4, ఏప్రిల్ 2023, మంగళవారం

భగవంతుణ్ణి మనమా, మనల్ని భగవంతుడా... ఎవర్ని ఎవరు పట్టుకోవాలి?

భగవంతుడు మనల్ని పట్టుకోవాలా? భగవంతుణ్ణి మనం పట్టుకోవాలా?

ఇది క్రిందటి టపాలో పద్మగారి ప్రశ్న. 

ఇందు గలడందు లేడని
సందేహం వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదికి జూచిన
అందందే కలడు.....
సర్వాంతర్యామి... 
ఎక్కడని వెతకగలం?
అంతర్యామి...
పట్టుకునే శక్తి మనకు ఉందా?
భగవంతుణ్ణి మనం పట్టుకోలేం కానీ, భగవంతుడు ఉన్నాడన్నది సత్యం. మనల్ని పట్టుకు నడిపిస్తున్నడన్నది సత్యం. ఆయన మనల్ని పట్టుకునే వున్నాడు, మనల్ని పట్టుకున్న ఆయన్ని గుర్తించడమే ఆధ్యాత్మికత. ఆ సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికే శోధన, సాధన... అని వాట్సప్ లో తనకి బదులిచ్చాను. వెన్వెంటనే తన నుండి ప్రశ్నల పరంపర.
ఒక చేతితో సంసారమును, మరో చేతితో భగవంతున్ని పట్టుకోవాలన్న రామకృష్ణ పరమహంస మాటలపై మీ అభిప్రాయం? మనం పట్టుకోలేమనుకుంటే ఆయన ఎందుకు పట్టుకోమని చెప్పినట్లు? 
త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య కబీర్ తదితరులు భక్తితో పరమాత్మను పట్టుకొని పరమపదించి ముక్తి పొందలేదా? 
ఆధ్యాత్మికత అంటే ఏమిటి? శోధన సాధన ఎలా చేయాలి? 
అర్థమైంది తన మనోస్థితి. ఆ ప్రశ్నలకు నాలో కదలాడే భావనలను తనకి అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలా అని, ఓ స్పష్టతకై ఆలోచిస్తూ... ఈలోగా కొందరి మిత్రుల అభిప్రాయం తెలుకుంటే బాగుంటుందనిపించి, వార్ని అడిగాను - భగవంతుణ్ణి మనమా...మనల్ని భగవంతుడా... ఎవరు ఎవర్ని పట్టుకోవాలి? అని!
'భగవంతుడు మనల్ని పట్టుకోడు, భగవంతుడునే మనం భక్తి ద్వారా సాధనల ద్వారా పట్టుకోవాలి. అందుకు గురువు అత్యవసరం. భగవంతునికి భక్తునికి వారధిగా గురువు ఉండాల్సిందే' అని కొందరు, 'మనల్ని భగవంతుడు పట్టుకోడు, అవతార పురుషులు, కారణజన్ములు, జ్ఞానుల లాంటివార్నే భగవంతుడు పట్టుకుంటాడు. వాళ్ళ ద్వారా భగవంతుణ్ణి పట్టుకునే అవకాశం మనకి కల్పిస్తాడు'...ఇది మరొకరి భావన. 'ఈ భౌతిక ప్రపంచం ఓ పెద్ద మాయాజాలం. ఈ సంసారం ఓ మహా సముద్రం. లేచిన దగ్గర నుండి పడుకునేంతవరకు పనులు చేయడానికే సమయం సరిపోవడం లేదు. ఈ ప్రాపంచిక ప్రపంచంలో పారమార్ధిక జీవనానికి మనుగడ లేదు. రెండూ భిన్న రహదారులు, భిన్న జీవన విధానాలు. మనం బలహీనులం కాబట్టి మనం దైవాన్ని గానీ, దైవం మనల్ని గానీ  పట్టుకోవడం ఎలా సాధ్యమౌతుంది'...ఇది మరొకరి మాట. మా అమ్మాయి (అనూష)ను అడగగా, ఏమాత్రం ఆలోచించకుండా, 'భగవంతుడే మనల్ని పట్టుకు నడిపిస్తున్నాడు. నా జీవితమే చూడు, ఎన్నో మలుపులు...ఊహించనివి, ఆశించనవి... ఏదో శక్తి నన్ను నడిపిస్తుంది. ఆ విశ్వాసంతో నడుస్తున్నాను. అయితే బుద్ధి అనేది మనకుంటుంది కదా, దాని సహాయంతో మన నడత సరిగ్గా ఉండేటట్లు చూసుకుంటే చాలు. భగవంతుణ్ణి పట్టుకునే శక్తి మనకెక్కడిది? భగవంతునికి నచ్చేలా మనముంటే, ఆ పట్టుకునేవాడే ఏదో క్షణాన్న పూర్తిగా తనవైపుకు తిప్పుకుంటాడు. అన్నమయ్య, రామదాసు లాంటివార్ని త్రిప్పుకోలేదా'? అని బదులిచ్చింది.
ఇదే ప్రశ్న నా పుత్రున్ని (అనుదీప్)ను అడిగా...'అమ్మా? అంతా దేవేచ్ఛ. ఆయన నడిపిస్తున్నాడు. ప్రతీది అంగీకరిస్తూ, దైవ స్ఫురణతో మన పనిని మనం ప్రశాంతంగా చేసుకుపోవడమే. దొంగ పోలీసును పట్టుకుంటాడా? పోలీసు దొంగని పట్టుకుంటాడా? ఎవర్ని పట్టుకునేశక్తి ఎవరికున్నట్లు? సింపుల్ లాజిక్'...అంటూ సింపుల్ గా చెప్పాడు. అందరి అభిప్రాయాలు ఆలోచింపజేసేవే. 

పద్మగారు పశ్నలకు నాకున్న చిరు అవగాహనతో బదులివ్వడానికి ప్రయత్నిస్తున్నాను. తప్పులుంటే పెద్దలు మన్నించి సరైన అవగాహన కల్పిస్తారని ఆశిస్తున్నాను. 
భగవంతుడు మనల్ని పట్టుకోడు... 
ఈ మాటతో నేను ఏకీభవించలేను. ఈ సమస్త సృష్టి సర్వేశ్వరుని సృజనే. భగవంతుని శక్తిచే ఈ జగత్తు నడుస్తుంది. 
కేనోపనిషత్తులో, అమరత్వాన్ని గురించి చూచాయగా ఎఱిగిన శిష్యుడు ప్రశ్నిస్తాడు - 'ఏ శక్తి మనల్ని నడిపిస్తుంద'ని .
కేనేషితం పతతి ప్రేషితం మనః కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తః|
కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుః శ్రోత్రం క ఉ దేవోయునక్తి||
ఎవ్వనిచే మనస్సు విషయాలపై పడుతుంది? ఎవనిచే ప్రేరేపింపబడి ముఖ్య ప్రాణం తన పనులను నిర్వహిస్తుంది? దేనిచే ప్రేరేపింపబడి మాట్లాడుతున్నాం, వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం?
దీనికి గురువుగారు ఏం చెప్తారంటే -
శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణః|
చక్షుషః చక్షురతిముచ్య ధీరాః ప్రేతస్మాత్ లోకాత్ అమృతా భవంతి||
అది ఆత్మ. దాని శక్తిచేతనే చెవి వింటుంది, కన్ను చూస్తుంది, జిహ్వ మాట్లాడుతుంది, మనస్సు గ్రహిస్తుంది, ప్రాణాలు పనిచేస్తాయి. ఈ ఇంద్రియాల నుండి ఆత్మను వేరేగా చూసే ధీరులు, ఈ ఇంద్రియబద్ద లోకంనుండి బైటపడి అమృతత్వాన్ని పొందుతారు. ఈవిధంగా పరమాత్మ శక్తే మనల్ని పట్టుకు నడిపిస్తుందని తెలుస్తుంది.
దీనినే శ్రీరామకృష్ణ పరమహంస వారు ఒక విశ్లేషణతో చెప్తారు, ఒక కుండలో నీరు పోసి, బియ్యం వేస్తే, అవి ఉడికి, అన్నం తయారుకావడానికి  కారణం క్రింద అగ్ని అయ్యేటట్లు, శరీరమనే కుండలో మనస్సు, బుద్ధి, ఇంద్రియాదులు పనిచేయడానికి కారణం ఆత్మ శక్తి. అదే భగవత్ శక్తి. ఈ శక్తితోనే ఇవన్నీ నడుస్తున్నాయని తెలుసుకోవాలంటారు. ఇప్పుడు ఆలోచించండి పరమాత్మ మనల్ని పట్టుకు నడిపిస్తున్నాడా లేదా? 
                      

మరి, భగవంతుడు మనల్ని పట్టుకోలేదనడానికి తావెక్కడ?

భగవంతుణ్ణి మనం పట్టుకోవాలా?
భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప మనం భగవంతుణ్ణి పట్టుకోలేం.  
                     

ఎవరికి సాక్షాత్కరించాలో ఆత్మే ఎన్నుకుంటుంది అని అంటుంది కఠోపనిషత్తు. అంటే ఎన్నుకోవడం మన ప్రయత్నాలతో, సాధనతో ముడిపడి లేదు. భక్తులు చెప్పే భగవదేచ్ఛ అన్నా, కర్మయోగులు చెప్పే దేవేచ్ఛ అన్నా, మహర్షులు చెప్పే ఈశ్వరేచ్ఛ అన్నా ఇదే. ఆయన ఇచ్ఛ ఉంటే ఆయనే పట్టుబడతాడు. 

భాగవతం దశమ స్కంధములో ఉలూఖల (ఉలుకల) బంధనమనే ఓ అద్భుత లీల ఉంది. గోపికలంతా కృష్ణుని అల్లరి గురించి యశోదకు చెప్పినప్పుడు, యశోదమ్మ ఎలాగైనా కృష్ణుని పట్టుకొని అక్కడవున్న రోలుకి కట్టేయాలని చాలా ప్రయత్నిస్తుంది. 
                      

కట్టడానికి శక్యం కాని తనని, కట్టివేయాలని పట్టుదలతో, తంటాలు పడుతూ తల్లి చేస్తున్న ఎడతెరపని ప్రయత్నం చూసి, అయ్యో! అమ్మ నన్ను పట్టుకోడానికి ఇంతలా ప్రయత్నిస్తుంది కదా, నేను యశోదమాతకు పట్టుబడాలని అనుకొని పట్టుబడతాడు. తనకి తాను భగవంతుడు పట్టుబడాలని అనుగ్రహిస్తేనే తప్ప పట్టుకోలేం అంటున్నది భాగవతం. 
                  

తల్లి యశోద కృష్ణునితో, నిన్ను పట్టుకుందామంటే, ఎవరికీ చిక్కవట కదా... నేను నిన్ను పట్టుకోవాలని పట్టుదలతో పట్టుబడితే నీవు తప్పకుండా అందుతావు...కృష్ణుని నోటిలో విశ్వ ప్రదర్శన చూసినా, అన్నీ మరిచి మాయలో పడి అంటుంది.  అలాగే మనం కూడా ఏమనుకుంటామంటే, చాలా సాధన చేస్తున్నాం, భక్తితో భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం... గురువును ఆశ్రయించి ఉన్నాం... ఎప్పటికైనా భగవంతుణ్ణి పట్టుకోగలం అని! కానీ, ఈ భావన మాత్రమే సరిపోదు. అలాగని మనం కలత పడాల్సిన పని లేకుండా మనకి కూడా ఎలా తనకి తాను భగవంతుడు పట్టుబడతాడో యశోదమ్మను పరిశోధిస్తే, ఆ సూక్ష్మతత్వం అర్థమవుతుంది. 
                       

కృష్ణుని గురించే అనుక్షణం తపన, హృదయం నిండా అనన్య ప్రేమ, నిరంతర స్ఫురణ, శరణాగతి భావన, పట్టుబడతాడనే పరిపూర్ణ విశ్వాసం వుండి, ఆమెలా ప్రయత్నిస్తే యశోదమ్మకు పట్టుబడినట్లే, తనకి తానై పట్టుబడతాడు. భగవంతుణ్ణి అనుమతి లేనిదే ఎవరూ ఏమీ చేయలేరు. భగవంతుని అనుగ్రహం లేనిదే ఎవరూ ఏమీ సాధించలేరు. 

సాధన ద్వారా పట్టుకోగలం అనుకుంటే అది మన మనో మాయే. మనం చేస్తున్న సాధన ఆత్మ దర్శనానికి కాదు, చిత్తశుద్ధికి. 

మన ప్రతిబింబం కనిపించాలంటే అద్దం శుభ్రంగా ఉండాలి. అలానే ఆత్మ దర్శనం కావాలంటే మన హృదయం నిర్మలంగా ఉండాలి. మనస్సును వాక్కును ఏకం చేసి భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ నిష్కపటంగా ఉండాలి. మనం చిత్తశుద్ధితో ఉంటే చాలు, మిగిలినదంతా ఆ భగవంతుడే మన ద్వారా చేయించుకుంటాడు. 

గొడ్డలి కట్టెలను కొడుతుంది, అది గొడ్డలి గొప్పతనం కాదు. కలం గ్రంథాలను వ్రాస్తుంది, అది కలం గొప్పతనం కాదు. మనం మంచి పనులు చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, అది మన గొప్పతనం కాదు. అన్నింటికీ కర్త అయిన ఈశ్వరునిదే ఆ గొప్పతనమని, మనం కేవలం ఈశ్వరుని చేతిలో పనిముట్లం అన్న భావనతో సర్వకర్మలను, కర్మాఫలాలను ఈశ్వరుని యందు వదిలి భక్తుడు ఉన్నప్పుడు చిత్తశుద్ది అలవడుతుంది. 
                      

