23, ఫిబ్రవరి 2013, శనివారం

తనో వినయశీలి... తనే మన "రసజ్ఞ"

రసజ్ఞ...
రసజ్ఞ అందరికీ తెలిసిన ప్రముఖ బ్లాగరిణి.
వివిధ విశిష్ట అంశాలను ప్రస్తావిస్తూ, అందుకు తగ్గ విలువైన విషయాలను అనుసంధానం చేసి సమగ్ర వివరణతో సామాన్యులకు సహితం సులభగ్రాహ్యంగా అవాగాహన కల్పిస్తూ ఆసక్తిదాయకంగా రచించడంలో అందె వేసిన చెయ్యి తనది.
అయినా అందరికీ తెలిసిన తన గురించి చెప్పడం 'ముంజేతి కంకణానికి అద్దం పట్టడమే' అయినా తనలో నాకు నచ్చిన, పలువురు మెచ్చిన "వినమ్రత" గురించి ప్రస్తావించాలనిపిస్తుంది.

తనతో నాకు పరిచయమై ఒక్క ఏడాదే అయింది. అయితేనేం... జన్మ జన్మల బంధములా ఆత్మీయంగా 'ఆత్మబంధువ'యింది. "అమ్మా" అన్న ప్రేమైక పిలుపుతో 'ప్రియపుత్రిక'యింది.

రసజ్ఞ...
రసజ్ఞ అంటే - రసం జ్ఞానాతీతి రసజ్ఞ అన్నారు. 
రసం అంటే సారభూతమయినది , నవరసాలు, కళలు అని కూడా అనుకోవచ్చును. జ్ఞానాతీతి అంటే తెలిసినది అని అర్ధం
ఇక పదానికి అర్ధాన్ని వాడుక భాషలో తీసుకుంటేమనకి రసాన్నితెలియచేసేది ఏమిటిమనం తినే దాని రసం వలనే మనకి రుచి తెలుస్తుందిట
అలా తీసుకుంటే మనకి రుచిని తెలియచేసేది ఏమిటి? నాలుక కనుక మామూలు పరిభాషలో నాలుక అనే అర్ధాన్ని ప్రతిబింబిస్తున్నా - 
ఒక రసాన్ని లేదా కళలని ఆస్వాదించేది అనుభూతని మనకి ఇచ్చేది అని 'రసజ్ఞ' అనే పేరు తెలియచేస్తోంది. (ఇంకా రసజ్ఞ నామవైభవమును తెలుసుకోవాలనుకుంటే తన బ్లాగ్ లో "నా పేరు..... అన్న టపా చూడగలరు.http://navarasabharitham.blogspot.in/2011/07/blog-post.html)
నేను సామాన్యురాలిని. అందుకే రసజ్ఞ అంటే నాలుక అనే సామాన్య అర్థాన్నే తీసుకొని దాని గురించే ప్రస్తావిస్తాను -
సాధారణంగా పెద్దవారు, పరహితాన్ని కోరుతూ పరోపకారతత్త్వంతో పలువురి మన్ననలు పొందే మంచివ్యక్తిని 'అందరి తలలో నాలుక లాంటివాడ'ని అంటుంటారు. నాలుకతో సద్గుణమును ఎందుకు పోల్చుతారంటే నాలుక (రసజ్ఞ) వినయానికి చిహ్నం. 
కన్ప్యూషియన్ అనే చైనా తత్వవేత్త తన చివరిక్షణాల్లో తన శిష్యులను దగ్గరకు పిలిచి, 'చూడండీ, నా నోట్లో నాలుక ఉన్నదా? లేదా?' అని ప్రశ్నించగా, 'ఉన్నద'ని శిష్యులు చెప్పారు. మరి దంతాలు ఉన్నాయా? లేవా?' అని ప్రశ్నించగా, 'లేవ'ని శిష్యులు చెప్పగా, అప్పుడు ఆ తత్వవేత్త యిలా అన్నారట -  'ఈ నాలుక నేను పుట్టినప్పటి నుండి నా నోట్లో ఉంది. పుట్టిన కొంతకాలానికి దంతాలు వచ్చాయి. యవ్వనదశలో ముప్పదిరెండు దంతాలు అయినాయి. కానీ, నేడు అవన్నీ ఊడిపోగా, నాలుక మాత్రమే మిగిలియుంది. కారణం, నాలుక కోమలంగా సరళంగా కొసదేలి కఠినంగా ఉన్న దంతాల మద్య కూడా ఎంతో వినయంగా ఉండడం వలన ఇప్పటిదాకా ఉంది. చాశారా... దంతాలు గట్టిగా కొసదేలి అన్ని ఉండీ ఇప్పుడు ఒక్కటీ మిగలలేదు. నాలిక ఒక్కటే ఉన్నను వినయమనే సద్గుణము వలన చివరికంటా ఉంది. అందుకే జీవితంలో వినమ్రతగా ఉండాలి' అని ఉపదేశించారు.
పరిణిత వ్యక్తిత్వంనకు ప్రామాణికం 'వినయం. ప్రతీవ్యక్తి అలవర్చుకోవలసిన మొట్టమొదటి సద్గుణం "వినయం". నాలుక(రసజ్ఞ) వినయానికి గుర్తు. వినయానికి చిహ్నమైన 'నాలుక'నే అర్ధం వచ్చే పేరు గల 'రసజ్ఞ' సార్ధక నామదేయురాలు. శ్రీ రవిశంకర్ గారు అన్నట్లు ప్రజ్ఞ యొక్క వికసనమే 'వినయం. అది మన రసజ్ఞలో ప్రస్పుటమైంది. 

రసజ్ఞ...
రసజ్ఞ విశిష్టమైన వినయానికి ప్రతీక. ఇది తనతో పరిచయం ఉన్న అందరి అభిప్రాయం.
కేవలం పేరుకే పరిమితంకాకుండా, అనేక సద్గుణములతో కూడిన తన వ్యక్తిత్వంలో వినయమనే అమూల్యభూషణమునే ధరించి తన నామానికే వన్నె తెచ్చుకుంది. అన్నింటికీ అతీతంగా, అన్ని రంగాల్లో విజేతగా నిలిపేదే వినయం. ఆ వినయం తన సహజస్వభావమై భాసిల్లుతుంది.  
ఈ మధ్యనే తను పెట్టిన టపా 'తౌర్యత్రిక కళ ' చదివాను. పోస్ట్ పోస్ట్కు ద్విగిణీకృతమౌతున్న తన ప్రతిభ నన్నెంతో ఆశ్చర్యానందాలకు లోనుచేస్తే, ఆ విషయాన్నే ఎప్పటిలా తనకి మెయిల్ చేయగా - "నీకు నా మీద ఉన్న ప్రేమ, అభిమానంతో అలా అంటున్నావు కానీ, అమ్మా! నేనింకా చిన్నదానినే, నా రచనలు ఇప్పుడే మొగ్గ దశలో ఉన్నాయి. మీ అందరి ఆశీర్వాదాలే వాటికి నీళ్ళు. అవి త్వరలో పూలు పూయాలని కోరుకుంటున్నాను"... అన్న తన ప్రత్యుత్తరం -
ఎదిగిన కొలది ఒదిగియుండే వినయానికి చిహ్నంగా ఉంది. ఎప్పటికప్పుడు తన ప్రత్యుత్తరాలు, మాటలు నన్ను ఎంతగానో అబ్బురపరుస్తుంటాయి. తన సంస్కారం, వినమ్రతకు ఎప్పుడూ ముగ్దురాలవుతుంటాను.

విద్యాదదాతి వినయం, వినయాద్యాతి పాత్రతా ... విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల పాత్రత (యోగ్యత) కలుగుతుందన్నదానికి ఓ చక్కటి ఉదాహరణ మన వినయ సౌజన్యమూర్తి "రసజ్ఞ".

తన పోస్ట్స్ ద్వారా తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నట్లే, తన ఆత్మీయ సహచర్యం ద్వారా ఎన్నెన్నో నేర్చుకున్నాను. అందులో మచ్చుకి ముచ్చటగా ఓ మూడు -
1. చిన్ని చిన్ని తప్పిదాల్ని భరించలేనప్పుడు జీవితంలో పెద్ద విజయాల్ని సాధించలేం.
2. చివరికంటూ మనవెంట వచ్చేది సంసారం కాదు, సంస్కారం.
3. మన భావాలు మరొకరికి భారం కాకూడదు, బాధని కల్గించకూడదు.
ఇలా తనగురించి ఎన్నైనా చెప్పగలను. కానీ; "అమ్మ మనస్సు" బిడ్డకి దిష్టి తగులుతుందన్న వెరపుతో నిలువరిస్తుంది.
యక్షప్రశ్నలలో ధర్మరాజు ఇలా అంటాడు - 'మానం హిత్వా ప్రియోభవతి' తన్ను తాను గొప్పగా భావించనివాడు జనులందరికీ ప్రియమైనవాడగునని. అలా ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే వినయశీలి అయిన మన రసజ్ఞ, అందరికీ ప్రియమైనది. అందరి మన్ననలు పొందుతున్న మన రసజ్ఞకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, ఎంతో ఉన్నత స్థాయిలో తనుండాలని ఆశిస్తూ... 


