2, డిసెంబర్ 2018, ఆదివారం

స్వీయ సంఘర్షణ

గత కొద్దిరోజులుగా కాస్త అస్వస్థత. ఆ కారణంగా నిద్రలేమి, నీరసం, అలసట. నిన్నటిరోజు వేకువన, కాస్త సహజ సిద్ధమైన గాలికై మేడ మీదకు వెళ్లాను. మా ఇంటికి కాస్త దూరంలో టైరులను కాల్చుతుండడంతో ... ఆ వాసనతో కలుషితమైన గాలి... ప్చ్!
కొంతసేపు అనంతరం - పనమ్మాయి రాక, ఆమె అంట్లు తోము చున్నంతసేపు పూర్తిగా కొళాయి ఇప్పేసి బకెట్ నిండి, నీరు వృధాగా పోతున్నా, పని పూర్తయ్యేవరకు కట్టదు ఎన్నిసార్లు చెప్పిన, చెప్పిన రెండుమూడురోజులు వరకు  మాత్రమే మాట వినడం. అటుపై యధాస్థితి... నీరు కరువై కొందరు, నీరు  వృధా చేస్తూ కొందరు ఇక్కడ జల దుర్వినియోగం, మరొక చోట వ్యర్ధ పదార్థాలతో జలకాలుష్యం ... ప్చ్.
సాయంత్రం ఓ పని నిమిత్తం బయటకు వెళ్తూ, శివాలయం దగ్గర ఆగాను. శివాలయం ప్రహరీ ముందు కొబ్బరిపెంకులు, వాడినపువ్వులు, ఖాళీ పాల కవర్లు, విరిగిన మట్టిప్రమిదలు, ప్లాస్టిక్ కవర్లు ..... కుప్పలా చెత్త. ఆ చెత్తలో ఏదో వెతుక్కొని తింటూ రెండు కుక్కలు,  పాలపాకెట్ పీకుతున్న ఆవు ...  పరిసరాల కాలుష్యం...  ప్చ్!
ఇలా వ్యర్ధాలతో గాలి, నీరు, భూమి ... కలుషితం కావడం ... ఏదో బాధ... దాని గురించే ఆలోచనలు. నాలో నాకే సంఘర్షణ. ఒంట్లో బాగుండదానివి బాగలేనట్లు వుండక, ఎందుకే ఇన్ని ఆలోచనలు అని నాలో నేననుకున్నా, విదిలించుకున్న వదలక మదిలో కదిలాడే అవే దృశ్యాలు, అవే ఆలోచనలు. .

బాగుందోయి, గుడికి వెళ్ళినవారు కొబ్బరికాయలు, పండ్లు, అభిషేకముకై పాలు తీసుకెళ్తారు కదా, కార్తీకమాసమాయే, అసలే శివయ్య అభిషేకప్రియుడాయే, ఇవన్నీ సహజమేనమ్మా, భక్తులు ఏదో తమ భక్తానుసారం భగవంతుణ్ణి ఇలా ఫల పుష్ప క్షీరాదులతో సేవిస్తుంటారు, నీవు కూడా అప్పుడప్పుడు పంచామృతాలతో, క్షీరాదులతో నమక చమకాల నడుమ అభిషేకాలు చేస్తుంటావు కదా, అయినా కృష్ణపరమాత్మే చెప్పాడు కదా, పత్రం పుష్పం ఫలం తోయం ... అని!
ఆ అన్నట్లు, గతంలో నీవొ పోస్ట్ లో- సత్కర్మలకు, సాధనలకు పవిత్రంగా ఉపయోగించే దేహ'పత్రం'ను, ఎలాంటి కలుషితాలు అంటని స్వచ్ఛమైన హృదయ'పుష్మము'ను, నిష్కామ కర్మ'ఫలా'న్ని, 'తోయమ'నే భక్తిరసంతో మేళవించి కృష్ణార్పణం చేయడమే ఆ శ్లోకంకు అర్ధమంటూ పెట్టావు కదా, అందరూ అలా అనుకొని ఉండలేరమ్మా ... అంటూ మరల మనసు గోల ... 
నిజమే,  నేను పోస్ట్ పెట్టాను. నేనే కాదు ఎందరెందరో వివిధరీతుల్లో ఈ శ్లోకంకు అర్ధం తెలిపారు. అయితే ఆ శ్లోకం చివరలో ఓ మాట జోడించి చెప్పారు కృష్ణపరమాత్మ, 'ప్రయతాత్మనః' అని!  ప్రయతాత్మనః అంటే పరిశుద్ధమైన మనస్సు కలవాడని అర్ధం. పరిశుద్ధమనస్సు కలవాడు తన భక్తికొలది సమర్పించిన పత్రపుష్పాదులను స్వీకరిస్తానని తెలిపాడు. ఆ పరిశుద్ధత మనస్సుకు ఎలా వస్తుంది? శుభ్రత లేని నడవడిక మనస్సును శుద్ధత పరుస్తుందా?
దుర్వాసన వస్తే భరించలేక ముక్కు మూసుకుంటూ అక్కడనుండి వెళ్ళిపోతాం,  కలుషితనీరు త్రాగం, అటువంటి నీరు ఉన్నచోటునుండి నిలబడలేం. కలుషిత పదార్ధాలు భుజించలేం, సరికదా, పరిసరాలు బాగుండని చోట మంచి ఆహరమును  కూడా స్వీకరించలేం, ఇటువంటి ప్రదేశాల్లో మన మనస్సు కూడా ఏకాగ్రతగా ప్రశాంతంగా స్థిరంగా ఉండలేదు కదా. అందుకే అంటున్నా -  మన చేతలు మన మనస్సుని పరిసరాలను శుభ్రపరిచేవిగా ఉండాలి.
ఇక, అభిషేకాలు చేయడం, ఫలపుష్పాదులు సమర్పించడం తప్పని అనడంలేదే, పరిసరాలు కలుషితం చేయడం తప్పంటున్నాను. పూజ అనంతరం అనవసర వ్యర్ధాలను అలా శివాలయ పరిసరమందే పారెయ్యక, వాటిని ఓ మూత  ఉన్న చెత్తడబ్బాలో పడేయడం చేయాలిగానీ, ప్చ్... మరల నిట్టూర్పా ... అసలు ఎందుకే నీకింత బాధా ... ఎవరో నాలో నన్నే నిలేస్తున్న భావన... అవునూ ... ఎందుకింత బాధా? నన్ను నేనే ప్రశ్నించుకున్నా ... అప్పుడు నాలో కదిలాడారు నా కుటుంబ పెద్దలు. 

నా చిన్నప్పుడు మాది కట్టెల పొయ్యే. ఉదయాన్నే మా మేనత్తగారు గానీ, అమ్మగానీ, చిక్కటి పేడనీటిలో ముంచిన చిన్న బట్టతో పొయ్యి అలికి, ముగ్గులేసి, కట్టెలు పెట్టి, వెలిగించి, నమస్కరించి వంట ప్రారంభించేవారు. నూతి దగ్గర, ముందు తోడిన చేదలో నీటిని గానీ, అలాగే మున్సిపాలిటీ కొళాయి నీరు బిందెలో పట్టేముందు గానీ, ముందు నీటిని తాకి, కళ్ళకు అద్దుకునేవారు. అసలు లేస్తూనే భగవత్ స్మరణతో భూమిని తాకి నమస్కరించేవారు. ఎందుకని అడగగా, అన్నింటా ఉన్నది ఆ భగవంతుడేనమ్మా, ఆయన స్వరూపములైన వీటిని నమస్కరిస్తే, ఆ నమస్కారం ఆ భగవంతునికే  చేరుతుందని తాతయ్య చెప్పడం బాగా జ్ఞాపకం. ఆనాడు వారు చెప్పింది అంతా చాదస్తమని భావించి తర్కానికి దిగాను. పెద్దయ్యాక అవగాహన కొచ్చింది. ఆచరణలో పెట్టాక సాత్వికత అలవడింది. అగ్నిదేవుడని, వాయుదేవుడని, జలదేవతయని, భూదేవియని ఇలా అన్నింటా దేవుడును, దేవతని చూసే సంస్కృతి మనది. పెద్దవారు వారి వారి పనుల ద్వారా ప్రకృతిని ఆరాధించడం తెలియజేశారు. కానీ, మనం ఏం చేస్తున్నాం? 

 ఆధ్యాత్మికత అంటే వాదన కాదు, విశ్వాసం. ఆధ్యాత్మికత తర్కంగా ప్రారంభమై, సత్యంగా నిలిచి, జగమంతా కనిపించి, సర్వమూ సర్వేశ్వరుడే అన్న సమ్మతితో ముగుస్తుంది.  
              
పరమేశ్వరునికి "అష్టతనువులు" అన్న పేరుంది. వేమనగారు కూడ తన పద్యాలలో చెప్పారు, 'అష్టతనువు లమర హరుడౌట నెఱుగరో' అని. 

మాయా ఉపాధిచే అంతటా వ్యాపించి వున్న సర్వేశ్వరునికి - వాయువు, భూమి, జలము, అగ్ని, ఆకాశం,  మహాతత్వం, అవ్యక్త తత్త్వం, అహంకార తత్త్వం అనే ఎనిమిది రకాల తత్త్వములను తనువులుగా చెప్తుంటారు మహర్షులు. అంటే వాయువు, భూమి, జలము, అగ్ని, ఆకాశమనే పంచభూతాలు పరమాత్ముని మొదట అయిదు తనువులు. భగవంతుణ్ణి అభిషేకించే మనం, శుద్ధంగా పూజించే మనం ఆయన తనువులైనట్టి గాలి, నీరు, భూమిలను శుద్ధంగా ఉంచుకోవద్దా? పరమాత్ముని పట్ల అపేక్ష, ఆయన తనువుల పట్ల ఉపేక్షా... తగునా ఇది? పరమాత్మను పవిత్రంగా భావించినట్లే పరమాత్మ సృజనను కూడా పవిత్రంగా తలచి, ఉంచాలన్నదే నా భావన. మన పరిసరాలు బాగుంటే మనం ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉంటాం, తద్వారా మన మనస్సు శుద్ధత పొందుతుంది. 
                                              


ఈ సృష్టి యావత్తు పంచభూతాల సంయోగమే.ఈ చరాచర విశ్వాలన్నీ పంచభూతాల జనితమే. అందుకే పెద్దలు అంటుంటారు - "దేవుడిని తలంచని జీవులుంటారు కానీ, జీవుడిని స్పర్శించని దేవుడు లేడు" అని! 

భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా
నాయొక్క ఈ మాయ, భూమి, జలం , అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అని ఎనిమిది విధములుగా విభజించబడిందని గీత యందు పరమాత్మ చెప్తారు కదా. 

పంచభూతములు బ్రహ్మాండంలోనూ, మనలోనూ ఉన్నవి. ఈ పంచభూతాలు మరియు మనస్సు, బుద్ధి, అహంకారం అనే తనువులు మనవి. ఈ పంచభూతాల సమ్మిళిత స్వరూపమే మన దేహం. ఇక ఈ దేహమును చైతన్యవంతం చేయుటకు జీవశక్తి అవసరం. ఆ జీవశక్తి కూడా ఈ పంచభూతాల సమ్మిళితమే.
స్థూల దేహంలో - పంచభూతాలకు ప్రతీకలుగా పంచేంద్రియాలు (చెవి, నాసిక, నేత్రం, నాలుక చర్మం) ఉంటే,  సూక్ష్మ దేహంలో పంచ కోశాలుగా అమరివున్నాయి. అంతేకాదు,భూతత్వంనకు చెందిన మూలాధారం, జలతత్వానికి చెందిన స్వాధిష్టానం,  అగ్నితత్త్వానికి ప్రతీకగా మణిపూరకచక్రం, వాయువుకు ప్రతీకగా అనాహతం, ఆకాశతత్త్వానికి ప్రతీకగా విశుద్ధిచక్రం అనే ఐదు శక్తి నాడీకేంద్రములున్నాయి మనలో. 

మన నడవడిక, అలవాట్లు, ఆలోచనలు, సంస్కారాలు, ప్రారబ్ధ వాసనలు బట్టి ప్రభావితమౌతూ పైవన్నీ పనిచేస్తుంటాయి. మన చేష్టలు సక్రమంగా లేకుంటే ఇవి క్రమ క్రమంగా శక్తిని కోల్పోతుంటాయి. అందుకే అనేక శారీరక మానసిక అనారోగ్యాలు. పంచేద్రియాలు, పంచకోశాలు, పంచ చక్రాలు జాగృతి పరచాలంటే బాహ్యమున, అంతరమున అష్టతనువులను శుద్ధతగా వుంచితే చాలు. 
ప్రకృతిలో ఉన్న ఈ పంచభూతాలు మనలోనూ ఉండడమే కాదు, వాటి యొక్క ఆశ్రయంతోనే మనం జీవిస్తున్నాం. అది మరిచి, నిప్పు, నీరు, నేల, గాలి లను కలుషితం చేస్తే ముప్పు మనకే కదా, మరి అది తప్పు కాదా? 
ప్రకృతిని ప్రాపంచికంగా సద్వినియోగపరుచుకుంటూ, పారమార్థికంగా పరమాత్మస్వరూపమనే ఆపేక్షభావంతో  చూడగలగాలి. అప్పుడే సర్వత్రా సర్వేశ్వరుడున్నాడన్న భావన మనలో బలీయమౌతుంది. ఎప్పుడైతే మనం కాంచినదంతా  పరమాత్మమయంగా భావించి దానిని పవిత్రంగా చూస్తామో, అప్పుడే మన అంతరంగాలు ఆటోమేటిక్ గా పవిత్రమవుతాయి.


ఎన్ని పూజలు చేస్తేనేం? ఎన్ని సాధనలు చేస్తేనేం? 'భావశుద్ధివిహీనానాం సమస్తం కర్మ నిష్ఫలమ్'...  భావశుద్ధి సంపూర్ణముగా కలగనివారి సమస్త కర్మలును నిష్పలములు.  

సాధారణముగా సాధకుని సాధనాక్రమం - భగవంతుడు ఉన్నాడనే భక్తిభావంతో ప్రారంభమై, నామస్మరణతో కొంత ముందుకెళ్లి, నాలో ఈశ్వరుడు ఉన్నాడు అనే నమ్మికతో దృఢపడి, సర్వత్రా సర్వేశరుడున్నాడనే స్ఫురణతో పుంజుకొని, "నేను" గా ఈశ్వరుడు ఉన్నాడు అనే ఎఱుకతో మౌనమౌతాడు. ఆ స్థితికి రావాలంటే అందుకు సహకరించాల్సినవి ఈ అష్టతనువులే. 

భగవంతుని అష్టతనువులు ప్రకృతిగా భాసిల్లుతూ, చైతన్యంగా మనకు కావాల్సిన ప్రజ్ఞానాన్ని అందిస్తుంటుంది. మన అంతరంగాన్ని శుద్ధి చేయటం, మన చూపును పారదర్శకం చేయటం, పరమేశ్వరుని తత్త్వం ఎరుక పర్చటమే వాటి లక్ష్యం. ఆ లక్ష్యంతో మనం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాటి ధర్మాలను వీడక వర్తిస్తున్నాయి. కానీ, ఆ ప్రజ్ఞానం మనకు ఎందుకు అందడం లేదో, అందరం గ్రహిస్తే  బాగుంటుంది. 
దేనినీ పట్టించుకోకుండా, విమర్శించకుండా ముందుకు సాగిపోతున్నఅప్పుడప్పుడూ ఇలాంటి స్వీయ సంఘర్షణలు తప్పడంలేదు.  

19, నవంబర్ 2018, సోమవారం

శివోహం

                                         

వేదాలలో 'యజుర్వేదం' గొప్పది. యజుర్వేదంలో నాల్గవకాండలో ఉన్న 'రుద్రం' ఇంకా గొప్పది. రుద్రం మధ్యలో ఉన్న 'పంచాక్షరి' అంతకంటే గొప్పది. పంచాక్షరి లోని రెండక్షరాలు మరీ గొప్పవి. ఆ రెండక్షరాలు - "శివ".  శివ అంటే మంగళం శుభం అని అర్ధం.
                                             - శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు 

నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే ... ఈ సంసారిక జీవితంలో మానవజన్మ తరించాలంటే నామ స్మరణ చేయాలి. భగవంతుణ్ణి చేరే మార్గంలో నామస్మరణం ఉత్తమం. శివ అనే రెండక్షరాలు పరబ్రహ్మ స్వరూపం. 'శి' అంటే పాపనాశనం. 'వ'అంటే ముక్తిప్రదానం.

లోకసమస్తాన్ని తనలో నిలుపుకొని, తానే లోకమైన విశ్వనాధుడు ఈశ్వరుడు. ఆదిదేవుడు, ఆద్యంతరహితుడు అయిన శివుడు మన జీవనతాత్త్వికతకు అతిసన్నిహితంగా ఉంటాడు. సుఖదుఃఖాలు అనే ద్వంద్వాల నడుమ సాగే మన జీవనయానంలో ద్వంద్వాలన్నింటినీ ఏకంచేసే అద్వయమూర్తిగా గోచరిస్తాడు.  
ప్రమధాది గణాలను నియంత్రించే సర్వాత్మకుడైన పరమశివుడే ఇంద్రియాల్ని నియంత్రించగలిగిన శక్తిమంతుడు. 
కాలకూట విషాన్ని, శేషనాగును కంఠంలో ధరించి ఉండటం ద్వారా మృత్యుంజయ రూపత్వం విశదమౌతుంది. గంగను శిరస్సుపై ధరించి విశ్వముక్తి మూలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అగ్నిమయమైన తృతీయ నేత్రం దగ్గరే చంద్రకళను ధరించి ఉండడం వల్ల సంహారకర్త పోషకత్వరూపమై విరుద్ధ ధర్మాశ్రయత్వాన్ని దిగ్దర్శితం చేస్తున్నట్లు తెలుస్తుంది. సర్వలోకాధిపతియై కూడా విభూతీ వ్యాఘ్రచర్మాన్ని ధరించి  పామును మెడలో వేసుకొని, కపాలం చేబూని శ్మశానంలో తిరుగాడే లోకశివశంకరుడు వైరాగ్యంనే శ్రేష్ఠమైనదిగా వ్యక్తం చేస్తున్నాడు. 
                                                   

అణిమాది అష్టసిద్దులున్న - ఒంటికి పూసుకునేది భస్మమే. చుట్టుకున్నది గజవస్త్రమే. ధరించేది నాగభరణాలే. శివుని మూడోనేత్రం జ్ఞాననేత్రం. నటరాజు స్వరూపం - కళాంతరంగుడైన శివుని కళా స్వరూపానికి ప్రతీక. స్వచ్ఛతకు హిమాలయం మారుపేరు. ధర్మరూపమైన వృషభమే వాహనం. చంద్రుడు చిత్తానికి ప్రతినిధి. గంగ చంచలత్వానికి గుర్తు. పులి స్వార్ధ చింతనకు మరో రూపం. ఏనుగంటే నిలువంత గర్వం. వాటన్నింటిని జయించమని చెబుతుంది శివతత్వం. నంది ధర్మానికి సర్పాలు నిర్భయత్వానికి నిదర్శనం.

భస్మాన్ని ధరించిన ఆయన దగ్గర ఏముందీ అని అడుగుతారు కొందరు. కానీ,
భస్మాన్ని మించిన పవిత్రమైనది ఈ సృష్టిలో వేరే ఏమీ లేదు. జన్మాంతర పాపాలను దహించి వేసేదే భస్మం. కాబట్టే, భస్మానికి 'విభూతి' అని పేరు. విభూతి అంటే ఐశ్వర్యమనీ అర్ధముంది. 

