5, సెప్టెంబర్ 2019, గురువారం

భారతీయ సంస్కృతి సంప్రదాయంలో "దీపం"

                                                       

                                                         

                                                  దీపం జ్యోతి పరబ్రహ్మ 
                                                  దీపం సర్వతమోపహం
                                                  దీపేన సాధ్యతే సర్వం 
                                                    దీపదేవ నమోస్తుతే.   

"దీపం" పరమాత్మకు ప్రతిరూపం.   
"దీపం" మన సంస్కృతిలో విడదీయరాని భాగం.  
"దీపం" పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక. 
మట్టి ప్రమిద భూతత్వానికి, తైలం జలతత్వానికి, వత్తి ఆకాశతత్వానికి, వెలగడానికి కదలాడే గాలి వాయుతత్వానికి, జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు.

విశ్వం కాంతిమయం. కాంతి శక్తిమయం. దైవాన్ని ప్రకాశంగా, ప్రకాశాన్ని దైవంగా ఆరాధించే సంప్రదాయంను ఋషులు అనుష్టించి అందించారు.  
'అగ్నిముఖావై దేవా' అని వేదం తెలుపుతుంది. దేవతలు అగ్నిముఖులు. వారికి మనకి అనుసంధానం చేసే మాధ్యమం అగ్ని. 'అగ్నిం దూతం వృణీమహే' అన్నది శ్రుతి. అందుకే అగ్నిహోత్రాన్ని ఆరాధించే యజ్ఞవిజ్ఞానాన్ని ఋషులు ఆవిష్కరించారు. దేవతల శరీరాలు తేజోమయాలు. కనుకనే తేజస్వరూపాలతోనే వారిని భావించి ఉపాసిస్తారు. నిత్యాగ్నిహోత్రం ద్వారా అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి,    యజ్ఞయాగాదులు ద్వారా అగ్నిని ఆరాధిస్తూ ఏ దేవతలకైనా హవ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం. మనం ఇవ్వదలచుకున్న ద్రవ్యాన్ని ఏ దేవత లేదా దేవుని పేరు చెప్పి స్వాహా అనగానే, అగ్ని దానిని నేరుగా వారికే చేర్చేస్తాడు. దేవతలకు మనకి అనుసంధానకర్తగా అగ్ని వ్యవహరిస్తాడు. ముక్కోటి దేవతలకు వాహకంగా నిలిచే అగ్నికి సూక్ష్మరూపమే దీపం. ఆ దీప ప్రకాశమే పరబ్రహ్మ.    
పూర్వకాలంలో ప్రతి ఇంటా నిత్యం అగ్నిహోత్రం నిర్వహించేవారు. నేటి పరిస్థితుల రీత్యా నిత్య అగ్నిహోత్రం సాధ్యం కాకపోవడంతో ఉభయసంధ్యల్లో దీపారాధన శుభప్రదం అని శ్రేయస్సుకరమని ఓ నియమమును ఏర్పరిచారు.  


దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ, మధ్యభాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, వత్తి వెలుగులో పార్వతిదేవి, సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి. 

భక్తిని క్రియారూపంగా ప్రకటించే విధానమే పూజ. మనస్సులో భగవంతుడిని నింపుకుని, నామాలను వాగ్రూపంగా ఉచ్చరిస్తూ, కర్మణా పూజను ఆచరించడం జరుగుతుంది. ఇలా త్రికరణశుద్ధిగా జరిగేది పూజ. ఇలా పూజను ప్రారంభించేముందు ఆ పరమాత్మునికి ప్రతిరూపమైన దీపాన్ని వెలిగిస్తూ...
దీపం జ్యోతి పరబ్రహ్మం
దీపం సర్వతమోపహం
దీపేన హరతే పాపం
దీపలక్ష్మీ నమోస్తుతే
అని అంటూ దీపాన్ని ఆరాధిస్తాం. 

