వర్షంలో కాగితపు పడవలు వదలడం, నేల,బండ; వీరి వీరి గుమ్మడుపండులాంటి ఆటలు, పుస్తకా లలో నెమలికన్ను,కొంచెం బియ్యం (బియ్యం పెడితే నెమలికన్ను పిల్లలను పెడుతుందని, బోల్డన్ని నెమలికన్నులవుతాయని) పెట్టుకోవడం ............ నవ్వు వస్తుందిప్పుడు...... బట్ అప్పుడు ఎంతటి అమాయకత్వం....... ఆ అమాయకత్వం వెనుక ఆనందం, నేడు చేసే పనులలో వుండవెందుకనీ? ఆనాడు ఏ చింతనలు, చింత లేని మనస్సుకీ నేడెందుకు ఇంతటి తాపం? ఆనాడు లేని సందేహాలు, సంకోచాలు, సంఘర్షణలు నేడెందుకు మనతో ఆడుకుంటున్నాయి? అప్పుడు ఏ పని చేయాలన్పించినను ఏ ఆలోచనలేకుండా హాయిగా చేసేయడమే...... మరి ఆనాడు లేని వెరపు, ఆలోచనలు ఈనాడు ఎందుకనీ?
బాల్యం వరం, యవ్వనం వివిధ కామనలు(కోరికలు), మధ్యస్తం తపనలు, వృద్ధాప్యం అనుభవాల జ్ఞాపకాలు ......... ఇదా జీవితం........ కాదు కాదు .........
జీవనమజిలీ_________ ఆనందంగా వుండాలి....... అందంగా వుండాలి........ ప్రాపంచికంగా పారమార్ధికంగా తృప్తికరంగా వుండాలి..........
అలా జీవించాలంటే ఏం చేయాలి........
ఇది నా స్నేహితురాలి సందేహమే కాదు, నాది, నాలాంటి మరికొందరిది కూడా -
బాల్యమందు మనది కల్మషం లేని, కోపతాపాలాంటి ఏ భావాన్ని మోయక నిర్మలంగా ఉండే మనస్సు. స్వార్ధంకు తావులేని స్వచ్ఛత. మనం మనలాగే స్పష్టంగా ఉండేవారం. మన బలపమో, పెన్సిల్ లో ప్రక్కవారు లాక్కుంటే కాసేపు కోపంతో తిట్టుకున్నా, మన పలక విరిచేసారని ఒకర్ని కొట్టినా అది ఆ కాసేపే! ఏదీ మోసేవారం కాం. మన సహజత్వముకు (ఆనందంనకు) దగ్గరగా ఉండేవారం. అందుకే ఆనందం మన దగ్గరే ఉండేది.
మరి ఇప్పుడో?
మనతో పాటు పెంచుకున్న అభిప్రాయాలు, కల్పించుకున్న ఆలో చనలు, అలవర్చుకున్న అలవాట్లు, ఏర్పరుచుకున్న స్వభా వాలు. మనం మనలాగా కాకుండా ఎన్నో ముసుగులు మద్య మనల్ని మనం కట్టేసుకుంటున్నాం. సహజత్వంనకు దూరంగా ఉంటున్నాం. మనస్సునిండా మోయలేని బరువులను వేసేస్తున్నాం. సహజసిద్ధమైన ఆనందమును అనవసర ఆలోచనలతో మనకు మనం దుఃఖంగా మలచుకుంటున్నాం.
ఉదాహరణకి మనల్నీ, మనచుట్టూ ఉన్నవారిని గమనిద్దాం -
కొందరు తోటివారిని నమ్మరు. అపనమ్మకాలా నడుమ అన్నింటినీ సందేహిస్తూనే సతమతమౌతారు. తాము మాత్రమే నమ్మకస్తులైనట్లు, నిజాయితీపరులమన్న భావన. ఇటువంటి తత్త్వం వలన ఏదీ సాధించలేం. ఏదో ఒకటి రెండుసార్లు చెడు అనుభవాలు ఎదుర్కున్నంతమాత్రానా తోటివారిని నమ్మకపోవడం సముచితం కాదు కదా? వీరిది అపనమ్మకపు ముసుగు. ఇలానే వుంటే తమని ఎవరూ నమ్మరని గ్రహించి ఈ తత్త్వమును మార్చుకోగల్గినప్పుడే ఆనందంను ఆస్వాదించగలం.
