26, ఆగస్టు 2015, బుధవారం

జీవాత్మ-పరమాత్మ --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి [ఆరవభాగం]


గత టపాల్లో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధచక్రాలు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆరవచక్రమైన ఆజ్ఞాచక్రం గురించి తెలుసుకుందాం -
ఆజ్ఞాచక్రం -
ఐం హ్రీం శ్రీం హాం హం సశ్శివస్సోహం సోహం, సశ్శివ ఆజ్ఞాదిష్టాన దేవతాయై హాకినీ సహిత పరమాత్మస్వరూపిణ్యై నమః
ఈ కమలం రెండు దళాలుతో వుంటుంది. మనోతత్త్వం. అధిదేవత హాకీని. ఈమె హ, క్ష అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమెకు పులిహార ప్రీతి. ఈమె మజ్జాధాతువునకు అధిపతి.
భ్రూమధ్యమందు విలసిల్లే ఈ చక్రం మనలో 3,240 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఈ స్థానం మనస్సుకు మనకు సంధానం చేస్తుంది. ఇది ఈ శరీర మనే ఆలయానికి గర్భగుడి ద్వారం లాంటిది. 

ధ్యానమను స్థితిచేత ప్రకాశించు ఈ చక్ర కమలమందు రెండు దళాలు కలవని తెలుసుకున్నాం. ధ్యానమనగా ధ్యానింపబడు విషయం, ధ్యానించువాడు అను రెండు మాత్రమే కలిగిన స్థితి. 'హ'కారం, 'క్ష'కారం అను రెండు దళాలతో కూడిన ఈ పద్మం అదే స్థితిని సూచిస్తుంది. ద్యానింపబడు పరమాత్మ, ధ్యానించే జీవాత్మ మాత్రమే వుండే స్థితి. ఈ ధ్యానంను సాధన చేస్తే జ్ఞాననేత్రం తెరుచుకొని ఆత్మదర్శనం అవుతుంది. ఇది సంపూర్ణత్వాన్ని సిద్ధింపజేసే చక్రం. తద్వారా పొందే స్థితి బ్రహ్మత్వపు స్థితి. బ్రహ్మమే తానని తెలుసుకునే స్థితి. ఇక్కడ అన్నింటిని పరిత్యజించి జీవుడు బ్రహ్మభూతుడవుతాడు . సాధకుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. 

 'శ్వాస' ప్రక్రియకూ, ఆధ్యాత్మిక శక్తికీ చాలా సంబంధముంది. స్థూలశరీరానికి సంబంధించి లంగ్స్, తద్వారా హార్ట్, బ్లడ్ లో ఆక్సిజన్ సరిపడినంతగా సరఫరా చేయటానికి ఈ శ్వాస ప్రక్రియే ఆధారం. అందులోని  వొడిదుడుకులు సరిచెయ్యటానికి, దాని శక్తి యింకా పెంచటానికి ప్రాణాయామం ఎంతో తోడ్పడుతుంది. ఈ శ్వాస వలన వచ్చేశక్తి స్థూలశరీరానికి ఎంత అవసరమో, సూక్ష్మశరీరానికి కూడా అంతే అవసరం. మనం లోపలకు తీసుకునే గాలి మూలాధారం వరకు వెళ్ళి, తిరిగి పైకి వస్తూ స్వాధిష్టాన చక్రంలో చైతన్యం పొంది ప్రాణశక్తిగా, జీవశక్తిగా మారుతుంది. తద్వారా ఇడా పింగళ సుషుమ్నా నాడుల ద్వారా ఆజ్ఞాచక్రంకు చేరుతుంది. ఈ చక్రమే శ్వాస చంచలగతిని అదుపుచేసి క్రమక్రమంగా నిశ్శలం చేసి కైవల్యానికీ, మోక్షానికీ, జీవన్ముక్తికీ కారణమౌతుంది. ఈ చక్రాన్నే దివ్యనేత్రమనీ, జ్ఞానచక్షువనీ అంటారు. అలానే ఈ స్థానాన్నే త్రివేణీసంగమం అంటారు. 'త్రివేణిసంగమం' గురించి మరికొంత వివరణకై  ఇక్కడ చూడండి.  
ఈ చక్రంనకు పంచకోశాలలో విజ్ఞానమయకోశంతో సంబంధం. శారీరక వ్యవస్థలోని రక్తప్రసరణవ్యవస్థతో సంబంధం.

