18, నవంబర్ 2011, శుక్రవారం

వేదమాత - గాయత్రి

త్రికాలజ్ఞులై నిష్కాములైన భౌతికసుఖములనుకోరని ఋషీశ్వరులు యోగదృష్టితో లోకకళ్యాణమునకు ఉత్కృష్టమైన మంత్రములు ప్రసాదించిరి. 
మకారం మననం ప్రాహు స్తకారస్త్రాణ ఉచ్యతే/మనన త్రాణసంయుక్తో మంత్ర ఇత్యభి ధీయతే // 
'మ' మననం చేయువానికి 'త్ర' రక్షించును. అనగా మననం చేయువానిని రక్షించునది మంత్రమనబడును.
మంత్రములలో శైవ మంత్రములు ఒక కోటి, సౌరములు రెండు కోట్లు, గణేశ మంత్రములు ఏబది లక్షలు, వైష్ణములు ఏబది లక్షలు, శక్తి మంత్రములు మూడు కోట్లు గలవు. ఈ సప్తకోటి మహామంత్రములలో ఆది మంత్రం "గాయత్రి".
యోగులకంటే మంత్రజపం చేయువారు మిగుల ఉత్తములని భారతమున చెప్పబడెను. యజ్ఞములన్నింటిలో జపయజ్నం శ్రేష్టమైనది. యజ్ఞానం జపయజ్ఞోస్మి (భగవద్గీత) . 'సర్వమంత్రేషు గాయత్రీ వరిష్టా ప్రోచ్యతే బుధై:' సర్వమంత్రములలో గాయత్రిమంత్రం మిక్కిలి శ్రేష్టమైనది.
 'గయాన్  త్రాయతేసా గాయత్రీ 'అనగా ఏది గయ - ప్రాణమును రక్షిస్తుందో - అది గాయత్రి (ఐతరేయ బ్రాహ్మణం). ప్రాణములను ఉద్ధరించే  సామర్ద్యము కారణముగా ఆదిశక్తి గాయత్రి అనుబడినది. 'గాయత్రీ వేద మాతా చ' గాయత్రి వేదములయొక్క తల్లి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తియు గాయత్రీ శక్తిజనితములు. శంకరాచార్య భాష్యములో గాయత్రీశక్తిని స్పష్టం చేస్తూ ఇలా చెప్పబడినది - 'గీయతే తత్వమనాయ గాయత్రీతి ' అనగా ఏ వివేకబుద్ధి ఋతంభరా ప్రజ్ఞ ద్వారా వాస్తవికత యొక్కజ్ఞానము లభింపజేస్తుందో అది గాయత్రి. 
గాయత్రీ తు స్వయం పూర్ణో యోగ ఇత్యుచ్చతే బుధై: / కించిత్తత్వం హి యోగస్య బహిరస్మాన్న విద్యతే //
భావం : గాయత్రి స్వయముగా పూర్ణయోగం అని పండితులు తెలియజేశారు. యోగం యొక్క ఏ తత్వాలు దీనికి బాహ్యముగా లేవు. యోగమనగా కలయిక. ఆత్మను పరమాత్మలో కలిపేదే యోగం. ఐతే యోగసాధన మార్గాలు అనేకం. ఒకొకరి సాధన ఓకోలా వుంటుంది. సాధకుని స్థితిబట్టి, అవగాహనబట్టి, అనుకూలతబట్టి, శక్తిబట్టి, యోగ్యతబట్టి తమకు నచ్చిన సాధనమార్గాన్ని అనుసరిస్తారు. ఏ సాధనైన దాని పరమార్ధం పరమాత్మలో సంలీనమే. ఈ సాధనామార్గాలలో గాయత్రీ సాధన ఒకమార్గం.
గాయత్రీమాతకు ఐదు ముఖములుండును. అందు మొదటిది ముత్యపురంగు, రెండవది పగడపురంగు, మూడవది బంగారపు వన్నెయు, నాల్గవది ఇంద్రనీలపువర్ణమును, ఐదవది వజ్రపువర్ణమును కలిగియుండును. ఈమె త్రినేత్రదారిణి. నవరత్నకిరీటమును ధరించి ప్రకాశమానమై యుండును. దశబాహువులు కలిగి అందు వరదాభయముద్రలను, అంకుశం, కొరడా, కపాలం, శంఖ చక్ర గదా పద్మద్వయమును ధరించి ఎల్లప్పుడూ భక్తులను రక్షించుచుండును. 
                      * ఆదిశక్తి - వేదమాత - దేవమాత - విశ్వమాత *
గాయత్రి పరమాత్మ యొక్క ఇచ్చ్చాశక్తి. దాని కారణముగా సృష్టి మొత్తం నడుచుచున్నది. చిన్న పరమాణువు మొదలుకొని పూర్తి విశ్వబ్రహ్మాండం వరకు ఆమె యొక్క శక్తిప్రభావం వలననే చరిస్తున్నాయి. పరమాత్మ స్వయముగా మౌలికరూపంలో నిరాకారుడు, అన్నిటినీ తటస్థ భావముతో చూస్తూ శాంతియుత అవస్థలో ఉంటారు.సృష్టి ప్రారంభంలో ఆయనకు ఒకటి నుండి అనేకము అయే కోరిక కలిగినప్పుడు, ఆయన ఈకోరిక శక్తిగా తయారైనది.ఈ శక్తి సహాయంతోనే మొత్తం సృష్టి తయారై నిలబడినది. సృష్టిని తయారుచేసే ప్రారంభికశక్తి అయిన కారణముగా గాయత్రీనీ "ఆదిశక్తి " అనిఅన్నారు. బ్రహ్మకు సృష్టినిర్మాణ, విస్తరణల కొరకు అవసరమైన జ్ఞానము, క్రియాకౌశలము ఆదిశక్తి గాయత్రి యొక్క తపోసాధన ద్వారానే లభించినది. ఇదే జ్ఞాన -విజ్ఞానము, వేదము అనబడినది. ఈ రూపంలో ఆదిశక్తి పేరు "వేదమాత" అయినది. వేదముల సారము గాయత్రీ మంత్రములో బీజ రూపంలో నిండి ఉన్నది. సృష్టి యొక్క వ్యవస్థను రక్షించే, నడిపించే విభిన్న దైవశక్తులు ఆదిశక్తి యొక్క ధారలే. ఆదిశక్తి నిర్మాణం, పర్యవేక్షణ, పరివర్తనము మొదలైన క్రియలకు అనుగుణముగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వంటి దైవశక్తులరూపంలో విడివిడిగా ప్రకటితమౌతుంది. ఇదేవిధముగా ఇతర దైవశక్తులు దీనియొక్క వివిధ ధారలు ఈశక్తి నుంచే పోషణ పొందుతాయి . ఈ రూపములో శక్తిని  " దేవమాత " అనే పేరుతో పిలుస్తారు. విశ్వఉత్పతి మొత్తం ఆదిశక్తి గర్బములో జరిగినది . కనుక "విశ్వమాత" అనే పేరుతో కూడా పిలుస్తారు. 
                                      గాయత్రీ పరాశక్తి. మహాకాశ, చిత్తాకాశ, చిదాకాశ స్వరూపమే గాయత్రీస్వరూపం. గాయత్రిమంత్రం సర్వతత్త్వసంపూర్ణం. పరబ్రహ్మ మౌలికం. గాయత్రీ పరమేశ్వర స్వరూపం. పరమేశ్వరత్వమే భగత్వం. భగం కలిగినవాడే భగవంతుడు. భగమనగా బలం, తేజం, శక్తి, ఆరోగ్యం, ఐశ్వర్యములని అర్ధం. ఈ దైవీశక్తులే గాయత్రీశక్తులు. శక్తిమంతుడే పరమేశ్వరుడు, శక్తి ఉత్పాదనమే గాయత్రీయోగం.
                                     గాయత్రి మూడు గుణములతో కూడిన శక్తి . హ్రీం - సద్బుద్ధి, శ్రీం - సమృద్ధి, క్లీం - శక్తి ప్రధానములు. దీనికి మూడు విశేష ధారలు కలవు. వీటిని గంగ, యమునా, సరస్వతిల త్రివేణీ సంగమం అని కుడా అనవచ్చును. దైవశక్తులతో జోడించినపుడు వీటిని సరస్వతి ,లక్ష్మి ,కాళి మరియు బ్రహ్మ ,విష్ణు, మహేశ్వర రూపంలో తెలుసుకొనగలము. గాయత్రి సాధనతో సాధకుని మనస్సు, బుద్ధి మరియు భావనలు ఈ త్రివేణిలో స్నానం చేసే అవకాశం లభించినపుడు, స్థితి కాయకల్పం వలె తయారవుతుంది. సద్గుణములు వృద్ధి, అంతర్గత శాంతి , సంతోషంతో పాటు సార్వజనిక సమృద్ధి సఫలతలను ఇచ్చేది గాయత్రి. 
                                     ప్రాపంచిక కష్టాల నదిని దాటుటకు ధైర్యము, సాహసము, ప్రతిభ, ప్రయత్నం అనే నాలుగు కోణములుగల నావ అవసరము. గాయత్రీ సాధన ఈ నాలుగు ప్రత్యేకతలను మనిషిలో బాగా పెంపొందిస్తుంది.
