తమైన దేహంతో ఎగశ్వసతో రాముని ముందు వాలగా, సుగ్రీవుడు చేసిన పనికి నొచ్చుకొని, నీవు మా అందరికీ నేతవు... నేత తలతో సమానం, తలపోతే మిగతా శరీరానికి ఏం విలివ? 'సుగ్రీవా! నీకు ఏమైనా అయితే, నాకు సీతతో ఏం పనయ్యా' అని అంటాడు రాముడు. పైగా, నీకు ఏమైనా అయితే, నీ మాట నిజం చేయటం కోసం రావణున్ని చంపి, సీతను విడిపించి, అయోధ్యకు చేర్చి, వానరులందరినీ కిష్కింధకు చేర్చి, ప్రాయోపవేశంలో మిత్రువైన నిన్నే తలచుకుంటూ వదిలేద్దాం అనుకున్నాను అని అంటాడు రాముడు. ఎంతటి అవాజ్యనురాగమిది.

జీవితంలో ఎందఱో తారసపడుతుంటారు. అందులో కొందరు మంచి పరిచయస్థులుగా వుంటారు. అతికొద్దిమంది అతి తక్కువ సమయంలోనే స్నేహితులుగా, ఆత్మసములై అల్లుకుపోతారు. శరీరాలు రెండయినా, ఏకాత్మభావనతో ఒకటిగా వుండటం నిజమైన మైత్రి.

నిజమైన మైత్రి, తన మిత్రులు సరైన మార్గం తప్పితే వెంటనే హెచ్చరిస్తుంది. అపార్ధం చేసుకున్నా, తిట్టినా, చివరికి దూరం చేసినా వారి శ్రేయస్సును కోరి మంచినే చేస్తుంది, చెప్తుంది. చిరు భేదాభిప్రాయాలు వచ్చాయనో, పరుషంగా మాట్లాడారనో అపార్ధం చేసుకోకుండా, అవగాహన చేసుకుంటూ, అర్ధంకాకుంటే ఎందుకలా మాట్లాడావని తననే అడిగి తెలుసుకోవడం ఉత్తమగుణం.

పాపా న్నివారయతి యోజయతే హితాయ
గుహ్యంచ గూహతి గుణాన్ ప్రకటీ కరోతి
అపద్గతంచ న జహాతి దదాతి కాలే
సన్మిత్ర లక్షణ మిదం ప్రవదంతి సంతః
సన్మిత్రులు తమ స్నేహితులను చెడుపనులనుండి వారిస్తారు. మంచి పనులు చేయుటకు ప్రోత్సహిస్తారు. రహస్యాలను గోప్యంగా వుంచుతారు. స్నేహితుల సద్గుణాలను ప్రకటిస్తారు. ఆపదవచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోక, ఆదుకుంటారు. సమయం వచ్చినప్పుడు అవసరమైన వాటిని సమకూర్చుతారు.

కరా వివ శరీరస్య నేత్రయోరివ పక్ష్మణీ / అవిచార్య ప్రియం కుర్యాత్ తన్మిత్రం మిత్రముచ్యతే... శరీరానికి చేతులవలె, కళ్ళకు రెప్పలవలె అప్రయత్నంగా అనుకోకుండా, అలవోకగా మంచిచేసే మిత్రులే మిత్రులు.
సుహృదం హితకామానాం యం: శృణోతి న భాషితం ... మన మేలు కోరేవారే నిజమైన మిత్రులు. అట్టి మిత్రుల మాటలను వినాలి.