14, ఫిబ్రవరి 2013, గురువారం

శ్రీరామ నామజపం చేయువారు ఎంతపాపం చేసినను పర్వాలేదు కదండీ...

 క్రిందటి పోస్ట్ లో "పరమపావనం రామనామం" ను చదివిన ఒకరు ఈ క్రింద ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నను చూడగానే మనసంత భారమైంది. ఎంతో వేదన. ఇటువంటి ప్రశ్నలకు ఏమని బదులివ్వగలను? 

భగవత్ నామజపం చేయువారు పాపములన్నియు అగ్నియందు కట్టెలు భస్మమగునట్లు అగునని అంటారు. అలానే శ్రీరామ నామజపం చేయువారు ఎంతపాపం చేసినను ఆ పాపమునుండి విముక్తులగుదురని అంటారు కదా. అలానే 'జపతో నాస్తి పాతకం' అన్న శాస్త్రవచనం కూడా ఉంది కదండీ. అంటే ఏ పాపం చేసిన పర్వాలేదు కదండీ. భగవత్ నామధ్యానాలతో ఆ పాపం పోగొట్టుకోవచ్చు కదండీ?

ఏ భగవత్ నామధ్యానలైన భక్తియుతంగా ఉండాలి. భగవంతునిపై నమ్మకం, భక్తి, శాస్త్ర అవగాహన సరిగ్గా కుదురుకోలేనంత కాలం (సరిగ్గా లేనంతకాలం) ఇలాంటి సందేహాలే వస్తుంటాయి.
నిజమైన భక్తి బుద్ధిని వశంలో ఉంచుతుంది. పాపకర్మలవైపు మనస్సును పొనీయదు. మన చర్యలన్నీ దైవం గమనిస్తాడనే భావన పాపకర్మలను చేయనీయదు. భక్తియుతమైన నామస్మరణ మనలో కలిగే అత్యాశలను, తప్పుడు తలపులను క్రమేణా తొలగించి పవిత్రభావనలను, సత్వబుద్ధిని కల్గిస్తుంది. ఇటువంటి భక్తియుతమైన జపమే అప్పటివరకు మనం చేసిన పాపములను నశింపజేస్తుంది. 

కృత్వా పాపం హి సంతప్య తస్మాత్ పాపాత్ర్పముచ్యతే /
నై వం కుర్యాత్పునరితి నివృత్యా పూయతే తు సః // (మనుస్మృతి)
తెలివిలేని కాలమందు చేసిన పాపముచే కష్టమందున్నవారు పశ్చాత్తాపముతో భగవంతున్ని ప్రార్ధించినచో ఆ పాపంనుండి విముక్తి పొందుదురు. మరల ఎప్పటికిని అలాంటి పాపకార్యం చేయక సత్యనిష్ఠ యందు ఉండినచో, పరిశుద్ధులగుదురు.

పైన చెప్పిన మనుస్మృతిలో శ్లోకం ప్రకారం తెలివిలేనికాలమందు అంటే తప్పొప్పుల విచక్షణ లేనికాలమందు చేసిన పాపములు నామధ్యానాది జపములచే నశించును. అంతేకానీ, తెలిసి చేసి భగవత్ నామధ్యానాదులచే ఆ పాపం పోతుందని అనుకోవడం అజ్ఞానమే అవుతుంది. 
శ్రీరామ నామంగానీ, ఏ భగవత్ నామంగానీ భక్తి జ్ఞాన వైరాగ్య సదాచారములతో ఆచరించువారికే అంతవరకు తెలియక చేసిన పాపకర్మల ఫలితము నశించును అని పెద్దలు చెప్పినది సత్యమే. కానీ, నామధ్యాన జపాదులు శక్తి తెలిసికూడా దురాచారపరులై పాపకర్మలు చేయువారికి ఆ పాపఫలితము మరింత అధికరించును.
శ్రీరామనామం పరమపవిత్రమైనను వక్రబుద్ధితో అనుష్టించువారికి నిశ్చయంగా చెరుపు చేయును. 

ఇటువంటి ప్రశ్నలకు రమణమహర్షి ఏమని బదులిచ్చారో పరిశీలిస్తే మరింత అవగాహన పెరుగుతుంది.
 ప్రశ్న :- స్వామీ! పంచాక్షరి గాని, తారకం గాని, ఏదో ఒక మంత్రం జపించేవారు జారత్వ చోరత్వసురపానదులు చేసినా, ఆ మంత్రజపం వల్ల ఈ దోషాలు హరింపబడగలవా? ఆ పాపం వారిని అంటకుండునా?
శ్రీ రమణుల జవాబు :- నేను జపిస్తున్నాననే భావం లేకుంటే, వీటి వల్ల కలిగే దోషం వారికి అంటదు. నేను జపిస్తున్నాననే భావమున్నప్పుడు దురభ్యాసాలవల్ల కలిగే పాపంమాత్రం ఎందుకంటదు? 
ప్రశ్న:- ఈ పుణ్యం ఆ పాపాన్ని హరింపదా?
జవాబు :- నేను చేస్తున్నాననే అహంభావం ఉన్నంతవరకు దేనికది అనుభవించవలసిందే. ఒకదానితో వేరొకదానిని కప్పిపుచ్చటం ఎట్లా పొసగుతుంది? నేను చేస్తున్నాననే భావన పోయినప్పుడు తనకేది అంటదు. తానెవరో తెలుసుకుంటే గాని నేను చేస్తున్నాననే భావన పోదు. తన్ను తానెరిగిన వానికి జపమేది? తపమేది? ప్రారబ్ధవశంగా శరీరయాత్ర సాగుతుందేగాని వారు దేనిని ఇచ్చింపరు. ప్రారబ్ధం అనేది ఇచ్ఛాప్రారబ్ధం, అనిచ్చాప్రారబ్ధం, పరేచ్చప్రారబ్ధం అని మూడు విధములు. తన్ను తానెరిగిన తత్త్వజ్ఞునకు ఇచ్ఛా ప్రారబ్ధం లేనేలేదు. అనిచ్చా పరేచ్చా రెండే ఉంటాయి. వారు ఏది చేసినా పరులకొరకే. ప్రారబ్ధానుసారం చేయవలసిన పనులుంటే చేస్తారుగాని తత్ఫలితం వారి నంటదు. అటువంటివారు ఏది చేసిన పుణ్యపాపములు లేవు. అయితే, వారు ఎప్పుడూ లోకాన్ననుసరించే నడుస్తారు గాని అవకతవక పనులు చేయరు.

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

ఇదో అనిర్వచనీయమైన ఆనందానుభూతి.


రాత్రంతా చాలాసార్లు మెలుకువ వచ్చేసేది. మెలుకువ రావడం చెప్పుకోదగ్గ విషయం కాదు. కానీ, ఆ మెలుకువ అంతరాన అప్రయత్నంగా "రామ"నామం జరుగుతుండగా రావడం విశేషం. ఇదో అనిర్వచనీయమైన ఆనందానుభూతి. 

ఇదిలా ఉండగా తెల్లవారుఝామున లతీష్ బాబు (అల్లుడుగారు)నుండి ఫోన్ -
ఆదివారం కదా, అప్పుడే లేచారేమ్మా అన్న నా ప్రశ్నకు ...
అత్తమ్మా! నేను ఇప్పుడు భద్రాచలంలో గుడి ముందు ఉన్నాను. రామదర్శనంకు వెళ్తున్నాను... అని నవ్వుతూ బదులిచ్చారు.
ఓహో..... ఏమని చెప్పను? నా ఆనందం ద్విగుణీకృతమైంది. ఈ ఆనందసమయంలో గతంలో పోస్ట్ చేసిన రెండు టపాలను మరల పోస్ట్ చేస్తున్నాను.