కొందరు అంతా తమకే తెలుసన్న అహంభావనతో ఉంటారు. తాము చేసిందే సరైనదన్న భావన వీరిది. ఈ అహంభావం అసంతృప్తినే మిగుల్చుతుంది. తామే తెలివైనవారమన్న అహంభావన ఇక్కట్లునే కల్గిస్తుంది. ఇటువంటివారు ఇతరుల అభిప్రాయాలను అర్ధం చేసుకోరు. తప్పు ఉన్నా తమది తప్పుకాదనే అంటారు. తమది తప్పూ అని మనస్సాక్షిగా తెలిసినా బయటికి అంగీకరించక తమని తాము సమర్ధించుకునే ప్రయత్నంలో తమ ఆనందమును కోల్పోవడంతో పాటు ఇతరులను బాధపెడతారే తప్ప తమ మూర్ఖత్వమును వీడరు. కాన్ఫిడెన్సు అవసరమే కానీ, ఓవర్ కాన్ఫిడెన్సు అనర్ధదాయకమని గ్రహించని మొండితనం వలనే ఆనందమును దూరం చేసుకుంటారు. వీరిది అహంకారపు ముసుగు. అందుకే అంతా తమకే తెలుసన్న అహంకారమును వీడాలి. పట్టువిడుపులు, సర్దుబాటులు, పరస్పర అభిప్రాయాలను గౌరవించుకోవడాలు అలవర్చుకుంటేనే జీవితం ఆనందమయం.
కొందరు తమ అభిప్రాయాలకు, ఆలోచనలకే పరిమితమౌతారే తప్ప క్రొత్తభావాలకు చోటివ్వరు. తోటిమిత్రులు చెప్పినా మారడానికి ఇష్టపడరు. ఎప్పుడూ నేను నేనుగానే ఇలానే ఉంటాను. మారను, అని తమ భావాలతో తమకి తామే సంకెళ్ళు వేసుకొని బంధీలౌతారు. కానీ, మానవ జీవనగమనమే అనేక మార్పులమయం. పుట్టినప్పుడు ఉన్నట్లే జీవితాంతం ఉండలేం కదా. 'మనిషిలో వుండే అద్భుతమైన విషయాలన్నింటిలోనూ, తనని తాను మార్చుకోగలడమన్నదే అమోఘమైన గొప్పశక్తి' అని ఓ మహర్షి అంటారు. సృష్టిలో మార్పు అనివార్యం. మానవుడు ధ్యానిగా, ధ్యాని యోగిగా, యోగి జ్ఞానిగా పరిణామం చెందుతూ చివరికి ఏ మార్పులేని స్థితికి వచ్చి పరమాత్మను చేరుకోవాలి. గొంగళిపురుగు మారితేనే కదా సీతాకోకచిలుక అవుతుంది. అలానే మార్పు అనేది మానవునికి అనివార్యమని గ్రహించక ప్రవర్తించడం తగదు. మంచికై మారినప్పుడే ఆనందం పొందగలం.
కొందరు చాలా తెలివిగా అంటుంటారు, ఈ దేహం ఏ కారణంగా వచ్చిందో, ఏ బాధ్యతలు నిర్వర్తించడానికి వచ్చిందో??? ఈ శరీరంతో ఏర్పడిన బంధాలను, నా భాద్యతలను సక్రమముగా నిర్వర్తించడమే తప్ప 'నేను' అంటూ లేను, 'నేను' అన్నది భగవంతునికే అర్పించేశాను, నా భాద్యతలను నిర్వర్తిస్తూ నాపై ఆధారపడినవారికి అభివృద్ధి తేవడమే తప్ప నాకంటూ ఏ కోరికలు లేవు, నా చిరునవ్వుని సైతం మరిచిపోయాను ఏనాడో అని అంటారు. అలాగని భగవతార్పణ భావనతో ఆనందంగా వుంటారా అంటే ఊహు.... మానసికంగా అలసిపోతారు, తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంటారు. మెట్టవేదాంతం విన్పిస్తారే తప్ప పరిణితి వీరిలో ఉండదు. పరిణితితో కూడిన ప్రాపంచిక పారమార్ధిక జీవనగమనమే కదా ఆనందమును ఇచ్చేది. వ్యక్తిత్వవికాసమే ఆనందమయ జీవితానికి పునాది. మన వ్యక్తిత్వమును అందంగా ఆనందంగా మలచుకోవాలంటే స్వచ్ఛత, సదవగాహన, సచ్చీలం, సంస్కారం, సంయమనం, సహకారం, సత్యం, స్పష్టత, సద్గోష్టి, సన్మార్గం, సదాశయం, సత్సంకల్పం, సహనం, సంతోషం, సరళత్వం, సమానదృష్టి, సేవాదృక్ఫదం లాంటి సద్గుణాలను స్వాగతించాలి. ఇవన్నీ మన సహజగుణాలే. ఇవన్నీ మన అంతరంగంలోనే వున్నాయి. కాకపోతే మనమేసుకున్న ముసుగులను తొలగించుకుంటే చాలు; ఆనందమే ఆనందం.