పామరుడు అయిన, పండితుడు అయినా సరే, తాను చేసిన ప్రతీ కర్మకు ఇప్పుడో, అప్పుడో, ఎప్పుడో ఫలం అనుభవించాలి. కనుక విచక్షణతో కర్మలను ఆచరించాలి.  దైవానికి కాదు, కర్మకు భయపడాలి.  దైవం క్షమించినా కర్మ వదలదు, కర్మ ఫలితం అనుభవించాల్సిందే. 
జీవించినంతకాలం కర్మ చేయక తప్పదు. కర్మ ఫలితం తప్పదు. మరి కర్మ ఫలం అంటకుండా ఏం చేయాలి? 
కర్మ ఎరుకతో చెయ్యి, లేకపోతే కర్మే ఎరుకులోకి తీసుకువస్తుంది అంటారు తాత్వికులు.
ఒకసారి మన ఋషులు తెలిపే సంప్రదాయాలను పరిశీలిస్తే, ఆధ్యాత్మికతను దైనందిక జీవితంలో ఎంత చక్కగా ముడిపెట్టి చూపించారో తెలుస్తుంది.
నదులు, చెట్లు, పుట్టలు... అన్నింటినీ పూజించే పద్దతి ద్వారా అన్నింటా దైవం ఉన్నాడనే భావం నెలకొల్పారు. గాలి - వాయుదేవుడు, నిప్పు - అగ్నిదేవుడు, వాన - వరుణదేవుడు, భూమి - భూదేవి...ఇలా ప్రతీ దాంట్లో భగవంతుని ఉనికి అనుభవంలోకి తెచ్చుకోమంటుంది సనాతన ధర్మం. ఆ ఉనికిని అనుభవంలోనికి తెచ్చుకుంటూ చేసే కర్మలు ఈశ్వరునికి పూజలు అని అన్నారు మహర్షులు. ఎవరు ఏపనిలో ఉన్నా దైవస్ఫురణతో చేయాలి.
                      

స్నానం చేస్తున్నప్పుడు - మనలో చెడు వాసనలను శుభ్రం చేసుకుంటున్నాను
బిడ్డకు స్నానం పోస్తూ - దైవానికి అభిషేకం చేస్తున్నాను
ఇల్లు ఊడ్చుతూ - భగవంతుణ్ణి నాలో ప్రతిష్ఠించుకోవడానికి హృదయాన్ని పరిశుద్ధం చేస్తున్నాను
వంట చేస్తూ - దైవానికి నైవేద్యం సిద్ధం చేస్తున్నాను
కూరగాయలు తరుగుతూ - నాలో ఉన్న కామక్రోదాధి దుర్గుణాలను జ్ఞానమనే కత్తితో తరుగుతున్నాను
భర్త పిల్లలు తదితరులకు వడ్డిస్తూ - దైవానికి ఆరగింపు చేస్తున్నాను... 
ఈ రీతిలో ప్రతీ పనిని దైవసేవగా, దైవ స్ఫురణతో సాగిస్తే, ఇంతకంటే సాధన వేరొకటి వుంటుందా అని అంటారు సత్య సాయిబాబా వారు. ఏ పని చేస్తున్న, 'నేను చేస్తున్నాను' అనే అహంకార భావనని దివ్యత్వంలో లీనం చేసి పడే శ్రమను ఒక నివేదనగా భగవంతునికి అర్పించడం అత్యుత్తమ భావన. దైనందిక కార్యక్రమంలో భగవంతుణ్ణి ఉనికి లోనికి తెచ్చుకోవడానికి, నిష్కామ కర్మకు ఇదో చక్కని ప్రక్రియ.
                     

రామకృష్ణ పరమహంస వారు చెప్పిన ఓ చక్కటి కథ గుర్తుకొస్తుంది.
నిరంతరం అంతా రామేచ్ఛ అన్న భావనలో ఉండే  ఓ సాలెవాడు, ఒకరోజు రాత్రి నిద్రపట్టక ఆరుబయట కూర్చొని భగవత్ నామజపం చేస్తున్నాడు. అదే సమయంలో ఆ దారిలో వచ్చిన దొంగలు, మూటలు మోయలేక ఈ సాలెవాన్ని తమతో పాటు నడవమని, ఆ మూటలు ఆయనపై వేసి తీసుకెళ్తుండగా, రక్షకభటులు రావడంతో ఆమూటలను, సాలెవాన్ని వదిలి దొంగలు పారిపోయారు. ఈ సాలెవాన్ని రక్షకభటులు న్యాయాదికారి ఎదుట హాజరు పర్చగా, ఎప్పుడూ అంతా రామేచ్ఛ అన్న భావనలో ఉండే సాలెవాడు 'రామేచ్ఛ వలన అంతవరకు మగ్గం నేస్తున్న నేను అలసి పడుకుందామనుకుంటే, నిద్ర పట్టక నామజపం చేసుకుంటూ ఆరుబయట కూర్చున్నాను. రామేచ్ఛ వలన అటుగా వచ్చిన దొంగలు, వారు మోస్తున్న మూటలు నాపై వేసి వాళ్ళతో పాటు నడవమన్నారు. రామేచ్ఛ వలన కొంతసేపటికి ఈ రక్షకభటులు వచ్చి నన్ను పట్టుకున్నారు. రామేచ్ఛ వలన ఇప్పుడు మీ ముందు నన్ను హాజరుపర్చారు' అని చెప్పగా, ఇతను సజ్జనుడు విడిచిపెట్టండి అని న్యాయాధికారి ఆదేశించెను. ఈ కథలో మాదిరిగా ప్రతీది ఆధ్యాత్మిక కోణంలో స్వీకరించాలి. ఎదురయ్యే కష్టసుఖాలను కూడా భగవత్ ప్రసాదంగా / దేవేచ్ఛగా భావించడం కూడా భగవత్ ఉనికిని అనుభవం లోనికి తెచ్చుకోవడమే. నేరుగా పట్టుకొలేకపోయినా, ఇలా భగవత్ ఉనికిని గుర్తించడం వలన కొంత పట్టుకున్నట్లే.
                       

అలా ప్రతీ పనిలోనూ భగవంతుని ఉనికిని అనుభవంలోనికి తెచ్చుకోవడమే సరైన ఆద్యాత్మికత. ఇలా అనుభవంలోనికి తెచ్చుకోవడం అంత సులువు కాదు, అందుకు ఎంతో అభ్యాసం, పూర్తి విశ్వాసం, సర్వమూ భగవన్మయంగా చూడగలిగే చిత్తశుద్ధి ఉండాలి. 
                     

ఇక ఆధ్యాత్మికత అంటే ఏమిటో గత కొన్ని టపాలలో తెలపడం జరిగింది కాబట్టి ఇక్కడ సంక్షిప్తంగా చెప్తున్నాను.
ఆధ్యాత్మికత అంటే -
"ఆది నుండి ఉన్న ఆత్మ కథ".
"నిత్యమూ ఆత్మను అధ్యాయనం చేయడం".
"శరీరం, ప్రాణం, మనస్సే కాకుండా ఆత్మ అనే సద్వస్తువు ఉంది అనే జ్ఞానపు ఎఱుక".
"నేను అంటే ఏదో నాకు తెలిపే యోగం".
"ఎఱుక కోల్పోకుండా దైవ స్ఫురణలో ఉండడం"
"బహిర్ముఖమైన మనస్సును అంతర్ముఖం చేయడం".....

ప్రాపంచిక జీవితం, పారమార్థిక జీవితం అని రెండు జీవితాలు లేవు. ఉన్నది ఒకటే జీవితం. ఆధ్యాత్మికత వ్యవహార జీవితానికి అతీతం కాదు. అందులో పార్శమే.
భౌతిక ప్రపంచం పెద్ద మాయాజాలం... మనం బలహీనులం... ఊహూ.....ఈ భావమూ సరికాదు.
                   

భౌతిక ప్రపంచంలో ధర్మపరమైన అనుబంధం వుండాలి. అంతరంగంలో ఆత్మ స్వరూపుడైన భగవంతుడు ఉన్నాడనే స్పృహ వుండాలి. . అసలు భౌతిక ప్రపంచం మాయకాదు. అంతర ప్రపంచం యొక్క కొనసాగింపే భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచమే అంతర ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి దారి చూపిస్తుంది. మాయ అనేది మనం ఏర్పరుచుకున్న అజ్ఞానం. మనం ఈ ప్రపంచాన్ని చూస్తూ, ఇదే సత్యమనుకొని ఏర్పరుచుకున్న అభిప్రాయాలు భావాలు నమ్మకాలు వదిలితే, మాయ వీడుతుంది. 
దేనిని మనం మాయ అంటున్నామో, అది సాక్షాత్ బ్రహ్మమే అని తెలుసుకునేంతవరకు ఆధ్యాత్మిక సాధన పరిసమాప్తం కాదు. 
అలానే, మనం బలహీనులం కావొచ్చు. కానీ, మనం ఎవరి శరణు పొందామో, ఆయన సర్వశక్తి సంపన్నుడని మరిచిపోకూడదు. భగవంతుడు అండగా ఉన్నాడన్న విశ్వాసం మనకున్నప్పుడు బలహీనులమనే భావనకు తావులేదు.
                    

పద్మగారు రామకృష్ణ పరమహంస వారి మాటలను ప్రస్తావిస్తూ... భగవంతున్ని మనం పట్టుకోలేనప్పుడు ఆయన పట్టుకోమని ఎందుకు చెప్పారని అడిగారు.
వైద్యులు తమ దగ్గరకు వచ్చిన రోగులందరికీ ఒకే రకమైన మందులు ఇవ్వరు. రోగులను పరీక్షించి, వారికి ఏ మందు చక్కగా పనిచేస్తుందో గుర్తించి, తగు మందులు సూచించి వాడమంటారు. వాళ్ళకి పలానా మందులు వాడమన్నారు, నేనూ అవే వాడతానంటే కుదరదు కదమ్మా.
అలానే, రామకృష్ణుల వారైనా, రమణుల వారైనా, సద్గురువులైనా మన మనస్సు ఎలాగైతే చక్కగా కుదురుకుంటుందో గుర్తించి, తరించడానికి తగు సూచనలు ఇస్తారు. కొందరికి కర్మ యోగం, కొందరికి భక్తి యోగం, కొందరికి జ్ఞాన యోగం ...ఇలా మన ఉపాసన సౌలభ్యం కోసం పలు మార్గాలు చెప్తారు. ఈ సూచనలు మన మానసిక పరిపక్వత, అభిరుచి బట్టి వుంటాయి. 
                      

ఈ యోగ మార్గాలలో కొంచెం వైవిధ్యం ఉన్నా, ఫలితం మాత్రం ఒక్కటే. అన్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకి తీసుకెళ్లేవే. మనకు అనువైన ఒక యోగపద్ధతిని చిత్తశుద్దిగా అనుసరించి అందులో పరిపూర్ణత సాధించాలి. 
ఈ శరీరం అశాశ్వతమైనదని, మలినమైన అంశాలతో కూడినటువంటిదని శాస్త వచనం. 
ఈ శరీరం మహా దివ్యమైనది, యోగ సాధనకు అనువైనది, పరమాత్మకు ఆలయం వంటిది అనే ఈ మాటలు కూడా శాస్త్ర వచనాలే.
పరస్పర విరుద్ధమైన ఈ మాటలు ఏయే సందర్భంలో ఎందుకు శాస్త్రం చెప్పిందో ఆ ఆంతర్యం గ్రహించాలి. ఈ శరీరమే నేను అని భ్రమిస్తూ, దాని సుఖపెట్టడానికి ప్రయాస పడేవారికి, ఈ శరీరంపై మోహంతో ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తించేవారికి... నాయనా! ఈ శరీరం అశాశ్వతం, ఈ శరీరం నీటి బుడగ లాంటిది, ఈ శరీరమే నీవని భ్రాంతితో దారి తప్పకు అని మొదట మాట చెప్పింది. ఇక రెండవ మాట ఎవరికంటే - ఈ శరీరాన్ని భౌతిక సుఖాలకై పోషించే లాలస లేకుండా, ఈ శరీరాన్ని భగవత్ ఉపకరణగా భావించి, దీనినే ఓ సాధనగా మలుచుకొని, దివ్యత్వం పొందేవారికి చెప్పింది. 
తేనెటీగలు పువ్వుల నుంచి పువ్వులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మకరందాన్ని స్వీకరించినట్లు, మనం నిరంతర జిజ్ఞాసపరులై, జ్ఞానసముపార్జనకి మహర్షులు యోగులు సద్గురువుల నుండి వారి మాటలలో వున్న ఆంతర్యాన్ని, జ్ఞానాన్ని గ్రహించాలి.

త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య తదితరులను భగవంతుడు తన అనుగ్రహంతో తనవైపు త్రిప్పుకున్నాడు. వారి భక్తి అలాంటిది. జ్ఞానంతో కూడిన భక్తి వారిది. 
                        


అనుక్షణం తమలోని అంతర్యామితో అనుబంధం కల్గి వున్నవారు. ఆత్మ జ్ఞానం పొందినవారు. అందుకే అన్నమయ్య "బ్రహ్మ మొకటే, పరబ్రహమొకటే"... అని ఆలపించగలిగారు.  
అంతరంగమున ఉన్న సత్యాన్ని కాంచి,
మనుగేలరా ఓ రాఘవా! 
మరుగేల చరా చర రూప
పరాత్పర సూర్య సుధాకర లోచన
అన్ని నీ వనుచు అంతరంగమున
తిన్నగా వెదికి తెలుసుకొంటినయ్య... అని కీర్తించాడు త్యాగరాగేయుడు.
                  