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
రక్తక్షీణత, రక్తస్రావం అను వ్యాధులు సంభవించును. వినాళ గ్రంధులవ్యాధులు, అధిక రక్తపోటు, ప్రేగులలో పుండ్లు లాంటి వ్యాధులు కలుగును.  
ఈ చక్ర మానసిక స్వభావం -
మూసుకుపోవడం వలన మానసిక స్థిరత్వం లేకపోవటం, కనులలో లోపాలు,క్షమాగుణం లేకపోవటం, నిరాశ నిస్పృహలతో కూడిన అలసట, అన్ని విషయాలయందు సందేహస్పదులు.  
తెరుచుకుంటే మనసులో, దృష్టిలో స్థిరత్వం, ఏకాగ్రత వుంటుంది. సూక్ష్మ బుద్ధి అలవడుతుంది. వివేకానికి మూలమై సత్యాన్ని గ్రహించమని నిర్దేశిస్తుంది. ఆధ్యాత్మికమైన శక్తి, ఆలోచన, అంతరదృష్టిలను  పెంపొందిస్తుంది. నీటియందు మంచుగడ్డ కరిగిపోయినట్లు 'నేన'ను అహం అంతర్యామి యందు కరిగిపోవును. 
ఈ చక్రమును శుద్ధిచేసుకోవడం ఎలా???
శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రంనకు హాకీని అధిష్టానదేవత. ఈమెకు పులిహార మందు ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే పులిహారను స్వీకరించుచూ, వ్యాధులను బట్టి అవసరమైనచో తగు ఔషదములను ఉపయోగిస్తూ 'ఓం' అను బీజాక్షరమును ధ్యానించువారికి ఈ వ్యాధులు నివారణ కాగలవు. ఓంకారం వేదమునకు మొట్టమొదటి బీజం. ఈ ఓంకారం వివరణకై ఇక్కడ ఓంకారం - 1&2చూడండి.
ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
నియంత్రణతో కూడిన భావనలు చేయడం అవసరం. ధారణ, ధ్యానం ఇందుకు ఉపకరిస్తుంది.
ఈ చక్రమునకు అధిపతి గ్రహం చంద్రుడు. మనిషి మానసిక స్థితికి, ధన సంపాదనకు చంద్రుడు కారకుడు. చంద్రుడు ఎప్పుడూ ఒకేలా వుండడు. వృద్ధి క్షయాలు కలిగినవాడు. అందుకే జాతకంనందు చంద్రుడు సరిగ్గా లేకుంటే చంచల స్వభావం కలిగి వుంటారు. చంద్రుడు నీటికి కారకుడు. అందువల్ల మంచినీరు ఎక్కువగా త్రాగాలి. అలాగే చంద్రుడు తెలుపువర్ణమునకు సంకేతం కావున సాధ్యమైనంతవరకు తెలుపురంగు వస్త్రాలు ధరించడం, ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు వుండేలా అభ్యాసం చేయడం, మృదువుగా మసులుకోవడం చేస్తే చంద్రానుగ్రహం సాధించినట్లే. తత్ఫలితంగా ఆజ్ఞాచక్రం సానుకూలంగా పనిచేస్తుంది.
తదుపరి చక్రం 'సహస్రారం' గురించి తదుపరి టపాలో ...

21, ఆగస్టు 2015, శుక్రవారం

మాటే మంత్రం --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి [ఐదవభాగం]

అర్ధవంతమైన ఆదర్శవంతమైన జీవితానికి, నైతికవర్తనతో కూడిన జీవనానికి ఆధ్యాత్మిక పురోగామిత్యమే మార్గదర్శకంగా వుంటుంది. ఈ ఆధ్యాత్మిక పురోగతి ఎలా సాధ్యమో తెలియజేస్తున్నాయి మన శాస్త్రములు. శాస్త్రములు అంటే యోగులు, జ్ఞానులు స్వానుభవం బట్టి నిర్ణయించిన సరళధర్మములు. వాటిని అవగాహన చేసుకొని ఆచరిస్తే పారమార్ధికంగా పురోగతి సాధించవచ్చు.

నా అవగాహన మేరకు మనలో ఉన్న సప్తచక్రములు గురించి, ఆ సప్తచక్రాలలో జాగృతి తీసుకువచ్చే సప్తగ్రహాలు గురించి తెలిపే ప్రయత్నం కొన్ని టపాలా ద్వారా తెలియజేస్తున్నాను. 

