25, మార్చి 2013, సోమవారం

"ఆహా ... నా నెచ్చలి బహు బుద్ధిశాలి" !




రెండురోజుల క్రితం - 
హరిప్రియ (స్నేహితురాలు) నుండి ఫోన్ ... 'నేనిప్పుడు ట్రైన్లో ఉన్నాను, చిన్నమ్మ (పిన్ని) దగ్గరకు వెళ్తున్నాను, వచ్చాక మాట్లాడతాను. ఓకే నా' !
నిన్న ఉదయం -
తననుండి మరల ఫోన్ ... 'ఇప్పుడే ఇంటికి వచ్చాను, వీలైతే రా, నీతో ఓ విషయం చెప్పాలి.....'!
నిన్న సాయంత్రం తనింటికి వెళ్లగా, తను చెప్పిన విషయం ఏమిటంటే -
ఈ మధ్యనే తన మరదలకి పాప పుట్టింది. పేరు సన్వి. పెద్దపాప పేరు సమన్వి. రెండుసార్లు సిజేరియన్ కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. అదే వారి చిన్నమ్మకు కోపకారణమైంది. ఎంతో సఖ్యతగా ఉండే అత్తాకోడళ్ళ మధ్య ఈ కారణంగా చిరు స్పర్ధ. ఎవరికైన ఒక్కపుత్ర సంతానమైన ఉండాలని, పాపని చూడడానికి ఎవరు వచ్చినా, నా మాట వినలేదు, పున్నామ నరకంనుండి రక్షించే పుత్ర సంతానం లేదని అనడం ... ఆ మాటలకు బాధపడి మరదలు ఫోన్ చేస్తే ఊరు వెళ్లి, చిన్నమ్మకు కౌన్సిలింగ్ చేసి వచ్చాను అని!
ఓహో ... ఏమని కౌన్సిలింగ్ ఇచ్చావో చెప్పుమరి, అని అడగగా -
ఏముందీ, నాతో కూడా చిన్నమ్మ అవే మాటలంది. ప్రియమ్మా! నీవైనా చెప్పు, తల్లితండ్రులను ఉద్ధరించేది కొడుకే కదమ్మా, పుత్రుడే కదా పున్నామ నరకంనుండి రక్షించేది, కొడుకు వలనే కదమ్మా మోక్షమని శాస్త్రం చెప్తుంది, ఇదే నేనంటున్నానని మీ తమ్ముడు, మరదలు నన్ను తప్పు పడుతున్నారు, నేను అన్నదాంట్లో తప్పేం ఉంది? అని అమాయకంగా ప్రశ్నిస్తున్న చిన్నమ్మ మీద కొంచెం కోపం, జాలి కలగగా, ఓపిగ్గా చెప్పాను, అమ్మ ఆలోచన తప్పని!
తనేం చెప్పిందో తన మాటల్లోనే -
"అపుత్రస్య గతిర్నాస్తి' అన్న మాట శాస్త్రంలో ఉన్నమాట నిజమే గానీ, అమ్మా! ఆ మాట ఈ కాలానికి చెందినది కాదు. కొన్నివేల సంవత్సారాలు క్రితం, అప్పటి రాజులు తమ రాజ్యాన్ని పరిపాలించినంతకాలం పరిపాలించి, అటుపై పుత్రునికి రాజ్యాధికారమును అప్పగించి, తమ తమ జన్మలను తామే ఉద్ధరించుకోవాలని అన్నింటిని పరిత్యజించి వానప్రస్థం స్వీకరించేవారు. అటువంటివారు పుత్రుడు జన్మిస్తే కొంతకాలానికి వారికి రాజ్యపరిపాలన అప్పగించి, నిశ్చింతగా తపస్సు చేసుకోవాలని పుత్రున్ని కోరుకునేవారు. అప్పటి కాలధర్మప్రకారం పుత్రుడు ఆవశ్యకమై శాస్త్రంలో చెప్పిన మాట అది. అమ్మా! పుత్రులు లేనివారికి మోక్షం లేనిచో, అసలు భార్యాబిడ్డలే లేని నారద, శుక, సనక, సనందనాది మహర్షులు, శంకరాచార్యులు, షిర్డీ బాబా, రమణులు మొదలగువారికి మోక్షసిద్ధి ఉండకూడదు కదా! అమ్మా! నీకు షుగర్ ఉందని నీవు మందు వేసుకోకుండా తమ్ముడు వేసుకుంటే నీకు షుగర్ తగ్గుతుందా? నీకు ఆకలి వేసినప్పుడు తమ్ముడు భోజనం చేస్తే నీ ఆకలి తీరిపోతుందా? అలానే నీ ప్రారబ్ధకర్మలను నీవే క్షయం చేసుకొని, మోక్షసిద్ధిని పొందాలే తప్ప, పుత్రుడిని కన్నంతమాత్రమున రాదమ్మా. అయితే అమ్మా, ఎంత దుష్టులైన పుత్రున్ని కంటే చాలు, మోక్షాన్ని పొందేస్తారా? మోక్షానికి అర్హత పుత్రున్ని కనడమేనా? "అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం" ఎవరు చేసిన కర్మఫలితం వారికే సిద్ధిస్తుందని శాస్త్రవచనం ఉంది కదా. మనం చేసుకున్న పుణ్యకర్మలు, సాధన బట్టే మోక్షసిద్ధి వస్తుందమ్మా. తల్లితండ్రులను ప్రేమతో చూసుకున్న బిడ్డలు, తాముచేసిన ఈ పుణ్యకర్మవలన తాము ఉద్ధరింపబడతారు. అలానే, తమను ఆత్మీయంగా చూసుకుంటూ, తాముచేయు పుణ్యకర్మలకు సహకరించిన సంతానం వలన తల్లితండ్రులు కొంత ఉద్ధరింపబడతారన్న మాట వాస్తవమే అయినను, అంతమాత్రమునే మోక్షం రాదు. ఇక, పితరుల సౌఖ్యం కొరకు ఆచరించే పితృకర్మలు (శ్రాద్ధములు మొ...) ద్వారా పితరులకు కొంత సౌఖ్యం, పిల్లలకు పితృదేవతలనుగ్రహం దొరుకుతుందే తప్ప, అంతమాత్రమున మోక్షం రాదని చెప్పా!