                                     జీవాత్మ ,పరమాత్మ మధ్య సూక్ష్మ ప్రకృతి యొక్క మాయా పరద ఉన్నది . ఈ పరదాను దాటుటకు ప్రకృతిసాదనములతోనే ప్రయత్నించాలి. చింతన - మననం, ధ్యానం - ప్రార్ధన, వ్రతము - అనుష్టానము, సాధన వంటి అన్ని ఆద్యాత్మిక ఉపచారములు ఇందు నిమితమై ఉన్నాయి. వీటన్నిటిని వదిలి పరమాత్మను పొందుట ఏ విధముగాను వీలుకాదు. సత్యగుణం, చిత్ శక్తి ద్వారా మాత్రమే జీవాత్మ ,పరమాత్మల యొక్క కలయిక జరుగగలుగుతుంది. ఈ ఆత్మ పరమాత్మల కలయికను జరుపగలిగే శక్తియే గాయత్రి.
                                    గాయత్రి బ్రహ్మప్రతిపాదకమగు మంత్రము. కుండలినీ శక్తి 24 తత్వంలతో జగత్తును సృజించును కావున గాయత్రి  24 అక్షరములు కలిగి యున్నదని శంకరులు ప్రపంచసారమున వ్రాసిరి. 
ఈ శరీరం పంచభూతాత్మకం. ఇందలి జీవాత్మ చిదానందస్వరూపముగా పంచప్రాణస్వరూపముగా విహరించుచున్నది. తన్మాత్ర స్వభావంవలన ప్రలోభితమైన గుణసంపత్తును దైవీసంపత్తుగా మలచుకొని ఆధ్యాత్మికధారణ చేయవలెను. యోగసిద్ధివలన ఇది సాధ్యం. యోగసిద్ధి మంత్రసిద్ధివలన వచ్చును. 
                                * గాయత్రీ మంత్రం *
గాయత్రీమంత్రములో తొమ్మిది నామములు కలవు. ౧. ఓం ౨. భూ ౩. భువః ౪.సువః ౫.తత్ ౬. సవితు: ౭. వరేణ్యం ౮. భర్గః ౯.దేవస్య ఈ తొమ్మిదినామములద్వార భగవంతుడు కీర్తింపబడుతున్నాడు. ధీమహీ అంటే ఉపాసన అని అర్ధం. ధియోయోనః ప్రచోదయాత్ అంటే భగవంతున్ని ప్రార్ధించుట.
ఈ మంత్రమును ఐదుచోట్ల ఆపి జపించవలెను. ౧. ఓం ౨. భూర్భువ స్సువః ౩. తత్స వితుర్వరేణ్యం ౪. భర్గోదేవస్య ధీమహీ ౫. ధియోయోనః ప్రచోదయాత్.
"ఓం భూర్భువ స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్"
అర్ధం : 'ఓం' కారంను ప్రణవమని అందురు. ప్రణవమునుండియే సమస్త శబ్దములు, మంత్రములు ఏర్పడుటచేత ఓంకారం సర్వమంత్రములకు హేతువు. ఓంకారముచే వ్యాహృతులు, వ్యాహృతులచే వేదములు ఆవిర్భవించినవి. (ఓంకారం వివరణ ఈ బ్లాగ్ మొదటి పోస్ట్ యందు కలదు)   ఓం = ప్రణవాత్మకమైన పరమాత్మ(పరమేశ్వరుడు), భూ = ప్రాణము నకు ప్రాణము(సత్ స్వరూపుడు), భువః = సర్వదుఃఖములను పోగొట్టి(చిత్ స్వరూపుడు), సువః = సమస్తసుఖములను యిచ్చునట్టి(ఆనందస్వరూపుడు)పరమాత్మ, నః = మా యొక్క, ధియ = బుద్ధులను, ప్రచోదయాత్ = ప్రేరణ చేయునో,  తత్ = ఆ, సవితు: = సర్వజగత్తులను సృష్టిచేయు, దేవస్య = దివ్యమహిమగల ఆ పరమాత్మయొక్క, వరేణ్యం =మిక్కిలి శ్రేష్టమై కోరదగిన, భర్గః = సర్వదుఃఖనాశకరమగు శుద్ధస్వరూపమును, ధీమహి = ధారణచేయుదునుగాక.                               
                              * గాయత్రీ గుణముల విశిష్టత *
ఈ మంత్రము యొక్క ఇరువదినాలుగు అక్షరములు ఇరువదినాలుగు గుణములను కలిగియున్నది.
'త' - అజ్ఞానాంధకారమును పోగొట్టును, 'త్స' - ఉపపాతకములను పోగొట్టును, 'వి' - మహాపాతకములను, 'తు' - దుష్టగ్రహ దోషములను,   'ర్వ' - భ్రూణహత్యాదోషములను, 'రే' - అగమ్యాగమనదోషములను, 'ణి' - అభక్ష్యాభక్షణ దోషములను, 
'యం' - బ్రహ్మహత్యాపాతకములను, 'భ' పురుషహత్యాపాతకములను, 'ర్గో' గోహత్యదోషములను, 'దే' స్త్రీహత్యాదోషములను, 
'వ' - గురుహత్యాదోషములను, 'స్య' - మానసికపాపములను, 'ధీ' - పితృ మాతృవధ పాపములను, 'మ' - పూర్వజన్మార్జిత పాపములను, 'హి' - అశేష పాపసమూహములను, 'ధీ' - ప్రాణివధపాపములను, 'యో' - ప్రతిగ్రహపాపములను, 'యో' - సర్వపాపములను పోగొట్టగా,
'నః' - ఈశ్వరప్రాప్తియు, 'ప్ర' - విష్ణులోకప్రాప్తియు, 'చో' - రుద్రపదప్రాప్తియు, 'ద' - బ్రహ్మపదప్రాప్తియు, 'యాత్' - త్రిమూర్తుల ప్రసాదసిద్ధిని కలగజేయును.
భూ:, భువః, సువః, అనే మూడు వ్యాహృతులు బ్రహ్మతత్వ స్వరూపలక్షణమైన సత్, చిత్, ఆనందాలు. భూ: అంటే సత్తు, భువః అంటే చిత్తు, సువః అంటే ఆనందము. ఈ మూడు కలిసిందే ఓం. ఇదే పరబ్రహ్మ. తత్ సవితు: అదే సవిత. సూయతే అనే నేతిసవితా - ఈ జగత్తు సృష్టి స్థితి లయలకు కారణమైంది సవిత (గాయత్రి). 
                     * గాయత్రీ మంత్రోచ్చారణ ప్రభావం * 
ఈ మంత్రోచ్చారణ సమయమందు శరీరములోని సర్వ నాడీస్థానములలో స్పందనాశక్తి చేకూరును. షట్ చక్రములలో స్పందన ఏర్పడి తద్వారా చక్రములు జాగృతమౌను. ఈ బీజాక్షర స్పందనాశక్తివలన శరీరావయములలో ఉన్న గ్రంధులలో శక్తులను మేల్కొలిపి మహత్వపూర్ణమగు సఫలతను, సంపన్నతను, సిద్ధులను చేకూర్చును. గాయత్రి మంత్రంలోని బీజాక్షరములు శరీరములోని ఈ దిగువ వివరించినస్థానములయందు స్పందనను చేకూర్చి పూర్ణయోగత్వమును సిద్ధింపజేస్తుంది.
సూర్యున్ని ఆరాధించిన ఆరోగ్యం, కుశలం, పుత్రులు పుణ్యం; మహాదేవున్ని ఆరాధించుట వలన యోగం, జ్ఞానం, కీర్తి; విష్ణువును ఆరాధించిన ధర్మార్ధ కామమోక్షములు; దుర్గోపాసనచే సర్వ మోక్షాది సకలకోరికలు; గణేశున్ని ఉపాసించిన కర్మసిద్ధి, విఘ్ననివారణ ప్రాప్తించును. అయితే గాయత్రీ మంత్రానుష్టానమువలన పంచాయతన దేవతలు చేకూర్చు సర్వఫలములు సమిష్టిగా చేకూరును. ఈ మంత్రం పఠనం చేయువారికి చతుర్విధపురుషార్ధములు, ధర్మార్ధకామమోక్షములను ప్రాప్తించును. సమస్తకోరికలను తీర్చు కామ్యఫలప్రదాత్రి 'గాయత్రీ'. గాయత్రి కామధేనువు. ఆత్మశక్తిని, మానసికశక్తిని, సంసారికశక్తిని లభింపజేయును. ప్రణవం (ఓం), భూ:, భువః, సువః, గాయత్రిమంత్రం అనునవి పంచమహాయజ్ఞములు (దేవయజ్ఞం, ఋషియజ్ఞం లేక బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞములు). ప్రణవ వ్యాహృతిత్రయ గాయత్రీమంత్రమును నిత్యమును జపించినయెడల పంచపాపములనుండి పావనమై పంచయజ్ఞముల ఫలితంను పొందుదురు.

