12, మే 2021, బుధవారం

నామ - మంత్ర వైశిష్ట్యం

మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఇది ఒకరి ప్రశ్న. 
చింతకాయలు రాలతాయో లేదో గానీ; చింత, చింతలు రాలిపోతాయి.
ఈ ప్రశ్నే కాదు, అప్పుడప్పుడు మంత్రానికి నామానికి సంబంధించి కొన్ని కొన్ని సందేహాలు కొందరిలో...
కొందరు అడిగిన, కొన్ని సందేహాలకు సమాధానాలే ఈ టపా.

ఈ సృష్టి కొన్ని శబ్ధాల అపూర్వ కలయిక. శబ్ధమే సృష్టి యొక్క సారం, ప్రాధమిక లక్షణం. మంత్రాలంటే శక్తివంతమైన శబ్ధతరంగాలు. శరీరం స్థూలమైతే, మనస్సు సూక్ష్మం. స్థూలమైన దానికంటే, సూక్షమైన దానికే శక్తి ఎక్కువ. శారీరిక శక్తి కంటే మానసికశక్తి చాలా గొప్పది. ఈ సూక్ష్మశక్తుల జాగృతికి మంత్ర శబ్ధతరంగాలు తోడ్పడుతాయి. దీని ప్రభావం... మన సూక్ష్మగ్రంధులపైన, షట్ చక్రాలపైన సూటిగా పడి జాగృతం అవుతాయి.

'మననాత్ త్రాయతే ఇతి మంత్రః'
మననం చేయడం వల్ల మనల్ని రక్షించేది మంత్రం.
మంత్రాలు కేవలం పదాల నిర్మితాలు కాదు, శక్తికి ప్రతిరూపాలు. ఋషులు అమోఘ తపశ్శక్తితో, భగవదాదేశంతో పలికినవే మంత్రాలు. విశ్వచైతన్యం దేవుడు/దేవతగా అవతరించినప్పుడు అతి సూక్ష్మంగా కనిపించే అతీంద్రియశక్తే మంత్రం. కొన్ని అక్షరాలా ప్రత్యేక ఉచ్ఛారణే మంత్రం. ఇది బీజాక్షరాలతో కూడినది. బీజంలో ప్రాణశక్తి  దాగి వుంటుంది. ఓంకారం చేర్చి ఆయా దేవదేవతల పేర్లతో బీజాక్షరాలను (ఐం శ్రీం హ్రీం క్లీం... ఇత్యాదివి) కలిపి జపించడంవలన కలిగే ఫలితం అనంతం. మంత్రాన్ని పదే పదే స్మరించడం వలన శబ్ధంలో నుంచి శక్తి ఉద్భవించును. అరణిని మధింప అగ్ని ఎట్లు జనించునో, అట్లు బీజాక్షరాలతో కూడిన మంత్రమును పలుమార్లు జపించుటచేత శక్తి ఉద్భవించును. అప్పుడే మంత్ర సిద్ధి, దేవతా సాక్షాత్కారం అగునని పెద్దలు చెప్తుంటారు. 
అందుకు ఉదాహరణ - 
మంత్రశక్తికి మానవరూపంగా పేరుగాంచిన శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు {(1896 -1990) గోరంట్ల గ్రామం, గుంటూరుజిల్లా} పదిసంవత్సరాల వయస్సులో, శ్రీ బాలాత్రిపురసుందరి మంత్రోపదేశాన్ని స్వీకరించి, ఆరేళ్ళపాటు నిష్ఠతో అనుష్టించి, మంత్రసిద్ధిని పొందారు. శ్రీవిద్యా ఉపాసకులు, మహాభక్తులు. ఒకరోజు మంత్రజపంలో ఉండగా, ఈయనను కలవడానికి కొంతమంది వారింటికి రాగా, ఆ ఇంట్లోనుండి ఓ బాలిక బయటికిరాగా, 'మీ నాన్నగారు లేరా...అమ్మా' అని అడగగా, పూజలో ఉన్నారు, ఒకగంట తర్వాత రండని బదులిచ్చింది ఆ బాలిక. కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తులు మరల వచ్చి మాట్లాడుతూ... మధ్యలో, 'మీ పాప చాలా ముద్దుగా వుంది, ఆ ముఖంలో ఎంత  తేజస్సో' ...అని చెప్పడం... మా ఇంట్లో పిల్లలెవరూ లేరే అని, ఆ వచ్చింది తన ఆరాధ్యదేవతైన బాలాత్రిపురసుందరి అని గ్రహించారు. వీరు కటికదారిద్ర్యాన్ని అనుభవిస్తున్న రోజులవి... ఒకసారి మూడురోజులు నిరంతరంగా అమ్మమంత్రాన్ని జపిస్తూ, ఇంట్లో అన్నీ నిండుకోవడంతో మంచినీళ్ళనే నైవేద్యంగా అర్పించి, నీరసంతో సొమ్మసిల్లగా, అమ్మవారే స్వయంగా ఆయనకు అన్నం తినిపించి, "ఇకమీదట నీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాను నాయనా" అని అభయమిచ్చింది ఆ తల్లి. 
మనకి తెలియకపోవచ్చు కానీ, అక్కడక్కడ ఇలాంటి భక్తులున్నారు.