అబ్బా ... ఇంత చక్కగా ఎలా చెప్పావ్ అని అనగా, 'నీ సాంగత్యంలో అలవడిన పుస్తక పరిజ్ఞానంతో' అన్న తన మాటలింటూ, హృదయపూర్వకంగా ఇలా అనుకున్నాను -

"ఆహా ... నా నెచ్చలి బహు బుద్ధిశాలి" !
                               

21 కామెంట్‌లు:

  1. ఇంతకి ఆ పిన్ని గారు మారారా ?

    రిప్లయితొలగించండి
  2. కొడుకు వల్లనే మోక్షం అని ఇంకా ఈ రోజుల్లో నమ్మే వారున్నారంటే ఆశ్చర్యం గా ఉందండి భారతి గారు. మీ నేస్తం చెపితే ఆవిడ చిన్నమ్మ కన్విన్స్ అయ్యారా?

    రిప్లయితొలగించండి
  3. సజ్జన సాంగత్యం, మిత్ర సాంగత్యం ... ఫలితం కళ్ళే దుటు నే కనబడుతుంది. బహు బాగుగా ఉంది. సంతోషదాయకం .

    రిప్లయితొలగించండి
  4. ఆహా !

    ఇక్కడ కూడా మరో జిలేబీ యే మరి !

    బాగుందండీ టపా !

    'అపుత్రి' యస్య గతిహి సదా న ఆస్తి, సర్వదా న 'ఆస్థి'!

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  5. సంతానం కావాలన్నారు, పుత్ర సంతానమేనని చెప్పలేదు. మధ్యలో వచ్చిన వి ఇవన్నీ. మంచి పని చేశారు. ఆడ పిల్లకూడా మన సంతానమే, ఆమె వారసులు కూడా మన వారసులే.

    రిప్లయితొలగించండి
  6. భారతి గారు. చక్కటి విషయాలను తెలియజేసారండి.

    పుత్రులు లేనివారికి మోక్షం లేనిచో, అసలు భార్యాబిడ్డలే లేని నారద, శుక, సనక, సనందనాది మహర్షులు, శంకరాచార్యులు, షిర్డీ బాబా, రమణులు మొదలగువారికి మోక్షసిద్ధి ఉండకూడదు కదా!....అని చక్కగా తెలియజేసారు.


    రిప్లయితొలగించండి
  7. అజ్ఞాత గారు!
    పూర్తిగా మారారో, లేదో తెలియడానికి కొంతకాలం ఆగక తప్పదు. ఎవరైనా మారడానికి కొంతసమయం పడుతుంది. నా స్నేహితురాలి ప్రయత్నం మంచి ఫలితాన్నే ఇస్తుందని ఆశిద్దాం.

    రిప్లయితొలగించండి
  8. వెన్నెల గారు!
    ఇలా భావించేవారు అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ అక్కడక్కడ ఉన్నారు. నా ప్రియనేస్తం చెప్పినదానికి తన చిన్నమ్మ కన్విన్స్ అయ్యారో, లేదో తెలియడానికి కొంతసమయం పడుతుంది. ప్రస్తుతానికి ఆ విషయంలో ఏమీ అనకుండా మౌనంగా ఉన్నారనే సమాచారం.
    మీ స్పందనకు ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  9. వనజ గారు!
    చల్లని చంద్ర కిరణాలతో వేడి తొలగిపోతుంది.
    కల్పవృక్షంతో దారిద్ర్యం నిర్మూలం అవుతుంది.
    గంగాస్నానంతో పాపం పరిహారమౌతుంది.
    కానీ, కేవలం అసమాన సజ్జనసాంగత్యంతో అవన్నీ ఒకేసారి నివారణ అవుతాయి అన్న శ్రీ రమణుల వాక్కును స్పురణకు తెచ్చింది మీ వ్యాఖ్య.
    మీ స్పందనకు ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  10. జిలేబి గారు!
    మీకు ఈ టపా నచ్చడం సంతోషదాయకం.
    మీ స్పందనకు ధన్యవాదములండి.

