27, మే 2016, శుక్రవారం

తెలుసుకోవాలని ఉంది...

శంబూకుడి వధ గురించి వ్రాయండి, ఈ మధ్య ఏదేదో వింటున్నాను, మీరు చెపితే తెలుసుకోవాలని ఉంది...

అని ఓ మిత్రురాలు అడిగారు.

నిజమే, ఈ కధపై విమర్శలు వున్నాయి. శూద్రులు తపస్సు చేయకూడదా? చేస్తే నేరమా? అందుకు సంహరిస్తారా? శూద్రులంటే ఎందుకింత వివక్ష? ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? ధర్మమూర్తి అని అంటారే శ్రీరామచంద్రున్ని, మరి ఆయనే, ఎవరికీ ఏ హానీచేయక తపస్సు  చేసుకుంటున్నశంబూకుడు అన్న శూద్రున్ని సంహరించడం ధర్మమా? ... ఇత్యాది ప్రశ్నలతో కొన్ని విమర్శలు వింటున్నాను అప్పుడప్పుడు!
మిత్రమా!
ఈ శంబూకుని కధ లోనికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చతుర్వర్ణాలు గురించి, శాస్త్రం గురించి, అప్పటి యుగధర్మం గురించి,  అప్పటి ప్రజలు ఎలా వుండేవారు?... ఇత్యాది విషయాలు ఓసారి పరిశీలిస్తే -

రామాయణం బాల కాండము, అయోధ్యా కాండము, అరణ్య కాండము, కిష్కింధ కాండము, సుందర కాండము, యుధ్ధ కాండము, ఉత్తర కాండము అనే ఏడుకాండలుతో కూడుకున్నది. ఇందులో ఉత్తరకాండ వాల్మీకి వ్రాసింది కాదని, ఇది ఋషిప్రోక్తమని / ప్రక్షిప్తమని కొందరు చెప్తుంటారు. అలానే రామాయణంలో కొన్ని కధలు (లక్ష్మణ రేఖ, శబరీ రామునికి పండ్లు తినిపించడం, హనుమాన్ తన గుండెను చీల్చడం మొ..) కూడా ఋషిప్రోక్తమేనని అంటుంటారు.
అసలు ఈ ఋషిప్రోక్తమంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం.

ఈ సృష్టి మొత్తము పరస్పరత్వముపై ఆధారపడి యున్నది. ఒక అంశంతో పరస్పర సహకారం లేక మరియొక అంశమునకు అస్తిత్వం లేదు. సర్వజీవరాశుల యెడలను  ఈ సత్యమును మనం గమనిస్తే అవగతమౌతుంది. ఈ పరస్పరత్వము గురించి, ధర్మాల గురించి తెలియజేయునది శాస్త్రం. దీనియందు ప్రజ్ఞయున్నవారిని లేదా దీనిని దర్శించేవారిని ద్రష్టలు లేక ఋషులు అందురు. ఋషులు అంటే జ్ఞానపారంగతులు. జీవిత సూక్ష్మాన్ని, తత్త్వాల్ని దర్శించగలిగే యోగద్రష్టలు. వేలసంవత్సరాలు తరబడి ఋషుల పరంపర ఈ పరస్పరత్వమను మహత్తర సత్యమును దర్శనం చేసి, క్రోడీకరించి ఇచ్చిన శాస్త్రం పరంపరాగతంగా మనకు అందింపబడుచున్నది.
ఋషులు అంటే ఆశ్రమంలోనో, అరణ్యంలోనో, తపోదీక్షతలో ఉంటూ నిస్సంతుడై సమాజానికి దూరంగా వుండేవారని అనుకుంటే పొరపాటే.  యుగయుగాలుగా, తరతరాలుగా కాల ప్రవాహగతిలో ఎప్పటికప్పుడు మార్పులను సంతరించుకుంటూ సాగిపోతున్న సమాజానికి ఎప్పటికీ కాలదోషంపట్టని సంస్కృతీవిధిని, సమ్యగ్వివేచన, ఆచరణ అనేవి సమాజహితం కోసం శాస్త్రాల్లో పొందుపరుస్తూ భావితరాలకు మార్గదర్శకం చేసేవారే ఋషులు. 
ఋషులు అనుభవజ్ఞానంతో యోగదృష్టితో దర్శించిన ధర్మమే మనకు ప్రమాణికం.
ధర్మమును ఆచరించాలంటే - ఏది ధర్మమో, ఏది కాదో గ్రహించే జ్ఞానముండాలి. అలాంటి జ్ఞానం మానవునికి కొంత సహజంగా వున్నను, అది మాత్రమే సరిపోదు. యుగ యుగానికి, దేశ దేశానికి ధర్మం మారిపోతుంది. ఒకరికి ధర్మంగా అన్పించింది, మరొకరికి అధర్మంగా గోచరించవచ్చు కాబట్టి అల్పజ్ఞుడైన మానవుడు తన బుద్ధితో నిర్ణయించవలసినవి కావీ ధర్మాధర్మాలు. ఋషిప్రోక్తమైన శాస్త్రాలే మనకు మార్గదర్శకం. మన హైందవ సంస్కృతికి మూలం శాస్త్రాలే. 
వ్యక్తిశీలాన్ని, సంస్కారాన్ని, సంస్కృతిని తీర్చి దిద్దడానికి ఋషులప్రోక్తమైన సందేశాత్మక కధలు ఉపదేశాలు, మానవాళికి ఎంతో తోడ్పడతాయి.
దీనిబట్టి మనకు అవగతమౌతుంది ఋషిప్రోక్తం అంటే ఋషులచే చెప్పబడినవి మనకు శ్రేయోదాయకమని. 

ఇక చతుర్వర్ణాలు గురించి -

అందరూ చైతన్యస్వరూపులే.  ఇందులో సందేహం లేదు. అయితే, 
వారిలో విద్య చెప్పుటకొరకును, దేవపూజ చేయుటకొరకును కొందరు, శత్రువులను నిరోధించుటకొరకును, 
అందరిని ఓ పద్ధతిలో నడిపించుటకును, బలం, ధైర్యము గల కొందరిని, దేహబలమున బుద్ధి యుక్తిశ్శక్తియున్నవారిని వ్యాపరకృత్యములకు, 
తెలివి సంపూర్ణంగా లేనివారిని కృషిచేయుటకును, ఇతరపనులు చేయుటకును నిశ్ఛయించి, జనుల పరిపక్వత అనుసరించియు, అప్పుడుండు స్థితిని అనుసరించియు పూర్విజులు మానవులను నాలుగుభాగములుగా నియమించి వుండవచ్చునని పెద్దలు చెప్తుంటారు. 
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః । 
తస్య కర్తార మపి మాం విద్యకర్తార మవ్యయమ్ ॥ 

మానవులు తమ సదుపాయమునకై బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, శూద్ర ధర్మములనుసరించి నాలుగు వర్ణములుగా ఏర్పడిరి. మానవులు చేయుపనులు నాలుగు విధములుగా నుండును. 1. తెలుసుకొనుట, తెలియజెప్పుట, 2. కాపాడుకొనుట, కాపాడుట, 3. ఉపయోగపడుట, ఉపయోగించుకొనుట, 4. కాయకష్టంతో పనులను చేసుకొనుట, చేసిపెట్టుట. ప్రతీ మానవుడు ఈ నాలుగింటిలో ఏదో ఒకదానికి పనికి వచ్చు స్వభావంను కలిగియుందురు. దీనినిబట్టే వృత్తి కర్మలు ఏర్పడును. ఈ నాలుగు విధముల విభాగమునే పెద్దలు నాలుగు వర్ణములుగా పేర్కొనిరి. 