          పరమపావనం 
          రామనామం 

భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన కలియుగంలో లేదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ప్రతీ భగవన్నామంలో ఒక నిగూఢ అంతరశక్తి, మహిమ వుంటుంది. మనకున్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండక్షరాలా "రామ" మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతి తెలుపుతుంది. ఇది హరిహరతత్వంబు కలిసిన మహామంత్రం. 
'ఓం నమోనారాయణాయ' అనెడి ఆష్టాక్షరి మంత్రములో "రా" అను అక్షరం జీవాక్షరం. (ఎందుకంటే ఈ మంత్రంలో 'రా' తొలగించినచో  ఓం నమో నాయణాయ  అన్నది అర్ధం లేనిదవుతుంది) 'ఓం నమశ్శివాయ' అనెడి పంచాక్షరి మంత్రంబులో "మ" అనునది జీవాక్షరం. (ఎందుకంటే ఈ మంత్రంలో 'మ' తొలగించినచో ఓం నశ్శివాయ అంటే  శివుడే లేడని అర్ధం) ఈ రెండు జీవాక్షరముల సమాహారమే "రామ". శివకేశవుల సంఘటిత శక్తియే 'రామ'మంత్రం. అందుచే రామమంత్రం సర్వశక్తివంతమైన, శ్రేష్టమైన ముక్తిప్రసాద మంత్రముగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
100 కోట్ల శ్లోకాలతో రామాయణం వాల్మికిచే రచింపబడినది. అది త్రైలోక్యవాసుల సొత్తు. దానిని పరమశివుడు అందరికి పంచెను. 33 లక్షల 33 వేల 333 శ్లోకముల వంతున పంచగ 1 శ్లోకం మిగిలిపోయింది. దానిని కూడా పంచమని మునులు కోరారు. ఆ శ్లోకంలో 32 అక్షరములు ఉన్నవి. దానిని దశాక్షరి రూపమున ముగ్గురికి పంచగా రెండక్షరములు మిగిలినవి. ఆ రెండక్షరములు శివుడు తనకై తీసుకున్నాడని కధనం. ఆ రెండక్షరములే "రామ".
                                                                                                
                                                రామనామ ప్రభావం
"రామ" అను రెండక్షరములు మనోహరమైనవి. మధురమైనవి. అమృత సమానం. ఈ రెండు అక్షరములు ముక్తి అను అమృతమును ఇచ్చును. సులభమైన ఈ నామం ఇహమందు సుఖమును, సంపదలను ఇస్తే, పరమునందు విష్ణుసాయుజ్యం ఇస్తుంది. లౌకికముగా భవభూతి, పారమార్ధికముగా ఆత్మానుభూతి రామనామం వలన కల్గుతుంది.
రాశబ్దోచ్చారణే జాతే వక్ర్తాత్పాపం విగచ్ఛతి / మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి //  (ఉమాసంహిత)
('రా' అను శబ్దం ఉచ్చరించగానే పాపం వదనమునుండి బయటపడును. పిదప 'మ'కారము వినుటతోడనే భస్మమైపోవును)
రామేతి రామచంద్రేతి రామభద్రేతి వా మనుమ్ / యావజ్జీవం జపన్ మర్త్యో జీవన్ముక్తో న సంశయః //  (ఉమాసంహిత)
(రామ, రామచంద్ర, రామభద్ర, అను ఈ మంత్రాలలో దేనినైనను జీవితాంతం వరకు జపించు మనుజుడు జీవన్ముక్తుడు కాగలడు. ఇందులో సంశయం లేదు)
కృశాను (అగ్ని) 'ర'అక్షరం అగ్నిబీజాక్షరం. భాను (సూర్యుడు) 'అ'అక్షరం సూర్యబీజాక్షరం. హిమారక (చంద్రుడు) 'మ'అక్షరం చంద్రబీజాక్షరం. ఈ మూడు బీజాక్షరములు కలసి "రామ" శబ్దమయ్యెను. అగ్నిగుణం దహించుట. అగ్నిబీజాక్షరమగు  'ర' శుభాశుభ కర్మలను దహించి మోక్షమును ఇచ్చును. సూర్యుని వలన అంధకారం నశించును. అటులనే సూర్య బీజాక్షరం 'అ' మోహాందకారమును పోగొట్టును. చంద్రుడు తాపమును హరించును. అటులనే చంద్రుని బీజాక్షరం 'మ' తాపత్రయమును హరించును.
ఉత్పత్తి కర్తయగు బ్రహ్మవంటివాడు చంద్రుడు. పోషణ కర్తయగు విష్ణువువంటివాడు సూర్యుడు. సంహార కర్తయగు శివునివంటివాడు అగ్నిదేవుడు. ఈ త్రిమూర్తిస్వరూపుడు శ్రీరాముడు. 
రామ మంత్రము ఎటువంటిదంటే - పుట్టుట, గిట్టుట అనెడి అలలు గల సంసారమను సముద్రం దాటించునదియును, బ్రహ్మవిష్ణురుద్రాదుల చేత పొగడదగినదియును, బ్రహ్మహత్యాది మహాపాపములను నశింపజేయునదియును, కామక్రోధలోభ మోహమదమాత్సర్యాలాది దుర్గుణములను సంహరించునదియును, నేను జీవుడనేడి అజ్ఞానం తొలగించునదియును, పరబ్రహ్మం (చైతన్యం) నేననెడు దివ్యజ్ఞానం వలన కలిగిన నిరాతిశయానందమును వర్ధిల్లుజేయునదియును, వేదముల కడపటిభాగమైన జ్ఞానకాండం చేత విచారింపదగినదియుయగును.  ( శ్రీ సీతారామాంజనేయ సంవాదం)
రా శబ్దోశ్చారణాదేవ ముఖాన్నిర్యాంతి పాతకాః / పునః ప్రవేశ భీత్యాచ మకారస్తూ కవాటవత్ //
(నోరు తెరిచి "రా" అని చెప్పునప్పుడే పాపములన్నియు నోటినుండి బయటికి వెళ్లిపోవుచున్నవి. మరల అవి లోపలకు ప్రవేశించకుండా "మ"కారం తో నోటిని మూసి బంధించుచున్నది)
"రా" అక్షరం ఉచ్చరించుటవలన నోరు తెరవబడి పాపములు పోయి ముఖం మధురముగా ఉండును. "మ" అక్షరం ఉచ్చరించుటవలన నోరు మూతపడి సంతోషం కలుగును.
"రా" అక్షరం బ్రహ్మస్వరూపుడునగు ఆదికూర్మముతో సమానం. "మ" అక్షరం జీవస్వరూపుడగు ఆదిశేషువుతో సమానం. 
"రా" అక్షరం ఛత్రం వలెను, "మ" అక్షరం కిరీటం వలెను సర్వ వర్ణములకంటే అధికముగా ప్రకాశించును. ఇటువంటి రామనామమును జపించిన సిద్ధత్వమును పొందుదురు.
"రా" అగ్నిబీజాక్షరం కావున దానిని స్మరించిన మాత్రమున సకలపాపములు భస్మము కావించుననియు, "మ" అమృతబీజాక్షరం కావున దానిని స్మరించిన యెడల సత్యముగా మోక్షం ఇచ్చుననియు ఋషులు తెలిపారు.
"రా" అనగా పరబ్రహ్మం, "మ" అనగా చిచ్ఛక్తి. "రా" అనగా క్షేత్రజ్ఞుడు, "మ" అనగా జీవుడు. "రా" అనగా శివుడు, "మ" అనగా శక్తి. "రా" అనగా విష్ణువు, "మ" అనగా  లక్ష్మి. "రా" అనగా బ్రహ్మం, "మ" అనగా సరస్వతి. "రా" అన్న మాత్రమున యముడు గజ గజ వణుకును, "మ" అన్న మాత్రమున అతని పాశం తెగిపోవును. రామ అన్న భవబంధములు నశించును. రామ అన్న సమస్త సంపదలు కల్గును. రామ అన్న సర్వార్ధములు సిద్ధించును. రామ అన్న బ్రహ్మహత్యాదిపాతకములెల్ల నివర్తియగును. రామ అన్న సకల సంశయములు నివృత్తియగును. రామనామం స్మరణం చేసేవారికి మోక్షం కరస్థమై రామమయమై ఉన్నది. రామ మంత్రముకంటే అధికమైన యజ్ఞంగాని, తపంగాని, వ్రతంగాని, మంత్రంగాని, మరియొకటి లేదు. 
                                  
                         తారక మంత్రం

తారకం సర్వవిషయం సర్వధా విషయమక్రమం చేతి వివేకజం జ్ఞానం // (పతంజలి యోగం)
(వివేక జన్య జ్ఞానం తారకం. ఆత్మానాత్మ వివేకజ్ఞానముచే కలిగెడు శుద్ధమైన ఆత్మజ్ఞానమునకు తారకమని పేరు. (సంసార సాగరమునుండి తరింపజేసేది కాబట్టి ఇట్టి వివేకజ్ఞానమునకు తారకం అంటారు)
రామ మంత్రం ఒక్కటియే తారకమంత్రమైనది.
తా, రకం - తన యొక్క స్వరూపం. తన స్వరూపం తాను తెలిసికొనినచో ఏ చింతయు లేక మనస్సు నెమ్మది పొందును. పరమాత్ముడైన శ్రీరామునితో ప్రత్యగాత్మ స్వరూపుడైన తాను వియ్యమగుటయే యోగమనబడును. 
రామ ఏవ పరబ్రహ్మ రామ ఏవ పరం తపః రామ ఏవ పరం తత్వం శ్రీరామో బ్రహ్మతారకం//