    రిప్లయితొలగించండి
  11. సర్ (శర్మగారు)!
    మరింత చక్కగా తెలియజేశారు.
    మీకు నా వందనములు.

    రిప్లయితొలగించండి
  12. అనూరాధ గారు!
    మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి.

    రిప్లయితొలగించండి
  13. చాలా చక్కగా చెప్పారు. అవునులెండి, ఈ రోజుల్లో కూడా ఇంకా అలా అనుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు.ఎవరైనా ఒకటే అని తెలుసుకోటానికి ఇంకా కొంత కాలం పడుతుందనుకుంటా! హృదయానికి దగ్గారగా ఉండేది కూతురు, కంటికి దగ్గరగా ఉండేది కొడుకు. మెల్లిగా వాళ్ళే తెలుసుకుంటారులెండి, 'కంటే కూతుర్నే కను' అని :)

    రిప్లయితొలగించండి
  14. జయ గారు!
    మీరు చెప్పింది నిజమేనండి... ఎవరైనా ఒకటే అని తెలుసుకోవడానికి కొంతకాలం పడుతుంది.
    మీ స్పందనకు మనసార ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  15. పున్నామనరకం
    పునః + నామ + నరకం అంటే మళ్ళీ మళ్ళీ నామం తీసుకునే నరకం అంటే పునర్జన్మ అన్నమాట.
    పుత్రుడు అంటే వారసుడు. మన గుణగుణాలను సంతరించుకున్నవాడు, మన జ్ఞానాన్ని పోలివున్న చతురతను గ్రహించినవాడు. కనుక పుత్రుడు మనల్ని పున్నామనరకం నుంచి తప్పిస్తాడు.
    పుత్రుడు అంటే శారీరక వారసుడు కాదు, బుద్ధిపరమైన వారసుడు. మనం జ్ఞానం పొంది,
    మనలాంటి ఆత్మజ్ఞానులను కొంతమందినైనా తయారుచేస్తేనే మనకు మరుజన్మ నుంచి విడుదల.

    రిప్లయితొలగించండి
  16. పున్నామనరకం అంటే పుత్‍ నామ నరకం అని అండీ.

    రిప్లయితొలగించండి
  17. అయ్యా! శ్యామలీయంగారు,
    పుత్ అంటే ఏమిటో అర్ధం వివరించకోరుతున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాకునూరి వారు ధర్మసందేహాల కార్యక్రమంలో ఈవిషయంపై వివరణ లోగడ ఇచ్చారు. వారు పుం అనే పేరు గల నరకం అని చెప్పారు. పుత్‍ + నామ -> పున్నామ లేదా పుం + నామ -> పున్నామ అవుతుంది. ఈ విషయంలో లోగడ నేను పుత్ అనేది ఆ నరకం పేరు అని విన్నాను. నేనే పొరబడ్డానేమో.

      మీరు అన్నట్లుగా పునః + నామ -> పునర్నామ అవుతుంది కాని పున్నామ కాదు. వేరొక చోట కూడా పునః నామ అని ఇవ్వటం చదివాను. అది పొరపాటు ఆలోచన.

      తొలగించండి
    2. పున్నామ నరకాత్ త్రాయత ఇతి పుత్రః అని పుత్రశబ్దానికి వ్యుత్పత్తి. ఇక్కడ పున్నామ అన్నది పుత్‍+నామ -> పున్నామ అని విడదీయాలి. లేని పక్షంలో పుత్రః అని విగ్రహవాక్యం సిధ్ధించదు. కాబట్టి నరకం పేరు పుత్. దానినుండి రక్షించేవాడు పుత్రుడు. ఈ పుత్ అనే నరకం గురించి వామనపురాణంలో 35వ అధ్యాయంలో విపులంగా ఉంది.

      తొలగించండి
  18. అయ్యా! శ్యామలీయంగారు,
    మీ వివరణ సంతృప్తికరంగా ఉందండి. మీకు నా నమస్సులు.

    రిప్లయితొలగించండి
  19. శ్యామలరావు గారు,
    రమణిగారు,
    మీ వ్యాఖ్యల ద్వారా చక్కటి విషయాలు తెలుసుకున్నాను. ధన్యవాదములు మీ ఇరువురుకి.

    రిప్లయితొలగించండి