25, మార్చి 2013, సోమవారం

"ఆహా ... నా నెచ్చలి బహు బుద్ధిశాలి" !




రెండురోజుల క్రితం - 
హరిప్రియ (స్నేహితురాలు) నుండి ఫోన్ ... 'నేనిప్పుడు ట్రైన్లో ఉన్నాను, చిన్నమ్మ (పిన్ని) దగ్గరకు వెళ్తున్నాను, వచ్చాక మాట్లాడతాను. ఓకే నా' !
నిన్న ఉదయం -
తననుండి మరల ఫోన్ ... 'ఇప్పుడే ఇంటికి వచ్చాను, వీలైతే రా, నీతో ఓ విషయం చెప్పాలి.....'!
నిన్న సాయంత్రం తనింటికి వెళ్లగా, తను చెప్పిన విషయం ఏమిటంటే -
ఈ మధ్యనే తన మరదలకి పాప పుట్టింది. పేరు సన్వి. పెద్దపాప పేరు సమన్వి. రెండుసార్లు సిజేరియన్ కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. అదే వారి చిన్నమ్మకు కోపకారణమైంది. ఎంతో సఖ్యతగా ఉండే అత్తాకోడళ్ళ మధ్య ఈ కారణంగా చిరు స్పర్ధ. ఎవరికైన ఒక్కపుత్ర సంతానమైన ఉండాలని, పాపని చూడడానికి ఎవరు వచ్చినా, నా మాట వినలేదు, పున్నామ నరకంనుండి రక్షించే పుత్ర సంతానం లేదని అనడం ... ఆ మాటలకు బాధపడి మరదలు ఫోన్ చేస్తే ఊరు వెళ్లి, చిన్నమ్మకు కౌన్సిలింగ్ చేసి వచ్చాను అని!
ఓహో ... ఏమని కౌన్సిలింగ్ ఇచ్చావో చెప్పుమరి, అని అడగగా -
ఏముందీ, నాతో కూడా చిన్నమ్మ అవే మాటలంది. ప్రియమ్మా! నీవైనా చెప్పు, తల్లితండ్రులను ఉద్ధరించేది కొడుకే కదమ్మా, పుత్రుడే కదా పున్నామ నరకంనుండి రక్షించేది, కొడుకు వలనే కదమ్మా మోక్షమని శాస్త్రం చెప్తుంది, ఇదే నేనంటున్నానని మీ తమ్ముడు, మరదలు నన్ను తప్పు పడుతున్నారు, నేను అన్నదాంట్లో తప్పేం ఉంది? అని అమాయకంగా ప్రశ్నిస్తున్న చిన్నమ్మ మీద కొంచెం కోపం, జాలి కలగగా, ఓపిగ్గా చెప్పాను, అమ్మ ఆలోచన తప్పని!
తనేం చెప్పిందో తన మాటల్లోనే -
"అపుత్రస్య గతిర్నాస్తి' అన్న మాట శాస్త్రంలో ఉన్నమాట నిజమే గానీ, అమ్మా! ఆ మాట ఈ కాలానికి చెందినది కాదు. కొన్నివేల సంవత్సారాలు క్రితం, అప్పటి రాజులు తమ రాజ్యాన్ని పరిపాలించినంతకాలం పరిపాలించి, అటుపై పుత్రునికి రాజ్యాధికారమును అప్పగించి, తమ తమ జన్మలను తామే ఉద్ధరించుకోవాలని అన్నింటిని పరిత్యజించి వానప్రస్థం స్వీకరించేవారు. అటువంటివారు పుత్రుడు జన్మిస్తే కొంతకాలానికి వారికి రాజ్యపరిపాలన అప్పగించి, నిశ్చింతగా తపస్సు చేసుకోవాలని పుత్రున్ని కోరుకునేవారు. అప్పటి కాలధర్మప్రకారం పుత్రుడు ఆవశ్యకమై శాస్త్రంలో చెప్పిన మాట అది. అమ్మా! పుత్రులు లేనివారికి మోక్షం లేనిచో, అసలు భార్యాబిడ్డలే లేని నారద, శుక, సనక, సనందనాది మహర్షులు, శంకరాచార్యులు, షిర్డీ బాబా, రమణులు మొదలగువారికి మోక్షసిద్ధి ఉండకూడదు కదా! అమ్మా! నీకు షుగర్ ఉందని నీవు మందు వేసుకోకుండా తమ్ముడు వేసుకుంటే నీకు షుగర్ తగ్గుతుందా? నీకు ఆకలి వేసినప్పుడు తమ్ముడు భోజనం చేస్తే నీ ఆకలి తీరిపోతుందా? అలానే నీ ప్రారబ్ధకర్మలను నీవే క్షయం చేసుకొని, మోక్షసిద్ధిని పొందాలే తప్ప, పుత్రుడిని కన్నంతమాత్రమున రాదమ్మా. అయితే అమ్మా, ఎంత దుష్టులైన పుత్రున్ని కంటే చాలు, మోక్షాన్ని పొందేస్తారా? మోక్షానికి అర్హత పుత్రున్ని కనడమేనా? "అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం" ఎవరు చేసిన కర్మఫలితం వారికే సిద్ధిస్తుందని శాస్త్రవచనం ఉంది కదా. మనం చేసుకున్న పుణ్యకర్మలు, సాధన బట్టే మోక్షసిద్ధి వస్తుందమ్మా. తల్లితండ్రులను ప్రేమతో చూసుకున్న బిడ్డలు, తాముచేసిన ఈ పుణ్యకర్మవలన తాము ఉద్ధరింపబడతారు. అలానే, తమను ఆత్మీయంగా చూసుకుంటూ, తాముచేయు పుణ్యకర్మలకు సహకరించిన సంతానం వలన తల్లితండ్రులు కొంత ఉద్ధరింపబడతారన్న మాట వాస్తవమే అయినను, అంతమాత్రమునే మోక్షం రాదు. ఇక, పితరుల సౌఖ్యం కొరకు ఆచరించే పితృకర్మలు (శ్రాద్ధములు మొ...) ద్వారా పితరులకు కొంత సౌఖ్యం, పిల్లలకు పితృదేవతలనుగ్రహం దొరుకుతుందే తప్ప, అంతమాత్రమున మోక్షం రాదని చెప్పా!

అబ్బా ... ఇంత చక్కగా ఎలా చెప్పావ్ అని అనగా, 'నీ సాంగత్యంలో అలవడిన పుస్తక పరిజ్ఞానంతో' అన్న తన మాటలింటూ, హృదయపూర్వకంగా ఇలా అనుకున్నాను -

"ఆహా ... నా నెచ్చలి బహు బుద్ధిశాలి" !
                               

23, మార్చి 2013, శనివారం

నా జీవనగమనంలో ..... శ్రీ బుద్ధ భగవాన్!



సకల జనావళిని అజ్ఞానంధకారంలోంచి జ్ఞానకాంతిలోకి తీసుకురావడమునే తన జీవిత ఆశయంగా పెట్టుకొని, 'సిద్ధి పొందుగోరువారికి నేను రక్షకుడును, ముక్తి కోరువారికి నేను మార్గదర్శకుడును, దుర్వార సంసార సాగరాన్ని దాటదలిచినవారికి నేను సేతు బంధనమును, నిర్లక్ష్యం చేయబడ్డవారికి నేను విశ్రమించు పాన్పును, నా సన్నిధి కోరువారికి నేను మిత్రుడును' అని భావించి, సమ్యక్ సంబుద్ధిని, నిర్వాణ పధం ప్రభోదములను చేసిన అనంతకారుణ్యమూర్తి - "శ్రీ బుద్ధ భగవాన్'.
నాకు ప్రశాంతజీవనం అలవడడానికి, నన్ను నేను చూసుకోవడానికి, సరిచేసుకోవడానికి దోహదపడిన
బుద్ధభగవాన్ బోధలలో కొన్ని -
                                                  
కర్మ చేయకుండా ఎవరూ ఉండరు, ఉండలేరు. ప్రతీ కర్మకు ఫలితం వుంటుంది. కర్మకు కారణం వున్నంతవరకు, దాని ప్రతిఫలం అనుభవించక తప్పదు. కర్మలు మూడు విధములు. అవి కాయక కర్మ, వాచక కర్మ, మానసిక కర్మ. కర్మ బయటనుండి వచ్చేది కాదు. ఏ దైవం చేతనో అది మన మీద విధింపబడేది కాదు. అది మన స్వభావం వలనే జరుగుతుంది. మన మానసిక అలవాట్లు, అభ్యాసాలు, ఊహలు, భావాలు, అభిప్రాయాలు, ఆలోచనలు, సంబంధాలు, ఆపేక్షలు, కోర్కెలు, ఇష్టాలు ... వీటి ఫలితమే కర్మ. మనగతమంతా కర్మ ఫలితమే, ఈ కర్మే మన వర్తమానాన్ని ఏర్పాటు చేస్తుంది గనుక, వర్తమాన జీవితం కర్మలచేత బంధింపబడి యుంటుంది. వర్తమానంలో చేసే కర్మల ఫలితమే భవిష్యత్తులో తటస్థపడుతుంది. ఆ ఫలితాలే భవిష్యత్తులో మన స్థితిగతుల మీద తమ ప్రభావాన్ని చూపుతాయి. కర్మలలో వ్యత్యాసం వలనే మనుష్యులందరూ ఒకే విధంగా జీవించలేరు. కానీ, నిష్కామముతో కర్మలాచరించే వారిని ఏ కర్మఫలితమూ బంధించదు. కర్మ కాంక్షతో చేసినప్పుడే అది బంధహేతువు అవుతుంది. అది మనోమాయకు, దుష్కర్మకు దారి తీస్తుంది. తత్ఫలితమే దుఃఖం. అందుకే మనం సదా సత్కర్మాచరణే  గావించాలి.
                              