భగవంతుని స్పురణ, స్మరణ, చింతనలకు దోహదపడే ఏ కర్మ అయినా మనస్సు శుద్ధికి ఒక సాధనే. 
                     

కలి ప్రభావం ఎంత ఎక్కువగా వున్నా, దాని బారినుండి తప్పించుకునే ఉపాయం మాత్రం చాలా సులువైనది, సరళమైనది, సూక్ష్మమైనది. కలియుగ వాసులకు చక్కటి దివ్యౌషధం - భగవన్నామపానం.
                     

పూర్వం ఋషులు యోగులు మహర్షులు ఏళ్ళ తరబడి సాధనలు చేయగా పొందే స్థితిని, కలియుగంలో కేవలం భగవన్నామ స్మరణ ద్వారా పొందవచ్చు. భవసాగరాన్ని అవలీలగా దాటవచ్చు. భవరోగాలనుండి సులభంగా విముక్తులం కావొచ్చు. అయితే అందుకు నామం పట్ల అమిత విశ్వాసం వుండాలి. 
"భగవన్నామ స్మరణతో భవసాగరాన్నే దాటవచ్చు, ఆ చిన్న ఏరుని దాటలేవా"... అన్న పండితుడి మాటలు విని, రోజూ నీటిపై నడుస్తూ, సకాలంలో పండితునికి పాలుపోసే పల్లెపడుచు విశ్వాసాన్ని గమనించండి. అలానే చోఖామేళా సాధనను చూడండి -
అనాటి కట్టుబాట్లు ప్రకారం చోఖామేళా అనే భక్తునికి దేవాలయ ప్రవేశ అర్హత లేదు (అస్పృశ్యుడని). ఆ కారణంచే తన తోటలో పాండురంగడికి చిన్న గుడి నిర్మించి, మంత్రాలు రాకపోయిన నామజపంతో అర్చించేవాడు. ఆ భక్తికి మురిసి పండరీనాధుడు చోఖామేళా నివేదించిన పెరుగును ఆరగించేవాడు. ఒకరోజు ఇంటికి గోడ కడుతుండగా, ప్రమాదవశాత్తూ గోడకూలి ఇతనితో పాటు మరికొందరు కూలీలు అసువులు బాసారు. ఆ ఇటుకుల మధ్య నుండి శవాలను తీసాక, వాటిని గుర్తుపట్టడం కష్టమైంది. భక్తుడైన చోఖామేళా పార్ధివదేహాన్ని తీసి సమాధి కట్టాలనుకున్నవారికి, ఆయన శరీరాన్ని గుర్తించడం ఎలా?... అని అనుకుంటున్న సమయానికి, అక్కడకు వచ్చిన నామదేవ్ "ఏ అస్థికల నుంచి విఠలా, విఠలా అనే నామం వినిపిస్తుందో, అదే చోఖామేళా దేహం" అని చెప్పడంతో, స్థానికులు ఆ దేహాన్ని గుర్తించి సమాధి చేసారు. అస్థికలే నామ స్మరణ చేసేయంటే ఎంతటి సాధకుడో కదా. (ఈ సమాధి ఆలయంకు ఎదురుగానే ఉంది).

మంత్రాలు మనో ప్రక్షాళనకు ఉద్దేశించబడినవే. మనశ్చాంచల్యాన్ని అరికట్టడానికి, తగినశక్తి సామర్ధ్యాలను సాధించడానికి సరైన మార్గం మంత్రజపం/నామ స్మరణం . 

