12, మార్చి 2023, ఆదివారం

నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి...

                      


భారతీ, 

ఓ మాట చెప్పనా? ఏదైనా కావలిస్తే, అది అమ్మకి చెప్తే, నాన్నకు చెప్పి త్వరగా మన కోరికను తీరేటట్లుచూసేది అమ్మే. అమ్మ ద్వారానే అయ్యగారు దగ్గరకు చేరాలి. ఎంతసేపు రామా, హనుమా...అని మొర పెట్టుకోవడమే తప్ప, అమ్మ సీతమ్మను తలచేవా ఏనాడూ? నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లికి... అని అంతటి రామ భక్తుడే వేడుకున్నాడే... నీవూ అలా వేడుకోవచ్చు కదా... నేను తలచినా, తలవకున్నా, మరిచినా... నా చేతిని వదలవద్దని రామయ్యకు చెప్పు సీతమ్మ తల్లీ... అని అమ్మని అడుగు...అమ్మని ప్రేమతో పట్టుకుంటే, రాముడు నీ చెంతే...ఇక నీకూ ఎంతో నిశ్చింత..... అని చమత్కారంగా చెప్తున్న, మిత్రురాలు ఝాన్సి మాటలకు నవ్వుకుంటూ, రామ రామా అని స్మరించడంలో సీతమ్మ కూడా ఉంటుంది కదా, వేరేగా సీతమ్మ అని అనుకోకపోయినా, శ్రీ రామ అనుకోవడంలో సీతమ్మను తలచినట్లే కదా. చిత్ రాముడైతే, చిచ్చక్తి సీతమ్మ. శుద్ధబ్రహ్మము రాముడైతే, శబ్ధబ్రహ్మరూపిణి సీతమ్మ. ఆయన ఆత్మయోగి, ఈమె చిచ్చక్తి. రాముని తోడనే సీతమ్మ. రాముని లోనే సీతమ్మ. వేరు భావం లేదని, అందుకే ప్రత్యేకంగా సీతా అని స్మరించడం లేదని అన్నాను. 

ఊహూ...అది కాదు... నేను చెప్పింది ఏమిటంటే, సీతమ్మ ప్రకృతి. ప్రకృతిని ఆరాధించటం ద్వారానే పురుషుడిని చేరుకోగలం. ఒకసారి కొంతకాలం రామయ్యతో పాటు అమ్మనీ స్మరించి చూడు...ఒక విధమైన హాయి వస్తుంది. సీతమ్మ కోణంలో రామాయణం పరిశీలించి స్మరణలో సీతమ్మ గురించి వ్రాయవచ్చు కదా...ఆ తర్వాత నీ ఇష్టం అని అంది.
నాకోసం చెప్పిన మాటలు వినక మానతానా? రామునితో పాటు సీతమ్మ నామం మదిలో స్మరణం. ఆ సమయాల్లో కొన్నిసార్లు అనిర్వచనీయమైన ధ్యానానుభూతి.

సీతమ్మతో కాసేపు -

అమ్మా! ఇదిగో అప్పటి నుండి నిన్నే చూస్తున్నాను. నిన్ను మాత్రమే చూస్తూ, రామాయణం చదవడం ప్రారంభించాను. సీతోపనిషత్ చదువుతూ, నీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అయినా నా అమాయకత్వం గానీ, లోక కల్యాణార్థమై అవతరించిన ఆదిపరాశక్తి అపరాంశవైన నిన్ను అణుమాత్రమైనా చూడగలనా? 
    