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే / సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే //
(నేను సదా రామనామమును ధ్యానించెదను, అది విష్ణు సహస్రనామములకు సమానమైనది. నీవును ఆ నామమును జపించుమని శివుడు పార్వతీదేవికి ఉపదేశించెను)
తారక మంత్రమునే శివుడు సదా జపించెను. జీవుడు ముక్తి పొందవలెనని తలచి కాశీలోని మరణకాలమున ఈశ్వరుడే తారకమంత్రం స్వయముగా జీవుల దక్షిణ చెవియందు ఉపదేశించును. రామ అను శబ్దమును మరా అని జపించి దోపిడిదొంగ రత్నాకరుడు వాల్మికి మహాముని అయ్యెను. సహస్రనామములతో సమానమని శివుని వచనమును విని, పార్వతీ రామనామమును పఠించి శివుని సాంగత్యం నొందెను. తన వచనములయందామెకు గల విశ్వాసం జూచి, సంతచించి ప్రసన్నుడై పార్వతికి శివుడు తన శరీరములో ఎడమభాగమును ఇచ్చెను. రామనామ స్మరణతో రాయిరూపంలోఉన్న అహల్య రామస్పర్శకు నోచుకొని పునీతురాలైనది.
రామ అను తారకమంత్రము చేత సకల పాతకములు నశించును. పార్వతీదేవికి పరమేశ్వరుడు, వాల్మికికీ నారదుడు, భరద్వాజునకు వాల్మికి, వ్యాసులకు పరాశరులు, శుకులకు వ్యాసుడు ఉపదేశించినది తారక మంత్రమే.
తారకమంత్రము కంటే ఉత్తమమంత్రం లేదు. ఈ మంత్రమును త్రికరణశుద్ధిగా అనుష్టించినవారు భవసాగరమును నిస్సంశయమముగా తరింపగలరు. నిరంతంను ప్రాణావాయువు లోపల వెలుపల సంచరించు నప్పుడెల్లను తదేకధ్యానముతో తారకమంత్రమును మననింపుచు ఉన్నను కాలక్రమేణ ఈ మహామంత్ర ప్రభావంచే ముక్తిని పొందుదురు. (మహాభక్త విజయం)
రామ అన్నది ఒక్క నామమే కాదు, మంత్రం కూడా. రామ మంత్రం మనిషిని తరింపజేసేది కావునా అది తారకమంత్రమైంది. ఇందుకు ఉదాహరణముగా ఓ కధని కంచి పీఠమునకు అధిపతి అయిన శ్రీ చంద్రశేఖరసరస్వతివారు ఓసారి చెప్పారు. ఓ అడవిలో కొందరు దొంగలు తాము చేద్దామనుకుంటున్న దొంగతనం గురించి ఇలా మాట్లాడుకొని ముక్తిని పొందినట్లు ఓ కవి చమత్కారముగా చెప్పింది చెప్పారు. 
వనే చ రామః వసు చాహరామః 
నదీం స్తరామః నభయం స్మరామః 
వనే కిరాతః ముక్తిం గతాః షంగాతే
అంటే - వనే చ రామః (అడవిలో నివశిద్దాం), వసు చాహరామః (ఈ దారిలో వెళ్ళే ప్రయాణికులనుండి సంపదను దొంగలిద్దాం), నదీం స్తరామః (దొంగాలించాక నదిని దాటేద్దాం), నభయం స్మరామః (నదిని దాటేస్తే పట్టుబడతామనే భయం వుండదు) అని అనుకున్నారు. వారు దొంగలైనప్పటికి వారి మాటలలో రామః అను శబ్దం వుండడం వలన వనే కిరాతః ముక్తిం గతాః షంగాతే .... ఆ అడవిలో కిరాతకులు మరణించినతర్వాత ముక్తిని పొందారు. రామ అన్న పదమహిమ తెలియకున్నా ఆ కిరాతకులు వారివారి మాటలమద్య అసంకల్పితముగా రామ అని పలికినందులకే ముక్తి లభిస్తే, భక్తితో శ్రద్ధతో స్మరిస్తే ఇహపరములందు ఎంతలా తరిస్తమో గుర్తించండి.
శ్రీరామప్రాతిపదికమవశేనాపి సంగృణన్ / ముక్తిం ప్రాప్నోతి మనుజః కిం పునర్బుద్ధిపూర్వకమ్ // (ఉమా సంహిత)
(శ్రీరామ అను ప్రాతిపదికమును తెలియక ఉచ్చరించినను మనుజుడు ముక్తినొందుననగా తెలిసి ఉచ్చరించిన ముక్తినొందుననుటలో సందేహం ఏముంటుంది?)
                                                                             
                    నామము గొప్పదా - రూపం గొప్పదా

రూపం నామమునకు ఆధీనం. నామం లేక రూపం యొక్క జ్ఞానం కలుగదు. రూపంగల పదార్ధం చేతిలో వున్నను నామం తెలుసుకొనని యెడల ఆ పదార్ధం గుర్తెరుంగం. నామమును ధ్యానిస్తే రూపం స్వయముగా హృదయంలో వ్యక్తమగును. మనస్సునకు ఆనందం కలుగును. సగుణ, నిర్గుణ బ్రహ్మములకు నామమే సాక్షి. ఈ రెండింటిని తెలుసుకొనుటకు నామమే ప్రధానము.వానిని చేరుటకు నామం మార్గం చూపును. (మహాభక్తవిజయం)
బ్రహ్మం సగుణమనియు, నిర్గుణమనియు చెప్పవచ్చును. సగుణ నిర్గుణములకంటే నామమే శ్రేష్టం. ఎందుకంటే - నామం యొక్క ప్రభావంవలన సగుణ నిర్గుణములు రెండును స్వాదీనమగును. అగ్ని దారువులో కలదు, ఆ అగ్నియే ప్రకటమై ప్రజ్వరిల్లును. మొదటిది అవ్యక్తం, రెండవది వ్యక్తం. అటులనే నిర్గుణబ్రహ్మం  అవ్యక్తం, సగుణబ్రహ్మం వ్యక్తం. రెండును అగమ్యములు. నామం మాత్రం గమ్యం. అందుచేత బ్రహ్మం కంటెను, రాముని కంటెను నామం శ్రేష్టమైనదని చెప్పుదురు. సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మం జీవుని హృదయములలో ప్రకాశిస్తున్ననను లోకములో సమస్తజీవులను అది గ్రహించలేక దుఃఖితులై అగచాట్లు పడుచున్నారు. ఆ కారణంచే ఆ బ్రహ్మం రూపమును ధరించి పేరు పెట్టుకొని లోకమునకు వ్యక్తమగుచున్నాడు. ఆ సగుణబ్రహ్మమునకు నామం లేనిచో స్మరించలేముకాబట్టి సగుణనిర్గుణబ్రహ్మములకంటే నామం యొక్క ప్రభావము శ్రేష్టమైయున్నది. సగుణబ్రహ్మం మాధుర్యమూర్తి, నామం మాధుర్య మహిమాశక్తి దీప్తి. రాముని వలన తరించినవారు కొందరే, రామనామం వలన తరించువారు అనంతమంది.
రామనామ్ మణిదీప్ ధయ జొహ్ రే హరంద్వార్
తులసి భీతర్ ఛాహే రహు జాం బహం ఉజ ఆర్ (తులసీదాసు)
(నీకు లోపల బయట వెలుగు కావాలని కోరుకుంటే, జిహ్వ అనే ద్వారం దగ్గర రామనామం అనే దీపాన్ని వెలిగించండి)

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే / రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః //
శ్రీరామున్ని కౌసల్యాదేవి రామా అనియు, దశరధుడు రామభద్ర యనియు, వసిష్టమహర్షి రామచంద్ర యనియు, రాజులు రఘునాధ యనియు, సీతాదేవి నాధ యనియు, భక్తులు సీతాపతి యనియు, సంబోధింతురు. అట్టి సీతారామునకు నమస్కారం.

              ఆధ్యాత్మికపరంగా రామాయణ అంతరార్ధం 

ఆధ్యాత్మిక సాధకుల దృష్టిలో రామాయణ అంతరార్ధమిది. మన ఇంట బయట జరుగుతున్నదే రామాయణం. ఎలాగంటే -

                                అయోధ్య నగరం

ఏ విధమైన సుఖదుఃఖాలు, గెలుపోటములు, రాగద్వేషాలు, కోపతాపాలు ఏవీ లేనటువంటి; సామాన్య జనునిచే జయింప వీలులేనటువంటి నగరం అయోధ్య. అనగా ఏ వాసనలు అంటని ఆనంద హృదయమే అయోధ్య.
ఆ అయోధ్య అధిపతి దశరధుడు. దశరధుడు అంటే దశేంద్రియములను (5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు) జయించినవాడు. ఆ దశరధమహారాజుకు సత్వ, రజో, తమో గుణములనే కౌసల్య, సుమిత్ర, కైకయి అనే ముగ్గురు భార్యలు. రాముడు (ధర్మం) భరతుడు (శ్రద్ధ) లక్ష్మణుడు (భక్తి) శత్రుఘ్నుడు(శక్తి) అనే నలుగురు పుత్రులు.
భగవత్ తత్వాన్ని మానవాళికి అందించడానికి మాధవుడే మానవరూపములో వచ్చిన ధర్మావతారమూర్తి శ్రీరామచంద్రమూర్తి అందరిలో వున్నా ఆత్మారాముడు. 
ఆత్మారాముడైన శ్రీరాముడు వ్యక్తమై అర్ధంకావాలంటే దానికి సంకల్పమనెడి మనస్సు అవసరం. ఆ మనస్సే సీత.
సీతారాములకు వివాహం జరిగింది. అటుపై కొంతకాలమునకు కైకయి కారణముగా శ్రీరాముడు అయోధ్యను విడిచి సీతతో కల్సి, లక్ష్మణుడు వెంటరాగా అరణ్యములకు వెడలెను. అనగా ఆనందముగా అయోధ్యలో వున్న ఆత్మరాముడు మనస్సనెడి సీతతో కూడి సుఖదుఃఖాలుతో కూడిన జీవితమనే అరణ్యములో ప్రవేశించాడు. వీడి వుండలేని భక్తి (లక్ష్మణుడు) ఆత్మను (రామున్ని) అనుసరించింది.
సీత రామున్నే చూస్తూ, రామున్నే తలస్తూ, రామున్నే జపిస్తూ, రామున్నే ధ్యానిస్తూ - అంతా రాముడే అన్న భావనతో వున్నంతకాలం రామునితోనే కూడి ఆనందముగా ఉంది. అయోధ్య, అరణ్యము రెండునూ ఆమెకు ఒకేలా ఆనందమును ఇచ్చాయి. అంటే మనస్సు(సీత) ఆత్మతో(రామునితో) కూడి అంతర్ముఖురాలై వున్నంతకాలం అయోధ్యలోనూ, అరణ్యములోను ఆనందస్థితిలోనే వుంది.
ఒకరోజు సీత బంగారులేడిని చూసింది. ఆ లేడి కావాలని రామున్ని కోరింది. బంగారులేడి ఏమిటీ? ఇది రాక్షసమాయల వుందని రాముడు వారించినను వినక ఆ లేడిపై ఆశపడి తీసుకురమ్మని రామున్ని పంపింది. అనగా అంతవరకు అంతర్ముఖమై ఆత్మారామున్ని కూడి ఆనందముగా వున్న మనస్సుదృష్టి బహిర్ముఖమై బంగారులేడి రూపములో వున్న మాయలో పడి, ముందు ఆత్మని వదిలేసింది. రాముడు వెళ్ళాకా తన దగ్గరే వున్న లక్ష్మణుడుని కూడా వెళ్ళమని దుర్భాషలాడి పంపేసింది. బహిర్ముఖమైన మనస్సు మంచిని, విచక్షణను మరిచి ప్రవర్తిస్తుందని అనడానికి ఈ ఘటనో దర్పణం. లక్ష్మణుడు వెళ్తూ గీసిన లక్ష్మణరేఖనూ దాటేసింది. దశకంఠుడు చేతికి చిక్కింది. పరమ దుఃఖితురాలైంది. లంకకు చేరింది. అంటే ఆత్మనెడి రామున్ని మొదట వదులుకున్న మనస్సు తర్వాత భక్తిత్వమనే లక్ష్మణుని విడిచిపెట్టింది. దశకంఠుడుకి బందీ అయి తీవ్ర బాధకు లోనైంది. కోరికలకు, రాగద్వేషాలకు, కోపతాపాలకు మనస్సులో స్థానం ఏర్పడితే బాధలు తప్పవు.
                                 
                                 లంకా పట్టణం

సుఖదుఃఖాలు, గెలుపోటములు, రాగద్వేషాలు, కోపతాపాలు... ఇత్యాదులకు నిలయం లంకాపట్టణం. అన్ని వాసనలను అంటిపెట్టుకున్న పట్టణం లంకా. దీనికి తొమ్మిది ద్వారములు. ఈ లంకాపట్టణం మానవ శరీరం. మానవ శరీరమునకు కూడా నవద్వారలున్నాయి. లంకకు రాజు  దశకంఠుడు.  దశకంఠుడు అంటే దశేంద్రియములకు (5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు) లోబడినవాడు. లంక చుట్టూ సాగరము అనగా మానవుని చుట్టూ వున్న ఈ  మాయాసంసారసాగరమే. 
లంకలో వున్న సీత తన దుఃఖమునకు కారణం గ్రహించి, ఏకవస్త్రముతో వుంటూ రామునికై తపిస్తూ, రామున్నే ధ్యానిస్తూ, రాముడు వచ్చి తనని రక్షిస్తాడనే నమ్మకముతో వుంటుంది. అనగా తను బహిర్ముఖమై మాయలేడిపై ఆశపడి ఆత్మానందమును కోల్పోయి, దైవానుగ్రహం లక్ష్మణుని రూపేణ వున్న, దానిని వదులుకున్నందుకే తనకింత దుర్గతి పట్టిందని, తన దుఃఖమునకు కారణం తనేనని గ్రహించి తిరిగి రామున్ని చేరాలని ఏకధ్యాసతో అంతర్ముఖురాలైంది. 
ఇక ఇక్కడ రాముడు సీతకై విలపిస్తూ (రాముడు భగవంతుడు అయినప్పటికీ పూర్తిగా మానవుడిగానే జీవించాడు), సీతను అన్వేషించడం ప్రారంభించాడు. అంటే భక్తుడు దారితప్పి తిరిగి తనకై పరితపిస్తుంటే భగవంతుడు కూడా అంతలానే ఆ భక్తునికై పరితపిస్తాడని ఇక్కడ అర్ధమోతుంది.
                                              ఆంజనేయుడు 
ఆంజనేయుడు పవనతనయుడు. అంటే ఉచ్చ్వాస నిశ్శ్వాస స్వరూపమైన ప్రాణాయామ స్వరూపుడు. 
మనస్సువేగం వాయువేగమునకు సమానం (మనోజవం మారుతతుల్య వేగం). అలా పరుగులు తీసే మనస్సుని నియంత్రించగలగడం శ్వాసతోనే సాధ్యం. ప్రాణాయామమే మనోనియంత్రనకు ఔషదం. ఈ ప్రాణాయామం ఎలా సాధ్యమౌతుందంటే ఇంద్రియములను జయించినప్పుడు (జితేంద్రియం) చక్కగా సాధ్యమౌతుంది. ఈ ఇంద్రియములను ఎలా జయించగలమంటే బుద్ధితో (బుద్ధిమతాం) జయించాలి. అప్పుడే ప్రాణాయామం చక్కగా జరుగుతుంది. ఈ ప్రాణాయామం స్వరూపుడు ఆంజనేయుడు. అంటే మూలాధారచక్రం మొదలుకొని సహస్రారం వరకు వ్యాపించగలిగినవాడు ఆంజనేయుడు. కుండలినీజాగృతి చేసి ఆత్మను పరమాత్మ దరికి చేర్చగల శక్తిమంతుడు ఆంజనేయుడు. భక్తునికి భగవంతునికి మద్య వారధి నిర్మాణకర్త ఆంజనేయుడే.
ఇక కధ లోనికి వస్తే -
సముద్రమును దాటి లంకలో ప్రవేశించాడు ఆంజనేయుడు. అనగా సంసారసాగరమనే మాయను దాటి లంక అనెడి శరీరం లోనికి ప్రవేశించాడు. సీతను దర్శించి రాముని అంగుళీయకం ఇచ్చి, త్వరలోనే రాముడు వచ్చి నిను రక్షిస్తాడని చెప్పి ఆనందపరుస్తాడు. అంటే  ప్రాణాయామం శుద్దమనస్సును చూసి పరమాత్మ అనుగ్రహం నీకు కల్గుతుందన్న అభయమిచ్చి పరమాత్మదర్శన యోగ్యత నీకు త్వరలోనే కల్గుతుందని చెప్పి ఆనందపరుస్తాడు. అనగా ప్రాణాయామం వలన సాధకుని మనస్సుకు తెలుస్తుంది ఆత్మసాక్షాత్కారం కలగబోతుందన్న అనుభూతి కల్గి ఆనందస్థితిలో వుంటుంది. ఆంజనేయుడు కొంతవరకు లంకాదహనం చేశాడు. అనగా లోపలున్న దుర్గుణాలు, వాసనలను కొంతవరకు దహనం చేశాడు. అయినా 'నేను' అనే అహంకారంతో రావణుడు హుంకరిస్తూనే వున్నాడు. అప్పుడు ఆంజనేయుడు మరింతగా తన తోకని పెంచి చుట్టలుచుట్టిన తోకనే ఆసనముగా చేసుకొని రావణుని ఎదుట కూర్చొని రామసందేశం వినిపించాడు. అనగా ప్రాణాయామ స్వరూపుడు అయిన ఆంజనేయుడు మరింతగా తన శక్తిని జాగృతి చేసి సహస్రారంవరకు ఎదిగి అక్కడ కూర్చొని లౌకికమైన కోరికలు, స్వార్ధం, అహంకారం విడిచి స్వస్థానంనకు మనస్సుని పంపేస్తావా, మరణిస్తావా అని సందేశం వినిపించాడు. 
ఇటుపై కధ అందరికీ తెల్సిందే. 
భగవత్ తత్వం అర్ధంకాక రావణుడు పతనమౌతాడు.
అగ్నిప్రవేశం చేసిన సీత రామున్ని చేరింది. అనగా సంపూర్ణముగా వాసనలన్నీ హరించబడి శుద్ధమనస్సు ఆత్మారామున్ని చేరింది.
తిరిగి అయోధ్యకి రావడం, పట్టాభిషేకం జరగడం అంటే అంతర్యామి అయిన రామునితో శుద్ధమనస్సనెడి సీత అయోధ్య అనెడి హృదయంలో కలిసివుండడమే పట్టాభిషేకం. 
కొంతకాలమనంతరం సీతను అడవిలో విడిచిపెట్టేయడంలో ఆంతర్యం ఏమిటంటే -
శుద్ధమనస్సు అలానే హృదయంలోనే ఆత్మారామున్ని చూసుకుంటూ వుండిపోతే శుద్ధమనస్సు స్థాయిలోనే వుంటుంది. భగవంతుడు శుద్దమనస్సులను ఉద్ధరించి తనస్థాయిలో (చైతన్యంలో) పూర్తిగా లయం చేయాలని భావిస్తాడు కాబట్టి, ఎక్కడనుండి వచ్చిందో అక్కడ లయమౌతానే చైతన్యంలో కలుస్తుంది కాబట్టి సీత అనెడి శుద్ధమనస్సును విడిచిపెట్టడం జరిగింది. అప్పుడుకూడా సీత అంతర్ముఖురాలై దైవధ్యానంలో వుండి కొంతకాలం తర్వాత ఎక్కడ నుండి వచ్చిందో అక్కడే లయమైంది. పుడమి నుండి వచ్చి పుడమిలోనే లయమై చైతన్యస్వరూపిని అయింది.
                            మనోజవం మారుతతుల్యవేగమ్ 
                            జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
                            వాతాత్మజం వానరయూధ ముఖ్యమ్
                            శ్రీరామ దూతం శరణం ప్రపద్యే// 
మనస్సమాన గతిలో వాయుసదృశ్య వేగంతో పరమజితేంద్రియుడై  శ్రీమంతుల్లో(బుద్ధిలో) శ్రేష్టుడైన పవన నందనుడు వానరాగ్రగణ్యుడు అయిన శ్రీరామ దూతను శరణువేడుతున్నాను. 
                            శ్రీ రామ చంద్ర చరణౌ మనసా స్మరామి 
                            శ్రీ రామ చంద్ర చరణౌ వచసా గృణామి
                            శ్రీ రామ చంద్ర చరణౌ శిరసా నమామి 
                            శ్రీ రామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే//
శ్రీరామచంద్రుని చరణములను నేను మనసా స్మరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను వాక్కు ద్వారా కీర్తించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములకు శిరస్సు వంచి నమష్కరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను నేను శరణువేడుచున్నాను. 
7, ఫిబ్రవరి 2013, గురువారం

