18, నవంబర్ 2019, సోమవారం

అబ్బో ఈరోజు ఎన్ని దీపకాంతులో...

ఈరోజు ఉదయం నుండి వాట్సప్ లో కొందరు సత్సంగ మిత్రులు పంపిన దీప సందేశాలు...










                         



6, నవంబర్ 2019, బుధవారం

🕉 కిరాతార్జునీయం - అంతరార్ధం 🕉

మన పురాణ ఇతిహాసాల్లో ప్రతీ సంఘటనకీ అంతరార్ధం, బాహ్యార్ధం తప్పక వుంటాయి. బాహ్యార్ధాన్ని మాత్రమే తెలుసుకుంటే కేవలం విషయజ్ఞానంతో పాటు భక్తిత్వం పెరుగుతుంది. అదే అంతరార్ధాన్ని గ్రహిస్తే ఆత్మజ్ఞానం కలిగి ముక్తిని చేరే మార్గం బోధపడుతుందని ప్రముఖ బ్లాగర్ రసజ్ఞగారు తన ఓ పోస్ట్ లో అంటారు. నాది కూడ అదే భావన. ఆ కోణంలోనే ఈ కధకు చక్కటి అంతరార్ధమును మా తాతయ్యగారు చెప్పారు కానీ, పూర్తిగా జ్ఞాపకంలేదు. లీలగా జ్ఞాపకమున్నది ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. 
                                                         
కృష్ణపరమాత్మ(భగవత్ స్వరూపులు)మరియు
వ్యాసమునీంద్రులవారు(గురు స్వరూపులు) శివునికై తపస్సు చేయమని అర్జునుడికి సూచించారు.  
భగవంతుడు మరియు గురువు...వీరిరువురి సూచన అంటే - నిస్సందేహంగా ఇందులో పరమార్ధమున్నట్లే.
మానవుడిని మాధవుడిగా చేయడానికీ, మనల్ని తరింపచేయడానికి ఏదో అర్ధముందని గ్రహించగలగాలి. జీవాత్మకు ప్రతీక అయిన అర్జునుడిని మిషగా మానవుడు తరించడానికి ఓ గొప్ప సందేశాన్నే ఈ సంఘటన ద్వారా సకల మానవళికి అందించారు. 

శివుడినే ఎందుకు ఆరాధించమని చెప్పారంటే - "శామ్యతి పరమానంద రూపత్వాన్నిర్వికారో భవతి ఇతిశివః" అని అర్ధం చెప్తుంది అమరకోశం. పరమానంద స్వరూపుడు, ఏ వికారాలు లేనివాడు శివుడు. 
జీవులన్నింటికీ షడ్వికారాలు (జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశాంగ) ఉంటాయి. శివుడు మాత్రమే ఏ వికారాలు లేని పరమానందమయుడు. మనలో వికారాలు పోవాలంటే -  ఏ వికారాలు లేనివాడిని ఆశ్రయించాలి. అలానే శివుడు పశుపతి. పశువులు అనగా ఇంద్రియములు అని అర్ధం. దిక్కులని మరియొక అర్ధం. వీనికి అధిపతి అయిన పశుపతిని/శివుడిని అందుకే ఆరాధించమని 
సూచించారు.

                           


ఇక కధలోని పరమార్ధం పరిశీలిద్దాం -

మనుషుల్లో  పశుభావమును [నేను జీవుడనే భావమును] పొగొట్టునది పాశుపతాస్త్రం. అంటే అజ్ఞానం పొగొట్టు అస్త్రం. అజ్ఞానం పొగొట్టుకొని ఆత్మజ్ఞానం పొందాలని సాధకుని ప్రయత్నమే ఈ కిరాతార్జునీయం. 
ఇక్కడ అర్జునుడు ఓ ఆధ్యాత్మిక సాధకునిగా పరిగణిస్తూ పరిశీలిద్దాం. ప్రాపంచిక జీవనంలో అలసిసొలసి...ఏమిటీ జీవితం...ఇది కాదు జీవితం...మొన్న ఆనందం...నేడు అజ్ఞాతం...దుఃఖం...ఏది శాశ్వతం...ఏది అశాశ్వతం...ఇత్యాది భావనలతో వైరాగ్యం...అజ్ఞానమును వీడి యధార్ధజ్ఞానమును తెలుసుకోవాలన్న వైరాగ్యసహిత ఆకాంక్ష కల్గింది. ఇదే శుభకరమైన ఇచ్ఛ... 'శుభేచ్ఛ'. ఇది సాధకుని మొదటిస్థాయి.
వైరాగ్యం చేత మనకున్నది మనమున్నది సత్యమూ నిత్యమూ కాదని తెలుసుకొని, ఇంద్రియాల ద్వారా వచ్చే భౌతిక విషయపరిజ్ఞానం, ఆనందాల పట్ల అనురక్తి తగ్గి, సజ్జనసాంగత్యం, స్వాధ్యాయం ద్వారా జ్ఞానప్రాప్తికై... ఏం చేయాలి...ఎలా సాధించాలి అన్న 'విచారణ' మొదలౌతుంది. ఇది సాధకుని రెండో స్థాయి. 

