28, ఏప్రిల్ 2022, గురువారం

మంచివారిలోనే భగవంతుడు ఉంటాడా?

కొన్ని రోజుల క్రితం - 

నా స్నేహితురాలి బ్లాగ్ లో ఒకరు ఈ క్రింద ప్రశ్నలు వేశారు. దానికి క్లుప్తంగా ఓ వ్యాఖ్యల బదులివ్వడం తెలియక, కాస్త వివరంగా ఇక్కడ తెలుపుతున్నాను.

                         

అన్నీ భగవంతుని మయమే ...
అవును, ఇది సత్యం. ఇందులో సందేహం లేదు.
                         

అందరిలో భగవంతున్ని చూడాలనే కదా చెప్తారు ...
అవును, ఇదీ సత్యమే.
                        
           
వాళ్ళతో స్నేహం వద్దు, వీళ్ళతో స్నేహం వద్దు... నా ఫ్రెండ్స్ కొంత చెడ్డవారే. ఏం అయితే, వారిలో భగవంతుడు వుండడా? మంచివారిలోనే ఉంటాడా?
ఎందుకుండడు? అందరిలో ఉంటాడు.

ఒక విష సర్పం ఎదురైతే, ఆ ప్రాణిలో కూడా భగవంతుడు ఉన్నాడని దగ్గరకు వెళ్ళక, ఎందుకు ప్రక్కకు తప్పుకోవడం? అది హాని చేస్తుందనే పరిజ్ఞానం వలన. ఈ జ్ఞానం ఎలా కల్గింది? పెద్దలు చెప్పడం వలన.
                       

అలాగే, చెడు సహవాసాలతో హాని జరుగుతుందని, చెడు స్నేహాలు వద్దని పెద్దలుచెప్తారు. 
                         
కర్ణుడు ఎంతటి ఉదాత్తుడు... అయినా నేటికీ దుష్ట చతుష్టయంలో ఒకరిగానే నిలిచిపోయాడు. కారణం, దుర్యోధనాదుల స్నేహం. 
                   

           

     
మట్టిలో చేరి ఇనుము పట్టు తుప్పు
అగ్నిలో చేరి ఇనుమును అదియు వీడు
సాహచర్యముచే నిట్లు జరుగుచుండు...
ఇనుము మట్టితో చేరినప్పుడు, తుప్పుపట్టి దాని శక్తి కోల్పోతుంది. అదే నిప్పుతో చేరేసరికి ప్రకాశవంతంగా మెత్తగా మారుతుంది. 
సహవాసం ప్రభావం ఇలా ఉంటుంది. కీడు మేలు అనేది మనం సహవాసం చేసేవారి మంచి చెడులపై ఆధారపడి ఉంటుంది. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవేమిటో నేను చెప్తాను అంటారు విజ్ఞులు. చెడ్డవారితో చెలిమి ఉన్నప్పుడు మంచివారిని కూడా చెడ్డగానే చూస్తారు. తాటిచెట్టు క్రింద పాలు త్రాగుతున్నానంటే, ఎవరు నమ్ముతారు? కనుక చెడుస్నేహాలకు కాస్త దూరంగా ఉండమని పెద్దలు చెప్తుంటారు.
                          


అంతటా భగవంతుడు ఉంటాడన్నది అబద్దమా?
అబద్దం కానే కాదు. 
                    


నీతులు చెప్పేవారు వంద శాతం మంచివారా?
వంద శాతం మంచివారని ఎవరూ చెప్పలేరు. నాకు మంచిగా అనిపించింది, వేరొకరికి కాదనిపించవచ్చు. కానీ, నీతులు చెప్పేవారిలో అధికులు, సమాజ హితం కోరేవారే. మన శ్రేయస్సు కోరేవారే. మంచి చెడు సహజం. అయితే సంబంధ బాంధవ్యాలను సరైన రీతిలో తీసుకోవాలి. చెడును తెలియజెప్పి సంస్కరించగలగాలి  ఎవర్నీ ద్వేషించనక్కర లేదు. విమర్శించనక్కరలేదు. కానీ, ఎన్నుకోవలసినవారిని సరైన రీతిలో ఎన్నుకోవాలి. వారి ప్రభావం మనపై ఉంటుంది కాబట్టి.  
                           

                    
బ్రతుకుతెరువు కోసం చదువుకుంటే ఉద్యోగం, డబ్బు, హోదా వస్తాయి. ఇలాంటివి చదివితే కూడు వస్తుందా? కష్టపడితే కూడుగానీ, భక్తి కూడు పెడుతుందా? 
                        

ఒకప్పుడు విద్యను వ్యక్తిత్వ వికాసం కోసం అభ్యసించి, యశస్సు సాధించేవారు. కానీ, నేటి విద్యా విధానంలో విద్య అంటే - కేవలం ఉద్యోగం, ధన సముపార్జన అన్న భావన ఏర్పడింది. ఈ చదువులతో తర్కవాదములలో ప్రవేశిస్తున్నారు. ఇది కాదు చదువు యొక్క విలువ. ఆస్తులు, హోదాలు పొట్ట కూటి కోసం చదివేది మాత్రమే చదువు కాదు. జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా గుర్తించేలా చేసేదే అసలైన విద్య. మనల్ని సంస్కరింపజేసేదే అసలైన విద్య. 

 భక్తి - భుక్తి ... కొన్ని అద్భుతాలు -

ఒకసారి స్వామి వివేకానంద మండు వేసవిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వేస్టేషన్‌లో ఉండగా, ఒక సంఘటన జరిగింది.

వివేకానందుడు సన్యసించారు కనుక, వారికి భగవత్ ప్రసాదంగా లభించినదే భుజిస్తుండేవారు.     

భిక్షగా ముడి సామాన్లు లభిస్తే, వండుకుని భుజించేవారు లేదా భిక్షాటన చేస్తుండేవారు.

వివేకానందుడికి ఆరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో దాహార్తితో కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి, ఒక ధనవంతుడు చులకనగా మాట్లాడనారంభించాడు. అతని ఆలోచన ప్రకారం, సన్యాసులు అంటే ఏ పనీ చేయకుండా, సోమరిలా తిరుగుతూ, ఊరిలో వారిపై భోజనానికై ఆధారపడుతూ, ప్రజలను మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని.

ఇటువంటి భావం కలిగివున్న ఆ ధనవంతుడు  స్వామీజీతో ఇలా అన్నాడు..