అలాగే దీపారాధన సమయంలో ఈ క్రింద మంత్రం పఠిస్తూ నమస్కరిస్తాము. 
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా 
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్ 
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే 
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే
మూడువత్తులను తీసుకొని, తైలంలో తడిపి అగ్నిని జతచేసి, శుభప్రదమైన మూడులోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించి, పరమాత్మకు భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకం నుండి రక్షించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను. అని రోజూ దీపానికి నమస్కరిస్తాము. వెలిగించేది చిన్న దీపం, ఆశించేది ముల్లోకాల్లోనూ వెలుగులీనాలని. ఎంత ఉదాత్త భావన, ఎంత గొప్ప ఆలోచన. చిన్ని చిన్ని చర్యలతో, చిన్న ప్రార్ధనతో సర్వుల శ్రేయస్సును కోరుతూ మన బ్రతుకులను ఎలా పండించుకోవాలో, ధన్యతనొందాలో తెలియజెప్పిన మన సంస్కృతీ సంప్రదాయాలకు జోహార్లు. అలానే సర్వేజనాః సుఖినోభవంతు అనుకుంటాం. అందరూ బాగుండాలి, అందులో మనమూ ఉంటాం కానీ, అందరికై నిస్వార్ధ ప్రార్ధన. ఇటువంటి ప్రార్థనలలో ఎంత హాయని. 

                                                 దీపం జ్యోతి పరబ్రహ్మ 
                                                 దీపం సర్వతమోపహం
                                                 దీపేన సాధ్యతే సర్వం
                                                 సంధ్యాదీపం నమోస్తుతే  
లోకానికి వెలుగును తేజస్సును ప్రసాదించే సూర్యుడు జీవులమీద దయతో వారికి జీవాన్ని, శక్తిని ప్రసాదించడానికి తాను అస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. అందుకే సూర్యుని అస్తమయంకు కాస్త ముందుగానే ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సంప్రదాయాన్ని పెద్దలు ఏర్పరిచారు.    

                           
సర్వదేవతలూ దీపంలోనే నిక్షిప్తమై ఉంటారన్నది శాస్త్రవచనం. కాంతిని ఐశ్వర్యంగా భావిస్తాం. కనుకనే దీపమును లక్ష్మీస్వరూపంగా కొలుస్తారు.  
ఉభయసంధ్యలలో దీపారాధన లక్ష్మీప్రదం అని సామాన్యులకు తెలుసు. అందుకనే పెద్దగా పూజలు వ్రతాలు చేయనివారైనా, ఏమీ తెలియని పామరుడయినా ధూప దీప నైవైద్యాలను తప్పక పూజలో సమర్పిస్తాడు.   

జ్యోతిని జ్ఞానానికి ప్రతీకగా భావిస్తాం. అజ్ఞానాన్ని అంధకారంతోను, జ్ఞానాన్ని వెలుగుతోను సంకేతించడం మన భారతీయ సంస్కృతి.  
దీపం అంధకారాన్ని పటాపంచలు చేస్తూ, సదా ఊర్ధ్వదృష్టినే కలిగియుండడం ద్వారా, అంధకారమనే అజ్ఞానాన్ని పారద్రోలి, మనస్సును అల్పవిషయాల పైకి కాక ఊర్ధ్వముఖంగా పరబ్రహ్మం వైపు మళ్లించమనే సంకేతాన్నిస్తుంది. 

ఆలయ ప్రాంగణములో దీపం, వృక్షమూలం చెంత దీపం, ధ్వజస్తంభం దగ్గర దీపం, గృహంలో దేవునిమూర్తుల ముందు దీపం, ఇంటిగుమ్మం దగ్గర దీపం, తులసి చెంత దీపం, ముగ్గుల నడుమ దీపం, పుష్పాల మధ్య దీపం ... ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించిన ఆ ప్రకాశం అసురశక్తుల్ని, అసురగుణాల్ని, గణాల్ని నిలువరించి సత్వాన్ని, సత్యాన్ని ప్రభోదిస్తుంది. దీపకాంతుల ప్రకాశంతో అశాంతిచీకటుల అస్తమయం, నిరాశ నిస్పృహల తిరోగమనం కాగా,  దైవంపట్ల భక్తి పురోగమనం, ఉల్లమున ఉల్లాస ఉత్సాహాల ఉత్తేజం, సత్వగుణ ఆగమనం,అంతరమున ఆంతర్యామిపై అనురక్తి అధికమౌతాయి.   

లక్ష్మీదీపం, అర్చనాదీపం, బృందావనదీపం, నందాదీపం, అఖండదీపం, ఆకాశదీపం,  అని దీపారాధనల్లో అనేక రకాలు. 