బాధపెట్టాలన్న ఉద్దేశ్యం లేకున్నా, ఒకోసారి మన మాటలు, చేతలు ఇతరులకు బాధను కల్గించవచ్చు. కొందరు మన చిన్నతప్పును కూడా భూతద్దంలో చూస్తారు. ఓ గిరి గీసి వెలివేస్తారు. తప్పు చేయని మానవుడు ఉంటాడా? మానవుడిలా మాధవుడు వెలివేస్తే? తోటిమానవుడినే మనం క్షమించలేనప్పుడు, భగవంతున్ని క్షమించమని ప్రార్ధించడం తగునా? మన తప్పుని గ్రహించిన మరుక్షణం మరల ఆ తప్పుచేయకుండా మనల్ని మనం సరిదిద్దుకోవాలి. అలానే మనం చేసినా తప్పు వలన ఎవరైనా బాధపడితే వారిని క్షమాపణ అడగాలి. ఇది చిన్నతనమో, ఓటమో అని అనుకోకూడదు. ఇది పరిణితి కల్గిన మనస్సుకు నిదర్శనం. అప్పటికీ మనల్ని క్షమించక ఇంకా వారు తప్పుపడితే ఆ తప్పుపట్టినవారే ఆ తప్పుల భారాన్ని మోస్తారు. తప్పుని ఒప్పుకున్నవారు శత్రువుల్ని మిత్రులుగా మార్చుకోగల సమర్ధులు. తప్పుని ఒప్పుకున్నా క్షమించలేనివారు మిత్రుల్ని శత్రువులుగా మార్చుకునే దుర్భలులు. సమర్దులే ఆనందంగా జీవిస్తారు.
కొందరు తమకి వ్యతిరేకంగా చిన్న సంఘటన జరిగినా చాలు - అంతవరకు కనబరచిన ప్రేమా, నమ్మకాలను ఒదిలేసుకొని అశాంతిని వారు పొందడమే కాకుండా చుట్టూ వున్నవారికీ పంచేస్తారు. వీరిలో పరిణితి ఎక్కడ ఉంది? ఆనందం దుఃఖమూ మన చేతల్లోనే వున్నాయి. ఆనందం మనకు దూరంగా లేదు, ఆనందంనకు మనమే దూరంగా ఉంటున్నాం అని గ్రహించి మన గుణాల్ని సరిదిద్దుకుంటే ఆనందం మన చెంతనే ఉంటుంది.