ప్రథమా శబ్దబ్రహ్మమయీ స్వాధ్యాయకాలే ప్రసన్నా,
ఉద్భవా నరకాత్మికా, ద్వితీయా భూతలే హలాగ్రే సముత్పన్నా |
తృతీయా ఈకారరూపిణీ, అవ్యక్తస్వరూపా భవతీతి సీతా 
ఇతి ఉదాహరంతి శౌనకీయే ||
మొదటి రూపం - శబ్దబ్రహ్మమయి రూపం. స్వాధ్యాయకాలంలో ప్రసన్నమవుతుంది.
రెండవ రూపం -  నరకాత్మికా (స్వాతిరిక్తే యేన రమంతే తే నరాః తేషాం కం, తదేవాత్మా స్వరూపం యస్యాః) భగవంతుని కంటే అన్యమైనది ఏది లేదని తెలిసి, ఆ భగవత్ స్వరూపమే తనదిగా, తానుగా, తనలో తాను రమిస్తూ వుండే నరులలోని బ్రహ్మానందమే జగన్మాత స్వరూపం. (నిరావృత సుఖ స్వరూపేణ సకృత్ ఉద్భవా) బ్రహ్మ జ్ఞానులలోని ఆ బ్రహ్మానందరూపిణి ఐన తానే భూమిపై హలాగ్రమున అంటే నాగేటి చాలున ఉద్భవించిన సీత.
మూడవ రూపం - 'ఈ'కారరూపిణి. అవ్యక్తరూపిణి... జగత్తంతా నిండి ఉండే జగదానందకారిణి అని తెలిపింది, శౌనకీయం.

ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తిత్రయం యద్భావసాధనమ్| 
తాధ్భ్రహ్మ సత్తాసామాన్యం సీతా తత్వ ముపాస్మహే|| 
ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులకి యే భావం సాధనం అయిందో, ఆ బ్రహ్మసత్తే సీతతత్త్వము.
(ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులైన మూడింటి స్వరూపమే సీతాదేవి. అంతటా అన్నిటా సామాన్యంగా వ్యాపించి ఉన్న సత్ బ్రహ్మభావాన్ని సాధించటానికి ఈ శక్తి త్రయాన్ని సాధకుడు ఉపాసించాలి. మనిషి తన లోని ఈ మూడు శక్తులు సరిగ్గా ఉపయోగించుకొనకపోతే బ్రహ్మభావాన్ని పొందలేడు)

దేవతలు బ్రహ్మను అడిగారు - "కా సీతా, కిం రూప మితి"| (సీత ఎవరు? ఆమె స్వరూపం ఏమిటి?)

మూలప్రకృతిరూపత్వాత్ సా సీత ప్రకృతిః స్మృతా|
ప్రణవప్రకృతిరూపత్వాత్ సా సీత ప్రకృతి రుచ్యతే||
సీత మూల ప్రకృతి మరియు ప్రణవప్రకృతి అగుటచేత ఈ సీతాదేవి మూలప్రణవప్రకృతి స్వరూపిణి అన్నది బ్రహ్మ వాక్కు.
(మొట్ట మొదట అవ్యక్తపరబ్రహ్మంలో నుండి వ్యక్తమైనది ప్రణవం (ఓం) సీతాదేవియే. అలాగే మొదట ఉద్భవించిన మూలప్రకృతి కూడా సీత స్వరూపమే)

శ్రీరామసాన్నిధ్యవశా జ్జగదానందకారిణీ|
ఉత్పత్తిస్థితిసంహారకారిణీ, సర్వదేహినామ్||
సీతా భగవతీ జ్ఞేయా మూలప్రకృతి సంజ్ఞితా|
ప్రణవత్వాత్ ప్రకృతి రితి వదంతి బ్రహ్మవాదినః ఇతి||
సీతాదేవి శ్రీరాముని సన్నిధిలో ఉండి జగదానందకారిణి అవుతుంది. సమస్త ప్రాణులను సృష్టి, స్థితి, లయములు గావిస్తుంది. కావున ఈమె మూలప్రకృతిగా తెలుసుకోవాలి. ప్రణవరూపిణి యగుటచేత ప్రకృతి అని బ్రహ్మవాదుల భావన.