అలానే దీపపు సెమ్మెలను బట్టి నాగ దీపం, రథ దీపం, మేరు దీపం, కుంభదీపం అని కూడా వ్యవహరిస్తారు. వేదకాలంలో మత్స్య, కూర్మ, మయూర, హంస, గజ, అశ్వ, సర్ప, శంఖ, పద్మ, చక్రాకారాలతో ప్రమిదలను మట్టితో మలచి యజ్ఞయాగాదుల మంటపాలలో వినియోగించేవారట. ఇతిహాస పురాణయుగాల్లో దారు శిలా సువర్ణ రజిత తామ్ర కంచు ఇత్తడి ఇత్యాది వాటితో దీపపు కుందులను తయారుచేసి వినియోగించేవారు. 

సాధారణంగా నిత్యా దీపారాధనలో కుందిలో నాలుగువత్తులను జీవాత్మ, పరమాత్మలకు ప్రతిరూపంగా రెండువత్తులుగా చేసి  రెండు జ్యోతులుగా వెలిగిస్తారు. మూడు వత్తులు ముల్లోకాలకు, త్రిగుణాలకు, త్రిసంధ్యలకు సంకేతంగా భావిస్తూ  కొందరు మూడువత్తులను వెలిగిస్తారు. వారి వారి కుటుంబ ఆనవాయితి, అలవాటు బట్టి దీపారాధన చేస్తుంటారు. 

సద్గతిని కలిగించడానికి దీపం ఒక సేతువు. పరమాత్మకు ప్రతీకైనా దీపజ్యోతి మన ఆధ్యాత్మిక ప్రగతికి ఆలంబనంగా నిలుస్తుంది. 
చీకటి నుండి వెలుగువైపు, అమంగళం నుండి మంగళంవైపు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, మృత్యువు నుండి అమరత్వం వైపు సాగాలని ప్రబోధించడమే దీపం అంతరార్ధం. 

అలానే దీపజ్యోతి శారీరక మానసిక ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడుతుంది. చీకటి తమోగుణానికి తార్కాణం. చీకటి సోమరితనం,నిద్ర, అలసత్వం,నిరాశలను పెంచి శారీరక కుంగుబాటుకు గురిచేస్తుంది. వెలుగు ఉత్సాహానికి ఆహ్లాదానికి క్రియాశీలత్వానికి దోహదపడుతుంది. దీపజ్యోతిని తదేకంగా చూడడం వలన మానసిక ఏకాగ్రత వృద్ధిచెందడంతో పాటు తాత్త్విక పరిణితికి దోహదపడుతుంది. 

హృదయకుహరంలో ఆత్మజ్యోతిని దర్శించాలన్న ధార్మిక విజ్ఞానం దీపారాధనలో ఉంది. దీపం యొక్క విశిష్టత తెలుసుకొని ధ్యానిస్తే తత్వదృష్టి మరింత విస్తరిల్లి అంతర్ముఖమై ఆత్మజ్యోతిని దర్శించుకోవచ్చని అనుభవజ్ఞులమాట. 'దీపజ్యోతి ధ్యానాభ్యాసం పరమాత్మ దర్శనానికి ఒక మార్గం' అని శ్రీరామకృష్ణులు వారు చెప్పేవారు. కాబట్టి దీపారాధన ఓ ఆధ్యాత్మిక సాధనాభ్యాసమే.


శరీరమనే ప్రమిదలో నిష్ఠ అనే నూనె వేసి, వత్తి అనే బుద్ధితో జ్ఞానమనే జ్యోతిని వెలిగించి, హృదయంలో ఉన్న ఆత్మను దర్శింప జేసుకోవడానికి చేసే ప్రయత్నమే దీపారాధనలోని ఆంతర్యం అని అంటుంది ఆర్యధర్మ. 

దీపారాధన వలన దుష్టశక్తులు రావని,  ఐశ్వర్యం కలుగుతుందని ఓ నమ్మకం. దీపమున్న ఇంట్లో దుష్టశక్తులు చొరబడనట్లు దేహమనే ఇంట్లో ప్రకాశిస్తున్న ఆత్మజ్యోతిని ధ్యానించినప్పుడు మనస్సులోని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే దుష్టశక్తులు ప్రవేశించలేవు. అలాగే దీపజ్యోతిలోని మూడురంగులు సత్వ రజో తమోగుణాలను సూచిస్తుంది. ఈ గుణాలను అధిగమించినప్పుడు ఆ ఆత్మజ్యోతిలో ప్రతిష్ఠితమై ఉన్న పరమాత్మ దర్శనము అవుతుందన్నది మహర్షుల మాట.   