“ఓ స్వామీ! చూడు.. చూడు.. నేనెంత మంచి భోజనం చేస్తున్నానో.. నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్ళు ఉన్నాయి. నేను డబ్బులు సంపాదిస్తాను. కాబట్టి, నాకు మంచి మంచి వంటకాలు, వగైరాలు అన్నీ సమకూరాయి. ఇటువంటి భోజనం నువ్వు కనీసం కలలో అయినా పొందగలవా? ఏ సంపాదనా లేకుండా దేవుడు.. దేవుడూ.. అంటూ తిరిగేవాడివి. అందుకే నీకు ఈ బాధలు.  నీ భక్తి నీకిప్పుడు భోజనం పెడుతుందా? చూసావా... నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడయ్యా.. ఆకలి బడలిక తప్ప!” అని దెప్పిపొడవటం మెుదలుపెట్టాడు.

స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు. విగ్రహంలా కూర్చొని భగవంతుని పాదపద్మాలనే తలచుకుంటున్నారు.

అప్పుడు ఒక అద్బుతం జరిగింది.

ప్రక్క ఊరి జమీందారు ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి, స్వామీజీ పాదాలపై వాలిపోయాడు. అతను స్వామితో ఇలా అన్నాడు, 

“మీ పాదాలను సేవించి స్పృశించే భాగ్యం కలగడం నా పట్ల శ్రీ రామ చంద్రమూర్తి కున్న అనుగ్రహం.
దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి!" అని ప్రాధేయపడ్డాడు.

స్వామీజీ “ఎవరు నాయనా నీవు? నేను నిన్ను ఎరుగనే... పొరబడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు!” అని అంటూ ఉంటే,  ఆ వ్యక్తి స్వామీజీ ముందు వెండి పీట వేసి, భోజనం ఒక బంగారు అరటి ఆకు మీదకు మారుస్తూ... లేదు స్వామీ, నేను కలలో చూసింది మిమ్మల్నే!”
"శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి, మిమ్మల్ని చూపించి, నా బిడ్డ ఆకలితో ఉంటే, నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా... లే... లేచి అతనికి భోజనం పెట్టు!  అని ఆజ్ఞాపించారండి.
"ఆహా.. ఏమి నాభాగ్యం... మీ వలన నాకు రామదర్శనం కలిగింది. తండ్రీబిడ్డలు ఇరువురుది ఏమి గాంభీర్యం,  ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు, ఎవరూ మరచిపోలేరు."
"నేను పొరబడటం లేదు స్వామీ.. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లటి నీరు కూడా తెచ్చాను" అన్నాడు.

స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది. ఏ అభయ హస్తమైతే తనజీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో.. అదే అభయ హస్తమిది.

ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న ఆ ధనవంతుడు ఉన్నపళంగా స్వామి వారి పాదాలపైపడి, కన్నీటి ధారాలతో స్వామి పాదాలను అభిషేకిస్తూ, క్షమాపణ కోరాడు.

ఇది కేవలం స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే, ఇంతకు మించినవి, ఎంతో ఆశ్చర్యం కలుగజేసేవి, చాలా ఉన్నాయి మన మహర్షుల యోగుల అనుభవాలు. వారి వారి జీవిత చరిత్రలు చదివితే ఇలాంటివి తెలుసుకోవచ్చు.

                                    🕉️🕉️🕉️🕉️🕉️

పూర్వకాలంలో సకల శాస్త్రములను అభ్యసించిన ధర్మపరాయణుడైన ఓ కడు బీద బ్రాహ్మణోత్తముడు, విద్య విక్రయం పాపమని భావించి, ఒక బడిలో ఉచితంగానే విద్యాబోధన చేస్తుండెను. విద్యార్ధుల తల్లితండ్రులు దయదలచి ఏమైన యిస్తే, అదే జీవనాధారమయ్యేది. ప్రతీరోజు ఇంటిలో వంటకం అయిన తరువాత తల్లి స్వయంగా వచ్చి పిలుస్తేనే, అతడింటికి వెళ్ళి బోజనం చేసేవాడు. ఇంట్లో ఏమైన వండితే మధ్యాన్నం 12గంటలకు తల్లి వచ్చి పిలిచేది. లేనిచో, ఆ బడిలోనే కూర్చొని భగవద్గీత పారాయణం చేయుచుండెను. తరచుగా పస్తులుండడం వారికి పరిపాటి. ఒకరోజు ఒంటి గంటైనను తల్లి రాకపోవడంతో ఈ దినమూ ఉపవాసమేనని గ్రహించి, గీత పారాయణం చేయుచుండగా, 
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే | అను శ్లోకం పఠనం నకు వచ్చెను.
                        