మైత్రీ సమానుశీలేషు ... సమానశీలం కలిగిన వారియందు మైత్రిభావం అధికం. వారి అనుభూతులు, ఆలోచనలు, స్పందనలు ఒకేలా వుంటాయి. వారి హృదయాలు ...  ప్రతీక్షణం సంభాషించుకుంటాయి, మనకోసం మనకై వున్నారో ఆత్మీయ వ్యక్తి అన్న మధురభావనతో అనిర్వచనీయ ఆనందంను పొందుతుంటాయి. ఓ అనియంత్రణశక్తి ఏదో కలిపి వుంచుతుందన్న అనుభూతి. అయితే, స్నేహితుల స్వభావాల రీత్యా అప్పుడప్పుడు వారి వారి అభిప్రాయలు నప్పనూ వచ్చు, నప్పకపోవచ్చు. అప్పుడే విభేదించక సరికానివి సరిచేసుకుంటూ, సరైనమార్గంలో సాగిపోవడమే సన్మిత్రుల లక్షణం.

స్నేహితుడంటే ... నవమాసాలూ మోయని తల్లి, రక్తం పంచిన తండ్రి, బెత్తం పట్టుకోని గురువు, చుట్టరికం లేని బంధువు, అక్షరాలకతీతమైన పుస్తకం. ఇంకా యింకా ... స్నేహం గురించి చెప్పడానికి ఎన్ని ఉపమానాలైన తక్కువే. ఆ అనుబంధం అన్ని బందాలకన్నా బెత్తుడు ఎక్కువే ... అని స్నేహ రసజ్ఞులు అంటుంటారు.
యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం ... మిత్ర ముండె నేని సిద్ధౌషదం అక్కరలేదన్నది భర్తృహరి సుభాషితం.


మరి ఇటువంటిస్నేహాన్ని జీవితాంతం నిలుపుకోవడం ఎంతో ఉత్తమోత్తమం కాదా?
                                          మిత్రమా!
నీతోనే వుంటాను, నీలోనే వుంటాను ... కడదాక... కాదు కాదు మరుజన్మలో కూడా! 
                                                                                                               



12, అక్టోబర్ 2015, సోమవారం

ఆధ్యాత్మిక అభిరుచి గల బ్లాగర్స్ అందరికీ ఓ అభ్యర్ధన ...

                                                                


నాకు రామాంజనేయులంటే అమిత ఆరాధన. ఆధ్యాత్మికతను అర్ధం చేసుకుంటూ, అటు పయనించాలనే అభిలాష. 
ఆధ్యాత్మిక విషయాలు పఠన, శ్రవణముల ద్వారా తెలుసుకున్నవి మర్చిపోకుండా, మననం చేసుకోవడానికి వీలుగా వుంటుందని, మంచివిషయాలు నలుగురితో పంచుకోవడం కూడా అవుతుందని, వాటిని "స్మరణ"లో పదిలపరుస్తున్నాను.

ఈ మధ్య నా అవగాహన మేరకు చక్రాలు గురించి వివరణను పెట్టాను. అయితే, అనాహత చక్రం గురించి టపా పెట్టాక, ఒకరు వ్యాఖ్యకు బదులిచ్చాను గానీ, ఆ సందేహం నన్ను తొలుస్తుంది. దయజేసి ముందుగా ఆ లింక్ ను ఇక్కడ చూడండి.

అనాహతచక్రమునకు అధిదేవత లలితా సహస్ర నామముల యందు ఇలా తెలపబడింది.
అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా
దంష్ట్రోజ్జ్వలాక్షమాలాదిధరా రుధిరసంస్ధితా
కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా
మహావీరేంద్రవరదా రాకిన్యంబా స్వరూపిణీ.

ఈ విధంగా చూస్తే ఈ చక్రంనకు అధిదేవత 'రాకిని' గా తెలుస్తుంది. 
అయితే ఓ సత్సంగ మిత్రురాలు ఈ చక్రమునకు అధిదేవత 'కాకిని' అని చెప్తూ, కొన్ని పుస్తకములు ఇచ్చారు. అందులో అధిదేవత 'కాకిని' అనే వివరణే ఉంది. అటుపై కొందరు పెద్దలను అడిగాను. 'రాకిని' కదండీ అని వారిని నేనడిగితే, అన్ని పేర్లూ అమ్మవేనమ్మా, కానీ, అనాహత చక్రమందు యున్న పరాదేవత "కాకిని" అని చెప్తూ, వారు కూడా ఆ టపాకు వచ్చిన వ్యాఖ్యకు నేనిచ్చిన జవాబునే వివరణగా తెలిపారు. కానీ, ఎందుకో ఏదో అశాంతి. లలితలో వున్నది తప్పని అనగలమా? అమ్మో! ఈ భావనే నన్ను వణికిస్తుంది. మనసంతా వేదనమయంగా వుంది. 
ఇక, నేను చదివిన, విన్న వాటిని తప్పని అనుకోవడమా?  ఏమిటో అంతా అయోమయంగా ఉంది. ఆవేదనగా ఉంది.  