మనస్సు నిరంతరం ఏదో ఒకటి చింతించకుండా వుండదు. అది దాని స్వభావం.  పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది. అది ప్రకృతి నియమం. అందుకే మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడుఆలోచనలు చేరుకుంటాయి. అనేక విషయ వాసనలతో
నిండిపోతుంది. కావున నామం/ మంత్రం ద్వారా మనస్సుని తిప్పగలిగితే, అంటే అంతర్ముఖమైతే విషయ చింతన తగ్గుతుంది. 

ఎన్నో బాధ్యతలు, మరెన్నో సమస్యలు, అననుకూల పరిస్థితుల నడుమ సాగుతున్న సగటు గృహస్థులం. సంసారం సజావుగా సాగే వారికి, సంసారాన్ని త్యజించిన సాధవులకు జపధ్యానాలు గానీ, తీరికే దొరకని  మాకెలా సాధ్యమౌతుంది? 

హు.....భగవంతుని స్మరించడానికి సమయమే ఉండదు...ఇలా సమయం దొరకడం లేదని వాపోయేవారు ఒక్కసారి తమని తాము పరిశీలించుకొండి...తమ దినచర్యలో ఎంత సమయాన్ని అనవసర విషయాలకై వృధా చేస్తున్నారో గమనించండి. ఫోన్ మాట్లాడడానికి, టి.వి చూడడానికి, షికార్లు తిరగడానికి, కాలక్షేప కబుర్లుకు సమయముంటుంది కానీ, భగవన్నామ స్మరణకు మాత్రం సమయం ఉండదు కదా.
ఒకటి గుర్తించండి - గృహస్థులు రోజులో కొద్దిసమయం సాధనకు కేటాయిస్తే వచ్చే ఫలితం, రోజంతా సాధన చేసే సాధువుల ఫలితంకు సమానంగానే వుంటుంది. 'నిరంతరం భగవన్నామన్ని గానం చేసే నారదుడి కన్నా, ఉదయం నిద్ర లేస్తున్నే ఓసారి, తింటున్నప్పుడు ఓసారి, రాత్రి నిద్రపోయేటప్పుడు ఓసారి భగవన్నామన్ని స్మరించే రైతు గొప్పవాడు' అని పెద్దలు చెప్పిన కధ గుర్తు చేసుకొండి. మనస్సుంటే మార్గం వుండదా? అభ్యాసం చేస్తే ఏది సాధ్యం కాకపోదు. సంసార విధులను నిర్వర్తిస్తూ కూడా, మనస్సును భగవంతునిపై ఉంచడం అలవర్చుకోవచ్చు...ప్రయత్నించండి మరి. 
అలానే ఎక్కడో చదివిన ఓ కధను ఇక్కడ ప్రస్తావించాలని ఉంది. 
ఒక రోజు, ఓ ఆవు అడవిలో గడ్డి మేస్తుండగా, వచ్చిన పులిని చూసి పారిపోతూ, పులి బారినుండి తప్పించుకోవడానికి ఆ ఆవు ఒక నీళ్ళులేని, బాగా బురదగా ఉన్న చిన్న చెరువులో దూకేసింది. ఆ ఆవును తరుముకుంటూ వస్తున్న ఆ పులి కూడా ఆ తొందరలో బురదగా ఉన్న ఆ చెరువులో దూకేసింది. 
ఆ రెండు ఎంత ప్రయత్నించిన, ఆ నీళ్ళు లేని బురదతో ఉన్న ఆ చెరువులో నుండి బయట పడటం వాటి వల్ల కాలేదు.
ఆ పులి, ఆవు పైకి పంజా విసరాలని శతవిదాల ప్రయత్నించి విఫలమై, ఆ బురదలో నుండి తప్పించుకోలేక నిస్సహాయతతో "ఇప్పుడే నిన్ను చంపి తినేయాలని ఉంద"ని అంది కోపంగా.
అప్పుడా ఆవు, పులిని చూసి నవ్వి, ”నీకు యజమాని ఎవరైనా ఉన్నారా"? అనడిగింది.
పులి, ”ఏం మాట్లాడుతున్నావు. ఈ అడవికి యజమానిని నేనే! నాకు నేనే కదా యజమానిని” అని గర్వంగా గాండ్రించింది.
అప్పుడా ఆవు, ”నువ్వీ అడవికి రాజువే కావచ్చు. కానీ, ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకోలేని స్థితిలో ఉన్నావు కదా”అన్నది...నిదానంగా!
పులి, ”నీ పరిస్థితి అంతే కదా. నువ్వు కూడా ఈ బురదలో కూరుకుని ఉన్నావు కదా, ఆకలితో చస్తావు కదా”అన్నది.
అప్పుడా ఆవు,”నేను చావను”అన్నది నమ్మకంగా.
"ఈ అడవికి రాజునైన నేనే ఈ బురదలో కూరుకుని పోయి బయటకు రాలేక పోతున్నాను. నువ్వొక సాధుజంతువవు, బలహీనురాలివి, నీవు ఎలా బయటకు వస్తావు? నిన్ను ఎవరు రక్షిస్తారు” అన్నది పులి.
నిజమే, నన్ను నేను రక్షించుకోలేను. కానీ నా యజమాని నన్ను రక్షిస్తాడు. సూర్యాస్తమయం అవ్వడంతో, నేను ఇంటికి చేరక పోవడంతో, నన్ను వెతుక్కుంటూ వస్తాడు. నన్ను ఈ బురదనుండి పైకి లేపి నన్ను రక్షించి, మా ఇంటికి నన్ను తీసుకువెడతాడు.”అని  మెల్లగా చెప్పింది.
పులి స్థబ్దురాలై, దిగాలుపడిపోయింది.
సూర్యాస్తమయం కాగానే, ఆవు చెప్పినట్లు, దాని యజమాని వచ్చి, ఆవు దురవస్థ చూచి, ఆ బురదలో నుండి దానిని పైకి తీసి.  ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఆవు, యజమాని దయపట్ల ఎంతో కృతజ్జత మనస్సులోనే చెప్పుకుంది. ఆవు, దాని యజమాని, పులి దురవస్థకు చింతించారు. కానీ దాని దురహంకారం వారిని దానిని దగ్గరకు చేరనివ్వలేదు