వారు పరమపదించి ముక్తి పొందలేదు. ముక్తస్థితి పొందే తనువు చాలించారు. ముక్తి అనేది మరణం తర్వాత వచ్చేది కాదు, ముందే పొందేది.
ఇంతటి భక్తి మనలో ఉందా? కన్నప్పలా కన్ను ఇచ్చే భక్తి, రామకృష్ణునిలా అలౌకిక స్థితిలో నృత్యం చేసే భక్తి, రామదాసులా వ్యాకులతతో పరితపిస్తూ గుండె చీల్చుకునే భక్తి మనకుందా?
ఈ ప్రశ్నలు మనమెవరమూ వేసుకోం. ప్రహ్లాదుడు పిలవగానే స్తంభం పగలుగొట్టుకొని నరసింహుడు సాక్షాత్కరించాడు. మరి ఎన్నో లక్షలసార్లు నారాయణ మంత్రజపం చేసిన మనకెందుకు ఆయన కలలోనైనా కానరావడం లేదని మనల్ని మనం ఏనాడైనా సమీక్షించుకున్నామా?
ఏదో కొంతసేపు పూజగదిలో భగవంతున్ని ఆరాధించడం, కొంతసమయం జపం, కొంతసేపు ధ్యానం, సద్గ్రంధాల పారాయణం, వీలైనప్పుడు ఆలయ దర్శనాలకు సత్సంగాలకు వెళ్ళడం...ఇది కాదు భక్తి అంటే. ఇవన్నీ ప్రత్యేక విద్యలను అభ్యసించడానికి అర్హతకై పెట్టిన ప్రవేశ పరీక్షలు లాంటివి.నిజమైన భక్తి అంటే పరమాత్మతో అనుక్షణం అనుబంధం కల్గివుండడం. ఈశ్వరుడు ఉన్నాడనే స్ఫ్రుహతో జీవించడం నిజమైన ఈశ్వరారధన. పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన ధర్మాధర్మాలను గమనిస్తుంటాడు, ఆయన ప్రీతికోసం నేను ధర్మబద్ధంగా జీవించాలనే ఉదాత్త భావన కూడా భక్తే. ఇందుకు కావల్సింది ఎంతో విశ్వాసం, ఆర్తి, శ్రద్ధ. భక్తి ఉన్నవారందరూ భగవంతుణ్ణి ఆరాధిస్తారు. భక్తితో పాటు శ్రద్ధ కలిగినవారు మాత్రమే భగవంతుని అనుగ్రహం పొందుతారు. 
                       

పువ్వులో మకరందం ఉంటే, భ్రమరం దానికదే వచ్చి ఆస్వాదిస్తుంది. అలానే మనలో భక్తి మాధుర్యం ఉంటే, భగవంతుడు తనకి తానే పట్టుబడతాడు. 


12, మార్చి 2023, ఆదివారం

నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి...

                      


భారతీ, 

ఓ మాట చెప్పనా? ఏదైనా కావలిస్తే, అది అమ్మకి చెప్తే, నాన్నకు చెప్పి త్వరగా మన కోరికను తీరేటట్లుచూసేది అమ్మే. అమ్మ ద్వారానే అయ్యగారు దగ్గరకు చేరాలి. ఎంతసేపు రామా, హనుమా...అని మొర పెట్టుకోవడమే తప్ప, అమ్మ సీతమ్మను తలచేవా ఏనాడూ? నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లికి... అని అంతటి రామ భక్తుడే వేడుకున్నాడే... నీవూ అలా వేడుకోవచ్చు కదా... నేను తలచినా, తలవకున్నా, మరిచినా... నా చేతిని వదలవద్దని రామయ్యకు చెప్పు సీతమ్మ తల్లీ... అని అమ్మని అడుగు...అమ్మని ప్రేమతో పట్టుకుంటే, రాముడు నీ చెంతే...ఇక నీకూ ఎంతో నిశ్చింత..... అని చత్కారంగా చెప్తున్న, మిత్రురాలు ఝాన్సి మాటలకు నవ్వుకుంటూ, రామ రామా అని స్మరించడంలో సీతమ్మ కూడా ఉంటుంది కదా, వేరేగా సీతమ్మ అని అనుకోకపోయినా, శ్రీ రామ అనుకోవడంలో సీతమ్మను తలచినట్లే కదా. చిత్ రాముడైతే, చిచ్చక్తి సీతమ్మ. శుద్ధబ్రహ్మము రాముడైతే, శబ్ధబ్రహ్మరూపిణి సీతమ్మ. ఆయన ఆత్మయోగి, ఈమె చిచ్చక్తి. రాముని తోడనే సీతమ్మ. రాముని లోనే సీతమ్మ. వేరు భావం లేదని, అందుకే ప్రత్యేకంగా సీతా అని స్మరించడం లేదని అన్నాను. 

ఊహూ...అది కాదు... నేను చెప్పింది ఏమిటంటే, సీతమ్మ ప్రకృతి. ప్రకృతిని ఆరాధించటం ద్వారానే పురుషుడిని చేరుకోగలం. ఒకసారి కొంతకాలం రామయ్యతో పాటు అమ్మనీ స్మరించి చూడు...ఒక విధమైన హాయి వస్తుంది. సీతమ్మ కోణంలో రామాయణం పరిశీలించి స్మరణలో సీతమ్మ గురించి వ్రాయవచ్చు కదా...ఆ తర్వాత నీ ఇష్టం అని అంది.
నాకోసం చెప్పిన మాటలు వినక మానతానా? రామునితో పాటు సీతమ్మ నామం మదిలో స్మరణం. ఆ సమయాల్లో కొన్నిసార్లు అనిర్వచనీయమైన ధ్యానానుభూతి.

సీతమ్మతో కాసేపు -

అమ్మా! ఇదిగో అప్పటి నుండి నిన్నే చూస్తున్నాను. నిన్ను మాత్రమే చూస్తూ, రామాయణం చదవడం ప్రారంభించాను. సీతోపనిషత్ చదువుతూ, నీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అయినా నా అమాయకత్వం గానీ, లోక కల్యాణార్థమై అవతరించిన ఆదిపరాశక్తి అపరాంశవైన నిన్ను అణుమాత్రమైనా చూడగలనా? 
    
ప్రథమా శబ్దబ్రహ్మమయీ స్వాధ్యాయకాలే ప్రసన్నా,
ఉద్భవా నరకాత్మికా, ద్వితీయా భూతలే హలాగ్రే సముత్పన్నా |
తృతీయా ఈకారరూపిణీ, అవ్యక్తస్వరూపా భవతీతి సీతా 
ఇతి ఉదాహరంతి శౌనకీయే ||
మొదటి రూపం - శబ్దబ్రహ్మమయి రూపం. స్వాధ్యాయకాలంలో ప్రసన్నమవుతుంది.
రెండవ రూపం -  నరకాత్మికా (స్వాతిరిక్తే యేన రమంతే తే నరాః తేషాం కం, తదేవాత్మా స్వరూపం యస్యాః) భగవంతుని కంటే అన్యమైనది ఏది లేదని తెలిసి, ఆ భగవత్ స్వరూపమే తనదిగా, తానుగా, తనలో తాను రమిస్తూ వుండే నరులలోని బ్రహ్మానందమే జగన్మాత స్వరూపం. (నిరావృత సుఖ స్వరూపేణ సకృత్ ఉద్భవా) బ్రహ్మ జ్ఞానులలోని ఆ బ్రహ్మానందరూపిణి ఐన తానే భూమిపై హలాగ్రమున అంటే నాగేటి చాలున ఉద్భవించిన సీత.
మూడవ రూపం - 'ఈ'కారరూపిణి. అవ్యక్తరూపిణి... జగత్తంతా నిండి ఉండే జగదానందకారిణి అని తెలిపింది, శౌనకీయం.

ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తిత్రయం యద్భావసాధనమ్| 
తాధ్భ్రహ్మ సత్తాసామాన్యం సీతా తత్వ ముపాస్మహే|| 
ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులకి యే భావం సాధనం అయిందో, ఆ బ్రహ్మసత్తే సీతతత్త్వము.
(ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులైన మూడింటి స్వరూపమే సీతాదేవి. అంతటా అన్నిటా సామాన్యంగా వ్యాపించి ఉన్న సత్ బ్రహ్మభావాన్ని సాధించటానికి ఈ శక్తి త్రయాన్ని సాధకుడు ఉపాసించాలి. మనిషి తన లోని ఈ మూడు శక్తులు సరిగ్గా ఉపయోగించుకొనకపోతే బ్రహ్మభావాన్ని పొందలేడు)

దేవతలు బ్రహ్మను అడిగారు - "కా సీతా, కిం రూప మితి"| (సీత ఎవరు? ఆమె స్వరూపం ఏమిటి?)

మూలప్రకృతిరూపత్వాత్ సా సీత ప్రకృతిః స్మృతా|
ప్రణవప్రకృతిరూపత్వాత్ సా సీత ప్రకృతి రుచ్యతే||
సీత మూల ప్రకృతి మరియు ప్రణవప్రకృతి అగుటచేత ఈ సీతాదేవి మూలప్రణవప్రకృతి స్వరూపిణి అన్నది బ్రహ్మ వాక్కు.
(మొట్ట మొదట అవ్యక్తపరబ్రహ్మంలో నుండి వ్యక్తమైనది ప్రణవం (ఓం) సీతాదేవియే. అలాగే మొదట ఉద్భవించిన మూలప్రకృతి కూడా సీత స్వరూపమే)

శ్రీరామసాన్నిధ్యవశా జ్జగదానందకారిణీ|
ఉత్పత్తిస్థితిసంహారకారిణీ, సర్వదేహినామ్||
సీతా భగవతీ జ్ఞేయా మూలప్రకృతి సంజ్ఞితా|
ప్రణవత్వాత్ ప్రకృతి రితి వదంతి బ్రహ్మవాదినః ఇతి||
సీతాదేవి శ్రీరాముని సన్నిధిలో ఉండి జగదానందకారిణి అవుతుంది. సమస్త ప్రాణులను సృష్టి, స్థితి, లయములు గావిస్తుంది. కావున ఈమె మూలప్రకృతిగా తెలుసుకోవాలి. ప్రణవరూపిణి యగుటచేత ప్రకృతి అని బ్రహ్మవాదుల భావన.

తల్లీ!
జనకుడికి నాగేటి చాలున దొరకక ముందు, రామచంద్రుణ్ణి మనువాడక ముందు కూడా వున్న మహాశక్తి స్వరూపిణివి కదా...
రాక్షసులు హనుమ తోకకి నిప్పంటించారని రాక్షసాంగనలు ద్వారా విని, దుఃఖితురాలివై అగ్నిదేవుడుని ప్రార్థించి, మంటలు ప్రజ్వరిల్లుతున్నా, ఆ వేడి బాధ హనుమకు లేకుండా చేసిన నీవు, నీవుగా సంకల్పం మాత్రంచే రావణుని వధించగలవు కానీ, రాముడే చేయాలని ఎందుకు తలచావో, మొదట అర్థం కాలేదు. తరచి తరచి ఆలోచిస్తే, అర్థమైందమ్మా ... నీ మనోగతం.  

దేవ మాయేనా నిర్మితవై, అయోనిజవై, యజ్ఞదాత్రిలో నాగేటి చాలున ఉద్భవించి, నరుడుగా పుట్టిన రాముణ్ణి వివాహం చేసుకొని నరకాంతగానే నడుచుకున్న సాధ్విమణివి.

అందుకే అయోనిజగా ఉద్భవించి, నరకాంతగా జీవించి, రాముని భార్యగా నరకాంత ధర్మాన్ని లోకానికి నిరూపించి, ప్రాతివ్రత్యంలో  నిలబడి, రావణున్ని రామునిచే పడగొట్టించినంతవరకు ఓర్పుగా ఉన్నావని! 
                   

రావణుడు పరమ శివభక్తుడు, శాక్తేయుడు, సర్వవేదార్ధ పరిజ్ఞాత... బ్రహ్మ వరాల కారణంగా (దేవతలు, దానవులు, పన్నగులు, యక్షులు, రాక్షసుల నుండి చంపబడకుండ ఉండేటట్లు రావణుడు బ్రహ్మ దగ్గర వరం పొందాడు. మానవులు నుండి చంపబడకుండా ఉండే వరాన్ని కోరుకోలేదు. అప్పుడే మానవుడు వలనే మరణం కలుగుతుందని బ్రహ్మ వాక్యం) 
అంతటి వానిని వధించడానికి విష్ణువే నరునిగా అవతరించాలి. శక్తివైన నీవు రావణ మారణ సంగ్రామానికి నాందివి అయ్యావు. రావణునికి రాముడు మహావిష్ణువని తెలియదు. రావణునికి ఈ సంగతి తెలియాలి. రాముని రూపంలో నరుడుగా జన్మించింది నారాయణుడేనన్నది అందరికీ తెలియాలి. మానవుడు మాధవుడు ఎలా కాగలడో, రాముని జీవన నడవడి ద్వారా ముందు యుగాల వారికి తెలియాలి, బ్రహ్మ వాక్యం నిజం చేయాలి. ఇందుకే కద తల్లీ! మహాశక్తివైన నీవు రావణుని సహరించకుండ సహనంతో ఉన్నదీ...