             * * *
మనసే మనిషిని బద్ధున్ని లేదా బుద్ధున్ని చేస్తుంది.
                              
             * * *
ధర్మమార్గం, సమదృష్టి, దృఢసంకల్పం, సత్కర్మాచరణ, మితభాషణ, సహజీవనం ఇవే సత్యప్రాప్తికి సాధనాలు.
భోగభాగ్యాలపై, సుఖాలపై వాంఛలేకుండా, మనోప్రక్షాళనం చేసుకొని స్వధర్మంలో పయనించాలి. విషయాలు విషం వంటివి. విషయవాసనలనుంచి విరమణ వలన మనస్సు నిర్మలం, నిశ్చలం అవుతుంది. నీ చీకటిని నువ్వే పారద్రోలుకునేందుకు, నీ సంరక్షణ బాధ్యత నీకు నువ్వే స్వయంగా తీసుకునేందుకు, నీకు నువ్వే జ్యోతిగా నిలిచి వెలిగేందుకు ... బయట దేనితోను సంబంధం పెట్టుకోక, దేన్నీ ఆశ్రయించక, అనుకరించక, అనుసరించక; నీలోనే ఆ ఆశ్రయమో, రక్షణో తీసుకో!
                              
          * * *
తనను తాను తెలుసుకుంటే, ఇంక తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. తనని తాను, తాను తెలుసుకోక, ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. ప్రవర్తన వినయంగా వుండేకొద్దీ మేలు అధికంగా, బహుముఖంగా వుంటుంది. దానికి సోమరితనం పనికిరాదు, కాలం వృధా చేయకూడదు, వర్తమానంలో జీవించాలి.
                              
          * * *
ధ్యానం అంటే - నిజజీవితం నుండి పలాయనం కాదు, నిజజీవితం లోకి ప్రవేశం.
ధ్యానం అంటే - ఒక అనుభవం కాదు, ఆ క్షణంలో సాక్షికి ఎరుకలో వుండటం.
ధ్యానం అంటే - సంకల్పరహిత స్థితి. అకర్మ స్థితి.
మనసు ఎక్కడ ఎప్పుడు అంతం అవుతుందో, అప్పుడు అక్కడ ధ్యానం ఆరంభమౌతుంది.
                              
            * * *
జన్మ ఒక అల లాంటిది. అది తిరిగి మహాసముద్రంలో కలిసి, మరో అలలా పైకి లేస్తుంది. అవిరామంగా, అనంతముగా జననమరణాలు రెండూ మానవజీవితంలో ఎడతెగకుండా అలలు మాదిరిగా వస్తూ పోతూ ఉంటాయి. ఆ జీవన ప్రవాహం అవిచ్ఛన్నంగా సాగిపోతూ వుంటుంది. 'అజ్ఞానం' జీవితంలో పేరుకుపోయినంతకాలం జననమరణాలు తప్పవు.అజ్ఞానం పోయి స్వస్వరూప జ్ఞానం కలిగితే పునర్జన్మలు ఉండవు. "నేను" అనే అహంభావం వుంటే, కోర్కె కలగడం సహజం. ఆ కోర్కె వలన కర్మ చేయడం సహజం. కోర్కె ఆగి, స్వస్వరూప జ్ఞానం కలిగిన క్షణమునే జీవనసాఫల్యత!
                              
          * * *
దైవంకోసం, దేవతానుగ్రహంకోసం ఎప్పుడూ ఎదురు చూడకుండా, బైటనుంచి ఎటువంటి సహాయం కోసం చూడకుండా, ఎప్పడూ దేనికీ ... ఎవరిమీద దేనిమీద దేనికోసం ఆధారపడకుండా, ప్రతిఒక్కరూ ప్రతిక్షణం తమను తాము ఏ అరమరికా లేకుండా, ఎటువంటి దురాభిమానం పక్షపాతం, స్వార్ధం లేకుండా, లోపల బైటా పరిశీలించుకోవాలి... పరీక్షించుకోవాలి... పరిశోధించుకోవాలి. పాపం, హింస, వాంఛ, మోహం, స్వార్ధం మొదలగువాటికి జీవనగమనంలో చోటులేకుండా, దయ, ప్రేమ, కరుణ, సమానత్వం కలిగి... అందరూ అంతా ఒకటే, సమానమే ఆన్న ఏకత్వభావంతో, దృఢసంకల్పంతో సాధన చేస్తూ సన్మార్గవర్తనులై జీవించాలి. ఇదే 'అంతర్వీక్షణ'.
                              
         * * *
జీవితం సత్యాన్వేషణతో సాగాలి గానీ, కోర్కెలతో కాదు.
                              
         * * *
ఇతరుల మాటకో, భావానికో, అభిప్రాయానికో ... దేనికో ఒకదానికి నువ్వు కోప్పడి, బాధపడితే అది నీ దుర్భలత్వం. వారు మనస్సుతో గాక, స్వేచ్ఛగా అనాలోచితంగా అనినా, చేసినా ... నువ్వు దానికి ప్రతిస్పందించి, ప్రతిక్రియ చేయడం అది నీ మనోదాస్యం. ఇది తగదు.
                              
        * * *
దుఃఖరహితంగా జీవించాలంటే, విషయలోలత్వం కోర్కెలు స్వార్ధచింతన పూర్తిగా నశించాలి. ఇందుకు అష్టాంగ సూత్రాలును అనుసరించాలి. అవి - సరైన ఆలోచన, సదవగాహన, నిర్మల మనస్సు, సత్కర్మ, సరైన యత్నం, సత్ప్రవర్తన, బుద్ధిసూక్ష్మత, ఏకాగ్రత.
                              
       * * *
మీరు దేనిమీద ఆధారపడక, మీ కాళ్ళమీద మీరు నిలబడండి. ప్రార్ధించి, బేరమాడినంతమాత్రాన పాపపరిహారం కాదు. శీలం, సమాధి, ప్రజ్ఞ అనే మూడూ జీవితంలో ముఖ్యంగా అలవర్చుకోవాలి.
శీలమంటే పవిత్ర అలోచనాలు, సమాధి అంటే సరైన ఏకాగ్రత, ప్రజ్ఞ అంటే సంపూర్ణ ఎరుక.
                              
       * * *
ధర్మ శబ్దం విపులార్ధం కలది. అది గంభీరమైనది. కేవలం భాషా పాండిత్యం వాళ్ళ అది తెలిసే సంగతి కాదు. అచంచలమైన ధర్మనిష్ఠ, ధర్మనిరతి, సత్యవంతమైన నిర్మలమైన అంతరంగం, సాత్విక ప్రవృత్తి, శమం (అంతరింద్రియ నిగ్రహం), దమం (బాహ్యఇంద్రియ నిగ్రహం), భూతదయ, ఓర్పు, నమ్రత దానికి అవసరం. అప్పుడే ధర్మ స్వరూపాన్ని దర్శించగలరు.
                              
      * * *
నదీ ప్రవాహంలో అనేక వస్తువులు, చెత్త చెదారం అంతా, అన్నీ కొట్టుకుపోతాయి. ఏవో రెండు వస్తువులు ఆ ప్రవాహంలో కలుసుకొని, కొంతదూరం కలిసి ప్రయాణించి, ప్రవాహతాకిడికి ఎక్కడో విడిపోతాయి. సంసారంలో ఈ జీవులస్థితి ఆ విధంగానే వుంటుంది. గతంలో ఎక్కడెక్కడో వున్నవారో, వచ్చి ఒకచోట చేరి, ఒక కుటుంబంగా వుండి, కొంతకాలం తర్వాత తిరిగి ఎవరిదారినవారు పోతారు. కాబట్టి విజ్ఞులగువారు ఇట్టి సంయోగ వియోగాలకు బాధపడరు.
                              
      * * *
ఈ ప్రపంచంలో లాభనష్టాలు, దూషణ భూషణలు, కష్టసుఖాలు, బాధా సంతోషాలు ఎప్పుడూ వుండేవే. వివేకులు వాటిని నిగ్రహించుకోవాలి. అవి ఎట్లా వస్తాయో, అట్లానే పోతాయి.
                              
      * * *
పాపం చేయకపోవుటయే 'పుణ్యం'.
                              