దీనిని ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే - ఆవు శరణాగతి చేసినవారికి ప్రతీక. పులి సామాన్య మానవునిలో ఉన్న అహంకారపూరిత మనస్సుకు ప్రతీక. యజమాని మనం నమ్మిన భగవంతుడు.  బురద మన చుట్టూ ఉన్న ఆకర్షణలతో కూడిన మాయా ప్రపంచం. పులి ఆవును తరుముకు రావడం మన జీవిత పోరాటం అన్నమాట.
జీవిత పోరాటంలో అలసిపోయి, ఏమీ చేతకాక, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడే దైవాన్ని ప్రార్దించడం కాక, దైవం ఉన్నాడు అని ఎల్లప్పుడూ విశ్వసిస్తూ, దైవ నామస్మరణతో మనం శరణాగతి అయితే, దైవమయిన ఆ యజమాని జీవన సమరంలో మనం ఓడిపోతున్నప్పుడు,  నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు, ”నేనున్నాను” అంటూ వచ్చి మనలను పంకిలం నుండి లేవదీసి ఈ భవబంధాల నుండి విముక్తిని ప్రసాదిస్తాడు. 

ఓ కధను ఆధ్యాత్మిక కోణంలో విశ్లేషించడం బాగుంది. ఇది వ్రాసిన రచయితకు 🙏

నేను శివ భక్తురాల్ని. నిరంతరం శివ స్మరణమే. కష్టసుఖాలు సహజమని తెలుసు. కానీ ఈమధ్య బాధలసుడి...కష్టాలు చుట్టుముట్టేస్తున్నాయి. మీరు మతం మారితే, ఈ బాధలు తగ్గుతాయని కొందరు ప్రలోభపెడుతున్నారు. మనస్సు ఆశ పడుతుంది. మరోప్రక్క చిన్న గుంజాటన...ఏం చేయను... మతం మారనా? మంత్రం మార్చనా? నిజంగా నామ స్మరణముకు శక్తి ఉందంటారా?
ఈ మధ్యనే నాకు తెలిసిన ఒకామె నుండి వచ్చిన మెసేజ్ ఇది. మెసేజ్ బట్టి తను ఇబ్బందుల్లో ఉందని అర్ధమై, ఫోన్ చేసి మాట్లాడాను. కుటుంబ స్పర్ధలు, ఉమ్మడి ఆస్తుల గొడవలు, వయస్సురీత్యా బి.పి షుగర్ లాంటి బాధలు...దీనికి తోడు తన భర్తకు కరోనా.  
జీవితమన్నాక కష్టసుఖాలు సహజమేనని మీరే అన్నారు కదా. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి గానీ, ఇలా దిగులు పడడం మంచిదా? మతం మారితే కష్టాలు పోతాయా? ఆ మతంలోవారికి కష్టాలు రావా, లేవా? వారికి కరోనా రాదా? రాలేదా? బాధలో ఏదేదో ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. జవాబు మీకే దొరుకుతుంది. దైవ మంత్రం పట్ల, నామం పట్ల విశ్వాసాన్ని సడలనీయక, మరింత జపించండి. పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని విశ్వాసాన్ని సడలనీయకండి. మార్కేండేయుడిని యమపాశం నుండి తప్పించింది శివ మంత్రం కాదా? ద్రౌపదిని వస్త్రాపహరణం నుండి కాపాడింది కృష్ణ నామం కాదా? చిన్నతనంలో ఎన్ని కష్టాలు అనుభవించినా... హరి మంత్రాన్ని విడువక ప్రహ్లాదుడు, నారాయణ మంత్రంతో దృవుడు ఏ స్థితిని పొందారో గుర్తుకు తెచ్చుకొండి. వారిని మించిన కష్టాలా మనవి? మాధవుడే మానవునిగా జన్మించాక కష్టాలు ఎదుర్కోక తప్పలేదు. అలాంటిది ఎన్నో జన్మల ప్రారబ్దాలను మోస్తూ పుట్టిన మనకి కష్టాలు ఉండవా? 