అయోజనిగా వచ్చి కూడా, రావణాసురుడిచేత బంధింపబడి, అశోకవనంలో రాక్షసస్త్రీలచేత అన్ని బాధలను కేవలం ధర్మరక్షణార్ధమే అనుభవిస్తూ, భర్తను అనుగమిస్తూ, నరకాంతగా నడుచుకోవడం... 

నిజం చెప్పొద్దూ... కొన్ని కొన్ని సందర్భాల్లో రామయ్య కంటే, ఒకింత నీవే గొప్పనిపిస్తుంది తల్లి.

పద్నాలుగువేల మంది ఖర దూషణాదులను చూసినప్పుడు రాముడు కోపించినట్లుగా, రాముని కళ్ళలో ఎరుపు జీరలు వచ్చాయట కానీ, లంకలో పలు రీతుల్లో రాక్షసులు బాధ పెట్టినా, ఏనాడూ నీ కళ్ళు మాత్రం ఎరుపెక్కలేదట కదమ్మా... అందరి పట్లా నీకు కారుణ్యమే...క్షమాగుణ సంపన్నురాలివి తల్లి.

కడగండ్లు పాల్జేసిన రావణుని కూడా రక్షింపదలచి రాముణ్ణి శరణు కోరమని హితవుపదేశించడం... ఎవరికైనా సాధ్యమా?  అందరి హితైషిణివి తల్లి.

రావణ సంహారం అయ్యాక, నీ దగ్గరకు వచ్చిన హనుమ, రావణ సంహారం, రాముని విజయం చెప్పేక, అమ్మా! ఆరోజు నేను వచ్చినప్పుడు ఈ రాక్షస స్త్రీలు ఎంత బాధ పెట్టారో చూసానమ్మా... అనుమతి నివ్వు, వీరిని నా పిడికిలి పోట్లతో చంపేస్తాను అని అనగా, వాళ్ళకి నా రక్ష. నీ ప్రభువు చెప్పింది నీవు చేసినట్లే, వాళ్ళ ప్రభువు చెప్పింది వాళ్ళు చేసారు. వాళ్లనెందుకు చంపడం? అంటూ...వేటగాడు, పెద్దపులి, భల్లూకం కథ చెప్పి వారించిన నీ వాత్సల్యమే వాత్సల్యం. అందుకే అమ్మ అమ్మే. 

అమ్మా! 
శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం, మునులు వచ్చి రాక్షసుల బారినుండి కాపాడమని కోరడం,  రాముడి అభయంను పొందడం, సుతీక్ష్ణ మహర్షిని దర్శించి, కులాసాగా మాట్లాడుకుంటూ 
ప్రయాణం కొనసాగిస్తూ, రాముడికి నీవు చేసిన ఉపదేశం... అమ్మా! నిజం చెప్పొద్దూ.....
మొదట "మీరు మహాత్ములంటూ రాముడితో సంభాషణ ప్రారంభించి, రాముడి సత్యసంధత, దర్మనిష్ఠ కొనియాడుతూ, పూర్వవైరం ఏమీ లేకపోయినా, ఇతరుల ప్రాణాలు తీయడం అనే మూడో వ్యసనం భయంకరంగా ఉంటుందంటూ... క్రూరులైన సరే, మనజోలికి రానంతవరకు వాళ్ళను దండించే హక్కు ధర్మవరులకు ఉండదు కదా...అంటూ నీలో కదలాడిన భయాన్ని దిగులును చెప్తూ, సమయోచితంగా ఓ కథను కూడా చెప్పి, ప్రస్తుతం జటావల్కలాలను ధరించి, తాపస వృత్తి చేపట్టాక, ఆయుధం పట్టడం తగునా... అని చెప్పాలనుకున్నదంతా చెప్పేసి, చివరగా, మీకు ధర్మాన్ని ఉపదేశించే సామర్థ్యం నాకే కాదు, ఎవరికీ లేదు' అని అంటూనే... మీ తమ్ముడితో ఆలోచించి ఏది ధర్మమని అనుకుంటారో అది చేయమని..... ఎంత చక్కగా మాట్లాడావో... అమ్మా! నీకంటే  మృదుభాషిణి ఎవ్వరుంటారు తల్లి? 
                    

లంకా పట్టణంలో అశోకవనంలో శింశుపా వృక్షం క్రింద బంధించి ఉన్న నీతో, 'అమ్మా! నిను తీసుకొని వెళ్ళి రాముడి వద్దకు జేర్చి, ఇప్పుడే నిన్ను దుఃఖం నుండి విముక్తురాలను చేస్తాను, ఓ మంగళప్రదురాలా! నీవు సందేహించక నా భుజంపై కూర్చొమ్మా... అని హనుమ అన్నప్పుడు,  
ఓ వానరశ్రేష్టుడా! నీవంతవాడవగుదువు కానీ, రాముడే వచ్చి రావణుడిని చంపి, విజయం సాధించి నన్ను తీసుకెళ్లినట్లయితేనే ప్రతిష్టాత్మకంగా ఉంటుంది.   దొంగిలికొని పోవదగునే దొరలకు నెందున్ (మొల్ల రామాయణం) ఇప్పుడు నీతో నేను వచ్చేస్తే, రావణుడు నన్ను అపహరించి తెచ్చినట్లుగానే ఉంటుంది.... రావణుడి దొంగతనబుద్ధికి, రాముడి దొరతనంతో బదులివ్వాలని, రాముడు కీర్తిని ఇనుమడించే రీతిలో ఎంత చక్కగా మాట్లాడవో కదా తల్లి. రాముడి కార్యం చెడిపోయే పనులేవీ మనం చేయకూడదు. రాముడు తన పరాక్రమంతో రావణుడుని సంహరించి, నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళితే అది ఆయన కీర్తికి, గౌరవానికి, ప్రతాపానికి తగినట్లుగా ఉంటుంది... ఇది కదమ్మా రాజపౌరషమంటే! భర్త ప్రఖ్యాతే భార్యకు ముఖ్యమని ఎంత చక్కగా చూపించావో తల్లి.
ప్రాతివ్రత్య దర్మాన్ననుసరించి నా అంతట నేనుగా పర పురుషుణ్ణి స్పృశించనని అన్నావు... రావణుడు బెదిరించిన, ప్రలోభ పెట్టినా, రాక్షస స్త్రీలు భయపెట్టినా, మనస్సులో రాముణ్ణే నిలుపుకొని ఓర్చుకోవడం...ఇది కదా ప్రాతివ్రత్యం. రావణుడు, రాక్షసులు నిన్ను ఎంత బాధించిన, అక్కడ నుండి తప్పించుకునే అవకాశం హనుమ రూపేణా వచ్చిన, రాముడే వచ్చి నన్ను తీసుకెళ్ళాలని ప్రకటన చేసి నిలబడ్డావు...ఇది కదా ఓర్పు. అందుకే కదమ్మా, ఇప్పటికీ ఓర్పు అంటే మా అమ్మ సీతమ్మదే అని చెప్పుకుంటున్నాం.
                     

 
ఆ పిమ్మట హనుమ మాటలు బట్టి, హనుమ ఒకింత నొచ్చుకున్నాడని గ్రహించి, నీవు నాకు అత్యంత ఆప్తుడివి అని స్పురింపజేసెలా మాట్లాడి, నీకూ రామయ్యకు, దేవతలకు మాత్రమే తెలిసిన కాకాసురుని వృత్తాంతం చెప్తూ, ప్రియంగా మాట్లాడిన నీకంటే మృదుస్వభావి ఎవరుంటారు తల్లి? 

అమ్మా! 
ఇలా ఎన్నెన్ని చెప్పను... నీకు నీవే సాటి తల్లి.
                      

ఇంతటి సద్గుణ సంపన్నురాలివి కాబట్టే, వాల్మీకి మహర్షి సీతాయః చరితమ్ మహత్..... మహత్తరమైన చరిత్ర నీదని శ్లాఘించారు.

ఆత్మదర్శనం కల్గించి మనిషిని తరింపజేసే మహాశక్తివి. కారణము నుండి వచ్చిన కార్యములన్నీ కారణము కంటే వేరు కానట్లు, మూలప్రకృతి రూపిణి అయిన నీలో నుంచి వచ్చిన అన్ని నామరూపాలు నీవే తల్లి. నిజానికి నీవు ఏకరూపిణి ఐనా, అనేక నామరూపాలతో గోచరిస్తున్నావు.

శక్తిస్వరూపిణివి నీవేనంటూ ... మందా హిమవతః సృష్ఠే గోకర్ణే భద్రకళా, చిత్రకూటే తధాసీతా వింధ్యే వింధ్యాధికారిణీ... అంటూ దేవీ భాగవతం తెలిపాక, వేయి మాటలేలా తల్లీ.

అమ్మా!
ఇంతకు ముందు ఆనందంలోనైన, ఆవేదనలోనైన అప్పుడప్పుడు రామయ్య తండ్రితో ఏదేదో మాట్లాడడం పరిపాటి. ఆపై ఏదైనా తప్పు మాట్లాడితే మన్నించవయ్యా అనుకోవడమూ అలవాటే. కానీ, నీతో ఇలా ముచ్చటించడం ఇదే మొదటిసారి అయినను, మన్నించమని అడగను తల్లి... ఎందుకంటే నీవు అమ్మవు, అప్పుడే మాటలొచ్చిన బిడ్డ మాటలు తల్లికి మురిపమే కదమ్మా.

తల్లీ!
నీవు ఎంతో సౌందర్యవంతురాలివని, లోకోత్తర సౌందర్యవతివని వాల్మీకి మహర్షి మొదలు మొల్ల తదితర కవులెందరో కొనియాడారు. కానీ నిను కాంచే కవి హృదయం నాకు లేదమ్మా... పోనీలే అని కలలోనైనా కానరావు. ప్చ్...
నీ అంతర సౌందర్యం మాత్రం చూసానమ్మా.... అత్యంత అద్భుతం. కానీ, వర్ణించే భాషా సౌందర్యం నాలో లేదని నీకు తెలుసు కద తల్లి.

త్రేతాయుగంలోనే ముందు ముందు యుగాలలో మానవులు ఎలా నడుచుకొని తరించాలో, జీవన వాహినిలో ఎదురయ్యే ఒడిదుడుకులును ఎలా అధిగమించాలో, జీవితమంటే ఏమిటో నన్నది, అనుభవించి చూపించావు కద తల్లి. అందుకే ఎన్ని యుగాలు మారినా, నీవు అందరి గుండెల్లో అందరిదానివై నిలిచావు.

అమ్మా! 
ఏదైనా బాధలో ఉన్నప్పుడు, తెలిసి తెలిసి ఈ జన్మలో ఏ తప్పూ చేయలేదు, మరి ఏ జన్మ పాపమో, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నననో, ఎవర్ని బాధ పెట్టానో...ఇంత కష్టమొచ్చింది అనో...సామాన్య మానవులు తమ తప్పుని తెలుసుకోవడానికి తమలో తాము తర్కించుకుని మాట్లాడినట్లే, నీవు కూడా నీలో నీవు తర్కించుకొని, అరణ్యాలకు వస్తానని నీవు అన్నప్పుడు, రాముడు వద్దన్నప్పుడు, పరుషంగా మాట్లాడినందుకు, అలానే, మాయ లేడిని కోరేక, మరిది లక్ష్మణుడుని కఠినంగా నిందించినందుకే నాకీ వెతలని, వేదనతో ఓ మామూలు మానవకాంతలా పశ్చాత్తాప పడుతూ మాట్లాడడం...
అన్నీ తెలిసినా -
ఓ మాయలేడిని కోరుకుంటూ, రామలక్ష్మణులను పంపడం ...
మాయలవాడి మాటలు నమ్మి భిక్ష పెట్టి మోసపోవడం...
స్త్రీ సహజ చిత్తవృత్తిని ఎంత చక్కగా లోకానికి తెలిపావో కదమ్మా.

అయ్యోయ్యో... జగన్మాతవి, అందర్నీ చూడాలి...అయినా నా ముచ్చట్లతో నిన్ను చాలాసేపు కూర్చోబెట్టేసాను. కృష్ణుడటమ్మా రాసలీలప్పుడు ఒకేసారి  గోపికలందరు చెంతన  ఉన్నాడట. అదెలా సాధ్యమంటే, కృష్ణుడు పరమాత్ముడు, తనను తాను పలు కృష్ణులుగా విస్తరించుకొని, గోపికలందరి దగ్గర ఉన్నాడని చెప్తారు. మరి నీవో... పరాశక్తివి... జగన్మాతవి...నా దగ్గర కూర్చొనే, ఒకేసారి అందర్నీ చూసుకోగలవు. ఇదో భావ సదృశ్యం. ఏమనుకోకు తల్లీ... మరి కాసేపు కూర్చో... చివరగా నీ కళ్యాణ ముచ్చటా విను.
                     

              
అమ్మా! 
నీ తండ్రి జనకుడు బ్రహ్మజ్ఞాని. నీవేవరో తెలుసు...అందుకే నీవు వీర్యశుల్క వంటూ, ఎవరూ ముట్టుకోవడానికి, పట్టుకోవడానికి వీలు కానటువంటి శివధనస్సుని ఎక్కుపెట్టిన వారితోనే నీ వివాహమని ప్రకటించడం... 
                           