      * * *
జీవితంలో ఏ విషయంలోనైనా సరే 'అతి'ని వదలాలి. మధ్యేమార్గం అవలంభించాలి. ఆ మార్గం జ్ఞానవంతుల్ని చేస్తుంది. నిర్వాణస్థితికి చేరుస్తుంది. ఈ స్థితిని పొందడానికి పది సంకెళ్ళుతో కూడిన భవచక్రమును దాటాలి. ఆ పది సంకెళ్ళు ఏమిటంటే - 1. అహాన్ని ఆత్మగా భావించరాదు. 2. ధర్మం విషయంలో సంశయం పనికిరాదు. 3. కర్మాచరణ విషయంలో మూఢఆచారాలు పోవాలి. 4. విషయ వికారాల్ని జయించాలి. 5. సమత్వం వుండాలి. 6. ప్రాపంచికత యందు అనాసక్తత. 7. సుఖాపేక్ష ఉండరాదు. 8. గర్వం ఉండరాదు. 9. దంభం నశించాలి. 10. అజ్ఞానం తొలగాలి.
                              
    * * *
శారీరకంగా కోర్కెలనే బంధాలనుండి విముక్తి పొందటం, మానసికంగా 'నేనే' అనే అహంభావం విసర్జించడం. నైతిక దృష్ట్యా కామ, క్రోధ మోహాదులు, విద్రోహ విద్వేషాలు, అజ్ఞానం వదలడం ... దీనినే నిర్వాణస్థితి అంటారు.
                              
   * * *
రాగం శాంతిస్తే దోషాగ్ని శాంతిస్తుంది. దోషాగ్ని శాంతిస్తే అభిమానాది సకలదోషాలు ఉపశమిస్తాయి. అప్పుడే మానవునికి శాంతి.
                              
     * * *
యోగమంటే చిత్తవృత్తి నిరోధం. చిత్తం చలించుటయే బంధం. స్థిరంగా వుండుటే మోక్షం. యోగి, వాక్కును మనస్సులో, మనస్సును బుద్ధిలో, బుద్ధిని సాక్షి యందు లయింపజేసి, ఆ సాక్షిని అసలు సత్యంగా గుర్తిస్తాడు. యోగమార్గం - అంతఃపధం. అంటే అంతర్భాగంలో మనోదారణే యోగం. యోగద్వారం - హృదయం. యోగగమ్యం - పరబ్రహ్మం. అంటే హృదయమందు జీవనం.
                              
    * * *
యజ్ఞయాగాది క్రతువుల పేరుతో జరిగే జంతుబలుల్ని ఆపమని చెప్పి, అసలు యజ్ఞం అంటే ఏమిటో తెలియజెప్పిన బుద్ధ ప్రబోధమిదే -
నోరులేని పశువులను బలిచేయడం కాదు, మనలో ఉన్న అజ్ఞానపశువును జ్ఞానవేదికపై బలిచేయడమే నిజమైన యజ్ఞం. సర్వప్రాపంచిక భావాలను, స్వార్ధ అహంకార పశువాసనలను బ్రహ్మాగ్ని కుండంలో ఆహుతి చేయడమే బ్రహ్మయజ్ఞం. మానవునిలోని అరిషడ్వర్గములనే పశువులను సంహరించి, పరిశుద్దులగుటయే యజ్ఞం. నియత కర్మలన్నీ ధర్మభావనతో చేస్తే, అదే యజ్ఞం!
                              
   * * *
జన్మతః అందరూ జ్ఞానులే. జీవించేకొద్దీ చాలా ఎక్కువమంది అజ్ఞానులుగా మారతారు. అజ్ఞానాన్ని గుర్తించి, ఆగి, ఆలోచించినవాడే నిజమైన అన్వేషకుడు.
                              
   * * *
మనలో వెలిగే అంతరజ్యోతే జ్ఞానం. ఆ జ్ఞానజ్యోతిని ఎవరికివారు దర్శించడమే, అంతిమ సత్యం.
                              
  * * *
జీవితంలో నిరాకరించవలసినవి ఐదు వున్నాయి, అవి - జీవితం కోసం కాంక్ష, అహంకారం, అవిద్య, కామం, ద్వేషం. జీవితంలో ఆహ్వానించదగినవి ఐదు వున్నాయి, అవి - విశ్వాసం, జాగృతి, నీతివర్తన, ధ్యానం, జ్ఞానం.
                               * * *
అజ్ఞానాన్ని తొలగించకుండా, మానసిక బలహీనతల్ని అధిగమించకుండా, ఎవరూ భవసాగరాన్ని దాటలేరు, విముక్తి పొందలేరు.
                               * * *
ముక్తి అనేది మరణించాక వచ్చేది కాదు, బతికుండగానే సంపాదించుకోవలసినది.
                              * * *
మనిషి ప్రకృతి నుండి ఎంతో నేర్చుకోవాలి.
మట్టి : అమృతం, విషం రెంటినీ స్వీకరిస్తుంది. మన మనస్సులోకి వచ్చే మంచి చెడు ఆలోచనలను మనం సమంగా స్వీకరించాలి.
నీరు : నీళ్ళలో ఎంత మురికి చేరినా స్వీకరిస్తుంది. స్వచ్చంగా వుంటుంది.  జ్ఞాని అలానే ఉండాలి.
నిప్పు : అన్నింటినీ కాల్చివేస్తుంది. మంచి చెడు పదార్ధాలని చూడదు. అలానే జ్ఞానంతో అన్ని మాలిన్యాలను దగ్ధం చేయాలి.
గాలి : సుగంధాలను దుర్గంధాలను తనలో కలుపుకొని పోతుంది. జ్ఞాని అంతే, దేనినీ తప్పుపట్టక సాగిపోవాలి.

20, మార్చి 2013, బుధవారం

నా జీవనగమనంలో ..... 'శ్రీ రమణమహర్షి'

తమను తాము తెలుసుకున్న మహాత్ములందరూ - ఏం చేసినా,అది సమస్త ప్రాణికోటి పురోభివృద్ధి కోసమే, సర్వుల ఉద్ధరణకే! ఏం చెప్పినా, అది పరమాత్మ సిద్ధి కోసమే, సర్వ జనావళిని తరింపజేయడానికే!
అటువంటి మహాత్ములు ఈ అవనిపై అప్పుడప్పుడు అక్కడక్కడా సకల ప్రాణికోటి శ్రేయస్సుకై దేహదారులై గురువులుగా , జ్ఞానులుగా , మహర్షులుగా , ప్రవక్తలుగా , సంతులుగా అవతరిస్తునే ఉంటారు. అటువంటివారిలో ఒకరు "శ్రీ రమణమహర్షి".
వీరు నా జీవనగమనంలో నాకెలా మార్గదర్శకులయ్యారంటే -


భగవంతునికై
ప్రార్ధన, సాధన ఉండాలి అంటారే 
..... అసలు ప్రార్ధనంటే ఏమిటి? సాధన అంటే ఏమిటన్న నా మొదటి సందేహానికి సమాధానం భగవాన్ రమణ మహర్షి ఇలా తెలియజేశారు -
"భగవత్ ప్రార్ధన అంటే మాటలు జపించడం కాదు, భగవంతునికై పరితపించడం. సాధన అంటే ఉన్నదానిని ఉన్నట్లుగా గ్రహించడం. సాధన అంటే వికాసంతో కూడిన ఒక సజీవమైన సంగతి. ఎదుగుదల, పెరుగుదలతో కూడిన విషయమిది. మొగ్గ పువ్వుగా విచ్చుకున్నట్లు, జీవుడు ఈశ్వరుడుగా ఎదగడం. మొగ్గ సూర్యుని వైపు తిరగడం వంటిది సాధన. అంటే జీవుడు ఈశ్వరుడు వైపు దృష్టి మరల్చడం. విగ్రహారాధన, దైవపూజ, శరణాగతి, భక్తి, విశ్వాసం, తన్మయత్వం, ఆరాధన అవసరమే గానీ, నామరూపరహితమైన పరమాత్మే అన్నింటిలోనూ అంతర్భూతంగా వున్న ఆత్మ అని అనుభవపూర్వకంగా గుర్తించడం నిజమైన సాధన". 

