బ్రహ్మభావే మనశ్చారో బ్రహ్మచర్యం పరం తధా
బ్రహ్మ భావనమందు మనస్సును సర్వదా చరింప జేయుటయే బ్రహ్మచర్యం.
బ్రహ్మణీ చరతీతి బ్రహ్మచారీ, తస్యభావః బ్రహ్మచర్యం
పరబ్రహ్మయందు చరించువాడు బ్రహ్మచారి, వానిభావం బ్రహ్మచర్యం.
ఇక సామాన్యముగా ఆలోచిస్తే -
మైధునస్యాప్రవృత్తిర్హి మనోవాక్కాయకర్మణా /
బ్రహ్మచర్యమితిప్రోక్తం యతీనాం బ్రహ్మచారిణామ్ //
మనోవాక్కాయకర్మలచే స్త్రీ సంబంధ విషయములనుండి నివృత్తి యేది కలదో అదే బ్రహ్మచర్యం. ఇది యతులకును బ్రహ్మచారులకును వర్తిస్తుంది.
అయితే -
మానవునికి త్రివిధ దేహములు (స్థూల సూక్ష్మ కారణ) యున్నట్లే బ్రహ్మచర్యం కూడా మూడు విధములై యున్నది.
తద్భేదం త్రివిధం వక్ద్యే స్థూలం సూక్ష్మం చ కారణమ్ /
వ్యాయామః ప్రధమః ప్రోక్తః మనోనైర్మల్యకం తధా //
ఆత్మశుద్ధిన్త్రుతీయా చ మోక్షస్సిద్ధ్యతి తే నఘ /
త్రివిధం బ్రహ్మచర్యం చ సాధనీయం సదా జనై: //
బ్రహ్మచర్యం కూడా స్థూలం, సూక్ష్మం కారణం అని మూడు విధములై ఉంది. స్థూలబ్రహ్మచర్యమును వ్యాయామముద్వారా, సూక్ష్మబ్రహ్మచర్యమును మనోనిర్మలత ద్వారా, కారణబ్రహ్మచర్యమును ఆత్మశుద్ధి ద్వారా పరిశుద్ధత గాంచును.
పైన చెప్పిన వ్యాయామ, మనోనిర్మలత, ఆత్మశుద్ధులు ఎలా కల్గుతాయంటే -
యోగాసనం చ వ్యాయామే ప్రాణాయామశ్చ మానసే /
పరమాత్మ స్వరూపస్య విదుర్జ్జ్ఞానం తృతీయకే //
వ్యాయామ బ్రహ్మచర్యంలో యోగాసానాదులున్ను, మానస బ్రహ్మచర్యంలో ప్రాణాయామాదులున్ను, ఆత్మశుద్ధి బ్రహ్మచర్యంలో పరమాత్మ స్వరూపజ్ఞానమును కల్గుతాయి.
మరల ఈ బ్రహ్మచర్యమును మూడువిధములుగా పేర్కొంటారు. అదేమిటంటే -
1. మానసికం :- మనస్సున ఎలాంటి విషయ సంకల్పములు లేకుండుట.
2. వాచికం :- వాక్కుతోను విషయాభిలాష ప్రయుక్తాలాపములు లేకుండుట.
3. కాయికం :- క్రియారూపేణా శరీరముతో సంబంధం లేకుండుట.
అటులనే ఈ బ్రహ్మచర్యమును మరో మూడువిధములుగా శాస్త్రము చెప్పుచున్నది. అవి ఏమిటంటే -
1. నైష్టికము :-
జన్మించిన మొదలుగు మరణపర్యంతం ఎలాంటి విషయ దోషములు లేకుండా ఆచరింపబడు బ్రహ్మచర్యం. ఇందులకు దృష్టాంతం - శుకమహర్షి, సనకాదులు, ఆంజనేయుడు, గార్గి మరియు సులభాయోగినులు భీష్ముడు, మొదలగువారు. కలియుగమున రమణమహర్షి, అరవిందులవారు తదితరులు.
2. గార్హస్థ్యం :-
ఋతుకాలమునందు మాత్రమే విషయములయందు ప్రవర్తించి ధర్మబద్ధుడై అనుష్టించు బ్రహ్మచర్యం. ఇందులకు దృష్టాంతం - జనకుడు, చూడాలా, శిఖిధ్వజ, మదాలస మొదలగువారు.
3. వైదురము :-
భార్యవియోగము లేక భర్తవియోగం కల్గిగాని, లేక భార్యాభర్తలకు ఆత్మశుద్ధి గలిగి విషయములలో విరక్తి కలిగి బ్రహ్మచర్యము ఆచరించురో అది విధురబ్రహ్మచర్యం. ఇందులకు దృష్టాంతం - యాజ్ఞవల్క్య మైత్రేయీ, విశ్వామిత్రుడు మొదలగువారు. కలియుగమున గురునానక్, శ్రీకృష్ణచైతన్యాదులు కలరు.