రామలక్ష్మణులు విశ్వామిత్రుడు తలపెట్టిన యాగ సంరక్షణ చేయడం, విశ్వామిత్రుడు రామునికి దివ్యాస్త్రాలు అనుగ్రహించడం, సిద్దాశ్రమంలో కొన్ని రోజులు గడపడం అయ్యాక, ఒకరోజు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో, మిథిలా నగరంలో జనక మహారాజు గొప్పయాగం చేస్తున్నాడట, అందరూ వెళ్తున్నారు, మనమూ వెళ్దాం, పైగా ఒకప్పుడు మిధిలాధిపతియైన దేవరాతుడు దేవతల నుండి ఒక ధనస్సును పొందాడు. ధృఢమైన ఆ ధనస్సును వంచి ఎవరూ నారిని సంధించలేరట... దానిని చూద్దాం పదండి... అని బయల్దేరదీసి, దారి పొడుగునా కుశనాభుని నూరుగురు కుమార్తెలు గూనివారయ్యే ఇతివృత్తం, సగరుని వృత్తాంతం, అహల్య వృత్తాంతం ... ఇలా ఒకోచోట ఒకో ఇతివృత్తం చెప్పడం ద్వారా గృహస్థాశ్రమ ధర్మం, వివాహం ఎవరు చేయాలి, ఎలా చేయాలి... వివాహం అయ్యాక ఎట్లా ఉండాలి... అనేక అనేక సూక్ష్మ ధర్మాలను చెప్పకనే చెప్పి, భవిష్యత్తులో రామచంద్రుని యందు ప్రకాశించే సద్గుణాలన్నిటికీ సానబెట్టి, ఓ వజ్రంలా చేసి, మిధిలకు యేతించి, నీ తండ్రికి, వీరు దశరథ మహారాజు పుత్రులని పరిచయం చేసి, శివధనుస్సును చూపమని, రాముణ్ణి చూడమనడం... అనాయాసంగా రాముడు ఎక్కుపెట్టగా ధనుర్భంగం కావడం... అప్పుడు కదమ్మా, నీ వివాహ సన్నాహాలు ప్రారంభమైనవి.

తల్లీ!
తాటకవధ... అహల్యశాపవిమోచనం... శివ ధనుర్భంగం చేసినప్పుడే రాముడు అవతార పురుషుడని గ్రహించి, నీ పాణిగ్రహణ సమయంలో జనకులవారు నిన్ను ఎంతో గొప్పగా పరిచయం చేస్తూ -
                  

ఈమె సీత. నా కూతురు. ఇకనుంచి నీకు ధర్మ మార్గంలో తోడుగా చరిస్తుంది. ఈమె పాణిని గ్రహించు, నీకు భద్రం కలుగుతుంది. ఈమె పతివ్రత, మహా భాగ్యశాలి, నీడవలే నిన్ను అనుసరిస్తుంది...అని అన్నారట కదమ్మా...
 
బ్రహ్మజ్ఞాని అయిన నీ తండ్రి భవిష్యత్ దర్శించారా ఏమిటి తల్లి? 
ఇయం సీతా... ఈమె నాగటి చాలున ఉద్భవించిన సీత. అయోనిజ. నాగటి చాలు రైతు కృషి ఫలింపజేస్తుంది. అలానే నీ కృషిని ఫలింపజేసే ఈమె సీత.

మమసుత... నా కుమార్తె.  నేను కనలేదని నాకూతురు కాదనుకుంటావేమో... ఆకాశవాణి చెప్పింది ఈమె నాకుమార్తె అని!

సహధర్మ చరితవ... నీకు దర్మమార్గంలో తోడుగా చరిస్తుంది... అంటే ధర్మం లేకపోతే ఈమె వుండదు, నీతో చరించదు, నీవు లేకుండా ఉండదు, ఈమెకు భర్తవయినందుకు ఇక నీవు ధర్మ మార్గంలో చరించి తీరాల్సిందే ... ఏం ముడి పెట్టారమ్మా... ధర్మ మార్గంలోనే చరించాలని శాసనమే చేసేశారు.

భద్రం తే... నీకు మంగళము అగుగాక. నిన్ను పెళ్లాడాక భద్రం (శుభమ్) కాకుండా ఎలా వుంటుంది?

ప్రతీచ్ఛచైనాం...ఈమెను పరిగ్రహింపుము. 
(మా అమ్మాయిని ఇస్తున్నాను, పుచ్చుకో...అని కాకుండా, ఈమె సాక్షాత్తు నీ దేవేరి, నీ అన్ని అవతారాల్లో ఈమెనే నీ సహదర్మచారిణి. ఈమెను గుర్తించి స్వీకరించు అన్న భావం ప్రస్పుటింపజేసిన నీ తండ్రి ఎంతటి జ్ఞానియో...)

పాణిం గృహ్ణీష్వ పాణినా...నీ చేతిలో ఆమె చేతిని తీసుకొనుము. ఇక ఈమె రక్షణా బాధ్యత నీదే సుమా అన్నట్లు చెప్పారు కదమ్మా.

పతివ్రతా... ఏ స్థితిలోనైన భర్తనే అనువర్తించే ఇల్లాలవుతుందని, 

చాయేవానుగత సదా... ఎప్పుడూ నిన్ను నీడలా అనుసరిస్తుందని ... (నీవు తండ్రి మాట ప్రకారం ఈ ప్రాయం లోనే విశ్వామిత్రుని వెంట వచ్చిన పితృవాక్య పరిపాలకుడువి అయినట్లే, ఈమె కూడా నా మాటకు విలువనిస్తూ నీ వెన్నంటే ఉంటుందని)...ఏం చెప్పారమ్మా.

రాముడు అరణ్యవాసంకు సిద్ధమైనప్పుడు, ఈ మాటలనే చెప్పి, ఒకింత పరుషంగా మాట్లాడి, రామయ్యను ఒప్పించావు కదా. ఈ ధర్మాచరణ వైశిష్టమే ఉన్నత పథంలో నిలుపుతుందనడానికి తార్కణమై నిలిచావు. ఎంత చక్కటి చరితం తల్లి నీది... 
                   

అమ్మా!
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి...అని, నేను రామ ధ్యానం మరిచిన, నా ధ్యాస మరలిన, నన్ను నిరంతరం అనుగ్రహించమని రామయ్యకు చెప్పు తల్లి... అని చెప్పాలనుకున్నాను కానీ, నిజం చెప్పనా తల్లీ...నీతో ఇలా మాట్లాడుతుంటే, ఏదో భరోసా... ఎంతో భద్రత... ఎనలేని నిశ్చింత. ఇంకా దేనికమ్మా... సిఫారసులు?

అమ్మా! 
నీతో ఇంకా ముచ్చటించాలని ఉంది, అదేమిటో తల్లి, నీ గురించి ఎంత చెప్పినా తక్కువే, తనివి తీరదెన్నటికీ. ఇది అనంతం. అయినా నా పిచ్చిగానీ, తరించడానికి అమృతం అంతా కావాలా... ఒక్క చుక్క చాలదూ.....

25, ఫిబ్రవరి 2023, శనివారం

బ్రోచేవారెవరురా .....