ఘృతం లేదా తైలం, ప్రమిద, వత్తి వీటితో ఒక చిన్న వెలుగు మొలక దీపం. ప్రమిదలలోని గోఘృతం లేదా తైలం అజ్ఞానమైతే అహం వత్తి. అజ్ఞానాంధకారాన్ని జ్ఞానజ్యోతితో తొలగించుకొని మానవత్వపు దీపకాంతులని పంచిపెట్టడమే దీపకళిక తత్త్వం .చిన్ని దీపంలో ఎంత అద్భుతమైన ఆవిష్కరణ. నిత్యం దీపం వెలిగించడం అలవాటైపోవడం వలన గుర్తించలేకపోతున్నాం కానీ, దానికున్న విశిష్టత ఎనలేనిది. ఈ అద్భుతమైన అంతరార్ధాన్ని, మన సంప్రదాయ ఔచిత్యాన్ని గ్రహించి, దీపారాధనను వివిధరీతుల్లో, సుమాల సోయగాలతో, అందంగా అలంకరించి, ఆనందంగా అంతర్యామితో అనుసంధానం అవుతూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నచక్కటి సాధకులు 'వనజతాతినేని'గారు. ఆమె అభిరుచి అభినందనీయం. ఆమె అభిమతం ఆచరణీయం. ఆమెకిదే నా అభివందనం 🙏
ఇంతటి మహత్తరశక్తి  ఉన్న  దీపానికి మ్రొక్కకుండా ఉండగలమా?  
                                                                
                                                            దీపం నమోస్తుతే 


13 కామెంట్‌లు:

  1. దీపం విశిష్టత తెలుసుకోగలిగాను. వనజగారి దీపారాధన చిత్రాలు చాలా చక్కగా ఉన్నాయి. చక్కటి సమాచారంతో చక్కటి చిత్రాలతో ఈ టపా ప్రకాశవంతంగా శోభిల్లుతోంది.



    రిప్లయితొలగించండి
  2. మన ఆచార వ్యవహారాల్లో ఇంత పరమార్ధముందని ఇప్పుడిప్పుడే అర్ధమౌతుంది. ఇకనుండి ఆ చేసిన
    కొద్ది నిముషాల పూజనయిన శ్రద్ధగా చేస్తాను భారతిగారు.
    రోటీన్ గా ఏదో తూతూ మంత్రంగా హడావిడిగా పూజ అయిందనిపిస్తున్నాను. ఆబ్బా...వనజగారు దీపాలంకరణలోనే ఆమె శ్రద్ధాభక్తులు కనిపిస్తున్నాయి. ఆఅమెకు నా _/\_ అభినందనాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్మగారు,
      వనజగారు చిత్రాల స్ఫూర్తితో ఈ టపా పెట్టానండి.
      మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి.

      తొలగించండి
  3. .



    దీపింపబడేది దీపం. ఉద్దీపింపబడేది దీపకాంతి.

    వివరణాత్మక టపా. చాలా బాగుంది. చిత్రాలు బాగున్నాయి.

    చిన్న సందేహమండి...ఇంత ప్రాముఖ్యత ఉన్న దీపాన్ని చనిపొయినవారి దగ్గర ఎందుకు వెలిగిస్తారండి?







    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. దీపంలా కాలి పోవాలని :)



      జిలేబి

      తొలగించండి
    2. రమణిగారు,
      మృతులైనవారికి నరకాది అంధకార కూపాల పాలుకాకుండా దివ్యలోకాల సద్గతులు ప్రాప్తించాలనే భావంతో ఆత్మశాంతికి ఏకవత్తిదీపసమర్పణ ఆచారం ఉంది.
      మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి.

      తొలగించండి
  4. ప్రతిరోజూ ఒకటే దీపం పెట్టవచ్చా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒకటే దీపం అంటే మీ ప్రశ్న సరిగ్గా అర్ధం కాలేదండి. బహుశా ఒకటే కుందెలో దీపం వెలిగించవచ్చా అన్నది మీ ప్రశ్నని అనుకుంటాను.
      పై టపాలో చెప్పినట్లు సాజ్యం త్రివర్తి సమ్యుక్తం...మూడు వత్తులను కలిపి ఒకే కుందెలో దీపం వెలిగించాలి.ఒకటే కుందె అయితే మూడు వత్తులు తప్పనిసరి. లేదా రెండేసి వత్తులు కలిపి రెండు కుందెల్లో దీపం వెలిగించాలి.

      వివరణలకై ఇక్కడ రెండు లింక్స్ ఇస్తున్నాను. చూడండి.

      https://youtu.be/V5ewv3dnj64

      https://youtu.be/Wbpt05IXoWw




      తొలగించండి