తాను గరళాన్ని మింగి  లోకానికి అమృతం దక్కించిన ఈ నీలకంఠుని  నెత్తిన నీళ్లు కుమ్మరిస్తే చాలు, మెచ్చి వరాలు కురిపించేస్తాడు. దోసెడు నీళ్ల అభిషేకం, చిటికెడు బూడిద అలంకారం, కూసిన్ని బిల్వపత్రాలు, కాసిన్ని ఉమ్మెత్తపువ్వులు, 'శంభో శంకర శరణు శరణు' అన్న స్మరణకే పొంగిపోయే బోళాశంకరుడు. .

అందుకే, 
నీలకంఠుని శిరసుపై నీళ్లుచల్లి
పత్తి రిసుమంత ఎవ్వాడు పాఱవైచు
కామధేనువు వానింటి గాడిపసర
మల్ల సురశాభి వానింటి మల్లెచెట్టు
అని  మాదయగారి మల్లన్నవారు కొనియాడరు.  

సామాన్యుడైన, సంపన్నుడయినా, విద్యావంతుడయినా, అవిద్యావంతుడయినా, మిత్రుడయినా,  శత్రువయినా పశువయినా, పురుగయినా ... అందరూ శివయ్యకు సమానమే. అందుకే -
సుహృద్విపక్ష పక్షమో, తృణారవింద చక్షు షో, ప్రజా మహిమహేంద్రయో, సమ ప్రవృత్తికః ... అని శివతాండవస్తోత్రం లో రావణాసురుడు కీర్తిస్తాడు.

సర్వసృష్టి సమానత్వం శివతత్త్వం. ఆస్తికుడు, నాస్తికుడు, జ్ఞాని, అజ్ఞాని, దేవతలు, రాక్షసులు, బలవంతుడు, బలహీనుడు, సర్వగ్రంధ పారాయణుడు, నిరక్షరాసుడు.... అందర్నీఆదరించి అనుగ్రహించే ప్రేమపరవశుడు శివయ్య.
రావణుడు రాక్షసుడని తెలిసినా అనుగ్రహించాడు. భస్మాసురుడు కృతఘ్నుడని తెలిసినా వరమిచ్చాడు.  దోషభూయిష్టుల్ని సైతం నెత్తిన పెట్టుకొనే భక్తసులభడు శంకరుడు. ఎంతటి పాపచరితులనైనా పునీతం చేసే దయాంతరంగడు. 
                                                      


మార్కండేయుడు అల్పాయుష్కుడని తెలిసిన చిరంజీవత్వమును ఒసగేసాడు, తిన్నడు నిరక్షరాసుడయిన ముక్తినిచ్చాడు. 
సాలెపురుగు సర్పం, ఏనుగు ప్రేమకే పరవశించి మోక్షాన్ని ప్రసాదించేసాడు. చెట్టునెక్కి, భయంతో రాత్రంతా మెలుకువగా ఉండడం కోసం కొన్ని ఆకులు వేసేసరికి విలుకాడిని కూడా ఆదరంగా అక్కున చేర్చేసుకున్నాడు. అధికపనులతో కష్టింపజేసిన, అవమానించిన, అవరోధించిన .... నొవ్వక నొప్పించక చెదరని భక్తితో, దీపారాధన చేసే చాకలి పోలికి స్వర్గప్రాప్తినిచ్చాడు. ఒకానొక రోజు, విసుగ్గా ఓ ఇల్లాలు విసిరిన మలిన వస్త్రాన్ని ఆనందంగా స్వీకరించి, శుభ్రపరచి, వత్తులుగా చేసి వెలిగించిన బీద బ్రాహ్మణుకి జీవనముక్తినే ప్రసాదించిన కారుణ్యమూర్తి. ఎంతటి కరుణశాలియో కదా, ఈ గుండె చల్లని దేవర.

వేదాలు -వాదాలు, పాండిత్య చర్చలు - పామరుల ప్రశ్నలు, తర్కాలు - మీమాంసాలు, సోత్కర్షలు - సలహాలు, సొగసులు -బేషజాలు, అవసరం లేదు భక్తికి. స్వచ్ఛమైన ప్రేమ కనబరిస్తే చాలు కదిలిపొతాడు, కరిగిపోతాడు, కరుణిస్తాడు ఈ భక్తవత్సలుడు.
మహాదేవ మహాదేవ మహాదేవేతి యో వదేత్ /
ఏకేన ముక్తిమాప్నోతి ద్వాభ్యాం శంభూ ఋణీ భవేత్ //
మహాదేవ మహాదేవ మహాదేవ అని ముమ్మారు ఉచ్చరించునట్టివారికి ఈశ్వరుడు ఒకమారు స్మరణకు ముక్తినిఛ్చి, మిగిలిన రెండుమార్లు స్మరణకు రుణపడి ఉంటాడు.
చిన్నప్పుడు మా తాతయ్యగారి దగ్గర ఈ శ్లోకం చదివినప్పుడు ఇలా అనిపించేది -
చన్నీటి స్నానాలు, నిత్యా దీపారాధనలు, ఆలయ సందర్శనాలు, అభిషేకాలు అర్చనలు, అష్టోత్తరాలు, శివనామస్మరణలు ... ప్రతీ కార్తీకమాసంలో ఎంతోమంది చేస్తున్నారు. మరి వారికెందుకు ముక్తి రావడం లేదు??? మరి పై కధలన్నీ అబద్దమా??? ఇది అప్పటి నా సందేహం. 
కానీ, అవగాహన ఏర్పడ్డాక తెలుసుకున్నా -
                                                                         
                                                
శివార్చనలో పోటీపడి తమని తాము అర్పించుకునేటంత దృఢభక్తి సాలీడు పాము ఏనుగులకు ఉన్నందునే శివసాయుజ్యమునే ప్రాప్తింపజేశాడు ఆ శ్రీకాళహస్తీశ్వరుడు.  
తనకున్న శక్తిలో నోటిదారాలతోనే తనకై గూడు కాదు, శివునికై గుడి కట్టింది సాలెడు. ఆ రీతిలో మనం కూడా, మన బుద్ధిశక్తిని ఆశలదారాలను ఆస్తులు అంతస్థుల చుట్టూ తిప్పకుండా,  కాస్త పరమేశ్వరార్పణం చేస్తే ముక్తి వస్తుంది.  
తనదగ్గరున్న విలువైన మణిని శివుని ముందు పెట్టి భక్తితో పూజించి తపించేది పాము. అదే రీతిలో మనలో బుసలుకొట్టే అరిషడ్వార్గాల పామును పట్టి పరమాత్ముని చుట్టూ తిప్పి తపిస్తే ముక్తి వస్తుంది.  
తన తొండం నిండా జలమును నింపి అపార భక్తి పరవశంతో శివాభిషేకం చేసేది ఏనుగు. అటులనే దేహమే నేనన్న  బలమైన అహంతో మధించిన మనస్సనే గజాన్ని అంకుశమనే అకుంఠిత భక్తితో అదుపులో పెట్టి శివకైంకర్యానికి ఉపక్రమిస్తే కైవల్యం వస్తుంది.  ఆ మూడింటిలా ఒకే ధ్యాసతో చిత్తశుద్ధితో తపనతో మనమూ ఆరాధించాలి.
                                                             

తిన్నడని బోయవాడు కధకు వస్తే -
తిన్నడు తత్వాన్ని ముందు  గ్రహించండి -
వృక్షమూలంలో శివుణ్ణి దర్శించి, అక్కడే సేవిస్తూ వుండిపోయిన భక్తిత్వమే స్థిరత్వం, ఏ వంకరలు లేని ఏకాగ్రతయే తిన్నని తనం. చెక్కు చెదరని పట్టుదలే ధీరత్వం. మనోదృష్టిని చెదరనీయకుండా శివుణ్ణే దర్శిస్తూ, తన దృష్టిని నమ్మిన శివునికే నివేదించడం సర్వ సమర్పణం. ఆ రీతిలోనే మన దివ్య చక్షువుతో అంతరాలయంలో నున్న శివుణ్ణి దర్శించి,  త్రికరణాలను శివార్పణం చేస్తే మోక్షమొస్తుంది.

శివుని మహిమల్ని గుర్తించి ఆరాధించడమే భక్తి. పై కధల్లో చాలావరకు గతజన్మ పుణ్య ప్రారబ్ధాలు కలిసివచ్చాయని నా భావన. అందుకే పెద్దలు పూర్వజన్మ సుకృతం వుండాలిఅంతారు. మనం కూడా చేసే సాధనాలు వృధా పోవు. ఏ జన్మలోనో కలిసివచ్చి ముక్తిని ప్రసాదిస్తాయి. 
                                                           

శివపూజ -
మనస్సును శుద్ధి చేసుకోవడం "అభిషేకం". అత్యాశలను వదిలించుకోవడం "విభూతి ధారణ". నేనే అన్న అహం, నాదీ అన్న మాయ, నేనే చేస్తున్న అన్న క్రియ - ఈ మూడు భావాలను విడిచిపెట్టడం  "త్రిదళ సమర్పణం". అప్పుడే తేజోమయమైన "ఆత్మలింగం" కాంచగలం.   


26, అక్టోబర్ 2018, శుక్రవారం

బాగు చేసేందుకే బాధలు

మానవులకు మానసికంగా, శారీరకంగా, ఆర్ధికంగా, సంతానంతో, సంతానలేమితో, బంధుమిత్రులతో, బయటవారితో, ఊహించని ఘటనలతో ... ఇలా సమస్యలు అనేకం. ఒకోసారి ఈ సమస్యలు ఒకదాని వెంబడి ఒకటిగా , ఊకుమ్మడిగా ఎదురవ్వడంతో అనేక సతమతలు ...