డిసెంబర్ ఇరవై ఒకటిన ఓ సత్సంగ మిత్రురాలు నుండి మెసేజ్... క్షేమమేనా మీరు? కుటుంబ వ్యవహారాల్లో బిజీనా...ఈ మధ్య వాట్సప్ సత్సంగ గ్రూప్ లో గానీ, బ్లాగ్లో గానీ అస్సలు కనిపించడం లేదెందుకని... నిజమే...కొన్ని నెలలుగా బాధ్యతల నిర్వహణల వలన కొంత ఒత్తిడి, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఒకింత నిస్సత్తువ....వెరసి గ్రూప్ లకు, బ్లాగ్ కు కాస్త దూరం. పై మిత్రురాలు మెసేజ్ తో బ్లాగ్ చూడాలనిపించి, నా బ్లాగ్ ఓపెన్ చేసి, కొన్ని టపాలు చదివాను. అలా చదువుతుంటే కొన్ని కొన్ని క్రొత్తగా, అప్పుడే తెలుసుకుంటున్నట్లు... ఈ టపాలు పెట్టింది నేనేనా అన్న సందేహం కలిగింది...నాకు వచ్చిన మరుపు వలన! కరోనా తగ్గిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ లో భాగంగానో, వయస్సు (56) రీత్యనో చెప్పలేను గానీ, నిస్సత్తువ తదితరాలతో పాటుగా చిరు మరపు కూడా జతైంది. అప్పుడప్పుడు నా కుటుంబ సభ్యులు మర్చిపోతున్నావని, కొన్ని కొన్ని సందర్భాలలో అంటున్నా, పట్టించుకోలేదు కానీ, ఆధ్యాత్మిక విషయాలను, విశ్లేషణలను మర్చిపోతుండడం చాలా బాధని కల్గించింది.
ఇలా అయితే క్రమేణా రామ స్మరణ కూడా మర్చిపోతానేమో... ఈ భావన మరింత బాధగా మారింది. అన్నీ మర్చిపోయే స్థితి వస్తే, నన్ను అమ్మా అని కాకుండా రామా అని పిలవమని, నాతో ఏది మాట్లాడినా రామ నామాన్ని జోడించి చెప్పండని నా కుటుంబసభ్యులకు కోరుదామని అనుకున్న, వారు బాధ పడతారేమోనన్న వెరపు. ఏడుస్తూ రామున్నే శరణు కోరాను చాలా రోజులు.
నీ అనుగ్రహంతో, అలవడిన నీ నామ స్మరణతో నా జీవనగమనం సాఫీగా సాగిపోతుంది. ఇలానే శేష జీవితం నీ స్మరణంతోనే ముగించవయ్యా...రామయ్య.
ఒకరోజు నా ఈ బాధను నా మిత్రులకు చెప్పగా, ప్రియంవద అనే మిత్రురాలు అన్నదిలా - ఇదేం పెద్ద సమస్య కాదు, అలాగని చిన్నది కాదు, నిన్ను నీవు ఒత్తిడికి గురి చేసుకోక, కొంచెం ప్రయత్నించు...
నేను ఎక్కడో చదివిన ఓ కథను చెప్తాను...ఆ రీతిలో ప్రయత్నించమని ఈ క్రింద కథను ప్రియా చెప్పింది. ఒక ఊర్లో ఓసారి ఎప్పుడూ వచ్చిన కాపరి కాకుండా, కాపరి కొడుకు గోపి రెండురోజులుగా తమని మేతకు తీసుకువెళ్లడం గమనించిన ఓ ఆవు, "ఏంటి రా గోపి, బడికి వెళ్లకుండా గేదలు కాయటానికి వచ్చావ్" అని అడిగింది గేదలు ఆవుల మందలో వెనకనున్న ఆవు. "నాకు ఇక చదువు రాదని మానాన్న మరియు మా సర్ మొన్న ఈ నిర్ణయనికి వచ్చారు" బాధగా చెప్పాడు గోపి. "చదువేముందిరా, నేను గడ్డి తిన్నంత సులువు" అంది ఆవు. "అలానా, ఎలా?" ఆశగా అడిగాడు గోపి. అప్పటికే పొలం వచ్చింది. "ముందు నన్ను కాస్త తిననివ్వు, తరువాత చదువు మర్మం చెపుతా" అని మేతలో మునిగి పోయింది ఆవు. కాసేపు ఓపిక పట్టిన గోపి, "ఏం చేస్తున్నావ్? నాకు ఏదో చెపుతానని, నీవు తింటూ ఉన్నావ్" అని అడిగాడు. "నేను ఏకాగ్రతగా అంతర గ్రహణం చేస్తున్నా.... కదిలించకు" అంది ఆవు. "అదేమిటి? అంతర గ్రహణమా? కొత్తగా ఉందే ఈ మాట" అని గోపి అనగా, "ఆహారాన్ని లోపలకు తీసుకోవడాన్ని అంతర గ్రహణం అంటారు. అంటే క్లాస్ లో టీచర్ పాఠం చెప్పేటప్పుడు వినటం లాంటిది. ఇక్కడ శ్రద్ధ అవసరం. అర్ధమైన, కాకున్నా ముందు ఆలకించాలి. ఇది చదువు యొక్క మొదటి లక్షణం. అర్థమయిందా" అని చెప్తూ, "ముందు నన్ను సరిపడినంత తిననివ్వు. మిగిలినది తరువాత చెపుతా" అంటూ తినటం కొనసాగించింది. గోపి ఆవుని బాగా గమనిస్తూ ఆలోచనాపరుడై, తినటంలో ఉన్న శ్రద్ధ వినటంలో ఉండాలన్నమాట అని గ్రహించాడు. కాసేపు గడిచాక ఆవు, గోపి ఇద్దరూ చెట్టు కిందకు చేరారు. "అదేంటి ఒట్టిగా నోరు చప్పరిస్తూ నములుతున్నావ్" వింతగా అడిగాడు గోపి. దానికి ఆవు నవ్వుతూ ..... "దీనిని నెమరు వేయటం అంటారు. అంటే జీర్ణక్రియ. ఇందాక తిన్న ఆహారాన్ని, తీరుబడిగా నోటిలోకి తెచ్చుకొని నమలటం. ఇది చాలా ముఖ్యం. "ఎందుకలా" అడిగాడు గోపి. "సర్ చెపుతున్న చాలా విషయాలు అప్పటికి బాగుంటాయి. కానీ, కాసేపటికి మర్చిపోతాం. అందుకే ఇంటికి వచ్చాక తీరుబడిగా నెమరు వేసుకోవాలి. ఎవరికైతే నెమరు వేసే అలవాటు ఉంటుందో, వారికి చదువు బాగా జీర్ణమౌతుంది... నిజానికి చదువు లోని మర్మం ఇదే" అని రహస్యంగా చెప్పింది ఆవు. గోపీకి తన పొరపాటు ఇప్పుడు అర్ధమైంది. తాను ఏనాడు ఇంటికొచ్చి పుస్తకం పట్టింది లేదు. సాయంత్రమయ్యింది. గేదలు అవులు ఇంటికి మరలాయి. గోపి చూపు అంతా ఆవు మీదనే ఉంది. అది ఉదయం కన్నా హుషారుగా ఆనందగా ఉంది. "ఏంటి విషయమ"ని గోపి అడిగగా, ఆ ఆవు ఇలా అంది... "దీనిని శోషణం మరియు స్వాంగీకరణ అంటారు. జీర్ణమైన ఆహారం రక్తంలో చేరి, మనకు శక్తిని హుషారును ఇస్తుంది. జీర్ణం సరిగ్గా జరిగితేనే, ఈ ఆనందం అనుభవించగలం. దీనిని నీ చదువుకు అన్వయించుకో... శోషణం మరియు స్వాంగీకరణ అంటే చదువు నీకు అర్థమై ఒంటపట్టటం. అది తెలిస్తే చదువు రుచికరంగా ఉంటుంది. నీకు ఒక పేరును గుర్తింపును తెస్తుంది. నీ ముఖంలో ఓ వెలుగు, నీ పేరుకు ఓ మెరుపు వస్తాయి" అంది ఆవు. గోపి గుండె పట్టుదలతో కొట్టుకోగా, రక్తం వేగంగా, పంతంగా పరిగెత్తింది. "ఇంతేనా... ఇంకేమైనా ఉందా? ఆలోచనగా అడిగాడు గోపి. ఇంకో విషయం ఉంది. పేడతట్ట తీసుకొని రా, చెపుతా అంది అవు. గోపీకి విషయం అర్థమై తట్ట తెచ్చి, పేడ పట్టి, పక్కన పెట్టి, చెప్పు అన్నాడు. "చివరి విషయం మల విసర్జన. చదువులో కూడా ఇంతే. పనికి మాలిన పనులు వదిలేయడం. కబుర్లు.... సెల్ ఫోన్, టీవి, ముచ్చట్లు తదితర వాటిని విసర్జించాలి. అప్పుడు నీకు జీర్ణం చేసుకోవటానికి మరింత సమయం దొరుకుతుంద"ని నవ్వుతూ చెప్పి ముగించింది ఆవు. ఆవుకు మేత పెట్టి, గోపి ఇంటికెళ్లాడు. నెల గడిచింది. గోపికి ప్రోగ్రెస్ కార్డు ఇస్తూ .... సర్ ఆశ్చర్యముగా మెచ్చుకోలుగా చూస్తూ, ఎంతగానో అభినందించారు. ఈసారి గోపి ఇంటి కెళ్లకుండా నేరుగా ఆవుల కొష్టం వద్దకు బయలు దేరాడు. "ఆ రోజు" సాయంత్రం ఆవు నడిచిన నడకలోని శక్తి, ఆనందం "ఈ రోజు" గోపి అడుగులలో కనిపిస్తుంది. ఈ కథను అర్థం చేసుకొని కొన్నేళ్లుగా వదిలేసిన పుస్తక పఠనం తిరిగి ప్రారంభించు, మననం చేసుకుంటూ ఉండు. అలానే మునుపటిలా సత్సంగములో చర్చించడం, చక్కటి ప్రవచనాలు వినడం మొదలెట్టు... అన్నీ గుర్తుకొస్తాయని అంది. ఇక మిత్రులందరూ చక్కటి టాపిక్స్ ప్రస్తావిస్తూ చర్చించడం ప్రారంభించారు. మరో మిత్రురాలు శారద ఈమధ్య కుటుంబ నిర్వహణలో సాధన లేక ఆధ్యాత్మిక అంశాల్లో కొంత మరుపు వచ్చిందనుకుంటాను. ఏది ఏమైనా రామనామం మర్చిపోలేదు. అదొక్కటి బలంగా పట్టుకో...
నామమే కలియుగంలో రక్ష. అదొక్కటి బలంగా నీ మనస్సులో నాటుకుంటే, నిరంతరం స్మరిస్తుంటే చాలు.....అని చెప్తూ, తనూ ఒక కథను ఫార్వర్డ్ చేసింది. ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు. పువ్వులు, పండ్లు, ధూప దీప నైవేద్యాలతో పాటు, ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడై వరాలిస్తాడని నమ్మినవాడు. కానీ, అలా ఏమీ జరగకపోవడంతో అసంతృప్తి మనసులో ఉండేది.
ఒకసారి ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు. అతను మహా జ్ఞాని అని విని, ఏదైనా మంత్ర దీక్ష తీసుకుని చేస్తే బాగుంటుందని తలచి, ఆ జ్ఞాని దగ్గరకు ఎంతో ఆశగా వెళ్ళి, దర్శనం చేసుకుని , తన మదిలో మాటలను విన్నవించాడు. సాధువు అంతా శాంతంగా విని, "నేను అలా ఎవరికీ దీక్ష ఇవ్వను. కానీ, నీ తపన చూస్తుంటే ఇవ్వాలనిపిస్తుంద"నగానే, భక్తుడు ఆనందభరితుడై సాష్టాంగ నమస్కారం చేసాడు. "అయితే, ఈ జప విధానం కొంచెం కష్టం. నీవు చేయగలవో, లేదో" అని సాధువు అనగా, "ఎంత కష్టమైనా, నేను చేయగలను... మంత్రం ఫలిస్తే చాలు" అన్నాడు భక్తుడు ఆనందంగా. ఐతే విను... నేను చెప్పే మంత్రం పఠించనవసరం లేదు కానీ, రోజుకి తొమ్మిది సార్లు ఎవరితోనైనా అనాలి... అలా తొమ్మిది రోజులు చేయు...ఆ పంచాక్షరీ మంత్రం ఏమిటంటే......."దేవుడున్నాడు". భక్తుడు అయోమయంగా చూసాడు. సాధువు చెప్పిన ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు. ఇన్ని లక్షల... కోట్ల జపం చేయాలని విన్నాడు కానీ, ఇదేమిటి? పైగా ఇది పంచాక్షరి మంత్రమట... ఏమిటది... దేవుడున్నాడనే కదా రోజూ పూజలు చేస్తున్నది... మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదేమిటి? అదీ ఇంకొకరితో... తనను పిచ్చివాడి క్రింద జమ కడ్తారేమో....ఎన్నెన్నో సందేహాలు భక్తునికి. సాధువు ఒకటే మాట చెప్పాడు "నన్నేమీ ప్రశ్నించ వద్దు. మంత్రం ఫలించాలంటే తొమ్మిది రోజులు నేను చెప్పినట్లు చేసి, ఆపై నాకు కనిపించు". భక్తుడు విచారంగా ఇంటికి వెళ్ళాడు. సమయం సందర్భం లేకుండా, ఎవరితోనైనా "దేవుడున్నాడు" అని ఎలా అనటం? ఏమిటీ గందరగోళం... ఇంతలో అతని భార్య వచ్చి, పక్కింటి వాళ్ళ గురించి ఏదో చాడీలు చెప్పబోయింది. ఇతను అప్రయత్నంగా అన్నాడు... "దేవుడున్నాడు". అంతే! ఆమె ఒక్క క్షణం తత్తరపడి మాట్లాడకుండా, లోపలికి వెళ్ళిపోయింది. ఇతనికి చాలా ఆనందం వేసింది. వెంటనే అతనికి ఏదో అర్థమయి కానట్లు... వింత భావన కలిగింది. ఆపై, ఇంక ఏ మంచి కనిపించినా "దేవుడున్నాడు" మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతోనూ, ఏదైనా చెడు కనిపిస్తే "దేవుడున్నాడు" అన్నీ గమనిస్తున్నాడనే అర్థంతోనూ , అన్యాయం జరుగుతోందని ఎవరైనా అంటే... "దేవుడున్నాడు" శిక్షిస్తాడనే అర్థంతోనూ, పూజలు అనే విషయం వస్తే "దేవుడున్నాడు" అని భక్తివిశ్వాసాలు వ్యక్తపరుస్తూ అనేవాడు. తొమ్మిది రోజులు గడిచాయి. అంతా నెమరువేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్ళాడు. సాధువు అన్నాడు "నువ్వు ఎప్పుడు, ఎవరితో రోజుకి ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకనవసరం. నువ్వు అలా అంటూ గ్రహించిదేమిటో నాకు చెప్పు" భక్తుడు మొదట తెల్లబోయినా, వెంటనే తేరుకుని అన్నాడు... "నాకు తెలిసింది ఏమిటంటే, దైవం సర్వాంతర్యామి. అంతటా వున్నాడు. సర్వజ్ఞుడు, అతనికి తెలియనిది, మనం దాచగలిగేది ఏమీ లేదు. నిష్పక్షపాతంగా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తాడు. ఎప్పుడు ఏది ఎవరికి ఇవ్వాలో తెలిసినవాడు, దయాసాగరుడు, ఆనందస్వరూపుడు…" అతనిని మధ్యలో ఆపి సాధువు అన్నాడు... "ఇప్పుడు చెప్పు... నువ్వు దైవం నుంచి ఏం ఆశిస్తున్నావు?" భక్తుడు తన్మయత్వంతో కళ్ళు మూసుకుని అన్నాడు "ఎటువంటి పరిస్థితుల్లోనూ నా మనసులోనుండి "దేవుడున్నాడు" అనే భావం చెదరకుండా స్థిరంగా ఉండేలా చూస్తే చాలు"...అని చెప్తుండగా, ఆపి, ఆహా! మంత్రం ఫలించింది...ఆనందంగా ఉండు...చెప్పాడు సాధువు. ఈ కథను ఒకటికి రెండుసార్లు చదవండి. మనసారా విశ్వసించటమే మనం చేయాలి. రాముడున్నాడని విశ్వసించండి...
"రాముడున్నాడు" అనేపంచాక్షరీ మంత్రాన్ని నిర్మలమైన మనస్సుతో నిత్యం జపించండి...అంతా సర్ధుకుంటుంది భారతిగారు... అని! 


అలాగే మరో సత్సంగ మిత్రురాలు అనవసరంగా భయపడకండి. ఒకోసారి మరుపు సహజం. నామాన్ని మర్చిపోలేదు కదా. రామ నామం చేస్తున్నారంటే అది రామానుగ్రహం. అది ఎన్నటికీ మర్చిపోలేరు...అని ఎన్నో రీతుల్లో ధైర్యం చెప్తూ, తనూ ఓ చక్కటి కథను చెప్పింది. కొన్ని శతాబ్దాల క్రితం, శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ప్రసాదం కొరకు భక్తులు బారులు తీరి వేచి చూసేవారు. ఒక పేద వైష్ణవుడు రోజూ వరుసలో అందరికంటే ముందు నిలబడే వాడు. అయన తన కోసమే కాక, తన ఆరుగురు కొడుకుల కొరకు కూడా ప్రసాదం ఇవ్వమని పట్టు పట్టేవాడు. ఇలా రోజూ ఆలయ అధికారులకి అతనికి క్రొంత వాదులాట జరిగేది. ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే, ఇతరులకు కొంచెమే ప్రసాదం లభిస్తుందని ఆలయ అధికారులు మందలించేవారు. నా ఆరుగురు కొడుకులు బ్రక్క చిక్కి పోయారు, కనుక ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆయన వాదించేవాడు. ఒకరోజు రామానుజుల వారు అక్కడ గలాటా చూసి, ఏమి జరిగిందని వాకబు చేస్తారు. ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుణ్ణి చూపి, రోజూ అధిక ప్రసాదం కొరకు ఆయన గలాటా చేస్తున్నాడని తెలియచేస్తారు. రామానుజులు ఆ వైష్ణవుణ్ణి చూసి, నాయనా! నీవు ఆలయములో కొన్ని కైంకర్యములు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని ప్రశ్నిస్తారు. స్వామి, నా బక్క చిక్కిన కొడుకులని మీరే చూడండి, రోజంతా వారికీ సేవలు చేయడంతోనే నా సమయం సరిపోతుంది, వారిని వదిలేసి, నేను ఆలయంలో ఏ కైంకర్యం చేయలేను. పైగా, నేను వేదాలను గాని, దివ్య ప్రబంధములను గాని నేర్చుకోలేదు, అందువల్ల నేను ఆలయంలో ఏ కైంకర్యం చేయలేను, నాకు కొన్ని విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు తప్ప ఏమి రావు, నేనేమి చేయగలను? మీరే దయతల్చండి అని బదులిచ్చాడు ఆ పేద వైష్ణవుడు. సరే, నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలని చెప్పమని రామానుజుల వారు అడుగగా, ఎంతో ఇబ్బందిగా "విశ్వం విషు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు:, భూత కృత్ భూత భృత్.. నాకంత వరకే వచ్చు అని చెప్పాడా వైష్ణవుడు. సరే నీకు భూత భృత్ అనే భగవన్నామము తెలుసు కదా, ఆ నామాన్నే జపించు, ఇక నీకు ఇక్కడికి ఆహారార్థి యై రావలసిన అవసరం ఉండదు అని సెలవిచ్చారు రామానుజులు. ఆ నాటి నుండి ఆ వైష్ణవుడు మరల కోవెల ప్రసాద వితరణ ప్రాంతంలో కనిపించలేదు. ప్రసాదపు వరుసలలో గొడవలు ఆగిపోయాయి. అయితే ఇంకో విచిత్రమైన సమస్య మొదలయింది. రోజూ రంగనాథులకు సమర్పిస్తున్న ప్రసాదంలో చాల భాగం మాయమైపోతుంది. ప్రసాదం దొంగల బారి పడుతుందేమో అని భద్రత పెంచారు కూడా. అయినా సమర్పించిన దానిలో చాలా ప్రసాదం మాయమైపోతుంది. ఆ పేద బ్రాహ్మణుడే దొంగిలిస్తున్నాడేమో అని అనుమానం అందరిదీ. చివరకి రామానుజులకి తెలియ చేసారు ఈ సమస్యని. ఆ పేద బ్రాహ్మణుణ్ణి పిలుచుకు రమ్మని రామానుజుల వారు మనుషులని పంపగా, ఆయన తన పాత నివాసంలో ఉండటం లేదని తెలిసింది. ఆ వైష్ణవుడు ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ తెలియలేదు. కొంత కాలం తర్వాత, రామానుజులు ఏదో కార్యక్రమానికై కొల్లిడం నది (శ్రీరంగం దగ్గర కావేరి పాయ) దాటుతుండగా, ఈ వైష్ణవుడు స్వామీ, స్వామి అని రామానుజులని బిగ్గరగా పిలుస్తూ వారిని సమీపించారు. రామానుజుల పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆయన కనుల నుండి ధారగా కన్నీరు కారుస్తూ, మీ కటాక్షం వలన ఆ పిల్లవాడు రోజూ నాకు ప్రసాదం అందచేస్తున్నాడు అని చెప్పాడు. అందువల్ల నా పిల్లలు ఆ పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇక ఆలయ అధికారులతో గొడవలు ఎందుకని కోవెల దగ్గర గృహం నుండి నేను ఇక్కడికి వచ్చేసాను. నేను మీకు సదా కృతజ్ఞుడను. మీరు చెప్పిన విధంగా రోజూ నేను "భూతభృతే నమ:" జపాన్ని చేస్తున్నాను...అని చెప్పాడు ఈ మాటలు విన్న రామానుజులు ఆశ్చర్య చకితులయ్యారు. ఎవరా పిల్లవాడు? వాని పేరేమి అని అడుగగా, ఆ పిల్లవాడు తాను రామానుజా దాసుడనని చెప్పాడని చెప్పాడు వైష్ణవుడు. ఆ బాలుడు ఇంకెవ్వరు సాక్షాత్ శ్రీరంగనాదుడే...అని గ్రహించి, ఉప్పొంగి పోయారంతా. భూత భృత్ నామానికి అర్థం సమస్త జీవులని పోషించువాడు అని అర్ధం.
అందుకే భారతి, నామానికి ఉన్న శక్తి ఎంతటిదో అర్థం చేసుకుని, ఆ నామ పారాయణం అఖండంగా చేయు...నీకు ఏది అవసరమో, అది ఆ పరమాత్ముడే ఇస్తాడు. 