9, నవంబర్ 2011, బుధవారం

మోక్షపధం - రామ దర్శనం

ఆధ్యాత్మిక సాధకుల దృష్టిలో రామాయణ అంతరార్ధమిది. మన ఇంట బయట జరుగుతున్నదే రామాయణం. ఎలాగంటే -
అయోధ్య నగరం :
ఏ విధమైన సుఖదుఃఖాలు, గెలుపోటములు, రాగద్వేషాలు, కోపతాపాలు ఏవీ లేనటువంటి; సామాన్య జనునిచే జయింప వీలులేనటువంటి నగరం అయోధ్య. అనగా ఏ వాసనలు అంటని ఆనంద హృదయమే అయోధ్య.
ఆ అయోధ్య అధిపతి దశరధుడు. దశరధుడు అంటే దశేంద్రియములను (5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు) జయించినవాడు. ఆ దశరధమహారాజుకు సత్వ, రజో, తమో గుణములనే కౌసల్య, సుమిత్ర, కైకయి అనే ముగ్గురు భార్యలు. రాముడు (ధర్మం) భరతుడు (శ్రద్ధ) లక్ష్మణుడు (భక్తి) శత్రుఘ్నుడు(శక్తి) అనే నలుగురు పుత్రులు.
భగవత్ తత్వాన్ని మానవాళికి అందించడానికి మాధవుడే మానవరూపములో వచ్చిన ధర్మావతారమూర్తి శ్రీరామచంద్రమూర్తి అందరిలో వున్నా ఆత్మారాముడు. 
ఆత్మారాముడైన శ్రీరాముడు వ్యక్తమై అర్ధంకావాలంటే దానికి సంకల్పమనెడి మనస్సు అవసరం. ఆ మనస్సే సీత.
సీతారాములకు వివాహం జరిగింది. అటుపై కొంతకాలమునకు కైకయి కారణముగా శ్రీరాముడు అయోధ్యను విడిచి సీతతో కల్సి, లక్ష్మణుడు వెంటరాగా అరణ్యములకు వెడలెను. అనగా ఆనందముగా అయోధ్యలో వున్న ఆత్మరాముడు మనస్సనెడి సీతతో కూడి సుఖదుఃఖాలుతో కూడిన జీవితమనే అరణ్యములో ప్రవేశించాడు. వీడి వుండలేని భక్తి (లక్ష్మణుడు) ఆత్మను (రామున్ని) అనుసరించింది.
సీత రామున్నే చూస్తూ, రామున్నే తలస్తూ, రామున్నే జపిస్తూ, రామున్నే ధ్యానిస్తూ - అంతా రాముడే అన్న భావనతో వున్నంతకాలం రామునితోనే కూడి ఆనందముగా ఉంది. అయోధ్య, అరణ్యము రెండునూ ఆమెకు ఒకేలా ఆనందమును ఇచ్చాయి. అంటే మనస్సు(సీత) ఆత్మతో(రామునితో) కూడి అంతర్ముఖురాలై వున్నంతకాలం అయోధ్యలోనూ, అరణ్యములోను ఆనందస్థితిలోనే వుంది.
ఒకరోజు సీత బంగారులేడిని చూసింది. ఆ లేడి కావాలని రామున్ని కోరింది. బంగారులేడి ఏమిటీ? ఇది రాక్షసమాయల వుందని రాముడు వారించినను వినక ఆ లేడిపై ఆశపడి తీసుకురమ్మని రామున్ని పంపింది. అనగా అంతవరకు అంతర్ముఖమై ఆత్మారామున్ని కూడి ఆనందముగా వున్న మనస్సుదృష్టి బహిర్ముఖమై బంగారులేడి రూపములో వున్న మాయలో పడి, ముందు ఆత్మని వదిలేసింది. రాముడు వెళ్ళాకా తన దగ్గరే వున్న లక్ష్మణుడుని కూడా వెళ్ళమని దుర్భాషలాడి పంపేసింది. బహిర్ముఖమైన మనస్సు మంచిని, విచక్షణను మరిచి ప్రవర్తిస్తుందని అనడానికి ఈ ఘటనో దర్పణం. లక్ష్మణుడు వెళ్తూ గీసిన లక్ష్మణరేఖనూ దాటేసింది. దశకంఠుడు చేతికి చిక్కింది. పరమ దుఃఖితురాలైంది. లంకకు చేరింది. అంటే ఆత్మనెడి రామున్ని మొదట వదులుకున్న మనస్సు తర్వాత భక్తిత్వమనే లక్ష్మణుని విడిచిపెట్టింది. దశకంఠుడుకి బందీ అయి తీవ్ర బాధకు లోనైంది. కోరికలకు, రాగద్వేషాలకు, కోపతాపాలకు మనస్సులో స్థానం ఏర్పడితే బాధలు తప్పవు.
లంకా పట్టణం :
సుఖదుఃఖాలు, గెలుపోటములు, రాగద్వేషాలు, కోపతాపాలు... ఇత్యాదులకు నిలయం లంకాపట్టణం. అన్ని వాసనలను అంటిపెట్టుకున్న పట్టణం లంకా. దీనికి తొమ్మిది ద్వారములు. ఈ లంకాపట్టణం మానవ శరీరం. మానవ శరీరమునకు కూడా నవద్వారలున్నాయి. లంకకు రాజు  దశకంఠుడు.  దశకంఠుడు అంటే దశేంద్రియములకు (5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు) లోబడినవాడు. లంక చుట్టూ సాగరము అనగా మానవుని చుట్టూ వున్న ఈ  మాయాసంసారసాగరమే. 
లంకలో వున్న సీత తన దుఃఖమునకు కారణం గ్రహించి, ఏకవస్త్రముతో వుంటూ రామునికై తపిస్తూ, రామున్నే ధ్యానిస్తూ, రాముడు వచ్చి తనని రక్షిస్తాడనే నమ్మకముతో వుంటుంది. అనగా తను బహిర్ముఖమై మాయలేడిపై ఆశపడి ఆత్మానందమును కోల్పోయి, దైవానుగ్రహం లక్ష్మణుని రూపేణ వున్న, దానిని వదులుకున్నందుకే తనకింత దుర్గతి పట్టిందని, తన దుఃఖమునకు కారణం తనేనని గ్రహించి తిరిగి రామున్ని చేరాలని ఏకధ్యాసతో అంతర్ముఖురాలైంది. 
ఇక ఇక్కడ రాముడు సీతకై విలపిస్తూ (రాముడు భగవంతుడు అయినప్పటికీ పూర్తిగా మానవుడిగానే జీవించాడు), సీతను అన్వేషించడం ప్రారంభించాడు. అంటే భక్తుడు దారితప్పి తిరిగి తనకై పరితపిస్తుంటే భగవంతుడు కూడా అంతలానే ఆ భక్తునికై పరితపిస్తాడని ఇక్కడ అర్ధమోతుంది.
ఆంజనేయుడు :
ఆంజనేయుడు పవనతనయుడు. అంటే ఉచ్చ్వాస నిశ్శ్వాస స్వరూపమైన ప్రాణాయామ స్వరూపుడు. 
మనస్సువేగం వాయువేగమునకు సమానం (మనోజవం మారుతతుల్య వేగం). అలా పరుగులు తీసే మనస్సుని నియంత్రించగలగడం శ్వాసతోనే సాధ్యం. ప్రాణాయామమే మనోనియంత్రనకు ఔషదం. ఈ ప్రాణాయామం ఎలా సాధ్యమౌతుందంటే ఇంద్రియములను జయించినప్పుడు (జితేంద్రియం) చక్కగా సాధ్యమౌతుంది. ఈ ఇంద్రియములను ఎలా జయించగలమంటే బుద్ధితో (బుద్ధిమతాం) జయించాలి. అప్పుడే ప్రాణాయామం చక్కగా జరుగుతుంది. ఈ ప్రాణాయామం స్వరూపుడు ఆంజనేయుడు. అంటే మూలాధారచక్రం మొదలుకొని సహస్రారం వరకు వ్యాపించగలిగినవాడు ఆంజనేయుడు. కుండలినీజాగృతి చేసి ఆత్మను పరమాత్మ దరికి చేర్చగల శక్తిమంతుడు ఆంజనేయుడు. భక్తునికి భగవంతునికి మద్య వారధి నిర్మాణకర్త ఆంజనేయుడే.
ఇక కధ లోనికి వస్తే -
సముద్రమును దాటి లంకలో ప్రవేశించాడు ఆంజనేయుడు. అనగా సంసారసాగరమనే మాయను దాటి లంక అనెడి శరీరం లోనికి ప్రవేశించాడు. సీతను దర్శించి రాముని అంగుళీయకం ఇచ్చి, త్వరలోనే రాముడు వచ్చి నిను రక్షిస్తాడని చెప్పి ఆనందపరుస్తాడు. అంటే  ప్రాణాయామం శుద్దమనస్సును చూసి పరమాత్మ అనుగ్రహం నీకు కల్గుతుందన్న అభయమిచ్చి పరమాత్మదర్శన యోగ్యత నీకు త్వరలోనే కల్గుతుందని చెప్పి ఆనందపరుస్తాడు. అనగా ప్రాణాయామం వలన సాధకుని మనస్సుకు తెలుస్తుంది ఆత్మసాక్షాత్కారం కలగబోతుందన్న అనుభూతి కల్గి ఆనందస్థితిలో వుంటుంది. ఆంజనేయుడు కొంతవరకు లంకాదహనం చేశాడు. అనగా లోపలున్న దుర్గుణాలు, వాసనలను కొంతవరకు దహనం చేశాడు. అయినా 'నేను' అనే అహంకారంతో రావణుడు హుంకరిస్తూనే వున్నాడు. అప్పుడు ఆంజనేయుడు మరింతగా తన తోకని పెంచి చుట్టలుచుట్టిన తోకనే ఆసనముగా చేసుకొని రావణుని ఎదుట కూర్చొని రామసందేశం వినిపించాడు. అనగా ప్రాణాయామ స్వరూపుడు అయిన ఆంజనేయుడు మరింతగా తన శక్తిని జాగృతి చేసి సహస్రారంవరకు ఎదిగి అక్కడ కూర్చొని లౌకికమైన కోరికలు, స్వార్ధం, అహంకారం విడిచి స్వస్థానంనకు మనస్సుని పంపేస్తావా, మరణిస్తావా అని సందేశం వినిపించాడు. 
ఇటుపై కధ అందరికీ తెల్సిందే. 
భగవత్ తత్వం అర్ధంకాక రావణుడు పతనమౌతాడు.
అగ్నిప్రవేశం చేసిన సీత రామున్ని చేరింది. అనగా సంపూర్ణముగా వాసనలన్నీ హరించబడి శుద్ధమనస్సు ఆత్మారామున్ని చేరింది.
తిరిగి అయోధ్యకి రావడం, పట్టాభిషేకం జరగడం అంటే అంతర్యామి అయిన రామునితో శుద్ధమనస్సనెడి సీత అయోధ్య అనెడి హృదయంలో కలిసివుండడమే పట్టాభిషేకం. 
కొంతకాలమనంతరం సీతను అడవిలో విడిచిపెట్టేయడంలో ఆంతర్యం ఏమిటంటే -
శుద్ధమనస్సు అలానే హృదయంలోనే ఆత్మారామున్ని చూసుకుంటూ వుండిపోతే శుద్ధమనస్సు స్థాయిలోనే వుంటుంది. భగవంతుడు శుద్దమనస్సులను ఉద్ధరించి తనస్థాయిలో (చైతన్యంలో) పూర్తిగా లయం చేయాలని భావిస్తాడు కాబట్టి, ఎక్కడనుండి వచ్చిందో అక్కడ లయమౌతానే చైతన్యంలో కలుస్తుంది కాబట్టి సీత అనెడి శుద్ధమనస్సును విడిచిపెట్టడం జరిగింది. అప్పుడుకూడా సీత అంతర్ముఖురాలై దైవధ్యానంలో వుండి కొంతకాలం తర్వాత ఎక్కడ నుండి వచ్చిందో అక్కడే లయమైంది. పుడమి నుండి వచ్చి పుడమిలోనే లయమై చైతన్యస్వరూపిని అయింది.
                                       మనోజవం మారుతతుల్యవేగమ్ 
                                       జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
                                       వాతాత్మజం వానరయూధ ముఖ్యమ్
                                       శ్రీరామ దూతం శరణం ప్రపద్యే// 
మనస్సమాన గతిలో వాయుసదృశ్య వేగంతో పరమజితేంద్రియుడై  శ్రీమంతుల్లో(బుద్ధిలో) శ్రేష్టుడైన పవన నందనుడు వానరాగ్రగణ్యుడు అయిన శ్రీరామ దూతను శరణువేడుతున్నాను. 
                              శ్రీ రామ చంద్ర చరణౌ మనసా స్మరామి 
                              శ్రీ రామ చంద్ర చరణౌ వచసా గృణామి
                              శ్రీ రామ చంద్ర చరణౌ శిరసా నమామి 
                              శ్రీ రామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే//
శ్రీరామచంద్రుని చరణములను నేను మనసా స్మరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను వాక్కు ద్వారా కీర్తించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములకు శిరస్సు వంచి నమష్కరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను నేను శరణువేడుచున్నాను.