ప్రతీ చక్రానికీ, ప్రతీ గ్రహానికీ  శారీరక, మానసిక, లేక ప్రాపంచిక, పారమార్దికంగా విధులు ఉంటాయి. ప్రతీ చక్రకేంద్రమునకు ఉద్భోదనము, ఉత్తేజం కలిగించు శబ్దములు లేక అక్షరములు కొన్ని కలవు. వీటిని ఓ క్రమమైన పద్ధతిలో ఉచ్చరించుటవలన ఈ కేంద్రముల ప్రవృత్తిల యందు మార్పులు కలిగి ఆ చక్రాలలో తేడాలు సర్దుబాటుయగును. దానివలన వ్యాధులు నిర్మూలనమగును. ఈ బీజాక్షరములను సరైన పద్ధతిలో ధ్యానించడం వలన  అనారోగ్యములు తొలగడమే కాకుండా మానసిక వికారములు కూడా పోయి బుద్ధి వికసించును. అయితే ఈ విధమైన సాధన కష్టమని భావించేవారికి కొన్ని సులభమార్గములను మన యోగులు సూచించారు. గ్రహాలను సానుకూలపర్చుకోవడం ద్వారా, ధ్యానసాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమేనని తెలిపారు. గ్రహాలనుండి అనుగ్రహ ప్రవాహాన్ని స్వీకరించే శక్తి మనలో వున్న చక్రాలుకు వుంది. అందుకే గ్రహాలను సానుకూలంగా పనిచేయాలంటే ఏం చేయాలో సూచించారు. ఆ సూచన సద్గుణాల సాధన. ఈ విధమైన అంటే గ్రహాలను సానుకూలపరుచుకునే సాధన సాగించిన కొలదియు భక్తీ, ధ్యానం, చక్రజాగృతి, ఆత్మార్పణం ... ఇతరసుగుణములు ఒకటొకటిగా అంతరంగం నుండి వికాసం నొందును.  ధ్యానమంటే మనలో వున్న మాలిన్యాన్ని తొలగించుకోవడమే. ధ్యానం ద్వారా మాత్రమే మనస్సుకు వారసత్వంగా సంక్రమించిన స్వభావంనుండి విడుదల కావడం సాధ్యమవుతుంది. 

గత నాలుగు టపాల్లో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత చక్రముల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఐదవ చక్రమైన విశుద్ధిచక్రం గురించి తెలుసుకుందాం -

విశుద్ధిచక్రం - 
 
ఐం హ్రీం శ్రీం రాం సోహం హంసశ్శివం: విశుధ్యధిష్టానదేవతాయై డాకినీ సహిత జీవేశ్వర స్వరూపిణ్యాంబాయై నమః

ఈ కమలం 16 దళాలుతో ఉంటుంది. ఆకాశతత్త్వం. అధిదేవత డాకిని. ఈమె అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ, ఎ, ఏ , ఓ, ఔ , అం ,అః   అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమెకు పాయసాన్నమందు ప్రీతి. తెల్లని ఏనుగు (ఐరావతం) వాహనం.  

కంఠప్రదేశం వెనుక వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 25,344 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. విశుద్ధి అంటే పవిత్రం (శుద్ధి) చేసేది అని అర్ధం. ఈ చక్రాన్ని సాధిస్తే పరమ పవిత్రులై, ఆత్మదర్శనానికి వున్న అడ్డంకులు తొలగించుకున్నవారై, తాము తెలుసుకున్నదానిని ఇతరులకు చక్కగా బోధించగలరు. ఈ చక్రంనకు పంచకోశాలలో విజ్ఞానమయకోశంతో సంబంధం.  జ్ఞానేంద్రియం చెవి. 

ప్రతీ మనిషికి వాక్కు చాలా ముఖ్యమైనది. తనని తాను వ్యక్తపరుచుకోవటానికి వాక్కు చాలా అవసరం. మన సంస్కారమును తెలిపేది వాక్కే. అందుకే పెద్దలంటారు - 'బుర్ర(తల) విలువ నోరు చెప్తుంది' అని! ఊరికే మాట్లాడడం కాదు, చక్కగా మాట్లాడగలగాలి. మృదుభాషణం చక్కటి సంబంధ భాంధవ్యాలను నెలకొల్పుతుంది. పరుషవాక్కులు, వక్రభాషణం ఎన్నో అనర్ధాలను అంటగడుతుంది. మంచి స్నేహాలను, మంచి బంధాలను, సామరస్యవాతవరణం నుంచి దూరం చేస్తుంది. అలానే మాట్లాడకూడని సమయంలో మాట్లాడినా, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోయినా పొందవలసిన జీవితం చేజారిపోయినట్లే. ఇంత ముఖ్యమైన వాక్కుకు కారణం కంఠభాగంలో ఉన్న ఈ విశుద్ధచక్రమే. మాట ఎలా వుండాలంటే  ...  వివరణకై  ఇక్కడ చూడండి 

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
ముక్కు, నోరు, గొంతు, చెవులు మున్నగు భాగములకు సంబంధించిన వ్యాధులన్నియూ ఈ చక్రం పరిధిలోనికే వచ్చును. థైరాయిడ్ సమస్యలు వచ్చును. మాటలు సరిగ్గా రాకపోవడం, ఎలర్జీ, ఆస్తమ, టాన్సిల్స్ మొదలైన వ్యాధులు కలుగుతాయి. సంతానలేమికి కూడా ఈ చక్రం కొంత కారణం. 