ఇలా ఇంకా చాలామంది సహృదయంతో చక్కని మాటలతో, సలహాలతో ఎంతో ఊరటని ఇచ్చారు. 


ఇక, పై స్ఫూర్తిదాయక కథా రచయితలు ఎవరో గానీ... వారికి, అనునిత్యం రాములోరికి వారి కీర్తనల ద్వారా అక్షరార్చన చేస్తున్న శ్యామలీయం గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. అందరి సలహాలను వందశాతం అమలు చేశాను. రామానుగ్రహంతో ఇప్పుడు నా పరిస్థితి మెరుగ్గా ఉంది. కొద్దిరోజులు క్రితం మా అక్కగారమ్మాయి విద్య సాయి, 'భారతాంటీ! ఈ మధ్య ఏమీ వ్రాయడం లేదు, వ్రాయండి' అనడం...ఇదే మాటను మరి కొొందరు అడగడంతో... గత కొంత కాలముగా, నాలో జరిగిన సంఘర్షణలో కొంత ఈ టపా ద్వారా తెలుపుతున్నాను. 
 అలాగే ఝాన్సి అనే మిత్రురాలు ఓ చమత్కారపు సలహా ఇచ్చారు. దాని గురించి మరో టపాలో ...

28, ఏప్రిల్ 2022, గురువారం

మంచివారిలోనే భగవంతుడు ఉంటాడా?

కొన్ని రోజుల క్రితం - 

నా స్నేహితురాలి బ్లాగ్ లో ఒకరు ఈ క్రింద ప్రశ్నలు వేశారు. దానికి క్లుప్తంగా ఓ వ్యాఖ్యల బదులివ్వడం తెలియక, కాస్త వివరంగా ఇక్కడ తెలుపుతున్నాను.

                         

అన్నీ భగవంతుని మయమే ...
అవును, ఇది సత్యం. ఇందులో సందేహం లేదు.
                         

అందరిలో భగవంతున్ని చూడాలనే కదా చెప్తారు ...
అవును, ఇదీ సత్యమే.
                        
           
వాళ్ళతో స్నేహం వద్దు, వీళ్ళతో స్నేహం వద్దు... నా ఫ్రెండ్స్ కొంత చెడ్డవారే. ఏం అయితే, వారిలో భగవంతుడు వుండడా? మంచివారిలోనే ఉంటాడా?
ఎందుకుండడు? అందరిలో ఉంటాడు.

ఒక విష సర్పం ఎదురైతే, ఆ ప్రాణిలో కూడా భగవంతుడు ఉన్నాడని దగ్గరకు వెళ్ళక, ఎందుకు ప్రక్కకు తప్పుకోవడం? అది హాని చేస్తుందనే పరిజ్ఞానం వలన. ఈ జ్ఞానం ఎలా కల్గింది? పెద్దలు చెప్పడం వలన.
                       

అలాగే, చెడు సహవాసాలతో హాని జరుగుతుందని, చెడు స్నేహాలు వద్దని పెద్దలుచెప్తారు. 
                         
కర్ణుడు ఎంతటి ఉదాత్తుడు... అయినా నేటికీ దుష్ట చతుష్టయంలో ఒకరిగానే నిలిచిపోయాడు. కారణం, దుర్యోధనాదుల స్నేహం. 
                   

           

     
మట్టిలో చేరి ఇనుము పట్టు తుప్పు
అగ్నిలో చేరి ఇనుమును అదియు వీడు
సాహచర్యముచే నిట్లు జరుగుచుండు...
ఇనుము మట్టితో చేరినప్పుడు, తుప్పుపట్టి దాని శక్తి కోల్పోతుంది. అదే నిప్పుతో చేరేసరికి ప్రకాశవంతంగా మెత్తగా మారుతుంది. 
సహవాసం ప్రభావం ఇలా ఉంటుంది. కీడు మేలు అనేది మనం సహవాసం చేసేవారి మంచి చెడులపై ఆధారపడి ఉంటుంది. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవేమిటో నేను చెప్తాను అంటారు విజ్ఞులు. చెడ్డవారితో చెలిమి ఉన్నప్పుడు మంచివారిని కూడా చెడ్డగానే చూస్తారు. తాటిచెట్టు క్రింద పాలు త్రాగుతున్నానంటే, ఎవరు నమ్ముతారు? కనుక చెడుస్నేహాలకు కాస్త దూరంగా ఉండమని పెద్దలు చెప్తుంటారు.
                          


అంతటా భగవంతుడు ఉంటాడన్నది అబద్దమా?
అబద్దం కానే కాదు. 
                    


నీతులు చెప్పేవారు వంద శాతం మంచివారా?
వంద శాతం మంచివారని ఎవరూ చెప్పలేరు. నాకు మంచిగా అనిపించింది, వేరొకరికి కాదనిపించవచ్చు. కానీ, నీతులు చెప్పేవారిలో అధికులు, సమాజ హితం కోరేవారే. మన శ్రేయస్సు కోరేవారే. మంచి చెడు సహజం. అయితే సంబంధ బాంధవ్యాలను సరైన రీతిలో తీసుకోవాలి. చెడును తెలియజెప్పి సంస్కరించగలగాలి  ఎవర్నీ ద్వేషించనక్కర లేదు. విమర్శించనక్కరలేదు. కానీ, ఎన్నుకోవలసినవారిని సరైన రీతిలో ఎన్నుకోవాలి. వారి ప్రభావం మనపై ఉంటుంది కాబట్టి.  
                           

                    
బ్రతుకుతెరువు కోసం చదువుకుంటే ఉద్యోగం, డబ్బు, హోదా వస్తాయి. ఇలాంటివి చదివితే కూడు వస్తుందా? కష్టపడితే కూడుగానీ, భక్తి కూడు పెడుతుందా? 
                        

ఒకప్పుడు విద్యను వ్యక్తిత్వ వికాసం కోసం అభ్యసించి, యశస్సు సాధించేవారు. కానీ, నేటి విద్యా విధానంలో విద్య అంటే - కేవలం ఉద్యోగం, ధన సముపార్జన అన్న భావన ఏర్పడింది. ఈ చదువులతో తర్కవాదములలో ప్రవేశిస్తున్నారు. ఇది కాదు చదువు యొక్క విలువ. ఆస్తులు, హోదాలు పొట్ట కూటి కోసం చదివేది మాత్రమే చదువు కాదు. జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా గుర్తించేలా చేసేదే అసలైన విద్య. మనల్ని సంస్కరింపజేసేదే అసలైన విద్య. 

 భక్తి - భుక్తి ... కొన్ని అద్భుతాలు -

ఒకసారి స్వామి వివేకానంద మండు వేసవిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వేస్టేషన్‌లో ఉండగా, ఒక సంఘటన జరిగింది.

వివేకానందుడు సన్యసించారు కనుక, వారికి భగవత్ ప్రసాదంగా లభించినదే భుజిస్తుండేవారు.     

భిక్షగా ముడి సామాన్లు లభిస్తే, వండుకుని భుజించేవారు లేదా భిక్షాటన చేస్తుండేవారు.

వివేకానందుడికి ఆరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో దాహార్తితో కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి, ఒక ధనవంతుడు చులకనగా మాట్లాడనారంభించాడు. అతని ఆలోచన ప్రకారం, సన్యాసులు అంటే ఏ పనీ చేయకుండా, సోమరిలా తిరుగుతూ, ఊరిలో వారిపై భోజనానికై ఆధారపడుతూ, ప్రజలను మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని.

ఇటువంటి భావం కలిగివున్న ఆ ధనవంతుడు  స్వామీజీతో ఇలా అన్నాడు..

“ఓ స్వామీ! చూడు.. చూడు.. నేనెంత మంచి భోజనం చేస్తున్నానో.. నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్ళు ఉన్నాయి. నేను డబ్బులు సంపాదిస్తాను. కాబట్టి, నాకు మంచి మంచి వంటకాలు, వగైరాలు అన్నీ సమకూరాయి. ఇటువంటి భోజనం నువ్వు కనీసం కలలో అయినా పొందగలవా? ఏ సంపాదనా లేకుండా దేవుడు.. దేవుడూ.. అంటూ తిరిగేవాడివి. అందుకే నీకు ఈ బాధలు.  నీ భక్తి నీకిప్పుడు భోజనం పెడుతుందా? చూసావా... నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడయ్యా.. ఆకలి బడలిక తప్ప!” అని దెప్పిపొడవటం మెుదలుపెట్టాడు.

స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు. విగ్రహంలా కూర్చొని భగవంతుని పాదపద్మాలనే తలచుకుంటున్నారు.

అప్పుడు ఒక అద్బుతం జరిగింది.

ప్రక్క ఊరి జమీందారు ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి, స్వామీజీ పాదాలపై వాలిపోయాడు. అతను స్వామితో ఇలా అన్నాడు, 

“మీ పాదాలను సేవించి స్పృశించే భాగ్యం కలగడం నా పట్ల శ్రీ రామ చంద్రమూర్తి కున్న అనుగ్రహం.
దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి!" అని ప్రాధేయపడ్డాడు.

స్వామీజీ “ఎవరు నాయనా నీవు? నేను నిన్ను ఎరుగనే... పొరబడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు!” అని అంటూ ఉంటే,  ఆ వ్యక్తి స్వామీజీ ముందు వెండి పీట వేసి, భోజనం ఒక బంగారు అరటి ఆకు మీదకు మారుస్తూ... లేదు స్వామీ, నేను కలలో చూసింది మిమ్మల్నే!”
"శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి, మిమ్మల్ని చూపించి, నా బిడ్డ ఆకలితో ఉంటే, నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా... లే... లేచి అతనికి భోజనం పెట్టు!  అని ఆజ్ఞాపించారండి.
"ఆహా.. ఏమి నాభాగ్యం... మీ వలన నాకు రామదర్శనం కలిగింది. తండ్రీబిడ్డలు ఇరువురుది ఏమి గాంభీర్యం,  ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు, ఎవరూ మరచిపోలేరు."
"నేను పొరబడటం లేదు స్వామీ.. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లటి నీరు కూడా తెచ్చాను" అన్నాడు.

స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది. ఏ అభయ హస్తమైతే తనజీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో.. అదే అభయ హస్తమిది.

ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న ఆ ధనవంతుడు ఉన్నపళంగా స్వామి వారి పాదాలపైపడి, కన్నీటి ధారాలతో స్వామి పాదాలను అభిషేకిస్తూ, క్షమాపణ కోరాడు.

ఇది కేవలం స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే, ఇంతకు మించినవి, ఎంతో ఆశ్చర్యం కలుగజేసేవి, చాలా ఉన్నాయి మన మహర్షుల యోగుల అనుభవాలు. వారి వారి జీవిత చరిత్రలు చదివితే ఇలాంటివి తెలుసుకోవచ్చు.