ఆమె కాదు...ఆమెలా కొందరు ఇలానే భావిస్తారు. 
బాధలకు బెదిరిపోకూడదు. ​మనస్సును పరిపరి ఆలోచనలతో పరుగులు పెట్టించి వేదనను పెంచుకునేకంటే,  
బాగుచేసేందుకే బాధలొస్తున్నాయని భావిస్తే, విచారం తగ్గదా? అద్భుతమైన నగలా తయారవ్వడానికి ముందు బంగారం నిప్పులో ఎంతలా కాలిందో, ఎన్ని సమ్మెటపోట్లను భరించిందో గుర్తించండి. ఒక శిల, ఎన్ని ఉలి దెబ్బలు తిని దైవ విగ్రహంలా మారిందో ఆలోచించండి. నెగ్గి నిలబడే శక్తినిమ్మని కోరాలే గానే కృంగిపోకూడదు. 
                       

ఒకరంటారు - ఎంతలా ప్రార్ధించిన భగవంతుడు పలకడం లేదని. కానీ, వారు చేసిన ప్రార్ధన త్రికరణశుద్దిగా ఉందో, లేదో గుర్తించరు. మనస్సు చలించేవారికి, మాటిమాటికి సందేహించేవారికి, కుతర్కం చేయువారికి ఏ మంత్రమూ ఫలించదు. సాధకులకు శ్రద్ధ, విశ్వాసం ప్రధానం. యాంత్రికంగా జపం చేయకూడదు. యాంత్రికంగా చేస్తే ... మనకి , టేప్ రికార్డర్
కి తేడా ఉండదు కదా. సుందర చైతన్యానందులవారు అన్నట్లు - "పరిపూర్ణ విశ్వాసంతో కదలని ప్రార్ధనలు పరమాత్మను చేరలేవు. స్పందన లేని సాధనలు ప్రతిస్పందన నెలా దర్శిస్తాయి? ఆర్తి లేని భక్తి యొక్క ఆర్తనాదమును అచ్యుతుడు ఆలకించడు".  
విశ్వాసంతో ప్రార్ధిస్తే అనుమానంతో ఎదురుచూడకండి. 

ఒకోసారి త్రికరణశుద్దిగా మంత్రజపం చేసిన, ఎంతో తపనగా నామ స్మరణం చేసినా, కొన్ని ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు. అప్పుడు మన ప్రయత్నంకంటే, ప్రారబ్ధం బలీయంగా ఉందని గ్రహించాలి. విత్తనం, వేరు కనబడకపోయినా వృక్షం, ఫలం కనిపిస్తాయి. అలాగే - కారణమైన  ప్రారబ్ధ కర్మలు గోచరించకున్నా, వాటి ఫలాలు అనుభవాలుగా వస్తాయి. ఈ కర్మ-ఫల సంధానకర్త ఈశ్వరుడు.  ప్రారబ్ధ కర్మలు అనుభవించక తప్పదు. ఇటువంటప్పుడే భగవన్నామ స్మరణ విడవకుండా ఉండి, సంపూర్ణ శరణాగతి పొందితే భగవత్ అనుగ్రహముతో అనుభవించేఖర్మనుకూడా తప్పించుకోవచ్చు, మన ప్రారబ్ధాలను చాలా వరకూ క్షయం చేసుకోవచ్చు.
                    

మహాభారత యుద్ధంలో అర్జునుడిపై వేసిన బాణాలు అఖండమైన శక్తి వంతమైనవి. కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం చేత వాటి శక్తి పూర్తిగా పని చేయలేదు.
ఒకసారి శ్రీకృష్ణుడు యుద్ధానంతరం అర్జునుని రథాన్ని దిగమని చెప్పగా, అర్జునుడు దిగుతాడు, పిమ్మట కృష్ణుడు దిగుతాడు. అప్పుడు రథం భయంకరమైన శబ్దాలతో, అతి భయంకరమైన మంటలతో కాలిపోవడం చూసి అర్జునుడు భయంతో వణికిపోతుండగా, శ్రీ కృష్ణుడు చెపుతాడు ఇలా -
"ఇంతవరకు నేను ఈ రథంలో వున్నంతకాలం, ఎవరి బాణములు ఏమి చేయలేకపోయాయి. ఇప్పుడు నేను దిగాను... వాటి పని అవి చేస్తున్నాయ"ని!
మన కర్మలు కూడా అంతే, భగవంతుడు మనయందు ఉన్నత కాలం, ప్రారబ్ధ కర్మల ఫలితములను కొంతవరకే మనల్ని తాకుతాయి, వాటిని ఎదుర్కొంటాం, పూర్తిగా అవి అనుభవంలోనికి రాకుండా దగ్ధమైపోతాయి. 
అందుకే నిత్య నామస్మరణతో, భగవంతున్ని మనలో నిలుపుకోమని పెద్దలు చెప్తుంటారు.

ఈ దేవుడు గొప్పవాడా... ఆ దేవుడు గొప్పవాడా... లేదా దేవత గొప్పదా?  భక్తి మార్గం గొప్పదా... ధ్యాన మార్గం గొప్పదా?  ఈ మంత్రమా...ఆ మంత్రమా...ఏది గొప్పది?
రాముడా... శివుడా... కృష్ణుడా... అమ్మవారా ???
                    

ఊహు...ఈ మీమాంస వద్దు. అందరూ  ఏకదైవమైన పరబ్రహ్మ వ్యక్తరూపాలే. ఏ రూపంలో కొలిచినా దేవుడు ఒక్కడే. అలానే, అన్ని మార్గాలు భగవంతున్ని చేరుకోవడం కోసం మార్గ నిర్దేశం చేసినవే. అన్ని భగవంతుని అనుగ్రహసారం వచ్చినవే. ఏది ఎక్కువా కాదు, ఏది తక్కువా కాదు. ఎవరి అర్హతకు అణుగుణముగా వారిని ఆ మార్గంలో నిలుపుతాడు. ఎవరిని ఆరాధించిన, ఏ మార్గాన్ని అనుసరించిన చివరికి అనంత హృదయవాసంలో అణగవలసిందే. 
                         

7 కామెంట్‌లు:

  1. కురుక్షేత్ర సంగ్రామంలో
    కృష్ణభగవానుడు జ్ఞానోపదేశానికి నాందిగా శంఖాన్ని పూరించాడు. క్షీరసాగరమధనంలో వచ్చిన ఆ శంఖం వలే మనలో కూడా నామం లేదా మంత్రం ద్వారా చేసే మనో మధనం నుండి జ్ఞానం పుడుతుందని ఎవరో చెప్పగా విన్నాను. మంచి టపా. నామం మరియు మంత్రం గురించి ఎంతో బాగ చెప్పారు.🙏

    రిప్లయితొలగించండి
  2. జోగరావు13 మే, 2021 8:06 AMకి

    భారతీ గారు, నాకు గురుసమానులు ఒకరు రామ రక్షా స్తోత్రాన్ని రోజుకు పదకొండుసార్లు పదకొండు రోజులు చేయమని చెప్పేరు. నేను చేయడం ప్రారంభించాను. ప్రారంభించాక పనుల్లో ఆటంకాలు పరులతో అవమానాలు ఇంట్లో అశాంతి. పారాయణం ఆపేసాను. ఒకసారి కాదు మూడుమార్లు ప్రయత్నించాను. అవే అనుభవాలు. భయంతో ఆపేసాను. బహుశా రామున్ని సేవించే భాగ్యమూ అర్హత నాకు లేవేమోనండి. మీరేమంటారు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జోగరావు గారు, ఇటువంటి అపోహలకు మొగలిచెర్ల అవధూతగారు ఎంత చక్కటి బోధ చేసారో పరిశీలించండి.

      మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు, తాము ధ్యానం నుంచి లేచివచ్చిన తరువాత... ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం గురించి అప్పుడప్పుడు శ్రీధరరావు దంపతులకు బోధిస్తూ వుండేవారు..

      ఒకసారి రామనామం గురించి, ప్రభావతి గారు...శ్రీ స్వామివారితో మాట్లాడుతూ..."నాయనా! రామకోటి వ్రాసిన వాళ్ళకు చాలా కష్టాలు వస్తాయని విన్నాను. స్వయానా మా ఆడపడుచును చూసాను. ఆమె ఎంతో శ్రద్ధగా రామకోటి వ్రాసి, పూర్తిచేసింది కానీ, ఆమె కుమారుడు ఆరు సంవత్సరాల వయసు వాడు, సరిగ్గా శ్రీరామనవమి నాడే మరణించాడు. నేనూ ఓ పది పదిహేను పుస్తకాలు రామ నామం వ్రాసాను.అదేమిటో ...ఆ సమయంలోనే, అంతులేని కష్టాలు మమ్మల్ని చుట్టుముట్టాయి. భయపడిపోయి, అంతటితో రామకోటి వ్రాసే ఆలోచన మానుకున్నాను!" అన్నారు.

      అప్పటిదాకా ప్రభావతిగారు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్న శ్రీ స్వామివారు, పక్కున నవ్వారు. అలా నవ్వుతూనే కొద్దిసేపు వున్నారు. ఆ తరువాత గంభీరంగా మారిపోయారు. "అమ్మా! రామనామం అంటే ఏమనుకున్నావు? అది అగ్ని! అగ్ని తల్లీ! ఆ అగ్నిలో సర్వపాపాలూ భస్మం కావాల్సిందే. జన్మ జన్మల పాపాలను హరించివేసే ముక్తిదాయకమైనది. ఒక కరకు బోయవాడిని మహర్షిగా మార్చిన మంత్రం. వానరుణ్ణి దైవంగా మలచిన మహామంత్రం. నామరహితమైన పరబ్రహ్మస్వరూపాన్నీ
      అనుభూతిని ఎవరూ దర్శించలేరు, పొందలేరు. అది మహా మహా యోగులకు తప్ప అన్యులకు సాధ్యం కాదు. అందుకు మానవోత్తముడూ, అవతారపురుషుడు, రావణుడి బారి నుండి లోకాలను రక్షించిన దైవమూ అయిన రాముడి రూపాన్ని, రామనామమును, తారకానికి ప్రతిబింబంగా మలచుకున్నాము. ఒక గురి, ఒక లక్ష్యం, ఒక ఆకారం, ఒక ధ్యేయం లేనిదే మంత్రజపం చేయలేరు సాధారణ మానవులు".

      "ఇక రామకోటి విషయానికి వస్తే...నీ శ్రద్ధాభక్తులను దైవం కూడా పరీక్షిస్తాడు". ఈ వ్యక్తి, నిజంగా శరణాగతి పొందాడా? లేదా? అని పరీక్షిస్తాడు. దైవం పెట్టే పరీక్షలు కఠినంగా ఉంటాయి. చలించకూడదు. ఒకసారి నువ్వు సర్వస్య శరణాగతి పొందావా...నిన్ను ఆ దైవమే అక్కున చేర్చుకుంటాడు".

      "అమ్మా! ప్రహ్లాదచరిత్ర, గజేంద్రమోక్షం, ఈ రెండూ భాగవతము లోని ముఖ్య ఘట్టాలు. మీరు చదివే వుంటారు. ప్రహ్లాదుడు ఆ నారాయణుడిని తన పసి ప్రాయం నుంచే శరణు వేడాడు. అందుకు మహావిష్ణువు అన్ని ఆపదల నుండీ అడుగడుగునా అతడిని కాపాడాడు. అదమ్మా సర్వస్య శరణాగతి అంటే! అది అహంకార రహిత భక్తి!
      ఇక గజేంద్రుడు తాను అహంకరించినంత కాలం, విష్ణుమూర్తి కన్నెత్తి చూడలేదు. గజేంద్రుడి అహంకారం నశించి, శరణు పొందిన తరువాతే తాను వచ్చాడు. ఇది పశు భక్తి!అర్ధం అయిందా?"

      "ఏదీ! ఇందాక నీ ఆడపడుచు కుమారుడి గురించి చెప్పావే... ఆ బాలుడికి పసిప్రాయం నుంచే వ్యాధి ఉంది. అందులోంచి విముక్తి కలిగించడమే అతనికి, ఆవిడకు శ్రేయస్కరము. అది తెలుసుకోలేక, తల్లి కనుక ఆమె బాధపడటంలో అసహజం లేదు కానీ; ఆ బిడ్డను శ్రీరామనవమి నాడే తీసుకుపోవటమన్నది ఉత్తమగతులు ప్రసాదించటానికే. ఆ బిడ్డ వైకుంఠధామం చేరివుంటాడన్నది నిర్వివాదాంశం.
      మరో సంగతి...రామకోటి వ్రాస్తే, కష్టాలు చుట్టుముడతాయని భయపడ్డానన్నావే. రామకోటి వ్రాయని వారికి కష్టాలు లేవా తల్లీ? భగవన్నామం నమ్మి జపించి వ్రాసిన వారికి ఏ కష్టాలూ ఉండవు. ఒకవేళ ప్రారబ్ధాన్ని బట్టి వచ్చినా, అవి తాత్కాలికంగానే ఉంటాయి. ఒకరకంగా అవి వారికి శ్రేయస్సునే కలిగిస్తాయి. దాదాపు అందరు భక్తుల కథలూ చదివే వుంటారు మీరు. ఈ విషయాన్నే తేట తెల్లంగా తెలుపుతాయి వారి చరిత్రలు...అవునా"?

      "రామకోటి వ్రాస్తే కష్టాలు చుట్టుముట్టాయని వాపోయావు కదా తల్లీ! నీకు అలా వ్రాయడానికి అర్హత వుందో... లేదో, ముందుగా భగవానుడు పరీక్షిస్తాడమ్మా. అసలు ఈ జన్మకు నువ్వు ముక్తిమార్గం వైపు పయనించే అర్హత లేదనుకో. భగవన్నామాన్ని చేత పట్టుకుని కూడా, చిన్నపాటి వ్యాధులొచ్చాయనో, లేదా కుటుంబంలో సమస్యలు వచ్చాయనో, ఇవేవీ కాకుంటే, ఇతరులు చెప్పిన కల్పిత మాటల ప్రభావం చేతనో, చేతిలో వున్న దివ్య నామాన్ని వదిలి, ఈ లౌకిక విషయ వాసనల్లో చిక్కుకుపోతావు. ఈ వ్యాధులు, ఈ కుటుంబ సమస్యలు, ఇవన్నీ...ప్రతీ గృహస్థుకూ వుండేవే. మానసిక అశాంతి అనేది అందరికీ వుంటున్నదే. కొత్తగా రామకోటి వ్రాసినంతమాత్రాన అవి రావు సరికదా, ఆ సమస్యల తీవ్రత తగ్గించి, మానసిక ప్రశాంతతను చేకూర్చే మహత్తర నామం...రామనామం తల్లీ!".

      "వద్దు అమ్మా, వద్దు! లేనిపోని శంకలు పెట్టుకొని, ఆ దివ్యనామాన్ని వదలకు! నిష్ఠతో ప్రారంభించు! చేత పట్టుకున్న ఆ రామనామాన్ని వ్రాయడం మొదలుపెట్టు! కోటి పూర్తి చెయ్యి! అది ఒక్కటీ వున్నా, దైవం కరుణ పూర్తిగా ఉన్నట్లే! దైవ కరుణ లేకుండా, ఎన్ని అష్టైశ్వర్యాలు వున్నా వ్యర్ధమే తల్లీ!" అని చెప్పారు.

      మీ సందేహానికి సమాధానముగా స్వామి వారి ఈ బోధ చాలనుకుంటాను జోగరావు గారు.

      తొలగించండి
  3. జోగరావు13 మే, 2021 2:26 PMకి

    భారతీ గారు,
    మీ సమాధానం చదువుతుంటే తెలియని భావొద్వేగం. కళ్ళ వెంబడి ధారలు. నా అపోహ తొలగించారు.
    అమ్మా!
    చాలామందికి నా అనుభవాలు చెప్పాను. భయంతో చేయడం ఎందుకు వదిలేయమని చెప్పేవారు. కానీ, లోలోపల ఏదో దిగులు. ఇంతకాలానికి మీ ద్వారా రామానుగ్రహం అందుకున్నాను. 🙏
    శ్రీరామ రామ రఘునందన రామ రామ
    శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ |
    శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
    శ్రీరామ రామ శరణం భవ రామ రామ ‖

    శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
    శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి |
    శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
    శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే ‖

    రిప్లయితొలగించండి