అపారమైన కృష్ణ భక్తి ఉన్నను, ఆకలి బాధతో ఆ శ్లోకం యొక్క మొదటను, తుదను ఎర్రటి పెన్సిల్ తో రెండు బ్రాకెట్లను వేసెను.
ఆ సమయమున ఈ పంతులుగారి వద్దే చదువుచుండెడి ఆ నగరంలోని రాజుగారి కుమారుడు, ఒక గంప నిండుగా సామానులను తీసుకొని పంతులయ్యగారి ఇంటికి వచ్చి, ఈ దినమునకు కావల్సిన వంటసామగ్రిని పై విస్తరాకులలో పెట్టినాను, వాటిని ఈ దినం బోజనమునకు ఉపయోగించుకొని గంప యొక్క అడుగుభాగమున వున్నవి చూసుకొని, రేపటినుండి వాడుకోమని కన్నీరు కార్చుతూ చెప్పగా, ఆ రాజకుమారుని చెక్కిళ్ళకు రెండు ప్రక్కల ఎర్రగా నెత్తురు కారేలాగున వాతలు ఉండుట చూసి, ఆ ఉపాధ్యాయుని తల్లి, అయ్యో! బాబు! ఎవరు నాయనా! నిన్నిలా కొట్టారని అడగగా, తల్లీ! మీ కుమారుడగు పంతులుగారు, చెప్పినట్లు నేను చేయుట లేదని సందేహం కలిగి నా ముఖమున వాతలు వేసెనని చెప్పెను. దానితో ఆ తల్లి ఆందోళనగా బడికి వెళ్ళి, నాయనా! మనమిక ఈ గ్రామంలో వుండగలమా? రాజుగారి కుర్రవానిని నెత్తురు కారేలాగున ముఖమున వాతలు వేయవచ్చునా? ఎంతో సహనశీలుడవయిన నీవు, ఏల ఈ ప్రమాదకరమగు పని చేసితివి? ఈ నగరపు వారి సహాయం వల్లనేగదా, ఈ మాత్రమైన అనుష్ఠానం చేసుకొని, జీవించగలుగుతున్నాం అని అంటున్న తల్లిమాటలు అర్ధంకాక, అయోమయంగా తల్లితో సహా రాజుగారి ఇంటికి వెళ్ళగా, రాజు కుమారుడు బోజనం చేసి, మరల బడికి వచ్చుటకు సిద్ధమై యుండెను. ఆ అబ్బాయిని అడుగగా, నేను మీ ఇంటికి రాలేదని చెప్పెను. ఆ బాలుని ముఖంపై ఎటువంటి వాతలు లేకుండెను. అంతట ఆ ఇరువురు ఇందులో ఏదో రహస్యముందని యోచిస్తూ, ఇంటికి వచ్చి ఆ గంపను చూడగా, పైన ఆ రోజుకు సరిపోవు బియ్యం, పప్పులు ఉండెను. విస్తరాకు దిగువున అమూల్యమగు రత్నములు కనిపించెను. అప్పుడు తాను చదివిన శ్లోకం, గీసిన గీతలు గుర్తుకు వచ్చి, వచ్చింది శ్రీకృష్ణుడేనని, తాను గీసిన గీతలు కృష్ణుని ముఖంపై వాతలయ్యనని, ఇది శ్రీకృష్ణుని మహిమగా గుర్తించారు.
     
                                      🕉️🕉️🕉️🕉️🕉️

ఒకప్పుడు భద్రాచలం ప్రయాణమంటే, ఎంతో ప్రయాసతో కూడుకున్నది. అటువంటి పరిస్థితుల్లో, రామదర్శనంకై వచ్చే భక్తులకు ఏదైన సహాయం చేయాలన్న సంకల్పం పమిడిఘంటం వెంకటరమణ దాసుది. కౌపీనం తప్ప, ఏ ఆస్తుపాస్తులు లేని ఆయన యాయవార వృత్తి ద్వారా సంపాదించిన దానితోనే, నిత్యాన్నదానం చేయాలన్న గొప్ప సంకల్పంతో ఇల్లిల్లు తిరిగి దానంగా వచ్చేదానిని శుభ్రంగా వండి, వేడి వేడి అన్నం,  కాస్త పప్పో, పచ్చడినో, మజ్జిగలతో భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తుండేవాడు. అంతకంతకు భక్తజనం పెరగడం, అన్ని ఇళ్ళకు వెళ్ళి అడిగి తెచ్చిన వాటితో వచ్చినవారికి లేదనకుండా అన్నం పెట్టేవాడు. ఒకనాడు ఆయన ఏర్పాటు చేసిన ఆ అంబ సత్రంలో వంటపాత్రలను ఎవరో ఎత్తుకు పోవడం, వేరే వంటపాత్రలు లేకపోవడంతో వండేవాళ్ళు వెళ్ళిపోవడంతో, అంతా రాములవారే చూసుకుంటారని, రాముడే దిక్కని, రామునిపై భారం వేసి నిబ్బరంగా ఉండగా, ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చి, తాము వంటవాళ్ళమని, వండటానికి తమ దగ్గర రెండు గుండిగలు వున్నాయని, ఈరోజు వంటపని తాము చేసిపెడతామని చెప్పి, వెంటనే వంట ప్రారంభించి, ఎప్పటిలాగే భక్తులు వచ్చే సమయానికి వండడం పూర్తి చేసారు. కమ్మటి వాసన, చక్కటి రుచులతో రోజుటి కంటే గొప్పగా ఉన్నాయంటూ భక్తులు లొట్టలు వేసుకుంటూ తిన్నారట. ఆపై కుర్రాళ్ళు కనిపించలేదు. వారికోసం వెతికినా వారి ఆచూకి తెలియలేదు. ఆ రూపం వున్న కుర్రవాళ్ళని గతంలో ఎవరూ చూసి ఎరగరు. గోపన్నను విడిపించేందుకు తానీషాకు మాడలు చెల్లించిన అన్నదమ్ములు రామలక్ష్మణులే నేడూ నిరంతరాయంగా జరుగుతున్న ఈ అన్నదాన యజ్ఞాన్ని కొనసాగించినట్లు గ్రహించారంతా. ఆ తర్వాత ఆ గుండిగలలో వండి, చేస్తున్న అన్న ప్రసాదం బహు బాగుండేదని భక్తుల మాట. భక్తులు అంతకంతకూ పెరగడం యాచించింది సరిపోవడం లేదని, నీవే దిక్కని రామున్ని ప్రార్ధించడం, హఠాత్తుగా ఒక ధనవంతుడు వచ్చి, నా తల్లి స్వప్నంలో కనిపించి మీ సత్రానికి తన భూములన్నిటినీ ఇచ్చేయమని చెప్పిందని, 4వేల ఎకరాలు మీకు రాసిస్తున్నానని, ఆ పత్రాలు అందజేయడం జరిగింది. ఆ ధనవంతుడు హనుమకొండ నుండి వచ్చిన తుంగతుర్తి నరసింహారావు అనే వకీలు గారు. దాసుగారు తదనంతరం, క్రమేణా ఆ సత్రాన్ని అందరు మరిచినా, ఆ సత్రం పాడుబడిన, ఆస్తి అన్యాక్రాంతమైన, కొన్ని సంవత్సరాల క్రితం ఆ సత్రాన్ని శృంగేరిపీఠం తన ఆధీనంలోకి తీసుకొని, చక్ర సిమెంట్స్ అధినేత కృష్ణమోహన్ గారి సహకారంతో వేద పాఠశాలను నెలకొల్పి మరల అన్నదానం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ రెండు గుండిగలు రామ గుండిగ, లక్ష్మణ గుండిగ పేరిట ఉన్నాయి. 
                

                                     🕉️🕉️🕉️🕉️🕉️

శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు (1896-1990) తినడానికి ఏమీలేక నీరసించి సొమ్మసిల్లగా, ఆ జగన్మాతే స్వయంగా అన్నం తినిపించడం జరిగింది. ఈ వివరణ నామ - మంత్ర వైశిష్ట్యం ఈ టపాలో చూడగలరు.

