4, ఏప్రిల్ 2023, మంగళవారం

భగవంతుణ్ణి మనమా, మనల్ని భగవంతుడా... ఎవర్ని ఎవరు పట్టుకోవాలి?

భగవంతుడు మనల్ని పట్టుకోవాలా? భగవంతుణ్ణి మనం పట్టుకోవాలా?

ఇది క్రిందటి టపాలో పద్మగారి ప్రశ్న. 

ఇందు గలడందు లేడని
సందేహం వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదికి జూచిన
అందందే కలడు.....
సర్వాంతర్యామి... 
ఎక్కడని వెతకగలం?
అంతర్యామి...
పట్టుకునే శక్తి మనకు ఉందా?
భగవంతుణ్ణి మనం పట్టుకోలేం కానీ, భగవంతుడు ఉన్నాడన్నది సత్యం. మనల్ని పట్టుకు నడిపిస్తున్నడన్నది సత్యం. ఆయన మనల్ని పట్టుకునే వున్నాడు, మనల్ని పట్టుకున్న ఆయన్ని గుర్తించడమే ఆధ్యాత్మికత. ఆ సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికే శోధన, సాధన... అని వాట్సప్ లో తనకి బదులిచ్చాను. వెన్వెంటనే తన నుండి ప్రశ్నల పరంపర.
ఒక చేతితో సంసారమును, మరో చేతితో భగవంతున్ని పట్టుకోవాలన్న రామకృష్ణ పరమహంస మాటలపై మీ అభిప్రాయం? మనం పట్టుకోలేమనుకుంటే ఆయన ఎందుకు పట్టుకోమని చెప్పినట్లు? 
త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య కబీర్ తదితరులు భక్తితో పరమాత్మను పట్టుకొని పరమపదించి ముక్తి పొందలేదా? 
ఆధ్యాత్మికత అంటే ఏమిటి? శోధన సాధన ఎలా చేయాలి? 
అర్థమైంది తన మనోస్థితి. ఆ ప్రశ్నలకు నాలో కదలాడే భావనలను తనకి అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలా అని, ఓ స్పష్టతకై ఆలోచిస్తూ... ఈలోగా కొందరి మిత్రుల అభిప్రాయం తెలుకుంటే బాగుంటుందనిపించి, వార్ని అడిగాను - భగవంతుణ్ణి మనమా...మనల్ని భగవంతుడా... ఎవరు ఎవర్ని పట్టుకోవాలి? అని!
'భగవంతుడు మనల్ని పట్టుకోడు, భగవంతుడునే మనం భక్తి ద్వారా సాధనల ద్వారా పట్టుకోవాలి. అందుకు గురువు అత్యవసరం. భగవంతునికి భక్తునికి వారధిగా గురువు ఉండాల్సిందే' అని కొందరు, 'మనల్ని భగవంతుడు పట్టుకోడు, అవతార పురుషులు, కారణజన్ములు, జ్ఞానుల లాంటివార్నే భగవంతుడు పట్టుకుంటాడు. వాళ్ళ ద్వారా భగవంతుణ్ణి పట్టుకునే అవకాశం మనకి కల్పిస్తాడు'...ఇది మరొకరి భావన. 'ఈ భౌతిక ప్రపంచం ఓ పెద్ద మాయాజాలం. ఈ సంసారం ఓ మహా సముద్రం. లేచిన దగ్గర నుండి పడుకునేంతవరకు పనులు చేయడానికే సమయం సరిపోవడం లేదు. ఈ ప్రాపంచిక ప్రపంచంలో పారమార్ధిక జీవనానికి మనుగడ లేదు. రెండూ భిన్న రహదారులు, భిన్న జీవన విధానాలు. మనం బలహీనులం కాబట్టి మనం దైవాన్ని గానీ, దైవం మనల్ని గానీ  పట్టుకోవడం ఎలా సాధ్యమౌతుంది'...ఇది మరొకరి మాట. మా అమ్మాయి (అనూష)ను అడగగా, ఏమాత్రం ఆలోచించకుండా, 'భగవంతుడే మనల్ని పట్టుకు నడిపిస్తున్నాడు. నా జీవితమే చూడు, ఎన్నో మలుపులు...ఊహించనివి, ఆశించనవి... ఏదో శక్తి నన్ను నడిపిస్తుంది. ఆ విశ్వాసంతో నడుస్తున్నాను. అయితే బుద్ధి అనేది మనకుంటుంది కదా, దాని సహాయంతో మన నడత సరిగ్గా ఉండేటట్లు చూసుకుంటే చాలు. భగవంతుణ్ణి పట్టుకునే శక్తి మనకెక్కడిది? భగవంతునికి నచ్చేలా మనముంటే, ఆ పట్టుకునేవాడే ఏదో క్షణాన్న పూర్తిగా తనవైపుకు తిప్పుకుంటాడు. అన్నమయ్య, రామదాసు లాంటివార్ని త్రిప్పుకోలేదా'? అని బదులిచ్చింది.
ఇదే ప్రశ్న నా పుత్రున్ని (అనుదీప్)ను అడిగా...'అమ్మా? అంతా దేవేచ్ఛ. ఆయన నడిపిస్తున్నాడు. ప్రతీది అంగీకరిస్తూ, దైవ స్ఫురణతో మన పనిని మనం ప్రశాంతంగా చేసుకుపోవడమే. దొంగ పోలీసును పట్టుకుంటాడా? పోలీసు దొంగని పట్టుకుంటాడా? ఎవర్ని పట్టుకునేశక్తి ఎవరికున్నట్లు? సింపుల్ లాజిక్'...అంటూ సింపుల్ గా చెప్పాడు. అందరి అభిప్రాయాలు ఆలోచింపజేసేవే. 