                                    🕉️🕉️🕉️🕉️🕉️

పూర్వకాలంలో సకల శాస్త్రములను అభ్యసించిన ధర్మపరాయణుడైన ఓ కడు బీద బ్రాహ్మణోత్తముడు, విద్య విక్రయం పాపమని భావించి, ఒక బడిలో ఉచితంగానే విద్యాబోధన చేస్తుండెను. విద్యార్ధుల తల్లితండ్రులు దయదలచి ఏమైన యిస్తే, అదే జీవనాధారమయ్యేది. ప్రతీరోజు ఇంటిలో వంటకం అయిన తరువాత తల్లి స్వయంగా వచ్చి పిలుస్తేనే, అతడింటికి వెళ్ళి బోజనం చేసేవాడు. ఇంట్లో ఏమైన వండితే మధ్యాన్నం 12గంటలకు తల్లి వచ్చి పిలిచేది. లేనిచో, ఆ బడిలోనే కూర్చొని భగవద్గీత పారాయణం చేయుచుండెను. తరచుగా పస్తులుండడం వారికి పరిపాటి. ఒకరోజు ఒంటి గంటైనను తల్లి రాకపోవడంతో ఈ దినమూ ఉపవాసమేనని గ్రహించి, గీత పారాయణం చేయుచుండగా, 
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే | అను శ్లోకం పఠనం నకు వచ్చెను.
                        


అపారమైన కృష్ణ భక్తి ఉన్నను, ఆకలి బాధతో ఆ శ్లోకం యొక్క మొదటను, తుదను ఎర్రటి పెన్సిల్ తో రెండు బ్రాకెట్లను వేసెను.
ఆ సమయమున ఈ పంతులుగారి వద్దే చదువుచుండెడి ఆ నగరంలోని రాజుగారి కుమారుడు, ఒక గంప నిండుగా సామానులను తీసుకొని పంతులయ్యగారి ఇంటికి వచ్చి, ఈ దినమునకు కావల్సిన వంటసామగ్రిని పై విస్తరాకులలో పెట్టినాను, వాటిని ఈ దినం బోజనమునకు ఉపయోగించుకొని గంప యొక్క అడుగుభాగమున వున్నవి చూసుకొని, రేపటినుండి వాడుకోమని కన్నీరు కార్చుతూ చెప్పగా, ఆ రాజకుమారుని చెక్కిళ్ళకు రెండు ప్రక్కల ఎర్రగా నెత్తురు కారేలాగున వాతలు ఉండుట చూసి, ఆ ఉపాధ్యాయుని తల్లి, అయ్యో! బాబు! ఎవరు నాయనా! నిన్నిలా కొట్టారని అడగగా, తల్లీ! మీ కుమారుడగు పంతులుగారు, చెప్పినట్లు నేను చేయుట లేదని సందేహం కలిగి నా ముఖమున వాతలు వేసెనని చెప్పెను. దానితో ఆ తల్లి ఆందోళనగా బడికి వెళ్ళి, నాయనా! మనమిక ఈ గ్రామంలో వుండగలమా? రాజుగారి కుర్రవానిని నెత్తురు కారేలాగున ముఖమున వాతలు వేయవచ్చునా? ఎంతో సహనశీలుడవయిన నీవు, ఏల ఈ ప్రమాదకరమగు పని చేసితివి? ఈ నగరపు వారి సహాయం వల్లనేగదా, ఈ మాత్రమైన అనుష్ఠానం చేసుకొని, జీవించగలుగుతున్నాం అని అంటున్న తల్లిమాటలు అర్ధంకాక, అయోమయంగా తల్లితో సహా రాజుగారి ఇంటికి వెళ్ళగా, రాజు కుమారుడు బోజనం చేసి, మరల బడికి వచ్చుటకు సిద్ధమై యుండెను. ఆ అబ్బాయిని అడుగగా, నేను మీ ఇంటికి రాలేదని చెప్పెను. ఆ బాలుని ముఖంపై ఎటువంటి వాతలు లేకుండెను. అంతట ఆ ఇరువురు ఇందులో ఏదో రహస్యముందని యోచిస్తూ, ఇంటికి వచ్చి ఆ గంపను చూడగా, పైన ఆ రోజుకు సరిపోవు బియ్యం, పప్పులు ఉండెను. విస్తరాకు దిగువున అమూల్యమగు రత్నములు కనిపించెను. అప్పుడు తాను చదివిన శ్లోకం, గీసిన గీతలు గుర్తుకు వచ్చి, వచ్చింది శ్రీకృష్ణుడేనని, తాను గీసిన గీతలు కృష్ణుని ముఖంపై వాతలయ్యనని, ఇది శ్రీకృష్ణుని మహిమగా గుర్తించారు.
     
                                      🕉️🕉️🕉️🕉️🕉️

ఒకప్పుడు భద్రాచలం ప్రయాణమంటే, ఎంతో ప్రయాసతో కూడుకున్నది. అటువంటి పరిస్థితుల్లో, రామదర్శనంకై వచ్చే భక్తులకు ఏదైన సహాయం చేయాలన్న సంకల్పం పమిడిఘంటం వెంకటరమణ దాసుది. కౌపీనం తప్ప, ఏ ఆస్తుపాస్తులు లేని ఆయన యాయవార వృత్తి ద్వారా సంపాదించిన దానితోనే, నిత్యాన్నదానం చేయాలన్న గొప్ప సంకల్పంతో ఇల్లిల్లు తిరిగి దానంగా వచ్చేదానిని శుభ్రంగా వండి, వేడి వేడి అన్నం,  కాస్త పప్పో, పచ్చడినో, మజ్జిగలతో భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తుండేవాడు. అంతకంతకు భక్తజనం పెరగడం, అన్ని ఇళ్ళకు వెళ్ళి అడిగి తెచ్చిన వాటితో వచ్చినవారికి లేదనకుండా అన్నం పెట్టేవాడు. ఒకనాడు ఆయన ఏర్పాటు చేసిన ఆ అంబ సత్రంలో వంటపాత్రలను ఎవరో ఎత్తుకు పోవడం, వేరే వంటపాత్రలు లేకపోవడంతో వండేవాళ్ళు వెళ్ళిపోవడంతో, అంతా రాములవారే చూసుకుంటారని, రాముడే దిక్కని, రామునిపై భారం వేసి నిబ్బరంగా ఉండగా, ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చి, తాము వంటవాళ్ళమని, వండటానికి తమ దగ్గర రెండు గుండిగలు వున్నాయని, ఈరోజు వంటపని తాము చేసిపెడతామని చెప్పి, వెంటనే వంట ప్రారంభించి, ఎప్పటిలాగే భక్తులు వచ్చే సమయానికి వండడం పూర్తి చేసారు. కమ్మటి వాసన, చక్కటి రుచులతో రోజుటి కంటే గొప్పగా ఉన్నాయంటూ భక్తులు లొట్టలు వేసుకుంటూ తిన్నారట. ఆపై కుర్రాళ్ళు కనిపించలేదు. వారికోసం వెతికినా వారి ఆచూకి తెలియలేదు. ఆ రూపం వున్న కుర్రవాళ్ళని గతంలో ఎవరూ చూసి ఎరగరు. గోపన్నను విడిపించేందుకు తానీషాకు మాడలు చెల్లించిన అన్నదమ్ములు రామలక్ష్మణులే నేడూ నిరంతరాయంగా జరుగుతున్న ఈ అన్నదాన యజ్ఞాన్ని కొనసాగించినట్లు గ్రహించారంతా. ఆ తర్వాత ఆ గుండిగలలో వండి, చేస్తున్న అన్న ప్రసాదం బహు బాగుండేదని భక్తుల మాట. భక్తులు అంతకంతకూ పెరగడం యాచించింది సరిపోవడం లేదని, నీవే దిక్కని రామున్ని ప్రార్ధించడం, హఠాత్తుగా ఒక ధనవంతుడు వచ్చి, నా తల్లి స్వప్నంలో కనిపించి మీ సత్రానికి తన భూములన్నిటినీ ఇచ్చేయమని చెప్పిందని, 4వేల ఎకరాలు మీకు రాసిస్తున్నానని, ఆ పత్రాలు అందజేయడం జరిగింది. ఆ ధనవంతుడు హనుమకొండ నుండి వచ్చిన తుంగతుర్తి నరసింహారావు అనే వకీలు గారు. దాసుగారు తదనంతరం, క్రమేణా ఆ సత్రాన్ని అందరు మరిచినా, ఆ సత్రం పాడుబడిన, ఆస్తి అన్యాక్రాంతమైన, కొన్ని సంవత్సరాల క్రితం ఆ సత్రాన్ని శృంగేరిపీఠం తన ఆధీనంలోకి తీసుకొని, చక్ర సిమెంట్స్ అధినేత కృష్ణమోహన్ గారి సహకారంతో వేద పాఠశాలను నెలకొల్పి మరల అన్నదానం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ రెండు గుండిగలు రామ గుండిగ, లక్ష్మణ గుండిగ పేరిట ఉన్నాయి. 
                

                                     🕉️🕉️🕉️🕉️🕉️

శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు (1896-1990) తినడానికి ఏమీలేక నీరసించి సొమ్మసిల్లగా, ఆ జగన్మాతే స్వయంగా అన్నం తినిపించడం జరిగింది. ఈ వివరణ నామ - మంత్ర వైశిష్ట్యం ఈ టపాలో చూడగలరు.

                                         🕉️🕉️🕉️🕉️🕉️

                       

ఇటువంటి పుస్తకాలు చదివితే, భక్తి కూడు పెడుతుందని, అలాగే మనం కష్టపడి సంపాదించిన కూడుకు మూలమైన సృజనకర్త ఎవరన్నదీ అవగాహనకు తెస్తుంది.
                         

ఇలాంటివి చదివితే - 
జ్ఞానోదయం అవుతుంది. 
మానసిక వికారాలుండవు.
వ్యక్తిత్వ వికాసం కల్గుతుంది.
మన దగ్గరకు వచ్చిన ప్రతీ విషయం అవగాహన అవుతోంది. 
మనకు కల్గిన ప్రతీ సందేహానికి
 సమాధానం దొరుకుతుంది.
                        

పుస్తక పఠనం వలన ప్రయోజనం -
మన పురాణ ఇతిహాసాలలో, యోగుల మహర్షుల చరిత్రలలో ఆత్మజ్ఞానానికి సంబంధించిన విజ్ఞానమే కాదు, మన దైనందిక జీవితాల్ని ఉత్తమ మార్గంలో నడుపుకోవడానికి దోహదపడే అంశాలు అనేకముంటాయి. అనేక కధల రూపంలో ఉపయుక్త ప్రధానాంశాలను ప్రబోధిస్తాయి. నీతి నియమాలను, ధర్మ సూక్ష్మాలను, సాంఘిక ఆర్ధిక రాజకీయ రంగాల్లో మనం నడుచుకోవాల్సిన విధానాల్ని వివరిస్తాయి. చారిత్రాత్మిక సంఘటనల ద్వారా మనకు ఉపయోగపడే అనుభవాలు కోకొల్లాలుగా ఉంటాయి.  ప్రపంచంలో ప్రముఖుల ఆత్మకథలు (బయోగ్రపీ) చదివితే, వారిలో  చాలామంది తమకు ప్రేరణ స్పూర్తి భారతీయ శాస్త్ర గ్రంథాలే అని పేర్కొనడం గమనార్హం.
మన సంస్కృతి పట్ల అవగాహన రావాలన్న, మన ఔనత్యం అవగతం కావాలన్న శాస్త్ర పఠనమో, శ్రవణమో తప్పనిసరి. 
                     

పై ప్రశ్నలకు నా అవగాహన మేరకు సమాధానాలు తెలిపాను. తప్పులుంటే తెలపండి.....

ఒకోసారి కొందరు రచయితలు చక్కటి సందేశమున్న సంభాషణలను తెలుపుతుంటారు. అలాంటిదే ఒకటి ఈ మధ్య నాకు వాట్సాప్ లో వచ్చింది. ఇది మూల గ్రంథంలో ఉందో, లేదో నాకు తెలియదు గానీ, మంచి సందేశం ఉండడంతో ఇక్కడ షేర్ చేస్తున్నాను.
 
కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది.
కర్ణుడు కృష్ణుడుని అడిగాడు...

నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పు కాదే.

పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ, నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు.

పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు..

ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది.

ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం, కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే.

నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే... స్నేహం వల్లనే.

అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని అన్నాడు కర్ణుడు.

దానికి కృష్ణుడు సమాధానంగా -

కర్ణా!

నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను.

నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది.

నేను పుట్టిన రాత్రే, నా కన్న తల్లితండ్రి నుండి వేరుచేయబడ్డాను.

చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు. నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను.

నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి. అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు. కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను.

నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా.

నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు.

మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ.

సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది.

జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమున ఒడ్డు నుంచి దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది. అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది.

సరే, ఇంతకు దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో, నీకు మంచిపేరు వస్తుంది.

అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు. పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణమన్న నింద వేస్తారు అందరూ నాపైన.

ఒకటి గుర్తుంచుకో కర్ణా...

జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి.

జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు.

దుర్యోధనుడు అవనీ, యుధిష్టరుడు అవనీ, అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే.

ఏది సరైనదో, ఏది ధర్మమో నీ మనసుకీ, నీ బుద్ధికి తెలుసు..

మనకు ఎంత అన్యాయం జరిగినా, మనకు ఎన్ని పరాభవాలు జరిగినా, మనకు రావల్సినది మనకు అందకపోయినా...

మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం...అదే చాలా ముఖ్యమైనది.

జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో, ఎవరో కాస్త ఆదుకున్నారో... అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా (licence ) అనుకోకూడదు. మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు. ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు... అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు.