30, అక్టోబర్ 2013, బుధవారం

అంతరింద్రియం / అంతఃకరణ చతుష్టయం

శరీరం లోపల అంతర్గముగా నుండు సూక్ష్మతత్త్వములతో కూడియుండిన అంతఃకరణమునే అంతరింద్రియమని అందురు. పంచభూతముల యొక్క సూక్ష్మంశములే మనో, బుద్ధి, చిత్త, అహంకారంలతో కూడిన అంతఃకరణం. ఈ నాలుగింటితో కూడిన అంతఃకరణమునే అంతఃకరణ చతుష్టయం అంటారు. గాలి, అగ్ని, జలము, పృథ్వి, ఆకాశాంశలతో కూడినదే అంతఃకరణం. అంతఃకరణముది ఆకాశతత్త్వం కాగా, మనస్సుది వాయుతత్త్వం, బుద్ధిది అగ్ని తత్త్వం, చిత్తముది జలతత్త్వం, అహముది పృథ్వితత్త్వం.
మనస్సు :- వాయుతత్త్వం అగుటచే నిరంతరమూ చలించుటకు కారణమగుచున్నది. ఇది చంచలమైనది. సంకల్ప, వికల్పములు దీని కార్యములు. అనిశ్చితస్థితి. చంద్రుడు అధిష్టానదేవత.
బుద్ధి :- అగ్ని అంశమగుటచే నిశ్చయించుగుణం కలిగియున్నది. నిశ్చలస్థితి. నిశ్చయం, మంచి చెడుల విచక్షణాజ్ఞానం దీని లక్షణం. స్వంత సామర్ధ్యం కలది. అధిష్టానదేవత పరబ్రహ్మ.
చిత్తము :- జలాంశమగుటచే మందగమనం దీని స్వభావం. అనేక విధములగు ఆలోచనలు కలది. ప్రాణి కోట్ల వృత్తులన్నియు దీనియందు యుండును. శరీరమునందలి సర్వేంద్రియములను చలింపజేస్తుంది. మహావిష్ణువు అధిష్టానదేవత.
అహంకారం :- పృధ్వీ అంశం. కాఠిన్యస్వభావం. నేను, నాది అను అభిమానమును కల్గించును. ఈ తత్త్వంతో చేయు క్రియలు, వాటిచే ఏర్పడిన గర్వం దీని స్వంతం. కోపం, రోషం, స్వార్ధం మొదలగు వాటికి ఈ అహమే కారణం. అధిష్టానదేవత రుద్రుడు.
ఈ అంతఃకరణ చతుష్టయం విజ్రుంభన ఆగి నిర్విషయస్థితి కలుగనంతవరకు అంతరశుద్ధి కలుగదు. అంతఃకరణశుద్ధి కానంతవరకు ఆత్మతత్త్వం గ్రహించలేం.28, అక్టోబర్ 2013, సోమవారం

"మౌనం"


మౌనం -
              దైవభాష.
              సనాతనం.
              లిపి లేని విశ్వభాష.
              ధార్మిక దివ్యత్వానికి ద్వారం.
              సనాతన భాషాస్రవంతి.
మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు, నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ (మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియమంటారు) విజ్రుంభణను ఆపడం. మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం.

మౌనమంటే -
                   నిరంతర భాషణ.
                   చింత, చింతన లేని తపస్సు.
                   అఖండ ఆనందపు ఆత్మస్థితి.
                   విషయ శూన్యావస్థ.
యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ శంకరులు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది.
పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదుశాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి. అహంవృత్తి ఏమాత్రం  ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు. ఈ మౌనం మూడు రకాలు.
1. వాజ్మౌనం :-                   వాక్కుని నిరోదించడం. ఈ రకమైన మౌనం వలన పరుషవచనాలు పలుకుట, అసత్యమాడుట, పరనింద చేయుట, చాడీలు చెప్పుట, అసందర్భ వ్యర్ధప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి.


2. అక్షమౌనం :-
                
కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక యేకాగ్రనిష్టలో నుండుట. ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యానవైరాగ్యాలు బాగా అలవడుతాయి.


3. కాష్ఠమౌనం :-
      
 
దీనిని మానసిక మౌనమంటారు. మౌనధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠమౌనమంటారు. ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది.
దీనినే 40 సంవత్సరములు మౌనదీక్షలో గడిపిన శ్రీ మెహర్ బాబా గారు ఇలా తెలిపారు - 'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది. మనస్సు మౌనంగా వున్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'.

మౌనం -
                      దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.
                      గురువు మౌనం జ్ఞానానుగ్రహం.
                      జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.
                      భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన.
ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు, మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది, అంతర్యామిని దర్శింపజేస్తుంది, మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.
మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధసంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష. అనేక సంవత్సరములు చర్చలద్వారా, చర్యలద్వారా దేనిని తెలుసుకోలేరో, దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు. మాటలకు ఆటుపోట్లు వుంటాయి, కానీ; మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞానస్రవంతి.
మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోను మాట్లాడువారిని సదా మహామౌనలేయని మహాత్ములు పేర్కొంటారు.
పలుకుల కందక భావమునంటక భాసిలు బ్రహ్మము దానగుచుం
బలుమరు బల్కగ పల్కినచో నవి పల్కితినంచు దలంపక యే
తలపులు లేక నిరంతర సౌఖ్యసుధారస మానుచు నుండుట ని
ర్మలమగు మౌనము మారుతనందన! మానక దీవి భజింపదగున్.
                                          - శ్రీ సీతారామాంజనేయ సంవాదం.
ఓ వాయుపుత్రా! అవాజ్మనసగోచరమైన బ్రహ్మమే స్వస్వరూపభూతమైనదని నిశ్చయించి, యెప్పటికైనను ఏ మాటలనైనను మాటలాడక యోగి సదా యాత్మానుభవనిష్ఠుడై యుండును. ఒకవేళ మాట్లాడినను 'నేను మాట్లాడితిని' అని తలంపడు. ఇంత యేల? అతనికి సంకల్పములే వుండవు. ఇట్టిస్థితిగలిగి సర్వకాలములయందును స్వస్వరూపానందానుభావమును చెందుచుండుటయే మౌనం. 

'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం' వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది. భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ధప్రపంచం కంటే అందమైనది, అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే అఖండానందం, ఇదే ఆత్మసాక్షాత్కారం, ఇదే మోక్షం.