5, నవంబర్ 2011, శనివారం

పరమపావనం - రామనామం


భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన కలియుగంలో లేదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ప్రతీ భగవన్నామంలో ఒక నిగూఢ అంతరశక్తి, మహిమ వుంటుంది. మనకున్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండక్షరాలా "రామ" మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతి తెలుపుతుంది. ఇది హరిహరతత్వంబు కలిసిన మహామంత్రం. 
'ఓం నమోనారాయణాయ' అనెడి ఆష్టాక్షరి మంత్రములో "రా" అను అక్షరం జీవాక్షరం. (ఎందుకంటే ఈ మంత్రంలో 'రా' తొలగించినచో  ఓం నమో నాయణాయ  అన్నది అర్ధం లేనిదవుతుంది) 'ఓం నమశ్శివాయ' అనెడి పంచాక్షరి మంత్రంబులో "మ" అనునది జీవాక్షరం. (ఎందుకంటే ఈ మంత్రంలో 'మ' తొలగించినచో ఓం నశ్శివాయ అంటే  శివుడే లేడని అర్ధం) ఈ రెండు జీవాక్షరముల సమాహారమే "రామ". శివకేశవుల సంఘటిత శక్తియే 'రామ'మంత్రం. అందుచే రామమంత్రం సర్వశక్తివంతమైన, శ్రేష్టమైన ముక్తిప్రసాద మంత్రముగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
100 కోట్ల శ్లోకాలతో రామాయణం వాల్మికిచే రచింపబడినది. అది త్రైలోక్యవాసుల సొత్తు. దానిని పరమశివుడు అందరికి పంచెను. 33 లక్షల 33 వేల 333 శ్లోకముల వంతున పంచగ 1 శ్లోకం మిగిలిపోయింది. దానిని కూడా పంచమని మునులు కోరారు. ఆ శ్లోకంలో 32 అక్షరములు ఉన్నవి. దానిని దశాక్షరి రూపమున ముగ్గురికి పంచగా రెండక్షరములు మిగిలినవి. ఆ రెండక్షరములు శివుడు తనకై తీసుకున్నాడని కధనం. ఆ రెండక్షరములే "రామ".
                                                                                                
