మంచి పుస్తకం...
మొదటిసారి చదువుతున్నప్పుడు ఓ ఆత్మీయ నేస్తంలా అన్పిస్తుంది, రెండవసారి చదువుతున్నప్పుడు కొత్త కొత్త జీవితసత్యాల్ని ఆవిష్కరించేదిలా, మరోసారి చదివే టప్పుడు అపారజీవితానుభవమున్న వయోధికుడిలా, మరలా చదివేటప్పుడు ఓ జ్ఞానిలా గోచరిస్తుంది.....
కాసిన్ని కాగితాలు, బోలెడు అక్షరాలు, పలు పదాల కూర్పు మాత్రమే కాదు, జీవితాన్ని వెలిగించే దీపం కూడా.
మంచి పుస్తకం...
ఏ స్థితిలోనూ దూరం కాని నేస్తం. అన్నివేళలా అందుబాటులో ఉండే సలహాదారు. గమ్యం సుగమం చేసే మార్గదర్శి. సుద్దులు చెప్పే అమ్మ. బుద్ధులు నేర్పే నాన్న. జీవనోపాధినిచ్చే అన్నదాత. ఎన్నో వివరించే మానసిక విశ్లేషకుడు. ఔనత్యాన్ని పెంచే వ్యక్తిత్వవికాస నిపుణుడు. అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపే గురువు.
ఒక మంచి పుస్తకం చదవడం పూర్తయితే మనకో మంచి స్నేహితుడు దొరికినట్లే.
ఇలా పఠనాసక్తి ఉన్న పెద్దవారు, పుస్తకప్రియులు మంచి పుస్తకముకై చెప్పే నిర్వచనాలు అనేకం.
* * *
పెద్దబాలశిక్ష, బాల సాహిత్యం, కాల్పనిక కాల్పనికేతర సాహిత్యం, పరిశోధన గ్రంధాలు, పద్య శతకాలు, పాకశాస్త్రాలు, వ్యక్తిత్వ వికాస గ్రంధాలు, అర్ధశాస్త్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు.... ఓహో.... ఎన్నెన్నో పుస్తకాలు... అందరి అభిరుచులకు తగ్గట్లుగా.
సాధారణంగా ఆధ్యాత్మిక సాధకులు వేదాంత గ్రంధ పఠనం చేసినంతకాలం మనస్సు ఉత్సాహంగా తాదాత్య్మముతో దైవ సాన్నిధ్యంలో గడుపుతున్నంత అనుభూతిని పొందుతారు. అయితే అదే అనుభూతితో ఆగిపోకూడదు. ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. అందుకు తగ్గట్టుగా అధ్యయనం, అధ్యయనం చేసింది అవగాహన చేసుకోవడం, అవగాహన చేసుకున్నది ఆచరణలో పెట్టడం ప్రతీ సాధకునికి అవసరం. ఈ అధ్యయన విషయమై మన శాస్త్రాలు, మహర్షులు, ఆధ్యాత్మిక అనుభవిజ్ఞులు... ఏం తెలుపుతున్నారో ఓసారి గమనిద్దాం -
ఇదం జ్ఞానమిదం జ్ఞేయం యస్సర్వం జ్ఞాతు మిచ్ఛతి |
అపి వర్షసహస్రాయుః శాస్త్రాన్తం నాధిగచ్ఛతి || (ఉత్తరగీత)
ఇది జ్ఞానం, ఇది జ్ఞేయం అని శాస్త్రములను చదివి గ్రహించుటకు సాధ్యం కాదు. ఏలననగా వేలకొలది సంవత్సరములు జీవించియుండి శ్రద్ధతో చదివినను శాస్త్రాంతము కనిపించదు.
అదీత్య చతురో వేదా ధర్మ శాస్త్రాణ్యనేకశ: |
బ్రహ్మతత్త్వం న జానాతి దర్వీ పాకరసం యథా ||
నాలుగువేదములు చదివినను, సమస్త ధర్మశాస్త్రములను చూసినను, బ్రహ్మతత్త్వంను తెలుసుకొనక పోయినచో అనేక పక్వాన్నాదులలో తిరిగెడు గరిటె, వాని రుచులు ఎట్లు తెలుసుకొనచాలదో, అట్లే వీరును ఆ గరిటెకు సమానమే.