జీవితంలో జరిగిపోయిన సంఘటనలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఆలోచనలని గతముయందే నిలిపితే మన అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది. జ్ఞాపకాలు గుదిబండలుగా మారి మనస్సులో మోయనిబరువై నిలుస్తాయి. అలానే భవిష్యత్తు గురించి ఎంతగానో ఊహిస్తూ గాలిలో మేడలు కట్టేస్తుంటారు. ఇదీ నిరాశనే నింపేస్తుంది. అలా కాకుండా ఒక్కొక్క క్షణాన్ని గుర్తిస్తూ, ఆ క్షణంలో మనం ఏం చేస్తున్నామో ఆ పనియందు సంపూర్ణంగా ఉండగలిగితే ఆనందమే కదా. జీవితంలో ఆనందం ఏం చేస్తున్నారన్న దానిబట్టి ఉండదు. చేస్తున్న పనిని ఇష్టంగా చేస్తున్నారన్న దాంట్లో వుంటుంది. ఏ పనినైనా ఇష్టంగా, పరిపూర్ణమైన శ్రద్ధతో చేస్తే ఆనందం మన సొంతమౌతుంది. ఇక్కడ చిన్నప్పుడు మా మాస్టారుగారు చెప్పిన ఓ కధ జ్ఞాపకం వస్తుంది. మానసికంగా అలసిపోయిన ఓ వ్యక్తి ఓ సాధువు చెంతకు వెళ్లి ప్రశాంతతగా జీవించాలనుకుంటున్నాను, అందుకు ఏం చేయాలి అని అడగగా, చెప్తాను గానీ, కాస్తా నిల్చొని, ఈ నీళ్ళపాత్రను తొణకనీయకుండా నేను వచ్చేంతవరకు చేతిని మార్చకుండా పట్టుకో, క్రిందకు దించకు అని చెప్పి లోపలికి వెళ్లి ఎంతసేపటికీ రారు. ఈ వ్యక్తి చెయ్యి తిమిరిఎక్కినను ఓ పావుగంట పట్టుకొంటాడు. మరో పదినిముషములు చేయ్యిలాగేస్తున్న పట్టుకొని, ఆపై పట్టుకోలేక వదిలేసి హమ్మయ్య అని అనుకుంటుండగా, సరిగ్గా ఆ సమయానికే సాధువు వచ్చి, నీ మనస్సు కూడా ఇలాంటిదే, దానిని పట్టుకొని నీవున్నంతకాలం ప్రశాంతత ఉండదు, దానిని వదిలేయ్...సుఖపడతావ్ అని!
కొందరు అతిగా కోరుకుంటారు. పరిమితిగా కోరుకోవ డంలో తప్పులేదు కానీ, అతిగా ఆశపడడం తప్పు. కోరికలు అవసరాలు వరకు పర్వాలేదు. అంతకు మించి మనస్సు వెళితే అహంకార మమకారాలు ఎక్కువౌతాయి. అందుకే అవసరానికి మించి కోరుకోవడం కూడా దుఃఖమే. స్వార్ధంకై కాకుండా పరోపకార్ధమై కోరుకోవడంలోనే ఆనందం ఎక్కువ. అలానే శాశ్వతమైనవాటికీ, క్షణికమైన వాటికీ మద్య తేడాను వివేచనతో తెలుసుకొని ప్రవర్తించడమే ఆనందంనకు నాంది.
మనిషి సంఘజీవి. ఇతరులతో అవసరరాలుంటాయి. కొందరు చిన్న చిన్న విషయాల్లో కూడా ఇతరుల భావాలతో విభేదించి అశాంతిని పెంచుకుంటారు. తమ మనస్సులో ఏముందో చెప్పరు. బయటికి మౌనంగా ఉంటారు కానీ, మనస్సులో ఎన్నో భావసంఘర్షనలను అనుభవిస్తారు. మనస్సుని నొక్కిపెడుతూ ఎన్నో సందేహాలను పెంచుకుంటారు. వారి చేతల్లో వారి అశాంతిని కనబర్చుతారు. అలాకాకుండా మనసారా మాట్లాడుకుంటే ఆనందం తాండవించదా?
మన జీవితమంతా మన ఆలోచనల ఫలితమే. మన ఆలోచనలే మన రూపకర్తలు. ఇతరులపట్ల మనకుండే భావాలు మన ఆలోచనల పైనే ఆధారపడి వుంటుంది. ఇది మన స్వభావాన్ని ప్రతిఫలింపజేస్తుంది. ఒకొకరు అర్ధం చేసుకునే తీరు వేరు వేరుగా ఉంటాయి కాబట్టి ఇతరుల భావాలను అర్ధంచేసుకొని పరస్పరం గౌరవించుకుంటూ నడుచుకోవాలి. అలాగే మంచి మంచి ఆలోచనలతో చెడు ఆలోచనలను అధిగమించాలి. ఇతరుల కర్మలను మనం నియంత్రిచలేము గానీ, మనల్ని మనం నియంత్రిచుకోగల్గితే మనతోపాటు ఇతరులకు కూడా మంచే జరుగుతుంది. భగవంతుడు మనకు ఎలాంటి లోటును కలిగించలేదు. లోటు మన మనస్సులోనిది మాత్రమే. సుఖదుఃఖాలు మన మనస్సులోనివే కాని బయటివికావు. ఇష్టాయిష్టాల ఎన్నికలో సర్దుబాటు తత్వమును కలిగి వుండడం, అవగాహనతో అందంగా మన జీవితాల్ని మలుచుకోగల్గడం మన చేతుల్లో పనే. ఇది సక్రంగా చేస్తే ఆనందం మన దగ్గరే వుంటుంది.