స్త్రీలు వేదవిద్యకు అర్హులేనా???

క్రిందటి టపా 'స్త్రీల సందేహాలు' చదివిన ఒకరు  వేదాన్ని ఆడవారు, బ్రాహ్మణేతరులు చదవకూడదంటుంటారు. ఇది నిజమేనా అండీ ... అని ప్రశ్నించారు. 
ఈ ప్రశ్నలకు సమాధానం మన శాస్త్రాల యందే ఉన్నది.

స్త్రీపురుషుల శరీరసృష్టియందు బేధం కలదు. శరీర నిర్మాణమున త్వచము, రక్తము, మాంసము, మేధస్సు, మజ్జ, అస్థి అను ఆరుకోశములు కలవు. త్వచమూ, రక్తమూ, మాంసము స్త్రీల శరీరమునందు అధికముగాను, మేధస్సు మజ్జ, అస్థి కాస్త తక్కువగాను ఉండడమువలన స్త్రీ పురుషుని కంటే తక్కువ దేహబలం కలిగియున్నది. ఇది సృష్టి నియమం. అందుచే మనోనిగ్రహము, ధారణాశక్తి, బలము పురుషులకు ఉన్నంతగా స్త్రీలకు ఉండదన్నది యదార్ధం. అలానే పురుషుల కంటే స్త్రీలల్లో ప్రేమ, శాంతస్వభావం, మృదుత్వం అధికం. ఇవి చాలు, భగవద్భక్తికిని, వేదాధ్యయనమునకు, బ్రహ్మజ్ఞానమునకు! 
అయితే వేదమంత్రధారణలో పురుషులకున్న దృఢశక్తి స్త్రీలల్లో ఉండదు. మరియు బ్రహ్మచర్యం వలన అమితశక్తిని పురుషులు పొందగలరు. స్త్రీలల్లో నెలనెలా ఋతుక్రమం వలన కాయికశక్తి, మానసికశక్తి, బుద్ధినిశ్చయాత్మకశక్తి కొంత తగ్గుతుంది. ఈ కారణం వలన బ్రహ్మవిద్య యందు కొంత అవరోధం ఉంటుందన్నది నిజమేనైనప్పటికీ వేదవిద్యలను అభ్యసించే అర్హత స్త్రీలకు లేదనుకోవడం తప్పు. స్థిరసంకల్పముతో ఈ విద్యలను అభ్యసించవచ్చును. అలా అభ్యసించినవారిలో గార్గేయ, మైత్రేయి, విశ్వవర... మొదలగువారు ఉన్నారు. 

భగవద్గీత యందు 'కీర్తి: శ్రీర్వాక్చనారీణాం స్మృతిర్మేధా ద్రుతి: క్షమా' స్త్రీల యందలి కీర్తి, ఐశ్వర్యం, వాక్చమత్కృతి, ధారణాశక్తి, బుద్ధిబలం, దైర్యం, ఓర్పు... నా అంశములే (స్వరూపములే) అన్న శ్రీకృష్ణ పరమాత్మ మాటలను పరిగణలోనికి తీసుకొని పరిశీలించిన ఇన్ని భగవదంశములున్న స్త్రీ వేదవిద్యకు అనర్హురాలని అనుకోవడం అవివేకం.

ఇక మన వేదగ్రంధాలను పరిశీలిస్తే - 
సమస్తమైన వేదవేదాంత రహస్యాలను పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించలేదా?  శ్రీమన్నారాయణుడు భూదేవికి బోధించలేదా? ... వీరంతా శక్తిస్వరూపులు కాబట్టి, వీరిని పరిగణలోనికి తీసుకురాకూడదని అనుకుంటే -
యాజ్ఞవల్క్యమహర్షి బృహదారణ్యకోపనిషత్తులో, తన భార్యయైన మైత్రేయికిని, శ్రీ కపిలాచార్యుడు సాంఖ్యశాస్త్రమందు తనతల్లియైన దేవహుతికిని, మతంగమహర్షి తన శిష్యురాలైన శబరికిని వేదవిద్యలు బోధించలేదా?

యోగాదికారిణమునకు అందరునూ అర్హులే. బాలుడు, వృద్ధుడు, వ్యాధిగ్రస్తుడు, యౌవనస్థుడు, స్త్రీ, శూద్రుడు అందరునూ జ్ఞానమునకు సమానాధికారులే నని ఈ క్రింది శ్లోకం ద్వారా తెలుస్తుంది.
యోగాదికారిణస్సర్వే ప్రాణిన స్సర్వదా యతః /
బాలో వృద్ధో వ్యాధియుక్తో యువా స్త్రీ శూద్రజన్మబృత్ // (సనత్కుమార సంహిత)

బ్రహ్మచారీ గృహస్థో వా వానప్రస్థో థవా యతి: /
నారీ వా వృషలో వా పిపక్వో బ్రహ్మ విచారయేత్ // (రమణగీత)
బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, యతి, స్త్రీ వీరిలో ఎవరికైనను మనఃపరిపక్వత యున్నచో బ్రహ్మవిచారం చేయవచ్చు. 

శూద్రులు వేదవిద్యకు అర్హులేనా? 
శూద్రులంటే ఎవరు? 
పుట్టుకతో అందరూ శూద్రులే.
జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః /
వేదపాఠాత్తు విప్రస్స్యాత్ బ్రహ్మజ్ఞానాత్తు బ్రాహ్మణః //
ఎవరైనను జననముచే శూద్రుడును, ఆత్మసంస్కారాది కర్మముచే ద్విజుడును, వేదాధ్యయనముచే విప్రుడును, బ్రహ్మజ్ఞానము కలుగునప్పుడు బ్రాహ్మణుడును అగుచున్నారు.