                                                 *రామనామ ప్రభావం*
"రామ" అను రెండక్షరములు మనోహరమైనవి. మధురమైనవి. అమృత సమానం. ఈ రెండు అక్షరములు ముక్తి అను అమృతమును ఇచ్చును. సులభమైన ఈ నామం ఇహమందు సుఖమును, సంపదలను ఇస్తే, పరమునందు విష్ణుసాయుజ్యం ఇస్తుంది. లౌకికముగా భవభూతి, పారమార్ధికముగా ఆత్మానుభూతి రామనామం వలన కల్గుతుంది.
రాశబ్దోచ్చారణే జాతే వక్ర్తాత్పాపం విగచ్ఛతి / మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి //  (ఉమాసంహిత)
('రా' అను శబ్దం ఉచ్చరించగానే పాపం వదనమునుండి బయటపడును. పిదప 'మ'కారము వినుటతోడనే భస్మమైపోవును)
రామేతి రామచంద్రేతి రామభద్రేతి వా మనుమ్ / యావజ్జీవం జపన్ మర్త్యో జీవన్ముక్తో న సంశయః //  (ఉమాసంహిత)
(రామ, రామచంద్ర, రామభద్ర, అను ఈ మంత్రాలలో దేనినైనను జీవితాంతం వరకు జపించు మనుజుడు జీవన్ముక్తుడు కాగలడు. ఇందులో సంశయం లేదు)
కృశాను (అగ్ని) 'ర'అక్షరం అగ్నిబీజాక్షరం. భాను (సూర్యుడు) 'అ'అక్షరం సూర్యబీజాక్షరం. హిమారక (చంద్రుడు) 'మ'అక్షరం చంద్రబీజాక్షరం. ఈ మూడు బీజాక్షరములు కలసి "రామ" శబ్దమయ్యెను. అగ్నిగుణం దహించుట. అగ్నిబీజాక్షరమగు  'ర' శుభాశుభ కర్మలను దహించి మోక్షమును ఇచ్చును. సూర్యుని వలన అంధకారం నశించును. అటులనే సూర్య బీజాక్షరం 'అ' మోహాందకారమును పోగొట్టును. చంద్రుడు తాపమును హరించును. అటులనే చంద్రుని బీజాక్షరం 'మ' తాపత్రయమును హరించును.
ఉత్పత్తి కర్తయగు బ్రహ్మవంటివాడు చంద్రుడు. పోషణ కర్తయగు విష్ణువువంటివాడు సూర్యుడు. సంహార కర్తయగు శివునివంటివాడు అగ్నిదేవుడు. ఈ త్రిమూర్తిస్వరూపుడు శ్రీరాముడు. 
రామ మంత్రము ఎటువంటిదంటే - పుట్టుట, గిట్టుట అనెడి అలలు గల సంసారమను సముద్రం దాటించునదియును, బ్రహ్మవిష్ణురుద్రాదుల చేత పొగడదగినదియును, బ్రహ్మహత్యాది మహాపాపములను నశింపజేయునదియును, కామక్రోధలోభ మోహమదమాత్సర్యాలాది దుర్గుణములను సంహరించునదియును, నేను జీవుడనేడి అజ్ఞానం తొలగించునదియును, పరబ్రహ్మం (చైతన్యం) నేననెడు దివ్యజ్ఞానం వలన కలిగిన నిరాతిశయానందమును వర్ధిల్లుజేయునదియును, వేదముల కడపటిభాగమైన జ్ఞానకాండం చేత విచారింపదగినదియుయగును.  ( శ్రీ సీతారామాంజనేయ సంవాదం)
రా శబ్దోశ్చారణాదేవ ముఖాన్నిర్యాంతి పాతకాః / పునః ప్రవేశ భీత్యాచ మకారస్తూ కవాటవత్ //
(నోరు తెరిచి "రా" అని చెప్పునప్పుడే పాపములన్నియు నోటినుండి బయటికి వెళ్లిపోవుచున్నవి. మరల అవి లోపలకు ప్రవేశించకుండా "మ"కారం తో నోటిని మూసి బంధించుచున్నది)
"రా" అక్షరం ఉచ్చరించుటవలన నోరు తెరవబడి పాపములు పోయి ముఖం మధురముగా ఉండును. "మ" అక్షరం ఉచ్చరించుటవలన నోరు మూతపడి సంతోషం కలుగును.
"రా" అక్షరం బ్రహ్మస్వరూపుడునగు ఆదికూర్మముతో సమానం. "మ" అక్షరం జీవస్వరూపుడగు ఆదిశేషువుతో సమానం. 
"రా" అక్షరం ఛత్రం వలెను, "మ" అక్షరం కిరీటం వలెను సర్వ వర్ణములకంటే అధికముగా ప్రకాశించును. ఇటువంటి రామనామమును జపించిన సిద్ధత్వమును పొందుదురు.
"రా" అగ్నిబీజాక్షరం కావున దానిని స్మరించిన మాత్రమున సకలపాపములు భస్మము కావించుననియు, "మ" అమృతబీజాక్షరం కావున దానిని స్మరించిన యెడల సత్యముగా మోక్షం ఇచ్చుననియు ఋషులు తెలిపారు.
"రా" అనగా పరబ్రహ్మం, "మ" అనగా చిచ్ఛక్తి. "రా" అనగా క్షేత్రజ్ఞుడు, "మ" అనగా జీవుడు. "రా" అనగా శివుడు, "మ" అనగా శక్తి. "రా" అనగా విష్ణువు, "మ" అనగా  లక్ష్మి. "రా" అనగా బ్రహ్మం, "మ" అనగా సరస్వతి. "రా" అన్న మాత్రమున యముడు గజ గజ వణుకును, "మ" అన్న మాత్రమున అతని పాశం తెగిపోవును. రామ అన్న భవబంధములు నశించును. రామ అన్న సమస్త సంపదలు కల్గును. రామ అన్న సర్వార్ధములు సిద్ధించును. రామ అన్న బ్రహ్మహత్యాదిపాతకములెల్ల నివర్తియగును. రామ అన్న సకల సంశయములు నివృత్తియగును. రామనామం స్మరణం చేసేవారికి మోక్షం కరస్థమై రామమయమై ఉన్నది. రామ మంత్రముకంటే అధికమైన యజ్ఞంగాని, తపంగాని, వ్రతంగాని, మంత్రంగాని, మరియొకటి లేదు. 
                                                 *తారక మంత్రం* 
తారకం సర్వవిషయం సర్వధా విషయమక్రమం చేతి వివేకజం జ్ఞానం // (పతంజలి యోగం)
(వివేక జన్య జ్ఞానం తారకం. ఆత్మానాత్మ వివేకజ్ఞానముచే కలిగెడు శుద్ధమైన ఆత్మజ్ఞానమునకు తారకమని పేరు. (సంసార సాగరమునుండి తరింపజేసేది కాబట్టి ఇట్టి వివేకజ్ఞానమునకు తారకం అంటారు)
రామ మంత్రం ఒక్కటియే తారకమంత్రమైనది.
తా, రకం - తన యొక్క స్వరూపం. తన స్వరూపం తాను తెలిసికొనినచో ఏ చింతయు లేక మనస్సు నెమ్మది పొందును. పరమాత్ముడైన శ్రీరామునితో ప్రత్యగాత్మ స్వరూపుడైన తాను వియ్యమగుటయే యోగమనబడును. 
రామ ఏవ పరబ్రహ్మ రామ ఏవ పరం తపః రామ ఏవ పరం తత్వం శ్రీరామో బ్రహ్మతారకం//