తల్లీ!
జనకుడికి నాగేటి చాలున దొరకక ముందు, రామచంద్రుణ్ణి మనువాడక ముందు కూడా వున్న మహాశక్తి స్వరూపిణివి కదా...
రాక్షసులు హనుమ తోకకి నిప్పంటించారని రాక్షసాంగనలు ద్వారా విని, దుఃఖితురాలివై అగ్నిదేవుడుని ప్రార్థించి, మంటలు ప్రజ్వరిల్లుతున్నా, ఆ వేడి బాధ హనుమకు లేకుండా చేసిన నీవు, నీవుగా సంకల్పం మాత్రంచే రావణుని వధించగలవు కానీ, రాముడే చేయాలని ఎందుకు తలచావో, మొదట అర్థం కాలేదు. తరచి తరచి ఆలోచిస్తే, అర్థమైందమ్మా ... నీ మనోగతం.  

దేవ మాయేనా నిర్మితవై, అయోనిజవై, యజ్ఞదాత్రిలో నాగేటి చాలున ఉద్భవించి, నరుడుగా పుట్టిన రాముణ్ణి వివాహం చేసుకొని నరకాంతగానే నడుచుకున్న సాధ్విమణివి.

అందుకే అయోనిజగా ఉద్భవించి, నరకాంతగా జీవించి, రాముని భార్యగా నరకాంత ధర్మాన్ని లోకానికి నిరూపించి, ప్రాతివ్రత్యంలో  నిలబడి, రావణున్ని రామునిచే పడగొట్టించినంతవరకు ఓర్పుగా ఉన్నావని! 
                   

రావణుడు పరమ శివభక్తుడు, శాక్తేయుడు, సర్వవేదార్ధ పరిజ్ఞాత... బ్రహ్మ వరాల కారణంగా (దేవతలు, దానవులు, పన్నగులు, యక్షులు, రాక్షసుల నుండి చంపబడకుండ ఉండేటట్లు రావణుడు బ్రహ్మ దగ్గర వరం పొందాడు. మానవులు నుండి చంపబడకుండా ఉండే వరాన్ని కోరుకోలేదు. అప్పుడే మానవుడు వలనే మరణం కలుగుతుందని బ్రహ్మ వాక్యం) 
అంతటి వానిని వధించడానికి విష్ణువే నరునిగా అవతరించాలి. శక్తివైన నీవు రావణ మారణ సంగ్రామానికి నాందివి అయ్యావు. రావణునికి రాముడు మహావిష్ణువని తెలియదు. రావణునికి ఈ సంగతి తెలియాలి. రాముని రూపంలో నరుడుగా జన్మించింది నారాయణుడేనన్నది అందరికీ తెలియాలి. మానవుడు మాధవుడు ఎలా కాగలడో, రాముని జీవన నడవడి ద్వారా ముందు యుగాల వారికి తెలియాలి, బ్రహ్మ వాక్యం నిజం చేయాలి. ఇందుకే కద తల్లీ! మహాశక్తివైన నీవు రావణుని సహరించకుండ సహనంతో ఉన్నదీ...

అయోజనిగా వచ్చి కూడా, రావణాసురుడిచేత బంధింపబడి, అశోకవనంలో రాక్షసస్త్రీలచేత అన్ని బాధలను కేవలం ధర్మరక్షణార్ధమే అనుభవిస్తూ, భర్తను అనుగమిస్తూ, నరకాంతగా నడుచుకోవడం... 

నిజం చెప్పొద్దూ... కొన్ని కొన్ని సందర్భాల్లో రామయ్య కంటే, ఒకింత నీవే గొప్పనిపిస్తుంది తల్లి.

పద్నాలుగువేల మంది ఖర దూషణాదులను చూసినప్పుడు రాముడు కోపించినట్లుగా, రాముని కళ్ళలో ఎరుపు జీరలు వచ్చాయట కానీ, లంకలో పలు రీతుల్లో రాక్షసులు బాధ పెట్టినా, ఏనాడూ నీ కళ్ళు మాత్రం ఎరుపెక్కలేదట కదమ్మా... అందరి పట్లా నీకు కారుణ్యమే...క్షమాగుణ సంపన్నురాలివి తల్లి.

