28, ఫిబ్రవరి 2015, శనివారం

ఒకప్పటి మధురజ్ఞాపకం 'త్రివేణీ సంగమం'

గతపోస్ట్ చదివిన శైలజగారు అడిగిన ప్రశ్నతో నా మనసులో మరుగునపడిన విషయం మరుపుకురాకుండా మరల జ్ఞాపకం వచ్చేటట్లు చేసిన తనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ -
కాశీయాత్ర ( ఈ టపా వివరములకై  ఇక్కడ  క్లిక్ చేయండి) గురించి మాస్టారుగారు చెప్పిన మరుసటిదినమే ఈ త్రివేణీసంగమం గురించి కూడా ఆయన వివరించారు. 
మా అత్తయ్యగారు (మాస్టారుగారి భార్య) త్రివేణీ సంగమంలో మూడుసార్లు మునకలేస్తే చాలట కదండీ, ముక్తిపొందడానికి అని మాస్తారుగార్ని అడిగినప్పుడు - 
మూడుసార్లు ఎందుకు ఒక్కసారి మునక వేస్తే చాలు ముక్తి పొందవచ్చు అని నవ్వుతూ ఇలా వివరించారు. 
నాకు గుర్తున్నంతవరకు ఆ పద్యాలు, వివరణ చెప్తాను కానీ, పద్యాలలో ఒకటిరెండు అక్షరదోషాలు, వివరణలో చిరులోపం వుండవచ్చు. మన్నించాలి మరి.

మీనః స్నానపరః ఫణీ పవనభుజ్మే మేష్కోస్తి పర్ణాశనః 
నీరాశీ ఖలు చాతకః ప్రతిదినం శైలే బిలే మూషికః 
భస్మోద్దూళిత విగ్రహస్తు శునకో ధ్యానాధిరూడో బకః 
ఏతేషాం ఫలమస్తి కిం న హి న హి జ్ఞానం పరం కారణమ్ 

గంగాది తీర్దములలో మత్స్యకచ్చపాదులు సదా నివచించుచుండును. నాగసర్పం వాయుభక్షణం గలిగియుండును. మేకలు ఆకులనే తినుచుండును. చాతకపక్షికి జలమే ఆహరం. ఎలుకలు కొండగుహలలో నివచించియుండును. శునకం దిగంబరియై బూడిదలో పడియుండును. కొంగ మౌనంతో ధ్యానాధిష్టానముతో నుండును. వీటియన్నిటికిని ఎలాంటి విశేషఫలమును లేదు. కావున బాహ్యచేష్టలతో భ్రమనొందక పై జెప్పిన వాటియొక్క గుణములతో కూడియుండు అంతరంగనిష్ఠ సంపూర్ణముగా కలిగియున్డవలయును. ఎట్లున్డినను జ్ఞానమొకటి చేతనే జీవుడు తరిస్తాడు. 

మనం ఈ విషయాన్ని సదా గుర్తుపెట్టుకోవాలి. గతంలో చెప్పినట్లుగా పుణ్యక్షేత్ర దర్శనాలతో భక్తి పెరిగి , భగవంతున్ని స్మరిస్తూ చేసే తీర్ధస్నానాలతో పుణ్యం వస్తుంది. కానీ ఆ పుణ్యఫలం ప్రారబ్ధంలోనికి వచ్చిన తర్వత జననమరణాలు తప్పవు. అంతే తప్ప ముక్తి రాదు అని అంటూ ఇంకా ఇలా వివరించారు -

మన దేహంలో మూడు ప్రధాన నాడులున్నాయి. అవి ఇడా పింగళ సుషుమ్నాలు. ఈ మూడింటి సంయోగస్థలం భ్రూమధ్యం. అందుకే ఈ స్థానమును త్రివేణీ సంగమనియు, మేరు స్థానమనియు యోగులు చెప్పుదురు. కాబట్టే భ్రూమధ్యమున మనస్సును స్థిరంగా నిలిపి చేయు ధ్యానం శ్రేష్ఠం. ధ్యానంచే ఈ త్రివేణీ సంగమందు ఒక్క మునకవేసిన చాలును, ముక్తిపొందడానికి. 