న యోనిర్నాపి సంస్కారో న శ్రుతం న చ సంతతి: /
కారణాని ద్విజత్వస్య వృత్తమేవ తు కారణమ్ //
బ్రాహ్మణత్వమునకు కారణం బ్రాహ్మణస్త్రీ యందు జన్మించుట కాదు, ఉపనయనాది సంస్కారములు కాదు, వేదాధ్యయనం కాదు, బ్రాహ్మణసంతతి కాదు, సత్యధర్మాది వృత్తియే బ్రాహ్మణత్వం.

సత్యం దానం క్షమా శీల మానృశంస్యం తపో ఘ్రుణా /
దృశ్యంతే యత్ర నాగేంద్ర స బ్రాహ్మణ ఇతి స్మృతః //
సత్యము, దానము, క్షమ, ఓర్పు, సదాచారం, మానవత్వం, తపస్సు, జీవకారుణ్యం మొదలగు గుణములు ఎవరియందు యుండునో వారు బ్రాహ్మణులే అన్నది వేదవాక్యం.

శూద్రోపి శీలసంపన్నోగుణవాన్ బ్రాహ్మణో భవేత్ /
బ్రాహ్మణోపి క్రియాహీనః శూద్రాత్ర్పత్యవరో భవేత్ //
శూద్రకులమందు జన్మించినవారైనను, శమదమాది సద్గుణసంపన్నుడై  యుండినచో వారు బ్రాహ్మణులే. బ్రాహ్మణకులమందు జన్మించినవారైనను, సదాచార సద్గుణ దూరుడైనచో శూద్రుని కన్న నీచుడని భావించవచ్చును.

స్వభావాలు బట్టే వర్ణములుంటాయన్నదే కృష్ణ పరమాత్మ మాట కూడా.
బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప /
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః // (భగవద్గీత)
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను నాలుగు వర్ణముల వారిని వారివారి స్వభావాలను బట్టి విభజన యుండును.

మాం హి పార్ధ వ్యపాశ్రిత్య యేపి స్యు: పాపయోనయః /
స్త్రీయో వైశ్యాస్తథా శూద్రాస్తే పి యాంతి పరాం గతిమ్ // (భగవద్గీత)
ఓ పార్ధా! నీచయోనియందు జన్మించిన వారెవరు గలరో వారున్నూ, స్త్రీలును, వైశ్యులును, శూద్రులును నన్ను ధ్యానించి జ్ఞానవంతులై శాశ్వతానందమగు పరమపదం పొందుచున్నారు.
దీనిబట్టి జ్ఞానసముపార్జనకు అందరూ అర్హులే అని అర్ధమౌతుంది కదా.

న చర్మణో న రక్తస్య మాంసస్య చ న చాస్థినః /
న జాతి రాత్మనో జాతి ర్వ్యవహార ప్రకల్పితా // (తేజోబిందూపనిషత్)
ఆత్మకు జాతి బేధం లేదు, అలానే చర్మానికి, రక్తమునకు, మాంసమునకు, అస్థికిని జాతి బేధంలేదు, జాతి సాధారణ వ్యవహార కల్పితమే.

న గోత్రం న కులం సూత్రం న విభుత్వం న శూన్యతా /
న స్త్రీర్న యోషిన్నో వృద్ధా న కన్యా న వితంతుతా //
గోత్రము, కులము, సూత్రము, గొప్పది, చిన్నది, స్త్రీ, యువతి, వృద్ధస్త్రీ, కన్య, వితంతువు మొదలగుగా గల బేదములు లేకుండా వేదవిద్యాభ్యాసం చేయవచ్చని ఋభు మహర్షి నిదాఘునకు బోధించెను.

 ఇక ఆధ్యాత్మ జ్ఞానమునకు ప్రధానమైనది శరీరం కాదు, హృదయస్థమే ప్రధానం. దానికి స్త్రీపురుష బేధమేమున్నది? శ్రీ శంకరాచార్య భగవత్పాదులవారి అనుభవం ఒకటి పరిశీలిద్దాం -

వర్ణజాతిబేధములు తగవని, వీటినుండి జనులను ఉద్ధరించాలని పరమశివుడు తలచి, కాశీక్షేత్రమునకు వెళ్ళుచున్న శ్రీ శంకరాచార్యులవారికి చండాలవేషధారియై ఎదురుగా రాగా, 'ఆవలకు(ప్రక్కకు) తొలగ'మని శంకరాచార్యులవారు పలికిరి. అంతట చండాలవేషధారియైన ఈశ్వరుడు ఇట్లనెను -
అన్నమయా దన్నమయ మథవా చైతన్యమేవ చైతన్యాత్ /
యతివర! దూరీ కర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చ గచ్చేతి //
ఓ యతివర్యా! అన్నరసమైన శరీరమునుండి అన్నమయమైన శరీరమును దూరముగా తొలగమని కోరుతున్నావా? లేక చైతన్యరూపమైన ప్రత్యగాత్మను, చైతన్యరూపమైన ప్రత్యగాత్మనుండి దూరముగా తొలగించమని కోరుచున్నావా? అన్నమయ శరీరం అశుద్ధమైనచో, నీ శరీరముకూడా అన్నమయమై యున్నదికావున అదియునూ ఆశుద్ధమే. లేక చైతన్య రూపమగు ఆత్మతో తొలగించమని చెప్పినచో, ఆత్మ సర్వవ్యాపి కనుక, ఆత్మచైతన్యం లేని స్థలమెచ్చట కలదు? అని సమత్వమును బోధించే కధనం బట్టి స్త్రీ పురుష, వర్ణజాతిబేధములు లేవని గ్రహించవచ్చును.

ఇక్కడ మరో శాస్త్రీయమైన విషయాన్ని కూడా పరిశీలిద్దాం -
స్త్రీలు గర్భంతో ఉన్నసమయమందు వారి వారి విచారముననుసరించి సంతానం కలుగునని నిరూపింపబడినది. అందుకు శాస్త్రములయందు ఉన్న కొన్ని ఉదాహరణలు...
హిరణ్యకశిపుడు తపస్సు చేయుచున్నపుడు ఇంద్రుడు హిరణ్యకశిపుడు భార్యను అపహరించి తీసుకొని పొతున్నపుడు నారదమహర్షి అడ్డుకొని ఆమెను తన ఆశ్రమమునకు తీసుకొని వెళతాడు. అక్కడ ఆమెకు శ్రీహరి గురించి జ్ఞానబోధ చేయుచున్నపుడు ఆమె కడుపున గల ప్రహ్లాదుడు వింటుంటాడు. నారదమహర్షికి శుశ్రూష చేసి వారి ఉపదేశప్రకారం పరమాత్మను ధ్యానించుటచే ఆమె గర్భంలో యున్నది అసురబీజమైనను భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు జన్మించెను.
సుభద్ర గర్భంతో ఉన్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహం గురించి చెప్తున్నప్పుడే అభిమన్యుడు అది వింటూ ఊ కొట్టడం, శ్రీకృష్ణుడు చక్రం అడ్డుపెట్టినట్లు..... భారతంనందు కలదు.
జిజాబాయ్ గర్భంలో ఉన్నప్పుడే శివాజీ చక్రవర్తి ఎన్నో ధీరోదత్తమైన కధలను, మంచి మంచి విషయాలను తల్లి ద్వారా గ్రహించినట్లు చరిత్ర చెప్తుంది.
పై విషయాలను గమనించే గర్భిణీస్త్రీలు సాత్త్విక ఆహారంతో పాటు సదాచారులై, దైవభక్తిపరులై ఉంటూ, సత్కధలను, ఆధ్యాత్మిక గ్రంధపారాయణమును చేయవలయునని, తద్వారా సత్సంతానం కలుగునని పెద్దలు చెప్తుంటారు. అలానే ఇటువంటి అధ్యాయనములు చేసిన స్త్రీ వలన ఆమెకు పుట్టిన బిడ్డలు జ్ఞానవంతులగుదురు. తల్లే తొలిగురువు. ఇటువంటి స్త్రీవలన ఆ కుటుంబం అంతా అభివృద్ధిలోనికి వచ్చును. ఇల్లాలే ఇంటికి దీపం.

4, ఫిబ్రవరి 2013, సోమవారం

స్త్రీల సందేహాలు

ఆధ్యాత్మికపరంగా స్త్రీలకు కొన్ని సందేహాలు కలుగుతుంటాయి. ఋతుకాలమందు ఎప్పటిలా దైవ ధ్యానం చేయవచ్చా? గ్రంధ పారాయణం చేయవచ్చా? ... యిత్యాది సందేహాలు కొన్ని కలుగుతుంటాయి.
ఇటువంటి సందేహాలకు జవాబులు మన శాస్త్రాలలో కలవు. వాటినే పెద్దలు చెప్తుంటారు.

