4, అక్టోబర్ 2019, శుక్రవారం

దీని భావమేమి భారతీమాత ...

                                                           

నిన్న ఉదయం ఝాన్సీ అనే మిత్రురాలు నుండి వాట్సప్ మెసేజ్ ... 
ఈ క్రింద పద్యం పంపుతూ  దీని భావమేమి భారతీమాత ... అంటూ ... 


కరణంబు లఖిలోపకరణంబులును గాగ, బ్రాణంబు లుపచారభటులు గాగ,
గంగాప్రముఖనాడికలు జలంబులు గాగ,షట్కమలములు పుష్పములు గాగ,
జఠరాగ్నిహోత్ర ముజ్జ్వలధూపము గాగ, బటుజీవకళలు దీపంబు గాగ,
నందితానందంబు నైవేద్యముం గాగ, రవిశశిజ్యోతు లారతులు గాగ,
నంగదేవాలయమున సహస్రకమలపీఠమున శాంతిజనకజోపేతు డగుచు 
జెలగుపరమాత్ము రాము నర్చించుచుండ దత్త్వవిదు లీశ్వరప్రణిధాన మండ్రు
(ఈ పద్యాలు ఎందులోనివో సరిగ్గా చెప్పలేనుగానీ, బహుశా సీతారామాంజనేయ సంవాదము లోనివని అనుకుంటున్నాను).  


అష్టాంగయోగ సాధనలో 'శౌచ సంతోష తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః'  అని చెప్తుంటారు. 
ఈశ్వరప్రణిధానం అంటే స్థూల సూక్ష్మ శరీరాలచే లభించే కర్మఫలాలను ఈశ్వరునికి అర్పించుట. సర్వదా సర్వత్రా సర్వమూ భగవదనుసంధానం చేయడమే ఈశ్వర ప్రణిధానం. మరింత వివరణ కై .... ఇక్కడ  చూడండి. 
ఇక పై పద్యమునకు అర్ధం ఏమిటంటే -
                                                           
త్రికరణంగా (మనస్సు, వాక్కు, కర్మేనా) జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, అంతరింద్రియాలను పూజ పాత్రలుగా చేసుకొని, దశవిధప్రాణాలను* పనివాళ్ళుగా చేసుకొని, గంగాది నదులను అంటే ఇడా పింగళ సుషుమ్న నాడులను అభిషేకాది జలాలుగా చేసుకొని, షట్చక్రాలను పుష్పాలుగా చేసుకొని, జఠరాగ్నిని ధూపంగా చేసి, జీవకళలు* దీపాలుగా చేసుకొని, బ్రహ్మానందాన్ని నైవేద్యముగాపెట్టి,  సూర్య చంద్ర* జ్యోతులను ఆరతులుగా చేసుకొని, శరీరమనే దేవాలయంలో సహస్రకమలమనే సింహాసనం పైన శాంతి అనే 'సీత'తో కూడి దర్శనమిచ్చే పరబ్రహ్మమైన 'శ్రీరాముని' పూజించడమే ఈశ్వరప్రణిధానం అని తత్త్వవిదులు చెప్తుంటారు. 
                                                              
ఒకవిధంగా ఒక్కమాటలో చెప్పాలంటే - ఇది కర్మ, ధ్యాన యోగంలతో కూడిన అద్భుతమైన మానసపూజ. 

గమనిక - * ప్రాణమంటే జీవులు బ్రతకడానికి కావాల్సిన చైతన్యశక్తి. అంటే శ్వాసతో కలిసిన చైతన్యం ప్రాణం. పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు కలిపి దశవిధ ప్రాణాలు లేదా వాయువులని చెప్తుంటారు. ప్రాణాయామంలో కుంభకం వల్ల శరీరంలో నాడులన్నీ వాయువుచే పూరించబడి, ఈ దశవిధ వాయువుల యొక్క చలనం వేగవంతమై, తద్వారా హృదయ కమలం వికసిస్తుంది. 
* జీవకళలు అంటే షోడశి కళలని కొందరు, సూక్ష్మ ప్రణవం అయిన చిత్కళ అని కొందరు అర్ధం చెప్తుంటారు.  
* సూర్య చంద్రలు అనగా కుడినాసిక ద్వారా జరుగు శ్వాసను సూర్యనాడి అనియు, ఎడమనాసిక ద్వారా జరుగు శ్వాసను చంద్రనాడి అని అందురు.