16, సెప్టెంబర్ 2014, మంగళవారం

గృహస్థులకు బ్రహ్మచర్యమా ???

గత టపాను చదివిన శైలజగారు, గృహస్థులకు బ్రహ్మచర్యం వర్తించదేమో, గృహస్థులకు బ్రహ్మచర్యం ఎలా సాధ్యమౌతుందని ప్రశ్నించారు. 
ఆ ప్రశ్నకై నేను విని, చదివి తెలుసుకున్నంతలో ఈ చిరు వివరణ - 

ముందుగా బ్రహ్మచర్యం అంటే ఏమిటో తెలుసుకుందాం -

బ్రహ్మభావే మనశ్చారో బ్రహ్మచర్యం పరం తధా 
బ్రహ్మ భావనమందు మనస్సును సర్వదా చరింప జేయుటయే బ్రహ్మచర్యం. 

బ్రహ్మణీ చరతీతి బ్రహ్మచారీ, తస్యభావః బ్రహ్మచర్యం
పరబ్రహ్మయందు చరించువాడు బ్రహ్మచారి, వానిభావం బ్రహ్మచర్యం. 

ఇక సామాన్యముగా ఆలోచిస్తే -

మైధునస్యాప్రవృత్తిర్హి మనోవాక్కాయకర్మణా /
బ్రహ్మచర్యమితిప్రోక్తం యతీనాం బ్రహ్మచారిణామ్ //
మనోవాక్కాయకర్మలచే స్త్రీ సంబంధ విషయములనుండి నివృత్తి యేది కలదో అదే బ్రహ్మచర్యం. ఇది యతులకును బ్రహ్మచారులకును వర్తిస్తుంది. 

అయితే -

మానవునికి త్రివిధ దేహములు (స్థూల సూక్ష్మ కారణ) యున్నట్లే బ్రహ్మచర్యం కూడా మూడు విధములై యున్నది. 

తద్భేదం త్రివిధం వక్ద్యే స్థూలం సూక్ష్మం చ కారణమ్ /
వ్యాయామః ప్రధమః ప్రోక్తః మనోనైర్మల్యకం తధా //
ఆత్మశుద్ధిన్త్రుతీయా చ మోక్షస్సిద్ధ్యతి తే నఘ /
త్రివిధం బ్రహ్మచర్యం చ సాధనీయం సదా జనై: //

బ్రహ్మచర్యం కూడా స్థూలం, సూక్ష్మం కారణం అని మూడు విధములై ఉంది. స్థూలబ్రహ్మచర్యమును వ్యాయామముద్వారా, సూక్ష్మబ్రహ్మచర్యమును మనోనిర్మలత ద్వారా, కారణబ్రహ్మచర్యమును ఆత్మశుద్ధి ద్వారా పరిశుద్ధత గాంచును. 

పైన చెప్పిన వ్యాయామ, మనోనిర్మలత, ఆత్మశుద్ధులు ఎలా కల్గుతాయంటే -

యోగాసనం చ వ్యాయామే ప్రాణాయామశ్చ మానసే /
పరమాత్మ స్వరూపస్య విదుర్జ్జ్ఞానం తృతీయకే //

వ్యాయామ బ్రహ్మచర్యంలో యోగాసానాదులున్ను, మానస బ్రహ్మచర్యంలో ప్రాణాయామాదులున్ను, ఆత్మశుద్ధి బ్రహ్మచర్యంలో పరమాత్మ స్వరూపజ్ఞానమును కల్గుతాయి. 

మరల ఈ బ్రహ్మచర్యమును మూడువిధములుగా పేర్కొంటారు. అదేమిటంటే -

1. మానసికం :-  మనస్సున ఎలాంటి విషయ సంకల్పములు లేకుండుట. 
2. వాచికం :- వాక్కుతోను విషయాభిలాష ప్రయుక్తాలాపములు లేకుండుట. 
3. కాయికం :- క్రియారూపేణా శరీరముతో సంబంధం లేకుండుట. 