అందరూ వేదపండితులమై వుంటామంటే సమాజం నడవదు. అందరూ క్షత్రీయులమై వుంటామన్నా, వ్యైశ్యులమై వుంటామన్న ఈ సమాజము నడవదు. ధర్మమేమిటో తెలియజెప్పే వేదశాస్త్రాలు అభ్యసించి ఆచరించి, తెలియజేప్పేవారు కావాలి, తప్పుచేసేవారిని శిక్షించడానికీ, ప్రజలను పరిరక్షించడానికీ, సరైన మార్గంలో నడిపించడానికీ పాలకులూ కావాలి, అలానే మిగతా వర్ణాలువారు అవశ్యం సమాజానికి.
అందుకే పూర్విజులంటారు - కేవలం సత్వగుణం వల్లనే సంఘం నడవదు. రాజసిక, తామసిక లక్షణాలూ వుండాలి. తప్పుచేసేవారిని శిక్షించడానికి, దేశాన్ని రక్షించడానికి, అవసరమైతే యుద్ధం చేయడానికి రజోగుణం, పొలం దున్నాలి, పండించాలి, కడుపునిండా తినాలి, కంటి నిండా నిద్ర కావాలి! ఇది తమోగుణం. ఈ పనులన్నీ లోక క్షేమం కోసం చేయాలి కనుక అట్టి రాజసిక తామసిక కృత్యాలను భగవానుడు నిందించలేదు. వారిట్టి పనులు చేసి సంఘాన్ని ఆదుకొని ముందుకు నడిపిస్తున్నారు కనుక ఆ పుణ్యం వలన ఉన్నతస్థితినే పొందుతారు. 
గృహస్థు ఆశ్రమవారిపై మిగిలిన మూడు ఆశ్రమముల వారు కొంత ఆధారపడి వున్నట్లే , శూద్ర వర్ణంవారిపై తక్కిన వర్ణపువారు కొంత ఆధారపడే వున్నారు. అటువంటప్పుడు శూద్రజాతి అనే చిన్నభావన ఎందుకు? అన్ని వర్ణాలువారు సమాజానికీ అవసరమని, సమానమేనని అవగాహనతో, సామరస్యముగా సౌహార్దంగా వుంటే మేలు కదా. 
అప్పటియుగధర్మం, ప్రజల జీవనం - 
త్రేతాయుగంలో ప్రజలందరికీ విధ్యుక్త కర్మలంటూ నియమించబడి వున్నాయి. వాటిని వారు శ్రద్ధగా పాటించేవాళ్ళు. మన ఉపనిషత్తులు 'సత్యం వద ధర్మం చర', 'స్వధర్మో నిధనం శ్రేయః, పరధర్మో భయావహ' అని ఘోషిస్తున్నాయి గదా. దానినే ప్రజలు మనఃపూర్వకంగా నమ్మి జీవించేవారు. అప్పటి యుగధర్మమది.
ప్రజలందరూ స్వధర్మాచరణలో ధర్మనిరతులై  కల్లా కపటాలు, కార్పణ్యాలు లేనందున పరస్పర సహకారంతో విరోధాలు లేక ఆత్మీయతతో మెలుగుతూ సుఖజీవనం సాగిస్తూ వుండేవారు. అందరును సహోదరభావంతో జీవించేవారు. అన్నివర్ణాలువారు శాస్త్రప్రామాణికంగానే జీవించేవారు. శాస్త్రం పట్ల అప్పటివారికి అవగాహన, ఆదరణ,ఆచరణ వుండేది. 

అసలు శాస్త్రం అంటే ఏమిటి?
ఇది చేయుము, ఇది చేయకుమని శాసించున దగుటచేతనే దీనికి శాస్త్రమని పేరు వచ్చింది. రాజశాసనమందు ఇట్టి పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ఉన్నతోద్యోగంను, ప్రజలకు ఇట్టి బాధలు కలుగజేయువారికి కారాగార దండనయు ఎట్లు విధింపబడి యున్నవో, అలాగున ఇట్టి కార్యంచే పుణ్యమూ, ఇట్టి కార్యంచే పాపమూ, ఇట్టి విరక్తి మార్గంచే మోక్షమునూ, ఇట్టి విషయ ప్రవృత్తిచే సంసార బంధమును శాస్త్రం విధించుచున్నది. అందుచే శాస్త్రవిధి ననుసరించి ప్రవర్తించు వారికట్టి ఉత్తమలోకప్రాప్తి కలుగును. 
మానవులందరూ ఒక్కటేయైనను వారి స్వభావంను బట్టి, వృత్తిని బట్టి, వంశాచారమును బట్టి భిన్నంగా నుందురు. వారి వారి ప్రవృత్తికి, వృత్తికి, కులమునకు, వంశమునకు అనుగుణంగా వారు ఆచరింపవలసిన విదానములుండును. ఆదర్శవంతమైన ధర్మాలు అందరికీ అంటే ఎవ్వరూ పాటించరని మన ఋషులు గుర్తించి, భిన్న వ్యక్తులకు భిన్న వర్ణాలు, బిన్నధర్మాలు సూచించారు.
ఒక వర్ణం గొప్పదని, మరొకటి నీచమని శాస్త్రాలలో లేదు. శాస్త్ర నియమాలు కొంత సరసర్దుబాటుతో ఉంటాయి. అందరూ అన్ని ధర్మాలను పాటించాలని చెప్పదు. వారి వారి వృత్తుల కనుగుణమైన ధర్మాలను పాటించాలని అంటుంది. జాతిని బట్టి భేదభావంను చూపించదు. వర్ణాన్ని బట్టి, ఆశ్రమాన్ని బట్టి వివిధ ధర్మాలుంటాయి. ఒక వృత్తి గొప్పదని, ఒకటి నీచమని చెప్పదు. కర్మను బట్టి ఆచారాలు మారుతాయి. రకరకాల వృత్తులు రకరకాల వర్ణాలకు వృత్తి ధర్మాన్ని పాటించడం శ్రేష్టమని శాస్త్రాలు తెలిపాయి. ఆ స్వధర్మ ఆచరణయే ఉన్నతి స్థితిని ప్రాప్తింపజేస్తుందనే తెలుపుతుంది. ఎవరి కర్మలో వారు సిద్ధి పొందాలని గీత సందేశం. అనగా స్వధర్మానుష్టానం వుంటే పరిపక్వత పుణ్యం దానంతట అదే సిద్ధిస్తుంది. తన పని యేది, తన పని కానిదేది తెలియుటలోనే ఇహపరముల పరిష్కారమంతయూ యిమిడియున్నది. తనపని ఏదియో తెలిసికొను నిపుణత, ఆచరించు శ్రద్ధ, ఈ రెండునూ కలవారు ఆచరించునదే లోకమునకు సత్కర్మ యగును. తనకు స్వధర్మమగును. కార్యసిద్ధినికాని, ఆధ్యాత్మికసిద్ధినిగాని కోరినవారు శాస్త్రంను అంగీకరించి ఆచరించి తీరవలెను.
యశ్శాస్త్రవిధిముత్స్రాజ్య వర్తతే కామకారతః ।
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ॥
ఎవరు శాస్త్రోక్తవిధిని విడిచిపెట్టి స్వేచ్చగా ప్రవర్తించుచున్నారో, వారు సిద్ధిని పొందరు. సుఖమును పొందరు. సర్వోత్క్రుష్టమగు ముక్తిని కూడా పొందరు.

