http://www.sodhini.com
జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
18, నవంబర్ 2019, సోమవారం
అబ్బో ఈరోజు ఎన్ని దీపకాంతులో...
11, జులై 2018, బుధవారం
మ్యాజిక్ ట్రీ (కల్పవృక్షం) మ్యాజిక్ కౌ (కామధేనువు)
అమ్మమ్మా... అమ్మమ్మా...
నా చిట్టితల్లి శ్రీమాన్వి పిలుస్తూ పరుగు పరుగున వచ్చింది. కాస్త నెమ్మదిగా రావచ్చుకదా, పడిపోతావు ... అంటున్న, నా మాటలు వినిపించుకోకుండా,
నాకు మ్యాజిక్ లైట్ కావాలమ్మమ్మా ...
మ్యాజిక్ లైట్ ??? అదేమిటి? అదెక్కడ ఉంటుంది? నా ప్రశ్న వింటూనే...
రా, చూపిస్తా... నా చేతిని లాగుతూ హాల్ లోనికి తీసుకు వచ్చి అల్లావుద్దీన్ అద్భుతదీపం ఫోటో చూపించి ఆ మ్యాజిక్ లైట్ కావాలని మారాం చేస్తుంటే, అసలు ఆ మ్యాజిక్ లైట్ ఎందుకమ్మా? అని అడుగుతుండగానే, తమ్మూస్ కు స్పైడర్ మాన్, సూపర్ మాన్, చోటాభీమ్,కారు బొమ్మలు, నాకేమో బుక్స్, క్రేయాన్స్, బార్బీ, సింద్రిల్లా బొమ్మలు బోలెడన్ని అడగాలమ్మమ్మా... అప్పుడు ఆ లైట్ లోని భూతం వచ్చి వెంటనే అన్నీ ఇస్తుంది కదా, తాతయ్య, నాన్న కొద్దిగానే కొంటారు కదా... ఆ మాటలు వింటూనే ప్రక్కనే వున్న నా సుపుత్రిక గట్టిగా నవ్వుతూ, మాన్వీ! భూతం లైట్ ఎందుకు, కల్పవృక్షమనే మ్యాజిక్ ట్రీ గాని, కామధేనువనే మ్యాజిక్ కౌ గాని అడుగు, భూతాలుండవందులో అని రెచ్చగొట్టింది. ఆపై మా అమ్మమ్మ మనుమరాల కబుర్లు ప్రక్కనపెడితే -
తన కోరికతో గుర్తుకొచ్చిన నా చిన్ననాటి ఓ జ్ఞాపకంకు వస్తాను -
నేను చదువుకునే రోజుల్లో - రమణి, ఇందిర, రాణి, మరికొందరు మిత్రులం తరుచుగా ఒకచోట చేరి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. మాలో రమణి కాస్త పెద్ద. తను బాగా మాట్లాడేది, మంచి మంచి కబుర్లు , కధలు చెప్పేది. ఒకసారి నిర్మల అనే అమ్మాయి 'అల్లావుద్దీన్ దగ్గరున్న అద్భుతదీపం నా దగ్గరుంటే ఎంత బాగుండునో' అని అంది. ఎందుకని అడగగా, మా అమ్మను రెండురోజులుగా అరిసెలు తినాలనిపిస్తుంది, చేయమ్మా అంటే, పెద్ద పండుగ వస్తుంది కదా, అమ్మమ్మ చేసి పంపుతుందిలే అంటుంది, అదే అద్భుతదీపముంటే ఎంచక్కగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అరిసెలు, జీళ్ళు, చక్కిలాలు తినవచ్చు కదా... తన మాటలకు అందరం నవ్వుకున్నాం. అప్పుడే రమణి ఏది కోరుకుంటే అది ఇచ్చే కల్పవృక్షం గురించి చెప్తూ, కల్పవృక్షం పూర్వం ఉండేదని, ఓసారి ఒకతను అడవి మార్గంలో పయనిస్తూ, ఓ చెట్టు నీడన కాసేపు సేద దీరుదామని ఓ చెట్టు చెంతన ఆగి, 'అబ్బా, ఇక్కడ ఎంత చల్లగా వుంది, తినడానికి ఏమైనా ఉంటే బాగుండును అని అనుకోగానే ఫలాదులు ప్రత్యక్షం ..... తిన్నాక కాస్త విశ్రమించాలనిలించిన వెంటనే చక్కటి పాన్పు ప్రత్యక్షం ..... ఆ పాన్పు పై కూర్చుంటూ, ఇదేదో మాయచెట్టులా వుంది, కొంపదీసి ఇప్పుడు భూతమేదో వచ్చి నన్ను మింగేస్తుందేమో .... అనుకునేంతలో భూతం ప్రత్యక్షమై మింగేసిందట. ఇదంతా తన యోగదృష్టితో చూసిన ఓ యోగి, ఆ చెట్టు చెంతకు వచ్చి , ఓ కల్పవృక్షమా! నీకు నమస్కారం, నీవు ఇక్కడ నుండి మాయమైపోవడం మంచిద'ని తలవగానే మాయమైపోయిందని చెప్పింది.
ఆ తర్వాత కొంతకాలానికి మహర్షుల దగ్గర కల్ప వృక్షం, కామధేనవలుండేవని చదివాను. అటుపై మా తాతయ్యగారి వద్ద పుస్తక పఠనం, తాతయ్య చెప్పేకధలు, కబుర్లు ... (అప్పుడే లేశమాత్రంగా ఆధ్యాత్మిక అవగాహన అలవడింది) ఓసారి తాతయ్యగార్ని అడిగాను, కల్పవృక్షం, కామధేనువులు ఇప్పుడు ఎక్కడున్నాయని. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి ... ఇత్యాదులు భూలోకంలో ఉండవు తల్లీ అన్నారు.
మరి అవి ఉన్నట్లు మన పురాణ ఇతిహాసాలలో చదివాము కదా. మన పురాణాలలో ఉన్నటువాటికీ అంటే రామాయణాది ఘట్టాలకు చారిత్రాత్మిక ప్రదేశాలుకు ఆధారాలున్నాయి కదా. మరి అవి ఉన్నప్పుడు ఇవి ఎక్కడకు మాయమాయ్యాయి? ప్రశ్నకు -
ఓ... అవి ఎవరి దగ్గర ఉన్నట్లు చదివావని అడిగారు. వసిష్ఠుడు, జమదగ్ని, కపిల మహర్షి మొదలగు వారిదగ్గర ఉన్నట్లు చదివానని బదులిచ్చాను. ఆ...అలాగా, వారు ఎవరమ్మా? ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విని అర్ధం చేసుకో తల్లీ... నీవు పైన చెప్పిన వారంతా తమ తపస్సిద్ధి మహిమా విశేషమున మహా సిద్ధత్వం పొందిన మహర్షులు. వారంతా సిద్ధపురుషులు. వారి వారి సిద్ధత్వస్థితికి వారి వారి ఆశ్రమమునందు అవి సాకారమై నిలిచాయి. అవి వాళ్ళతోనో అంతరార్ధమాయ్యాయని గ్రహించాలి.
తల్లీ! ఈ మూడింటిని ఒక గోవు గానో, చెట్టుగానో, మణిగానో పరిగణించక, అవి దివ్యశక్తులని, అవి ఎలా ప్రాప్తిస్తాయో పరిశీలిస్తే బాగుంటుంది.
ముందో విషయం చెప్పు, ఇవి ఎక్కడ నుండి జనించాయి?
క్షీరసాగర మధనం జరిగినప్పుడు అందులోనుండే ఉద్భవించాయి కదా... ముందు క్షీరసాగర మధనం అంతరార్ధం గ్రహిస్తే, ఇది సులభంగానే అర్ధమౌతుంది. క్షీరసాగరమధనం యొక్క అంతరార్ధం గురించి గతంలో ఓ టపా పెట్టాను కాబట్టి, దాని గురించి ఇక్కడ మరల ప్రస్తావించను. [ఆ టపా లింక్ ను ఇక్కడ చూడగలరు.]
ఆధ్యాత్మిక సాధన యందు పురోగమించుతున్నప్పుడు ఎన్నో సిద్దులు ప్రాప్తమౌతాయి. అలా ప్రాప్తించినవే కల్పతరువు, కామధేనువులాంటివి.
సాధకుడు ఆత్మవిచారణ చేయుచు, యోగధ్యానాదులచే ఆధ్యాత్మికోన్నతి చెందుతున్నప్పుడు, మొదట మనో మలినాది విషయవాసనలు నశించిన పిమ్మట సంకల్పసిద్ధి కలుగుట ప్రారంభమగును. ఈ సంకల్పసిద్ధిచే యోగనిష్ఠుని యొక్కక్క కోరిక ఫలవంతమగును. ఈ సంకల్పసిద్ధి పేరే కామధేనువు. అలానే, కొంతకాలమునకు యోగి జితేంద్రియుడగును. సంకల్పములు నశించును. నిస్సంకల్పస్థితి కల్గును. ఆ స్థితి పొందినవారి సమక్షమున ఏది చేయ సంకల్పించిన అది సిద్ది కల్గును. ఇదే కల్పవృక్ష సిద్ధత్వం.
అంటే ఆధ్యాత్మిక తపమునందు -
ఎవరు జితకాములగుదురో అంటే కామ రహితులగుదురో అప్పుడు వారికి కామధేనుత్వ సిద్ధియును,
ఎవరికి నిర్వికల్పస్థితి అనగా సంకల్పములు నశించునో (సర్వ ప్రకృతి సంకల్పములను జయించింతురో) అప్పుడు వారికి కల్పవృక్ష సిద్ధియును,
ఎవరు పూర్ణంగా నిశ్చింతుడగునో అప్పుడు వారికి చింతామణిత్వ సిద్ధియును కలుగునని శ్రీ మలయాళ సద్గురువు లాంటివారు తెలిపారు తల్లీ ... అని చెప్తూ, ఇలా అన్నారు -
సాగరమధనం జరుగుతుండగా కామధేనువు, కల్పవృక్షములు మొదలగునవి ఉద్భవించినను అమృతం దొరికేంతవరకు ఎలాగైతే క్షీరసాగర మధనం చేశారో, అలాగే ఆధ్యాత్మిక సాధకులు ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ, మధ్యలో ఎన్ని అద్భుత దివ్యసిద్ధులు సిద్ధించిన, వాటియందు ఆపేక్ష ఏర్పరచుకోకుండా, అమృతత్వమనే ముక్తిత్వం లభించేంతవరకు సాధన నుండి సడలిపోరాదు. ఇంతటి స్థితికి చేరిన మహర్షుల చెంతే ఈ కల్పతరువు, కామధేనువు, చింతామణులుంటాయని చెప్పగా, ఇదంతా వింటున్నవారిలో ఒకరు, ఏమిటో బాబయ్యా, అర్ధమయ్యి అర్ధంకానట్లు వుంది, ఇలాంటిసాధన సామాన్యులకు కష్టమే. మరి మాబోటి సామాన్యులకు గతేమిటని అడగగా, మనలాంటి సామాన్యులకు దృఢమైన భక్తి ఆ సర్వేశ్వరుని పట్ల ఉంటే చాలు, ఆయనే మనకు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి. ఇది నేను చెప్పడం కాదు, కృష్ణ పరమాత్మే గీత యందు ఇలా చెప్పారు -
తస్య తస్యాచలాం శ్రద్దాం తామేవ విదధామ్యహామ్
స తయా శ్రద్ధాయ యుక్తః తస్యారాధన మీహతే
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్హి తాన్
సకామభక్తుడు ఏయే దేవతాస్వరూపములను భక్తిశ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో, ఆ భక్తునకు ఆయా దేవతలయందే స్థిరభక్తి కుదురుకొనునట్లు , అలాగే ఆయా దేవతల ద్వారా నా అనుగ్రహముచే ఆయా భక్తుల అభీష్ట కామములను తీర్చగలను.
ఆర్తో జిజ్ఞాసురర్ధార్ధీ జ్ఞానీ ... ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అను చతుర్విధ భక్తులకు ఆ పరమాత్ముడే కల్పవృక్షం.
అటులనే, శివానందలహరి లో శ్రీ శంకరులవారు చెప్పారిలా -
ఆమ్నాయాంబుధి మాదరేణ సుమనస్సంఘా స్సముధ్యన్మనో
మంథానం దృఢభక్తి రజ్జుసహితం కృత్వా మథిత్వా తత:
సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం
నిత్యానంద సుధాం నిరంతర రమా సౌభాగ్య మాతన్వతే
మంథానం దృఢభక్తి రజ్జుసహితం కృత్వా మథిత్వా తత:
సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం
నిత్యానంద సుధాం నిరంతర రమా సౌభాగ్య మాతన్వతే
దేవతలు మందరగిరిని కవ్వంగా చేసి క్షీరసాగరాన్ని మధించి కల్పవృక్ష, చింతామణి, అమృతములను సంపాదించినట్లుగా విజ్ఞులు తమ మంచి మనస్సులను కవ్వంగా చేసి, దృఢభక్తి యనే త్రాడుకట్టి, వేదాలనే మహాసాగరాన్ని మధించి దానినుండి భక్తులకు కల్పవృక్ష కామధేను చింతామణి వంటి వాడును, నిత్యానందామృత మూర్తియు, మోహాలక్ష్మీ స్వరూపుడును యైన ఉమా సమేతుడగు సదాశివదేవుని పొందుచున్నారు.
మనం కూడా అలా దృఢభక్తిని ఏర్పరచుకొని ఆ పరమాత్ముని పాదములను పట్టుకుంటే ఆయనే మనకన్నీనూ... అని చెప్పారు మా తాతయ్యగారు.
తన మ్యాజిక్ లైట్ కావాలనే కోరికతో, ఆనాటి ఈ నా మధుర జ్ఞాపకంను మననం చేసుకునేటట్లు చేసిన శ్రీమాన్వికి శుభాశిస్సులు. ఈ వివరణ అర్ధం చేసుకునే వయస్సు కాదు నా మనుమరాలిది. నా చిట్టితల్లి శ్రీమాన్వి పెద్దయ్యాక చెపుదామంటే ... అప్పుడు చెప్పేశక్తి నాకుంటుందో.... ఉండదో.... ఏమో... అందుకే ఇలా స్మరణ లో పదిలపరుస్తున్నాను. పెద్దయ్యాక చదివి తెలుసుకుంటుందన్న ఆశ.
24, మార్చి 2015, మంగళవారం
ఒకప్పటి మధురజ్ఞాపకం "శ్రీశైల శిఖరదర్శనం"లో అంతరార్ధం
క్రిందటి టపాకు కొనసాగింపు ...
అపారమైన భక్తివిశ్వాసాలుంటే తప్పకుండా తరిస్తాం ... అని అంటూ, అందుకు ఉదాహరణగా మాస్టారుగారు చెప్పిన కధ ఇది -
మహాశివరాత్రి
రోజున పార్వతిదేవి పరమశివుణ్ణి ఇట్లడిగెను - సర్వేశ్వరా! 'శ్రీశైల శిఖరం
దృష్ట్యా పునర్జన్మ న విద్యతే' అను శాస్త్రవాక్యమొకటి కలదు కదా.
శ్రీశైలశిఖరమును దర్శించినవానికి పునర్జన్మ లేదని చెప్పినది నిజమైనచో, ఈ
దినం ఎన్నియో వేలమంది జనులు శ్రీశైలపర్వతంనకు వచ్చియున్నారు. వీరందరికీ
శిఖరదర్శనం అయినది. మరి వీరందరూ ముక్తులయ్యెదరా? అని ప్రశ్నించగా -
సంపూర్ణ
విశ్వాసం వుండిన అట్లగును. ఈ విషయమై రేపటిదినం నీకు చూపెదను. నేను
మిక్కిలి ముదుసలి బ్రాహ్మణ రూపమును ధరించెదను. నీవు అతి వృద్ధురాలగు
బ్రాహ్మణి వేషమును పూనవలసినది. ఈ రాత్రి శిఖరదర్శనం చేసి ఈ జనులు
వెళ్ళుచుండెడు దారిలో బురదమయమగు నొక కోనేటిలో నేను పడియుండి ప్రాణం
పోయేలాగున నటించెదను. వచ్చిన వారందరినీ పతిభిక్ష పెట్టవలసినది, వేదములు
కడవరకు చదివి, వేదార్ధమును చక్కగా నెరిగిన ఈ వృద్ధబ్రాహ్మణుడు నా
పతిదేవుడు. ఈయన లోతైన ఈ గుంటలో స్నానార్ధమై వెళ్ళి పడిపోయెను. ఈయనను
రక్షించండి అని ప్రార్ధించు. ఎవరైనా నన్ను బయటకు తీయుటకై దగ్గరకు
వచ్చినప్పుడు, అయ్యలారా! ఆయన పాపం నశించినవారు. పాపం గలవారెవరైనా ఆయనను
తాకినచో వారపుడే మరణించెదరని చెప్పవలసిందిగా పరమశివుడు తెలిపెను.
మరునాడు
ఉదయం గుంపులు గుంపులుగా వచ్చుచుండు జనసమూహమును జూచి, భవానిదేవి రోదిస్తూ,
తన భర్తను రక్షించి, పతిభిక్ష పెట్టమని వేడుకుంటుండగా, కొందరు ఆ
వృద్ధబ్రాహ్మణుని రక్షించుటకై దగ్గరకు వెళ్ళునప్పుడు, ఈయన పాపం నశించిన
పుణ్యాత్ముడు, పాపం గలవారు తాకినచో అప్పుడే చనిపోవుదురని చెప్పగా, దగ్గరకు
వెళ్ళినవారు మనకి ఎందుకులే అనుకుంటూ, తిరిగి వెనక్కి వెళ్ళిపోయేవారు. ఆ
సమయంలో కళావంతులలో చేరిన పరిశుద్ధాత్మరాలగు నొక నారీమణి వృద్ధురాలగు ఆ
బ్రాహ్మణస్త్రీతో 'నీవు దుఃఖపడవలదు, నాకు ఈత వచ్చును, నేను మీ పతిని
దరిచేర్చేదను' అని చెప్పి రక్షించుటకు వెళ్ళబోవునప్పుడు, ఈ బ్రాహ్మణి పై
చెప్పిన మాటలను చెప్పగా, ఛ ఛ, నీకు శాస్త్రవచనాలు యందు విశ్వాసం లేదు,
శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అను శాస్త్రవాక్యం పట్ల
నీకున్న నమ్మకం ఇదేనా? నాకు ఇక పాపమెచట? నేను నిన్నటిరోజున శివరాత్రి
ఉపవాసముండి, జాగరం చేసి, శివపూజ చేసి, శ్రీశైల శిఖరదర్శనం చేసి,
పాపరహితురాలినై వచ్చుచున్నానని చెప్పి, ఆ గుంటలో దుమికెను. దూకి
వృద్ధబ్రాహ్మణుని రక్షించాలని పరమశివుణ్ణి తాకగానే, ఆయన సాక్షాత్తు
శంకరరూపమున దర్శనమిచ్చి, ఆ యువతిని విమానం నెక్కించుకొని కైలాసమునకు
తీసుకుపోవునట్లు కధ చెప్పిరి.
ఏమిటీ, కళావంతుల స్త్రీకి అంతటి యోగమా? అని అత్తయ్యగారు ప్రశ్నించగా -
వృత్తిని
కాదు చూడవలసినది, ఆమె భక్తిని, శాస్త్రవచనాలు పట్ల అణుమాత్రమైన అపనమ్మకం
లేని అపారమైన నమ్మకాన్ని. అందుకే అంటారు, భగవంతుడు విత్తం కాదు చిత్తంను
చూస్తాడని. మనిషిని కాదు మనస్సుని గమనించు. బహుశా ఆమె పూర్వజన్మ సుకృతం
వలన ఆమెలో అపారమైన భక్తివిశ్వాసములు ఏర్పడ్డాయి. అందుకే ఇంతటి యోగం
ప్రాప్తించింది అని మాస్టారుగారు చెప్పగా ...
బాగుందండీ, మరి ఆన్నిటికీ అంతరార్ధం ఉందంటారే, మరి ఈ శిఖర దర్శనంకు అంతరార్ధం కూడా చెప్పండి అని మరల అత్తయ్యగారు ప్రశ్నించగా -
ఆ...
వుంది, ఉందనే పెద్దలు చెప్తుంటారు. శ్రీశైలశిఖరం దర్శన మాత్రంచే
జన్మరాహిత్యం కల్గితే ఇన్ని సాధనలు ఎందుకు? వెళ్లి చూసిస్తే సరిపోతుంది
కదా, అది కాదు అసలు నిజం. యదార్ధం ఏమిటంటే, శిఖరమంటే గుడిగోపురం కాదు.
శిరశ్శిఖర ముచ్యతే అన్న మాటను ప్రామాణికంగా పరిశీలిస్తే, శిరస్సే
శిఖరం. ఎవరైతే తన శిరస్సునందు శ్రీశైలున్ని దర్శిస్తారో వారికి పునర్జన్మ
వుండదని ఆ వాక్యానికి అర్ధం. ఇది నిజమైన సాధన. ఇది నిజమైన యోగం. మనస్సునూ,
మనో ప్రక్రియలను కట్టి వేస్తే యోగసాధన సాధ్యమై పరమేశ్వరుణ్ణి దర్శనమై
జన్మరాహిత్యం కల్గుతుంది అని చెప్పారు. చక్కటి విషయాలు తెలిపిన
మాస్టారుగారికి నమస్సులు.
28, ఫిబ్రవరి 2015, శనివారం
ఒకప్పటి మధురజ్ఞాపకం 'త్రివేణీ సంగమం'
గతపోస్ట్ చదివిన శైలజగారు అడిగిన ప్రశ్నతో నా మనసులో మరుగునపడిన విషయం మరుపుకురాకుండా మరల జ్ఞాపకం వచ్చేటట్లు చేసిన తనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ -
కాశీయాత్ర ( ఈ టపా వివరములకై ఇక్కడ క్లిక్ చేయండి) గురించి మాస్టారుగారు చెప్పిన మరుసటిదినమే ఈ త్రివేణీసంగమం గురించి కూడా ఆయన వివరించారు.
మా అత్తయ్యగారు (మాస్టారుగారి భార్య) త్రివేణీ సంగమంలో మూడుసార్లు మునకలేస్తే చాలట కదండీ, ముక్తిపొందడానికి అని మాస్తారుగార్ని అడిగినప్పుడు -
మూడుసార్లు ఎందుకు ఒక్కసారి మునక వేస్తే చాలు ముక్తి పొందవచ్చు అని నవ్వుతూ ఇలా వివరించారు.
నాకు గుర్తున్నంతవరకు ఆ పద్యాలు, వివరణ చెప్తాను కానీ, పద్యాలలో ఒకటిరెండు అక్షరదోషాలు, వివరణలో చిరులోపం వుండవచ్చు. మన్నించాలి మరి.
నీరాశీ ఖలు చాతకః ప్రతిదినం శైలే బిలే మూషికః
భస్మోద్దూళిత విగ్రహస్తు శునకో ధ్యానాధిరూడో బకః
ఏతేషాం ఫలమస్తి కిం న హి న హి జ్ఞానం పరం కారణమ్
గంగాది తీర్దములలో మత్స్యకచ్చపాదులు సదా నివచించుచుండును. నాగసర్పం వాయుభక్షణం గలిగియుండును. మేకలు ఆకులనే తినుచుండును. చాతకపక్షికి జలమే ఆహరం. ఎలుకలు కొండగుహలలో నివచించియుండును. శునకం దిగంబరియై బూడిదలో పడియుండును. కొంగ మౌనంతో ధ్యానాధిష్టానముతో నుండును. వీటియన్నిటికిని ఎలాంటి విశేషఫలమును లేదు. కావున బాహ్యచేష్టలతో భ్రమనొందక పై జెప్పిన వాటియొక్క గుణములతో కూడియుండు అంతరంగనిష్ఠ సంపూర్ణముగా కలిగియున్డవలయును. ఎట్లున్డినను జ్ఞానమొకటి చేతనే జీవుడు తరిస్తాడు.
మనం ఈ విషయాన్ని సదా గుర్తుపెట్టుకోవాలి. గతంలో చెప్పినట్లుగా పుణ్యక్షేత్ర దర్శనాలతో భక్తి పెరిగి , భగవంతున్ని స్మరిస్తూ చేసే తీర్ధస్నానాలతో పుణ్యం వస్తుంది. కానీ ఆ పుణ్యఫలం ప్రారబ్ధంలోనికి వచ్చిన తర్వత జననమరణాలు తప్పవు. అంతే తప్ప ముక్తి రాదు అని అంటూ ఇంకా ఇలా వివరించారు -
మన దేహంలో మూడు ప్రధాన నాడులున్నాయి. అవి ఇడా పింగళ సుషుమ్నాలు. ఈ మూడింటి సంయోగస్థలం భ్రూమధ్యం. అందుకే ఈ స్థానమును త్రివేణీ సంగమనియు, మేరు స్థానమనియు యోగులు చెప్పుదురు. కాబట్టే భ్రూమధ్యమున మనస్సును స్థిరంగా నిలిపి చేయు ధ్యానం శ్రేష్ఠం. ధ్యానంచే ఈ త్రివేణీ సంగమందు ఒక్క మునకవేసిన చాలును, ముక్తిపొందడానికి.
ఇడా భాగీరధీగంగా పింగళా యమునానదీ
తయోర్మధ్య గతా నాడీ సుషుమ్నాఖ్యా సరస్వతీ
త్రివేణీ సంగమో యాత్ర తీర్ధ రాజ స ఉచ్యతే
తత్ర స్నానం ప్రకుర్వీత సర్వ పాపై ప్రముచ్యతే
ఇడానాడే గంగానది. పింగళనాడి యమునానది. ఈ రెండింటి మధ్యలో ఉన్న సుషుమ్నానాడి సరస్వతీనది. ఈ మూడు నాడులు భ్రూమధ్య స్థానంలో ఆజ్ఞాచక్రంలో సంగమిస్తాయి. దీనినే త్రివేణిసంగమం అని అంటారు. దీంట్లో స్నానం చేస్తే జీవుడు అనేక జన్మలలో తాను చేసిన పాపములనుండి, ప్రారబ్ధములనుండి ఒక్కమాటలో చెప్పాలంటే క్రియలనుండి విముక్తి పొంది ముక్తుడౌతాడు.
బాగుందండీ, మీరు చెప్తున్న దానిబట్టి నాకు అర్ధమౌతుంది .... బాహ్యముగా ఏమైతే ఉన్నాయో, ఏం చేస్తే తరిస్తామో, అవి అన్నీ మనలోనే ఉన్నాయని, మనలోనే చూసుకొంటే తరిస్తామని. కానీ, కోడికూయక ముందే లేస్తాను, గొడ్లచావిడికి వెళ్లి లక్ష్మిని (ఆత్తయ్యగారు ప్రేమగా పెంచుకుంటున్న ఆవుని) పలకరించి, కాస్త పేడను తీసుకొని వాకిట్లో కల్లాపి జల్లి, పొయ్యి అలికి ముగ్గులెట్టి, కసుపు తుడిచి, స్నానపూజాదికాలు పూర్తయ్యాక పొయ్యి రాజేస్తానా ... అప్పుడు అంటించిన పొయ్యి నడినెత్తిన సూర్యుడొచ్చేంతవరకు వెలుగుతునేవుంటుంది. కాసేపైన స్థిమితంగా కూర్చొనే సమయముండదు. మధ్యాన్నం మీరందరి భోజనాలు అయ్యాక, కాస్త తిని, వత్తులు చేసుకుంటునో, పప్పు విసురుకుంటునో, బియ్యం ఏరుకుంటునో, ఈనో పేనో చూసుకుంటునో ... ఆ సమయంలో కష్టసుఖాలు చెప్పుకోవడానికో, కాలక్షేప కబుర్లు చెప్పుకోవడానికో వచ్చే ఇరుగుపొరుగువారితో మాట్లాడుతూ చిన్న చితక పనులు చక్కబెట్టుకునేసరికి సాయంత్రమైపోతుంది. ఇక మరల మొదలు ఇల్లు ఊడ్చడం, వంటావార్పులు, వడ్డనలు. మీరందరూ పడుకున్న తర్వాతే నా నిద్ర. అంతవరకు పట్టుమని పదినిముషములైన నడుం చేరేయడానికి లేదు. మరి నాలాంటిదానికి కుదురుగా కూర్చోవడం, జపమో తపమో ధ్యానమో ఎలా అవుతుంది చెప్పండి...
మరి నాలాంటి వారు తరించే మార్గమే లేదా? అని అత్తయ్యగారు అనగా -
ఓహో ... ఎందుకు లేదూ, నన్ను చక్కగా అర్ధం చేసుకొని నాకు అనుగుణంగా మసులుకుంటున్నావు. అలుపు తెలవనివ్వని చిరునవ్వుతో ఓర్మితో అందరితో ఆత్మీయంగా, అందరికీ ఆసరాగా వుంటున్నావు. నీకు సాధ్యమయ్యేంతలో బీదవార్ని ఆదరిస్తున్నావు. ఓ ఇల్లాలిగా గృహస్థుధర్మమును చక్కగా నిర్వర్తిస్తున్నావు. నీ ఈ ధర్మవర్తనంకు మరింత భక్తివిశ్వాసములు జతైతే ఈ జన్మలోనో, మరుజన్మలోనో తప్పక తరిస్తావు... అని మాస్టారుగారు చెప్తుండగా -
అది కాదండీ, మరి త్రివేణీసంగమంలో మునకలేస్తే ముక్తివస్తుందన్న పెద్దలమాట అసత్యమా అన్న ఆమె ప్రశ్నకు...
లేదు లేదు, పెద్దలమాటలు, శాస్త్రవచనాలు ఎప్పటికీ అసత్యం కాదు. కాకపోతే వాటి అంతరార్ధమును గ్రహించి పాటించాలి. లేదా వాటిపై అణుమాత్రమైన అనుమానం లేకుండా అపారమైన భక్తివిశ్వాసములుంటే, దానికి పూర్వజన్మసుకృతం తోడైతే తప్పకుండా ఈజన్మలోనే తరిస్తాం. అది ఎలాగంటే ...
అంటూ ఓ చక్కటి కధను, అంతరార్ధమును వివరించారు. ఆ వివరాలు తదుపరి టపాలో ...
16, డిసెంబర్ 2014, మంగళవారం
శివయ్యకు చలా?????
నిన్న ప్రక్కింటావిడ, వాళ్ళ అమ్మాయి హారిక మా ఇంటికి వచ్చారు. ఈరోజు
హారిక పుట్టినరోజండి, అందుకే తెల్లవారుఝామునే శివాలయంకు వెళ్లి అభిషేకం
చేశామండి ... అని చెప్తూ, తెల్లవారక ముందే లేచి, చన్నీళ్ళు స్నానం స్వాములు
ఎలా చేస్తారో గానీ, ట్యాంక్ లో నీళ్ళతో స్నానం చేసేసరికి వణికిపోయానండి
చలితో, అని ఆవిడ చెప్తుండగా ... హారిక నవ్వుతూ, మరి నీళ్ళను , ఫ్రిడ్జ్ లో
పాలును శివలింగం మీద పోస్తున్నప్పుడు శివునికి చలెయ్యదా ఏమిటీ? అని ఆ
అమ్మాయి అంటే, శివయ్యకు చలా????? అని నేను అనుకుంటుండగా చాలా సంవత్సారాల
క్రితం ఓ మాసపత్రికలో చదివిన ఓ భక్తుని చమత్కారపు భావన గుర్తుకొచ్చింది.
ఆ భక్తుని చమత్కార భావన ఇదే -
ఇదెక్కడి విపరీతమయ్యా స్వామీ! నెత్తిమీద చల్లని చంద్రుణ్ణి పెట్టుకున్నావ్. అక్కడితో ఆగావా? అంతకన్నా చల్లనైన గంగమ్మను నెత్తికెక్కించుకున్నావు. ఆపైన తాకితే జివ్వుమనిపించే చల్లని పాముల్ని నగల్లా అలకరించుకున్నావు. అవన్నీ చాలవన్నట్లు మంచుకొండ కూతుర్ని ప్రక్కన కూర్చోబెట్టుకున్నావు. నీ చోద్యపు చిన్నెలకు అంతెక్కడ? గజగజలాడించే కార్తిక మార్గశిరమాసాలలో బ్రహ్మీ ముహూర్తము నుంచే ధారపాత్ర కింద తిష్టవేస్తావు. అభిషేకం పేరుతో ఎప్పుడూ నీళ్ళక్రింద నానుతుంటావు. నీ భక్తులూ నీకు తగినవారే, ఈ శీతలోపచారాలకు తోడు నీ ఒళ్ళంతా చల్లని విభూది చందనాలను పూస్తూ ఉంటారు. అయినా నీకు చలెయ్యదా మహానుభావా? అని ఓ భక్తకవి శివున్ని ప్రశ్నించాడు. అంతలోనే ఆయనకే సమాధానం తట్టి, 'నా అమాయకత్వంకానీ, నీకు చలేమిటయ్యా? తాపత్రయాలతో సలసల కాగిపోతున్న నా హృదయంలోనే కదా నీవున్నావు' అన్నాడట.

11, ఆగస్టు 2013, ఆదివారం
ఒకప్పుడు నేను విన్న కధను గుర్తుచేసిన 'శ్రీ శ్యామలీయం గారి భాగవతం'
పరమ భాగవతోత్తముడైన
బమ్మెర పోతానామాత్యులవారు తన సహజపాండిత్యంతో అనితరభక్తితో మానవాళికి
ఆత్మోన్నతిని అందించే శ్రీ మద్భాగవతాన్ని తెలుగులోనికి అనువదించగా,
దానిని తిరిగి ధారావాహికంగా భక్తజన హృదయాలను రంజింపజేస్తూ, ఎంతో భక్తితో తను చేస్తున్న ఈ పనిని ఓ తపస్సులా భావిస్తూ శ్రీమదాంధ్రమహాభాగవతంను సరళముగా అందిస్తున్న శ్రీ శ్యామలీయంగారికి నమస్సులు. వారి శ్యామలీయం భాగవతం చదువుతుండగా ఒకప్పుడు నేను విన్న ఈ కధ జ్ఞాపకం వచ్చింది.
శుకమహర్షి భాగవతమును ఏడురోజులలో పరీక్షిత్తు మహారాజునకు తెలిపి ముక్తిని కలుగజేసినట్లు తెలుసుకున్న ఓ మహారాజు తన ఆస్థాన పురోహితున్ని పిలిచి, ఆ భాగవతమును తనకి విశదపరచమని, తనకు అలానే ఏడురోజుల్లో మోక్షమును కలుగజేయమని, లేనిచో నీ పౌరాణికత్వం రద్దుచేసి, దేశబహిష్కరణ చేస్తానని శాసించెను. అంతట ఆ పౌరాణికుడు ఎంతో శ్రద్ధాభక్తులతో చెప్పినను ఆరాజు మనస్సు భగవద్వీలీనం చేయక ఏడవరోజు ముక్తికై ఎదురుచూస్తుండడంతోనే ఆరురోజులూ గడిచిపోయాయి. మరుసటిదినం ఏడవరోజు అగుటచే పౌరాణికుడు మహావ్యాకులతతో వుండగా, ఆ పండితుని సేవకుడు తన యజమాని విచారమునకు కారణం అడిగితెలుసుకొని, ఈ పనికి నన్ను నియమించండి, మీ బదులుగా నేను వెళ్లి ఈ పనిని పూర్తిచేస్తానని చెప్పి, తానే రాజభవనానికి వెళ్ళి, ప్రభూ! ఈ చిన్నివిషయానికి తానేల రావలయునని తలచి, మోక్షము యొక్క రహస్యమును తమకు తెలిపి రమ్మని నా యజమాని ఆదేశించగా నేను వచ్చితిని అని చెప్పి, ఓ రాజా! ఈ రోజు పురాణం ప్రారంభించుటకు ముందు మీరు బంధీకృతులు కావలసియున్నది అని చెప్పగా ... మోక్షం వచ్చుటకు ఇదికూడా అవసరం కాబోలు అని రాజు అంగీకరించగా, రాజును ఒకస్తంభమునకు కాలుచేతులు కట్టి బంధించి, ఆ పిమ్మట ఆ సేవకుడు అనేకరకముల ఫలహారములు తెప్పించి రాజుముందు పెట్టి, మహారాజా! శుభముహూర్తం దగ్గరకు వచ్చింది, ఈలోపునే మీముందున్న ఫలహారములను స్వీకరించాలి కావున వెంటనే భుజించమని చెప్పెను. ఇదెలా సాధ్యం? బంధీకృతమైన నేను ఎలా భుజించగలనని రాజు ప్రశ్నించగా, ఓ రాజా! పరీక్షన్మహారాజు వలే మీకు తగిన వైరాగ్యం లేదు, మీ బంధనములు తెగలేదు. ఇట్టిస్థితిలో ఏడురోజుల్లో మీకు మోక్షమిప్పించుట ఎట్లా సాధ్యమౌతుంది?
ఓ రాజా! జనమేజయులకు రాజ్యభారంబు సమర్పించి, యత్నంబు సంసారబంధంబునను తప్పించి, చిత్తంబు హరికి అర్పించి, ప్రాయోపవిష్టుండైన పరమభాగవతుడైన పాండవపౌత్రుండు పరీక్షిత్తు మహారాజుకున్న వైరాగ్యం మీలో లేదు. మీరింకనూ ఆశాపాశములతో ఈ మాయాప్రపంచంన కట్టుబడే యున్నందున మోక్షం సాధ్యం కాదు. రాజా! ప్రీతితో, ఆసక్తితో, ఫలాభిలాషతో, కర్తృత్వబుద్ధితో గడుపుజీవితం బంధమును కలిగిస్తాయి. బంధమెంతవరకుండునో అంతవరకు మోక్షం లేదు. ముక్తి పొందడానికి యోగ్యత, సాధన, ఆచరణ కావలసియున్నది. సమస్త బంధనములనుండి విముక్తి పొందినవారికి మాత్రమే ముక్తి సాధ్యమగును.
ఓ మహారాజా! దేహపుత్రకళత్రాది వారిపైగల మోహమనే వృక్షాన్ని నిష్కామమనే ఖడ్గంతో తెగనరకాలి. ఏకాంతప్రదేశమున అకార ఉకార మకారాలనే మూడక్షరాలతో కూడిన బ్రహ్మబీజమైన *ఓంకారము*ను మనస్సులో స్మరిస్తూ, ఉచ్ఛ్వాస నిశ్శ్వాశాలను వశపరుచుకోవాలి. విషయాల వెంబడి పరుగిడే ఇంద్రియాలను బుద్ధి అనే సారధితోను, మనస్సనే పగ్గంతోను బిగబట్టి నిగ్రహించాలి. గట్టివైన
కర్మబంధాలలో చిక్కుకొని
ఊగిసలాడే చిత్తాన్ని ప్రజ్ఞాబలంతో నిరోధించి భగవంతునిపై నిశ్చలంగా
నిలపాలి. విషయరహితమైన మనస్సుతో ఆ దేవుని కరచరణాదులైన అవయవాలను క్రమముగా
ధ్యానించాలి. రజో, తమో గుణాలచే ఆకర్షింపబడి మోహానికి లోనయ్యే మనస్సునూ, ఆ
గుణాలవలన కలిగిన మాలిన్యాలను ధారణతో తొలగించి నిర్మలం చెయ్యాలి. అలా
చేసిననాడు సర్వోత్కృష్టమైన విష్ణుపదం చేరుతారని, వారే మోక్షం పొందుతారని
శుకమహర్షి చెప్పినట్లుగా, అప్పటికే సర్వమూ పరిత్యజించి, హృదయాంతరమున హరిని
నిలిపి, మనస్సును భగవద్విలీనం చేయుటచే పరీక్షిత్తు మహారాజు మోక్షం
పొందాడు మహారాజా, అని భక్తుడైన ఆ సేవకుడు చెప్పగా, తన తప్పుని రాజు
గ్రహించి పశ్చత్తాపపడెను. సేవకుడు తిరిగి తన యజమాని ఇంటికి వెళ్ళగా,
అప్పటికే జరిగిన విషయాలన్నీ జనుల ద్వారా తెలుసుకున్న ఆ పండితుడు ఈ
భక్తోత్తముడిని సాదరంగా ఆహ్వానించి, 'నాయనా! ఈ దినమునుండి నేనే నీకు
సేవకుడిని, మీరే నేటి నుండి నా గురువులు' అని రెండు చేతులను ముకుళించి
నమస్కరించెను.
*ఓంకారం* గురించి మరింత వివరణ ఈ లింక్స్ నందు -
http://smarana-bharathi. blogspot.in/2011/09/blog-post. html
http://smarana-bharathi. blogspot.in/2011/09/blog-post_ 29.html)
ఎప్పుడో విన్న స్మరించుకోదగ్గ ఈ కధ మరుపున పడకూడదని స్మరణ లో పోస్ట్ చేస్తున్నాను.

నమస్కరించెను. *ఓంకారం* గురించి మరింత వివరణ ఈ లింక్స్ నందు -
http://smarana-bharathi.
http://smarana-bharathi.
ఎప్పుడో విన్న స్మరించుకోదగ్గ ఈ కధ మరుపున పడకూడదని స్మరణ లో పోస్ట్ చేస్తున్నాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

.jpg)