ఆ పరిస్థితుల్లో - ఆ విపులుణ్ణి, ఈ విపత్తులనుండి విడిపించమని, విన్నవించుకుంటాం ... విముక్తిని కల్గించమని వివిధరీతుల్లో వేడుకుంటాం, విలపిస్తాం, చివరికి విసిగి కలడో లేడో నని సందేహిస్తాం.
                                               


సరిగ్గా నా స్నేహితురాలిది ఇదే అనుభవం. తనో మంచి సాధకురాలు. భక్తిపరురాలు. అయినా కష్టాల నడుమ కలతపడి కలడో, లేడో అని సందేహించింది. ఎప్పుడూ ఎవ్వరికీ ఎలాంటి అపకారం చేయని మాకు ఎందుకిన్ని కష్టాలు అని వాపోయింది.  భగవంతుణ్ణి నమ్మనివారు హాయిగానే ఉన్నారు, భక్తులకే కష్టాలన్నీ అంటూ ... వేదనలో వివేచన విడిచి విలపించింది. 
ఇది తన అనుభవమే కాదు, ఒకప్పుడు నాది, మరికొందరిది కూడా కావచ్చు. 
                                     

జీవితమంటేనే సుఖదుఃఖాల సంగమం. అనుబంధాలు, ఆత్మీయతలు, ఆనందకర అనుభూతులతో పాటు ... ఎన్నెన్నో అవరోధాలు, అవహేళనలు, ఆవేదనలతో కూడిన ప్రయాణమే జీవితం. అందరి జీవితగమనంలో ఎత్తుపల్లాలు సహజం. వాటినుంచి పాఠాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగితేనే గమ్యం చేరుకోగలం. 
                                                     


మనకు కలిగిన అపకారాల మరుగున ఏదో ఉపకారం దాగివుంది. మన బ్రతుకు బండిని ముందుకు నడిపించడానికి ఎదురయ్యే కష్టాలు కొరడా దెబ్బల్లాంటివని ఓ చైనా తత్వవేత్త సద్బోధ.  

మనకన్నా కొన్ని లక్షలమంది బాగుండి ఉండవచ్చు. కానీ, కొన్ని కోట్లమందికన్నా మనం బాగున్నామన్న నిజాన్ని గుర్తించాలి. అటుపై 

సానుకూలమైన మార్పును స్వాగతించాలి

నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, కొంచెం మన ప్రతికూల భావాలను మార్చుకుంటే చాలు.
ప్రతికూలతల నడుమ వున్నప్పుడు, మన ఈ స్థితికి కారణం ... మన బంధువులు, చుట్టూ వున్నవారు, తలరాతలు, గ్రహాలూ, దురదృష్టాలు, ఆర్ధిక స్థితిగతులు కారణమని భావిస్తూ అశాంతికి లోనౌతుంటాం.  బయట ప్రభావాలని మనం తప్పు పట్టినంతకాలం దుఃఖాన్ని మోయక తప్పదు.
ఒకోసారి మన అశాంతికి ఎదుటివారు కారణం అనుకుంటాం కానీ, అది తప్పు. మన ఆనందానికి మనమే కారణం. మన మనోభావనలే కారణం. బాహ్య ప్రపంచం, బయటి వ్యక్తుల మనస్తత్వాలు, ప్రవర్తన మన ఆధీనంలో ఉండవు.  ఎదుటివారు అర్ధం చేసుకోలేదనో, విమర్శించారనో, అనుగుణంగా లేరనో భావిస్తూ చిరువేదనకు లోనౌతాం. ఎదుటివారు మారితే బాగుండును, మనల్నీ అర్ధం చేసుకుంటే బాగుండునని తలపోస్తూ తల్లడిల్లినంతకాలం అశాంతే. మార్పును మన నుంచి కాకుండా ఎదుటివారినుంచి అభిలాషిస్తూ ఉండడం వల్లనే మానవసంబంధాలు బలహీనమౌతున్నాయి. దానికి బదులు మనమే కొంచెం మారే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇతరుల సాయం, సానుభూతి కన్నా ముందుగా మన ఆలోచనలో మార్పు రావాలి. మనం మారితే మనం బాగుంటాం. క్రమేణా  మనతో వున్నవారు మారుతారు. నూటికి నూరు శాతం ఏ ఒక్కరు పర్ఫెక్ట్ కాదు, చిన్న చిన్న తప్పులు, బలహీనతలు అందరిలోనూ ఉంటాయి. వాటిని పరిగణ లోనికి తీసుకోకుండా సామరస్యంగా ఉండగలగాలి. ఒకింత సర్దుబాటుతత్త్వం ఉండాలి.  సర్దుకుపోవడం అంటే అపరాధమూ కాదు, అవమానం కాదు, అసమర్ధత కాదు, మనస్సుని నొప్పించుకుంటూ, నిస్సహాయంగా, తప్పనిసరిగా నడుచుకోవడం కాదు. అప్పటి పరిస్థితిని, ఎదుటివారి స్థితిని అంచనా  వేస్తూ, దానికి తగ్గట్లు స్పందిస్తూ, నొప్పించక నొవ్వక, సమయస్ఫూర్తితో, ఆత్మీయంగా పెద్ద మనస్సుతో వ్యవహరించడమే సర్ధుకుపోవడమంటే.
ఒకోసారి తప్పుడు భావాలు ఏర్పరచుకుంటాం. కానీ, మన ఊహలు, భావాలు అన్నీ నిజం కావు. నిజం తెలియాలంటే అవగాహన, నిశిత పరిశీలన, నిగ్రహం, స్వీయశోధన అవసరం. 
తప్పులు చేయడం సహజం. ఆ తప్పుల్ని ఒప్పుకొని, వాటి నుంచి పాఠం నేర్చుకొని, తిరిగి ఆ తప్పుల్ని చేయకుండా సాగిపోవడం విజ్ఞత. గతంలో సంబంధ బాంధవ్యాల విషయంలో నేను చేసిన తప్పిదం నాకో గుణపాఠం నేర్పింది. కొన్ని బాధ్యతల నిర్వహణలో బిజీ బిజీగా పరుగులు తీస్తూ, ఏం కోల్పోయానో తెలుసుకున్నాను. అర్ధం చేసుకున్న ఆత్మీయులు నేటికీ అక్కరనే ఉన్నా, వారి వారి అవసరాలలో ఆసరా కాలేకపోవడం ... బాధాకరం. ఎంతసేపు మనకోసమే కాకుండా సన్నిహితులకై ఆలోచించాలి.  కాస్త మనవార్ని పట్టించుకోవడం, వారి అవసరాలని గుర్తించడం, ఆపేక్ష చూపించడం, ప్రేమగా పలకరించడం చేసినప్పుడే ఆత్మీయతలు పెరిగి అందరిమధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. బంధమనేది ఒక ఆత్మీయ గ్రంధం. పొరపాట్లు , పొరపొచ్చాలు అనేవి అందులో కొన్ని పుటలు మాత్రమే. వీటిని సవరించాలే గానీ, కొన్ని పుటలకై మొత్తం గ్రంధాన్నే చింపేయకూడదు. 
గతంలోనికి భవిష్యత్తు లోకి కాకుండా వర్తమానంలో ఉంటూ, ప్రతికూలతలను వదిలి సానుకూలతలను  ఎంచుకొని, మనపై మనకు దృఢనమ్మకంతో, ధైర్యంగా ఓ నిబద్ధతతో సాగిపోవడం వివేకవంతమైన పని.
ఒకటి నిజం - జీవితంలో ఎదురయ్యే పరీక్షలు, మనం వాటిని ఎలా ఎదుర్కొంటామనే దాన్నిబట్టి విషాదంగానో, వినోదంగానో ఉంటాయి.
సుఖమూ - దుఃఖమూ, మంచీ - చెడూ, చీకటీ - వెలుగూ ... అన్నీ సహజం. ఎన్నో సంఘటల సమాహారమే జీవితం. ఎదురయ్యే అన్ని సంఘటనల్నీ ముందుగా ఊహించలేం, నిర్ణయించలేం, కానీ; ఎలా ఎదుర్కోవాలో, ఎలా మలచుకోవాలో మన చేతుల్లోనే ఉంటుంది. ఒక హరివిల్లు తయారవ్వాలంటే ఎండావాన రెండూ కావాలి. మన జీవితాలు శోభిల్లాలంటే కష్టసుఖాలు రెండూ అనుభవించాలి. 

శరీరానికి హాని కలిగించే ఆహరం, మనస్సుకి గ్లాని కలిగించే ఆలోచనలు విడిచిపెట్టినప్పుడే ఆరోగ్యవంతమైన ఆనందకరజీవనం సాధ్యం. మృదువైన మాట, దయగల చూపు. స్నేహపూర్వక సత్సంబంధాలు, మర్యాదకర ప్రవర్తన, నిరాశను నిలువరించగలిగే మనోబలం, అర్ధం చేసుకోవడం, ఆత్మీయతను  నిలుపుకోవడం... అలవర్చుకుంటే చాలు - ఆనందకర జీవనం మన సొంతం. మనకంటే ఎంతోమంది ఎక్కువ బాధలు పడేవారున్నారు ఈ లోకంలో. వారి వారి కష్టాలముందు మనదేం పెద్ద కష్టం కాదు. రామకృష్ణ పరంహంస. వివేకానందుడు,  ప్రహ్లాదుడు, సక్కుబాయి, మీరాబాయి ... ఇలా ఎందరో భక్తులు కష్టాలను ఎదుర్కొన్నారు. వీడని వాడని భక్తితో విశ్వాసం విడువక విమలచిత్తులై ఏం సాధించారో అందరికీ విదితమే. అలానే లింకన్, అబ్దుల్ కలాం తదితరులు బాల్యంలో అనుభవించిన కష్టాలెన్నో... అయినా అన్నీ భరించి ఎంత ఉన్నతస్థితికి చేరుకున్నారో అందరికీ విదితమే కదా. 