ఇడా భాగీరధీగంగా పింగళా యమునానదీ 
తయోర్మధ్య గతా నాడీ సుషుమ్నాఖ్యా సరస్వతీ  
త్రివేణీ సంగమో యాత్ర తీర్ధ రాజ స ఉచ్యతే 
తత్ర స్నానం ప్రకుర్వీత సర్వ పాపై ప్రముచ్యతే 

ఇడానాడే గంగానది. పింగళనాడి యమునానది. ఈ రెండింటి మధ్యలో ఉన్న సుషుమ్నానాడి సరస్వతీనది. ఈ మూడు నాడులు భ్రూమధ్య స్థానంలో ఆజ్ఞాచక్రంలో సంగమిస్తాయి. దీనినే త్రివేణిసంగమం అని అంటారు. దీంట్లో స్నానం చేస్తే జీవుడు అనేక జన్మలలో తాను చేసిన పాపములనుండి, ప్రారబ్ధములనుండి ఒక్కమాటలో చెప్పాలంటే క్రియలనుండి విముక్తి పొంది ముక్తుడౌతాడు. 
బాగుందండీ, మీరు చెప్తున్న దానిబట్టి నాకు అర్ధమౌతుంది .... బాహ్యముగా ఏమైతే ఉన్నాయో, ఏం చేస్తే తరిస్తామో, అవి అన్నీ మనలోనే ఉన్నాయని, మనలోనే చూసుకొంటే తరిస్తామని. కానీ, కోడికూయక ముందే లేస్తాను, గొడ్లచావిడికి వెళ్లి లక్ష్మిని (ఆత్తయ్యగారు ప్రేమగా పెంచుకుంటున్న ఆవుని) పలకరించి, కాస్త పేడను తీసుకొని వాకిట్లో కల్లాపి జల్లి, పొయ్యి అలికి ముగ్గులెట్టి, కసుపు తుడిచి, స్నానపూజాదికాలు పూర్తయ్యాక పొయ్యి రాజేస్తానా ... అప్పుడు అంటించిన పొయ్యి నడినెత్తిన సూర్యుడొచ్చేంతవరకు వెలుగుతునేవుంటుంది. కాసేపైన స్థిమితంగా కూర్చొనే సమయముండదు. మధ్యాన్నం మీరందరి భోజనాలు అయ్యాక, కాస్త తిని, వత్తులు చేసుకుంటునో, పప్పు విసురుకుంటునో, బియ్యం ఏరుకుంటునో, ఈనో పేనో చూసుకుంటునో ...  ఆ సమయంలో కష్టసుఖాలు చెప్పుకోవడానికో, కాలక్షేప కబుర్లు చెప్పుకోవడానికో వచ్చే ఇరుగుపొరుగువారితో మాట్లాడుతూ చిన్న చితక పనులు చక్కబెట్టుకునేసరికి సాయంత్రమైపోతుంది. ఇక మరల మొదలు ఇల్లు ఊడ్చడం, వంటావార్పులు, వడ్డనలు. మీరందరూ పడుకున్న తర్వాతే నా నిద్ర. అంతవరకు పట్టుమని పదినిముషములైన నడుం చేరేయడానికి లేదు. మరి నాలాంటిదానికి కుదురుగా కూర్చోవడం, జపమో తపమో ధ్యానమో ఎలా అవుతుంది చెప్పండి... 
మరి నాలాంటి వారు తరించే మార్గమే లేదా? అని అత్తయ్యగారు అనగా -
ఓహో ... ఎందుకు లేదూ,  నన్ను చక్కగా అర్ధం చేసుకొని నాకు అనుగుణంగా మసులుకుంటున్నావు. అలుపు తెలవనివ్వని చిరునవ్వుతో ఓర్మితో అందరితో ఆత్మీయంగా, అందరికీ ఆసరాగా వుంటున్నావు. నీకు సాధ్యమయ్యేంతలో బీదవార్ని ఆదరిస్తున్నావు. ఓ ఇల్లాలిగా గృహస్థుధర్మమును చక్కగా నిర్వర్తిస్తున్నావు. నీ ఈ ధర్మవర్తనంకు మరింత భక్తివిశ్వాసములు జతైతే ఈ జన్మలోనో, మరుజన్మలోనో తప్పక తరిస్తావు... అని మాస్టారుగారు చెప్తుండగా -
అది కాదండీ, మరి త్రివేణీసంగమంలో మునకలేస్తే ముక్తివస్తుందన్న పెద్దలమాట అసత్యమా అన్న ఆమె ప్రశ్నకు... 
లేదు లేదు, పెద్దలమాటలు, శాస్త్రవచనాలు ఎప్పటికీ అసత్యం కాదు. కాకపోతే వాటి అంతరార్ధమును గ్రహించి పాటించాలి. లేదా వాటిపై అణుమాత్రమైన అనుమానం లేకుండా అపారమైన భక్తివిశ్వాసములుంటే, దానికి పూర్వజన్మసుకృతం తోడైతే తప్పకుండా ఈజన్మలోనే తరిస్తాం. అది ఎలాగంటే ... 
అంటూ ఓ చక్కటి కధను, అంతరార్ధమును వివరించారు. ఆ వివరాలు తదుపరి టపాలో ... 