                                         🕉️🕉️🕉️🕉️🕉️

                       

ఇటువంటి పుస్తకాలు చదివితే, భక్తి కూడు పెడుతుందని, అలాగే మనం కష్టపడి సంపాదించిన కూడుకు మూలమైన సృజనకర్త ఎవరన్నదీ అవగాహనకు తెస్తుంది.
                         

ఇలాంటివి చదివితే - 
జ్ఞానోదయం అవుతుంది. 
మానసిక వికారాలుండవు.
వ్యక్తిత్వ వికాసం కల్గుతుంది.
మన దగ్గరకు వచ్చిన ప్రతీ విషయం అవగాహన అవుతోంది. 
మనకు కల్గిన ప్రతీ సందేహానికి
 సమాధానం దొరుకుతుంది.
                        

పుస్తక పఠనం వలన ప్రయోజనం -
మన పురాణ ఇతిహాసాలలో, యోగుల మహర్షుల చరిత్రలలో ఆత్మజ్ఞానానికి సంబంధించిన విజ్ఞానమే కాదు, మన దైనందిక జీవితాల్ని ఉత్తమ మార్గంలో నడుపుకోవడానికి దోహదపడే అంశాలు అనేకముంటాయి. అనేక కధల రూపంలో ఉపయుక్త ప్రధానాంశాలను ప్రబోధిస్తాయి. నీతి నియమాలను, ధర్మ సూక్ష్మాలను, సాంఘిక ఆర్ధిక రాజకీయ రంగాల్లో మనం నడుచుకోవాల్సిన విధానాల్ని వివరిస్తాయి. చారిత్రాత్మిక సంఘటనల ద్వారా మనకు ఉపయోగపడే అనుభవాలు కోకొల్లాలుగా ఉంటాయి.  ప్రపంచంలో ప్రముఖుల ఆత్మకథలు (బయోగ్రపీ) చదివితే, వారిలో  చాలామంది తమకు ప్రేరణ స్పూర్తి భారతీయ శాస్త్ర గ్రంథాలే అని పేర్కొనడం గమనార్హం.
మన సంస్కృతి పట్ల అవగాహన రావాలన్న, మన ఔనత్యం అవగతం కావాలన్న శాస్త్ర పఠనమో, శ్రవణమో తప్పనిసరి. 
                     

పై ప్రశ్నలకు నా అవగాహన మేరకు సమాధానాలు తెలిపాను. తప్పులుంటే తెలపండి.....

ఒకోసారి కొందరు రచయితలు చక్కటి సందేశమున్న సంభాషణలను తెలుపుతుంటారు. అలాంటిదే ఒకటి ఈ మధ్య నాకు వాట్సాప్ లో వచ్చింది. ఇది మూల గ్రంథంలో ఉందో, లేదో నాకు తెలియదు గానీ, మంచి సందేశం ఉండడంతో ఇక్కడ షేర్ చేస్తున్నాను.
 
కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది.
కర్ణుడు కృష్ణుడుని అడిగాడు...

నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పు కాదే.

పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ, నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు.

పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు..

ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది.

ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం, కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే.

నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే... స్నేహం వల్లనే.

అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని అన్నాడు కర్ణుడు.

దానికి కృష్ణుడు సమాధానంగా -

కర్ణా!

నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను.

నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది.

నేను పుట్టిన రాత్రే, నా కన్న తల్లితండ్రి నుండి వేరుచేయబడ్డాను.

చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు. నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను.

నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి. అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు. కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను.

నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా.

నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు.

మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ.

సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది.

జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమున ఒడ్డు నుంచి దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది. అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది.

సరే, ఇంతకు దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో, నీకు మంచిపేరు వస్తుంది.

అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు. పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణమన్న నింద వేస్తారు అందరూ నాపైన.

ఒకటి గుర్తుంచుకో కర్ణా...

జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి.

జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు.

దుర్యోధనుడు అవనీ, యుధిష్టరుడు అవనీ, అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే.

ఏది సరైనదో, ఏది ధర్మమో నీ మనసుకీ, నీ బుద్ధికి తెలుసు..

మనకు ఎంత అన్యాయం జరిగినా, మనకు ఎన్ని పరాభవాలు జరిగినా, మనకు రావల్సినది మనకు అందకపోయినా...

మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం...అదే చాలా ముఖ్యమైనది.

జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో, ఎవరో కాస్త ఆదుకున్నారో... అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా (licence ) అనుకోకూడదు. మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు. ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు... అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు.



8, ఫిబ్రవరి 2022, మంగళవారం

ఏమోయ్! కోడలకు ఏమిస్తావ్...

మూడు మాసాల క్రితం కార్తీకంలో - 

నా స్నేహితురాలు శారద వాళ్ళ అబ్బాయి నిశ్చితార్థం సందర్భంగా, స్నేహితులమంతా కలవడం జరిగింది. నిశ్చితార్థం వేడుక ముగిసాక, అందరం కబుర్లలో మునిగాం. శారద తన కోడలికి ఆరోజున పెట్టిన దశవతారాల హారంతో పాటు, వివాహం రోజున తను పెట్టాలనుకుంటున్న నగలు గురించి చెప్పగా, ప్రియంవద అనే మరో మిత్రురాలు సడన్ గా 'ఏమోయ్ భారతీ, నీవూ కోడలు అన్వేషణలో వున్నావు కదా, నీవేమిస్తావు కోడలికి' అని అడిగింది. పేరుకు తగ్గట్లుగా, ప్రియంగా తాను విన్న, చదివిన కధలతో సందర్భోచితంగా చక్కటి చర్చలు చేసే తను, ఇలా అడిగిందంటే, ఏదో చెప్పాలనుకుంటుదన్న విషయం అర్ధమై, 'నీవే చెప్పు, ఏమివ్వమంటావు' అని అడిగా నవ్వుతూ.