పద్మగారు పశ్నలకు నాకున్న చిరు అవగాహనతో బదులివ్వడానికి ప్రయత్నిస్తున్నాను. తప్పులుంటే పెద్దలు మన్నించి సరైన అవగాహన కల్పిస్తారని ఆశిస్తున్నాను. 
భగవంతుడు మనల్ని పట్టుకోడు... 
ఈ మాటతో నేను ఏకీభవించలేను. ఈ సమస్త సృష్టి సర్వేశ్వరుని సృజనే. భగవంతుని శక్తిచే ఈ జగత్తు నడుస్తుంది. 
కేనోపనిషత్తులో, అమరత్వాన్ని గురించి చూచాయగా ఎఱిగిన శిష్యుడు ప్రశ్నిస్తాడు - 'ఏ శక్తి మనల్ని నడిపిస్తుంద'ని .
కేనేషితం పతతి ప్రేషితం మనః కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తః|
కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుః శ్రోత్రం క ఉ దేవోయునక్తి||
ఎవ్వనిచే మనస్సు విషయాలపై పడుతుంది? ఎవనిచే ప్రేరేపింపబడి ముఖ్య ప్రాణం తన పనులను నిర్వహిస్తుంది? దేనిచే ప్రేరేపింపబడి మాట్లాడుతున్నాం, వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం?
దీనికి గురువుగారు ఏం చెప్తారంటే -
శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణః|
చక్షుషః చక్షురతిముచ్య ధీరాః ప్రేతస్మాత్ లోకాత్ అమృతా భవంతి||
అది ఆత్మ. దాని శక్తిచేతనే చెవి వింటుంది, కన్ను చూస్తుంది, జిహ్వ మాట్లాడుతుంది, మనస్సు గ్రహిస్తుంది, ప్రాణాలు పనిచేస్తాయి. ఈ ఇంద్రియాల నుండి ఆత్మను వేరేగా చూసే ధీరులు, ఈ ఇంద్రియబద్ద లోకంనుండి బైటపడి అమృతత్వాన్ని పొందుతారు. ఈవిధంగా పరమాత్మ శక్తే మనల్ని పట్టుకు నడిపిస్తుందని తెలుస్తుంది.
దీనినే శ్రీరామకృష్ణ పరమహంస వారు ఒక విశ్లేషణతో చెప్తారు, ఒక కుండలో నీరు పోసి, బియ్యం వేస్తే, అవి ఉడికి, అన్నం తయారుకావడానికి  కారణం క్రింద అగ్ని అయ్యేటట్లు, శరీరమనే కుండలో మనస్సు, బుద్ధి, ఇంద్రియాదులు పనిచేయడానికి కారణం ఆత్మ శక్తి. అదే భగవత్ శక్తి. ఈ శక్తితోనే ఇవన్నీ నడుస్తున్నాయని తెలుసుకోవాలంటారు. ఇప్పుడు ఆలోచించండి పరమాత్మ మనల్ని పట్టుకు నడిపిస్తున్నాడా లేదా? 
                      

మరి, భగవంతుడు మనల్ని పట్టుకోలేదనడానికి తావెక్కడ?

భగవంతుణ్ణి మనం పట్టుకోవాలా?
భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప మనం భగవంతుణ్ణి పట్టుకోలేం.  
                     

ఎవరికి సాక్షాత్కరించాలో ఆత్మే ఎన్నుకుంటుంది అని అంటుంది కఠోపనిషత్తు. అంటే ఎన్నుకోవడం మన ప్రయత్నాలతో, సాధనతో ముడిపడి లేదు. భక్తులు చెప్పే భగవదేచ్ఛ అన్నా, కర్మయోగులు చెప్పే దేవేచ్ఛ అన్నా, మహర్షులు చెప్పే ఈశ్వరేచ్ఛ అన్నా ఇదే. ఆయన ఇచ్ఛ ఉంటే ఆయనే పట్టుబడతాడు. 

భాగవతం దశమ స్కంధములో ఉలూఖల (ఉలుకల) బంధనమనే ఓ అద్భుత లీల ఉంది. గోపికలంతా కృష్ణుని అల్లరి గురించి యశోదకు చెప్పినప్పుడు, యశోదమ్మ ఎలాగైనా కృష్ణుని పట్టుకొని అక్కడవున్న రోలుకి కట్టేయాలని చాలా ప్రయత్నిస్తుంది. 
                      

కట్టడానికి శక్యం కాని తనని, కట్టివేయాలని పట్టుదలతో, తంటాలు పడుతూ తల్లి చేస్తున్న ఎడతెరపని ప్రయత్నం చూసి, అయ్యో! అమ్మ నన్ను పట్టుకోడానికి ఇంతలా ప్రయత్నిస్తుంది కదా, నేను యశోదమాతకు పట్టుబడాలని అనుకొని పట్టుబడతాడు. తనకి తాను భగవంతుడు పట్టుబడాలని అనుగ్రహిస్తేనే తప్ప పట్టుకోలేం అంటున్నది భాగవతం. 
                  

తల్లి యశోద కృష్ణునితో, నిన్ను పట్టుకుందామంటే, ఎవరికీ చిక్కవట కదా... నేను నిన్ను పట్టుకోవాలని పట్టుదలతో పట్టుబడితే నీవు తప్పకుండా అందుతావు...కృష్ణుని నోటిలో విశ్వ ప్రదర్శన చూసినా, అన్నీ మరిచి మాయలో పడి అంటుంది.  అలాగే మనం కూడా ఏమనుకుంటామంటే, చాలా సాధన చేస్తున్నాం, భక్తితో భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం... గురువును ఆశ్రయించి ఉన్నాం... ఎప్పటికైనా భగవంతుణ్ణి పట్టుకోగలం అని! కానీ, ఈ భావన మాత్రమే సరిపోదు. అలాగని మనం కలత పడాల్సిన పని లేకుండా మనకి కూడా ఎలా తనకి తాను భగవంతుడు పట్టుబడతాడో యశోదమ్మను పరిశోధిస్తే, ఆ సూక్ష్మతత్వం అర్థమవుతుంది. 
                       

కృష్ణుని గురించే అనుక్షణం తపన, హృదయం నిండా అనన్య ప్రేమ, నిరంతర స్ఫురణ, శరణాగతి భావన, పట్టుబడతాడనే పరిపూర్ణ విశ్వాసం వుండి, ఆమెలా ప్రయత్నిస్తే యశోదమ్మకు పట్టుబడినట్లే, తనకి తానై పట్టుబడతాడు. భగవంతుణ్ణి అనుమతి లేనిదే ఎవరూ ఏమీ చేయలేరు. భగవంతుని అనుగ్రహం లేనిదే ఎవరూ ఏమీ సాధించలేరు. 

సాధన ద్వారా పట్టుకోగలం అనుకుంటే అది మన మనో మాయే. మనం చేస్తున్న సాధన ఆత్మ దర్శనానికి కాదు, చిత్తశుద్ధికి. 

మన ప్రతిబింబం కనిపించాలంటే అద్దం శుభ్రంగా ఉండాలి. అలానే ఆత్మ దర్శనం కావాలంటే మన హృదయం నిర్మలంగా ఉండాలి. మనస్సును వాక్కును ఏకం చేసి భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ నిష్కపటంగా ఉండాలి. మనం చిత్తశుద్ధితో ఉంటే చాలు, మిగిలినదంతా ఆ భగవంతుడే మన ద్వారా చేయించుకుంటాడు. 

గొడ్డలి కట్టెలను కొడుతుంది, అది గొడ్డలి గొప్పతనం కాదు. కలం గ్రంథాలను వ్రాస్తుంది, అది కలం గొప్పతనం కాదు. మనం మంచి పనులు చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, అది మన గొప్పతనం కాదు. అన్నింటికీ కర్త అయిన ఈశ్వరునిదే ఆ గొప్పతనమని, మనం కేవలం ఈశ్వరుని చేతిలో పనిముట్లం అన్న భావనతో సర్వకర్మలను, కర్మాఫలాలను ఈశ్వరుని యందు వదిలి భక్తుడు ఉన్నప్పుడు చిత్తశుద్ది అలవడుతుంది. 
                      

పామరుడు అయిన, పండితుడు అయినా సరే, తాను చేసిన ప్రతీ కర్మకు ఇప్పుడో, అప్పుడో, ఎప్పుడో ఫలం అనుభవించాలి. కనుక విచక్షణతో కర్మలను ఆచరించాలి.  దైవానికి కాదు, కర్మకు భయపడాలి.  దైవం క్షమించినా కర్మ వదలదు, కర్మ ఫలితం అనుభవించాల్సిందే. 
జీవించినంతకాలం కర్మ చేయక తప్పదు. కర్మ ఫలితం తప్పదు. మరి కర్మ ఫలం అంటకుండా ఏం చేయాలి? 
కర్మ ఎరుకతో చెయ్యి, లేకపోతే కర్మే ఎరుకులోకి తీసుకువస్తుంది అంటారు తాత్వికులు.
ఒకసారి మన ఋషులు తెలిపే సంప్రదాయాలను పరిశీలిస్తే, ఆధ్యాత్మికతను దైనందిక జీవితంలో ఎంత చక్కగా ముడిపెట్టి చూపించారో తెలుస్తుంది.
నదులు, చెట్లు, పుట్టలు... అన్నింటినీ పూజించే పద్దతి ద్వారా అన్నింటా దైవం ఉన్నాడనే భావం నెలకొల్పారు. గాలి - వాయుదేవుడు, నిప్పు - అగ్నిదేవుడు, వాన - వరుణదేవుడు, భూమి - భూదేవి...ఇలా ప్రతీ దాంట్లో భగవంతుని ఉనికి అనుభవంలోకి తెచ్చుకోమంటుంది సనాతన ధర్మం. ఆ ఉనికిని అనుభవంలోనికి తెచ్చుకుంటూ చేసే కర్మలు ఈశ్వరునికి పూజలు అని అన్నారు మహర్షులు. ఎవరు ఏపనిలో ఉన్నా దైవస్ఫురణతో చేయాలి.
                      

స్నానం చేస్తున్నప్పుడు - మనలో చెడు వాసనలను శుభ్రం చేసుకుంటున్నాను
బిడ్డకు స్నానం పోస్తూ - దైవానికి అభిషేకం చేస్తున్నాను
ఇల్లు ఊడ్చుతూ - భగవంతుణ్ణి నాలో ప్రతిష్ఠించుకోవడానికి హృదయాన్ని పరిశుద్ధం చేస్తున్నాను
వంట చేస్తూ - దైవానికి నైవేద్యం సిద్ధం చేస్తున్నాను
కూరగాయలు తరుగుతూ - నాలో ఉన్న కామక్రోదాధి దుర్గుణాలను జ్ఞానమనే కత్తితో తరుగుతున్నాను
భర్త పిల్లలు తదితరులకు వడ్డిస్తూ - దైవానికి ఆరగింపు చేస్తున్నాను... 
ఈ రీతిలో ప్రతీ పనిని దైవసేవగా, దైవ స్ఫురణతో సాగిస్తే, ఇంతకంటే సాధన వేరొకటి వుంటుందా అని అంటారు సత్య సాయిబాబా వారు. ఏ పని చేస్తున్న, 'నేను చేస్తున్నాను' అనే అహంకార భావనని దివ్యత్వంలో లీనం చేసి పడే శ్రమను ఒక నివేదనగా భగవంతునికి అర్పించడం అత్యుత్తమ భావన. దైనందిక కార్యక్రమంలో భగవంతుణ్ణి ఉనికి లోనికి తెచ్చుకోవడానికి, నిష్కామ కర్మకు ఇదో చక్కని ప్రక్రియ.
                     

రామకృష్ణ పరమహంస వారు చెప్పిన ఓ చక్కటి కథ గుర్తుకొస్తుంది.
నిరంతరం అంతా రామేచ్ఛ అన్న భావనలో ఉండే  ఓ సాలెవాడు, ఒకరోజు రాత్రి నిద్రపట్టక ఆరుబయట కూర్చొని భగవత్ నామజపం చేస్తున్నాడు. అదే సమయంలో ఆ దారిలో వచ్చిన దొంగలు, మూటలు మోయలేక ఈ సాలెవాన్ని తమతో పాటు నడవమని, ఆ మూటలు ఆయనపై వేసి తీసుకెళ్తుండగా, రక్షకభటులు రావడంతో ఆమూటలను, సాలెవాన్ని వదిలి దొంగలు పారిపోయారు. ఈ సాలెవాన్ని రక్షకభటులు న్యాయాదికారి ఎదుట హాజరు పర్చగా, ఎప్పుడూ అంతా రామేచ్ఛ అన్న భావనలో ఉండే సాలెవాడు 'రామేచ్ఛ వలన అంతవరకు మగ్గం నేస్తున్న నేను అలసి పడుకుందామనుకుంటే, నిద్ర పట్టక నామజపం చేసుకుంటూ ఆరుబయట కూర్చున్నాను. రామేచ్ఛ వలన అటుగా వచ్చిన దొంగలు, వారు మోస్తున్న మూటలు నాపై వేసి వాళ్ళతో పాటు నడవమన్నారు. రామేచ్ఛ వలన కొంతసేపటికి ఈ రక్షకభటులు వచ్చి నన్ను పట్టుకున్నారు. రామేచ్ఛ వలన ఇప్పుడు మీ ముందు నన్ను హాజరుపర్చారు' అని చెప్పగా, ఇతను సజ్జనుడు విడిచిపెట్టండి అని న్యాయాధికారి ఆదేశించెను. ఈ కథలో మాదిరిగా ప్రతీది ఆధ్యాత్మిక కోణంలో స్వీకరించాలి. ఎదురయ్యే కష్టసుఖాలను కూడా భగవత్ ప్రసాదంగా / దేవేచ్ఛగా భావించడం కూడా భగవత్ ఉనికిని అనుభవం లోనికి తెచ్చుకోవడమే. నేరుగా పట్టుకొలేకపోయినా, ఇలా భగవత్ ఉనికిని గుర్తించడం వలన కొంత పట్టుకున్నట్లే.
                       

అలా ప్రతీ పనిలోనూ భగవంతుని ఉనికిని అనుభవంలోనికి తెచ్చుకోవడమే సరైన ఆద్యాత్మికత. ఇలా అనుభవంలోనికి తెచ్చుకోవడం అంత సులువు కాదు, అందుకు ఎంతో అభ్యాసం, పూర్తి విశ్వాసం, సర్వమూ భగవన్మయంగా చూడగలిగే చిత్తశుద్ధి ఉండాలి. 
                     

ఇక ఆధ్యాత్మికత అంటే ఏమిటో గత కొన్ని టపాలలో తెలపడం జరిగింది కాబట్టి ఇక్కడ సంక్షిప్తంగా చెప్తున్నాను.
ఆధ్యాత్మికత అంటే -
"ఆది నుండి ఉన్న ఆత్మ కథ".
"నిత్యమూ ఆత్మను అధ్యాయనం చేయడం".
"శరీరం, ప్రాణం, మనస్సే కాకుండా ఆత్మ అనే సద్వస్తువు ఉంది అనే జ్ఞానపు ఎఱుక".
"నేను అంటే ఏదో నాకు తెలిపే యోగం".
"ఎఱుక కోల్పోకుండా దైవ స్ఫురణలో ఉండడం"
"బహిర్ముఖమైన మనస్సును అంతర్ముఖం చేయడం".....

ప్రాపంచిక జీవితం, పారమార్థిక జీవితం అని రెండు జీవితాలు లేవు. ఉన్నది ఒకటే జీవితం. ఆధ్యాత్మికత వ్యవహార జీవితానికి అతీతం కాదు. అందులో పార్శమే.
భౌతిక ప్రపంచం పెద్ద మాయాజాలం... మనం బలహీనులం... ఊహూ.....ఈ భావమూ సరికాదు.
                   