15, ఫిబ్రవరి 2015, ఆదివారం

ఈ మంత్రమే ఎందుకు మృత్యుంజయ మంత్రమైందీ ???

మహా మృత్యుంజయ మంత్రం:
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం /
 ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ //

అర్ధం :-
అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదను గాక! 

ఉదయం తెలిసినామె మా యింటికి వచ్చారు. మాటల మద్యలో...  ఈ మద్య ఒకరి సూచన ప్రకారం 'మహా మృత్యుంజయ మంత్రం' రోజూ పదకొండుసార్లు చదువుతున్నానండి. కానీ, కొన్ని సందేహాలున్నాయండి. ఎప్పుడో ఒకప్పుడు అందరం మరణించాల్సిందే కదా, మరి ఈ మంత్రమును చదివితే మృత్యువును జయించి ఎల్లకాలం బ్రతికి ఉండలేం కదండీ... మరి అలాంటప్పుడు ఈ మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రమంటారు? అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు? అసలు దోసపండుకు, మృత్యువుకు ఏమిటి సంబంధమో తెలియడం లేదు. అది అడుగుదామనే వచ్చానండీ ... అన్న ఆమెకు, నా అవగాహన మేరకు నేనిచ్చిన బదులిది - 

మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదండీ, పునర్జన్మ లేకపోవడం.అంటే ఇకముందు జననమరణాలు లేకపోవడం. అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం. ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి వుండగానే పొందాల్సిన స్థితి. ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం. అది ఎలాగంటారా? 
ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి. సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది. జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు. అంటే మాయనుండి విడివడతాడు. పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన వున్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను దేహ ప్రారబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై వుంటాడు. (జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే వున్నను, మాయ విడివడడంతో ఇవి ఏవీ అంటక అత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుండే వ్యక్తి) ముక్తస్థితిలో వుంటాడు. ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు. పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కదండీ. 
ఈసరికే మీకు అర్ధమై యుంటుంది, దోసపండుతో ఎందుకు పోల్చారోనన్నది. 
ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. ఆ ఆరాధన  ఎలాగుండాలంటే  - 
జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం. 
మీకు తెలుసు కదా, ఆదిగురువు శివుడు అన్న విషయం.  ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి. అందులో వున్న ఆధ్యాత్మిక రహస్యాలను శోదించండి. శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు -
పంచభూతాత్మకుడు :- శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.  
త్రయంబకుడు :- శివుని మూడుకన్నులు కాలాలను (భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు. 
నామము :- శివనామం లోని మూడుగీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు, మధ్యబిందువును తురీయావస్థలకు చిహ్నం. అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్ధాలు చెప్తుంటారు, ఈ జగత్తంతయూ త్రిగుణాత్మకమని, మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్మూ, అని సూచిస్తుందని అంటుంటారు. అటులనే శివవిష్ణ్యాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా త్రిమూర్త్యాత్మకమని (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) మధ్యబిందువు ద్వారా మువ్వురూ ఒకటేనని తెలుసుకోమన్న సూచనుందని కొందరంటుంటారు. 
విభూతిదారుడు :- సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. అంటే భస్మంగాక తప్పదు. నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం. 
త్రిశూలం :- సత్వ రజో తమోగుణాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, మానసిక  శారీరక, ఆధ్యాత్మికశక్తులకు, ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం.  
నాగాభరణుడు :- సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం. అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు. అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు. 