                                                     * * *
ఒకానొకసారి నేను అనుకున్నది ఒకటి, జరిగినది వేరొకటి, అన్న రీతిలో ఉండేది నా పరిస్థితి. ఏమిటిది? ఎందుకిలా జరుగుతుందని చాలా కలత చెందుతున్న తరుణంలో శ్రీ రమణుల బోధ ఒకటి యాదృచ్చికంగా నా కంట బడింది. నాకు జవాబు దొరికింది., కలతా తీర్చింది, ఆ బోధ ఇదే -
"వారి వారి ప్రారబ్ధకర్మానుసారం విధాత వారి విధి నిర్ణయిస్తాడు. జరగవలసింది, ఎవరెంత అడ్డుపెట్టినా జరిగే తీరుతుంది. జరగనిది, ఎవరెంత ప్రయత్నించినా జరగదు. ఇది సత్యం. కనుక ఊరికే వుండటం మంచిది".
(ఇది శ్రీరమణులు ప్రపంచానికి ఇచ్చిన ప్రధమోపదేశం)
                              
                          * * *
భార్య మాటలతో కనువిప్పై భార్యను వదిలి పరమాత్మునికై పరితపించిన తర్వాతే తులసీదాసు యోగి అయ్యాడు. సిద్ధార్ధుడు భార్యాపుత్రులను, తల్లితండ్రులను, రాజ్యాన్ని పరిత్యజించి పరిశ్రమించి పరిశుద్దుడై, ప్రాపంచిక బంధాలకు బద్ధుడవ్వక బుద్దుడైనాడు. వెంకటరమణ తల్లిని, తోబుట్టువులను, బంధువులను వదిలి అరుణాచలం వెళ్లి యోగాపరుడై రమణమహర్షిలా భాసిల్లడు. అంటే సన్యసించినవారికి, సర్వం పరిత్యజించినవారే పరమాత్మను తెలుసుకోగల్గుతారా? మరి, కర్మానుసారం ఏర్పడే కర్తవ్యాన్ని గాలికొదిలేయడం తప్పు కాదా? ఇవన్నీ ప్రారబ్ధసారం వచ్చేవే కదా, ప్రారబ్ధాన్ని అనుభవించి అధిగమించాలంటారే... అటువంటప్పుడు ఈ బంధాలను, బాధ్యతలను పరిత్యజించడం పాపం కాదా????? ... ఇత్యాది ప్రశ్నలతో మనసంతా గజిబిజిగా అయినప్పుడు - 'దేనినీ పరిత్యజించనవసరం లేదు, కానీ; దేని యందు తాదాత్మ్యం ఉండకూడద'ని అంటూ, అసలు సన్యాసమంటే ఏమిటో తెలియజెప్పిన రమణమహర్షి వాక్కులివే ...
"సన్యాసమంటే - కాషాయం కాదు, ఇంటిని వదిలిపోవడం కాదు, వ్యక్తిత్వ విసర్జన.
సన్యాసమంటే - ప్రపంచం నుంచీ, మరి దేనినుంచీ వెనక్కి తగ్గి, సర్వం వదిలివేయడం కాదు. సమస్తాన్ని ప్రేమతో హృదయానికి హత్తుకోవడం. ఆ ఆలింగనంలో సంసారం అన్నీ వుంటాయి.
సన్యాసమంటే - అహంకార పరిత్యాగం. కోర్కెలనీ, నాది అనే భావాన్ని, దానిపట్ల అనురక్తిని త్యజించడం.
సన్యాసమంటే - పరిశుద్ధ జ్ఞానం.
                             ఇల్లు, సంసారం వదిలి కాషాయం కట్టడం కన్నా, ప్రేమతో ప్రపంచాన్ని తనలోనికి తీసుకోవడం ఉత్తమ సాధకుని లక్షణం. నిజమైన సాధకులు తమ ప్రేమను విశ్వప్రేమగా విస్తృతపరచి, సమస్త ప్రపంచాన్ని ప్రేమతో హత్తుకుంటారు. ప్రేమ, సమదృష్టి అలవర్చుకున్నవారు పరిత్యజించాలి
, సన్యసించించాలి అని అనుకోరు. నిజమైన సంసారం మనస్సంసారం. దాన్ని వదలాలి గాని, ఇల్లునీ, ఇల్లాల్ని కాదు. కర్మ జీవనాన్ని పరిత్యజించవలసిన పనిలేదు. సర్వకర్మలు ఆచరిస్తూ, నిష్కామంగా ఉంటూ, స్వస్థితి చెడగొట్టుకోకుండా ఉన్నవారే నిజమైన సాధకులు. విషయవస్తువుల పట్ల అనురక్తచిత్తుడైన వ్యక్తి అరణ్యాలకు వెళ్ళిన లాభం లేదు. మనో నిగ్రహం లేక ఎక్కడకు పోయినను ఇక్కట్లే. సత్కార్యాచరణుడై పంచేద్రియ నిగ్రహం గల వ్యక్తికి గృహజీవనమే తపోవనం". 
                              
                    * * *
ఇంట్లో ఏకాంతం లేదు, బయట సత్సంగంకు వెళ్ళడానికి వీలు కుదరడం లేదు, ఇలా అయితే నా సాధన సాగేదేలా? తీవ్ర సాధన చేస్తేనే కదా, పరమాత్మను కాంచగలం ... ఓహో ... ఇలాగైతే ఎలా ... లోలోన ఏదో వేదన ...!
ఈ విధంగా వేదన పడుతున్న నాకు అవగాహన కల్పించి స్వాంతన చేకూర్చిన  శ్రీ రమణుల వాక్కులివే-

"ఏకాంతమంటే - బైట ప్రపంచం నుంచి విడినివాసం కాదు.
ఏకాంతమంటే - ఆలోచనారహిత స్థితి.
ఏకాంతమంటే - ఆత్మలో స్థిరంగా నిలవడం.
                                 మనల్ని తరిమేది మన మనస్సే. ముందు దాన్ని సిద్ధం చేయాలి. అప్పుడు మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆనందంగా హాయిగా ఉండవచ్చు. ఉన్నచోట నిశ్చలమనస్సుతో శ్రద్ధగా సాధన చేయవచ్చు. బైట సత్సంగం వుంటుందంటున్నావు, అది సరే, అసలైన సత్సంగం నీలోనే యుంది. అదే నిజమైన గుహవాసం. ఏకాంతం మనస్సులోని సంగతి. మనష్యుల మద్య మసలినా, మనోపవిత్రతను నిలుపుకున్నవాడు ఏకాంతవాసే. అడవిలో, నిర్జన ప్రదేశంలో వుండి, ఆలోచిస్తూ వుంటే, అది ఏకాంతవాసమా? అనాసక్తుడు ఎప్పుడూ ఏకాంతవాసే".

                              
                    * * *
జీవితమన్నాక కష్టసుఖాలు తప్పవు. ఒకసారి ఒకదాని వెంబడి ఒకటిగా సంభవిస్తున్న ఆపద్కాలములో మానసికంగా బాగా అలసిపోయి, ఇక భరించలేను రామా! ఎందుకీ పరీక్షా? ఏమిటీ కష్టాలని రాముని చిత్రాన్ని చిత్తానికి తాకించుకొని బాధపడగా, ఆ రోజు సాయంత్రమే నా మిత్రురాలు యాదృచ్ఛికంగా రమణమహర్షి పుస్తకం ఇచ్చారు. తను వెళ్ళాక, రామున్ని ధ్యానించి పుస్తకం తెరవగా, తెరిచినా పుటలో ఉన్నది చదివాక, ఎప్పటిలా ప్రశాంతత వచ్చేసింది.  నేను ఆ క్షణంలో చదివింది ఏమిటంటే - 
"ఈ ప్రపంచాన్ని పాలించేవారు ఒకరు వున్నారు. ఆయనే భగవంతుడు. పాలించడమే కాదు, భరిస్తున్నది కూడా ఆయనే. మనం భరిస్తున్నామనుకోవడం వెర్రితనం. పరమేశ్వరుడే సకల భారాలను భరిస్తున్నాడు. కానీ, నీవు 'నేను భరిస్తున్నాను' అని అనుకుంటున్నావు. నీ బాధ్యతలు, భారాలూ భగవంతునిపై వుంచి, నీవు నిశ్చింతగా వుండు".
                                                * * *
ఎన్ని చదివినా, ఎప్పటికప్పుడు ప్రతీది కొత్తగానే ఉంటుంది. ఒకానొక కష్టసమయంలో రామా! నిన్ను ఇంతలా నిరంతరం స్మరిస్తానే, మరి ఇదా నీ అనుగ్రహం అని అజ్ఞానంతో బాధగా అనుకుంటూ ఎప్పటిలా పుస్తకం తీసి, (నాకు కోపం, బాధ, ఆనందం, ఉద్వేగం, ఉక్రోషం, అసహనం, అశాంతి ... ఇత్యాది ఏ భావాలు కల్గిన మౌనంగా ఏదో ఒక పుస్తకాన్ని తీసి చదవడం అలవాటు) రాముణ్ణి ధ్యానించి ఓ పుటను తెరిచి చదవగా, మూడు ముక్కల్లో నా అజ్ఞానాన్ని నేను గుర్తించేటట్లు చేశారు శ్రీ రమణులు.   
"మనం భగవంతున్ని స్మరించాం, అంటే అది భగవంతుడు అనుగ్రహించినవరం అన్నమాట. అనుగ్రహం భగవంతుని గుణం కాదు. అనుగ్రహమే భగవంతుడు. దేవుని అనుగ్రహం లేనిదే దేవుణ్ణి స్మరించలేం".
                                                * * *
తనే కరెక్ట్ అని, ఎదుటివార్ని అర్ధం చేసుకోకుండా కించపరిచే తనమాటలతో ఓసారి విభేదించానని, కొన్నేళ్ళ స్నేహాన్ని మరిచి, అరిచి, విడిచి, అహాన్ని అడ్డుగోడగా కట్టేసి,  నిందిస్తూ, నిష్టూరాలు ఆడిన ఓ ఆత్మీయనేస్తం ప్రవర్తన నన్ను కలచివేస్తున్నప్పుడు మౌనమయ్యాను. బాహ్యమున మౌనంగా ఉన్నా, అంతరాన్న ఆవేదన. ఆ తరుణంలో రామానుగ్రహంతో రమణుల బోధ నాచెంత చేరి నాలో చింతను పూర్తిగా మాయం చేసింది. ఒకప్పుడు ఎప్పుడూ కదిలాడే తన జ్ఞాపకాలతో మనస్సు బాధతో భారమయ్యేది, ఏ పనియందైన పరధ్యానమే! మరి ఇప్పుడు ఎప్పుడైనా తను జ్ఞాపకం వచ్చినా, దుఃఖస్పర్శ లేశమాత్రమైన ఉండక, దైనందికకార్యక్రమాల్లో ప్రశాంతంగా నిమగ్నురాలినౌతున్నాను. ఆమెకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. 
"మనల్ని ఎవరైతే ఖండిస్తారో, కాదంటారో, తిడతారో, నిందిస్తారో, నిరాకరిస్తారో వారు మన మిత్రులు. ఎందుకంటే, మన శత్రువైన దేహాన్ని (దేహాత్మభావాన్ని) వారు నిందిస్తున్నారు. మన మనోశత్రువునకు శత్రువైన దేహానికిశత్రువు అయినవారు మనకు ఆప్తమిత్రుడు కావాలి కదా"?
                                                * * *
కొందరు భక్తిమార్గం గొప్పదని, మరికొందరు ధ్యానయోగమని, మరికొందరు జ్ఞానమార్గమని, మరికొందరు కర్మయోగం గొప్పదని అంటుంటారు. నిజానికి ఏ యోగం గొప్పదన్న సందేహం కలిగి, నాలో నేనే... ఇదనీ, అదనీ విశ్లేషించుకుంటూ సతమతమౌతున్న తరుణంలో రమణుల పుస్తకం చేతికి రావడం, అందులో సమాధానం వుండడం ... ఒకింత అవగాహనై ఉపశమించాను. 
"ఏ యోగవిధానం మంచిదంటే ... అది వ్యక్తి అభిరుచి మీద ఆధారపడి వుంటుంది. ఒకరికి ఒక పద్ధతి, ఒక తీరు, ఒక విధానం సులభంగా వుంటే; మరొకరికి మరొక పద్ధతి సులువుగా వుంటుంది. అంతా, అన్నీ ఒకటే, సమానమే.
జీవుడు జనన, మరణవలయం నుంచి విముక్తి కావడానికి చేసే కర్మాచరణే - "కర్మయోగం".
అంతా దైవమే అయినా, తాను పరబ్రహ్మ నుంచి విడివడ్డాననే తపనతో, నిజమైన భక్తి విశ్వాసాలతో వుండుటే - "భక్తియోగం".
అజ్ఞానమనే తిమిరంలో పడి కొట్టుకునే జీవుడు, కాంతికోసం విమోచన కోసం ప్రయత్నించుటే - "జ్ఞానయోగం".
జీవుని స్వభావం విచారణ ద్వారా తెలుసుకోవడమే మహాయోగం ... అదే విచారణ మార్గం. పరిపూర్ణభక్తితో భక్తుడు శరణాగతి అవ్వడాన్నే విచారణ మార్గమును అనుసరించేవారు జ్ఞానమంటారు. అన్నిమార్గాలు అహంకారాన్ని ఆత్మలో లయింపజేయడమే గమ్యంగా కలిగియుంటాయి".