అటులనే ఈ బ్రహ్మచర్యమును మరో మూడువిధములుగా శాస్త్రము చెప్పుచున్నది. అవి ఏమిటంటే - 

1. నైష్టికము :- 
                    జన్మించిన మొదలుగు మరణపర్యంతం ఎలాంటి విషయ దోషములు లేకుండా ఆచరింపబడు బ్రహ్మచర్యం. ఇందులకు దృష్టాంతం - శుకమహర్షి, సనకాదులు, ఆంజనేయుడు, గార్గి మరియు సులభాయోగినులు భీష్ముడు, మొదలగువారు. కలియుగమున రమణమహర్షి, అరవిందులవారు తదితరులు. 
2. గార్హస్థ్యం :- 
                   ఋతుకాలమునందు మాత్రమే విషయములయందు ప్రవర్తించి ధర్మబద్ధుడై అనుష్టించు బ్రహ్మచర్యం. ఇందులకు దృష్టాంతం - జనకుడు, చూడాలా, శిఖిధ్వజ, మదాలస మొదలగువారు. 
3. వైదురము :- 
                      భార్యవియోగము లేక భర్తవియోగం కల్గిగాని, లేక భార్యాభర్తలకు ఆత్మశుద్ధి గలిగి విషయములలో విరక్తి కలిగి బ్రహ్మచర్యము ఆచరించురో అది విధురబ్రహ్మచర్యం. ఇందులకు దృష్టాంతం - యాజ్ఞవల్క్య మైత్రేయీ, విశ్వామిత్రుడు మొదలగువారు. కలియుగమున గురునానక్, శ్రీకృష్ణచైతన్యాదులు కలరు. 

అసలు బ్రహ్మచర్యమునకు ఆహరమునకు సంబంధం ఏమిటంటే -

ఆహరస్సత్త్వజనకం కరుణా భక్తివర్ధినీ /
బ్రహ్మభావనయా స్వస్మిన్ స్వయం బ్రహ్మాత్మనిశ్చయః //

సత్త్వగుణాభివర్ధకమగు సాత్త్వికాహారం సేవించుటయు బ్రహ్మచర్యమే యగును. భక్తిని వృద్ధి చేయు కరుణయు బ్రహ్మచర్యమే. స్వాత్మయందు బ్రహ్మభావనయు బ్రహ్మచర్యమే. 

మరి గృహస్థుల విషయంలో ఈ బ్రహ్మచర్యమును పరిశీలిస్తే - 

ఏ విధమైన వ్రతములు గాని, యజ్ఞాదిక్రియలుగాని, మండలం రోజుల పూజాదీక్షలుగాని చేసినప్పుడు బ్రహ్మచర్యం గృహస్థులు పాటించడం ఓ నియమంగా పెట్టుకుంటారు. 
కానీ, గృహస్థు బ్రహ్మచర్యమంటే - 

కాయేన మనసా వాచా నారీణాం పరివర్జనమ్ /
ఋతౌ భార్యాం వినా స్వస్య బ్రహ్మచర్యం తదుచ్యతే //
మనోవాక్కాయ కర్మాదులచే పరస్త్రీలతో సంసర్గం లేకుండుట, ఋతుకాలంలో మాత్రమే స్వపత్నితో జేరుటను గృహస్థ బ్రహ్మచర్యమనబడును. అటులనే మనోవాక్కాయ కర్మాదులచే పరపురుషచింతన లేనిదై, ఋతుకాలమందు మాత్రమే సంతానాభిలాషగలదై పతితో చేరు స్త్రీయు బ్రహ్మచారిణియే యగును.  

ఋతుకాలాభిగామీ యః స్వదారనిరతశ్చయః /
స సదా బ్రహ్మచారీ హి విజ్జ్ఞెయస్స గృహశ్రమీ //
ఋతుకాలమందు మాత్రం స్వభార్యయందు చేరు గృహస్థుడు ఎల్లప్పుడును బ్రహ్మచారియే అగును. అలాంటి నారీమణియు బ్రహ్మచారిణియే యగును.  

ఇక శాస్త్రము తెలుపుతున్న ఋతుకాల వివరణ -

ఋతుస్స్వాభావికః స్త్రీణాం రాత్రయః షోడశస్మృతాః /
చతుర్భిరితరైస్సార్ధమహోభిస్సద్విగర్హితై: //
స్త్రీలకు స్వాభావికముగా పదునారు దినముల వరకు ఋతుకాలము. అందు మొదటి నాలుగు దినములు వర్జనీయములు. 

తాసామాద్యాశ్చతస్రస్తు నిందితైకాదశీచ యా /
త్రయోదశీ చ శేషాస్తు ప్రశస్తా దశ రాత్రయః //
ఈ ఋతుకాలదినములలో మొదటి నాలుగు దినములను, పదకొండవ, పదమూడవ రాత్రియు నిందితములు. మిగిలిన పదిరాత్రులు ప్రశస్తములు. 