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే / సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే //
(నేను సదా రామనామమును ధ్యానించెదను, అది విష్ణు సహస్రనామములకు సమానమైనది. నీవును ఆ నామమును జపించుమని శివుడు పార్వతీదేవికి ఉపదేశించెను)
తారక మంత్రమునే శివుడు సదా జపించెను. జీవుడు ముక్తి పొందవలెనని తలచి కాశీలోని మరణకాలమున ఈశ్వరుడే తారకమంత్రం స్వయముగా జీవుల దక్షిణ చెవియందు ఉపదేశించును. రామ అను శబ్దమును మరా అని జపించి దోపిడిదొంగ రత్నాకరుడు వాల్మికి మహాముని అయ్యెను. సహస్రనామములతో సమానమని శివుని వచనమును విని, పార్వతీ రామనామమును పఠించి శివుని సాంగత్యం నొందెను. తన వచనములయందామెకు గల విశ్వాసం జూచి, సంతచించి ప్రసన్నుడై పార్వతికి శివుడు తన శరీరములో ఎడమభాగమును ఇచ్చెను. రామనామ స్మరణతో రాయిరూపంలోఉన్న అహల్య రామస్పర్శకు నోచుకొని పునీతురాలైనది.
రామ అను తారకమంత్రము చేత సకల పాతకములు నశించును. పార్వతీదేవికి పరమేశ్వరుడు, వాల్మికికీ నారదుడు, భరద్వాజునకు వాల్మికి, వ్యాసులకు పరాశరులు, శుకులకు వ్యాసుడు ఉపదేశించినది తారక మంత్రమే.
తారకమంత్రము కంటే ఉత్తమమంత్రం లేదు. ఈ మంత్రమును త్రికరణశుద్ధిగా అనుష్టించినవారు భవసాగరమును నిస్సంశయమముగా తరింపగలరు. నిరంతంను ప్రాణావాయువు లోపల వెలుపల సంచరించు నప్పుడెల్లను తదేకధ్యానముతో తారకమంత్రమును మననింపుచు ఉన్నను కాలక్రమేణ ఈ మహామంత్ర ప్రభావంచే ముక్తిని పొందుదురు. (మహాభక్త విజయం)
రామ అన్నది ఒక్క నామమే కాదు, మంత్రం కూడా. రామ మంత్రం మనిషిని తరింపజేసేది కావునా అది తారకమంత్రమైంది. ఇందుకు ఉదాహరణముగా ఓ కధని కంచి పీఠమునకు అధిపతి అయిన శ్రీ చంద్రశేఖరసరస్వతివారు ఓసారి చెప్పారు. ఓ అడవిలో కొందరు దొంగలు తాము చేద్దామనుకుంటున్న దొంగతనం గురించి ఇలా మాట్లాడుకొని ముక్తిని పొందినట్లు ఓ కవి చమత్కారముగా చెప్పింది చెప్పారు. 
వనే చ రామః వసు చాహరామః 
నదీం స్తరామః నభయం స్మరామః 
వనే కిరాతః ముక్తిం గతాః షంగాతే
అంటే - వనే చ రామః (అడవిలో నివశిద్దాం), వసు చాహరామః (ఈ దారిలో వెళ్ళే ప్రయాణికులనుండి సంపదను దొంగలిద్దాం), నదీం స్తరామః (దొంగాలించాక నదిని దాటేద్దాం), నభయం స్మరామః (నదిని దాటేస్తే పట్టుబడతామనే భయం వుండదు) అని అనుకున్నారు. వారు దొంగలైనప్పటికి వారి మాటలలో రామః అను శబ్దం వుండడం వలన వనే కిరాతః ముక్తిం గతాః షంగాతే .... ఆ అడవిలో కిరాతకులు మరణించినతర్వాత ముక్తిని పొందారు. రామ అన్న పదమహిమ తెలియకున్నా ఆ కిరాతకులు వారివారి మాటలమద్య అసంకల్పితముగా రామ అని పలికినందులకే ముక్తి లభిస్తే, భక్తితో శ్రద్ధతో స్మరిస్తే ఇహపరములందు ఎంతలా తరిస్తమో గుర్తించండి.
శ్రీరామప్రాతిపదికమవశేనాపి సంగృణన్ / ముక్తిం ప్రాప్నోతి మనుజః కిం పునర్బుద్ధిపూర్వకమ్ // (ఉమా సంహిత)
(శ్రీరామ అను ప్రాతిపదికమును తెలియక ఉచ్చరించినను మనుజుడు ముక్తినొందుననగా తెలిసి ఉచ్చరించిన ముక్తినొందుననుటలో సందేహం ఏముంటుంది?)
                                                                             
                           *నామము గొప్పదా - రూపం గొప్పదా*
రూపం నామమునకు ఆధీనం. నామం లేక రూపం యొక్క జ్ఞానం కలుగదు. రూపంగల పదార్ధం చేతిలో వున్నను నామం తెలుసుకొనని యెడల ఆ పదార్ధం గుర్తెరుంగం. నామమును ధ్యానిస్తే రూపం స్వయముగా హృదయంలో వ్యక్తమగును. మనస్సునకు ఆనందం కలుగును. సగుణ, నిర్గుణ బ్రహ్మములకు నామమే సాక్షి. ఈ రెండింటిని తెలుసుకొనుటకు నామమే ప్రధానము.వానిని చేరుటకు నామం మార్గం చూపును. (మహాభక్తవిజయం)
బ్రహ్మం సగుణమనియు, నిర్గుణమనియు చెప్పవచ్చును. సగుణ నిర్గుణములకంటే నామమే శ్రేష్టం. ఎందుకంటే - నామం యొక్క ప్రభావంవలన సగుణ నిర్గుణములు రెండును స్వాదీనమగును. అగ్ని దారువులో కలదు, ఆ అగ్నియే ప్రకటమై ప్రజ్వరిల్లును. మొదటిది అవ్యక్తం, రెండవది వ్యక్తం. అటులనే నిర్గుణబ్రహ్మం  అవ్యక్తం, సగుణబ్రహ్మం వ్యక్తం. రెండును అగమ్యములు. నామం మాత్రం గమ్యం. అందుచేత బ్రహ్మం కంటెను, రాముని కంటెను నామం శ్రేష్టమైనదని చెప్పుదురు. సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మం జీవుని హృదయములలో ప్రకాశిస్తున్ననను లోకములో సమస్తజీవులను అది గ్రహించలేక దుఃఖితులై అగచాట్లు పడుచున్నారు. ఆ కారణంచే ఆ బ్రహ్మం రూపమును ధరించి పేరు పెట్టుకొని లోకమునకు వ్యక్తమగుచున్నాడు. ఆ సగుణబ్రహ్మమునకు నామం లేనిచో స్మరించలేముకాబట్టి సగుణనిర్గుణబ్రహ్మములకంటే నామం యొక్క ప్రభావము శ్రేష్టమైయున్నది. సగుణబ్రహ్మం మాధుర్యమూర్తి, నామం మాధుర్య మహిమాశక్తి దీప్తి. రాముని వలన తరించినవారు కొందరే, రామనామం వలన తరించువారు అనంతమంది.
రామనామ్ మణిదీప్ ధయ జొహ్ రే హరంద్వార్
తులసి భీతర్ ఛాహే రహు జాం బహం ఉజ ఆర్ (తులసీదాసు)
(నీకు లోపల బయట వెలుగు కావాలని కోరుకుంటే, జిహ్వ అనే ద్వారం దగ్గర రామనామం అనే దీపాన్ని వెలిగించండి)

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే / రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః //
శ్రీరామున్ని కౌసల్యాదేవి రామా అనియు, దశరధుడు రామభద్ర యనియు, వసిష్టమహర్షి రామచంద్ర యనియు, రాజులు రఘునాధ యనియు, సీతాదేవి నాధ యనియు, భక్తులు సీతాపతి యనియు, సంబోధింతురు. అట్టి సీతారామునకు నమస్కారం.

1, నవంబర్ 2011, మంగళవారం

భావశుద్ధియే జ్ఞానసిద్ధి (ఆచారాల అంతరార్ధం ఇదే)