                                         * * *
లోకమంతా ఈశ్వర చిద్విలాసమే, ఈశ్వర ఆజ్ఞ లేనిదే చీమయిన కుట్టదంటారే ...  అన్నీ ప్రారబ్ధసారం జరుగుతుందంటారు కదా, మరి ప్రత్యేకంగా ఈ దుర్గుణాలు, దురభ్యాసాలూ పోగొట్టుకోవాలనటం ఎందుకు? అన్న సందేహానికి సమాధానం - శ్రీ రమణభాషణంలో ... 
ఎందుకా? చెబుతాను విను. శరీరం వుంది, దానికెక్కడో ఒక వ్రణం పుడుతుందనుకో, డాక్టరు వచ్చి, కత్తితో ఆ భాగం కోసి, చెడురక్తం తీసివేసి, మంచిరక్తానికి రక్షణగా కట్టుకట్టడం లేదా? అట్లాగే యిదీనూ! ఆ వ్రణం కోయకుండా వదిలితే,లోపలంతా కుళ్ళుతుంది. కోసిన వెనుక కట్టు కట్టకుంటే, చీముపడుతుంది. మానవుని నడవడిక లోనూ అంతే. దుర్గుణాలు, దురభ్యాసాలూ వ్రణం లాంటివి. కోసివేయకుంటే అదఃపతితుడౌతాడు. ఏ వ్యాధికి ఆ చికిత్స చేయాలి.
                                                 * * *
 
గురుసన్నిధిలో నిరంతరసాధన చేస్తున్న సత్యాన్వేషకులుకే తప్ప నేను చేయగలనా ఈ ఆధ్యాత్మికమార్గంలో పయనాన్ని..... అన్న వెరపు నాలో కల్గినప్పుడు నాలో ధైర్యాన్ని పెంచడానికి శ్రీ రమణానుగ్రహంతో నా కంటబడిన శ్రీరమణులు వివరించిన కధ ఇది -
ఒక పిచ్చుక గ్రుడ్డు సముద్రంలో జారి పడిపోతే, ఆ గ్రుడ్డును బయటికి తీసి రక్షించాలని పట్టుదలతో సముద్రంలో నీళ్ళన్నీ బయటపోస్తానని, విసుగు విరామం లేకుండా సముద్రలో మునిగి, ముక్కుతో నీరు పీల్చి ఒడ్డుకు వచ్చి రెక్కలతో విదిలించడం, ముక్కుతో బయటపోయడం చేస్తుండగా, ఇది చూసిన నారదులవారు, విషయం అడిగి తెలుసుకొని, ' వెఱ్ఱిపిచ్చుకా! నీకిది సాధ్యమా?' అని అడగగా, 'సాధ్యమా? అసాధ్యామా? అన్న చింత నాకు లేదు, పట్టుదలతో ప్రయత్నిస్తాను, పైన దైవమున్నాడు' అని అన్నదట ఆ పిచ్చుక. నారదుడు పిచ్చుక శ్రద్ధకు ఆనందంచి, గరుడుని వద్దకు వెళ్ళి, ఈ విషయమంతా వివరించి, 'ఏమోయ్, నీ జాతిపక్షి అంతశ్రద్ధతో పని చేస్తుంటే నీవు ఊరకే వుండటం ధర్మమా? సహాయపదరాదా?' అని అన్నాడట. ఆ మాటలు విన్న గరుడుడు పరుగుపరుగున వచ్చి రెండు రెక్కలతో ఒక్కసారి విసిరితే నీరంతా రెండు పాయలై చెదిరి గ్రుడ్డు బయటపడ్డది. పిచ్చుక ఆనందంతో ఆ గ్రుడ్డును తీసుకుందట. అదేవిధంగా ఆత్మచింతన కలవారూ, సత్కార్యాచరణపరులూ... ఈ పని పెద్దదే, మనకు ఈ పని చేయడం సాధ్యమా అని జంకి విడవక శ్రద్ధతో పాటుపడితే దైవసహాయం దానంతట అదే వస్తుంది. 
ఈ కధే కాకుండా ఒకరికి వచ్చే సందేహాలను శ్రీ రమణులు ఎలా తీర్చారో...  క్రింద సంభాషణను చదివి, తద్వారా నా సందేహానికి కూడా సమాధానం తెలుసుకున్నాను. 