ఒకటి గుర్తించండి, చాలావరకు చాలామంది మహనీయులందరు దుఃఖాలనుండే జీవితపాఠాలు నేర్చుకున్నారు. దుఃఖాలే వారిలో నిద్రాణమైన/ నిద్రాణావస్థలో ఉన్న శక్తుల్నీ, ప్రతిభాల్నీ అభివ్యక్తం చేశాయి... అన్న వివేకానంద మాటలు సత్యం. 

                                 
ఎప్పుడూ ఎవ్వరికీ ఎలాంటి అపకారం చేయని మాకు ఎందుకిన్ని కష్టాలు??? 
మనకందరికీ పూర్వం చేసిన కర్మల ఫలితంగానే ఈ జన్మ ప్రాప్తించిందన్నది విస్పష్టం. ఈ జన్మలో తప్పులు అపకారాలు చేయకపోవచ్చు గానీ, జత జన్మలలో చేసినవానిబట్టి ప్రారబ్ధంగా సమకూరినవే ఈ బంధాలూ, బాధలు. 

భాగవతమందు కపిలమహర్షి తల్లి దేవహూతి తో,
ధన పశు పుత్ర మిత్ర వనితా గృహ కారణభూతమైన యీ
తనువున నున్న జీవుడు పదంబడి యట్టి శరీర మెత్తి న
న్నునుగతమైన కర్మఫల మందక పోవగరాదు, మింట బో
యిన భువి దూరినన్ దిశల కేగిన నెచ్చటనైన దాగినన్
ధనధాన్యాలు పశువులు, పుత్రులు, మిత్రులు స్త్రీలు, గృహాలు మొదలైన వాటికి కారణభూతమైంది ఈ శరీరం. ఈ దేహంలో ఉన్న జీవుడు ఇవన్నీ అనుభవించి మళ్ళీ ఈ జన్మలోని కర్మఫలాన్ని అనుభవించటం కోసం ఇటువంటి తనువును తిరిగి ధరిస్తాడు. ఆకాశంలోకి ఎగిరిపోయినా, భూమిలో దూరినా, దిక్కులకు పారిపోయినా, ఎక్కడ దాగినా కర్మఫలాన్ని అనుభవించక తప్పదని తెలియజేస్తాడు.


బాగు చేసేందుకే బాధలు  

                                                    
కష్టాలు ఎదురౌతున్నాయని కుమిలిపోకు. జన్మజన్మల దుష్కర్మల వలన వచ్చిన ఈ కష్టాలు మన పాపాల ప్రారబ్ధం నుండి విముక్తిని చేస్తున్నాయి. అలానే సుఖాలు దరి చేరాయని పొంగిపోకు. జన్మజన్మల సత్కర్మల పుణ్యం తరిగిపోతుందని గ్రహించు.  పుణ్యంను హరించే సుఖం కన్నా పాపాలను హరించే దుఃఖమే శ్రేయోదాయకమంటారు శ్రీ  సుందర చైతన్యానందులవారు. 

                                                     




భక్తిలో పుష్టి ఉండాలి. ఏ చిన్న అవాంతరం వఛ్చినా అర్చించడం మానేస్తాం. అపవాదు వేచేస్తాం. సానుకూల పరిస్థితుల్లో పొంగి భగవంతుడున్నాడని, ప్రతికూల పరిస్థితుల్లో కృంగి ఉన్నాడో లేడోనని  భావించడం సరికాదు. భగవంతుడు మంచివాళ్లకు కష్టాలనిచ్చేది వారిని ఉత్తములుగా మలచడానికే నన్నది ఆధ్యాత్మిక అనుభవజ్ఞుల మాట.  


భగవంతుడు బలీయమైన సంకల్పంతో ఈలోకాన్ని నడిపిస్తూ వున్నాడు. బండ్లను ఓడలు చేయడం, ఓడల్ని బండ్లు చేయడం ఆయనలీల. ఏదో ప్రాసాదించాడని పరవశించేలోపే. మరేదో పట్టిలాగేసుకుంటాడు . బ్రతుకు ఎడారిలో వైరాగ్య జ్వాలలు రగులుతున్న వేళ ఎక్కడో సుదూరంగా సుఖాల ఎండమావుల్ని చూపిస్తాడు. మనం ఆశించేది ఒకటైతే, ఆయన శాసించేది మరొకటి. అయితే, అంతిమంగా భగవంతుని ప్రతిచర్య వెనుకో పరమార్ధం దాగి వుందనీ, ఆయన శిక్షలు వేసేవాడు కాదని, శస్త్రచికిత్సకుడేనని అర్ధమౌతుంది. ఆయన చేసే గాయాలు తాత్కాలికంగా బాధించినా, శాశ్వతంగా మనల్ని స్వస్థత పరుస్తాయని విదితమవుతోంది - స్వామి జ్ఞానదానంద   
ఒక్కొక్కసారి భగవంతుడే మన స్థిరచిత్తాన్ని పరీక్షించడానికి, పవిత్రకరించడానికి బాధలు కల్గిస్తాడు. అందుకే, సాధకుడు బాధల మధ్య చెదిరిపోకూడదు. మనల్ని మలిచేందుకు వచ్చినవే ఇవన్నీ అని భావిస్తూ, బాధలను దూరం చేయమని పరమాత్మను ప్రార్ధించక, బాధలను తట్టుకునే శక్తినివ్వమని పరితపించాలి.  బంగారు నగ శోభాయమానంగా తయారయ్యేముందు నిప్పుల్లో ఎంతగా కాలిందో, సమ్మెటపోట్లను ఎంతగా భరించినదో కదా. రోకలిపోటులకు ముక్కలుగాని బియ్యమే భగవదారాధనకు ఉపయోగపడే అక్షింతలైనట్లు, జీవితంలో దెబ్బల్లాంటి బాధలు తట్టుకొని విరగని చెదరని చిత్తదారులే భగవత్ప్రాప్తికి పాత్రులౌదురు.  


మరి వీటినుండి విముక్తి లేదా? అంటే ఉందనే మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. 
                                                     


కష్టాలు కలతలు కన్నీరు ల నడుమ కలవరముతో మనుగడ సాగించే బదులు తాము పూర్వము చేసిన దుష్కర్మల పట్ల ప్రాయశ్చిత్తం, భగవంతుని ను కృపకై ప్రయత్నమూ చేస్తే చాలామటుకు కర్మలనుండి విమోచనం లభిస్తుంది.
భగవద్ధ్యానం, జపం వలన మానసిక పాపాలు నశిస్తాయని, భజన సంకీర్తనల వలన వాచికపాపం. ఉపాసన అర్చన యజ్ఞయాగాదులు వలన శారీరకంకా చేసిన పాపాలు పరిహారమౌతాయని సూచిస్తున్నాయి.
అలానే ధనం కోసం చేసిన పాపాలు దానాల వలన, మనస్సుతో మాటతో క్రియతో చేసిన దుష్కర్మలనేవి తిరిగి మనస్సుతో మాటతో క్రియతో చేసే సుకర్మల ద్వారా సమసిపోతాయని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి.                                    
                                                               
జీవితంలో ప్రాప్తించిన వాటితో తృప్తి పడటం నేర్చుకున్న వ్యక్తి ఎన్నడూ విచారానికి గురికాడు; అది చేతకాని వ్యక్తి ఎప్పుడూ దుఃఖానికి గురి అవుతూనే ఉంటాడు!  

                                                           

31, జులై 2018, మంగళవారం

ఏమిటే ఈ మనస్సు ... భావకుసుమాలు

                                                            
                                                   

శుభోదయం భారతీ అంటూ, వాట్సాప్ లో పలకరించే నేను ఇలా లేఖలో ప్రత్యక్షమవ్వడం ఏమిటని అనుకుంటున్నావా? కారణం వుందోయి ... 
"శ్రీరామ జయరామ జయరామ ... 
యేన కేన ప్రకారణ యస్య కస్యాపి దేహినః 
సంతోషం జనయేత్ప్రాజ్ఞస్తదేవేశ్వర పూజనమ్ 
ఏ ప్రకారముగానైనను ఏ జీవికైనను ప్రాజ్ఞుడైనవాడు సంతోషం కలుగచేసేడు కార్యమునే చేయవలెను. అదియే సర్వేశ్వరునికి  గొప్ప పూజ. 
శుభోదయం రా బంగారం". 
అని నీవు పంపిన వాట్సాప్ మెసేజ్ నా ఈ లేఖకు కారణం. 
నీ ఈ మెసేజ్ తో కొద్దిరోజుల క్రితం నాలో జరిగిన సంఘర్షణను నీకు చెప్పాలనిపించి, అదంతా వాట్సాప్ లో తెలపలేక ఫోన్ బదులు పెన్ను పట్టుకున్నా.

రోజూ పావుతక్కువ ఐదుకు లేవడం, స్నానాదికాలు పూజ, ఆపై వంటావార్పు వగైరాలు..... మధ్యాన్నం ఓ అరగంట సేదతీరడం... తిరిగి పనులు ప్రారంభం... అన్ని ముగించుకొని పదకొండింటికి పడుకోవడం. ఇది సాధారణంగా నా క్రమం తప్పని నిత్య దినచర్య. అయితే గత కొద్దిరోజులుగా నేను లేచేసరికి పువ్వులన్నీ ఎవరో కోసేస్తున్నారు. నేను గమనించిందేమిటంటే - మార్నింగ్ వాక్ కు ఓ కవరుతో బయలుదేరడం, పూవులు కోసేయడం, ప్రహరీ లోపలున్న మందారమొక్కను కర్రతో వంచి కోసేయడం. విచారకరమేమిటంటే - ఆ హడావిడిలో చాలా పువ్వులు నేలమయం, కొమ్మలు విరిచేయడం... ప్చ్...
సరిగ్గా పువ్వులు లేక పూజలో ఏదో అసంతృప్తి. ఓ రోజైతే అస్సలు పువ్వులు లేవు. కాస్త తులసిదళాలతో పూజ ముంగించాను గానీ, మనసంతా వెలితి.
                                 

భారతీ, నా చిన్నప్పుడు, నాన్నమ్మ దేవునిపాటలు పాడుతూ... పెరట్లో పూవులను, తులసిదళాలను పూలసజ్జ నిండా కొస్తుంటే, ఆ పాటలు వింటూ, నేనూ కొన్ని పువ్వులు కోసి సజ్జలో వేయడం... నాన్నమ్మ నా ఈ చిన్నిపనికి మురిసిపోతూ... నా బంగారు తల్లీ, ఎంత సాయమో నాకూ... అని అంటూ, నా మొఖం చుట్టూ చేయి తిప్పి తన తలపై మెటికలు విరవడం... ఓ అందమైన జ్ఞాపకం. మదిలో మధురమైన సజీవ దృశ్యం.
నేను ఇంటర్ చదువుతున్నప్పుడు, ఓసారి నాన్నమ్మను అడిగాను, పూజకు పూవులు, తులసిదళములు, దీపాలు, అగరబత్తి ధూపాలు, కర్పూర నీరాజనములు ఎందుకని?

మనల్ని శుద్ధి చేసుకోవడానికి. స్నానాదికాలు శరీరాన్ని, పూజాదికాలు మనస్సుని శుద్ధి చేస్తాయి. బాహ్య శుద్ధితో పాటు అంతరశుద్ధి కూడా ఉండాలి తల్లి. పరమాత్ముడు అన్ని చోట్ల వుంటాడు. అందరిలోనూ వుంటాడు. కానీ, మనం దర్శించుకోలేం. ఆయనను దర్శించడం సామాన్యులకు సాధ్యం కాదు. మనస్సు చంచలం చపలం. ఓ చోట స్థిరంగా ఉండదు. ఈ లౌకిక లంపటాల నడుమ భగవంతునిపై మనస్సు లగ్నం చేయలేము. అందుకే మన మహర్షులు వేదాల్ని ఆధారంగా చేసుకొని, నిరాకారునికి రూపం, దీపం, ధూపం, పుష్పం, తీర్ధం, నైవేద్య  నివేదన... ఇలా అనేక ప్రక్రియలను ఏర్పరిచారు. మానవజన్మ నిరర్ధకం కాకూడదని, మన మనస్సును రోజులో కొద్ది సమయమైన భగవంతునివైపు మరల్చడానికి, భగవంతుని చెంతన భక్తుని మనస్సు ఏకాగ్రమొనర్చడానికి, సామాన్యభక్తులను తరింపజేయడానికే ఇవన్నీ ఏర్పరిచారని నాన్నమ్మ చెప్పింది. కొంతకాలం పిదప నాన్నమ్మ చెప్పింది అర్ధమైంది. ఆప్పటినుండేరా, పూజ చేయడం అలవడింది. 

నిజమే కదా,  బాహ్యక్రియలు అంతరశుద్ధికై సహకరిస్తాయి. ప్రాధమికంగా పరబ్రహ్మం నందు చిత్తం లగ్నం చేయవలెనన్న అందుకు అనుకూలమైన స్థానం సాధన ఉండాలి కదా.  
స్థూలం గా ఏర్పరిచే ఈ పూజాది ప్రక్రియలన్నీ భగవంతుని వైపు పూర్ణంగా మరలడానికే. సంపూర్ణ సమర్పణాభావం అలవడడానికే. ఎచ్చట దృగ్గోచారమగు స్థూలప్రకృతి యంతయూ పవిత్రంగా నుండునో, అచ్చట మన సూక్ష్మప్రకృతియగు మనోమయకోశం పరిశుద్ధస్థితి నొందును.
పంచేంద్రియాలతో పాటు మనసును ఏకాగ్రం చేయుటకే ఈ పూజ ఏర్పరిచారనిపిస్తుంది. దివ్యమంగళకరమగు భగవత్ రూపమునందును, దీప ధూప కర్పూరాది జ్యోతులయందు నేత్రేంద్రియం, సుగంధ ధూపవాసనలచే ఘ్రాణేంద్రియము ఏకాగ్రత నొందును. గంట శంఖధ్వనులలో కర్ణేన్ద్రియం లీనమగును. భగవన్నామోచ్చారణలచేత జిహ్వేంద్రియం లయించును. పరిమిళమిళిత శీతలదాయకమగు చందనాదులచే త్వగింద్రియం శాంతము నొందుతుంది. వీటన్నింటి మూలంగా మనస్సు  రమిస్తుంది కదా. 
భారతీ, ఇప్పుడు నేను చేసిన పూజ మహాఅయితే గంట లోపే. కానీ, ఆ ఒక్క గంట మిగిలిన 23 గంటల జీవనంకు శక్తిదాయకం. సరే, అసలు విషయంకు వస్తాను... ఆ రోజు పువ్వులు లేకుండా చేసిన పూజతో ఒకవిధమైన అసంతృప్తి. ఇంట్లో అందరికీ టిఫిన్స్, వంట తతిమ్మా పనులు పూర్తయ్యేసరికి 11 అయింది. 
దగ్గరలోనే గుడికి వెళదామనిపించి వెళ్లాను. దర్శనం అనంతరం బయటమెట్లుపై కూర్చొని ప్రసాదం తింటుండగా, ఆ ప్రక్కనే కూర్చున్న కొందరు, శ్రావణంలో తీసుకోవాల్సిన చీరల గురించి, ఏ షాపులో కొనాలో, కొనాలనుకుంటున్న బంగారం గురించి, ఆపై టీవీ సీరియల్స్ గురించి గట్టిగా మాట్లాడుకుంటేంటే... గుడికి వచ్చింది ఇందుకా... ఒకింత బాధతో గుడి లోపలకు మరల వెళ్లగా, ఓ 10 సం|| పాప తన పుట్టినరోజని అందరికీ ఓ పండుతో పాటు శివానంద లహరి పుస్తకమును ఇచ్చింది. అచ్చటే ఓ మూల కూర్చొని శివానందలహరి చదువుతుండగా ఈ శ్లోకములయందు మనస్సు నిలిచింది ... 
గభీరే కాసారే విశతి విజనే హోర విపినే
విశాలే శైలేచ భ్రమతి కుసుమార్ధం జడమతిః
సమార్పైక్యం చేత స్సరసిజ ముమానాధ భవతే
సుఖేనావ స్థాతుం జన ఇహ న జానాతి కిమహో 
ఓ ఉమాపతీ! ఏమీ ఆశ్చర్యం? మానవుడు తెలివి తక్కువవాడై, నీ ఆరాధనకై పువ్వులను సేకరించవలెనని లోతైన చెరువులలోకి దిగుతున్నాడు, నిర్జనారణ్యాలలో, ఎత్తైన పర్వతాలలో పరిభ్రమిస్తున్నాడు. కానీ మనస్సనే పద్మాన్ని నీకు సమర్పించి ఇచ్చట సుఖంగా స్థిరంగా వుండడం తెలుసుకోలేకున్నాడు కదా.
అలాగే కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ ... అన్న శ్లోకమందు 
గిరీశా! చేతిలో బంగారుకొండ, సమీపంలో కుబేరుడు, కామధేను, కల్పవృక్షం, చింతామణి మున్నగునవి గృహంలో రాజిల్లుతుండగా, శిరోపరి భాగంలో చంద్రుడు ప్రకాశిస్తుండగా, సమస్త మంగళాలూ నీ పాదపద్మలా సన్నిధిలో ఉండగా, నేను నీకేమి ఇవ్వగలను? నా మనోపుష్పమును నీకర్పిస్తున్నాను స్వీకరించు. 

