1, ఏప్రిల్ 2020, బుధవారం

ఎవరు ఎప్పుడు ఎలా ఎఱుకకు వస్తారో.....

ఆ మధ్యన ఓ స్నేహితురాలు ఇష్టాగోష్టిలో సుమంత్రుడు గురించి ఓ టపా పెట్టవోయి అని అన్నప్పుడు -

సుమంత్రుడా...దశరధుని మంత్రులలో ఒకరు కదా...అతను గురించి రాయడానికి ఏముంటుంది అని నిరాసక్తగా అన్నాను. 

వాల్మీకిచే సృజింపబడే రామాయణంలో పాత్రలన్నీ ప్రముఖమైనవే, వ్రాయరా అని తను అనగా, వ్రాయనని బదులిచ్చాను. 

ఏమిటో ...రామాయణంలో అన్ని పాత్రలు గురించి రాస్తుంటారు అందరూ, ఉడతను కూడా మరువక మెచ్చుకుంటారు గానీ, సుమంత్రుని గురించి పెద్దగా వ్రాయరు ...అని ఏదో చెప్తున్న తనమాటలను కొనసాగించడం ఇష్టం లేక, సరే పనుందని పోన్ పెట్టేసాను గానీ, నాలో ఏదో అంతర్మధనం. 

చిన్నప్పుడు సక్షిప్తంగా రామకధను చదివినను, సంపూర్ణ రామాయణమును తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు చదివిన గుర్తు. అలా చదువుతున్నప్పుడు నా రాముడిని అడవిలో వదిలి పెట్టడానికి వెళ్ళింది సుమంత్రుడని చదివినప్పటి నుండి అతనిపై ఓ విధమైన కోపం. అందుకే సుమంత్రుడు పేరు రామాయణంలో ఎక్కడ కనిపించిన ఆ పేజీలు చదవకుండా దాటవేయడం అలవడింది. ఆ కోపమో బాధో తెలియదు గానీ, ఈ వ్యక్తిగత తిరస్కార భావన నాలో అంతర్లీనంగా నాకు తెలియకుండనే వుండిపోయింది...నిద్రాణమై

అప్పట్లో మా తెలుగు టీచరమ్మను ఇదే అడిగితే - సుమంత్రుడు మంత్రి కదా, రాజాజ్ఞ ప్రకారం చేయడం అతని ధర్మం అని చెప్పినను, అడవికి బయలుదేరినప్పుడు ఆగమని దశరధుడే చెప్తున్నప్పుడు, మరి ఎందుకు ముందుకు రధం నడిపాడు... రాజైన దశరధుని మాట వినక, ఇంకా రాజుకాని, రాముని మాట ఎందుకు విన్నాడనే బాధతో కోపభావం నాలో ముద్రపడిపోయింది.

[అలానే సీతమ్మ వియోగమప్పుడు రాముని విలాపం కూడా చదవలేక ఆ పుటల్నీ కూడా దాటవేసాను] ఇప్పుడు నా స్నేహితురాలి వలన ఆ భావాలు మేల్కొన్నాయి.

చిన్నప్పటి కంటే ఇప్పుడు నాలో ఒకింత ఆలోచనలో పరిణితి రావడంతో, ఆనాటి నా భావన సరికాదేమో అన్న అంతర్మధనం. మరల రామాయణం పూర్తిగా చదువుదామన్న ఆలోచన, తపన. 


రామాయణం చదవడం ప్రారంబిస్తుండగా, ఈ వీడియో వాట్సాప్ లో. 


                              
రామానుగ్రహం అన్న పులకింత. చిత్రకారునికి శతకోటి వందనాలు. 

చదివాక అర్ధమైంది - 
నాది ఎంత అవగాహన రాహిత్యమో, అతను ఎంతటి సర్వజ్ఞుడో ... అన్నది. చదువుతున్నప్పుడు ఆయా సందర్భాలలో ఆయన కార్యశీలత దక్షత అర్ధమై పశ్చతాపంతో ఏడ్చేసాను. 

సుమంత్రుడు - సర్వజ్ఞుడు - ప్రజ్ఞావంతుడు  


దశరధమహారాజు మంత్రిమండలిలో రాజనీతిజ్ఞులైన ఎనిమిదిమంది మంత్రులు వుండిరి. వారిలో ఒకరు సుమంత్రుడు. 