కడగండ్లు పాల్జేసిన రావణుని కూడా రక్షింపదలచి రాముణ్ణి శరణు కోరమని హితవుపదేశించడం... ఎవరికైనా సాధ్యమా?  అందరి హితైషిణివి తల్లి.

రావణ సంహారం అయ్యాక, నీ దగ్గరకు వచ్చిన హనుమ, రావణ సంహారం, రాముని విజయం చెప్పేక, అమ్మా! ఆరోజు నేను వచ్చినప్పుడు ఈ రాక్షస స్త్రీలు ఎంత బాధ పెట్టారో చూసానమ్మా... అనుమతి నివ్వు, వీరిని నా పిడికిలి పోట్లతో చంపేస్తాను అని అనగా, వాళ్ళకి నా రక్ష. నీ ప్రభువు చెప్పింది నీవు చేసినట్లే, వాళ్ళ ప్రభువు చెప్పింది వాళ్ళు చేసారు. వాళ్లనెందుకు చంపడం? అంటూ...వేటగాడు, పెద్దపులి, భల్లూకం కథ చెప్పి వారించిన నీ వాత్సల్యమే వాత్సల్యం. అందుకే అమ్మ అమ్మే. 

అమ్మా! 
శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం, మునులు వచ్చి రాక్షసుల బారినుండి కాపాడమని కోరడం,  రాముడి అభయంను పొందడం, సుతీక్ష్ణ మహర్షిని దర్శించి, కులాసాగా మాట్లాడుకుంటూ 
ప్రయాణం కొనసాగిస్తూ, రాముడికి నీవు చేసిన ఉపదేశం... అమ్మా! నిజం చెప్పొద్దూ.....
మొదట "మీరు మహాత్ములంటూ రాముడితో సంభాషణ ప్రారంభించి, రాముడి సత్యసంధత, దర్మనిష్ఠ కొనియాడుతూ, పూర్వవైరం ఏమీ లేకపోయినా, ఇతరుల ప్రాణాలు తీయడం అనే మూడో వ్యసనం భయంకరంగా ఉంటుందంటూ... క్రూరులైన సరే, మనజోలికి రానంతవరకు వాళ్ళను దండించే హక్కు ధర్మవరులకు ఉండదు కదా...అంటూ నీలో కదలాడిన భయాన్ని దిగులును చెప్తూ, సమయోచితంగా ఓ కథను కూడా చెప్పి, ప్రస్తుతం జటావల్కలాలను ధరించి, తాపస వృత్తి చేపట్టాక, ఆయుధం పట్టడం తగునా... అని చెప్పాలనుకున్నదంతా చెప్పేసి, చివరగా, మీకు ధర్మాన్ని ఉపదేశించే సామర్థ్యం నాకే కాదు, ఎవరికీ లేదు' అని అంటూనే... మీ తమ్ముడితో ఆలోచించి ఏది ధర్మమని అనుకుంటారో అది చేయమని..... ఎంత చక్కగా మాట్లాడావో... అమ్మా! నీకంటే  మృదుభాషిణి ఎవ్వరుంటారు తల్లి? 
                    

