కృష్ణపరమాత్మ(భగవత్ స్వరూపులు)మరియు
వ్యాసమునీంద్రులవారు(గురు స్వరూపులు) శివునికై తపస్సు చేయమని అర్జునుడికి సూచించారు.
భగవంతుడు మరియు గురువు...వీరిరువురి సూచన అంటే - నిస్సందేహంగా ఇందులో పరమార్ధమున్నట్లే.
మానవుడిని మాధవుడిగా చేయడానికీ, మనల్ని తరింపచేయడానికి ఏదో అర్ధముందని గ్రహించగలగాలి. జీవాత్మకు ప్రతీక అయిన అర్జునుడిని మిషగా మానవుడు తరించడానికి ఓ గొప్ప సందేశాన్నే ఈ సంఘటన ద్వారా సకల మానవళికి అందించారు.
శివుడినే ఎందుకు ఆరాధించమని చెప్పారంటే - "శామ్యతి పరమానంద రూపత్వాన్నిర్వికారో భవతి ఇతిశివః" అని అర్ధం చెప్తుంది అమరకోశం. పరమానంద స్వరూపుడు, ఏ వికారాలు లేనివాడు శివుడు.
జీవులన్నింటికీ షడ్వికారాలు (జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశాంగ) ఉంటాయి. శివుడు మాత్రమే ఏ వికారాలు లేని పరమానందమయుడు. మనలో వికారాలు పోవాలంటే - ఏ వికారాలు లేనివాడిని ఆశ్రయించాలి. అలానే శివుడు పశుపతి. పశువులు అనగా ఇంద్రియములు అని అర్ధం. దిక్కులని మరియొక అర్ధం. వీనికి అధిపతి అయిన పశుపతిని/శివుడిని అందుకే ఆరాధించమని
సూచించారు.
ఇక కధలోని పరమార్ధం పరిశీలిద్దాం -
మనుషుల్లో పశుభావమును [నేను జీవుడనే భావమును] పొగొట్టునది పాశుపతాస్త్రం. అంటే అజ్ఞానం పొగొట్టు అస్త్రం. అజ్ఞానం పొగొట్టుకొని ఆత్మజ్ఞానం పొందాలని సాధకుని ప్రయత్నమే ఈ కిరాతార్జునీయం.
ఇక్కడ అర్జునుడు ఓ ఆధ్యాత్మిక సాధకునిగా పరిగణిస్తూ పరిశీలిద్దాం. ప్రాపంచిక జీవనంలో అలసిసొలసి...ఏమిటీ జీవితం...ఇది కాదు జీవితం...మొన్న ఆనందం...నేడు అజ్ఞాతం...దుఃఖం...ఏది శాశ్వతం...ఏది అశాశ్వతం...ఇత్యాది భావనలతో వైరాగ్యం...అజ్ఞానమును వీడి యధార్ధజ్ఞానమును తెలుసుకోవాలన్న వైరాగ్యసహిత ఆకాంక్ష కల్గింది. ఇదే శుభకరమైన ఇచ్ఛ... 'శుభేచ్ఛ'. ఇది సాధకుని మొదటిస్థాయి.
వైరాగ్యం చేత మనకున్నది మనమున్నది సత్యమూ నిత్యమూ కాదని తెలుసుకొని, ఇంద్రియాల ద్వారా వచ్చే భౌతిక విషయపరిజ్ఞానం, ఆనందాల పట్ల అనురక్తి తగ్గి, సజ్జనసాంగత్యం, స్వాధ్యాయం ద్వారా జ్ఞానప్రాప్తికై... ఏం చేయాలి...ఎలా సాధించాలి అన్న 'విచారణ' మొదలౌతుంది. ఇది సాధకుని రెండో స్థాయి.
జగద్గురువు కృష్ణపరమాత్మ, వ్యాసమునీంద్రులవారు సూచన మేరకు, అర్జునుడు పాశుపతాస్త్రం సాధించుట కోసం, శివుడికై తపస్సు చేయడానికి ఈశాన్యదిక్కుగా బయలుదేరి ఇంద్రకీలాద్రికి వెళ్ళెను. {ఈశాన్యం - పరమాత్మను ఉపాసించే దిక్కుయని అందరికీ విధితమే} వెళ్ళి పశుపతి అయిన శివుడిని ఆరాధించడం ప్రారంభించెను.
విచారణ ద్వారా ధ్యానసాధనలో నిమగ్నమై ఇంద్రియార్ధముల యందు ప్రీతి శుష్కించిపోవు స్థితి 'తనుమానసి'. ఇది సాధకుని మూడవ స్థాయి.
అర్జునుడు తపస్సు చేస్తున్నాడు ఎంతోకాలంగా. అయిన శివదర్శనం కానరాలేదు. ( మన హృదయంలో ఓ సత్యముంది. ఆ సత్యం ఎంత లోతులో ఉందో, అంత లోతులోనికి మనం వెళ్ళితే గానీ, ఆ జ్ఞానం దొరకదు. మనం ఆ జ్ఞానాన్ని పొందడానికి స్వప్రయత్నంగా కొంతదూరం వెళ్ళగలం. ఆపై ఎంత సాధన చేసిన వెళ్ళలేం. అయిన ఆగక సంకల్పబలంతో ముందుకు సాగితే, తప్పక గుర్వనుగ్రహం లభిస్తుంది).
సడలని సంకల్పంతో సాధన చేస్తుంటే ఇంద్రుడు (గురువు) {దృవుడికి నారదమహర్షి గురువైనట్లు, ఇక్కడ ఇంద్రుడు అర్జునుడికి గురువై మంత్రోపదేశం చేసిరి} వచ్చి, ఎందుకు తపస్సు చేస్తున్నావని ప్రశ్నించి, అర్జునుడనే సాధకుని హృదయక్షేత్రధర్మ పటిమను పరిశీలించి, పట్టుదలను పరీక్షించి, అంతర్గత శత్రువులు...అరిషడ్వర్గాలను జయించాలనే సంకల్పంతో పాశుపతాస్త్రముకై తపస్సు చేస్తున్నాడని మెచ్చి, పార్ధివలింగమును పంచాక్షరి మంత్రంతో ఆరాధించమని అనుగ్రహించెను. అర్జునుడు గుర్వనుగ్రహంతో కఠోర తపానికై పూనుకున్నాడు. తపోదీక్షలో చాలాకాలం గడిచింది. అప్పుడు పరమేశ్వరుడు పరీక్షించదలచి
రాక్షసుడిని రొద చేస్తూ తపోభగ్నం చేయమని చెప్తాడు. అంటే అంతరమునున్న ఆంతర్యామి మనస్సనే రాక్షసుడిని ప్రేరేపిస్తాడు. మనస్సు రొదను తన అస్త్రంతో (సాధనాశక్తితో) సంహరిస్తాడు అర్జునుడు. కానీ యధార్దానికి అదే క్షణమున శివాస్త్రం (శివానుగ్రహం) సంహరిస్తుంది మనస్సనే రాక్షసుడిని.
కానీ, 'నేనే' చంపాననే భావం అర్జునునిది. జీవుని యందు 'నేను' అను వ్యక్తిగత ప్రజ్ఞయే అహంకారం. ఇట్టి అహంకారం వలన జీవుడు తనని తాను పరమాత్మ నుండి వేరుచేసుకొనుచున్నాడు. ఇది జీవియందు నేను అను సంకల్పంగా పనిచేయుచున్నది. ఈ అహంకారమే ఇంకా అర్జునుడిలో వుండడం వలన, వాదిస్తూ ఘర్షణకు దిగాడు. కొంత ఘర్షణ తర్వాత శివుడు అపారకృప కనబర్చగా; తనవలననే జరిగిందనిపించినను, నిజమునకు పరమేశ్వరుని సంకల్పం వలనే జరిగెనను పరమసత్యం అవగతమై, అహంకార నిర్మూలనం కాగా పరమాత్మ పాదములను పట్టుకొనెను. పాశుపతాస్త్రమును పొందెను.
పరిపూర్ణభక్తిలో అహం కాలిపోతేనే గానీ తత్త్వజ్ఞానం అనుభవమవ్వదు.
ఈ అహంకారమన్నది నీటిలో తేలు మంచుగడ్డ వంటిది. మంచుగడ్డ నీరు ఒకటే అయినను మంచుగడ్డకున్న భౌతికరూపం వలన నీటినుండి తాత్కాలికంగా వేరగుచున్నది. అహంకారం వలన మనకొక స్వభావమేర్పడును. స్వభావం వలన కోపతాపాదులు మమకార బంధాలు ఏర్పడుచున్నవి. తత్ఫలితంగా సమస్త కర్మలు...బంధనాలు. ఎవరికైనను పనులు తాము చేయుచున్నామను అహంకారమే అజ్ఞానం. అదే మాయ. అదే బంధనం. పరమేశ్వరుని అనుగ్రహం వలననే సమస్తం జరుగుచున్నదని తెలియుటే అహంకార నిర్మూలనం.
పై మూడు స్థాయిలు తపోసాధనలో అధిగమించి నాల్గవ స్థాయికి చేరడానికి చేసే సాధనలో జరిగే సంఘర్షణ, మనస్సు చేసే కల్లోలములు మాటల్లో కుదించలేం. అంత తీవ్రంగా సంఘర్షణ ఉంటుంది. ఈ
మనస్సు చేసే రొద సాధనకు అడ్డంకమని అర్ధమై మనస్సుని నిర్వీర్యపరచాలని , సంకల్పం ధనస్సుతో సాధనశక్తి అస్త్రమును సంధిస్తాడు. ఇక్కడ ఈశ్వరానుగ్రహంతో మనస్సును జయిస్తాడు. కానీ ఇంకా వీడని అహంకారం...'నేనే', నా సాధనతో జయించాననే అహంకారదర్పం. కరుణాంతరంగని కృపచే,
ఆ దర్పమూ దమించి, శుద్ధ సాత్త్వికంతో చిత్తశుద్ధి పొంది తద్వారా నాడీమండలం శుద్ధమై కుండలిని జాగృతి అయిన స్థితి యిది. హృదయగ్రంధి విచ్ఛేదమే జ్ఞానం. మనస్సు నశించే సాధనే యోగం.
'అహం బ్రహ్మాస్మి' అని చక్కగా తెలుసుకున్న స్థితి. ఇలా స్వాత్మ యందు నిలకడ పొందడమే 'సత్త్వాపత్తి'. ఇది సాధకుని నాల్గవ స్థితి.
అటు పిమ్మట అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి. ఈ స్థితిలో కూడా సాధకునికి పరీక్షలు తప్పవు.
ఇంద్రాది దేవతలు జీవునికింకను సుఖములయందు వ్యామోహం వుందా అని పరీక్షిస్తారు. ఇక్కడ కూడా సాధనాశక్తితో స్థిరుడై సాగిపోవాలి. అప్పుడే సాధకుని జీవప్రజ్ఞకున్న పరిమితి తొలగిపోతుంది. తాను వేరన్న భావం నశించి సమస్తముతోను ఒకటియై ఉండును.
పై నాలుగుస్థాయిల అభ్యాసంచే సత్యరూఢస్థితిని పొంది,అనాసక్తితో, తటస్థ దృష్టితో, సత్యద్రష్టుడై విషయవాసనా రహితమగు అసంగస్థితియందు యుండుటయే 'అసంసక్తి'. ఇది సాధకుని ఐదవ స్థితి.
ఈ స్థాయికి చేరిన సాధకుడు, కర్మ సంస్కారములు పూర్తిగా భస్మమైపోయేంతవరకు శరీరంతో ఉండాలి కాబట్టి తిరిగి జనవాసంలోనికి వచ్చి సాటివారికై శ్రమిస్తూ అందరి పరిపూర్ణతకు ప్రయత్నిస్తాడు.
సత్యదర్శనం పొంది, సమాధిస్థితికి చేరిన సాధకుడు, సంకల్పమాత్రంచేత ఆ స్థాయినుండి క్రిందకు వచ్చి ఇతరులకు మేలు చేయునట్టి స్థితి 'పదార్ధభావన'.
(ఈ స్థాయికి చేరినా సాధకునికి, ఎన్నో సమాధానాలు దొరికినా, ఎంతో ఆధ్యాత్మిక పురోగతి సాధించిన కొన్ని సందేహాలు మిగిలి వుంటాయని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తుంటారు) ఇది సాధకుని ఆరవస్థాయి.
సప్తజ్ఞానభూమికలలో అర్జునుడు అనే సాధకుడు సాధించిన ఆరుస్థాయిల యోగసాధన కధనమే ఈ "కిరాతార్జునీయం".
ఇప్పుడు మనకో సందేహం రావచ్చు. మరి జ్ఞానభూమికలో సప్తమస్థాయికి అర్జునుడు సాధించలేదా అని.
సాధించాడు..... ఎప్పుడు?
కురుక్షేత్రమున యుద్ధారంభమునకు కాస్త ముందు. కృష్ణభగవానుడు అర్జునునకు గీతను ఉపదేశించి అతని సంశయములను తీర్చి జ్ఞానమును సంపూర్ణంగా అందించి శోకమోహములనుండి ఉద్ధరించాక ఏడవస్థాయిని సాధించెను.
కేవలం ఆత్మనిష్ఠలో అంటే జీవన్ముక్తస్థితిలో వుంటూ శేషజీవితాన్ని గడపడం. వీరికి సుఖదుఃఖాలుండవు. ప్రాప్తించిన కార్యములను అసంగత్వభావంతో చేస్తూ ముక్తులై యుందురు. ఇది 'తుర్యగ'స్థితి.ఇది సాధకుని సప్తమస్థితి.
🔱 ఓం నమః శివాయ 🔱