నింద్యాస్వష్టాసు చాన్యాసు స్త్రీయో రాత్రిషు వర్జయన్ /
బ్రహ్మచార్యేవ భవతి యత్ర తత్రాశ్రమే పసన్ //
పైన చెప్పిన నిషిద్ధములైన మొదటి నాలుగు దినములను, పదకొండవ, పదమూడవ దినములను, అమావాస్య పున్నమ వ్రత దినములను వదిలిపెట్టి తక్కిన రాత్రుల పత్నితో కూడినవాడు గృహస్థాశ్రమము నందున్నను బ్రహ్మచారియే యగును. అలాంటి స్త్రీయును బ్రహ్మచారిణియే యగును.  

బ్రహ్మచర్యం అవలంబించడం వలన ప్రయోజనమేమిటంటే - 

ఆయుస్తేజో బలం వీర్యం ప్రజ్ఞా శ్రీశ్చ మహద్యశః /
పుణ్యం చ మత్ప్రియత్వం చ లభ్యతే బ్రహ్మచర్యయా //
బ్రహ్మచర్యముచే పూర్ణాయువు, తేజస్సు, దేహేన్ద్రియములకు బలం, ఓజస్సు, ప్రజ్ఞా, జ్ఞానసంపద, యశస్సు, పుణ్యం, భగవత్ప్రీతియు కలుగును. 

శాన్తిం కాన్తిం స్మృతిం జ్ఞానమారోగ్యం చాపి సన్తతిమ్ /
య ఇచ్ఛతి మహద్ధర్మం బ్రహ్మచర్యం చరేదిహ //
ఈ జగత్తున శాంతి, కాంతి, స్మృతి, జ్ఞానం, ఉత్తమ సంతానం కోరువారెల్లరు సర్వోత్కృష్ట ధర్మమైన బ్రహ్మచర్యవ్రతమును తప్పక పాటించవలెను.


8, సెప్టెంబర్ 2014, సోమవారం

శుద్ధ ఆహారం (ద్వితీయ భాగం)

ఆహారశుద్ధి గురించి, వాని నియమములు గురించి, అలానే మాంసాహారం హింసాపూర్వక ఆహారమయినచో, శాకాహారంలో కూడా జీవముంటుంది కదా, మరి అది ఎందుకు హింసాపూర్వక ఆహరం కాదు? అలానే సాత్త్విక ఆహారం భుజించిన వారంతా ఎందుకు ధ్యానులు, జ్ఞానులు కాలేదని శైలజగారు గతంలో నేను పోస్ట్ చేసిన "శుద్ధ ఆహరం"  చదివి తన సందేహాలను అడిగారు. 


నాకు తెలిసినంతవరకు ఆ సందేహాలకు వివరణ ఇక్కడ ఇస్తున్నాను. 

అన్నదోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్ /
కలుషీకృతచిత్తానాం ధర్మస్సమ్యజ్న భాసతే //
ఆహారదోషంచే సర్వదా చిత్తమునకు కల్మషం కలుగును. కల్మషచిత్తం కలవారికి ధర్మరహస్యమైన జ్ఞానం ప్రకాశింపదు. 

అందుకే ఆధ్యాత్మిక సాధకులకు ఆహరశుద్ధి, ఆహారనియమములు తప్పనిసరి. 

మాంసాహారమునకు శాకాహరమునకు గల భేదం -

శాకాదులయందు జీవశక్తి యున్నప్పటికీ అవి జడములు. వాటికి ఇంద్రియములు లేవు. ఇంద్రియములు లేకపోవడం వలన వాటికి సుఖదుఃఖములు కలుగుటకు అవకాశం లేదు. 
జంతువులు మనుష్యులవలె స్త్రీపురుష సంయోగంచే నుత్పత్తి యగును గాని, సస్యముల వలె నుద్భిజ్జములు కావు. సస్యవర్గములు భూమి, నీరు మొదలగువాటి సహాయముతో పాటు, ఎక్కువగా సూర్యశక్తిని గ్రహించి, సూర్యశక్తిచే వృద్ధి అగుచున్నందున సూర్యుని యందున్న శక్తి సస్యాదులయందధికముగా యున్న కారణంచే వాటిని భుజించువారికి శుద్ధత్త్వం కలుగును. సత్త్వగుణం అలవడును. సూర్యుడు తమస్సును నాశము జేయునట్లు, శాకాహారంచే తమోగుణం నాశన మగును. 

ఆహార శుద్ధౌ సత్త్వశుద్ధి: సత్త్వశుద్ధౌ ధ్రువా స్మృతి: /
స్మృతిలాభే సర్వగ్రంధీనాం విప్రమోక్షః //
సాత్త్వికమైన శుద్ధాహారంచే మనఃశుద్ధియు, మనఃశుద్ధిచే దృఢమైన ప్రజ్ఞయు గల్గును. దృఢప్రజ్ఞచే సర్వగ్రంధులు నిశ్శేషముగా నాశంపొందును. 