ఎక్కడో ఏదో నాలోనే తప్పుందనిపిస్తుంది. ఏమరుపాటుతో వినడమో, చదవడమో, అవగాహనాలోపమో ఏదో పొరపాటు నాలోనే వుంది. అది ఏమిటన్నది గ్రహించలేకపోతున్నాను.  అప్పటినుండి నాలో తెలియని అపరాధభావన. సరైనది ఏమిటో తెలుసుకోవాలన్న తపన. ఆ తపనతో  ఆర్తిగా మీ ముందుకు వచ్చి అభ్యర్ధిస్తున్నాను. దయజేసి మీ  సమాధానంను వివరంగా తెలిపి నాకు సరైన అవగాహనను కల్పించి, సరైన మార్గంలో నేను పయనించడానికి సహకరించవలసిందిగా మీ అందర్నీ ప్రార్దిస్తున్నాను. 

6, అక్టోబర్ 2015, మంగళవారం

"పంచభూతాలు"సాక్షిగా...

ఈ మధ్య నాకో సందేహం వచ్చింది, "పంచభూతాలు"సాక్షిగా అని ఎందుకంటారని?

న్యాయస్థానాలు 'భగవంతుని సాక్షిగా' అని భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. అగోచరుడయిన భగవంతునికి ప్రతినిధిగా, తనచే చెప్పబడిన గీతను భగవత్ స్వరూపంగా భావిస్తూ ప్రమాణం చేయిస్తారని ఎక్కడో విన్నట్లు జ్ఞాపకం.  ఈ రీతిలోనే భగవంతునిచే సృజింపబడిన పంచభూతాలను భగవత్ స్వరూపంగా భావించి అలా అంటారా??? మరికొంత వివరణగా తెలుసుకోవాలనిపించి, కొందరు బ్లాగ్ మిత్రులను ఈ ప్రశ్నను అడగగా -
వారు వారి అభిప్రాయాలను తెలిపారు. వారి అమూల్య అభిప్రాయాలను  స్మరణలో పదిలపరుచుకునే ముందు, ముందుగా అసలు  ఈ పంచభూతాలు అంటే ఏమిటీ?  వాటి  ప్రాముఖ్యత ఏమిటీ ... అన్నది నేను చదివిన, విన్నదానిబట్టి నాకు తెలిసినది నా అవగాహన మేరకు ఒకింత వివరణ -

పంచభూతాలు :- పృథ్వి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం.
నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, శక్తిమంతుడు, చైతన్యుడు, అతీంద్రియుడు, సర్వాతీతుడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి, పరబ్రహ్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ ... అని మనం పిలిచే కొలిచే భగవంతుడు నుండే ఈ పంచభూతాలు ఓ క్రమపద్ధతిలో ఉత్పన్నాలైనాయి. ముందుగా శబ్దమయమైన ఆకాశం పుట్టగా, దాని నుండి స్పర్శతత్వం గలవాయువు పుట్టింది. ఈ వాయువు నుండి ఘర్షణ చేత రూపం గల అగ్ని పుట్టింది. అగ్ని నుండి రస స్వరూపమైన జలము పుట్టింది. దీని నుండి వాసన కలిగిన పృథ్వి పుట్టింది.
                                                                   
                                           

ఈ చరాచర విశ్వాలన్నీ పంచభూతాల జనితమే.
ఈ సృష్టి యావత్తు పంచభూతాల సంయోగమే.