"ఓ మనిషీ! నువ్వేది నీవెంట తీసుకెళ్ళలేవు. నీవెంట తీసుకెళ్లగలిగేదాన్ని కొంతైనా సమకూర్చుకో" అన్నది బుద్ధుని బోధ. మన వెంట తీసుకెళ్లగలిగినవి దయార్ధమైన ఆలోచనలు,మాటలు, చేతలు మాత్రమేనని ఆయనంటారు. మన మహర్షుల ఉపదేశంకూడా ఇదే. సద్గుణాలే మన వెంట వస్తాయి. అందుకే సద్గుణాలను ఆచరణలో పెడితే చాలు - ఆనందం మనతోనే! మనలోనే!!
"తేరే ఘూంఘట్ ఫట్ ఖోలో, రామ్ మిలేగా"
- కబీర్
నీ ముసుగు తొలగించుకో, రాముడు లభిస్తాడు.
భారతి గారు, ఎంత చక్కగా విష్లేషించారండి మనుషులని , వారి అలోచనా రీతిని. చాల చాలా నచ్చింది నాకు. ముఖ్యం గా మీరు ఆఖరులో రాసిన ఈ లైన్స్..
రిప్లయితొలగించండి"మన జీవితమంతా మన ఆలోచనల ఫలితమే. మన ఆలోచనలే మన రూపకర్తలు. ఇతరులపట్ల మనకుండే భావాలు మన ఆలోచనల పైనే ఆధారపడి వుంటుంది. ఇది మన స్వభావాన్ని ప్రతిఫలింపజేస్తుంది."
"భగవంతుడు మనకు ఎలాంటి లోటును కలిగించలేదు. లోటు మన మనస్సులోనిది మాత్రమే. సుఖదుఃఖాలు మన మనస్సులోనివే కాని బయటివి కావు. ఇష్టాయిష్టాల ఎన్నికలో సర్దుబాటు తత్వమును కలిగి వుండడం, అవగాహనతో అందంగా మన జీవితాల్ని మలుచుకోగల్గడం మన చేతుల్లో పనే. ఇది సక్రంగా చేస్తే ఆనందం మన దగ్గరే వుంటుంది."
సత్యం! అందుకోండి అభినందనలు, చాలా బాగుందండి.
చాలా బావుంది భారతి గారు.
రిప్లయితొలగించండిరెండు మూడు సార్లు చదివితే కాని అర్ధం కాలేదు. ఇలాంటి విశ్లేషణ విపులీకరణ ఉండటం మూలంగా.. మీ ఈ పోస్ట్ ని అర్ధంచేసుకునే అవకాశం లభించింది. మనసా ధన్యవాదములు.
నేను మిమ్మల్ని ఒకటి అడగవచ్చునా!? మీరు ముక్తేవి భారతి. (అవునా అండీ!)
వెన్నెల గారు!
రిప్లయితొలగించండిమీరు నచ్చి మెచ్చి మీ స్పందన తెలియజేసినందుకు ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి.
వనజా గారు!
రిప్లయితొలగించండిమీకు నచ్చినందుకు, మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి.
ఊహు.... నేను ముక్తేవి భారతిగార్ని కానండి.
భారతి గారు,
రిప్లయితొలగించండిపరిణతి గురించి మీరు వ్రాసిన మాటలు చాలా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. పరిణతి పూర్తిస్థాయి లో ఉండకపోయినా పరిణతి అనే భ్రమ కూడా ఉంటుంది. నిజమే.
డియర్ భారతి గారు, చాలా మంచి విశ్లేషణ.. కాని, ఆధ్యాత్మిక జీవనంలో ఎదుటి వ్యక్తి మనస్తత్వ విశ్లేషణకు తావు వుండదు.. వాళ్ళు ఎలా వున్నారు అనే దాని కంటే మనం ఎలా వున్నాము అన్నది ముఖ్యం. ఆ మన లో నుండే ఇన్ని ఇన్ని రకాల మనస్తత్వాల విశ్లేషణ జరగాలి. మనల్ని మనం దిద్దుకోవాలి. థింక్ పాజిటివ్... ఈ వాక్యం ఎంతో మేలు చేస్తుంది .. ఈ సందర్భంగా ఒక కధ గుర్తు వస్తుంది..నా బ్లాగ్ లో వ్రాస్తాను లెండి. బట్, థాంక్ యు.......
రిప్లయితొలగించండిలక్ష్మీదేవి గారు!
రిప్లయితొలగించండిపరిణితి పూర్తిస్థాయిలో ఉండకపోయినా పరిణితి అనే భ్రమ కూడా ఉంటుంది. సరిగ్గా చెప్పారు. ధన్యవాదాలండి.
రుక్మిణిదేవి గారు! ఈ పోస్ట్ నా మరియు నా మిత్రుల మద్య జరిగిన సంభాషణ. ఒక విధంగా ఇది ఓ సద్గోష్టి. ఈ కాలంలో చాలామంది ఏదో ఒక ముసుగు వేసుకునే జీవిస్తున్నారు. అందులో నేనూ అతీతురాల్ని కాను. కానీ, సత్యం గ్రహించి నన్ను నేను సరిదిద్దుకుంటూ నా ముసుగుల్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తూ, ప్రశాంతంగా జీవనపయనం సాగిస్తున్నాను. మానవులు ఈ ముసుగులు తొలగించుకుంటే రామదర్శనం (దైవదర్శనం) అవుతుందని కభీరుదాసులాంటి సంతులు చెప్పారు. వారు చెప్పిందే నేను నా అవగాహన మేరకు ప్రస్తావించాను. ఈ పోస్ట్ చదివి సద్గుణాల ఆచరణలో ఆనందమును ఆస్వాదించాలన్నదే నా అభిమతం. మీ స్పందనకు ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండిభారతి గారూ, మీ పోస్ట్ రెండు చదివాను, సందేహం లేదు విధుషీమణీ....భారతమ్మా
రిప్లయితొలగించండికొంచం మామూలు భాష వాడాలి కదా నా లాంటి వారికోసం , మంచి పోస్ట్ , మీ విశ్లేషణ అనితర సాద్యం.
మెరాజ్ గారు!
రిప్లయితొలగించండిఈ పోస్ట్ మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి.
విదుషీమణీ.......... అమ్మో........నాకు వర్తించదండి.
భారతమ్మా ...........ఆత్మీయమైన పిలుపు. ఆత్మబంధువు పిలుపులా....... ఆనందంతో కళ్ళు చెమర్చుతున్నాయి. హృదయపూర్వక అభివందనములు మెరాజ్ గారు!
చాలా బాగుంది భారతి గారూ!...
రిప్లయితొలగించండినేను ఫేస్ బుక్ మీట్ గురించి కాస్త బిజీగా ఉండి
మీ అమూల్యమైన పోస్టులు చూడలేకపోయాను.....
"ఓ మనిషీ! నువ్వేది నీవెంట తీసుకెళ్ళలేవు. నీవెంట తీసుకెళ్లగలిగేదాన్ని కొంతైనా సమకూర్చుకో" అన్నది బుద్ధుని బోధ. మన వెంట తీసుకెళ్లగలిగినవి దయార్ధమైన ఆలోచనలు,మాటలు, చేతలు మాత్రమేనని ఆయనంటారు. మన మహర్షుల ఉపదేశంకూడా ఇదే. సద్గుణాలే మన వెంట వస్తాయి. అందుకే సద్గుణాలను ఆచరణలో పెడితే చాలు - ఆనందం మనతోనే! మనలోనే!!...మంచి సందేశంతో ముగించారు...@శ్రీ
శ్రీ గారు!
రిప్లయితొలగించండిబిజీగా ఉన్నప్పటికీ ఈ పోస్ట్స్ చూసి మీ స్పందనను తెలిపినందుకు ధన్యవాదాలండి.
భారతి గారు, మీ బ్లాగు బావుంది. దీని ద్వారా ఆధ్యాత్మిక విషయాలు తెలుపుతున్నందుకు అభినందనలు.
రిప్లయితొలగించండివంశీకృష్ణ గారు!
రిప్లయితొలగించండిముందుగా మీకు నా ధన్యవాదాములండి. స్మరణ బ్లాగ్ మీకు నచ్చినందుకు సంతోషమండి.