23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ఎందుకు???

'సర్వం ఖల్విదం బ్రహ్మ' సర్వమూ బ్రహ్మమే అయినప్పుడు, అందరూ ఆత్మస్వరూపులే అయితే ... ప్రత్యేకించి ఆలయాలకు వెళ్లడం ఎందుకు? ఆహారనియమాలెందుకు? పూజలెందుకు? ధ్యానమెందుకు? నియమనిష్టలెందుకు? శాస్త్ర పఠనమెందుకు? సత్సంగాలెందుకు?
పై ప్రశ్నలన్నీ ఓ తెలిసిన అమ్మాయి అడిగింది. ఆ క్షణంలో, తనలో ఎన్నో ఏళ్ళ క్రితం నన్ను నేను చూసుకున్నట్లయింది. ఈనాడు ఈ అమ్మాయి ధైర్యంగా అడిగినట్లుగా, ఆనాడు నేను ఎవర్నీ అడగలేకపోయాను. అయితేనేం, భగవంతుని అనుగ్రహం వలన కాలక్రమేణా పుస్తక పఠనం వలన నా సందేహాలు తీర్చుకున్నాను. 

మనది పరోక్ష జ్ఞానం. అంటే మన ఋషులు, మహర్షులు, పూర్విజులు చెప్పింది పఠన శ్రవణముల ద్వారా తెలుసుకొన్నది. దానినే ప్రత్యక్షజ్ఞానం ద్వారా తెలుసుకొని ముక్తిత్వం పొందడానికే పై సాధనలు తల్లీ. 
దీపం గురించి తెలిసినంతమాత్రమున చీకటి పోతుందా? అన్నం గురించి మాట్లాడితే ఆకలి, నీరు గురించి మాట్లాడితే దాహం తీరుతాయా? అలానే వినడంవలన, తెలుసుకోవడం వలన ప్రయోజనం లేదు. భావనమయప్రజ్ఞ (అనుభవపూర్వకంగా తెలుసుకోవడం) అన్నింటికన్నా ముఖ్యం. 


మనస్సును జయించడం, మనస్సుకు అతీతులమవడం, చెడుగుణాలు తొలగించుకోవడం, మనలోపల ప్రక్షాళన జరగడం, సంపూర్ణంగా జీవించడం, అర్ధవంతంగా ఆరోగ్యవంతంగా ఆనందదాయకంగా జీవించడం, పరమ గమ్యంకు చేరడం, మానవజన్మకు సార్ధకత చేకూరడం ... ఇత్యాదులన్నీ పై సాధనల వల్లే సాధ్యం. 

మహర్షి, సద్గురు శ్రీ మలయాళస్వాములవారు ఇటువంటి ప్రశ్నలు అడిగిన ఓ వ్యక్తికి చక్కటి సమాధానమిచ్చారు. ఆ సమాధానం నా మనస్సులో ముద్రించుకుపోయింది. నన్ను ప్రభావితం చేసిన ఆ సమాధానం యధాతధంగా - 
"వ్యవసాయకుడు తన క్షేత్రము నందున్న రక్కీస, చిల్లకంప మొదలగు కంటకముల పాదులను తొలగించి, సంపూర్ణంగా కలుపును దుక్కి దున్నుటచే హరింపజేసి పైరుబీజములను ఎట్లు జల్లునో, అట్లే సాధకుడు తన హృదయాంతరాళమున నున్న దుఃఖమయ రాక్షసగుణములనన్నింటిని సంపూర్తిగా తొలగించి యందు దైవగుణబీజములను జల్లి, పెంచి పోషించినచో దైవత్వమను పంటయే పండితీరును. ఎండాకాలంలో కలుపు ఏమియూ కనబడకపోయినను, బీజరూపమున దాగియుండి వర్షం కురియగానే యెట్లు మొలకెత్తునో, అట్లే అనేక జన్మవాసనలు మనయందు దాగియుండి, సమయం వచ్చినప్పుడు అంకురించి మొలకెత్తుచుండును. వాటిని పై సాధనల ద్వారా సాధకుడు పట్టుదలతో కృషిచేసి పెరికివేసినచో, తప్పక విజయుడై, విశుద్ధ హృదయుడై దైవత్వంను పొందగలడు. గీతలో దైవాసుర సంపద్విభాగయోగమందు శ్రీకృష్ణభగవానుడు జెప్పినట్లు సాధకులెల్లరు తమయందు దైవభాగమెంతగలదో, అసురభాగమెంతగలదో పరిశోధించి, అనుక్షణమును అసురగుణ నిర్మూలమునకును, దైవగుణ ప్రతిష్ఠకొరకును ప్రయత్నశీలురై యుండవలయును". 

పై వివరణే ఆ అమ్మాయికి చెప్పగా - ఆంటీ, బాగుంది మీరు చెప్పింది. అయితే మరి ధ్యానాది సాధనలు చూసినవారంతా ఎందుకు మహర్షులు కాలేకపోతున్నారు? ముక్తులు కాలేకపోతున్నారు? ఆ అమ్మాయి ఈ ప్రశ్న వినగానే ఒకింత ఆశ్చర్యం. ఎందుకంటే ఒకానొకప్పుడు నేను మా తాతయ్యగారిని ఇదే ప్రశ్న అడిగాను. దానికి మా తాతయ్యగారు ఇలా చెప్పారు -    
మీనః స్నానపరః ఫణీ పవనభుజ్మే మేషోస్తి పర్ణాశనః 
నీరాశీ ఖలు చాతకః ప్రతిదినం శైలే బిలే మూషికః 
భష్మోద్దూళిత విగ్రహస్తు శునకో ధ్యానాధిరూఢో బకః 
ఏతేషాం ఫలమస్తి కిం న హి న హి జ్ఞానం పరం కారణమ్  

గంగయందే పుట్టిపెరిగిన జలచరం లన్నియు, నిత్యమూ గంగా స్నానమే చేసియు, అందే నివసించియు వున్ననూ, సర్పము వాయుభక్షణమును చేసినను, మేక ఆకులను తినినను, చాతకపక్షులుకు జలమే ఆహారమైనను, ఎలుకలు సదా గుహలలో వున్ననూ, కుక్క బూడిద పూసుకున్ననూ, కొంగ మౌనమును శీలించినను వీటియన్నిటికిని ఎలాంటి విశేషఫలమును ఉండదు. అలానే కాసేపు ధ్యానం, ఆహారానియమాలు, ప్రార్ధనలు, శాస్త్రపఠనాలు, ప్రవచనాలు వినడం... ఇత్యాది సాధనలు బాహ్యంగా ఆచరించినంత మాత్రమున ఫలితముండదు. అంతరంగనిష్ఠ ఉండాలి. సాధకునికి శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. ఎటువంటి అవరోధాలు కల్గినను పట్టుదలతో అనన్య దైవభక్తితో సాగిపోవాలి, ఆత్మసాక్షత్కారం, ముక్తి లాంటి అత్యున్నత స్థితులను చేరుకోవాలంటే హృదయ పరిశుద్ధత అత్యవసరం. అందుకు ఎంతో సాధన అవసరం... ఈ రీతిలో తాతయ్యగారు చెప్పింది ఆ అమ్మాయికి చెప్తూ ఎప్పటిలా మంచివిషయాలను 'స్మరణ'లో పదిలపరుచుకుంటున్నాను.    

                             మన మతి ఎలా ఉంటుందో, మన గతి అలాగే ఉంటుంది. 
                                       సమ్మతితో వుండు - సద్గతి పొందు