ధర్మజ్ఞుడు, బహుప్రజ్ఞాశాలి అయిన దశరధుడు సంతనార్ధియై, అశ్వమేధయాగాన్ని చేయ సంకల్పించుకొని మనస్సులో మాటను ముందుగా  తెలిపి గురువులను పురోహితులను తీసుకురమ్మని ఆజ్ఞాపించినదీ  సుమంత్రునికే. 

వశిష్టాదులు వచ్చి వెళ్ళేక... 
                        


                         

మీకు పుత్రప్రాప్తి కలుగుతుంది మహారాజా, అని హితం కల్గించే మాటను ప్రియంగా తొలుత చెప్పి, పూర్వం సనత్కుమారుడు ఋషులతో సంభాషిస్తుండగా, వారి నోట విన్న కొన్ని జరగబోయే విషయాలను చెప్తూ, పుత్రప్రాప్తికై చేసే ఈ యాగమునకు ఋష్యశృంగుని ఆహ్వానించవలసినదిగా చెప్పి, ఋష్యశృంగుని గురించి వివరంగా తెలిపి, దశరధునితో అంగదేశానికి వెళ్ళి ఆ మునిని ఆహ్వానింపజేసిందీ సుమంత్రులవారే. 
                            ◇◇◇◇◇

దశరధుడు, రేపే రామునికి రాజ్యాభిషేకం అని  చెప్పాక, సభాసదులందరు సంబరంగా వారి వారి ఇళ్ళకు వెళ్ళేక, రామున్ని మరల మరల చూడాలని వున్నదన్న తన తపనను తెలిపీ రామున్ని తీసుకురమ్మని చెప్పిందీ సుమంత్రునికే. 



సూర్యోదయం కావడం, వశిష్టాదులు రాజ్యాభిషేకంకై కావల్సిన సామగ్రి అంతా సిద్ధం చేసుకొని అంతఃపురంలోనికి ప్రవేశించి, సుమంత్రునిని చూసి, సుమంత్రా! వెంటనే వెళ్ళి మహారాజా వారికి మా రాకను తెలిపి, వారిని తీసుకొని రా అని వశిష్టులవారి మాట ప్రకారం దశరధుల అంతఃపురంకి వెళ్ళెను. అంతఃపురంలోనికి వెళ్ళడానికి సుమంత్రునికి ఎవరూ అడ్డుచెప్పరు. ఎందుకంటే సుమంత్రుడు రాదలచకున్నప్పుడు అతనిని అడ్డగింపకూడదని దశరధుని ఆదేశం. 

తం తు పూర్వోదితం వృద్దం ద్వారస్థా రాజసమ్మతాః |

న శేకురభిసం రోద్ధుం రాజ్ఞః ప్రియచికీర్షవః ||



సుమంత్రుడు రాజగృహంలోనికి ప్రవేశించి, మేల్కొలుపుతూ యుక్తాయుక్తంగా స్తుతించగా, ఓ సుమంత్రా! నీ స్తోత్రాలన్నీ నా హృదయాన్ని చీల్చివేస్తున్నాయి అని దీనంగా పలికిన మహారాజును చూసి ఖిన్నుడైన సుమంత్రుడుకి, వెంటనే వెళ్ళి రామున్ని ఇక్కడకు తీసుకురండని కైకయి ఆదేశించగా, అటుపై అది నా ఆజ్ఞగానే స్వీకరించి రామున్ని ఇక్కడకు తీసుకొని రా, అన్న మహారాజు మాటలు విని రామ మందిరానికి బయలుదేరాడు.
                             
                   

రామమందిరానికి వచ్చిన సుమంత్రుడు, తను వచ్చినట్లు చెప్పమని అక్కడ ద్వారపాలకులకు చెప్పగా, వారు వెళ్ళి రామునితో చెప్పగా, ఏకాంతగృహంలో సీతతో కలసి ఉన్నా, వచ్చింది తండ్రికి సన్నిహితుడు, తనకి అత్యంత గౌరవపాత్రుడు కావటం వలన వెంటనే తనవద్దకు తీసుకురమ్మని చెప్పగా, లోపలకు వచ్చి, కౌసల్యా పుత్రా! రామా! దశరధమహారాజు, కైకేయి వెంటనే నిన్ను తీసుకురమ్మన్నారని చెప్పడమే కాకుండా, తానే స్వయంగా రాముడు బయలుదేరి కూర్చున్న రధాన్ని మహారాజు అంతఃపురం వైపు నడిపెను. 
                            ◇◇◇◇◇
రాముడు వనవాసమునకు సిద్ధమై, తండ్రితో చెప్పి వెళ్ళాలని, సీతాలక్ష్మణులతో కలసి దశరధ రాజప్రసాదంలోకి అడుగుపెట్టి, దుఃఖిస్తూ దీనంగా వున్న సుమంత్రునిని చూసి, సుమంత్రా! నేను అడవులకు పోవటానికి సిద్ధమై, తండ్రిగారి దర్శనంకై వచ్చానని, ఈ విషయం తన తండ్రికి చెప్పమని చెప్పెను. 