అనంతశాస్త్రం బహు వేదితవ్యం స్వల్పశ్చ కాలో బహ వశ్చ విఘ్నా: |
యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబుమిశ్రం ||
శాస్తములకు అంతము లేదు, అంతయూ చదువుటకు కాలము లేదు, జీవితం చాల స్వల్పం, దీనిలో అనేక ప్రతిబంధములు కలవు. క్షీరనీరములు కలిసియుండినను హంస నీరమును విడిచి క్షీరమును మాత్రమే గ్రహించినట్లు , సారమైన విషయమును మహాత్ములనుండి గ్రహించి, అనుష్టించి కడతేరుట శ్రేష్టం.
వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా సర్వోన్నత శక్తి లేక ఆత్మ ఒకటి వున్నదని చెప్పేందుకు, దానికి దారి చూపేందుకు మాత్రమే ఉపకరిస్తాయి.
"ఎన్ని భాషలని,ఎన్ని శాస్త్రాలని నేర్చుకుంటారు? వేయిజన్మలెత్తినా అన్ని భాషలూ, అన్ని శాస్త్రాలూ రావు. దేనిని తెలుసుకుంటే సకలమూ తెలుస్తుందో, ఆ ఆత్మ నీ హృదయంలో ఉంది."నేనెవరు" అని ప్రశ్నించుకుంటే మనం ఆత్మ స్వరూపులమౌతాము. అసలు సత్యం నీలోనే వున్నదని అన్ని గ్రంధాలు చెప్తున్నాయి. నీలోనే యున్న ఆ సత్యాన్ని వదిలేసి దాన్ని గ్రంధాలలో వెదుకుట ఏమిటి? నిజమైన గ్రంధం ఆత్మ. ఆ గ్రంధాన్ని చదువు, తెలుసుకో. ఆత్మవిచారణయే సర్వకాలముల యందు చేయదగిన పని. గ్రంధాల అధ్యయనం అన్నది మనల్ని మనం సరి చేసుకొనే దిశలో ఉన్నత మార్గానికి దోహదపడుతుంది..కానీ ఆత్మానుభవం సాధ్యం కాదు.నిన్ను నీవు తెలుసుకో ముందు. పుస్తకం చెప్పేది అదే ..నిన్ను సరిచేసుకొని నన్ను చూడు, నన్ను తాగు అంటుంది. పురాణాలు, వేదశాస్త్రాలు అన్నీ పఠించాను కానీ, ఆత్మజ్ఞానం అంటే ఏమిటొ తెలియదు... అని ఒక పండితుడు అడగగా, జ్ఞానం శాస్త్రాల్లో లేదు. గ్రంధాలు బయట ఉండేవి. జ్ఞానం లోపల ఉండేది. అది తెలిసి ధ్యానించేవారికి ఆత్మజ్ఞానం కలుగుతుంది అని పై రీతిలో వివరించారు, శ్రీ రమణులు.
'జ్ఞానదేవతు కైవల్యమ్' ... ఆత్మజ్ఞానముననే మోక్షము సిద్ధించుచున్నదని శృతి చెప్పుచుండగా, శాస్త్ర జ్ఞానంచే ప్రయోజనం ఏముంది? ... అని అన్పించవచ్చు కానీ,
ద్వే విద్యే వేదితవ్యే తు శబ్దబ్రహ్మ పరం చ యత్ /
శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్ఛతి // (అమృత బిందూపనిషత్తు)
మానవుడు రెండు విద్యలు నేర్చుకొనవలయును. 1. శబ్దబ్రహ్మము 2. పరబ్రహ్మము. శబ్దబ్రహ్మమనగా శాస్త్రము. పరబ్రహ్మమనగా ఆత్మజ్ఞానం. అయితే శబ్దబ్రహ్మమందు నిష్ఠ కలిగినవాడు మాత్రమే పరబ్రహ్మమును పొందగల్గును అని ఉపనిషత్తు బోధించుచున్నది.
మరి ఈ శాస్త్ర అధ్యయనం ఎంతవరకు?
శాస్త్రాణ్వధీత్య మేధావీ అభ్యస్య చ పునః పునః |
పరమం బ్రహ్మ విజ్ఞాయ ఉల్కావత్తాన్యథోత్సృజేత్ || (ఉత్తరగీత)
ప్రజ్ఞావంతుడగువాడు వేదాంతశాస్త్రంను చక్కగా చదివి ఆ శాస్త్రార్ధమును మాటిమాటికి అభ్యసించి పరబ్రహ్మమును సాక్షాత్కరించుకొని, అన్నం ఉడికిన పిమ్మట కొరివికట్టెలను విడుచునట్లు, శాస్త్రములను విడవవచ్చునని కృష్ణభగవానుని వాక్కు.
అన్నము పక్వమగువరకు మంట ఎట్లుండవలెనో అట్లే జ్ఞానవిజ్ఞాన సంపూర్ణత్వం కలుగువరకు శాస్త్రాధ్యయనం తప్పనిసరిగా ఉండవలెను.
గ్రంధమభ్యస్య మేధావీ జ్ఞానవిజ్ఞానతత్పరః
పలాలమివ ధాన్యార్ధీ త్యజేత్ గ్రంధమశేషతః
మేధాసంపత్తి గలవాడు విద్యను బాగుగా అభ్యసించి జ్ఞానమున్ను, విజ్ఞానమున్ను కలిగినపిమ్మట శాస్త్రమును విడువవలయును. కర్షకుడు పైరును పోషించి, పండించి ధాన్యమును తీసుకొని పిమ్మట గడ్డిని త్యజించునేగాని, గడ్డి యుపయోగము లేదని తలంచి మొదటనే త్యజించినచో ధాన్యం దొరకదు గదా.
ధాన్యము నభిలషించు కర్షకులు, తమకు కావలసిన్నది ఫలమే యైనను, సకాలమున వ్యవసాయముచేసి విత్తనముల జల్లి, కలుపును తీసేసి, మంచి ఎరువుల సహాయంతో పైరును చక్కగా పోషించుచున్నారు. తమ ప్రయత్నం ఫలించిన తదుపరి ధాన్యమును తీసికొని గడ్డినెట్లు వదులుచున్నారో, అట్లే మోక్షాసక్తుడగు మేదావంతుడును వేదాంతగ్రంధముల నధ్యయనము జేస్తూ, సకాలంలో సరైన సాధనను చేసి, అహంను తీసేసి, సద్గురువు సహాయంతో ఆత్మజ్ఞానము సంపూర్ణముగా పొందిన పిదప గ్రంధపఠనంను విడువవలెను.
నావార్ధీ హి భవేత్తావత్ యావత్పారం న గచ్ఛతి |
ఉత్తీర్ణే తు సరిత్పారే నావయా కిం ప్రయోజనమ్ ||
ఎంతవరకు నది ఆవలదరిని చేరదో, అంతవరకు నదిని దాటుటకై పడవ యుండవలసిందే. ఏరు దాటిన మీద ఆ నావ ఉపయోగం లేదు.
అయితే ఇక్కడ మనమో విషయమును గమనించాలి -
ఆధ్యాత్మిక సాధన అంతరంగానికి సంబంధించినది. అది మనస్సులోనే జరగాలి. సత్యాన్ని బాహ్యంగా అన్వేషించుట కూడదు. ఆత్మే పరమాత్మ అనే సత్యాన్నే అన్ని గ్రంధాలు ప్రభోధిస్తున్నాయి. ఇది అనుభవంలోకి రావాలంటే తీవ్రసాధన అవసరం. అయితే, ఇది అనుభవంలోకి రాకపోవడానికి కారణం మనస్సే. మనస్సే మన స్వరూపాన్ని మరుగు పరుస్తుంది. అనుభవానికి రానీకుండా చేస్తుంది. మాయంటే ఏదో కాదు, మనసే మాయ. ఈ మాయ విడిపోతే స్వరూపం అనుభవానికి వస్తుంది. పరిపక్వమైన మనస్సు కలవారే, సత్యంను తీవ్రసాధన చేత అనాచ్చ్చాదితముగా అనుభవించ గలుగుదురు. కానీ సంసారబాధ్యతలతో, ఇతరత్రా విషయవాంఛలతో, ప్రతిబంధకాలతో సాధన చేయటానికి వ్యవధి లేనప్పుడు, ధ్యానం చేయడానికి ఏకాగ్రత కుదరనప్పుడు మనస్సుకు పరిపక్వత రాదు. అశాంతితో భారమౌతుంటుంది. ప్రాపంచిక మాయలో పడిపోతుంది. అలా మాయలో పడకుండా చేసే సాధనలో పుస్తకపఠనం ఓ సోపానమే అవుతుంది. అలాగని అదేపనిగా శాస్త్ర అధ్యయనంలోనే మునిగిపోకూడదు. శాస్త్రం ఏం చెప్తుందో గ్రహించి, అనుష్టించి ఆత్మసాక్షత్కారం పొందాలి.