సృష్టికి ఆధారమైన పంచభూతములు మనలోనూ ఉన్నాయి. ఈ పంచభూతాల సమ్మిళిత స్వరూపమే దేహం. ఇక ఈ దేహమును చైతన్యవంతం చేయుటకు జీవశక్తి అవసరం. ఆ జీవశక్తి కూడా ఈ పంచభూతాల సమ్మిళితమే.

మన స్థూల దేహంలోని పంచభూతముల అమరిక ఇలా వుంటుంది -

పృథ్వి :- 
వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనబడు కర్మేంద్రియాలు పృథ్విభూతంచే ఏర్పడెను. దీని గుణం గంధం /వాసన.  

అగ్ని :- 
శరీరంలో జఠరాగ్ని రూపంలో వున్నది. చర్మం, ముక్కు, కన్నులు, చెవులు, నాలుక అనబడు జ్ఞానేంద్రియములు అగ్నిభూతంచే ఏర్పడినవి. దీని గుణం రూపం. 

జలం :- 
రక్తరూపంలో యున్నది. శబ్ధం, స్పర్శ, రూపం, రసం, గంధం పంచతన్మాత్రలు జలభూతంచే ఏర్పడెను. దీని గుణం రసం.  

వాయువు :- 
శరీరంలో ప్రాణ రూపంలో ఉన్నది. పంచప్రాణములు (ప్రాణం, ఆపానం, వ్యానం, ఉదానం, సమానం) వాయుభూతంచే ఏర్పడెను. దీని గుణం స్పర్శ. 

ఆకాశం :- 
అంతఃకరణమై యున్నది. మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారములతో కూడిన ఈ అంతరింద్రియం 
ఆకాశభూతంచే ఏర్పడెను. దీని గుణం శబ్ధం. 

ఇక సూక్ష్మ దేహంలో పంచభూతాల అమరిక -  

మనలో పంచకోశాలు వున్నాయి మొదటిది అన్నమయకోశం. ఇది భూతత్వం నకు సంబంధించినది. రెండవది జలతత్వంతో కూడిన ప్రాణమయకోశం. మూడవది అగ్నితత్వంనకు సంబంధించిన మనోమయకోశం. నాల్గవది వాయుతత్వంనకు చెందిన విజ్ఞానమయకోశం. ఐదవది ఆకాశతత్వంనకు చెందిన ఆనందమయకోశం. ఈ ఐదు కోశాల మధ్య పరబ్రహ్మతత్వమైన ఆత్మ యున్నది. 

అలానే పంచభూతాలకు ప్రతీకలుగా మనలో ఐదు శక్తి నాడీకేంద్రములున్నాయి. ఇవే శక్తి చక్రాలు.  అవి భూతత్వంనకు చెందిన మూలాధారం, జలతత్వానికి చెందిన స్వాధిష్టానం, 
 అగ్నితత్త్వానికి ప్రతీకగా మణిపూరకచక్రం, వాయువుకు ప్రతీకగా అనాహతం, ఆకాశతత్త్వానికి ప్రతీకగా విశుద్ధిచక్రం. {ఆజ్ఞా, సహస్రారాలు తత్త్వాతీత చక్రాలు}. మన నడవడిక, అలవాట్లు, ఆలోచనలు, సంస్కారాలు, ప్రారబ్ధ వాసనలు బట్టి ప్రభావితమౌతూ ఇవి పనిచేస్తుంటాయి. 

ఇక "పంచభూతాల సాక్షిగా" అని ఎందుకంటారన్న నా ప్రశ్నకు నా మిత్రులిచ్చిన వివరణ - 


సరళ స్వభావి, మృదుభాషిణి, 'నా ప్రియనెచ్చలి' విశాలాక్షి గారు (వనితావని వేదిక  బ్లాగర్) వివరణ -

భారతిగారూ! నాకు మంచి పరీక్షే పెట్టారు. అయినా చూద్దాం. నేను రాసింది మీకు సమ్మతమో, కాదో....
పంచభూతాలు:-- పృధివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం...
పంచ ప్రాణాలు :__ ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము...