భౌతిక ప్రపంచంలో ధర్మపరమైన అనుబంధం వుండాలి. అంతరంగంలో ఆత్మ స్వరూపుడైన భగవంతుడు ఉన్నాడనే స్పృహ వుండాలి. . అసలు భౌతిక ప్రపంచం మాయకాదు. అంతర ప్రపంచం యొక్క కొనసాగింపే భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచమే అంతర ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి దారి చూపిస్తుంది. మాయ అనేది మనం ఏర్పరుచుకున్న అజ్ఞానం. మనం ఈ ప్రపంచాన్ని చూస్తూ, ఇదే సత్యమనుకొని ఏర్పరుచుకున్న అభిప్రాయాలు భావాలు నమ్మకాలు వదిలితే, మాయ వీడుతుంది. 
దేనిని మనం మాయ అంటున్నామో, అది సాక్షాత్ బ్రహ్మమే అని తెలుసుకునేంతవరకు ఆధ్యాత్మిక సాధన పరిసమాప్తం కాదు. 
అలానే, మనం బలహీనులం కావొచ్చు. కానీ, మనం ఎవరి శరణు పొందామో, ఆయన సర్వశక్తి సంపన్నుడని మరిచిపోకూడదు. భగవంతుడు అండగా ఉన్నాడన్న విశ్వాసం మనకున్నప్పుడు బలహీనులమనే భావనకు తావులేదు.
                    

పద్మగారు రామకృష్ణ పరమహంస వారి మాటలను ప్రస్తావిస్తూ... భగవంతున్ని మనం పట్టుకోలేనప్పుడు ఆయన పట్టుకోమని ఎందుకు చెప్పారని అడిగారు.
వైద్యులు తమ దగ్గరకు వచ్చిన రోగులందరికీ ఒకే రకమైన మందులు ఇవ్వరు. రోగులను పరీక్షించి, వారికి ఏ మందు చక్కగా పనిచేస్తుందో గుర్తించి, తగు మందులు సూచించి వాడమంటారు. వాళ్ళకి పలానా మందులు వాడమన్నారు, నేనూ అవే వాడతానంటే కుదరదు కదమ్మా.
అలానే, రామకృష్ణుల వారైనా, రమణుల వారైనా, సద్గురువులైనా మన మనస్సు ఎలాగైతే చక్కగా కుదురుకుంటుందో గుర్తించి, తరించడానికి తగు సూచనలు ఇస్తారు. కొందరికి కర్మ యోగం, కొందరికి భక్తి యోగం, కొందరికి జ్ఞాన యోగం ...ఇలా మన ఉపాసన సౌలభ్యం కోసం పలు మార్గాలు చెప్తారు. ఈ సూచనలు మన మానసిక పరిపక్వత, అభిరుచి బట్టి వుంటాయి. 
                      

ఈ యోగ మార్గాలలో కొంచెం వైవిధ్యం ఉన్నా, ఫలితం మాత్రం ఒక్కటే. అన్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకి తీసుకెళ్లేవే. మనకు అనువైన ఒక యోగపద్ధతిని చిత్తశుద్దిగా అనుసరించి అందులో పరిపూర్ణత సాధించాలి. 
ఈ శరీరం అశాశ్వతమైనదని, మలినమైన అంశాలతో కూడినటువంటిదని శాస్త వచనం. 
ఈ శరీరం మహా దివ్యమైనది, యోగ సాధనకు అనువైనది, పరమాత్మకు ఆలయం వంటిది అనే ఈ మాటలు కూడా శాస్త్ర వచనాలే.
పరస్పర విరుద్ధమైన ఈ మాటలు ఏయే సందర్భంలో ఎందుకు శాస్త్రం చెప్పిందో ఆ ఆంతర్యం గ్రహించాలి. ఈ శరీరమే నేను అని భ్రమిస్తూ, దాని సుఖపెట్టడానికి ప్రయాస పడేవారికి, ఈ శరీరంపై మోహంతో ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తించేవారికి... నాయనా! ఈ శరీరం అశాశ్వతం, ఈ శరీరం నీటి బుడగ లాంటిది, ఈ శరీరమే నీవని భ్రాంతితో దారి తప్పకు అని మొదట మాట చెప్పింది. ఇక రెండవ మాట ఎవరికంటే - ఈ శరీరాన్ని భౌతిక సుఖాలకై పోషించే లాలస లేకుండా, ఈ శరీరాన్ని భగవత్ ఉపకరణగా భావించి, దీనినే ఓ సాధనగా మలుచుకొని, దివ్యత్వం పొందేవారికి చెప్పింది. 
తేనెటీగలు పువ్వుల నుంచి పువ్వులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మకరందాన్ని స్వీకరించినట్లు, మనం నిరంతర జిజ్ఞాసపరులై, జ్ఞానసముపార్జనకి మహర్షులు యోగులు సద్గురువుల నుండి వారి మాటలలో వున్న ఆంతర్యాన్ని, జ్ఞానాన్ని గ్రహించాలి.