లంకా పట్టణంలో అశోకవనంలో శింశుపా వృక్షం క్రింద బంధించి ఉన్న నీతో, 'అమ్మా! నిను తీసుకొని వెళ్ళి రాముడి వద్దకు జేర్చి, ఇప్పుడే నిన్ను దుఃఖం నుండి విముక్తురాలను చేస్తాను, ఓ మంగళప్రదురాలా! నీవు సందేహించక నా భుజంపై కూర్చొమ్మా... అని హనుమ అన్నప్పుడు,  
ఓ వానరశ్రేష్టుడా! నీవంతవాడవగుదువు కానీ, రాముడే వచ్చి రావణుడిని చంపి, విజయం సాధించి నన్ను తీసుకెళ్లినట్లయితేనే ప్రతిష్టాత్మకంగా ఉంటుంది.   దొంగిలికొని పోవదగునే దొరలకు నెందున్ (మొల్ల రామాయణం) ఇప్పుడు నీతో నేను వచ్చేస్తే, రావణుడు నన్ను అపహరించి తెచ్చినట్లుగానే ఉంటుంది.... రావణుడి దొంగతనబుద్ధికి, రాముడి దొరతనంతో బదులివ్వాలని, రాముడు కీర్తిని ఇనుమడించే రీతిలో ఎంత చక్కగా మాట్లాడవో కదా తల్లి. రాముడి కార్యం చెడిపోయే పనులేవీ మనం చేయకూడదు. రాముడు తన పరాక్రమంతో రావణుడుని సంహరించి, నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళితే అది ఆయన కీర్తికి, గౌరవానికి, ప్రతాపానికి తగినట్లుగా ఉంటుంది... ఇది కదమ్మా రాజపౌరషమంటే! భర్త ప్రఖ్యాతే భార్యకు ముఖ్యమని ఎంత చక్కగా చూపించావో తల్లి.
ప్రాతివ్రత్య దర్మాన్ననుసరించి నా అంతట నేనుగా పర పురుషుణ్ణి స్పృశించనని అన్నావు... రావణుడు బెదిరించిన, ప్రలోభ పెట్టినా, రాక్షస స్త్రీలు భయపెట్టినా, మనస్సులో రాముణ్ణే నిలుపుకొని ఓర్చుకోవడం...ఇది కదా ప్రాతివ్రత్యం. రావణుడు, రాక్షసులు నిన్ను ఎంత బాధించిన, అక్కడ నుండి తప్పించుకునే అవకాశం హనుమ రూపేణా వచ్చిన, రాముడే వచ్చి నన్ను తీసుకెళ్ళాలని ప్రకటన చేసి నిలబడ్డావు...ఇది కదా ఓర్పు. అందుకే కదమ్మా, ఇప్పటికీ ఓర్పు అంటే మా అమ్మ సీతమ్మదే అని చెప్పుకుంటున్నాం.
                     

 
ఆ పిమ్మట హనుమ మాటలు బట్టి, హనుమ ఒకింత నొచ్చుకున్నాడని గ్రహించి, నీవు నాకు అత్యంత ఆప్తుడివి అని స్పురింపజేసెలా మాట్లాడి, నీకూ రామయ్యకు, దేవతలకు మాత్రమే తెలిసిన కాకాసురుని వృత్తాంతం చెప్తూ, ప్రియంగా మాట్లాడిన నీకంటే మృదుస్వభావి ఎవరుంటారు తల్లి? 

అమ్మా! 
ఇలా ఎన్నెన్ని చెప్పను... నీకు నీవే సాటి తల్లి.
                      

ఇంతటి సద్గుణ సంపన్నురాలివి కాబట్టే, వాల్మీకి మహర్షి సీతాయః చరితమ్ మహత్..... మహత్తరమైన చరిత్ర నీదని శ్లాఘించారు.

ఆత్మదర్శనం కల్గించి మనిషిని తరింపజేసే మహాశక్తివి. కారణము నుండి వచ్చిన కార్యములన్నీ కారణము కంటే వేరు కానట్లు, మూలప్రకృతి రూపిణి అయిన నీలో నుంచి వచ్చిన అన్ని నామరూపాలు నీవే తల్లి. నిజానికి నీవు ఏకరూపిణి ఐనా, అనేక నామరూపాలతో గోచరిస్తున్నావు.

శక్తిస్వరూపిణివి నీవేనంటూ ... మందా హిమవతః సృష్ఠే గోకర్ణే భద్రకళా, చిత్రకూటే తధాసీతా వింధ్యే వింధ్యాధికారిణీ... అంటూ దేవీ భాగవతం తెలిపాక, వేయి మాటలేలా తల్లీ.

