22, జులై 2016, శుక్రవారం

సనత్సుజాతీయం (తృతీయ భాగం)

శ్రీ సనత్సుజాతులవారు దృతరాష్ట్రునికి పొరపాటే మృత్యువనియు, మృత్యువుకు ఆకృతి లేదనియు చెప్తూ, ఇంకా ఇలా వివరిస్తున్నారు - 

మృత్యువంటూ వేరేగా ఏమీ లేదయ్యా. నీవేం చేస్తున్నావో దాన్నిబట్టి ఉంటుందయ్యా...
మృత్యువు ఎక్కడనుండి వస్తుందంటే ...
రాజా!
"క్రోదః ప్రమాదో మోహ రూపస్య మృత్యు:"  క్రోధం వలన, పొరపాట్లు చేయడం వలన, మోహం వలన మృత్యువు వస్తుంది. ప్రమాదమంటే పొరపాటు. తాను చేయవలసింది చేయకుండా, తనకు చేద్దామనిపించింది చేసేస్తే అదే పొరపాటు. ఏది చేయాలో, ఏది చేయకూడదో మనోబుద్ధులకు తెలుస్తుంది. దానిని గ్రహించి నడుచుకోకపోతేకనుక అదే మృత్యువు. ఇటువంటివారు "ఇతః ప్రేతాః" ఇక్కడనుండి వెళ్ళిపోయినవారై (శరీరం వదిలిన వారై) "తత్ర పునః పతంతి" మరల ఇక్కడే పడుతుంటారు. అంటే జననమరణ చక్రంలో తిరుగుతుంటారు.

అటుపై సత్కర్మ దుష్కర్మల గురించి ఇలా వివరిస్తున్నారు శ్రీ సనత్సుజాతులవారు ...


ఓ దృతరాష్ట్రా! మృత్యువు ఉండడం, లేకపోవడం మన కర్మల బట్టే వుంటుంది. "కర్మోదయే కర్మఫలానురాగా" కర్మ ఉదయించినప్పుడెల్లా అంటే కర్మ చేయాలనే తలపు రాగానే, ఆ కర్మఫలం అనురాగం కలిగిన వారౌతున్నారు.  నీవు ఏ దృష్టితో కర్మ చేస్తావో, దాన్నిబట్టి ఫలితముంటుంది. పూజలు హోమాదులు లోకక్షేమం కొరకు చేస్తే పుణ్యకర్మలు అవుతాయి, స్వార్ధంతోగాని, ఇతరులకు అపకారం కలిగించడానికి గాని చేస్తే సత్కర్మలు కూడా దుష్కర్మలే అవుతాయి. ఇచ్చా అరిషడ్వర్గాలతో కలిగినట్టి కర్మలు చేస్తే ప్రారబ్ధాలు తప్పవు, జననమరణాలు తప్పవు, మృత్యువు తప్పదు. కర్తవ్యం నుండి విముఖులు కానటువంటివారై తాము ఏది ఆచరించాలో అది ఆచరిస్తూ, చేయదలచినదంతా చేయకుండా, చేయవలసినవి చేస్తే కర్మ నాశం అవుతుంది, నిష్కామ కర్మ నైష్కర్మ్యసిద్ధి వస్తుంది, మోక్షమొస్తుంది. ఆచరణ యందు బుద్ధి విడిచి వుండి, భగవత్ సమర్పణ బుద్ధితో కర్మాచరణ చేసేవారికి కర్మ అంటదు. 



మన కర్తవ్యాన్ని మనం ఫలాపేక్ష లేకుండా, భగవంతునార్పణ బుద్ధితో నిర్వహిస్తే ఆగామి సంచిత ప్రారబ్ధములనేవి ఉండవు. 

ఇటువంటివారికి మృత్యువు లేనట్లే.

"నేను" అంటే శరీరం కాదయ్యా, నేను అనగా "ఆత్మ". శరీరం వున్నప్పుడు "నేను" అనే ఒకానొక ప్రజ్ఞగా ఉన్నాం. శరీరం వదిలిన తర్వాత కూడా "నేను" అనే ప్రజ్ఞ మాత్రమే ఉంటుంది. దేహ భ్రాంతి ఉన్నవారికే మృత్యువుంటుంది.

ఏది సత్యమో, నిత్యమో, ఏది మిధ్యో గ్రహించి, ఇంద్రియార్ధముల యందు మోహపడకుండా, ఇంద్రియాలతో కూడి మనస్సును వెళ్లనీయకుండా, స్వస్వరూప స్థితిని ఎఱిగి, అందరూ ఆత్మ స్వరూపములే అన్న సత్యాన్ని గ్రహించి తదానుగుణంగా జీవించువారికి మృత్యువుండదు రాజా.

సృష్టిలో ఉన్నటువంటి జీవుడు, సృష్టికి అతీతమైన దేవుడు... వీరు ఇద్దరు ఉన్నట్లు అన్పిస్తుందిగాని, దేవుడి అస్తిత్వంను అంగీకరించి శమదమాది గుణాలు కలిగి, ధ్యానాది సాధనలు చేస్తే, జీవుడే(ఆత్మ) దేవుడనే(పరమాత్మ) అన్న జ్ఞానం కలిగిననాడు తానే అది అవుతాడు. అటువంటివారికి మృత్యువుండదు. అన్నింటికి మన సంకల్పాలే కారణం. అంటే మనస్సే కారణం. మనస్సు ఏది సంకల్పించిందో దాని బట్టి ఉంటుంది. మనస్సు మృత్యువును కల్పించుకుంటే మృత్యువౌతుంది, పరబ్రహ్మమును కల్పించుకుంటే మనస్సు కూడా ఉండదు, పరబ్రహ్మమే ఉంటుంది. రాజా! కామ, క్రోధలోభాది అరిషడ్వర్గములున్నపుడు అవే మదిలో స్థిరపడతాయి కానీ, తానుండడు. ఆ తాను లేకపోవడమే మృత్యువు. మనస్సును ధర్మమార్గమున సత్కర్మాచరణం చేసి, ధ్యానాదులు ఉపాసన చేసి ఆత్మసాక్షాత్కారం పొందితే, శరీరం వున్నను ఆ జీవుడు మోక్షమందున్నట్లే. ముక్తి అనేది శరీరం పోయాక కాదు, ఉన్నప్పుడే పొందాల్సిన స్థితయ్యా. మృత్యువు కర్మ చేత, అజ్ఞానం చేత కల్పించుకున్నదే.

ఆత్మయందు ధ్యానం కలిగియుండి శాశ్వతమూ, నిత్యమూ అయినటువంటి వస్తువునందు మనస్సు నిలిపి, ఈ మిగిలినటువంటివన్నీ మనమెట్లా చేసుకుంటే అట్లా జరుగుతాయనేటువంటి సంగతి గుర్తుండి, మనమెలా సత్కర్మలు ఫలాపేక్షలేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించుకోవాలో అలా ఆచరించుకుంటూ ఉంటే మృత్యువు లేదయ్యా.
అని చెప్తూ, ధర్మాధర్మాల గురించి ఇలా వివరిస్తున్నారు ... ఈ వివరణ తదుపరి టపాలో ... 








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి