అంతర్ముఖత్వమే లక్ష్యం. ఆత్మవిచారణే గమనం, ఆత్మసాక్షాత్కారమే పరమగమ్యం. (శ్రీ రమణమహర్షి)
జీవితం
వేల సంవత్సరాల కాల పయనంలో దుమ్ము, ధూళి ఎంతో పోగుచేసుకుంది. ఆ ధూళి, దూసర
కణాలు కొండలుగా పేరుకుపోయాయి. ఆ పర్వతం పేరు 'నేను' అనబడే మనస్సు. గతంలో
వేల సంవత్సరాలుగా పేరుకుపోయిన ఈ మట్టి దిబ్బల బరువు మోయలేక జీవశక్తి
కలవరపడుతుంది. ఆ బరువు నుండి, గతం నుండి స్వేచ్ఛ పొందడం మన జీవితానికి
విముక్తి. పవిత్రత. జీవి స్వతంత్రం కావడమే జీవన లక్ష్యం. (శ్రీ దాదా)
మానవుని
అంతరంగంలో దివ్యత్వం ఉంది. సచ్చిదానందం యొక్క నిప్పురవ్వ ఉంది. దైవశక్తి
నిగూఢముగా ఉంది. దివ్యత్వం పట్ల దృఢవిశ్వాసంతో వ్యవహరిస్తే లక్ష్యాన్ని
సాధించగలవు. గమ్యాన్ని చేరగలవు. (నాన్నగారు)
అయితే
అందరికీ ముక్తి మాత్రమే లక్ష్యం కాకపోవచ్చు. వారివారి అభిమతం మేరకు వేరు
వేరు లక్ష్యాలు ఉండవచ్చు. ఎవరి లక్ష్యం వారికున్నను లక్ష్యగమనం సరిగ్గా
సాగించినవారే గమ్యంను చేరుకుంటారు.
మానవదేహం
ఓ అద్భుతమైన యంత్రం. అందులో అనంతమైన శక్తి ఉంది. మనం మన శారీరక, మానసిక
శక్తులలో చాలా కొద్దిభాగాన్నే ఉపయోగించుకుంటున్నాం. మనలో నిద్రాణమై ఉన్న
పూర్ణశక్తిని జాగృతం చేయాలంటే మనకొక ప్రణాళికబద్ధమైన 'లక్ష్యం' ఉండాలి.
లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావలాగా గమ్యం లేకుండా సాగిపోతుంది.
పుట్టాం, మరణించాం - అంతే తప్ప మానవజన్మ సార్ధకత ఏమీ ఉండదు. అందుకే ప్రతీ
మనిషికి నిర్ధిష్టమైన, స్పష్టమైన లక్ష్యం కావాలి. ఒక చిన్న తాత్కాలిక
అశాశ్వత ఆకాంక్ష అనేది లక్ష్యం కాదు. ఓ విశిష్టమైన, ఉన్నతమైన లక్ష్యంను
ఏర్పరుచుకొని, దానిని సాధించాలన్న సంకల్పం చేసుకోవాలి. మన మానసికశక్తిని
సంపూర్ణంగా ఈ లక్ష్యదిశలో ఉపయోగించి కార్యోన్ముఖులం కావాలి.
గతంలో
ఆ లక్ష్యదిశలో ముందడుగు వేసి విజయం సాధించినవార్ని మార్గదర్శులుగా
తీసుకొని, వారి జీవన గమనంను అధ్యయనం చేసి స్ఫూర్తితో మన గమనం సాగించాలి.
అన్నీ
అనుకూలించినవారికి, గొప్పస్థితిలో ఉన్నవారికి, దైవానుగ్రహం ఉన్నవారికి
మాత్రమే లక్ష్యసిద్ధి కలుగుతుందని, దేనికైనా పెట్టిపుట్టాలని, ప్రారబ్ధంలో
ఉండాలని కొందరు వ్యాఖ్యానిస్తారు. కానీ లక్ష్యం సాధించిన గొప్పవారంతా తమ
జీవిత ప్రారంభదశలోనే గొప్పవారు కాలేదు. సరైన మార్గంలో పాదం మోపి, సరైన
గమనంతో ముందంజు వేస్తూ, సరైన మార్గదర్శుకుల సమక్షంలో అన్నీ నేర్చుకుంటూ,
నేర్చుకున్నది ఆ దిశలో పయనిస్తున్నవారికి నేర్పుతూ, పట్టువదలని అవిశ్రాంత
పరిశ్రమతో సాధన చేస్తూ, ఉన్నతస్థానంకు చేరి గొప్పవారైరి. వారు ఈ స్థితికి
చేరుకోవడానికి ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ, తదేక నిశ్చల ధ్యాసతో కొన్ని
ఏళ్ల సాధన చేసారన్న విషయాన్ని ముందుగా గుర్తించాలి. వారు పడిన శ్రమ,
ఎదుర్కొన్న కష్టాలు, అధిగమించిన తీరు అన్నింటినీ అవగాహన చేసుకోవాలి.
ప్రయత్నంలో అశ్రద్ధ పనికి రాదు. ఏదో ప్రయత్నం చేస్తున్నాం, మా ప్రారబ్ధం
బాగాలేదు అని అనుకోకూడదు. ప్రారబ్ధం దేహానికే, ప్రయత్నానికి కాదు.
పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా ప్రయత్నం ఆపక లక్ష్యగమనం
సరిగ్గా సాగించగలిగినప్పుడే గమ్యం చేరుకోగలం. 'చేతిలో పనిని శ్రద్ధగా
చేయండి, ప్రేమగా చేయండి, నిష్కామంగా చేయండి, నిండు మనస్సుతో అంకితభావంతో
చేయండి. అదే కర్మయోగం. అదే గీతోపదేశం. అదే గమ్యానికి చేర్చే విజయపధం'.
లక్ష్య
సాధనలో ఎన్నో కష్టాలు, గమనమార్గంలో అపజయాలు, అవరోధాలు సహజం.
అటువంటిస్థితిలో ఆత్మస్థైర్యంతో అడుగులు వేయాలి. సీతాదేవి, శ్రీరాముడు
లాంటి అవతారపురుషులకే కష్టాలు తప్పలేదు. భగవంతుడే ప్రక్కనున్న పాండవులుకు
కష్టాలు తప్పలేదు. సత్యహరిచంద్రుడు, భక్తరామదాసు లాంటి మహనీయులు
కష్టపరీక్షలు ఎదుర్కోలేదా? వారి ముందు సామాన్య మానవుడెంత? బాధ, దుఃఖం,
కష్టం ... ఇవన్నీ జీవితానికి కావాల్సిన శిక్షణను ప్రసాదించి తరలిపోతాయి.
ఇవి స్థిరమైనవి కావు. గెలుపుబాటలో ఓటమి ఒక సోపానంగా పనిచేస్తుంది. రాత్రి
గడిచి ఉదయం రాక తప్పదు. గమ్యానికి హఠాత్తుగా చేరుకోలేం, అవిశ్రాంత కృషివలనే
చేరుకోగలం.
అణగదొక్కివేసే
పరిస్థితుల మద్యలో వికసించి పెంపొందడమే విజయవంతమైన జీవితం. నిజమైన
గొప్పతనం పైకి లేవడంలో లేదు, పడిన ప్రతీసారి పైకి దైర్యంగా లేవడంలోనే ఉంది.
మన ధైర్యం, బలమే జీవనం, అధైర్యం, బలహీనతలే మరణం. (వివేకానంద)
ఉత్సాహ పూర్ణ ప్రయత్నంతో సక్రమైన పద్ధతిలో సాధన చేస్తే లభించనిదంటూ ఏదీ ఈ జగత్తులో లేదు.(యోగవాసిష్టం)
ప్రయత్నంలో
పొరపాట్లు మానవునికి సహజమే. పొరపాట్లుకు, పరాజయాలకు కృంగిపోకుండా అందుకు
కారణం ఏమిటో తెలుసుకొని ఓరిమితో నిజాయితితో ప్రయత్నం కొనసాగించాలి.
పట్టువదలని సాధనయే సత్ఫలితాన్ని ఇస్తుంది. చేయాల్సిన పనులు వాయిదా వేస్తూ,
చివరిసమయంలో తొందరపడడం తగదు. నియమిత సమయంలో నిర్ధిష్టమైన పనిని చేయడమే కళ.
మన లక్ష్య సాధనలో దృఢనిష్ఠ అవసరం. అంటే లక్ష్యసిద్ధికై మనం రూపొంచుకున్న
నియమాలను నిత్యం నియమితరీతిలో పాటించడమే నిష్ఠ. గడిచిన ఈ దినం వెనక్కి
రాదన్న వాస్తవాన్ని గుర్తించి, భూతభవిష్యాల చింతన మరచి ఈ క్షణంలో
ధీరోదత్తంగా యశశ్శాలిగా పనిచేయాలి. ఏ పరిస్థితిలోనైన విద్య, వివేకం,
విశ్వాసం, కష్టపడేతత్వం, నిజాయితీ, నిర్భీతి, చురుకుదనం, వ్యక్తిత్వవికాసం,
క్రమశిక్షణ విడిచిపెట్టరాదు. ప్రతీ చిన్నపనిని శ్రద్ధగా చేయాలి.
చిన్నపనే కదా అన్న అలసత్వం పనికిరాదు. దేనియందు ఉదాసీనత తగదు. గొప్ప
పనులన్నీ చిన్నపనుల సముదాయమే. వేయి మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే
ప్రారంభమౌతుంది. వేలాది పుటల గ్రంధమైన ఒక్క అక్షరంతోనే ప్రారంభమౌతుంది. మనం
చేసే పనే మన వ్యక్తిత్వానికి సాక్షి.
ధీరులైనవారు
అసాధ్యమైన అవరోధాలను ఎదుర్కొని ధైర్యంగా నిరంతర పరిశ్రమతోనూ, అపారమైన
ఆత్మవిశ్వాసంతోనూ, అనంతమైన సహనంతోనూ, అన్నింటిని అధిగమించి శ్రేయశిఖరాన్ని
అధిరోహిస్తారు.
మన
లక్ష్యాన్ని సంకల్పించుకొని, అందుకుతగ్గ ప్రణాళికను రూపొందించుకొని,
దానిని సాధించాలనే తీవ్రమైన తపన మనకుంటే మన ప్రగతికి మనమే శిల్పులం.