అమ్మా!
ఇంతకు ముందు ఆనందంలోనైన, ఆవేదనలోనైన అప్పుడప్పుడు రామయ్య తండ్రితో ఏదేదో మాట్లాడడం పరిపాటి. ఆపై ఏదైనా తప్పు మాట్లాడితే మన్నించవయ్యా అనుకోవడమూ అలవాటే. కానీ, నీతో ఇలా ముచ్చటించడం ఇదే మొదటిసారి అయినను, మన్నించమని అడగను తల్లి... ఎందుకంటే నీవు అమ్మవు, అప్పుడే మాటలొచ్చిన బిడ్డ మాటలు తల్లికి మురిపమే కదమ్మా.

తల్లీ!
నీవు ఎంతో సౌందర్యవంతురాలివని, లోకోత్తర సౌందర్యవతివని వాల్మీకి మహర్షి మొదలు మొల్ల తదితర కవులెందరో కొనియాడారు. కానీ నిను కాంచే కవి హృదయం నాకు లేదమ్మా... పోనీలే అని కలలోనైనా కానరావు. ప్చ్...
నీ అంతర సౌందర్యం మాత్రం చూసానమ్మా.... అత్యంత అద్భుతం. కానీ, వర్ణించే భాషా సౌందర్యం నాలో లేదని నీకు తెలుసు కద తల్లి.

త్రేతాయుగంలోనే ముందు ముందు యుగాలలో మానవులు ఎలా నడుచుకొని తరించాలో, జీవన వాహినిలో ఎదురయ్యే ఒడిదుడుకులును ఎలా అధిగమించాలో, జీవితమంటే ఏమిటో నన్నది, అనుభవించి చూపించావు కద తల్లి. అందుకే ఎన్ని యుగాలు మారినా, నీవు అందరి గుండెల్లో అందరిదానివై నిలిచావు.

అమ్మా! 
ఏదైనా బాధలో ఉన్నప్పుడు, తెలిసి తెలిసి ఈ జన్మలో ఏ తప్పూ చేయలేదు, మరి ఏ జన్మ పాపమో, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నననో, ఎవర్ని బాధ పెట్టానో...ఇంత కష్టమొచ్చింది అనో...సామాన్య మానవులు తమ తప్పుని తెలుసుకోవడానికి తమలో తాము తర్కించుకుని మాట్లాడినట్లే, నీవు కూడా నీలో నీవు తర్కించుకొని, అరణ్యాలకు వస్తానని నీవు అన్నప్పుడు, రాముడు వద్దన్నప్పుడు, పరుషంగా మాట్లాడినందుకు, అలానే, మాయ లేడిని కోరేక, మరిది లక్ష్మణుడుని కఠినంగా నిందించినందుకే నాకీ వెతలని, వేదనతో ఓ మామూలు మానవకాంతలా పశ్చాత్తాప పడుతూ మాట్లాడడం...
అన్నీ తెలిసినా -
ఓ మాయలేడిని కోరుకుంటూ, రామలక్ష్మణులను పంపడం ...
మాయలవాడి మాటలు నమ్మి భిక్ష పెట్టి మోసపోవడం...
స్త్రీ సహజ చిత్తవృత్తిని ఎంత చక్కగా లోకానికి తెలిపావో కదమ్మా.

అయ్యోయ్యో... జగన్మాతవి, అందర్నీ చూడాలి...అయినా నా ముచ్చట్లతో నిన్ను చాలాసేపు కూర్చోబెట్టేసాను. కృష్ణుడటమ్మా రాసలీలప్పుడు ఒకేసారి  గోపికలందరు చెంతన  ఉన్నాడట. అదెలా సాధ్యమంటే, కృష్ణుడు పరమాత్ముడు, తనను తాను పలు కృష్ణులుగా విస్తరించుకొని, గోపికలందరి దగ్గర ఉన్నాడని చెప్తారు. మరి నీవో... పరాశక్తివి... జగన్మాతవి...నా దగ్గర కూర్చొనే, ఒకేసారి అందర్నీ చూసుకోగలవు. ఇదో భావ సదృశ్యం. ఏమనుకోకు తల్లీ... మరి కాసేపు కూర్చో... చివరగా నీ కళ్యాణ ముచ్చటా విను.
                     