అనేకనేక సాధనమార్గములు, యోగ పద్ధతులు అభ్యాస సూత్రములు వున్నను, వాటన్నింటినీ ఆచరించడం కొంత అసాధ్యముగా, కష్టతరముగా ఉండడంవలన బ్రహ్మభావచింతన వలనైనా తరించమని శాస్త్రాలు ఉద్భోదిస్తున్నాయి.
తానే బ్రహ్మమనెడి భావన కలిగియుండి, దేహాత్మ భావమును ప్రయత్నపూర్వకముగా శాశ్వతముగా విడిచిపెట్టి దినచర్యలు చేసుకుంటూ జీవించుటయే బ్రహ్మభావసాధన.
నేను ఫలానా అన్న దేహాత్మభావనను విడిచి, నేను బ్రహ్మమును అనెడి ఆత్మవాసనాభావమును శాశ్వతముగా మనస్సునందు యేర్పరుచుకొని, ఆ భావనతోనే జీవనక్రియలన్నిటిని జరుపుకొనుచుండవలెను.
మనోబుద్ధ్యా హంకార చిత్తాని నాహం, న శ్రోత్రం న జిహ్వ న చ ఘ్రాణ నేత్రం, న చ  వ్యోమ భూమిన్న తేజో న వాయు, శ్చిదానంద రూపః శివోహం శివోహం....
మనోబుద్ధ్యహంకార చిత్తములు నేను కాను. శ్రవణ జిహ్వలు కాని, నేత్ర ఘ్రాణములు కాని నేను కాదు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వి కూడా నేను కాదు. నేను శాశ్వతానందమును, చైతన్యమును, నేను శివుడును,శివుడును....... అన్నభావశుద్ధి కలగవలయును. 
నాహం దుఃఖీ న మే దేహో బంధః కో స్యాత్మనః స్థితః / ఇది భావరూపేణ వ్యవహారేణ ముచ్యతే //
నిత్యశుద్ధ స్వయంప్రకాశ జ్ఞాన స్వరూపుడైన నేను దుఃఖిని కాను, జన్మము లేనివాడనైన నాకు దేహమెట్లు కల్గును? సచ్చిదానంద లక్షణముగల ఆత్మ అయిన నాకు బంధమెక్కడిది? ఇలాంటి విచార భావరూప వ్యవహారములచే భక్తుడు ముక్తుడగుచున్నాడు.
అంతరశుద్ధికి ప్రధానమైనది భావశుద్దియే. భావం శుద్ధి అయినప్పుడే జ్ఞానం ప్రాప్తమగును.
భావతః సంవిశుద్దాత్మా స్వర్గం మోక్షం చ విందతి /
భావసంశుద్ధిగలఆత్మ స్వర్గమును, మోక్షమును పొందుచున్నది.
భావవృత్త్యా హి భావత్వం శూన్యవృత్త్యా హి శూన్యతా / బ్రాహ్మవృత్త్యా హి పూర్ణత్వం తధా పూర్ణత్వమభ్యసేత్ //
భావవృత్తి చేత భావత్వమును (అనగా జనుడు ఏయే భావన చేయుచుండునో, అలాంటి భావమును కల్గుటయు), శూన్య వృత్తిచే శూన్యత్వమును బ్రహ్మవృత్తిచే పూర్ణత్వంను  పొందుదురు. కనుక పూర్ణ బ్రహ్మభావనను అభ్యచించవలెను. అప్పుడే పూర్ణభావన ననుచరించి జ్ఞానము సిద్ధించును.
సనకాద్యాస్సదా జ్ఞానిన్ బ్రహ్మభావనయా యుతాః / జ్ఞానులగు సనకాది ఋషులు సదా బ్రహ్మభావన కలిగియుందురు.  జీవన్ముక్తి పొందగోరువారు సనకాదులవలె బ్రహ్మభావన కలిగియుండవలయును.
భావశుద్ధి: పరం శౌచం ప్రమాణం సర్వకర్మసు / చిత్తం విశోధయే త్తస్మా త్కిమన్యైర్బాహ్యశోధనై: //
భావశుద్దికన్న పరమగు శుద్ధి మరియొకటి లేదు. సమస్త కర్మలలో ఇదే ముఖ్యమగు ప్రమాణం. అట్లు చేయక బాహ్యంమాత్రము శుద్దిచేసుకొనిన ప్రయోజనం లేదు.
భావశుద్ధివిహీనానాం సమస్తం కర్మ నిష్ఫలమ్ / తస్మాద్రాగాదికం సర్వం పరిత్యజ్య సుఖీ భవేత్ // 
భావశుద్ధి సంపూర్ణముగా కలగనివారి సమస్త కర్మలును నిష్పలములు. అందువల్ల రాగాదులను మనోమాలిన్యములను పరిశుద్ధభావములతో పరిత్యజించి సుఖముగా వుండేలా ప్రయత్నించవలెను.
నిరంతరం 'అహం బ్రహ్మాస్మి' అనే నిశ్చల భావం కలిగియుండుటచే భ్రమరకీటక న్యాయమున బ్రహ్మత్వమును పొందుదురు.
వివిక్తదేశ ఆసీనో విరాగో విజితేంద్రియః / భావయే దేకమాత్మానం తమనంత మనన్యధీ: // 
సమస్త ఆశలను వర్జించి, ఇంద్రియములను వాటి వ్యాపారమునందు ప్రవేశింపకుండ   అణిచి, మనస్సును చలింపనీయకుండ  ఆత్మయందుంచి, ఆత్మయందు పరమాత్మభావన చేసుకొని ధ్యానించువారు బ్రహ్మప్రాప్తి పొందుదురు.
  • అందుకే మన పెద్దవారు పూజావిధానాలంటూ, ఆచారవ్యవహారాలంటూ కొన్ని పద్ధతులను నేర్పారు. వాటిని సునిశితముగా పరిశీలిస్తే అవన్నీ మొదట ఆధ్యాత్మిక సోపానములయి సాధన పెరిగేకొలది అవన్నీ మన భావశుద్ధత్వమునకే అన్నది అవగతమౌతుంది. ఏదైనాసరే ఓ విధిగా యాంత్రికముగా చేయకుండా అర్ధం గ్రహించి భావముతో చేయవలెను.
ఉదయం లేస్తున్నప్పుడు - 
                                