నీవు దీనిని చేయుమని చెప్పునట్టి శాస్త్రవిధివాక్యమును, నీవు దీనిని చేయకుము అని చెప్పునట్టి ప్రతిషేధవాక్యమును అనగా వేదోక్తములగు విధిప్రతిషేధవాక్యములను అనాదరణ చేసి, విడిచిపెట్టి, స్వేచ్చాప్రకార మెవరు నడుచుకోనుచున్నారో, వారికి పురుషార్ధ ప్రాప్తియోగ్యమగు తత్త్వజ్ఞానం గాని, ఇహలోక సౌఖ్యం గాని, స్వర్గం గాని, మోక్షం గాని ఏదియును లభింపదు.

ఇక శంబూకుని కధ -
ఉత్తర కాండలోని ఈ కధ అందరికీ తెలుసుకాబట్టి, సంక్షిప్తంగానే ఈ శంబూకుని వధను తెలుపుతాను -

ఒకరోజు ఓ బ్రాహ్మణుడు అకాల మరణం పొందిన తన కుమారుణ్ణి రామ దర్భారుకు తీసుకువచ్చి దుఃఖాతిశయంతో రామున్నినిందిస్తూ ఆశ్రయించగా, ఈ విధంగా జరగడానికి కారణం ఏమిటని వశిష్ఠులు తదితరవారిని శ్రీరాముడు వివరణ కోరగా, వారు స్వధర్మం విడిచి, సశరీరంతో స్వర్గంకు వెళ్ళాలనే తపనతో శంబూకుడు చేస్తున్న తపస్సే కారణమని చెప్పగా, వారి సూచనమేరకు శంబూకున్ని తన ఖడ్గంతో సంహరించగా ఆ బాలుడు పునర్జీవుడు అయినట్లు ఉత్తరాకాండలో కధ .

ఈకధ త్రేతాయుగం నాటిది. శ్రీరాముని కాలం నాటిది.
ఆ కాలంలోఆయా జాతులవారు వారివారి స్వధర్మాన్ని సక్రమంగా నిర్వహించుకుంటూ, తమతమ వ్యక్తిత్వాల్ని సరిదిద్దుకుంటూ జీవనం సాగిస్తే చాలు, సకాలంలో అదే జ్ఞానంగా పరిపక్వం పొంది మోక్షాన్ని ప్రసాదించే త్రేతాయుగమది. 
అప్పటి యుగధర్మం ప్రకారం స్వధర్మాచరణ పట్ల మొగ్గుచూపక, ఆచరించక పరతంత్ర మోహితుడై తన ఇచ్ఛానుసారం వర్తించడం, సశరీరంతో స్వర్గంకు వెళ్ళాలనే అసహజ కోరికతో తపస్సు చేయడం తప్పు. తప్పుచేసినవారిని శిక్షించడం రాజధర్మం. శంబూకున్ని శ్రీరాముడు అందుకే శిక్షించాడు. 
ఆచారః పరమో ధర్మః (సదాచరణమే పరమధర్మము). 
ఆచారహీనం న పునంతి వేదాః (ఆచారహీనున్ని వేదాలు కూడా పవిత్రం చేయవు). 