'అయితే నేను విన్న ఒక కధ చెప్తాను వినండి ముందు' అని తను అనగానే, అందరం ఉత్సాహంగా ''ఊఁ" కొట్టాం. కధలంటే అందరికీ ఆనందమే. 
తను చెప్పిన కధ యధాతధంగా - 
ఒక రాజుగారు తన కుమారునికి వివాహం చేసి కోడలుకై అనేకనేక వజ్ర వైడూర్య స్వర్ణాభరణములు సమకూర్చి ఇచ్చినా, కోడలు ముఖంలో పూర్ణానందమును కానరాక, మరి ఏమిస్తే ఆనందంగా వుంటుందో నని ఆలోచిస్తూ, ఒకరోజు కొలువుదీరిన సభలో ప్రశ్నించగా, అక్కడ వున్నవారు స్వర్ణాభరణాలు, మంచి మంచి వస్త్రాలు, విలువైన బహుమతులు సూచించగా, ఈ సమాధానాలు సరికావని అనుభవంతో నెఱిగిన రాజు అసహనంతో, తన మహామంత్రిని రేపు సభలో సరైన సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ, లేకుంటే కారాగారవాసం తప్పదని హెచ్చరించెను. ఆనాటి రాత్రి సమాధానం తట్టక, నిద్ర రాక ఆలోచిస్తూ వీధుల వెంబడి దిగులుతో ఆ మంత్రివర్యులు తిరుగుతుండగా, ఊరి బయట చెరువు చెంత ఓ  యువతి ఏడుస్తుండడం గమనించి, ఆ యువతి దగ్గరకు వెళ్ళి, ఎవర్నీవు... అని ఆరా దీయగా, తను ఎవరో తెలుపుతూ, అనాకారితనం వల్ల తనకి వివాహం కాకపోవడం, అందరి హేళనకు గురికావడం, వృద్దాప్యంలో వున్న తల్లితండ్రులు తనకై బెంగపడ్తూ ఆనారోగ్యగ్రస్థులవ్వడం... తదితర విషయాలు వివరించి, తన తల్లితండ్రులను ఎలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేటట్లు చేయాలో తెలియడం లేదని చెప్పగా, ఆ యువతికి తన తల్లితండ్రులపై ఉన్న ప్రేమను, మాట్లాడే విధానంలో సంస్కారమును గుర్తించి, అమ్మాయి! నేను ఈ రాజ్యపు మహామంత్రిని, నిన్ను నా కోడలుగా చేసుకుంటానని చెప్తూ, రేపు బహుశా నేను కారాగారవాసిని కావొచ్చును కనుక, నీ తల్లితండ్రులను తోడ్కొని ఇప్పుడే మా ఇంటికి వెళ్దామని చెప్పగా, ఆ యువతి నమస్కరించి, ఎందుకు మీరు శిక్షింపబడుతున్నారని అడగడం, జరిగింది మహామంత్రి గారు చెప్పడం, దానికి ఆ అమ్మయి సమాధానం చెప్పడం, ఆశ్చర్యానందాలకు లోనై, రేపు మీ అమ్మానాన్నలతో సభకు రా...రాజుగారి సమక్షంలోనే నిన్ను నా కోడల్ని చేసుకుంటాను, ఆ పిమ్మట నీవే  ఈ సమాధానం రాజుగారికి చెప్దువు గానీ, అని చెప్పడం జరిగింది.
మరునాడు సభలో జరిగింది రాజుగార్కి చెప్పి, వారి అనుమతితో ఆ యువతిని తన కోడలుగా చేసుకోవడం, ఆ అమ్మయినే  సమాధానం చెప్పమనడం, ఆ యువతి 'క్రొత్తగా అడుగెట్టిన కోడలకు స్వేచ్ఛ నివ్వండి, తనకి నచ్చినట్లుగా తనని వుండనిస్తే చాలు' అని సమాధానము చెప్పేసరికి సభ అంతా హర్షధ్వానలతో దద్దరిల్లింది. అయితే ఇక్కడ ఓ ట్విష్ట్ ఉంది... ముందురోజు రాత్రి ఆ మంత్రిగార్కి, యువతికి జరిగిన సంభాషణ విన్న ఇద్దరు గంధర్వులు కూడా ఆ సభకు వచ్చి, జరిగింది చూసి, ఆనందంతో అశరీరవాణిగా పలికిరిలా...
ఓ మంత్రివర్యా! నీ మంచితనం, నిజాయితి, నీ కోడలు తెలివి బహు ముచ్చటగా నున్నాయి. నీకో వరం ఇద్దామనుకుంటున్నాం, నీ కోడలు పగలంతా అనాకారిగా, రాత్రి అందంగా... లేదా పగలు అందంగా, రాత్రి అనాకారిగా ఉండేటట్లు వరమిస్తాం. ఈ రెండింటిలో ఏం కావాలో కోరుకోమని అడగగా, తను ఎలా ఉండాలనుకుంటున్నదో కోరుకునే స్వేచ్ఛను నా కోడలికే ఇస్తున్నానని మహామంత్రివారు అనగానే, చెప్పింది ఆచరణలో చూపినందుకు మెచ్చి, ఇకపై అనాకారితనం పోయి, అందంగా ఉంటుందని అనుగ్రహించి ఆశీర్వదించారు ఆ గంధర్వులు...అని కధ ముగించింది. 
అయితే కోడలకు స్వేచ్ఛనివ్వాలంటావు...అదే ఇస్తే వాళ్ళకి వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అయి, మన నెత్తి నెక్కి ఊరేగరా? మన పద్దతులు, ఇక్కడ ఎలా వుండాలో చెప్పకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది...అని కొంత సందేహంతో ప్రశ్నిస్తున్న శారదకు బదులిస్తూ, మనం ఏమీ నేర్పనవసరం లేదు ఈ కాలం పిల్లలకు...వాళ్ళే తెలుసుకుంటారు నెమ్మది నెమ్మదిగా.  ఈ తరం పిల్లలు స్వేచ్ఛాయుతులు ఆలోచనాపరులు కాబట్టి వారికి నచ్చినట్లు వారిని ఉండనిస్తే చాలు. అంతగా ఏదైన చెప్పాలనుకుంటే స్నేహపూరితంగా చెప్పాల్సిన రీతిలో చెప్తే సరి. ఇక వాళ్ళు కాదు మనం ఎలా వుండాలో ముందుగా తెలుసుకోవాలి. అందరికీ ఓ వీడియో ఫార్వార్డ్ చేస్తున్నాను...చూడండంటూ వాట్సాప్ కు ఈ వీడియో పంపింది ప్రియంవద.
                