వసుదేవత- వసువులంటే ప్రాణులు నివసింప యోగ్యమైనవి. భూమి మనకు నివాస యోగ్యము.
మృగాలకు, పశుపక్ష్యాదులకు,క్రిమికీటకాదులకు ఈ భూమే నివాసం. అన్నింటికి ఆశ్రయమిచ్చే ఈ పృధివి దేవత మనం తినే ఆహార పదార్ధాలు - ధాన్యాలు,పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, సుగంధంతో పరిమళాలు వెదజల్లే పుష్పాలు ఇవన్నీ భూమి ద్వారా లభ్యమవుతాయి. ఇవేకాక విలువైన ఖనిజాలు,లోహాలు, సువర్ణము, రత్నాలు, వజ్రాలు మొదలైన విశేషమైన ధాతువులు మనకు భూమి నుండే లభిస్తాయి.

జలదేవత:-- మన జీవనానికి నీరు చాలా అవసరం. నీరు లేకుంటే సమస్త ప్రాణులు నిర్జీవంగా ఉంటాయి. నీరు లేకపోతే వృక్షసంపద క్షీణించిపోతుంది. ఎన్నో ప్రాణులు నీటిలోనే నివసిస్తాయి.అందుకే జలం దేవత. 

 వాయుదేవత:-- గాలి లేనిదే సృష్టిలో ఏ ప్రాణి కొన్ని నిమిషాల కంటే ఎక్కువకాలం జీవించలేదు. మనం  తీసుకున్న ఆహారం జీర్ణమవ్వాలంటే జఠరాగ్నికి వాయువు తోడ్పడుతుంది.మన రక్తం శుద్ధి కావాలంటే ప్రాణవాయువు కావాలి. ఈ విశ్వమంతా వివిధరకాల వాయువుతో నిండి వుంది. కేవలం వాయువులో నివసించే ప్రాణులు కూడా కొన్ని ఉన్నాయి. కనుక వాయువు దేవత.

అగ్నిదేవత:-- మన నిత్య జీవితంలో అగ్ని ఎంతో ఉపయోగపడుతుంది. ఆహారపదార్ధాలు తయారుచేయడానికి, చలినుండి ఉపశమనం పొందడానికి, అగ్ని తోడ్పడుతుంది. "అగ్ని సమస్త దేవతలకు ముఖం- నోరు వంటిది. అగ్నిలో వేసిన పదార్ధాలు సూక్ష్మమై గాలిలో కలసి సమస్తప్రాణులకు ఆరోగ్యాన్ని, సుఖశాంతులను కలిగిస్తాయి.భూమ్యాది పంచ భూతాల వలన, సూర్యాది గోళాల వలన మానవులకు అన్న వస్త్రాలు, ప్రకాశం, వేడి మొదలైన జీవన ఉపయుక్త పదార్ధాలు లభిస్తాయి. అందుకే అవి దేవతలు. ఈ దివ్య పధార్ధాలను  ఉపయోగించుకొని, వాడుకొని వాటిని మరల అగ్నిలో పవిత్రం చేయాల్సిన బాధ్యత మానవులకే ఉంది.అగ్నిలో నేయి, ఓషదులు ఆహుతిగా ఇవ్వడం వలన అపవిత్రమైన వాయు,జలాదులు పరిశుద్ధమై పుష్టికారకమవుతాయి.