పృచ్ఛకుడు: భగవాన్! మీరు చెప్పినట్లు 'అహం' వృత్తియొక్క మూలమును, బుద్ధికుశలత వలన 'ఆత్మ' అని గ్రహించినను, మనస్సందు ప్రవేశింపకున్నది. కారణమేమి?
రమణమహర్షి : ఏమి అడ్డు వచ్చుచున్నదో చెప్పుడు?
పృచ్ఛకుడు : జన్మాంతర సంస్కారములు, మనస్సు తాను పుట్టినచోట చేరకుండా అడ్డు తగులుచున్నవేమో!
రమణమహర్షి: అది నిజమే! ఆ సంస్కారములను పోగొట్టుకొనుటకై మనం చేయు సాధన?
పృచ్ఛకుడు : మన ప్రయత్నమెంత తీవ్రమైనను, జన్మజన్మాంతరములుగా మనస్సులో నాటిన సంస్కారములను నిర్మూలింపలేము. భగవంతుని కృప ఒక్కటే, దీనికి సమర్ధమైనదని నా అభిప్రాయం. దేవుని కృప లేనిదే మనమెంత సాధన చేసినను లాభం లేదు.
రమణమహర్షి : మీరు చెప్పినది అంతయూ నిజమే. ఇందు మూడు విషయములు ఉన్నవి. 1. స్వప్రయత్నం 2. కాలపరిపాకం 3. ఈశ్వరకటాక్షం. మనం సాధన చేయుచుండగా, సమయం వచ్చినప్పుడు ఈశ్వరుణ్ణి కటాక్షం దానంతట అదే లభించును. దానికై దేవునికి జ్ఞాపకం చేయనవసరం లేదు. ఆయన మనం చేస్తున్నదంతా చూస్తూనే వున్నాడు. తగినసమయం వచ్చినప్పుడు ఆయన అనుగ్రహం దొరుకును. సాధకులు సామాన్యముగా దేవునికృపకై చూస్తూ తమసాధనలో అశ్రద్ధ వహిస్తారు. అందువలన వారు గమ్యస్థానం ఎప్పటికీ చేరలేరు.
                                   * * *
ఇలా చెప్తే చాలా ఉన్నాయి. పోస్ట్ పెద్దదవుతుందన్న కారణంతో .....
రమణానుగ్రహం
అపారం, రామానుగ్రహం అనంతం.
అనంతమైనది ఆధ్యాత్మికత్వం. ఆధ్యాతిక మార్గంలో పయనం అనేక అవరోధాలతో కూడుకున్నది, నీవు ఒంటరిగా ఎలా పయనించగలవని కొందరు మిత్రులు అడుగుతుంటారు. వారికి నా చిరునవ్వే సమాధానం. ఓ రచయిత అంటారు - నీవు ఎప్పటికీ ఒంటరివి కావు, నీకు తోడుగా ఆ దైవం ఆత్మరూపమున నీలోనే ఉందని.
నా రామాంజనేయులు, పుస్తకరూపేణా ఇందరి గురువులు నా దగ్గర ఉండగా ఇక నాకు వెరపు దేనికీ?
ప్రయత్నిస్తాను, చివరిక్షణం వరకు ప్రయత్నిస్తాను.

"ప్రయత్నం చేయక ఓడిపోతే మరణించినట్లే,
ప్రయత్నం చేస్తూ మరణించినను జయించినట్లే".
నా తదుపరి టపా -
నా జీవనగమనంలో .....  శ్రీ బుద్ధ భగవాన్!


                             
                           

17, మార్చి 2013, ఆదివారం

'నా జీవన గమనంలో ..... '

రాముడంటే అమితప్రేమ. హనుమాన్ అంటే అపారభక్తి. చిన్నప్పుడు (నేను ఆరవతరగతి చదువుతున్నప్పటి నుండి) భారత రామాయణాది గ్రంధాలతో పాటు వివిధ పుస్తకాలు మా తాతయ్యగారి కోసం (తనకి దృష్టిలోపం కలగడంతో) చదివి వినిపించడం అలవాటు అయింది. నేను చదువుతుండగా మధ్యమధ్యలో తాతయ్యగారు విశ్లేషణల వలన నాలో భగవత్భక్తి కలిగి కొంత అవగాహన ఏర్పడినప్పటికీ, అది పరిమితంగానే యుండేది. వివాహానంతరం - వ్రతాలు, పూజలు ... ఇత్యాదులు పెరిగినను అవి స్వలాభం కోసమే.  కాలక్రమేణా నిజమైన భక్తి కుదురుకున్న, 2003 కార్తీక మాసంలో జరిగిన ఓ దివ్యానుభవం వలన, అప్పటినుండి నిస్వార్ధ భక్తి చిగురించింది. అప్పటినుండే ఆద్యాత్మిక చింతన ప్రారంభమై, భగవత్ స్మరణ స్వలాభం కోసం కాక, భగవంతుణ్ణి భగవంతునికై భక్తిత్వముతో ఆరాధించడం అలవాటైంది. ఆధ్యాత్మికత, భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకోవాలన్న తపన నాలో కల్గి, ఆ దిశలో జీవనయానం ప్రారంభించాను.
నాబాధ్యతలు, కుటుంబనేపధ్యం, ఒకంతట ఎక్కడికీ కదిలివెళ్ళే తత్త్వం నాలో లేనందున, గురువుని ఆశ్రయించడం, సత్సంగాలకు వెళ్ళడం నాకు కుదరనివి. అందుకే రామాంజనేయుల్నే శరణువేడాను.
మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళు:
ర్నాన్యం జానే నైవ జానే న జానే

రాముడు నా తల్లి. రామచంద్రుడు నా తండ్రి. రాముడు నా ప్రభువు. రామచంద్రుడే నా సఖుడు. దయామయుడైన రామచంద్రుడే నా సర్వస్వం. అతనిని వినా నేను మరెవరిని ఎంతమాత్రమూ ఎరుగను.
మనోజవం మారుతతుల్య వేగమ్
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానర యూధముఖ్యమ్
శ్రీ రామదూతం శరణం ప్రపద్యే

మనస్సమానగతితో వాయుసదృశవేగంతో పరమజితేంద్రియుడై శ్రీమంతులలో శ్రేష్టుడైన పవననందనుడు, వానరాగ్రగణ్యుడు అయిన శ్రీ రామదూతను నేను శరణు వేడుచున్నాను.

ఇక అప్పటినుండి ఆధ్యాత్మికపరమైన ఏ పుస్తకం లభ్యమైన ఆ పుస్తకం రామానుగ్రహం అని త్రికరణశుద్ధిగా భావించడం, గురు
వుని పుస్తకరూపేణా నా రాముడే నాదరికి పంపారని విశ్వసించడం, ఆ మధురానుభూతితో ప్రీతిగా చదవడం అలవడింది.
నా జీవనగమనంలో ఎన్నో ఎనెన్నో సందేహాలు... అవన్నీ రామునికి విన్నవించుకోవడం... కొద్దిరోజుల్లోనే నాదరి చేరిన పుస్తకాల్లో ఆ నా సందేహాలకు సమాధానాలు దొరకడం... ఇది ఓ అనిర్వచనీయమైన రామానుగ్రహం. ఆ పుస్తకాలను నాకు అందజేసిన, అందజేస్తున్న మావారు మరియు నా మిత్రులే నా సత్సంగీయులు.
ఈ నా ఆధ్యాత్మికపయనంలో పుస్తకరూపేణా వచ్చి నన్ను అనుగ్రహించిన గురువులు - శ్రీ రమణమహర్షి, శ్రీ మలయాళ స్వామి, బుద్ధుడు, రామకృష్ణపరమహంస, జిడ్డు కృష్ణమూర్తి, వివేకానందులు, పరమహంస యోగానంద, యోగి వేమన, స్వామీ రామతీర్ధ ... మొదలగువారు.
మనిషన్నాక కష్టసుఖాలు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ, ఆయా కష్టసుఖాలను మనిషి స్వీకరించే విధానంలోనే ఒకొకరిది ఒకో పద్ధతి. కానీ; ఆ 'స్వీకరణ' లో 'పరిణతి'ని తీసుకువచ్చేదే "ఆధ్యాత్మిక చింతన". ప్రశాంతజీవానానికి ఆలంబన "ఆధ్యాత్మిక చింతన". మలినమైన శిలపైన జలం ప్రవహిస్తూ క్రమంగా దాని మురికిని ఎలా వదిలించి, మెరుపునిస్తుందో, అలానే "ఆధ్యాత్మిక చింతన" అనే గంగాజలం ఒక్కటే హృదయాన్ని ప్రక్షాళన చేసి, శుద్ధతను ప్రకాశాన్ని ప్రసాదిస్తుంది.
ఏ ప్రారబ్ధం లేనిదే జన్మరాదంటారు మహర్షులు. జన్మంటూ ఎత్తాక సుఖదుఃఖాలు అనివార్యం. కాలం కష్టాల్ని ఇస్తుంది, సుఖాలనీ ఇస్తుంది. అలాగని అదేపనిగా కష్టాలనే ఇవ్వదు, తట్టుకోలేం కాబట్టి! అలాగే అదేపనిగా సుఖాన్నీ ఇవ్వదు, పట్టుకోలేం కాబట్టి! కాలపరిభ్రమణంలో ఇవన్నీ సహజం. చిన్నప్పటినుండి పుస్తకపఠనం, తాతగారి విశ్లేషణలు వలన ఇవన్నీ సహజమన్న విషయం అర్ధమైనప్పటికినీ, చింతలలో చింతన కోల్పోయేదానిని, తెలుసుకున్న ధర్మాలను, కర్మసిద్ధాంతాలను మరిచిపోయి దుఃఖవశురాలిని అయ్యేదానిని. చదివిన, విన్న శాస్త్రవచనాలన్నీ మనోమాయ మరుగున పడిపోయేవి. అయితే, కాలక్రమేణా ఆధ్యాత్మిక చింతన ఒకింత అలవడడంతో కొలది సమయంలోనే ఆ స్థితిలో నుండి లోలోన విచారణ జరిగి రియలైజ్ కావడం జరుగుతుంది.
అప్పటిలా ఇప్పుడూ, అప్పుడప్పుడు కష్టాలూ, మనఃక్లేశాలు కల్గుతున్నప్పటికీ, అవి (వాటివలన కలిగిడి బాధ) అంతే హఠాత్తుగా అదృశ్యమయ్యేవి - ఓ స్పురణ తో! ఆ స్పురణకు ప్రేరణ మహాత్ముల మాటలే. అలా స్పురణ లోనికి వచ్చి ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ నా సందేహాలు తీర్చి, ప్రశాంత జీవనాన్ని నాకు అలవర్చిన మహాత్ములందరికీ ప్రణమిల్లుతూ .....
ఏయే మహాత్ముల వలన నా సందేహాలు ఎలా తీరాయో ... ఒకొకటిగా స్మరణలో స్మరించుకోవాలనిపించి, 'నా జీవన గమనంలో ..... ' అన్న శీర్షికను ప్రారంభిస్తున్నాను.
తదుపరి టపాలో నా జీవనగమనంలో ...  'శ్రీ రమణమహర్షి' వారి గురించి ప్రస్తావిస్తాను.