ద్యానమూ, జ్ఞానమూ ఎప్పుడు అలవడతాయంటే - 

మానవునికి స్థూల, సూక్ష్మ, కారణలనెడి దేహములు కలవు. శుద్ధమైన సాత్త్వికాహారముచే స్థూలదేహము ఇంద్రియములు మాత్రమే శుద్ధములగును. సూక్ష్మ దేహానికి ఈ ఆహారం కొంతమాత్రమే సహాయపడును. కరుణ, శాంతం, సత్యం, అధ్యయనం, ప్రేమ, దైవభావం, సమత్వం, ఏకాత్మభావనం, దేవోపాసన  బ్రహ్మచర్యం గురు, దేవ, పూజయుక్తమైన సాత్త్వికాహారం ప్రాణాయామాది యోగములచే స్థూలదేహ శుద్ధి గలుగును. అటుపై కారణదేహశుద్ధతకు పై రెండు శుద్ధతవలన జ్ఞానం అలవడి పవిత్రమగును.  

సాత్త్వికాహారులందరూ ఎందుకు జ్ఞానులు కాలేకపోతున్నారంటే - 

ఆహరశుద్ధి అంటే తీసుకున్న ఆహరం సాత్త్వికముగా ఉంటే చాలదు. ఆ ఆహారం వచ్చిన మార్గము కూడా సత్యముగా ఉండవలయును. సత్యముగా సంపాదించిన ఆహారమును యుక్తముగా, నియమముగా దైవారాధన చేసి భుజించవలెను. 
శ్రీశంకరభగవత్పాదుల వారు చెప్పినట్లు -
జిహ్వతో భుజించెడు ఆహారమే ఆహరం కాదు. కర్ణ, త్వక్, చక్షు, ఘ్రాణముల ద్వారా స్వీకరించేది కూడా ఆహారమే అవుతుంది.
ఇక ఆహారశుద్ధి యొక్కటే చాలదు, ఆత్మశుద్ధియు కలిగి యుండవలయును. అలానే ఆత్మశుద్ధి గలిగిన చాలదు, ఆహారశుద్ధియు కలిగి యుండవలయును. పైన చెప్పినట్లు స్థూల సూక్ష్మ దేహాలలో శుద్ధతా లోపము వలననే కొందరికి శుద్దాహారము కలిగియుండినను ఆత్మజ్ఞానం కలుగకపోవుటకును, అలానే ఆత్మ శుద్ధమైనది జ్ఞానమైనదని విచారణచేత తెలుసుకొనినను ఆత్మజ్ఞానం అనుభవమునకు రాకపోవుటకున్ను కారణమని గ్రహించాలి. కావుననే "శుద్ధిద్వయం మహత్కార్యం దేవానామపి దుర్లభం" అని శాస్త్రం వక్కాణిస్తుంది. 
 
ఈ సూక్ష్మ కారణ దేహములను శుద్ధపరుచుట తెలియకపోవుటచేతనే స్థూలమైన సాత్త్వికాహారమును భుజించువారందరిలో ధ్యానం, జ్ఞానం అలవడడం లేదు. 

ఇక గృహస్థులు ఎంత హింసారహితముగా ఉందామనుకున్నను అనివార్యమైన ఐదు విధములైన హింసలు వచ్చుచుండును. 

అవి - 

పంచసూనా గృహస్థస్య చుల్లీ పేషణ్యుపస్కరః /
కండనీ చోదకుంభశ్చ బధ్యతే యాస్తు వాహయన్ //

1. చుల్లీ :- కట్టెలు మొదలగువాని వలన వండునప్పుడు కట్టెలలో గల చెదలు మొదలగు క్రిములు నాశం. 
2. పేషణి :- విసరుచున్నప్పుడును, నూరుచున్నప్పుడును కలిగెడు ప్రాణహింస. 
3. ఉపస్కరః :- ఇతర గృహకృత్యములు చేయునప్పుడు కలిగెడు ప్రాణహింస. (బూజులు దులుపుట, తుడుచుట, చిమ్ముట, అలుకుట మొదలగు గృహ శుభ్రత పనులు, అలానే సస్యములలో నాగలితో దున్నుతున్నప్పుడు, పారతో చెక్కుతున్నప్పుడు కొన్ని క్రిములకు కలుగు ప్రాణహింస)
4. కండనీ :- ధాన్యాదులు దంచుతున్నప్పుడు కలుగు హింస. 
5. ఉదకుంభః :- నీరు మరిగించినప్పుడు కలుగు ప్రాణహింస. 