పిమ్మట అడవులకు వెళ్ళే రామున్ని చూసి, దశరధ మహారాజు మహాదుఃఖంతో మూర్ఛిల్లగా - 
నీతివేత్తయైన సుమంత్రుడు వాడియైన మాటలతో, కఠినంగా, నిష్ఠూరంగా మాట్లాడిన, చలించక, దయచూపని కైకేయిని చూస్తూ బాధను తట్టుకోలేక, నీ తల్లి మూర్ఖత్వమే నీకూ వచ్చిందని...ఆమె జన్మ రహస్యం గురించి చెప్పి, నిందించి ఆపై ఎంతగానో బ్రతిమిలాడెను. 

రామాదులను అరణ్యంలో వదిలిపెట్టుటకు రధమును సిద్ధంచేయమని సుమంత్రునిని ఆదేశించాను దశరధుడు అశ్రుపూరితనేత్రాలతో. 
                             
                  

అంతా శోకమయులై యుండగా, రధం నడపడంలో నేర్పరి అయిన సుమంత్రుడు రధాన్ని కదిల్చాడు. రధాన్ని త్వరగా నడపమని రాముడు, ఆపమని దశరధుడు...రెండు చక్రాలనడుమ నలిగిపోతున్న వేదననుభవిస్తూ రాముడు చెప్పినట్లే వేగంగా నడిపాడు. 


తమసానదీ తీరాన ఆ రాత్రి సీతారామలక్ష్మణులు శయనించుటకు శయనాన్ని సుమంత్రుడే ఏర్పాటు చేసెను. ఆపై వేకువనే వెంబడే వస్తున్న పౌరులను ఏమార్చి, 
రాముడు చెప్పినట్లు మరొక మార్గంలో తపోవనాలకు పోయేదారికి చేరుకున్నారు. వేదశృతి గోమతి నదులను దాటుతూ, కోసలరాజ్యంను కూడా దాటి, గంగా తీరాన్ని చేరారు. ఆ రాత్రికి అక్కడే విశ్రమించాలనుకున్నారు. 
                        

తెల్లారక గుహుడు గంగానదిని దాటడానికి నావను సిద్ధం చేసాక, రాముడు ప్రేమపూర్వకంగా సుమంత్రుని భుజం తట్టుతూ, సుమంత్రా! నువ్విక అయోధ్యకు వెళ్ళు అని అనగా, అందుకు విలపిస్తూ వెళ్ళలేనని చెప్పగా-
సుమంత్రా! మా ఇక్ష్వాకువంశానికి ఎన్నడూ నీవంటి విశ్వాసపాత్రుడైన సన్నిహితుడు లేడు. దశరధమహారాజు నన్ను తలచుకొని దుఃఖించకుండా, ఆయన్ను దగ్గరుండి ఓదారుస్తూ ఉండు. ఈ పనిని నువ్వు తప్ప ఇతరులెవ్వరూ చేయలేరు. జితేంద్రియుడు అయిన నా తండ్రికి నా నమస్కారం అందజేసి నా మనవిని తెలుపంటూ...నిన్ను అయోధ్యకు వెళ్ళమని చెప్పటానికి బలమైన కారణాలున్నాయి అని, అవీ చెప్పి, నీవు వెళ్ళు...నాకు సంతోషం కలుగించు అని 
రాముడు చెప్పడంతో, అయోధ్యకు తిరుగు ప్రయాణం అయ్యాడు  సుమంత్రుడు.

సుమంత్రుడు అయోధ్యకు చేరడం, రాముని సందేశాన్ని వినిపించడం, దశరధ కౌసల్యాదులకు ఓదార్చడం జరిగింది. ఈ సంఘటనలలో ఉత్తమదూత లక్షణం, హితాన్నికోరుకునేతత్వం 
ప్రస్ఫుటమౌతాయి.