5, మార్చి 2013, మంగళవారం

"శ్రీ లక్ష్మీ జయంతి"

మాసం  : పాల్గుణం
తిధి : శుక్లపక్ష పౌర్ణమి.
నక్షత్రం : ఉత్తరఫల్గుణి
ఈ శుభదినం "శ్రీ లక్ష్మీ జయంతి".

లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కోరీతిలో ప్రకటితమయినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.
1. స్వాయంభువ మన్వంతరంలో - భృగువు, ఖ్యాతిల పుత్రికగా జననం.
2. సార్వోచిష మన్వంతరంలో - అగ్ని నుండి అవతరణ.
3. జౌత్తమ మన్వంతరంలో - జలరాశి నుండీ,
4. తామస మన్వంతరంలో - భూమి నుండీ,
5. రైవత మన్వంతరంలో - బిల్వవృక్షం నుండీ,
6. చాక్షుష మన్వంతరంలో - సహస్రదళ పద్మం నుండీ,
7. వైవస్వత మన్వంతరంలో కీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు తెలుస్తుంది.

ఇందులో మొదటి మన్వంతరముగా చెప్పుకుంటున్న స్వాయంభువ మన్వతరంలో -
భృగుమహర్షి, ఖ్యాతిలకు పుత్రసంతానం ఉన్నప్పటికీ కుమార్తెలు కూడా కావాలనే కోరిక అమితంగా ఉండడంతో, భర్త అనుమతితో ఖ్యాతి పుత్రికను ప్రసాదించమని దేవీని ప్రార్ధిస్తూ తపస్సు చేయగా, ఆ తపస్సుకు మెచ్చిన జగన్మాత ప్రసాదించిన వరముచే భృగుమహర్షి దంపతులకు పుత్రికగా లక్ష్మీదేవి జన్మించెను.
ఇది ఇలా ఉండగా, దక్షప్రజాపతి స్తన ప్రదేశం నుంచి ఉద్భవించినవాడు ధర్ముడు. ఈ ధర్ముడనే ప్రజాపతి భార్యల్లో ఒకరైన సాధ్య వలన నలుగురు పుత్రసంతానం కలగగా, ఆ సంతానంలో ఒకరు నారాయణుడు. నారాయణుడు తన సోదరులైన నరుడు, హరి, కృష్ణుడులతో కల్సి తపస్సు చేయుచుండగా, ఆ తపస్సును భంగం చేయడానికి అప్సరసలు రాగా, నారాయణుడు తన విశ్వరూపాన్ని చూపడంతో వారు (అప్సరసలు) వెళ్ళిపోయారు. ఇది విన్న భృగుమహర్షికుమార్తె లక్ష్మీ
దేవి నారాయణుడే తన భర్త కావాలని తపస్సు చేయగా, అది మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమై, ఆమె కోరిక ప్రకారం తన విశ్వరూపాన్ని చూపించి, వివాహానికి సిద్ధం కాగా, దేవేంద్రుడు మధ్యవర్తిగా, ధర్ముడు పురోహితుడిగా కళ్యాణం జరిపించినట్లుగా విష్ణుపురాణ కధనం. ఇదొక్కటే అమ్మవారు గర్భసంజాత ఘటన.

ఇక చివరిగా చెప్పుకుంటున్న వైవస్వత మన్వంతరంలో -
పూర్వం ఒకసారి దుర్వాసమహాముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహుకరించగా, దేవేంద్రుడు ఆ మాలను తనవాహనమైన ఏనుగుకు వేయగా, ఆ ఏనుగు ఆ మాలను క్రిందపడవేసి కాళ్ళతో తొక్కి ముక్కలు చేయగా, ఇది చూసిన దుర్వాసుడు కోపోద్రిక్తుడై - 'నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక' అని శపించెను. శాపఫలితంగా స్వర్గలోక ఐశ్వర్యం నశించగా, రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకోగా, దేవేంద్రాదులు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి జరిగిన విషయాలు మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటబెట్టుకొని విష్ణువు వద్దకు వెళ్ళి వివరించగా, అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చని, అందునిమిత్తం క్షీరసాగరాన్ని మధించాలని విష్ణువు సలహా ఇవ్వగా, దేవతలకొక్కరికి క్షీరసాగరాన్ని మధించడం సాధ్యముకాదు కనుక రాక్షసుల సహాయాని తీసుకొని అందుకు సిద్ధమయ్యారు.

క్షీరసాగరమధనం :- మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే మహాసర్పాన్ని త్రాడుగా చేసుకొని చిలుకుతుండగా, మందరగిరి పట్టుతప్పి మునిగిపోతున్న తరుణంలో శ్రీకూర్మమై తన మూపుపై పర్వతాన్ని నిలుపుకొని, ఇక క్షీరసాగరమధనం కొనసాగించమని ఆనతిచ్చిన ఆర్తత్రాణపరాయణుడు "శ్రీ మహావిష్ణువు".
                         
         
క్షీరసాగర మధనం జరిగినప్పుడు - ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని లోకశ్రేయస్సుకై 'శివుడు' స్వీకరించి 'నీలకంఠుడు' కాగా, లోకకల్యాణం కోసం, భర్తకు విషం మింగమన్న పార్వతీదేవి 'సర్వమంగళ' గా ప్రసిద్ధి పొందారు. ఈ ఘటన మాఘబహుళ చతుర్దశినాటి రాత్రి జరిగింది. విషాన్ని హరించి, శివుడు లోకానికి మంగళం కల్గించినందున, ఈ దినం "శివరాత్రి" అయింది.
ఇదియే కాక, ఇదే రోజున శివలింగ ఆవిర్భావం జరిగినట్లు, అందుచే ఈ దినం శివరాత్రి పర్వదినం అయినట్లు లింగపురాణం ద్వారా తెలుస్తుంది. మరిన్ని వివరాలకై ఈ క్రింద లింక్ ను చూడగలరు.    

   http://smarana-bharathi.blogspot.in/2012/02/blog-post_18.html
                                              


ఆ తర్వాత మరల కొనసాగిన సముద్రమధనంలో 'సురభి' అనే కామదేనువు జనించగా ఋషులు యజ్ఞకర్మల నిమిత్తం దీనిని స్వీకరించారు. తర్వాత 'ఉఛ్వైశ్రవం' అనే తెల్లని అశ్వం జనించగా దానిని బలి స్వీకరించాడు. ఆ పిమ్మట ఐరావతం, కల్పవృక్షం మొదలగునవి జనించగా ఇంద్రుడు వాటిని స్వీకరించాడు. అనంతరం క్షీరాబ్ధి నుంచి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. ఆ శుభదినం ఉత్తరపల్గునీ నక్షత్రంతో వున్న పాల్గుణశుద్ధపూర్ణిమ. మనం జీవిస్తున్నకాలం వైవస్వతమన్వంతరం కనుక ఈ విధంగా క్షీరాబ్ధి నుండి ఆవిర్భవించిన ఈ దినమునే ''లక్ష్మీజయంతి"గా జరుపుకోవాలన్నది శాస్త్రవచనం.
                          
         
                                 ప్రాదుర్భవమే కాదు... పరిణయం కూడా !
ఈ శుభదినం లక్ష్మీదేవి ప్రాదుర్భవంతో పాటు పరిణయం కూడా జరిగినదినం. లక్ష్మీదేవి ఆవిర్భవించగానే తనకి తగిన వరుడెవ్వడా అని అందర్నీ చూస్తూ, సకలసద్గుణవంతుడు, అచ్యుతుడు, ప్రేమైక హృదయుడు, ఆర్తత్రాణ పరాయణుడు విశ్వవ్యాపకుడు అయిన శ్రీ మహావిష్ణువును కాంచి, పుష్పమాలను విష్ణువు మెడలో వేసి, వరించింది ఆ శుభసమయమునే!
సాధురక్షకుండు షడ్వర్గ రహితుండు
నాదుడయ్యేనేసి నడప నోపు
నితడే భర్త! యనుచు నింతి సరోజాక్షు
బుష్పదామకమున బూజ సేసె !

                                                      
'వక్షో నివాస మకరోత్ పరమం విభూతే / యత్రస్థితైధయత సాధిపతీం స్త్రీలోకాన్' ... లక్ష్మీదేవి విష్ణువు వక్షస్థలాన్నే తన నివాసంగా చేసుకుంది.
లక్ష్మి అనుగ్రహమంటే సిరిసంపదలే కాదు, ఆమె అనుగ్రహం ప్రధానంగా ఎనిమిదిరకాలుగా ఉంటుంది. అవి - ధనం, ధాన్యం, గృహం, సంతానం, సౌభాగ్యం, ధైర్యం, విజయం, మోక్షం!