శివున్ని బోళాశంకరుడు అంటారు. ఎందుకంటే, సులభంగా అనుగ్రహిస్తాడు. ఈ అనుగ్రహం కూడా రెండు విధాలు. సంసారబద్ధుడై భోగాలను ఆశిస్తూ ఆరాదించినవారికి వాటిని అనుగ్రహిస్తాడు. జననమరణ చక్రభ్రమణంలో పడిపోకుండా సంసారంనుండి విముక్తిని కోరేవారికి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రాసాదిస్తాడు. పై మంత్రమును మామూలుగా చదివితే అకాలమృత్యువునుండి  ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. అలా కాకుండా పారమార్ధిక సాధనగా గ్రహించి ఆరాదిస్తే ముక్తస్థితి లభిస్తుంది. అందుకే శివున్ని లయకారుడు అంటారు. లయకారుడు అంటే లీనం చేసుకోవడం లేదా తనలో కలుపుకోవడం. 
  
 శివుణ్ణి ఆరాధించడమంటే శివుని పటంను అలకరించి కాసేపు పూజించడం కాదు. శివుని దివ్యరూపం వ్యక్తపరుస్తున్న ఈ ఆధ్యాత్మిక అంతరార్ధములను అవగాహన చేసుకొని ఆరాధించాలి. ఆ ఆరాధనా కూడా ఏ రీతిలో వుండాలో శివరూమే తెలుపుతుంది. సాధారణంగా శివుడు ధ్యానంలో ఆసీనుడైనట్లు దర్శనమిస్తుంటాడు. ఆ రూపం ద్వారా నిరంతరం బాహ్యప్రపంచమును కాంచే కనులను గట్టిగా కాకుండా అంటి అంటనట్లు మూసి వుంచి, దృష్టిని భ్రూమధ్యాన లగ్నం చేసి అంతర్ముఖులై సత్యంను దర్శించమన్న సూచనను గ్రహించి సాధన చేసినట్లయితే జీవుడు శివుడవుతాడు.  
తన రూపం ద్వారా జ్ఞానబోధ చేస్తున్న శివమంత్రం ఎందుకు మృత్యుంజయ మంత్రమైందో ఇప్పుడు మీకు అర్ధమై వుంటుంది. 
మనం తరుచుగా వింటుంటాం, మనసెరిగి నడుచుకో, చిత్రాన్ని కాదు చిత్తాన్ని చూడు, శోధించి సాదించు అన్న మాటలను. 
ఇలాంటి అంతరార్ధములను తెలుసుకుంటున్నప్పుడు అర్ధమౌతుంటుంది - పెద్దలు పలికే పలుకుల్లో పరమార్ధం. 

విన్నపం :- ఆమె ప్రశ్నలకు నేను విన్న, చదివిన వాటివలన నా అవగాహన మేరకు నాకు అన్పించినది ఇలా చెప్పాను. ఈ టపా చదివినవారు ఇందులో ఏమైనా సవరణలు గానీ, ఇంకా ఏమైనా సూచనలు గాని ఉంటే తెలపగలరని ఆశిస్తున్నాను.