దశరధుడు మరణించిన పిమ్మట మిక్కిలి దుఃఖితుడైన భరతుడు రామసందర్శనంకై అరణ్యమునకు వెళ్ళుటకు తగిన ఏర్పాట్లు చేయమని సుమంత్రున్నే ఆదేశించాడు.


భరతుని ఆజ్ఞను సుమంత్రుడు పరమసంతోషంతో శిరసావహించాడు. 

                              



భరతుడు తన సైన్యంతో దండకారణ్యమునకు వెళ్ళి దూరం నుంచే రాముని నివాసం చూసి తన సైన్యమును అక్కడనే నిలిపి కేవలం 

సుమంత్రున్ని గుహున్ని మాత్రమే తీసుకొని ముందుగా వెళ్ళాడు. ఆశ్రమంలో భరతునిని ఆలింగనం చేసుకున్నట్లే, రామలక్ష్మణులు సుమంత్రున్ని కూడా సమాలింగనం చేసుకొన్నారు.

తండ్రి మరణవార్త వినగానే, విలపిస్తున్న రామున్ని వశిష్టాది మంత్రులంతా ఓదార్చాక వారి సూచన మేరకు జలతర్పణాలు ఇచ్చేందుకు బయలుదేరారు. దశరధమహారాజుకు పరమ ఆప్తుడైన సుమంత్రుడు వారిని మందాకినీ నదిలో స్నానం చేయించాడు. 

ఇక ఉత్తర కాండముకు వస్తే - 

                             
                   


లోకాపవాదం...సీతమ్మను పొలిమేరలు దాటించి, గంగానది ఆవలి ఒడ్డున ఆశ్రమం చెంతన దిగబెట్టి రావడానికి వెళ్ళిన ఘటనలో...పొలిమేరలు దాటేంతవరకు వెళ్ళిన రధమునకు సారధి సుమంత్రుడే. 



సీతమ్మకు రాముని సందేశం చెప్పి...తిరిగి వచ్చిన లక్ష్మణుని వేదనను చూసి, 

లక్ష్మణా!  ఏ దైవసంకల్పంచేత ఇటువంటి దుఃఖం కలిగిందో, ఆ దైవాన్ని ప్రతిఘటించలేం కదా అని అంటూ, ఓసారి వశిష్ట దుర్వాసమహర్షివారలను దశరధమహారాజు కలిసి మాట్లాడినప్పుడు, నేనూ అక్కడే ఉన్నాను. దుర్వాసమహర్షి అప్పుడు మీతండ్రిగారితో కొన్నిమాటలు చెప్పెను. శ్రీమహావిష్ణువే రాముడని, 11000సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడని, భృగుమహర్షి శాపం వలన భార్య వియోగం అనుభవిస్తాడని... 

తదితర విషయాలు లక్ష్మణునికి చెప్పి ఊరట కల్గించింది సుమంత్రుడే.


ఇలా రామాయణంలో సుమంత్రుడు పాత్ర ఎంతో ప్రశస్తమైనది. బాలకాండము నందు దశరధుడు యాగం చేద్దామనుకున్నప్పుడు, సరైన సమయంలో, సవివరంగా, సరైన సూచన చేసి రాజునకు ప్రియుడైనాడు.
వశిష్టాది మహర్షులకు, మహరాజుకు, రాజపుత్రులకు, రాజపురోహితులకు వినయజ్ఞుడై, తగు సమయంలో, తగు సేవలను అందించి, అందరి గౌరవాభిమానలను పొందిన వ్యక్తి సుమంత్రుడు. 

ఇతడు మహాపరాక్రమవంతుడే కాకుండా సమయాసమయాలు నెఱిగి నేర్పుతో మాట్లాడగల నేర్పరి.ఇతను ఇక్షాకువంశ హితకాముడు, విశ్వాసపాత్రుడు, పరమాప్తుడు.
ఎవరు ఎప్పుడు ఎలా ఎఱుకకు వస్తారో... 
ఏది ఎప్పుడు ఎలా తెలియబరుస్తాడో 
భగవంతునికే ఎఱుక. 
ఇంతకాలంకు సంపూర్ణరామాయణం చదవడం ప్రాప్తిఅయింది. నా అవగాహనారాహిత్యం నాకు తెలియజెప్పిన మిత్రురాలు 'విశాల'కు వందనాలు🙏🙏🙏