శూద్రుడనే వధించాడు అని అనేకంటే, శంబూకుడు ఆనాటి యుగధర్మమును విడిచి, విపరీత కోరికతో తపస్సు చేయడం సరికాదని అవగాహన చేసుకుంటే మంచిది.
ఆ కాలంలో శూద్రుడికే కాదు, అందరికీ ఒకే ధర్మం. రాజైనా ధర్మానికే కట్టుబడి నడుచుకునే యుగమది. 
ఓ రజకుడు  పరమసాధ్వి సీతమ్మపై నింద వేశాడని వేగుల ద్వారా విన్న అయోధ్యాధిపతి శ్రీరాముడు ఒక వ్యక్తిగా కాకుండా సమాజ రక్షకుడైన రాజుగా ఆలోచించి, తనకెంత బాధాకరమైనను, సీతను పరిత్యజించాడు. ఆ యుగధర్మప్రకారం కుటుంబంకోసం ఒక వ్యక్తినీ, ఊరుకోసం ఓ కుటుంబాన్నీ, దేశంకోసం ఒక ఊరును త్యజించడం ధర్మం. అప్పటిధర్మానుసారం నడుచుకొని రాముడు చేసిన ఈ పనిని గుర్తించరేం?
ఒకరడిగారు -  రాములవారికి మల్లే నాకూ ఒకే భార్య. మరి రామున్ని ఏకపత్నీవ్రతుడని కీర్తించడం దేనికని? 
ఆప్పటికాలంలో రాజులు బహుభార్యత్వం కలిగి వుండేవారు. అయినప్పటికీ, సర్వకాల సర్వకర్మల సర్వధర్మాలయందు మనోవాక్కుకర్మేణా ఒకే భార్య అన్న భావంతో శ్రీరాములవారు వుండబట్టే ఏకపత్నీవ్రతుడని ప్రజలు కీర్తించారు. ఇలాంటి సూక్ష్మాలను గ్రహించక విమర్శలు గుప్పిస్తూ విభేదించడం సరికాదు.

శంబూకునికై యోచించేవారు వాదించేవారు స్వవిషయంలోనూ రాముడు ఎంత ధర్మ నిబద్ధతగా వ్యవహరించాడో గ్రహిస్తే బాగుంటుంది. కొంచెం పరిశీలన, విజ్ఞత అవగాహన వుంటే ఈ విషయం చక్కగా అర్ధమౌతుంది.

అన్నికులాల్లో గర్భితమైన మూలసత్యాన్ని గ్రహించి, అప్పటి యుగధర్మాన్ని అవగాహన చేసుకొని ఈ కధని చదివితే విమర్శకు తావే వుండదు. అలా కాకుండా తర్కబుద్ధితో ఒక వాదనను నిర్మించుకుని కులవ్యవస్థను విమర్శించడం వలన సామరస్యం కుదరక, శాంతి సౌహార్దాలు ఉండక అశాంతినే పొందుతాం 
                                                    

రామాయణం -

ఓ అద్భుత కావ్యం. అందరి మదిలో మెదిలే పవిత్ర కావ్యం.
వాగ్వాదాలు చేసేవారికి అంతుబట్టదు ఈ గ్రంధం. మనం సత్యాన్ని గ్రహిస్తే సత్యమే గోచరిస్తుంది. ధర్మాన్ని గ్రహిస్తే ధర్మమే దర్శనమౌతుంది.
శ్రీరాముడు ధర్మం విలువేమిటో. ధర్మానికి వున్న శక్తి ఏమిటో తెలియజెప్పిన మహిమాన్వితుడు.
రావణ సంహారసమయంలో మండోదరి తనభర్త మరణానికి ఆయన అనుసరించిన అధర్మమే కారణమని అంటుందేగాని రాముడు సంహరించాడని నిందించదు. ఓ రాక్షస స్త్రీకి అర్ధమైన రాముని ధర్మం, కలియుగ మానవునికి అవగతం కాకపోవడం 'కలి'. 

మిత్రమా!
ఏదైనా మనదృష్టికోణం బట్టే వుంటుంది. దృష్టికోణం మనోభావన బట్టి వుంటుంది. మనోభావన అవగాహన బట్టి వుంటుంది.

శుభమ్ ...