శుచి శుభ్రతలను పాటిస్తూ, భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాదిస్తే ఆమె అనుగ్రహం పొందగలం. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతోనే సిరిసంపదలతో పాటు కీర్తి, మతి, ద్యుతి, పుష్టి, సమృద్ధి, తుష్టి, స్మృతి, బలం, మేధా, శ్రద్ధ, ఆరోగ్యం, జయం ఇత్యాదివి లభిస్తాయి.
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగాధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురామ్
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరం
త్వాం
త్రైలోక కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్
అందరూ లక్ష్మీ కటాక్షమునకు పాత్రులవ్వాలని కోరుకుంటూ ...

ఈ మాసం 10 వ తేదీన మహాశివరాత్రి కాగా, 27 వ తేదీన శ్రీలక్ష్మిజయంతి.
క్షీరసాగరమధనం అంతరార్ధంనకై ఈ లింక్ ను చూడగలరు. 

http://smarana-bharathi.blogspot.in/2011/10/blog-post_02.html

1, మార్చి 2013, శుక్రవారం

"రామానుగ్రహం" ... నా ఆనందక్షణాలు


ఈ మద్య క్రమం తప్పకుండా శ్రీ శ్యామలీయం గారి "పాహి రామప్రభో" చదవడం అలవాటైంది. నిన్న రాత్రి -
తరచుగ నల్ప దుఃఖముల తాకిడికే తలక్రిందులై సదా
పరమ దయాబ్ధి మీ‌చరణపంకజయుగ్మము లంటి యుండి స
త్వరమె విముక్తి గాంచి కడు ధన్యుల మౌదుము మీకు గాక నె
వ్వరి కెరుకౌను దుఃఖబడబానలతీవ్రత జానకీపతీ
!
(శ్యామలీయం గారి అనుమతి లేకుండా వారి పద్యాన్ని స్మరణలో స్మరించుకుంటూ పెట్టినందుకు మన్నించమని అభ్యర్ధిస్తున్నాను) అన్న వారి రచనను చదివి, దానినే స్మరించుకుంటూ పడుకుంటున్నప్పుడు పదే పదే అన్పించింది రామునికి సంబంధించిన పుస్తకం (రామాయణం గానీ, శ్రీ యోగ వాశిష్టం గాని) చదవాలని! ఉదయం లేస్తూనే చదవాలనే తపనతో ఈరోజు పనులు త్వరగా ముగించుకొని రామాయణం తీద్దామని పుస్తకాల అలమర దగ్గరకు వెళ్ళాను. రామాయణం ప్రక్కనే రెండు రోజుల క్రితం నా స్నేహితురాలు పంపిన శ్రీ సుందర చైతన్యనంద వారి వ్యాఖ్యానంతో కూడిన ఆత్మబోధ (శంకరభగవద్పాదుల వారిది) అన్న పుస్తకం ఉంది. ఆత్మబోధని చదవమని మనస్సు ప్రేరేపిస్తున్న ముందుగా నా రామున్ని గురించే చదవాలని రామాయణాన్నే చేతిలోనికి తీసుకున్నాను. ఏ పుస్తకమైనను చదివేముందు కొద్దినిముషాలు కళ్ళుమూసుకొని రామధ్యానం (రామనామ స్మరణం) చేసి చదవడం అలవాటు ఉన్న నేను ఇప్పుడు కూడా అలానే రామధ్యానంకు ఉపక్రమించగా -
ఊహు ... మనస్సు రామనామం యందు లగ్నం కాదే ... కళ్ళ ముందు ఆత్మబోధ పుస్తకమే కదలాడుతుంది. దానినే చదవమని మనో ప్రేరణకు తలవంచక తప్పలేదు. కానీ; అంతరాన్న ఏదో బాధ... 'రామా! ఏమిటిది? నిన్నే స్మరించుకుంటూ నీగురించి చదవాలని రాత్రి నుండి తపిస్తుంటే, ఇలా జరుగుతుంది ఏమిటీ? ఈ మనోమాయను నేను జయించలేను, మనో నియంత్రణ నాకింకా అలవడలేదు, అది నీకూ తెలుసు. మరి నీవే కదా, ఈ మనో మాయలో నుండి నన్ను బయటపడేయవల్సింది. అలా బయటపడేయకుండా ఆ మాయలో నన్నిలానే వదిలేస్తావా? ఇదేనా నీ అనుగ్రహం ..... ' ఇత్యాది భావాలు అంతరమున కదులుతుండగా, రామున్నే స్మరించుకుంటూ ఆత్మబోధలో ఓ పుట తెరిచి, ఎదురుగా ఉన్న శ్లోకాన్ని, వ్యాఖ్యానాన్ని చదువుతుండగా ...  ఆనందంతో నిరుత్తరాలినయ్యాను. ఏదో తెలియని అలౌకికస్థితి లోనికి వెళ్ళిపోయాను. ఆ స్థితి అవర్ణ్యం. ఆర్తితో తపించాలేగాని రాముడు లేనిదెక్కడ? రామాయణమైతేనేం ...  ఆత్మబోధ అయితేనేం ...  అన్నింటా ఉన్నది నేనే అని తెలియజెప్పడానికే ఇలా చేశావు కదా రామయ్యా! 

ఈనాటి ఈ నా ఆనందక్షణాలు అమూల్యం. ఈ నా అనుభూతిని స్మరణలో పెడదామని సిస్టం ఓపెన్ చేయగానే-
డెస్క్ టాప్ బ్యాక్ గ్రౌండ్ గా మా అబ్బాయి అనుదీప్ పెట్టిన చిత్రం నాకు మరింత ఆనందమును కల్గించింది. ఆ చిత్రమిదే -
                                 
ఓ ... చెప్పనే లేదు కదా..... ఆత్మబోధలో నేను చదివిన శ్లోకం, వ్యాఖ్యానం యధాతధంగా  -
తీర్త్వా మోహార్ణవం హత్వా
రాగాద్వేషాది రాక్షసాన్ /
యోగీ శాంతి సమాయుక్తః
ఆత్మా రామో విరాజతే //

భావం: ఆత్మజ్ఞాని మోహ సాగరమును దాటి, రాగాద్వేషాది రాక్షసులను సంహరించి, అటు పిమ్మట శాంతిని పొంది ఆత్మారాముడై వెల్గొందుచున్నాడు. 
ఈ శ్లోకమునకు స్వామి సుందర చైతన్యనంద వారి వ్యాఖ్యానం -
ఆత్మయైన తాను జీవుడని భ్రమ చెందుటయే మోహము. మనస్సులో మోహముదయించగనే ప్రశాంతత అనుభవించు చుండిన అంతఃకరణ అశాంతికి నిలయమగును. మోహపూరితమగు వాని మనస్సు రాగద్వేషములతో  నిండియుండును. ఇవి సుఖదుఃఖములనెడి ద్వంద్వములను కల్పించి అనంత దుఃఖమును, అసంఖ్యాకమైన జన్మలను అందించును. 
మోహము సాగరము వంటిది. అందుచే మోహార్ణవమని శ్రీ శంకరులువారు తెలియజేశారు. ఈ మోహము సాగరమువలె అనంతము, అగాధము అని భావం. రాగద్వేషాదులు రాక్షసుల వంటివి. రాక్షసుల ముందు జీవించువానికి ప్రాణభయం తప్పదు. రాగద్వేషాల మధ్య కొనసాగువానికి ప్రతిక్షణమూ మరణమే., ప్రతిక్షణమూ జననమే. విచారణ ద్వారా మోహసాగరమును దాటి, రాగద్వేషాది రాక్షసులను హతమార్చిన వానికి శాంతి లభించును. శాంతస్వరూపుడైనవాడు ఆత్మవిదుడై, ఆత్మారాముడై వెల్గొందును. 
ఈ శ్లోకమును చదువగానే దీని అంతరార్ధం - రామాయణ వైభవము అని అర్ధమౌతుంది. 
రామునికి దూరమై సీత లంకలో వున్నది. సీతలేని రాముడు శాంతిలేని జీవుడు. రాముడు దాటినా సాగరమే జీవుడు దాటవలసిన మోహమహార్ణవము. రామునిచేత వధించబడిన రావణ కుంభకర్ణాది రాక్షసులే, జీవునిచేత వధించబడవలసిన రాగద్వేషాదులు. సీత రామున్ని చేరినట్లు, శాంతి జీవున్ని సమీపించాలి. పట్టాభిషిక్తుడైన రాముడు అయోద్యరాముడు. సాక్షాత్కారము నొందిన జీవుడు ఆత్మారాముడు. 
                                                    'సర్వేషు రమన్తే ఇతిరామః '
                                    'అందరిలో రమించు దివ్య చైతన్యమే శ్రీరామచంద్రమూర్తి' 
ప్రతి ఒక్కరూ ఆత్మారాములై తరించాలన్నదే వేదాంతాశయము.