              
అమ్మా! 
నీ తండ్రి జనకుడు బ్రహ్మజ్ఞాని. నీవేవరో తెలుసు...అందుకే నీవు వీర్యశుల్క వంటూ, ఎవరూ ముట్టుకోవడానికి, పట్టుకోవడానికి వీలు కానటువంటి శివధనస్సుని ఎక్కుపెట్టిన వారితోనే నీ వివాహమని ప్రకటించడం... 
                           
రామలక్ష్మణులు విశ్వామిత్రుడు తలపెట్టిన యాగ సంరక్షణ చేయడం, విశ్వామిత్రుడు రామునికి దివ్యాస్త్రాలు అనుగ్రహించడం, సిద్దాశ్రమంలో కొన్ని రోజులు గడపడం అయ్యాక, ఒకరోజు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో, మిథిలా నగరంలో జనక మహారాజు గొప్పయాగం చేస్తున్నాడట, అందరూ వెళ్తున్నారు, మనమూ వెళ్దాం, పైగా ఒకప్పుడు మిధిలాధిపతియైన దేవరాతుడు దేవతల నుండి ఒక ధనస్సును పొందాడు. ధృఢమైన ఆ ధనస్సును వంచి ఎవరూ నారిని సంధించలేరట... దానిని చూద్దాం పదండి... అని బయల్దేరదీసి, దారి పొడుగునా కుశనాభుని నూరుగురు కుమార్తెలు గూనివారయ్యే ఇతివృత్తం, సగరుని వృత్తాంతం, అహల్య వృత్తాంతం ... ఇలా ఒకోచోట ఒకో ఇతివృత్తం చెప్పడం ద్వారా గృహస్థాశ్రమ ధర్మం, వివాహం ఎవరు చేయాలి, ఎలా చేయాలి... వివాహం అయ్యాక ఎట్లా ఉండాలి... అనేక అనేక సూక్ష్మ ధర్మాలను చెప్పకనే చెప్పి, భవిష్యత్తులో రామచంద్రుని యందు ప్రకాశించే సద్గుణాలన్నిటికీ సానబెట్టి, ఓ వజ్రంలా చేసి, మిధిలకు యేతించి, నీ తండ్రికి, వీరు దశరథ మహారాజు పుత్రులని పరిచయం చేసి, శివధనుస్సును చూపమని, రాముణ్ణి చూడమనడం... అనాయాసంగా రాముడు ఎక్కుపెట్టగా ధనుర్భంగం కావడం... అప్పుడు కదమ్మా, నీ వివాహ సన్నాహాలు ప్రారంభమైనవి.

తల్లీ!
తాటకవధ... అహల్యశాపవిమోచనం... శివ ధనుర్భంగం చేసినప్పుడే రాముడు అవతార పురుషుడని గ్రహించి, నీ పాణిగ్రహణ సమయంలో జనకులవారు నిన్ను ఎంతో గొప్పగా పరిచయం చేస్తూ -
                  

ఈమె సీత. నా కూతురు. ఇకనుంచి నీకు ధర్మ మార్గంలో తోడుగా చరిస్తుంది. ఈమె పాణిని గ్రహించు, నీకు భద్రం కలుగుతుంది. ఈమె పతివ్రత, మహా భాగ్యశాలి, నీడవలే నిన్ను అనుసరిస్తుంది...అని అన్నారట కదమ్మా...
 
బ్రహ్మజ్ఞాని అయిన నీ తండ్రి భవిష్యత్ దర్శించారా ఏమిటి తల్లి? 
ఇయం సీతా... ఈమె నాగటి చాలున ఉద్భవించిన సీత. అయోనిజ. నాగటి చాలు రైతు కృషి ఫలింపజేస్తుంది. అలానే నీ కృషిని ఫలింపజేసే ఈమె సీత.