పై వీడియో పంపించాక, నా వంక చూస్తూ,ఏమిటాలోచిస్తున్నావు భారతీ, అని ప్రశ్నించిన తనతో...ఏం లేదు, కొద్దిరోజుల క్రితం వాట్సాప్ గ్రూప్ లో ఈ స్వేచ్ఛ గురించి చర్చ జరిగింది. విశాల అనే మిత్రురాలు మీరు ఎవరికీ లోబడకుండా స్వేచ్ఛగా ఉన్నారా అని ప్రశ్నించింది. తను స్వేచ్ఛగా లేనని, బాధ్యతలు బంధాలుకు పరిమితమై ఉన్నానని, అందరికీ నచ్చేలా లోబడి వుండడమే బెటర్ అన్న విశాల అభిప్రాయాలు నేను చెప్తుండగా ...
ఊఁ...విశాలగారే కాదు...చాలమంది బాధ్యతలకు, బంధాలకు లోబడే ఉన్నారు. అది తినవద్దు, ఇది తినవద్దు, ఆరోగ్యానికి మంచిది కాదు...బయట తిరగవద్దు, ఏది కావాలన్న మేము సమకూర్చుతాం, టైముకు తింటున్నామా పడుకున్నామా...ఇత్యాది విషయాల్లో పిల్లల ప్రేమైక ఆంక్షలు...మనకి నచ్చింది స్వేచ్ఛగా తినడానికి లేదు, తిరగాడానికి లేదు...ఒకోసారి కొన్ని విషయాల్లో బేధాభిప్రాయాలు, కొందరి విషయంలో పిల్లల నిర్లక్ష్యం, కుటుంబ ఒత్తిళ్లు...వీటి కారణంతో అన్నింటికీ లోబడే ఉంటున్నాం అనుకోవడం కంటే, వాళ్ళకి మనపై, మనకు వాళ్ళపై ఉన్న ప్రేమను, బంధంను గుర్తిస్తే, ఈ లోబడే అనే భావం మనలో రాదు. ప్రేమ ఎప్పుడూ బంధనం కాదు, అది మరింత స్వేచ్ఛనిస్తుందని ప్రియంవద అంటూ, మరి నీవేం చెప్పావని అడగగా -
                 

    
నీవన్నట్లుగా బాధ్యతలు, ప్రేమైక బంధాలు అందరికీ ఉన్నావే. అటు, కుటుంబపరంగా ఒకింత ఒడిదుడుకులున్నప్పటికీ అవగాహనతో  అన్నింటినీ  సరళంగా సమన్వయపర్చుకుంటూ, సంతృప్తికరంగా
ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాను. ఇటు, అంతరాన ఆధ్యాత్మిక చింతనలతో, ఏ చింత లేకుండా,  ఆనందంగా, స్వేచ్ఛగా ఉన్నాను అని చెప్పానని చెప్తుండగా -  
అనుకుంటాంగానీ, ఎక్కడో చోట మనస్సు బందీగానే ఉంటుంది. నిజంగా నీవు పూర్తి స్వేచ్చగా ఉన్నావా? అదెలా సాధ్యమని అక్కడే ఉన్న ఝాన్సీ అనే స్నేహితురాలు అడగగా...అవును, నా మనస్సు చాలా స్వేచ్ఛగా ఉందని దృడంగా చెప్తూ, కాస్త వివరించానిలా. 
ఇదే ప్రశ్న ఓ సంవత్సరం ముందు విశాల అడిగివుంటే, నా సమాధానం ఎలా వుండేదో గానీ, మీకు తెలుసు కదా,  ఆగష్టు 2020 లో కోవిడ్ బారిన పడడం...నేను సీరియస్ కండీషన్ లో ఉండడం... ఆ క్షణంలో "ఉంటే రాముడిచ్చిన కుటుంబంలో, లేకుంటే రాముని పాదాల చెంత"...అంతేకదా...అని నేను అనుకోగానే, నాలో ఎంతో ధైర్యం...పద్నాలుగు రోజుల పాటు యూరిన్ ద్వార రక్తం పోతుండేది...ఉలిక్కిపడేలా నా గుండె సడి నాకినిపించేది...అయినా చలించక, ఇంటిల్లుపాది కోవిడ్ బారిన పడడంతో వారితో, ఫోన్ చేసి పలకరించే ఆత్మీయులతో మాట్లాడుతున్ననూ... ఆ పద్నాలుగు రోజులూ పడుకున్నా, మగతలో వున్నా, మెలుకువగా వున్నా, నిరాటంకంగా "రామ నామ జపం నాలో". రామ స్మరణ ఓ ధారణ... అప్రయత్నంగా ఓ యజ్ఞంలా సాగే జపం...ఆ రాములోరే చేయించుకున్నారు...లేకుంటే ఆ శక్తి నాకెక్కడిది? అప్పుడే అమ్మవారి స్వప్న దర్శనం...చిత్రంగా రామానుగ్రహంతో పదిహేనవరోజు నుండి నార్మల్ కు వచ్చాను. ఆరోజు నాకు వైద్యమిచ్చిన డాక్టర్ గారు, 'అమ్మా! ఏ దైవాన్ని కొలిచావమ్మా...మిమ్మల్ని నేను గానీ, ఈ మందులు గానీ బ్రతికించలేదు...మీరు నమ్మిన ఆ దైవమే మిమ్మల్ని కాపాడింది అని అన్నారు. 
ఆ మాటలతో నేను ఏ స్థితిని దాటివచ్చానో, రాముని కృప ఎంతలా నామీద వుందో అర్ధమై మూగబోయాను. 
                   