కరదర్శనం :- కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి / కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం // 
చేయి పైభాగాన లక్ష్మీ, మధ్యభాగమున సరస్వతి, చివరిభాగమున గౌరీదేవి వున్నందున ప్రాతః కాలమున ఈ శ్లోకం చదివి మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవలెను. (లేదా మూడుసార్లు శ్రీహరి, శ్రీహరి శ్రీహరి అని తలస్తూ  కరదర్శనం చేసుకోవలెను) [లక్ష్మీ,సరస్వతి,గౌరీదేవిలను దర్శనం చేసుకుంటున్న భక్తిభావం ఉండాలి]
భూప్రార్ధన :- సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే / విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే //
పాదస్పర్శతో భూదేవిని బాధిస్తున్నందుకు క్షమాపణ చెప్తూ కాలిని నేలకు  ఆన్చాలి. (లేదా పాదస్పర్శ క్షమస్వమే, భూదేవి నమోస్తుతే అనైన ప్రార్ధించవచ్చును) [క్షమాపణభావంతో నిజముగా నమష్కరించాలి]
ప్రాతః స్మరణ :- బ్రహ్మ మురారి స్త్రిపురాంతకశ్చ, భాను శ్శశీ భూమిసుతో బుధశ్చ / గురుశ్చ శుక్ర శ్శని రాహు కేతవః, కుర్వంతం సర్వే మమ సుప్రభాతమ్ // 
త్రిమూర్తులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు నాకు మేలు చేయుదురుగాక! [మేలు జరుగుతుందన్న నమ్మకభావన అనుభూతించాలి]
స్నానం :- గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి / నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు // 
[స్నానం అంటే హడావిడిగా నాలుగుచెంబులు పోసుకోవడం కాదు. ఇంట్లో స్నానం చేస్తున్నను పవిత్ర నదీజలములతో చేస్తున్నభావన పొందాలి. నదిదగ్గర చేస్తున్నప్పుడు 'ఇది విష్ణుపాదములనుండి ఉద్భవించి, శివుని జటాజూటం చేరి, అక్కడనుండి ఉరకలువేస్తూ, పరవళ్ళు త్రొక్కుతూ ఎందఱో దేవతలు, ఋషులు, మహర్షులు, యోగులు తపస్సాచరించిన పుణ్యభూమి హిమగిరులను తాకుతూ, కొండకోనలను, చెట్టుపుట్టలను స్పర్శించుతూ ఇక్కడ నదై ప్రవహిస్తుంది. ఆహా! ఎంతటి భాగ్యం.... ఇందు స్నానమాచరిస్తూ పునీతులమౌతున్నామన్న భావన ఉండాలి. అప్పుడే దేహశుద్ధితో పాటు మానసికశుద్ధి జరిగి మనస్సు నిర్మలమౌతుంది]
భాహ్యాభ్యంతరభేదేన శౌచం తు ద్వివిధం స్మృతమ్ / మృజ్జలాభ్యాం బహిశుద్ధి ర్భావశుద్ధి స్తదాన్తరమ్ //
బాహ్యాభ్యంతర భేదములచే శౌచం రెండువిధములుగా వుండును. జలముచే కలిగెడుశుద్ధి బాహ్యశుద్ది, నిర్మలభావము(భావశుద్ధి) చే కలిగెడుశుద్ధి అంతర శుద్ధి.
పూజావిధం :- చిత్రం, మృత్తిక, శిల, దారువు, లోహం.... దేనితో తయారైనదైనా దానిని భగవంతుని ప్రతిరూపముగా భావించి పూజిస్తాం. [ఈ రూపాలు మన ప్రగాడ  విశ్వాసభావనతో ఏర్పరుచుకున్నవి]
{న తే రూపం న చాకారో నాయుధాని న చాన్పదమ్ / తధ్కాపి పురుషాకారో భక్తానాం త్వం ప్రకాశాసే //
భగవంతునికి ప్రత్యేకముగా ఒక్క రూపముగాని, ఒక్క ఆకారముగాని, ఆయుధముగాని (శంఖు,చక్ర,డమరు మొదలగు), వైకుంఠ కైలాసాది ప్రత్యేక స్థలములుగాని లేనప్పటికిని భక్తవత్సలగుటచేతను, పరమకరుణాస్వరూపులగుటచేతను భక్తులయొక్క భావమును అనుసరించి అనేకరూపములను ధరించుచున్నారు. 
యే యధా మాం ప్రవద్యంతే తాంస్తదైవ భజామ్యహం ..... ఎవరు ఎలాంటి భావముతో నన్ను ఉపాసింతురో వారికాలాంటి భావముతో దర్శనమిత్తును.} 
దీపస్తుతి :- దీపం జ్యోతి: పరబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ / దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే // 
దీపజ్యోతే పరబ్రహ్మం. దీపజ్యోతే అన్ని తమో గుణాలని హరించేది. దీపం వల్లే సర్వం సాధ్యం. సంధ్యలో వెలిగే దీపానికి నమస్కారాలు. [దీపకాంతిలో తమోరజో గుణాలు హరిస్తాయన్న భావనతో స్థిరముగా పూజించవలెను]
పూజకు వినియోగించే పదార్దముల అంతరార్ధం :- కృష్ణభగవానుడు చెప్పిన పత్రం, పుష్పం, ఫలం, తోయంలకు అర్ధమేమిటంటే - పత్రం అంటే దేహం. ఈ శరీరమును వినియోగిస్తూ చేసే క్రియలను భక్తిభావముతో కృష్ణార్పణం చేయాలి.(ప్రారబ్ధకర్మనుండి విముక్తి కల్గుతుంది) పుష్పం అంటే హృదయం. పుష్పములా సున్నితముగా, సువాసనభరితంగా, స్వచ్ఛముగా వున్నా హృదయమును సమర్పించాలి. ఫలం అంటే కర్మఫలం. ఫలములో విత్తనములు వుంటాయి, అవి నాటితే తిరిగి చిగురిస్తాయి. అలానే కర్మల వలన జన్మించాల్సివస్తుంది. అలానే కర్మఫలాన్ని అనుభవించాల్సివస్తుంది. అలా కాకుండా త్రికరణశుద్ధిగా కర్మఫలాన్ని ఈశ్వరార్పణం చేస్తే కర్మబంధం తప్పుతుంది.(దీనివలన సంచిత, ఆగామి కర్మలనుడి విముక్తికల్గుతుంది) తోయమనగా భక్తిరసం. ఆరాధనతో, ఆర్తితో పరిపూర్ణ శరణాగతి భక్తిభావముతో మనస్సు ఉప్పొంగికార్చే ఆనందభాష్పాలను సమర్పించాలి. 
కొబ్బరికాయ :- కొబ్బరికాయ కొడుతున్నామంటే మన అహంకారమును వీడుతున్నామని. లోపలున్న తెల్లనికొబ్బరిలా మన మనస్సును సంపూర్ణముగా భగవంతుని ముందు పరిచామని. తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా మన జీవితాలని వుంచమని అర్ధం. కొబ్బరి బయటిభాగం మన శరీరమని, లోపలభాగం మన మనస్సని, మూడుకళ్ళు ఇడా,పింగళ, సుషమ్ననాడులని కూడా పెద్దలు చెప్తారు.
ధూపం :- సువాసనభరితమైన ధూపం మనలో వున్న చెడువాసనలను తొలగించాలని వెలిగిస్తాం.
హారతి :- కర్మవాసనలన్నియు కర్పూరముల పూర్తిగా క్షయింపబడాలని వెలిగిస్తాం. ఏ శేషములేకుండా భగవంతుని ముందు వెలిగించిన హారతి భగవంతునిలో కైకర్యం చెందినట్లుగా భక్తిభావంతో మనలోవెలుగుతున్నఆత్మ పరమాత్ముని యందు ఐక్యంకావాలని కోరుకోవడం. హారతిని కళ్ళకు అద్దుకోవడమంటే మన దృష్టి అంతర్ముఖం కావాలని.
భోజనమునకు ముందు :- అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లబే / జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి //
అన్నం బ్రహ్మరసో విష్ణు: భోక్తా దేవో మహేశ్వరః / ఇతిస్మరన్ ప్రభుం జానః దృష్టి దోషై: నలిప్యతే //
(ఏది భుజించినను భగవంతుని ప్రసాదముగానే స్వీకరించాలి)
భోజనము తర్వాత :- అగస్త్యం కుంభకర్ణంచ శమ్యంచ బడబానలమ్ / ఆహారపరిణామార్ధం స్మరామి చ వృకోదరమ్ //
ప్రయాణం :- జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః / అతవ్యాం నారసింహశ్చ సర్వతః పాతుకేశవః // 
నీటిబాధనుంచి వరాహావతారం, భూ సంబంధమైన బాధలనుంచి వామనావతారం, అడవుల్లోని బాధలనుంచి నరసింహావతారం, అన్ని బాధలనుంచి అన్ని అవతారాలకి మూలమైన శ్రీహరి రక్షించుగాక! (లేదా వనమాలీ గదీ శారజ్ఞి శంఖీ చక్రీ చ నందకీ / శ్రీమాన్ నారాయణో విష్ణు: వాసుదేవోభిరక్షతు // ; ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ / లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం // అని ప్రార్ధించవలెను)  
శయనవిధి :- రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం / శయనే యః స్మరేన్నిత్యం దుఃస్వప్నం తన్న నశ్యతి //  
ఈ ఆచారాల వెనుక ఆధ్యాత్మికశక్తి నిక్షిప్తమై వుంది. ఆధ్యాత్మిక తొలి సోపానాలు ఇవే. మేల్కొనే దగ్గరనుండి నిదురించేవరకు 'మనస్యేకం, వచస్యేకం, కర్మన్యేకం మహాత్మనాం' (మనస్సు, మాట, క్రియ ఈ మూడు ఒకదానికి ఒకటి సంబంధం సరిగ్గా కల్గియున్నాయో, లేదో సరిచూచుకుంటూ దినచర్య నిర్వర్తించాలి)
  • వీటన్నింటిని ఆచరించడంవలన భక్తిభావం పెరిగి క్రమేణ సత్వభావన స్థిరపడుతుంది. అటుపై తైలధారలా నిరంతర నామస్మరణ, జపం, మానసికపూజ, ధ్యానం అసంకల్పితముగా జరుగుతుంది. తద్వారా భావశుద్ధి పరిపూర్ణముగా కలిగి జ్ఞానం సిద్ధిస్తుంది. ఐతే ఈ శ్లోకములు, విధానములు తెలియనివారికి పరమాత్ముడు ప్రాప్తం కాడా? ప్రాప్తమౌతాడు... ఎలాగంటే - పూర్ణ భక్తిభావనతో మనకి తెలిసిన భాషలో మన భావనలను భగవంతునికి అర్పించినప్పుడు. మన భావననే ప్రార్ధనగా మలచగల్గినప్పుడు. ఉదాహరణకి: భక్త కన్నప్ప, తన ప్రేమైక భావనలతో పరమేశ్వరుని మెప్పించినట్లు. నిరంతర స్మరణ, అనన్య భక్తిభావన, సంపూర్ణ  శరణాగతి భక్తునికి వుండాలి. దీనికి ఓ నియమిత పద్ధతిగాని,  పరిమితిగానీ లేదు. ఎవరికి అనువైన పద్ధతిలో వారు సాధన కొనసాగించవచ్చు. కాకపొతే మనో, వాక్కు, కర్మేణ చేసే ప్రతీ క్రియయందు పరమాత్ముని చూడగలగాలి... సమస్తం సర్వాంతయామి సంకల్పమేనన్న స్థితప్రజ్ఞాభావంతో వుండగలగాలి... ప్రతీ అంకములో, ప్రతీ అంశములో, ప్రతీ అడుగులో, ప్రతీ క్షణములో, ప్రతీ వీక్షణములో, ప్రతీ చర్యలో, ప్రతీ మాటలో, ప్రతీ కదలికలో, ప్రతీ తలపులో, ప్రతీ చోటా పరమాత్మున్నే ద్యేయముగా వుండాలి... అంతే!  
  • ఇంతటి భావస్థితిలో వుండడం సాధ్యమైనా? కొంత కష్టమే అయినను అసాధ్యం కాదు. అభ్యాసం దృఢపడేవరకే కొంత అయోమయం, అటుపై అంతా ఆనందమే.  సాధ్యసాధ్యముల సందేహము వద్దు. ఫలితం గురించి ఆశ వద్దు. ఫలమేదైనా పరిపూర్ణ ప్రయత్నం మనది కావాలి.  
  • "ప్రయత్నం చేయక ఓడిపోవడం మరణించినట్లే. ప్రయత్నం చేస్తూ మరణించినను జయించినట్లే".