నిజమే కదా, మనోపుష్పం సమర్పించవచ్చు కదా... ఆనందమనిపించింది, నా అసంతృప్తి పోగొట్టడానికే భగవంతుడు ఇలా అనుగ్రహించాడనుకుంటూ ఇంటికి బయల్దేరాను. మధ్యాన్నం అందరి భోజనాలు అయ్యాక, కాస్త సేద తీరుదామని మంచమెక్కాను. నిద్ర రాలేదు కానీ, ఓ సందేహం మనస్సును తొలవడం ప్రారంభించింది. క్రిందపడిన పువ్వులూ, వాసన చూసిన పువ్వులూ పూజకు పనికిరావంటారు, మరి బంధాల క్రింద పడి, ఎన్నో విషయం వాసనలను తగిలించుకున్న ఈ మనోపుష్పంను ఎలా సమర్పించగలను? 
ఏమైంది నాకు, ఎందుకిన్ని ఆలోచనలు... అసహనంగా అనుకుంటుండగా ఫోన్ రింగ్... మాట్లాడి, వాట్సాప్ చూడడం మొదలెట్టా. అందులో ఓ ఫ్రెండ్ పంపిన మెసేజ్ చూడగానే ఆనందం పునఃప్రవేశం. ఆ మెసేజ్ -
అహింసా ప్రధమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః
సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః
శాంతి పుష్పం తపః పుష్పం, ధ్యాన పుష్పం తథై వచ
సత్య మష్టవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం భవేత్
మొదటి పుష్పం అహింస.  అహింసా వాఙ్మనంకాయై: ప్రాణిమాత్ర ప్రపీడనం ... శరీర మనో వాక్కులతో బాధింపకుండుట అహింస. వయస్సు రీత్యో, శారీరక శక్తి తగ్గో, బాధ్యతలు పెరిగో ... కాస్త చిరుబురులు ...ఇలా అప్పుడప్పుడు వాక్కు హింస చేస్తున్నా. 
ఇక రెండవది ఇంద్రియ నిగ్రహం... ప్రారబ్ధ ప్రపంచానురక్తిని విడిచి, బహిర్ముఖమగు ఇంద్రియములు నిగ్రహించి అంతర్ముఖం చేస్తూ,తామరాకుపై నీటిబొట్టులా మనుగడ సాగించడం ... అనుకున్నంత సులువు కాదురా..... కారణజన్మురాలైన సీతమ్మవారి నేత్రేంద్రియమే మాయలేడి వెనుక పరుగులు తీయగా, సామాన్యురాలిని ఈ మాయాప్రపంచబంధాల వెనుక పరుగిడడంలో ఆశ్చర్యమేముంది? 
మూడవ పుష్పం సర్వభూత దయ. సర్వజీవుల యెడ దయగా ఉండడం. హు... వంట చేస్తుండగా వంటగది ప్రక్కనున్న ప్రహరీగోడపైకి కాకుల రాక... కాస్త టిఫినో, బిస్కట్సో ... ఏదుంటే అది పెడితే, అది చూసిన మామయ్యగారు అలా పెట్టడం వలనే రోజూ కాకులు వస్తున్నాయని, గోడ నిండా రెట్టలే అని చిరుబురులు. అంతవరకూ కనిపించని శ్రీవారు, ఎన్నిసార్లు చెప్పించుకుంటావ్, పెద్దవాళ్ళ మాటకి విలువివ్వవా, మానర్స్ లేదు, కామన్సెన్స్ లేదు... మెత్తమెత్తని చివాట్లు.  అదేమిటో కానీ, అత్తయ్యగారు, మామయ్యగారు దండకం ఎప్పుడు ఉన్నా, ఎక్కడుంటారో గాని, ఈయన ఆ టైంకి ప్రత్యక్షం... (నవ్వకు గాని,  మామయ్య, అత్తమ్మగార్ల  చిరుబురులు తగ్గించడానికి మావారి రంగప్రవేశం, చివాట్లు...) అయినా మనస్సు చివుక్కు మంటుంది. కామన్సెన్స్ ఉన్న ఆ తండ్రీకొడుకులు భోజనం చేసేటప్పుడు కంచం చుట్టూ అంట్లే. టేబుల్ మానర్స్ లేనిది వీరికి, వాల్ మానర్స్ లేనిది కాకులకి... మధ్యలో నాకు తిట్లు. మెల్లగా మనస్సు  సణిగిన గొణిగిన అన్నీ కాసేపటిలో మణిగినవే.  చిన్న భూతదయకే ఫలితమిది. ఇక మిగతా పుష్పాలు గురించి ఏం చెప్పను... నా హృదయపూదోటలో పూర్తిగా వికసించని విరులివి. విడవని విరులతో విష్ణువుని ఎలా పూజించను? ఆలోచనలు ఆపి, మరల శివానందలహరి చదవడం మొదలెట్టా... 
సదా మోహాటవ్యాంచరతి ... అనే శ్లోకంలో మనందరికోసం ఇలా ప్రార్థిస్తారు శంకరభగవత్పాదులవారు -

ఓ కపాలీ! ఆదిభిక్షు ! నా మనస్సు ఒక కోతివంటిది. అది ఎప్పుడూ సంసారవ్యామోహమనే  మహారణ్యంలో  సంచరిస్తూ, సుందరాంగనల చుట్టూ  తిరుగుతూ, ఆశారూప శాఖలపై దుముకుతూ, , క్షణం తీరిక లేకుండా అటుఇటు పరుగులు తీస్తుంటుంది. అందువల్ల నా మనస్సనే కోతిని నీకు అర్పిస్తున్నాను. దాన్ని భక్తి అనే  తాడుతో గట్టిగా కట్టి, నీ ఆధీనంలో ఉంచుకో స్వామీ! 
నిజమేకదా, మట్టి, బురదలలో ఆడుకొని ఇంటికొచ్చిన బిడ్డని తల్లి దరి చేర్చుకోదా? బిడ్డ ఎలా ఉన్నా, దరిచేర్చుకున్న తల్లిలానే, ఆ పరమాత్ముడు ఎలా నేనున్నా, నన్ను దరిచేర్చుకుంటాడని అనుకోగానే ఎంతో స్వాంతన. 
నా ఈ భావనలు అమ్మతో పంచుకుంటే,  సకల సృష్టికర్తకు ఈ ఫల పుష్పాదులు ఏపాటి?  మన ప్రతీ క్రియలోను భక్తి, నిష్టా శ్రద్ధ కలిగియుండుటయే పూజ. అయినా, తల్లీ! చివరలో  
మంత్రహీనం క్రియాహీనం భక్తి హీనం చమూపతే
యత్ పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే||
 

అంటూ క్షమాప్రార్ధన చేస్తాం కదమ్మా, మన పూజలో ఏ లోపాలున్నా క్షమిస్తాడమ్మా ఆ భగవంతుడు అని అమ్మ చెప్పాక చాలా హాయనిపించింది. 
అబ్బా... ఏమిటే ఈ మనస్సు? ఒక్క విషయంకై  ఇన్ని భావ పరంపరలా? ఈ మనస్సు ఎన్నో అనుభూతుల మోపరి కదా!   
భారతీ, నా ఈ లేఖ సుత్తిగా ఉండవచ్చు, కానీ, ఇంచుమించుగా ప్రతీ విషయం, నా భావాలు నీతో పంచుకోవడం నా అలవాటు కదా.  నాకు ముక్తి, ఆత్మసాక్షత్కారంల్లాంటి పెద్ద విషయాలు తెలియవు. కానీ, రోజూ వేకువనే చేసుకునే పూజ, సమయం ఉన్నప్పుడు కాస్త ఆ దైవపుస్తకాలు చదువుకోవడం, నామస్మరణం ..... దీని వలన ప్రతికూలతభావాలు ఎక్కువసేపు మనస్సులో నిలువక, ప్రశాంతంగా జీవనం సాగుతుంది. ఇదే నా చిరు సాధన. 
ఉండనా మరి,
నీ... శైలు. 

11, జులై 2018, బుధవారం

మ్యాజిక్ ట్రీ (కల్పవృక్షం) మ్యాజిక్ కౌ (కామధేనువు)

అమ్మమ్మా... అమ్మమ్మా...
నా చిట్టితల్లి శ్రీమాన్వి పిలుస్తూ పరుగు పరుగున వచ్చింది. కాస్త నెమ్మదిగా రావచ్చుకదా, పడిపోతావు ... అంటున్న, నా మాటలు వినిపించుకోకుండా,
నాకు మ్యాజిక్ లైట్ కావాలమ్మమ్మా ...
మ్యాజిక్ లైట్ ??? అదేమిటి? అదెక్కడ ఉంటుంది? నా ప్రశ్న వింటూనే...  

రా, చూపిస్తా... నా చేతిని లాగుతూ హాల్ లోనికి తీసుకు వచ్చి అల్లావుద్దీన్ అద్భుతదీపం ఫోటో చూపించి ఆ మ్యాజిక్ లైట్ కావాలని మారాం చేస్తుంటే, అసలు ఆ మ్యాజిక్ లైట్ ఎందుకమ్మా? అని అడుగుతుండగానే, తమ్మూస్ కు స్పైడర్ మాన్, సూపర్ మాన్, చోటాభీమ్,కారు బొమ్మలు, నాకేమో బుక్స్, క్రేయాన్స్, బార్బీ, సింద్రిల్లా బొమ్మలు బోలెడన్ని అడగాలమ్మమ్మా... అప్పుడు ఆ లైట్ లోని భూతం వచ్చి వెంటనే అన్నీ ఇస్తుంది కదా, తాతయ్య, నాన్న కొద్దిగానే కొంటారు కదా... ఆ మాటలు వింటూనే ప్రక్కనే వున్న నా సుపుత్రిక గట్టిగా నవ్వుతూ, మాన్వీ! భూతం లైట్ ఎందుకు, కల్పవృక్షమనే మ్యాజిక్ ట్రీ గాని, కామధేనువనే మ్యాజిక్ కౌ గాని అడుగు, భూతాలుండవందులో అని రెచ్చగొట్టింది. ఆపై మా అమ్మమ్మ మనుమరాల కబుర్లు ప్రక్కనపెడితే -