త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య తదితరులను భగవంతుడు తన అనుగ్రహంతో తనవైపు త్రిప్పుకున్నాడు. వారి భక్తి అలాంటిది. జ్ఞానంతో కూడిన భక్తి వారిది. 
                        


అనుక్షణం తమలోని అంతర్యామితో అనుబంధం కల్గి వున్నవారు. ఆత్మ జ్ఞానం పొందినవారు. అందుకే అన్నమయ్య "బ్రహ్మ మొకటే, పరబ్రహమొకటే"... అని ఆలపించగలిగారు.  
అంతరంగమున ఉన్న సత్యాన్ని కాంచి,
మనుగేలరా ఓ రాఘవా! 
మరుగేల చరా చర రూప
పరాత్పర సూర్య సుధాకర లోచన
అన్ని నీ వనుచు అంతరంగమున
తిన్నగా వెదికి తెలుసుకొంటినయ్య... అని కీర్తించాడు త్యాగరాగేయుడు.
                  

వారు పరమపదించి ముక్తి పొందలేదు. ముక్తస్థితి పొందే తనువు చాలించారు. ముక్తి అనేది మరణం తర్వాత వచ్చేది కాదు, ముందే పొందేది.
ఇంతటి భక్తి మనలో ఉందా? కన్నప్పలా కన్ను ఇచ్చే భక్తి, రామకృష్ణునిలా అలౌకిక స్థితిలో నృత్యం చేసే భక్తి, రామదాసులా వ్యాకులతతో పరితపిస్తూ గుండె చీల్చుకునే భక్తి మనకుందా?
ఈ ప్రశ్నలు మనమెవరమూ వేసుకోం. ప్రహ్లాదుడు పిలవగానే స్తంభం పగలుగొట్టుకొని నరసింహుడు సాక్షాత్కరించాడు. మరి ఎన్నో లక్షలసార్లు నారాయణ మంత్రజపం చేసిన మనకెందుకు ఆయన కలలోనైనా కానరావడం లేదని మనల్ని మనం ఏనాడైనా సమీక్షించుకున్నామా?
ఏదో కొంతసేపు పూజగదిలో భగవంతున్ని ఆరాధించడం, కొంతసమయం జపం, కొంతసేపు ధ్యానం, సద్గ్రంధాల పారాయణం, వీలైనప్పుడు ఆలయ దర్శనాలకు సత్సంగాలకు వెళ్ళడం...ఇది కాదు భక్తి అంటే. ఇవన్నీ ప్రత్యేక విద్యలను అభ్యసించడానికి అర్హతకై పెట్టిన ప్రవేశ పరీక్షలు లాంటివి.నిజమైన భక్తి అంటే పరమాత్మతో అనుక్షణం అనుబంధం కల్గివుండడం. ఈశ్వరుడు ఉన్నాడనే స్ఫ్రుహతో జీవించడం నిజమైన ఈశ్వరారధన. పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన ధర్మాధర్మాలను గమనిస్తుంటాడు, ఆయన ప్రీతికోసం నేను ధర్మబద్ధంగా జీవించాలనే ఉదాత్త భావన కూడా భక్తే. ఇందుకు కావల్సింది ఎంతో విశ్వాసం, ఆర్తి, శ్రద్ధ. భక్తి ఉన్నవారందరూ భగవంతుణ్ణి ఆరాధిస్తారు. భక్తితో పాటు శ్రద్ధ కలిగినవారు మాత్రమే భగవంతుని అనుగ్రహం పొందుతారు. 
                       

పువ్వులో మకరందం ఉంటే, భ్రమరం దానికదే వచ్చి ఆస్వాదిస్తుంది. అలానే మనలో భక్తి మాధుర్యం ఉంటే, భగవంతుడు తనకి తానే పట్టుబడతాడు.