శ్రీ రమణమహర్షి, శ్రీ శంకరభగవద్పాదులవారు, రామకృష్ణపరమహంస తదితరవారంతా బ్రహ్మత్వం సిద్ధించాక కూడా శాస్త్ర పఠనం చేస్తూ, తమ దర్శనార్ధం వచ్చే సాధకుల చెంత శాస్త్ర చర్చలు, గ్రంథపఠనాలు సాగించేవారు. ఎందుకని మరి?
కాస్త లోతుగా ఆలోచిస్తే ...
శాస్త్రమను ఓడలేనిచో సంసారసాగరం దాటలేం. నది దాటిపోయిన వారికి పడవ అవసరం లేదు.
అలాగని, ఆత్మజ్ఞానం పొందినవ్యక్తి పడవను త్యజించి వెళ్ళడు. పడవను పదిలపరుస్తాడు. ఎందుకనగా ఆవల నుండు జనులను మరల దాటించుటకది అవసరం. ముక్తులైనవారులలో ఇతరులు తరించవలెనన్న సద్భుద్ది ఉంటుంది. అందుచే బద్ధులను విముక్తి చేయదలంచు ముక్తులైన జీవన్ముక్తులు తమ జీవితాంతం వరకు శాస్త్రాధ్యాయనుష్టానములను ఆచరించుకొనియే యుందురు.
'అసుప్తేరామృతే: కాలం నయేద్వేదాంతచింతాయా' ... లేచింది మొదలు నిద్ర పోయేంతవరకు, జన్మించిన పిమ్మట మరణం కలుగువరకును కాలమును వేదాంత చింతనంచేత గడుపవలయును.
తన అజ్ఞానంను మాత్రమే పోగొట్టుకొన తలచినవానికి గురువాక్యమొక్కటి చాలును. కాని ఇతరుల అజ్ఞానమును పోగొట్టకోరిక గలవానికి శాస్త్ర సాధన కూడా కావలయునని అంటారు శ్రీ రామకృష్ణ పరమహంస.
మనస్సును ప్రాపంచికవిషయ రహిత మొనర్చుకో వలయునన్న, మాయలో పడకుండా చూసుకోవాలన్న జ్ఞానత్వం తప్పనిసరి. ఆ జ్ఞానత్వంనకు శాస్త్రపఠనం ఆవశ్యకం. శాస్త్రజ్ఞానం అలవడిన ఆత్మజ్ఞానం ఉదయించును. అగ్నికి వాయువు ఎంత అవసరమో, అట్లే ఆత్మజ్ఞానానికి శాస్త్రజ్ఞానమూ అంతే అవసరం.
మొక్కను సంరక్షించినచో స్వయంగా మ్రానై పల్లవించి పుష్పించి ఫలమై, ఆ ఫలం పరిపక్వమై అప్రయత్నంగా క్రిందకు ఎట్లు రాలునో, అట్లే శాస్త్రాలను అధ్యయనం చేస్తూ అనుష్టించినచో మనస్సు పరిపక్వమై దేనితో విషయసంపర్కం లేకుండా ఆత్మసాక్షాత్కారఫలం పొందడం జరుగుతుంది.
అందుకే,
'వేదాభ్యాసో హి విప్రస్య తపః పరమిహుచ్యతే'... వేదాధ్యయనము ఉత్తమ మానవునికి గొప్పదగు తపస్సన్నది మనుమహర్షి మాట కాగా, 'స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే' ... అధ్యయనమే తపస్సు లన్నిటిలోను ముఖ్యమైన వాక్తపస్సని గీతాచార్యుని వచనం.
శ్రీ శంకరులవారు, శ్రీ రమణులు, శ్రీ రామకృష్ణులవారు శాస్త్రజ్ఞానం కలవారగుటచే అనేకవిధముల ప్రభోదించి ప్రజల యొక్క అజ్ఞానావరణమును తొలగించి జ్ఞానభాస్కరుణ్ణి ప్రకాశింపజేసిరి.
ఏది ఏమైనా, ఓ మంచి పుస్తకపఠనం పూర్తయిన పిమ్మట నా మదిలో మెదిలే మాట ఒకటే ... "పుస్తకం దేవోభవ".
వాట్సాప్ లో నాకు వచ్చిన, నచ్చిన చిరు వీడియో ...
వాట్సాప్ లో నాకు వచ్చిన, నచ్చిన చిరు వీడియో ...