మమసుత... నా కుమార్తె.  నేను కనలేదని నాకూతురు కాదనుకుంటావేమో... ఆకాశవాణి చెప్పింది ఈమె నాకుమార్తె అని!

సహధర్మ చరితవ... నీకు దర్మమార్గంలో తోడుగా చరిస్తుంది... అంటే ధర్మం లేకపోతే ఈమె వుండదు, నీతో చరించదు, నీవు లేకుండా ఉండదు, ఈమెకు భర్తవయినందుకు ఇక నీవు ధర్మ మార్గంలో చరించి తీరాల్సిందే ... ఏం ముడి పెట్టారమ్మా... ధర్మ మార్గంలోనే చరించాలని శాసనమే చేసేశారు.

భద్రం తే... నీకు మంగళము అగుగాక. నిన్ను పెళ్లాడాక భద్రం (శుభమ్) కాకుండా ఎలా వుంటుంది?

ప్రతీచ్ఛచైనాం...ఈమెను పరిగ్రహింపుము. 
(మా అమ్మాయిని ఇస్తున్నాను, పుచ్చుకో...అని కాకుండా, ఈమె సాక్షాత్తు నీ దేవేరి, నీ అన్ని అవతారాల్లో ఈమెనే నీ సహదర్మచారిణి. ఈమెను గుర్తించి స్వీకరించు అన్న భావం ప్రస్పుటింపజేసిన నీ తండ్రి ఎంతటి జ్ఞానియో...)

పాణిం గృహ్ణీష్వ పాణినా...నీ చేతిలో ఆమె చేతిని తీసుకొనుము. ఇక ఈమె రక్షణా బాధ్యత నీదే సుమా అన్నట్లు చెప్పారు కదమ్మా.

పతివ్రతా... ఏ స్థితిలోనైన భర్తనే అనువర్తించే ఇల్లాలవుతుందని, 

చాయేవానుగత సదా... ఎప్పుడూ నిన్ను నీడలా అనుసరిస్తుందని ... (నీవు తండ్రి మాట ప్రకారం ఈ ప్రాయం లోనే విశ్వామిత్రుని వెంట వచ్చిన పితృవాక్య పరిపాలకుడువి అయినట్లే, ఈమె కూడా నా మాటకు విలువనిస్తూ నీ వెన్నంటే ఉంటుందని)...ఏం చెప్పారమ్మా.

రాముడు అరణ్యవాసంకు సిద్ధమైనప్పుడు, ఈ మాటలనే చెప్పి, ఒకింత పరుషంగా మాట్లాడి, రామయ్యను ఒప్పించావు కదా. ఈ ధర్మాచరణ వైశిష్టమే ఉన్నత పథంలో నిలుపుతుందనడానికి తార్కణమై నిలిచావు. ఎంత చక్కటి చరితం తల్లి నీది... 
                   

అమ్మా!
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి...అని, నేను రామ ధ్యానం మరిచిన, నా ధ్యాస మరలిన, నన్ను నిరంతరం అనుగ్రహించమని రామయ్యకు చెప్పు తల్లి... అని చెప్పాలనుకున్నాను కానీ, నిజం చెప్పనా తల్లీ...నీతో ఇలా మాట్లాడుతుంటే, ఏదో భరోసా... ఎంతో భద్రత... ఎనలేని నిశ్చింత. ఇంకా దేనికమ్మా... సిఫారసులు?

అమ్మా! 
నీతో ఇంకా ముచ్చటించాలని ఉంది, అదేమిటో తల్లి, నీ గురించి ఎంత చెప్పినా తక్కువే, తనివి తీరదెన్నటికీ. ఇది అనంతం. అయినా నా పిచ్చిగానీ, తరించడానికి అమృతం అంతా కావాలా... ఒక్క చుక్క చాలదూ.....