అసలు బ్రహ్మచర్యమునకు ఆహరమునకు సంబంధం ఏమిటంటే -
ఆహరస్సత్త్వజనకం కరుణా భక్తివర్ధినీ /
బ్రహ్మభావనయా స్వస్మిన్ స్వయం బ్రహ్మాత్మనిశ్చయః //
సత్త్వగుణాభివర్ధకమగు సాత్త్వికాహారం సేవించుటయు బ్రహ్మచర్యమే యగును. భక్తిని వృద్ధి చేయు కరుణయు బ్రహ్మచర్యమే. స్వాత్మయందు బ్రహ్మభావనయు బ్రహ్మచర్యమే.
మరి గృహస్థుల విషయంలో ఈ బ్రహ్మచర్యమును పరిశీలిస్తే -
ఏ విధమైన వ్రతములు గాని, యజ్ఞాదిక్రియలుగాని, మండలం రోజుల పూజాదీక్షలుగాని చేసినప్పుడు బ్రహ్మచర్యం గృహస్థులు పాటించడం ఓ నియమంగా పెట్టుకుంటారు.
కానీ, గృహస్థు బ్రహ్మచర్యమంటే -
కాయేన మనసా వాచా నారీణాం పరివర్జనమ్ /
ఋతౌ భార్యాం వినా స్వస్య బ్రహ్మచర్యం తదుచ్యతే //
మనోవాక్కాయ కర్మాదులచే పరస్త్రీలతో సంసర్గం లేకుండుట, ఋతుకాలంలో మాత్రమే స్వపత్నితో జేరుటను గృహస్థ బ్రహ్మచర్యమనబడును. అటులనే మనోవాక్కాయ కర్మాదులచే పరపురుషచింతన లేనిదై, ఋతుకాలమందు మాత్రమే సంతానాభిలాషగలదై పతితో చేరు స్త్రీయు బ్రహ్మచారిణియే యగును.
ఋతుకాలాభిగామీ యః స్వదారనిరతశ్చయః /
స సదా బ్రహ్మచారీ హి విజ్జ్ఞెయస్స గృహశ్రమీ //
ఋతుకాలమందు మాత్రం స్వభార్యయందు చేరు గృహస్థుడు ఎల్లప్పుడును బ్రహ్మచారియే అగును. అలాంటి నారీమణియు బ్రహ్మచారిణియే యగును.
ఇక శాస్త్రము తెలుపుతున్న ఋతుకాల వివరణ -
ఋతుస్స్వాభావికః స్త్రీణాం రాత్రయః షోడశస్మృతాః /
చతుర్భిరితరైస్సార్ధమహోభిస్సద్విగర్హితై: //
స్త్రీలకు స్వాభావికముగా పదునారు దినముల వరకు ఋతుకాలము. అందు మొదటి నాలుగు దినములు వర్జనీయములు.
తాసామాద్యాశ్చతస్రస్తు నిందితైకాదశీచ యా /
త్రయోదశీ చ శేషాస్తు ప్రశస్తా దశ రాత్రయః //
ఈ ఋతుకాలదినములలో మొదటి నాలుగు దినములను, పదకొండవ, పదమూడవ రాత్రియు నిందితములు. మిగిలిన పదిరాత్రులు ప్రశస్తములు.
నింద్యాస్వష్టాసు చాన్యాసు స్త్రీయో రాత్రిషు వర్జయన్ /
బ్రహ్మచార్యేవ భవతి యత్ర తత్రాశ్రమే పసన్ //
పైన చెప్పిన నిషిద్ధములైన మొదటి నాలుగు దినములను, పదకొండవ, పదమూడవ దినములను, అమావాస్య పున్నమ వ్రత దినములను వదిలిపెట్టి తక్కిన రాత్రుల పత్నితో కూడినవాడు గృహస్థాశ్రమము నందున్నను బ్రహ్మచారియే యగును. అలాంటి స్త్రీయును బ్రహ్మచారిణియే యగును.
బ్రహ్మచర్యం అవలంబించడం వలన ప్రయోజనమేమిటంటే -
ఆయుస్తేజో బలం వీర్యం ప్రజ్ఞా శ్రీశ్చ మహద్యశః /
పుణ్యం చ మత్ప్రియత్వం చ లభ్యతే బ్రహ్మచర్యయా //
బ్రహ్మచర్యముచే పూర్ణాయువు, తేజస్సు, దేహేన్ద్రియములకు బలం, ఓజస్సు, ప్రజ్ఞా, జ్ఞానసంపద, యశస్సు, పుణ్యం, భగవత్ప్రీతియు కలుగును.
శాన్తిం కాన్తిం స్మృతిం జ్ఞానమారోగ్యం చాపి సన్తతిమ్ /
య ఇచ్ఛతి మహద్ధర్మం బ్రహ్మచర్యం చరేదిహ //
ఈ జగత్తున శాంతి, కాంతి, స్మృతి, జ్ఞానం, ఉత్తమ సంతానం కోరువారెల్లరు సర్వోత్కృష్ట ధర్మమైన బ్రహ్మచర్యవ్రతమును తప్పక పాటించవలెను.