అందుకే ప్రతిదినం పంచయజ్ఞపరాయణులై యుండవలయునని మనుస్మృతి చెప్తుంది. 
పైన తెలిపినవి లేకపోతే మానవునికి మనుగడ కష్టం కాబట్టి,  ఇటువంటి అనివార్యమైన హింసల నివృత్తి కొరకు పంచయజ్ఞములు విధింపబడినవి. 

అవి - 

అధ్యాపనం బ్రహ్మయజ్ఞః పితృయజ్ఞస్తు తర్పణమ్ /
హోమో దైవో బలిర్భౌతో నృయజ్ఞో తిధిపూజనమ్ // 

1. బ్రహ్మయజ్ఞము :- వేదోపనిషద్భగవద్గీత పారాయణము లేదా ప్రణవాది మంత్రజప భగవత్కీర్తన పూజాదులలో ఏదో ఒకటి ఆచరిస్తూ భోజనం చేయడం. 
2. పితృయజ్ఞము :- తర్పణాదులచే పితరులను తృప్తి పరచుట. 
3. దైవయజ్ఞము :- అగ్ని యందు వ్రేల్చుహోమము (వైశ్వదేవము). 
4. భూతయజ్ఞము :- కుక్క, పిల్లి, కాకి మొదలగు చిరుప్రాణులకు ఆహారమిడుట. 
5. మనుష్యయజ్ఞము :- అతిధిసత్కారం (బ్రహ్మచారులకు, సన్యాసులకు, సాధువులకు, తీర్ధయాత్రికులకు పూజ్యభావంతో భోజనం పెట్టుట, రోగులు, అంగహీనులు, నిస్సహాయులకు కరుణతో అన్నదానం చేయుట. 

ఆహార నియమములు -

హితం మితం సదాశ్నీయాద్యత్సుఖే నైవ జీర్యతే /
దాతు: ప్రకుప్యతే యేవ తదన్నం వర్జయేద్యతి: /
ఎల్లప్పుడూ ఆహరం మితంగాను, శుద్ధమైనదిగాను, ప్రీతికరమైనదిగాను ఉండవలెను. సుఖముగాను త్వరితముగాను జీర్ణమగునట్టి ఆహారమునే భుజించవలయును. ధాతుప్రకోపం కల్గించునట్టి అన్నమును భుజించరాదు. 

అన్నమని చెప్పుటచే బియ్యపు అన్నము అని అనుకోకూడదు. 'అద భక్షణే' అన్న దాతువునుండి అన్న శబ్ధమేర్పడినది. కనుక భక్షించున దంతయు అన్నమనియే భావించవలెను. 

ద్వౌ భాగౌ పూరయేదన్నైస్తోయేనైకం ప్రపూరయేత్ /
మారుతస్య ప్రచారార్ధం చతుర్ధమవశేషయేత్ //
సాధకులు అందరూ ఉదరమును సగభాగము అన్నము చేతను, పాతికభాగము జలము చేతను నింపి, మిగిలిన పాతిక భాగము గాలి సంచారార్ధముగా నుంచువారు బ్రహ్మనిష్ఠ యందు సర్వదా యుండగలరు. వీరికి వ్యాధులు రావు. 

సాయం ప్రాతర్మనుష్యాణామశనం దేవనిర్మితమ్ / 
నాన్తరం భోజనం దృష్టముపవాసీ తధా భవేత్ //
మనుష్యులకు దైవనిర్మితమగు భోజనము - ఉదయము, సాయంకాలము రెండుసార్లు మాత్రమే యేర్పడినది. అనగా మధ్యాహ్నం లోపల ఒకసారియు, సాయంకాలమున ఒక పర్యాయము మాత్రమె యుండవలయును. అట్టివారికి ఎలాంటి వ్యాదియు ఉండదు. ఈ రెండువేళల తప్ప ఇతర సమయములలో నేమియూ భుజింపనివారు ఉపవాసఫలమును పొందుదురు. 

మోక్షధర్మేషు నియతో లఘ్వాహారో జితేన్ద్రియః /
ప్రాప్నోతి బ్రాహ్మణః స్థానం తత్పరం ప్రకృతేర్ధ్రువమ్ //
మోక్షమార్గమందు ప్రవర్తించువారు నియమశీలులై, యుక్తాహారులై జితేన్ద్రియులై యుండినచో ప్రకృతికి పరమై, శాశ్వతమై యుండు పరబ్రహ్మస్థానమును పొందుదురు. 

ఆహారశుద్ధౌ చిత్తస్య విశుద్ధిర్భవతి స్వతః /
చిత్తశుద్ధౌ క్రమాత్ జ్ఞానం త్రుట్యన్తి గ్రంధయస్పుటమ్ //