ఆకాశదేవత:-- అంటే అవకాశం కల్పించేది. మనం చూసే ఖాళీ ప్రదేశం. దాని ద్వారానే శబ్ద తరంగాలు,ఒకరి నుండి మరొకరికి చేరుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలేవీ లేకపోతే ప్రాణులేవీ జీవించలేవు. అంతరిక్షంలోని గ్రహాలకు గ్రహాలకు మధ్య, గ్రహాలకు ఉపగ్రహాలకు మధ్య, నక్షత్రాలకు నక్షత్రాలకు మధ్య ప్రదేశం ఆకాశం. మానవులు ప్రయోగించే కృత్రిమ ఉపగ్రహాలు 'శాటిలైట్స్ ' అన్నీ అంతరిక్షంలోనే తిరుగుతూ భూమి మీద ఉన్న వార్తలను చిత్రాలను ఒకచోటి నుండి మరొక చోటికి అందిస్తున్నాయి. ఆకాశం లేకపోతే ఇది సాధ్యం కాదు. కనుక ఇది దేవత.

కాబట్టి పంచభూతాల సాక్షిగా.. అంటే దేవతల సాక్షిగా.. మరియు పంచభూతాలే పరమాత్మ..పరమాత్మ సాక్షిగా... సమ్మతమేనా మిత్రమా నా ఈ వివరణ. 

స్పూర్తిమయి, సద్గుణ సంపన్నమయి, సాహిత్య ప్రజ్ఞామయి, 'నా స్నేహమయి' వనజ గారు (వనజవనమాలి  బ్లాగర్) వివరణ - 

భారతి గారు ... 
పంచభూతాలు ... ఆకాశం భూమి వాయువు ,నీరు,  అగ్ని  ఈ సమస్త సృష్టి అంతా వీటితోనే నిర్మితమై ఉంటుంది .. పదునాలుగు లోకాలన్నీ కూడా !  మనం ఏ క్రియ నిర్వహించినా  వీటి సాక్ష్యం ఉంది తీరుతుంది.  అందుకే పంచ భూతాలూ సాక్షిగా అంటారని అనుకుంటున్నాను . శివుడుకు  పంచ ముఖాలు... ఆద్యంతాలు లేనివాడు సమస్త జగత్ ని తనలో నిమ్పుకున్నవాడు ఆది పురుషుడు శివుడు కాబట్టి ఆయన ఈ పంచ భూతాలని అయిదు ముఖాలు చేసుకున్నాడని ఎక్కడో చదివాను . నాకు తెలిసింది ఇదేభారతీ గారు .

స్నేహశీలి, శ్రేయోభిలాషి, సహృదయులు ' నా ఆత్మీయ నేస్తం' రుక్మిణీదేవి గారు ( భారతీయం బ్లాగర్) వివరణ - 

భారతి గారు!
సమస్త ప్రాణికోటి జీవనాధారములైన పృథ్వి, అగ్ని, జలము ,వాయువు , ఆకాశము - పంచ భూతములుగా పేర్కొనబడినవి .. వీటిలో ఎ ఒక్కటి లేకపోయినా జీవి మనుగడ దుర్లభం ..అందుకే సమస్త ప్రాణికోటి అని అనేకన్నా పంచభూతముల సాక్షిగా అని చెప్పబడి వుంటుంది అని నా వుద్దేశ్యం .

ముగ్గురు మిత్రుల అమూల్య వివరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. 

బహుశా అందుకేనేమో ... మన పూజా పద్ధతిలో- గంధంతో అర్చించుట, నామోచ్చరణతో పువ్వులను అర్పించుట, ధూప దీపారాధనలతో ఆరాదించుట, నైవేద్యం సమర్పించుట అనే పంచోపచారాలు ప్రధానమైనవిగా పేర్కొంటారు, ఈ ఐదు ఉపచారములలో పంచభూతములు ప్రతిబింబిస్తున్నాయి. పసుపు కుంకుమాది గంధాలు భూమికి, నామమంత్రోచ్చరణలతో పుష్పాలు ఆకాశానికి, ధూపం వాయువుకు, దీపం అగ్నికి, తీర్ధ నైవేద్యాలు నీటికి సంకేతకాలు. ఇట్లా పంచభూతాలను భగవత్ స్వరూపములుగా గుర్తించి ఆరాదించే పద్ధతిని పెద్దలు ప్రవేశపెట్టారనుకుంటాను .