ఆ తర్వాత నుండే, నిరంతరం గాడీ తప్పుతూ ప్రాపంచికత వైపు పరుగులు తీసే నా మనస్సు - ఏ స్థితిలో వున్నా, ఎలా వున్నా "రామ" అనుకోవడం, బాధ్యతలు బంధాలతో ఉరుకులు పరుగులు తప్పకున్నా, తప్పని రామ జపం, ఎవరితో మాట్లాడుతున్నా, మాట మాటకి నడుమ రామ స్మరణం అలవర్చుకుంది. ప్రాపంచిక గమనంలో చిన్న చిన్న ఎత్తుపల్లాలు, చిరు ఒడిదుడుకులున్నను, అన్నింటికీ మించి నాకంటే1.5 సం|| పెద్దయిన చిన్నన్నయ్య అకాల మరణం...అంతరాన్ని బలంగా తాకినను, కొద్దిసేపు మాత్రమే ఆ దుఃఖ స్పర్శ. వెన్వెంటనే మనస్సు రామ స్మరణంతో ఇవేవి మోయక, యదేచ్ఛగా ఆనందంలో ఓలలాడడం...ఏదో అలౌకిక శాంతి... ఇప్పటికీ అన్నయ్యని తలుచుకోగానే వేదనతో భారమౌతుంది మనస్సు...కానీ అది కొన్ని క్షణాలు మాత్రమే...రామ స్మరణతో వెంటనే తేలికైపోతుంది...ఇది అప్రయత్నంగా జరుగుతుంది. గతంలో మంచి అమ్మాయి కోడలుగా రావాలని, కుటుంభీకుల గురించి ఆశ, ఆరాటాలు వుండేవి...ఇప్పుడు అవేమీ లేవు...అంతా భగవదేచ్చ అన్న నిశ్చింత...
ఇలా వుంది నా అంతర గమనం... అటు ఇటు (ప్రాపంచికం, పారమార్ధికం) రెండింటి కలయికే జీవితం...ఇలా సాగుతుంది ప్రశాంతంగా నా జీవనం... ఇప్పుడు చెప్పండి, నేను స్వేచ్ఛగా ఉన్నానా...లేదా? 
                   

కొన్ని క్షణాల మౌనాన్ని బ్రేక్ చేస్తూ, నెమ్మదిగా చెప్పాను - అయితే అందరం ఒక విషయాన్ని అర్ధం చేసుకోవాలి. మన అభిప్రాయాలే మనల్ని ఇబ్బందికి గురిచేస్తుంటాయి. మన ఆలోచనలే అడ్డంకులు. కొన్నింటికి లోబడి ఉన్నామన్నది మన భావనే. మన హృదయంలో సరైన భావనే మన జీవితాల్ని నిర్ధేశిస్తుంది. ముందుగా మనం  ఇతరుల అభిప్రాయాలు అనుభవాలతో ముడిపడి వుండక, మనకు ఏం కావాలో అన్న స్పష్తమైన అభిప్రాయంకు రావాలి. దానికి బలమైన పూనిక ఉండాలి. మనలో మనం నిజాయితిగా ఉన్నామా, లేదా అని గమనించుకోవాలి. మనం మన అంతరంగంలో నిజాయితిగా లేనప్పుడు, పరాయిధ్యాసని అనుభవిస్తున్నట్లే. మన నిజమైన స్థితిని విడిచి, పరాయి స్థితిలో ఉన్నట్లే. ఈ పరాయి స్థితి నుండి స్వస్థితి లోనికి పయనించాలంటే నిరవధిక ప్రార్ధన వలనే సాధ్యమౌతుంది. ప్రాపంచిక బంధాలనుండి మానసిక విడుదల ప్రసాదించేదే భక్తి. ఈ భక్తే స్వేచ్ఛను ప్రజ్వలింపజేసే ఆయుధం. ఈ భక్తే హృదయమందిరంలో పూర్ణంగా మనస్సు లయమయ్యేలా జేసి, లౌకిక ఆనందాన్ని ఇస్తుంది. 
                       

ఆనందం స్వేచ్ఛ అనేవి బాహ్యవనరులలో కాదు, అంతరాన ఉంటాయి. త్రికరణశుద్ధిగా భగవంతునికి శరణాగతమైనప్పుడు మనస్సు దానికదే అదుపులోనికి వస్తుంది. మనస్సుని పవిత్రంగా వుంచుకోవాలి. మనస్సుని పవిత్రంగా వుంచుకోవడమంటే బాహ్యంగా మంచిగా ప్రవర్తించడం కాదు, హృదయంలో మనం మనలా స్వేచ్చగా, పరధ్యాస లేకుండా వుండడమే పవిత్రత...ఇదే చిత్తశుద్ధి.
                      

జీవితం అంటే - నేను, నా కుటుంబం, నా వాళ్ళు, నా సంపాదన, నా హోదా, భేదాలు, ఖేదాలు మోదాలేనా?
ఏదో బ్రతికేసాం అని కాకుండా జీవితం సార్ధకమయ్యేలా అంతరం తృప్తి పడేలా, స్వేచ్ఛగా జీవించేలా సాధనతో చిలికేద్దాం...అమృతం అందుకునేంతవరకు.

స్వేచ్ఛాజీవనమంటే పిల్లలు చెడిపోరా? పెద్దలమైన మనమైన స్వేచ్ఛ అనుకుంటే సంసారంలో కలతలు రావా? అని ప్రశ్నించిన మరో మిత్రురాలికి -
                     

సంసారంలో కొంత సర్దుబాటుతత్త్వం ప్రేమతో అలవర్చుకున్నవారికి స్వేచ్ఛ స్పర్శ అనుభూతమౌతుంది. 
"స్వేచ్ఛా జీవనమంటే అజ్ఞానం, అహంకారం, పెత్తనం, హద్దు మీరడం లాంటి గుణాలతో ఇష్టం వచ్చిన రీతిలో యదేచ్ఛగా నడుచుకోవడం కాదు, ఎంతో కొంత క్రమశిక్షణను అలవర్చుకోకపోతే నిత్య జీవితంలో మనకూ, మూగజీవాలకూ తేడాయే ఉండదు. సహజ సుందరమైన జీవితం క్రమశిక్షణ ఫలితంగానే నడుస్తుంది. విచక్షణ, క్రమశిక్షణలతో కూడుకున్నదే నిజమైన స్వతంత్ర జీవనం. వివేకారాహిత్యంతో యిష్టారాజ్యంగా ప్రవర్తించడం స్వేచ్ఛాజీవనం కాదు" అన్న రామకృష్ణ మఠంకు చెందిన స్వామి చెప్పిన మాటల్ని గుర్తుచేసింది రజిని అన్న మిత్రురాలు. 
ఇంతలో అక్కడే ఉన్న సంధ్య అనే సత్సంగ మిత్రురాలు, అవునవును... నాకు కొన్నిరోజులు క్రితం స్వేచ్ఛ గురించి ఓ మెసేజ్ వచ్చిందంటూ ఈ క్రింద మెసేజ్ షేర్ చేసింది. 

💦✨ స్వేచ్ఛ. 

