భారతీ గారు, మీరు భక్తితో రామ నామస్మరణం ఎందుకు అలవర్చుకున్నారోనన్న మాటలు వింటుంటే -
అంతకాలే చ మావేవ స్మరన్ ముక్త్వా కలేబరమ్|యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః||
మరణసమయంలో ఎవరైతే నన్నే స్మరించుచు దేహమును వీడుదురో వారు నన్నే చేరుదురు. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరమ్|
తం తమేవైతి కౌంతేయః సదా తద్భావభావితః||
ఓ కుంతీపుత్రా! ఎవరేయే భావమును స్మరించుచు తుదకు దేహత్యాగ మొనర్చునో వారు ఆ భావమునే పొందుదురు. అంటే మన ఉత్తరజన్మ మన కట్టకడపటి భావముపై ఆధారపడి ఉంటుందన్నది యదార్థం... అన్న గీతాచార్యుని మాటలతో పాటు ఎక్కడో చదివిన ఓ కథ కూడా గుర్తుకు వస్తుంది.
ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి మరు జన్మకు కారణమవుతాయి.
ఒకసారి ఒక రాజ్య కాపలాదారుడు ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చి, రాజు వద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వుంది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు, ఇందుకు అనుమతించండి” అని వేడుకొనగా, రాజు అందుకు సమ్మతించాడు.
రాత్రి అయింది. ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే తలంపుతో, ఆ రాజు మారువేషంలో చాటుగా మూగవాన్ని గమనిస్తూ బయల్దేరాడు.
అది మొదటి యామం. తప్పెట చేతపుచ్చుకొని ఆ కాపలాదారుని కొడుకు కాపలా కాయసాగాడు, రాజు అతణ్ణి వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు -
కామం క్రోధంచ, లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః
జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః.
(మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని, జ్ఞానమనే రత్నాన్ని అపహరించడానికి పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త)
ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు. 'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. మూగవానిగా నటిస్తున్నాడు. ఇతణ్ణి వెంబడించి, గమనించాలి' అని రాజు భావించాడు.
రెండవ ఝాము వచ్చింది, అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు -
జన్మదుఃఖం జరాదుఃఖం -
జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః
(పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, ఇవి మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త)
ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు, తృతీయ యామం వచ్చింది.
మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః
అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః
(తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు [ఇదంతా మిథ్య అని అర్థం] జాగ్రత్త! జాగ్రత్త) అని చాటాడు.
ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు, అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో నాలుగవ యామం వచ్చింది, అప్పుడు ఆ యువకుడు
ఆశయా బధ్యతే లోకే - కర్మణా బహుచింతయా
ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః
(ఆశాపాశంచేత కట్టుబడి తిరుగుతూ, లోక కర్మల చేత బహుచింతలకు లోనై, ఆయువు క్షీణించడం ఎరుగలేరే... జాగ్రత్త జాగ్రత్త) అని చాటాడు...
ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది, అతడు సాధారణ ఊరి కాపరి కాడు. పవిత్రమైన ఆత్మ గల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి ఇతణ్ణి తన రాజప్రాసాదానికి రప్పించి, అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకొని రాజు తన కోటకు వెళ్ళి పోయాడు.
మర్నాడు ఆ యువకుని తండ్రిని పిలిపించి,
అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగవాడు కాడు. అతడు పూర్వజన్మ జ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు, అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను, నా కోరిక తీర్చమని అతడిని అడుగు... అని. తండ్రి ఆశ్చర్యానందంకు లోనై, తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు. తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతున్నది అర్థం కాక, ఆశ్చర్యపోతున్నాడు.
అప్పుడు ఆ జీవన్ముక్తుడు, “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష విధిస్తారు?” అని అడిగాడు.
అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు.
“అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి. నా చేతులమీద, నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ యువకుడు. ఈ కోరిక విని రాజు అమితాశ్చర్యపోయి, ఇచ్చిన మాట ప్రకారం అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ యువకుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది.
దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించగా,
“ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతున్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి, “ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని, ఇప్పుడు ఎందుచేతనో ఒక దేశం నుండి చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు, ఆ దేశంలో పాపాత్ములే లేరా! లేదా పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది, ఇదే నా విచారానికి కారణం”... అని చెప్పగా, బ్రహ్మకీ ఇది విచిత్రంగా తోచి, అసలు విషయం పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు.
ఇక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు ఈ జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతున్నారు.
ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి ఈ జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతున్నది చూడగా, బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది.
అదేమంటే - మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా, ధూపదీపాలు పెట్టబడినవి, చూసేవారి మనస్సు భక్తి పరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది.
మరణశిక్ష విధింపబడి కొనిరాబడినవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింప చేసి, వారి మనస్సుకు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు. అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, భక్తితో తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి, వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు భక్తి మైకంలో గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.
ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై, ఈ జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు.
"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో
అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు, అని బ్రహ్మ, జ్ఞానిని అడిగాడు.
అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు -
"ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా?నా గత జన్మలో మరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు కలిగిన తలంపుల వలన నాకిలా జన్మించాల్సి వచ్చింది.
భగవానుడు గీతలో 'ఎంతటి క్రూర కర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు. కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను, నా అనుభవం నాకు ఒక పాఠమైనది” అని తెలపగా...
అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి, సత్యలోకం చేరుకొన్నాడు.
మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేదా ముక్తి లభిస్తుంది. సత్ చింతన కాక, వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తున్నది.
నామస్మరణే సులభోపాయం, ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం గాక! కావున మరణ సమయము ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కావున భగవన్నామ స్మరణ నిత్యము అన్ని వేళలలో ఏ పని చేస్తున్నా మానసికముగా అలవర్చుకోవాలని ఎప్పటిలా ప్రియంగా చెప్పింది ప్రియంవద.
జహా జహా చలూ కరూ పరిక్రమా, జో జో కరూ సో సేవా
జబ సోవూ కరూ దండవత్, జానూ దేవ న దూజా
- సంత్ కబీర్
నేను నడిచినప్పుడల్లా భగవంతుని గుడిని ప్రదక్షిణ చేస్తున్నట్టు భావిస్తాను; నేను ఏది చేసినా, అది భగవత్ సేవ గానే భావిస్తాను. నిద్రకు ఉపక్రమించినప్పుడు, నేను భగవంతునుకి ప్రణామం అర్పించినట్టుగా భావన పై ధ్యానం చేస్తాను. ఈ విధంగా, నేను ఎల్లప్పుడూ ఆయనతో ఏకమై ఉంటాను...
సంత్ కబీర్ లా కర్మలను భగవత్ తలపుతో జత చేసే భావన మనలో ధృఢమౌతే ధన్యులమే కదా... కానీ, అంత ధృఢ సంకల్పం లేదే... నిట్టూర్పుతో నెమ్మదిగా అన్నారు నిర్మల గారు.
గత మూడు దశాబ్దాలుగా మీకు నేను తెలుసు. నేను తెలిసి తెలిసీ ఏ తప్పులు చేయలేదు, భగవత్ ఆరాధన మానలేదు. నా జీవితం ఓ సుడిగుండం. అయినా ఈ ఆధ్యాత్మిక చింతన అలవడేకా మునుపటిలా దుఃఖం లేదంది నీరజ.
అసలు ఎందుకీ కష్టాలు? కొందరికి బ్రహ్మరాత ఇలా ఉంటాదేమిటి? ఇది వారి ప్రారబ్దం అంటారు... అసలు ఈ ప్రారబ్ధం ఏమిటి? ఈరోజు చేసిన వంట ఈరోజే తింటున్నాం కదా. అలాగే ఈ జన్మలో చేసిన కర్మల ఫలితాలు ఈ జన్మలోనే అనుభవించేయాలి కదా... మరు జన్మలకు ఎందుకు? హైమ గారి ఈ ప్రశ్నలకు, ఈరోజు వంట ప్రిజ్ లో దాచుకొని దాచుకొని తింటారు కదా, ఈరోజు చేతికి అందిన పంట ఫలాదులను ఈరోజే తినేయరు కదా, గర్భంలో పడిన బిడ్డను వెంటనే కనేయలేరు కదా. దేనికైనా సమయం రావాలి. విత్తనాలు చల్లగానే అవి అంకురించవు. నియమిత కాలంలోనే మొలకెత్తుతాయి కదా! ఈ ఏడాది పండిన ధాన్యం కొన్ని మరుసటి సంవత్సరపు పంటకు కారణమయినట్లే, కొన్ని మన కర్మలు మరుజన్మకు కారణమవుతాయి.
మనం చేసిన సత్కర్మలైనా, దుష్కర్మలైనా కొన్ని వెంటనే ఫలితాన్ని ఇస్తే, కొన్ని కొన్ని వెను వెంటనే తమ ప్రభావాన్ని చూపవు, కాలానుగుణంగా తమ ఫలితాన్ని చూపుతాయి.
ఇక బ్రహ్మ కాదు, మన తలరాతలు మనమే వ్రాసుకుంటాం. కర్మ ఎలా ఉంటుందో ఒక దగ్గర చదివాను. కృష్ణుడు కంసుని సంహరించి, తన తల్లిదండ్రులను కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వెళ్ళాడు. దేవకీమాత కృష్ణుని చూడగానే "నాయనా! నీవే పరమాత్మవి కదా. నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి. ఎందుకు 14 ఏళ్ళు ఆగావు... కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి" అని అడిగింది.
అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు "అమ్మా! నన్ను క్షమించు. నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో? విన్న దేవకి ఆశ్చర్య చకితురాలయింది.
"కృష్ణా ఇదెలా సాధ్యము? ఎందుకిలా అంటున్నావు?" అని అడిగింది. అప్పుడు కృష్ణుడు అమ్మా! గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు. కానీ, గత జన్మలో నీవు " కైకేయివి", నీ భర్త "దశరథుడు".
ఇక ప్రారబ్ధం అంటారా... కర్త, కర్మ, క్రియ మూడూ భగవంతునివే. కానీ; ఈ మూడు మనవే అని మన నెత్తిన వేసుకుని మోయడమే ప్రారబ్దం... ఝాన్సీగారు ఈ వివరణ ఇస్తూ, ఈమధ్య నేనో పాట విన్నాను, చాలా బాగుంది... వినడంటూ పార్వర్డ్ చేసిన వీడియో -
పైన ఉదాహరించిన కథా రచయితలకు హృదయపూర్వక నమస్సులు.
ఈ కబుర్లు కొనసాగుతునే ఉన్నాయి...