మహా మృత్యుంజయ మంత్రం:
అర్ధం :-
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం /
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ //
అర్ధం :-
అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. దో సపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదను గాక!
ఉదయం తెలిసినామె మా యింటికి వచ్చారు. మాటల మద్యలో... ఈ మద్య ఒకరి సూచన ప్రకారం 'మహా మృత్యుంజయ మంత్రం' రోజూ పదకొండుసార్లు చదువుతున్నానండి. కానీ, కొన్ని సందేహాలున్నాయండి. ఎప్పుడో ఒకప్పుడు అందరం మరణించాల్సిందే కదా, మరి ఈ మంత్రమును చదివితే మృత్యువును జయించి ఎల్లకాలం బ్రతికి ఉండలేం కదండీ... మరి అలాంటప్పుడు ఈ మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రమంటారు? అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు? అసలు దోసపండుకు, మృత్యువుకు ఏమిటి సంబంధమో తెలియడం లేదు. అది అడుగుదామనే వచ్చానండీ ... అన్న ఆమెకు, నా అవగాహన మేరకు నేనిచ్చిన బదులిది -
మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదండీ, పునర్జన్మ లేకపోవడం.అంటే ఇకముందు జననమరణాలు లేకపోవడం. అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం. ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి వుండగానే పొందాల్సిన స్థితి. ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం. అది ఎలాగంటారా?
ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి. సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది. జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు. అంటే మాయనుండి విడివడతాడు. పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన వున్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను దేహ ప్రారబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై వుంటాడు. (జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే వున్నను, మాయ విడివడడంతో ఇవి ఏవీ అంటక అత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుండే వ్యక్తి) ముక్తస్థితిలో వుంటాడు. ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు. పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కదండీ.
ఈసరికే మీకు అర్ధమై యుంటుంది, దోసపండుతో ఎందుకు పోల్చారోనన్నది.
ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. ఆ ఆరాధన ఎలాగుండాలంటే -
జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం.
మీకు తెలుసు కదా, ఆదిగురువు శివుడు అన్న విషయం. ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి. అందులో వున్న ఆధ్యాత్మిక రహస్యాలను శోదించండి. శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు -
పంచభూతాత్మకుడు :- శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.
త్రయంబకుడు :- శివుని మూడుకన్నులు కాలాలను (భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు.
నామము :- శివనామం లోని మూడుగీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు, మధ్యబిందువును తురీయావస్థలకు చిహ్నం. అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్ధాలు చెప్తుంటారు, ఈ జగత్తంతయూ త్రిగుణాత్మకమని, మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్మూ, అని సూచిస్తుందని అంటుంటారు. అటులనే శివవిష్ణ్యాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా త్రిమూర్త్యాత్మకమని (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) మధ్యబిందువు ద్వారా మువ్వురూ ఒకటేనని తెలుసుకోమన్న సూచనుందని కొందరంటుంటారు.
విభూతిదారుడు :- సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. అంటే భస్మంగాక తప్పదు. నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం.
త్రిశూలం :- సత్వ రజో తమోగుణాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, మానసిక శారీరక, ఆధ్యాత్మికశక్తులకు, ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం.
నాగాభరణుడు :- సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం. అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు. అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు.
శివున్ని బోళాశంకరుడు అంటారు. ఎందుకంటే, సులభంగా అనుగ్రహిస్తాడు. ఈ అనుగ్రహం కూడా రెండు విధాలు. సంసారబద్ధుడై భోగాలను ఆశిస్తూ ఆరాదించినవారికి వాటిని అనుగ్రహిస్తాడు. జననమరణ చక్రభ్రమణంలో పడిపోకుండా సంసారంనుండి విముక్తిని కోరేవారికి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రాసాదిస్తాడు. పై మంత్రమును మామూలుగా చదివితే అకాలమృత్యువునుండి ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. అలా కాకుండా పారమార్ధిక సాధనగా గ్రహించి ఆరాదిస్తే ముక్తస్థితి లభిస్తుంది. అందుకే శివున్ని లయకారుడు అంటారు. లయకారుడు అంటే లీనం చేసుకోవడం లేదా తనలో కలుపుకోవడం.
శివుణ్ణి ఆరాధించడమంటే శివుని పటంను అలకరించి కాసేపు పూజించడం కాదు. శివుని దివ్యరూపం వ్యక్తపరుస్తున్న ఈ ఆధ్యాత్మిక అంతరార్ధములను అవగాహన చేసుకొని ఆరాధించాలి. ఆ ఆరాధనా కూడా ఏ రీతిలో వుండాలో శివరూమే తెలుపుతుంది. సాధారణంగా శివుడు ధ్యానంలో ఆసీనుడైనట్లు దర్శనమిస్తుంటాడు. ఆ రూపం ద్వారా నిరంతరం బాహ్యప్రపంచమును కాంచే కనులను గట్టిగా కాకుండా అంటి అంటనట్లు మూసి వుంచి, దృష్టిని భ్రూమధ్యాన లగ్నం చేసి అంతర్ముఖులై సత్యంను దర్శించమన్న సూచనను గ్రహించి సాధన చేసినట్లయితే జీవుడు శివుడవుతాడు.
తన రూపం ద్వారా జ్ఞానబోధ చేస్తున్న శివమంత్రం ఎందుకు మృత్యుంజయ మంత్రమైందో ఇప్పుడు మీకు అర్ధమై వుంటుంది.
మనం తరుచుగా వింటుంటాం, మనసెరిగి నడుచుకో, చిత్రాన్ని కాదు చిత్తాన్ని చూడు, శోధించి సాదించు అన్న మాటలను.
ఇలాంటి అంతరార్ధములను తెలుసుకుంటున్నప్పుడు అర్ధమౌతుంటుంది - పెద్దలు పలికే పలుకుల్లో పరమార్ధం.
విన్నపం :- ఆమె ప్రశ్నలకు నేను విన్న, చదివిన వాటివలన నా అవగాహన మేరకు నాకు అన్పించినది ఇలా చెప్పాను. ఈ టపా చదివినవారు ఇందులో ఏమైనా సవరణలు గానీ, ఇంకా ఏమైనా సూచనలు గాని ఉంటే తెలపగలరని ఆశిస్తున్నాను.
భారతీగారు, మీ వివరణ బాగుంది. కాకపోతే త్రివేణి సంగమం అంటే గంగ యమున సరస్వతి నదుల సంగమం అని తెలుసు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లి వచ్చాం. ఎక్కడో అలహాబాద్ లో ఉన్న సంగమమును మన దేహనాడులతో పోల్చారు. దీని గురించి మరికాస్త వివరణ ఇవ్వగలరా?
రిప్లయితొలగించండిశైలజగారు!
రిప్లయితొలగించండిధన్యవాదములు.
చక్కటి ప్రశ్న వేశారు. ఈ త్రివేణి సంగమం గురించి మా మాస్టారుగారు చక్కగా వివరించారు. ఆ వివరణ వీలైనప్పుడు తదుపరి టపా లో తెలుపుతాను.
ఇప్పుడే ఈ పోస్ట్ చూసాను.
రిప్లయితొలగించండిరెండురోజుల క్రితం వచ్చిన పార్వార్డ్ మెసేజ్ ఇది.
ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం. అద్భుతంగా గుడి కడతారు. తీరికగా అలంకారాలు అద్దుతారు. తోచినంతసేపు హాయిగా ఆడుకుంటారు. పొద్దు వాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు. కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటిదారి పడతారు. అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు. ‘అంతగా అయితే, మరునాడు వచ్చి మళ్ళీ కడతాం. పోయేదేముందీ’ అనే ధీమాతో పిల్లలందరూ ‘సొంతిళ్ల’కు వెళ్లిపోతారు
'త్య్రంబకం యజామహే...’ అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశమూ అదే. ‘జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో...ఆత్మీయ బంధాలెన్నింటినో పెంచుకో. ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో. ఆట ముగిసే సమయానికి, వాటిని అదేవిధంగా సునాయాసంగా తెంచుకో’ అని ఆ మంత్రం బోధిస్తుంది.
వాటికి, మనిషికి మధ్య ముడి ‘ఉర్వారుకమివ బంధనం’లా ఉండాలంటుంది. పచ్చి దోసకాయ ముచికకు, దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే- ఆ కాయను పట్టుకు లాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంటుంది. అవి ఒకదాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకొని ఉంటాయి.
అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో, ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగానూ పెనవేసుకొని ఉంటాడు.
పిల్లలు ఇసుక గూళ్ళు కట్టినంత ప్రీతిగా తన, తనవారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు. దోసపండు మిగలముగ్గేనాటికి పరిస్థితి మారుతుంది. ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చటుక్కున విడిపోతుంది. అప్పడు చూస్తే ముచిక గాని, తీగ గాని ఎండి ముదిరిపోయినట్లు ఉంటాయి. అంతవరకు ఆ రెండూ ఒకదానితో మరొకటి గాఢంగా, బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది.
వయసు పడమటికి వాలేటప్పటికి, ప్రతి మనిషీ పసివారి మాదిరే తాను నిర్మించుకొన్న జీవితంపై పట్టు వదిలించుకోవాలి. తుది పిలుపు చెవిన పడేవరకు వదులుగా ఉంచుకోవాలి. ఆ సమయం రాగానే, దోసపండు మాదిరే పాత చిహ్నాలేవీ మిగలకుండా ప్రపంచం అనే తీగ నుంచి విడిపోగలిగిన స్థితికి రావాలి. పసిపిల్లల ధోరణిలోనే ‘మరో గుడి కట్టుకుందాంలే’ అన్నంత ధీమాతో ఈ శిథిలాలయాన్ని నిర్మూలనకు వదిలేయాలి.
సునాయాసంగా మరణించాలని కోరుతూ చేసే ప్రార్థనను పెద్దలు ‘మృత్యుంజయ మంత్రం’గా ప్రకటించడం ఓ విశేషం! ఆ రహస్యం బోధపడితే, మృత్యువును ఆహ్వానించగల స్థితికి మనిషి చేరుకోగలడు. మృత్యువును జయించడం అంటే- చావు లేకుండాపోవడం కాదు... మృత్యుభీతిని జయించడం!
ప్రపంచంతో అన్నింటినీ చివరన తెంచుకోగలిగితే, ‘ఈ ఆత్మ నిత్యం’ అని నమ్మగలిగితే మృత్యుభయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నిశ్చింతగా సొంతింటికి తిరిగి వెళ్లిపోయినట్లు, ఈ అద్దె ఇంటితో అనుబంధాన్ని వీడాలన్నదే ఆ మంత్ర మహోపదేశం! ‘వీడి వెళుతున్నాను’ అనేది అసురీ భావం.
‘అద్దె గృహాన్ని వీడుతున్నాను’ అనేది అమృత భావన! అలా అమృతత్వ స్థితిలోకి చేరుకోవడమే ముక్తి అనిపించుకుంటుంది. మనిషి జీవించి ఉండగానే సాధించాల్సిన స్థి తి అది. అందుకే దాన్ని ‘జీవన్ముక్తి’ అంటారు.
మనుషులందరూ దానికి అర్హులే! ... srinivasa murty chittamuri
_/\_
తొలగించండిమహా మృత్యుంజయ మంత్రాన్ని పరమేశ్వరుడు శుక్రాచార్యులకుపదేశ్ంచాడనీ , ఈ మంత్రాన్నే మృతసంజీవినీ మంత్రమంటారనీ , దీన్నుపయోగించే మృత్యుముఖంలోని రాక్షసులను బ్రతికించేవాడనీ పురాణకథనం .
రిప్లయితొలగించండిమంత్రమంటే వాచ్యార్థం రహస్యం . పైన పెద్దల వివరణలతో
ఏకీభవిస్తూనే , ఇందులో ఇంకేదైనా తంత్రం ఉందేమో అనే కోణంలో కూడా ఆలోచన చేసి , అది మానవ అభ్యుదయానికి ఉపయోగ పడుతుందేమో విబుధులు వివేచన
చేయవలసి ఉంది .
తల్లీ భారతి,
రిప్లయితొలగించండివందనం.
మీరు దయతో ముందుమాట రాసిన నా ఇ.బుక్ మాతా నాస్తి పితా నాస్తి ఈ రోజు కినిగెలో ప్రచురింపబడింది ఈ కింది లింక్ లో చూడగలరు.
http://kinige.com/kbook.php?id=9251