శాస్త్రమందు కర్మకాండమనియు, జ్ఞానకాండమనియు రెండు వర్గములు కలవు. ఇందు కర్మకాండవిధి ననుసరించిన కార్యములు ఋతుకాలమున చేయరాదు. అవి యజ్ఞాది క్రతువులు, దేవతార్చన, గ్రంధపారాయణం, వాద్యములతో భజన చేయుట, కృష్ణాజినాది ఆసనములపై కూర్చుండుట, తులసి రుద్రాక్షాది మాలలతో జపమాచరించుట మొదలగునవి చేయరాదు. ఎందుచేతనంటే విగ్రహాది పూజల విషయమై పైన చెప్పినవన్నియూ దేహమునకు అన్యములు కావున.

ఇక, పరమాత్మ సర్వదా తానై ఆత్మరూపంలో హృదయమునందు యుండును. ఈ ఆత్మ సదా శుద్ధమై, ముక్తమై యుండును. దానికి దేహేంద్రియములతో సంబంధం లేదుకనుక, దేహ, కాలబేధ విచారము జేయకనే బ్రహ్మనిష్ఠ చేయవలయునన్నది శాస్త్రవచనం. దేహపరంగా యోచిస్తే ఈ శరీరం మలినపూరితమే.
అత్యంత మలినో దేహో దేహీ త్వత్యంత నిర్మలః /
ఉభయోరంతరం జ్ఞాత్వా కస్యశౌచం విధీయతే // 
పంచభూత సమ్మేళనమై మలమూత్ర క్రిమికీటక సంకులమైన ఈ దేహం సర్వదా అశుచియే. శుద్ధమై ముక్తమై యుండెడు ఆత్మ మాత్రం సర్వదా పరిశుద్దముగా యున్నది.
కావున ఏ సమయమందైనను బ్రహ్మ(దైవ) ధ్యానం మాత్రం తప్పక చేయవచ్చును. 
ఓసారి శ్రీరమణ మహర్షి వారు ఈ సందేహం వెలిబుచ్చిన స్త్రీలతో 'ఏమేమీ? లోపలున్న చైతన్యం ఋతుకాలమందు ప్రక్కకు తప్పుకుంటుందా? బయటికి వచ్చేస్తుందా...ఏం?ఎప్పుడూ హృదయంలో ఉండేదానిని ధ్యానించడం మానేయాలా ఏం?'అని చమత్కరించారట.

నో దేశ కాలనియమః శౌచాశౌచ వినిర్ణయః /
పరం సంకీర్తనాదేవ రామరామేతి ముచ్యతే //
పరమాత్మ ధ్యానమునకు దేశకాల నియమం లేదు. అలాగనే శౌచ అశౌచ బేధమూ లేదు. శ్రీరామరామ అను పరమోత్కృష్టమగు సంకీర్తనను ఏ సమయమందు చేసినను బంధములనుండి విముక్తులగుదురు.

'ఆత్మ' ఋతుకాలమందును, ఇతర కాలములయందు కూడా హృదయమునందే యుండును. ఇది స్వజాతీయ, విజాతీయ, స్వగత, మలిన, అమలిన బేధరహితం. అది అఖండమై విరాజిల్లు శుద్ధమైన చైతన్య స్వరూపం. కనుక సర్వకాలములయందు, సర్వావస్థలలో ధ్యానించవచ్చును.

రత్యంతరే మూత్ర పురీషయోర్వా 
చండాలవేశ్మన్యధవా శ్మశానే /
కృతప్రయత్నో ప్యకృత ప్రయత్నః 
సదా స్మరేత్ కేశవనామధేయమ్ // (వైశ్వానరస్మృతి)
రతికాలమందు గాని, మలమూత్ర విసర్జన సమయమందు గాని, చండాలులు ఉన్నచోట వున్నగాని, శ్మశానభూమి యందుండి గాని, స్నాన సంధ్యాది కృత్యములచే శుచితో గూడి గాని, లేక కాలు చేతులు కడుగకనే గాని, సర్వేశ్వర స్మరణధ్యాన కీర్తనములను చేయవచ్చును.

శరీరాదులందెంత మాలిన్యము ఉండినను ఆత్మకు అవి అంటవు. దుర్గంధజలమందు ప్రతిబింబించిన సూర్యునకు ఆ దుర్వాసన అంటునా?  
శుచిర్వా ప్యశుచిర్వాపియో జపేత్ ప్రణవం సదా /
స న లిప్యతి పాపేనా పద్మపత్ర మివాంభసా // (యోగాచూడామణ్యుపనిషత్)
శుచితో, లేదా ఆశుచితోనైనను ఎవరు పరమాత్మను ధ్యానించునో వారు తామరాకేలగున నీటిలో తడవకుండునో అలాగున సంసార మాలిన్యముచే స్పృశింపబడడు. 

అలానే దేహానికే గాని,ఆత్మకు శరీరాది దోషములు అంటవని గీత యందు కృష్ణపరమాత్మ చెప్పిన ఓ రెండు శ్లోకములను పరిశీలిద్దాం -

యధా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవి: /
క్షేత్రం క్షేత్రీ తధా కృత్స్నం ప్రకాశయతి భారత //               
సూర్యుడు లోకమంతయూ ప్రకాశించిచుండునను, లోకం తనయందు ఎట్లు యుండదో అట్లే ఆత్మ అన్ని జీవరాసులలోను ప్రకాశించుచుండునను ఆ శరీరాది దోషములు ఆత్మను అంటవు.

యధా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే /
సర్వత్రావస్థితో దేహే తధాత్మా నోపలిప్యతే //
సర్వవ్యాపి అగు ఆకాశం అతిసూక్ష్మమగుటచే దానియందున్న భూతజాలములచే ఎట్లు మాలిన్యమును పొందదో అట్లే సర్వత్ర అన్ని ఉపాధుల యందును నిండియున్నను ఆత్మ మాలిన్యమునొందదు. 

ఈ రీతిలోనే మరో విషయాన్ని తెలుసుకోవాలి -
శౌచాచారాది క్రియలు దేహమందు జరిపినను హృదయం శుద్ధిగా లేనిచో పరమాత్మధ్యానం నిష్ప్రయోజనం. 
సర్వేషామేవ శౌచానా మర్ధశౌచం పరం స్మృతమ్ /
యోర్ధే శుచి: స తు శుచి: న మృద్వారి శుచిశ్శుచి:// (చాణక్యస్మృతి)
సమస్త శౌచాది క్రియలలో మనః పారిశుద్ధ్యం గొప్ప శుద్ధియని మహర్షులు తలంచుదురు. ఎవరు నిర్మలాత్ములై యుందురో, వారెంత యశుద్ధంగా ఉండినను మహాశుచి గలవారే. ఆత్మశుద్ధిలేనివారు మృజ్జలాదులచే ఎన్నివిధముల శుద్ధి చేసినను వారు మహా అశుద్ధులే.

మరి పరమార్ధ చింతన చేయువారికి ఉండవలసిన హృదయశుద్ధి ఎలా అలవడుతుందంటే -

వాచాం శౌచం చ మనసః శౌచమింద్రియ నిగ్రహః /
సర్వభూత దయా శౌచ మేతచ్చౌచం పరార్ధినామ్ // ( హితోపదేశం)
1. వాక్శుద్ధి (సత్యంగా, హితంగా, మధురంగా పలుకుట) 2. మనశుద్ధి (విషయవాసనా రహితమై యుండుట) 3. చక్షురాదీంద్రియశుద్ధి (నేత్రాదీంద్రియములు  వాటి వాటి విషయములగు చెడ్డవృత్తులలో ప్రవేశింపకుండుట) 4. సమస్త ప్రాణుల యందు కారుణ్య ముండుట. ఇవియే హృదయాన్ని శుద్ధిచేసే సాధనోపకరణములు.

పై విషయాలు బట్టి స్పష్టమైనది ఏమిటంటే -

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపివా /
యస్స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచి: //
స్నానాది క్రియలచే శుద్ధుడై గాని, స్నాన సంధ్యాదుల చేయక ఆశుద్ధుడై గాని, లేక అన్ని అవశాలను పొందియుండి గాని పరమాత్మధ్యానం చేయవచ్చును. అట్లు ధ్యానిన్చువారు ఆ ధ్యాన పవిత్రతచే ఆశుచివారైనను అంతర బాహ్యశుద్ధులను కలిగినవారే అగుదురు.

ఈ విధంగా శాస్త్రాలు, పెద్దలు చెప్పారని శుచి ఆచారాదులు అవసరం లేదని భావన తగదు. శాస్త్రాలు, పెద్దవారు చెప్పేదేమిటంటే - 
దేహానికి సంబందించిన సహజప్రక్రియలను ఆశుద్ధత్వముగా, అనర్హతగా భావించి పరమాత్మ ధ్యానాన్నీ, స్మరణని  విడువరాదని! 
స్నానశౌచాచారములు తప్పక యుండవలెను. ఆశుచిత్వం తమోగుణం. తమోగుణం సాధకులకు పనికిరాదు. 'అచారహీనం న పునంతి వేదాః' ఆచారహీనున్ని వేదములు పవిత్రునిగా చేయజాలవు, కావునా ఆధ్యాత్మిక జిజ్ఞాసపరులకు శుద్ధశౌచారములు తప్పనిసరి.