హాయ్ ...
ఈ రోజుకి ఈ బ్లాగ్ కు నేనే నాయకిని.
నా పేరు "శ్రీ మాన్వి".
వయస్సు ఒక సంవత్సర రెండు నెలల ఇరవైఏడు రోజులు.
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలనిపించి మా అమ్మమ్మ బ్లాగ్ కు వచ్చేసాను.
"భారతదేశం నా మాతృభూమి"
రత్నాకరా ధౌతపదాం హిమాలయ కిరీటినీం
బ్రహ్మరాజర్షిరత్నాడ్యాం వందేభారతమాతరం
(రత్నాకరుడైన సముద్రుడు ఎవరి పాదములను కడుగుతున్నాడో, ఎవరికీ హిమాలయము కిరీటమై ప్రకాశిస్తుందో, బ్రహ్మర్షి రాజర్షులనెడి పుత్రరత్నములతో ఎవరు ప్రకాశిస్తూ ఉన్నారో ... అట్టి పవిత్ర భారత నా మాతృభూమికి వందనం)
భారతభూమి జగన్మాత యొక్క సాక్షాద్రూపమే. అది ఎలాగంటే తండ్రి అయిన దక్షునిచే అవమానింపబడి అగ్నికాహుతి అయిన సతీదేవి దేహాన్ని ఎత్తి పరమశివుడు ప్రళయతాండవం చేస్తే, ఆ దేవి శరీరావయవాలు ఏబైరెండు చోట్ల పడ్డాయి. అవి మన భారతదేశంలోనే ఎబైరెండు శక్తిపీఠాలుగా విలసిల్లుతూ మన భూమి ఘనతను వెల్లడిస్తుంది. సముద్రమును వస్త్రముగా, పర్వతములను స్తనమండలముగా గలిగిన విష్ణుపత్నిగా భారతమాతను మన ఋషులు శ్లాఘిస్తున్నారు. మన మాతృదేశం కేవలం ఒక మట్టిముద్దకాదు, ఆమె భవాని, మహిషాసురమర్ధిని, భారతి. ఆమె కోటి కోటి జనమనో హృదయాలలోని ఇచ్ఛాశక్తుల సజీవ సాక్షాత్కారం. ఆమె సాక్షాజ్జగజ్జనని. పరాశక్తి యొక్క సజీవావిష్క్రుతి అని అరవిందులు వారుకీర్తించారట. ఈ విషయాలు అన్నీ మా అమ్మమ్మ చెప్తుంటుంది. అందుకే -
"నేను భారతీయురాలిగా జన్మించినందుకు గర్విస్తున్నాను"
ఏ ప్రపుల్ల పుష్పముల నీశ్వరునకు
పూజ సల్పితినో యిందు పుట్టినాడ
ఇంతటి మహనీయగడ్డ పై నాకు జన్మనిచ్చిన మా అమ్మానాన్న (అనూష, లతీష్) లకు వందనములు.
ఈ టపా ఇప్పుడు నాకు అర్ధం కాకపోయినను భవిష్యత్తులో నాకు స్ఫూర్తినిస్తుందనే ఆకాంక్షతో నా పేరిట మా అమ్మమ్మ ఈ పోస్ట్ ను పెట్టింది.
మరోసారి -
అందరికీ
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
- మీ శ్రీ మాన్వి