తన కోరికతో గుర్తుకొచ్చిన నా చిన్ననాటి ఓ జ్ఞాపకంకు వస్తాను -
నేను చదువుకునే రోజుల్లో - రమణి, ఇందిర, రాణి, మరికొందరు మిత్రులం తరుచుగా ఒకచోట చేరి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. మాలో రమణి కాస్త పెద్ద. తను బాగా మాట్లాడేది, మంచి మంచి కబుర్లు , కధలు చెప్పేది. ఒకసారి నిర్మల అనే అమ్మాయి 'అల్లావుద్దీన్ దగ్గరున్న అద్భుతదీపం నా దగ్గరుంటే ఎంత బాగుండునో' అని అంది. ఎందుకని అడగగా, మా అమ్మను రెండురోజులుగా అరిసెలు తినాలనిపిస్తుంది, చేయమ్మా అంటే, పెద్ద పండుగ వస్తుంది కదా, అమ్మమ్మ చేసి పంపుతుందిలే అంటుంది, అదే అద్భుతదీపముంటే ఎంచక్కగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అరిసెలు, జీళ్ళు, చక్కిలాలు తినవచ్చు కదా... తన మాటలకు అందరం నవ్వుకున్నాం. అప్పుడే రమణి ఏది కోరుకుంటే అది ఇచ్చే కల్పవృక్షం గురించి చెప్తూ, కల్పవృక్షం పూర్వం ఉండేదని, ఓసారి ఒకతను అడవి మార్గంలో పయనిస్తూ, ఓ చెట్టు నీడన కాసేపు సేద దీరుదామని ఓ చెట్టు చెంతన ఆగి, 'అబ్బా, ఇక్కడ ఎంత చల్లగా వుంది, తినడానికి ఏమైనా ఉంటే బాగుండును అని అనుకోగానే ఫలాదులు ప్రత్యక్షం ..... తిన్నాక కాస్త విశ్రమించాలనిలించిన వెంటనే చక్కటి పాన్పు ప్రత్యక్షం ..... ఆ పాన్పు పై కూర్చుంటూ, ఇదేదో మాయచెట్టులా వుంది, కొంపదీసి ఇప్పుడు భూతమేదో వచ్చి నన్ను మింగేస్తుందేమో .... అనుకునేంతలో భూతం ప్రత్యక్షమై మింగేసిందట. ఇదంతా తన యోగదృష్టితో చూసిన ఓ యోగి, ఆ చెట్టు చెంతకు వచ్చి , ఓ కల్పవృక్షమా! నీకు నమస్కారం, నీవు ఇక్కడ నుండి మాయమైపోవడం మంచిద'ని తలవగానే మాయమైపోయిందని చెప్పింది. 
ఆ తర్వాత కొంతకాలానికి మహర్షుల దగ్గర కల్ప వృక్షం, కామధేనవలుండేవని చదివాను. అటుపై మా తాతయ్యగారి వద్ద పుస్తక పఠనం, తాతయ్య చెప్పేకధలు, కబుర్లు ... (అప్పుడే లేశమాత్రంగా ఆధ్యాత్మిక అవగాహన అలవడింది) ఓసారి తాతయ్యగార్ని అడిగాను, కల్పవృక్షం, కామధేనువులు ఇప్పుడు ఎక్కడున్నాయని. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి ... ఇత్యాదులు భూలోకంలో ఉండవు తల్లీ అన్నారు.  
మరి అవి ఉన్నట్లు మన పురాణ ఇతిహాసాలలో చదివాము కదా. మన పురాణాలలో ఉన్నటువాటికీ అంటే రామాయణాది ఘట్టాలకు చారిత్రాత్మిక ప్రదేశాలుకు ఆధారాలున్నాయి కదా. మరి అవి ఉన్నప్పుడు ఇవి ఎక్కడకు మాయమాయ్యాయి?   ప్రశ్నకు -
ఓ... అవి ఎవరి దగ్గర ఉన్నట్లు చదివావని అడిగారు.  వసిష్ఠుడు, జమదగ్ని, కపిల మహర్షి మొదలగు వారిదగ్గర ఉన్నట్లు చదివానని బదులిచ్చాను. ఆ...అలాగా, వారు ఎవరమ్మా? ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విని అర్ధం చేసుకో తల్లీ... నీవు పైన చెప్పిన వారంతా తమ తపస్సిద్ధి మహిమా విశేషమున మహా సిద్ధత్వం పొందిన మహర్షులు. వారంతా సిద్ధపురుషులు. వారి వారి సిద్ధత్వస్థితికి వారి వారి ఆశ్రమమునందు అవి సాకారమై నిలిచాయి. అవి వాళ్ళతోనో అంతరార్ధమాయ్యాయని గ్రహించాలి. 
తల్లీ!  ఈ మూడింటిని ఒక గోవు గానో, చెట్టుగానో, మణిగానో పరిగణించక, అవి దివ్యశక్తులని, అవి ఎలా ప్రాప్తిస్తాయో పరిశీలిస్తే బాగుంటుంది.
ముందో విషయం చెప్పు, ఇవి ఎక్కడ నుండి జనించాయి? 

క్షీరసాగర మధనం జరిగినప్పుడు అందులోనుండే ఉద్భవించాయి కదా... ముందు క్షీరసాగర మధనం అంతరార్ధం గ్రహిస్తే, ఇది సులభంగానే అర్ధమౌతుంది. క్షీరసాగరమధనం యొక్క అంతరార్ధం గురించి గతంలో ఓ టపా పెట్టాను కాబట్టి, దాని గురించి ఇక్కడ మరల ప్రస్తావించను. [ఆ టపా లింక్ ను ఇక్కడ చూడగలరు.] 
ఆధ్యాత్మిక సాధన యందు పురోగమించుతున్నప్పుడు ఎన్నో సిద్దులు ప్రాప్తమౌతాయి. అలా ప్రాప్తించినవే కల్పతరువు, కామధేనువులాంటివి. 

సాధకుడు ఆత్మవిచారణ చేయుచు, యోగధ్యానాదులచే ఆధ్యాత్మికోన్నతి చెందుతున్నప్పుడు, మొదట మనో మలినాది విషయవాసనలు నశించిన పిమ్మట సంకల్పసిద్ధి కలుగుట ప్రారంభమగును. ఈ సంకల్పసిద్ధిచే యోగనిష్ఠుని యొక్కక్క కోరిక ఫలవంతమగును. ఈ సంకల్పసిద్ధి పేరే కామధేనువు. అలానే, కొంతకాలమునకు యోగి జితేంద్రియుడగును. సంకల్పములు నశించును. నిస్సంకల్పస్థితి కల్గును. ఆ స్థితి పొందినవారి సమక్షమున ఏది చేయ సంకల్పించిన అది సిద్ది కల్గును. ఇదే కల్పవృక్ష సిద్ధత్వం. 
అంటే ఆధ్యాత్మిక తపమునందు -
ఎవరు జితకాములగుదురో అంటే కామ రహితులగుదురో అప్పుడు వారికి కామధేనుత్వ సిద్ధియును, 
ఎవరికి నిర్వికల్పస్థితి అనగా సంకల్పములు నశించునో (సర్వ ప్రకృతి సంకల్పములను జయించింతురో) అప్పుడు వారికి కల్పవృక్ష సిద్ధియును, 
ఎవరు పూర్ణంగా నిశ్చింతుడగునో అప్పుడు వారికి చింతామణిత్వ సిద్ధియును కలుగునని శ్రీ మలయాళ  సద్గురువు లాంటివారు తెలిపారు తల్లీ ... అని చెప్తూ, ఇలా అన్నారు -
సాగరమధనం జరుగుతుండగా కామధేనువు, కల్పవృక్షములు మొదలగునవి ఉద్భవించినను అమృతం దొరికేంతవరకు ఎలాగైతే క్షీరసాగర మధనం చేశారో, అలాగే ఆధ్యాత్మిక సాధకులు ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ, మధ్యలో ఎన్ని అద్భుత దివ్యసిద్ధులు సిద్ధించిన, వాటియందు ఆపేక్ష ఏర్పరచుకోకుండా, అమృతత్వమనే ముక్తిత్వం లభించేంతవరకు సాధన నుండి సడలిపోరాదు. ఇంతటి స్థితికి చేరిన మహర్షుల చెంతే ఈ కల్పతరువు, కామధేనువు, చింతామణులుంటాయని చెప్పగా, ఇదంతా వింటున్నవారిలో ఒకరు, ఏమిటో బాబయ్యా, అర్ధమయ్యి అర్ధంకానట్లు వుంది, ఇలాంటిసాధన సామాన్యులకు కష్టమే. మరి మాబోటి సామాన్యులకు గతేమిటని అడగగా, మనలాంటి సామాన్యులకు దృఢమైన భక్తి ఆ సర్వేశ్వరుని పట్ల ఉంటే చాలు, ఆయనే మనకు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి. ఇది నేను చెప్పడం కాదు, కృష్ణ పరమాత్మే గీత యందు ఇలా చెప్పారు - 
యో యో యాం యాం తనుం భక్తశ్రద్ధయార్చితుమిచ్ఛతి
తస్య తస్యాచలాం శ్రద్దాం తామేవ విదధామ్యహామ్
స తయా శ్రద్ధాయ యుక్తః తస్యారాధన మీహతే
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్హి తాన్

సకామభక్తుడు ఏయే దేవతాస్వరూపములను భక్తిశ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో, ఆ భక్తునకు ఆయా దేవతలయందే స్థిరభక్తి కుదురుకొనునట్లు , అలాగే ఆయా దేవతల ద్వారా నా అనుగ్రహముచే ఆయా భక్తుల అభీష్ట కామములను తీర్చగలను. 
ఆర్తో జిజ్ఞాసురర్ధార్ధీ జ్ఞానీ ... ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అను చతుర్విధ భక్తులకు ఆ పరమాత్ముడే కల్పవృక్షం.  

అటులనే, శివానందలహరి లో శ్రీ శంకరులవారు చెప్పారిలా -
ఆమ్నాయాంబుధి మాదరేణ సుమనస్సంఘా స్సముధ్యన్మనో 
మంథానం దృఢభక్తి రజ్జుసహితం కృత్వా మథిత్వా తత: 
సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం 
నిత్యానంద సుధాం నిరంతర రమా సౌభాగ్య మాతన్వతే 

దేవతలు మందరగిరిని కవ్వంగా చేసి క్షీరసాగరాన్ని మధించి కల్పవృక్ష, చింతామణి, అమృతములను సంపాదించినట్లుగా విజ్ఞులు తమ మంచి మనస్సులను కవ్వంగా చేసి, దృఢభక్తి యనే త్రాడుకట్టి, వేదాలనే మహాసాగరాన్ని మధించి దానినుండి భక్తులకు కల్పవృక్ష కామధేను చింతామణి వంటి వాడును, నిత్యానందామృత మూర్తియు, మోహాలక్ష్మీ స్వరూపుడును యైన ఉమా సమేతుడగు సదాశివదేవుని పొందుచున్నారు.
మనం కూడా అలా దృఢభక్తిని ఏర్పరచుకొని ఆ పరమాత్ముని పాదములను పట్టుకుంటే ఆయనే మనకన్నీనూ... అని చెప్పారు మా తాతయ్యగారు. 
తన మ్యాజిక్ లైట్ కావాలనే కోరికతో, ఆనాటి ఈ నా మధుర జ్ఞాపకంను మననం చేసుకునేటట్లు చేసిన శ్రీమాన్వికి శుభాశిస్సులు. ఈ వివరణ అర్ధం చేసుకునే వయస్సు కాదు నా మనుమరాలిది. నా చిట్టితల్లి శ్రీమాన్వి పెద్దయ్యాక చెపుదామంటే ... అప్పుడు చెప్పేశక్తి నాకుంటుందో.... ఉండదో.... ఏమో... అందుకే ఇలా స్మరణ లో పదిలపరుస్తున్నాను. పెద్దయ్యాక చదివి తెలుసుకుంటుందన్న ఆశ.