ఈ చక్ర మానసిక స్వభావం:-
మూసుకుపోవడం వలన భావవ్యక్తీకరణలో లోపం. వాక్కులో అనేక అపసవ్యాలు. ఊహాశక్తి లోపిస్తుంది. 

తెరుచుకుంటే వాక్సుద్ధి. కవితాశక్తి, స్వర విజ్ఞానం, శాంతచిత్తం, శోకం లేకపోవడం, దీర్ఘాయువు. 

 విజ్ఞానమయకోశంతో సంబంధం ఉన్న ఈ విశుద్ధచక్రం ద్వంద్వాతీత చక్రం. చైతన్యపూరిత చక్రం. ఇక్కడకు చేరిన సాధకుడు ఆనందస్థితిని పొందుతాడు. ఈ ఆనందపారవశ్యంలో తదుపరి గమ్యాన్ని మరిచిపోకుండా ముందుకు సాగాలి. ఇక్కడే ఆత్మజ్ఞానం కల్గుతుంది. అహం నశిస్తుంది. నేను అనే తత్త్వం పూర్తిగా నశించి, నేను 'ఆత్మ'పరమై నా ఆత్మ అన్న భావం నుండి విశ్వాత్మ భావన లోనికి మారి, సాధకుడు కవి, వాగ్మి, బ్రహ్మజ్ఞాని అవుతాడు. భూత, భవిష్యత్తు, వర్తమానములను దర్శింపగలుగుతారు. జీవించుట తనకోసంకాక సృష్టి యందలి సకల జీవుల రూపంలలో నున్న పరమాత్మకొరకని తెలుసుకొని తదనుగుణంగా జీవిస్తాడు. విశ్వశ్రేయస్సును సాధించువాడగుటచే శోకం గానీ, రోగంగాని లేక చిరంజీవియై యుందురు. ఈ చక్రం శుభమును కోరువారికి, ఇంద్రియనిగ్రహం గలవారికి మోక్షద్వారం. 

ఈ చక్రమందు పదహారు దళాల యందు అ నుండి అః వరకు గల పదహారు అక్షరములు పదహారు కళలు. అమావాస్య నుండి పౌర్ణమి వరకు గల చంద్రుని పదహారు కళలే ఈ పదహారు రూపములు. చంద్రుడు మాతృత్వమునకు, గర్భధారణకు అధిపతి. అమావాస్య సృష్టి లయమై యున్న స్థితిని, పౌర్ణమి సృష్టి పూర్తిగా వ్యక్తమైయున్న స్థితిని తెలియజేయును. 

మరి ఈ చక్రమును ఎలా శుద్ధిచేసుకోవడం???
శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రంనకు డాకిని అధిష్టానదేవత. ఈమెకు పాయసాన్నం నందు ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే పాయసాన్నం స్వీకరించుచూ, వ్యాధులను బట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ, 'హం' అను బీజాక్షరంను ధ్యానించువారికి ఈ వ్యాధులు నివారణ కాగలవు. 

ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే - 

నిర్మలమైన నీలాకాశాన్ని చూడాలి. ఈ చక్రంపై మనస్సును నిలిపి ధ్యానం చేస్తూ ఉంటే మనస్సు ఆకాశంవలె పరిశుద్ధం అవుతుంది. నిర్మలమౌతుంది. 
ఈ చక్రంనకు అధిపతి కుజుడు. ధైర్య సాహసాలకు సంబంధించిన గ్రహమిది. కుజుడు బాగా వేగం వున్నవాడు. పటుత్వం వున్నవాడు. అగ్నికి, ఆయుధాలకు సంబంధించినవాడు. ఎక్కడ స్థిరత్వముందో, ఎక్కడ కాళ్ళ క్రింద భూమి కృంగిపోతున్నా చలించని ఆత్మవిశ్వాసముందో, ఎక్కడ సూటిదనముందో, ఎక్కడ సమానత్వముందో అక్కడ కుజుని శక్తి అపారంగా వున్నట్లు అర్ధం. మనలో ఈ లక్షణములను అభివృద్ధి పరుచుకుంటే ఈ చక్రం సానుకూలంగా పనిచేస్తుంది. తద్వారా విశుద్ధి చక్రం సానుకూలం. 

తదుపరిచక్రం 'ఆజ్ఞాచక్రం' గురించి తదుపరి టపాలో ...