మాటల్ని వల్లించడం సత్యం కాదు. శాస్త్రాల్ని తెలిసి ఉండడం సత్యం కాదు. మనిషి మాటల్లో మునిగిపోయాడు. మనిషి బంధాల నడుమ బంధీలా ఉన్నాడు. సంతోషంగా ఉన్నానంటాడు గానీ, తాను స్వేచ్ఛగా లేనని అనుకుంటున్నాడు. 
అట్లాంటి మనిషికి స్వేచ్ఛ ఇచ్చినా, అతను దాన్ని అనుభవించలేడు. 

బంధపాశాలకు కట్టుబడితే మనిషికి స్వాతంత్య్రమిచ్చినా స్వీకరించలేడు. వాదాలతో, శాస్త్రాలతో, మాటలలో సత్యం మరుగున పడిపోయింది. అందువల్ల మనం వాటికి అలవాటు పడిపోయాం. 
సత్యాన్ని గుర్తించే అర్హతను కోల్పోయాం. దీన్ని బట్టి ఎవరయితే అస్థిత్వాన్ని గుర్తించలేరో, తమ లోలోతుల్లోకి వెళ్లి తమ అసలు స్వరూపాన్ని చూడలేరో వాళ్లు సత్యాన్ని గ్రహించలేరు.

ఒక పర్వతం మీద ఒక సత్రం ఉండేది. దూర ప్రయాణాలు చేసేవాళ్లు అందులో బస చేసేవాళ్లు. పుణ్యక్షేత్రాలు దర్శించుకునే వాళ్లు ఆ మార్గం గుండా వెళ్ళే వాళ్లు. ఎందుకంటే ఆ పర్వతం మీద గొప్ప ఆలయముంది. ఆలయాన్ని సందర్శించాలనుకున్న వాళ్లు ఆ సత్రంలో దిగేవాళ్లు.

ఆ సత్రం యజమాని దగ్గర ఒక చిలుక ఉండేది. దాన్ని పంజరంలో పెట్టి సత్రం ముందు పంజరాన్ని వేలాడదీశాడు. దాన్ని ఎంతో ముద్దుగా చూసుకునేవాడు. దానికి ఫలాలు తినిపించేవాడు. దానికి స్వేచ్ఛ అన్నమాట నేర్పించాడు. అది ఎప్పుడూ ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటల్ని వల్లిస్తూ ఉండేది. సత్రంలో దిగిన వాళ్లకు గొప్ప వినోదంగా ఉండేది. వాళ్ళు కూడా దానికి తినడానికి ఏమైనా పెట్టేవాళ్లు. వాళ్ళు పెట్టినది తింటూ, అది ‘స్వేచ్ఛ,స్వేచ్ఛ’ అని అరుస్తుండేది. రాత్రయినా పగలయినా అవే మాటల్ని వల్లిస్తూ ఉండేది. నిజానికి ఆ పక్షికి స్వేచ్ఛ అనే మాటకు అర్థం తెలీదు. అది ఉన్నది పంజరంలో. తను స్వేచ్ఛగా లేనని, పంజరంలో ఉన్నానని, స్వేచ్ఛ అనే మాటకు తనకు అర్థం తెలీదని దానికి స్పృహ లేదు.

ఇలా ఉండగా, ఒక సారి వివేకవంతుడయిన ఒక వ్యక్తి ఆ సత్రంలో దిగాడు. చీకటిపడుతుండగా ”స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటలు వినిపించడంతో చుట్టూ చూశాడు. సత్రం ముందు పంజరంలో చిలుక ఆ మాటలు వల్లిస్తున్నట్లు తెలుసుకుని విస్తుపోయాడు. పంజరం దగ్గరకు వచ్చి నిలుచున్నాడు. అతన్ని చూసి చిలుక ”స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అంది. అది స్వేచ్ఛగా లేదని, ఆమాటకు దానికి అర్థం తెలీదని, అది పంజరంలో ఉందని అతనికి తెలుసు. అతనికి స్వేచ్ఛ అంటే ఏమిటో  తెలుసు. అతను వెంటనే పంజరం తలుపు తెరచి చిలుకను బయటకు లాగడానికి ప్రయత్నించాడు. ఆ చిలుక బయటకు రావడానికి ఇష్టపడలేదు. అతను బలవంతంగా బయటకు తీసి వదిలిపెట్టినా, మళ్లీ పంజరంలోకి వెళ్లింది. ఎప్పటిలా ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అని అరవడం మొదలుపెట్టింది. రెండుమూడు సార్లు అతను ప్రయత్నించాడు. చివరకు నాలుగోసారి దాన్ని పట్టుకుని, దూరంగా వెళ్లి ఆకాశంలోకి వదిలిపెట్టాడు. అది ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అంటూ ఎగిరిపోయింది.

ఆవ్యక్తి ఆనందంతో సత్రానికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. తెల్లవారు జామునే ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటలు వినిపించి, నిద్రమత్తు వదిలించుకుని, లేచి సత్రం ముందుకు వచ్చి చూశాడు. చిలుక పంజరంలో దూరి ‘స్వేచ్ఛ!స్వేచ్చ!’ అంటూ ఉంది.
ఇది చదివాక నిజమే కదా...కొందరు స్వేచ్ఛ స్వేచ్ఛ అంటారే గానీ, బంధనాల్లోనే ఉండడానికి ఇష్టపడతారు ఆ చిలకలా! ...అని అనుకున్నాం. 
ఒక మూడు రోజులు క్రితం మరల ఇదే టాపిక్ వాట్సాప్ గ్రూప్ లో రావడం... రుక్మిణిజీ అనే మిత్రురాలు 'బాధ్యత లేకపోవడం స్వేచ్ఛ కాదు, స్వేచ్ఛ అనేది పూర్తిగా అంతరంగికమైనది, మన బాధ్యతలలో భగవంతుడు తోడునీడగా ఉంటాడనే పూర్ణ విశ్వాసం మనలో ఉన్నప్పుడు అంతర్లీనంగా అనుభవమయ్యే పరమానందమే స్వేచ్ఛ' అని చెప్పి, కొన్ని ప్రశ్నలు వేయడంతో గతంలో జరిగిన ఈ చర్చ గుర్తుకు వచ్చి స్మరణలో పదిలపర్చుకుంటున్నానిలా...

పై కథా రచయితలకు నమస్సులు.

అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారు కోణంలో  - "స్వేచ్ఛ" ...
తదుపరి టపాలో...