జగద్గురువు కృష్ణపరమాత్మ, వ్యాసమునీంద్రులవారు సూచన మేరకు, అర్జునుడు పాశుపతాస్త్రం సాధించుట కోసం, శివుడికై తపస్సు చేయడానికి ఈశాన్యదిక్కుగా బయలుదేరి ఇంద్రకీలాద్రికి వెళ్ళెను. {ఈశాన్యం - పరమాత్మను ఉపాసించే దిక్కుయని అందరికీ విధితమే} వెళ్ళి పశుపతి అయిన శివుడిని ఆరాధించడం ప్రారంభించెను.
విచారణ ద్వారా ధ్యానసాధనలో నిమగ్నమై ఇంద్రియార్ధముల యందు ప్రీతి  శుష్కించిపోవు స్థితి 'తనుమానసి'. ఇది సాధకుని మూడవ స్థాయి.
అర్జునుడు తపస్సు చేస్తున్నాడు ఎంతోకాలంగా. అయిన శివదర్శనం కానరాలేదు. ( మన హృదయంలో ఓ సత్యముంది. ఆ సత్యం ఎంత లోతులో ఉందో, అంత లోతులోనికి మనం వెళ్ళితే గానీ, ఆ జ్ఞానం దొరకదు. మనం ఆ జ్ఞానాన్ని పొందడానికి స్వప్రయత్నంగా కొంతదూరం వెళ్ళగలం. ఆపై ఎంత సాధన చేసిన వెళ్ళలేం. యిన ఆగక సంకల్పబలంతో ముందుకు సాగితే, తప్పక గుర్వనుగ్రహం లభిస్తుంది).
                            
సడలని సంకల్పంతో సాధన చేస్తుంటే ఇంద్రుడు (గురువు) {దృవుడికి నారదమహర్షి గురువైనట్లు, ఇక్కడ ఇంద్రుడు అర్జునుడికి గురువై మంత్రోపదేశం చేసిరి} వచ్చి, ఎందుకు తపస్సు చేస్తున్నావని ప్రశ్నించి, అర్జునుడనే సాధకుని హృదయక్షేత్రధర్మ పటిమను పరిశీలించి, పట్టుదలను పరీక్షించి, అంతర్గత శత్రువులు...అరిషడ్వర్గాలను జయించాలనే సంకల్పంతో పాశుపతాస్త్రముకై తపస్సు చేస్తున్నాడని మెచ్చి,  పార్ధివలింగమును పంచాక్షరి మంత్రంతో ఆరాధించమని అనుగ్రహించెను. అర్జునుడు గుర్వనుగ్రహంతో కఠోర తపానికై పూనుకున్నాడు. తపోదీక్షలో చాలాకాలం గడిచింది. అప్పుడు పరమేశ్వరుడు పరీక్షించదలచి 
రాక్షసుడిని రొద చేస్తూ తపోభగ్నం చేయమని చెప్తాడు. అంటే అంతరమునున్న ఆంతర్యామి మనస్సనే రాక్షసుడిని ప్రేరేపిస్తాడు. మనస్సు రొదను తన అస్త్రంతో (సాధనాశక్తితో) సంహరిస్తాడు అర్జునుడు. కానీ యధార్దానికి అదే క్షణమున శివాస్త్రం (శివానుగ్రహం) సంహరిస్తుంది మనస్సనే రాక్షసుడిని. 
కానీ, 'నేనే' చంపాననే భావం అర్జునునిది. జీవుని యందు 'నేను' అను వ్యక్తిగత ప్రజ్ఞయే అహంకారం. ఇట్టి అహంకారం వలన జీవుడు తనని తాను పరమాత్మ నుండి వేరుచేసుకొనుచున్నాడు. ఇది జీవియందు నేను అను సంకల్పంగా పనిచేయుచున్నది. ఈ అహంకారమే ఇంకా అర్జునుడిలో వుండడం వలన, వాదిస్తూ ఘర్షకు దిగాడు. కొంత ఘర్షణ తర్వాత శివుడు అపారకృప కనబర్చగా; తనవలననే జరిగిందనిపించినను, నిజమునకు పరమేశ్వరుని సంకల్పం వలనే జరిగెనను పరమసత్యం అవగతమై, అహంకార నిర్మూలనం కాగా పరమాత్మ పాదములను పట్టుకొనెను. పాశుపతాస్త్రమును పొందెను.
పరిపూర్ణభక్తిలో అహం కాలిపోతేనే గానీ తత్త్వజ్ఞానం అనుభవమవ్వదు
ఈ అహంకారమన్నది నీటిలో తేలు మంచుగడ్డ వంటిది. మంచుగడ్డ నీరు ఒకటే అయినను మంచుగడ్డకున్న భౌతికరూపం వలన నీటినుండి తాత్కాలికంగా వేరగుచున్నది. అహంకారం వలన మనకొక స్వభావమేర్పడును. స్వభావం వలన కోపతాపాదులు మమకార బంధాలు ఏర్పడుచున్నవి. తత్ఫలితంగా సమస్త కర్మలు...బంధనాలు. ఎవరికైనను పనులు తాము చేయుచున్నామను అహంకారమే అజ్ఞానం. దే మాయ. దే బంధనం. పరమేశ్వరుని అనుగ్రహం వలననే సమస్తం జరుగుచున్నదని తెలియుటే అహంకార నిర్మూలనం. 
పై మూడు స్థాయిలు తపోసాధనలో అధిగమించి నాల్గవ స్థాయికి చేరడానికి చేసే సాధనలో జరిగే సంఘర్షణ, మనస్సు చేసే కల్లోలములు మాటల్లో కుదించలేం. అంత తీవ్రంగా సంఘర్షణ ఉంటుంది. ఈ 
మనస్సు చేసే రొద సాధనకు అడ్డంకమని అర్ధమై మనస్సుని నిర్వీర్యపరచాలని , సంకల్పం ధనస్సుతో సాధనశక్తి అస్త్రమును సంధిస్తాడు. ఇక్కడ ఈశ్వరానుగ్రహంతో మనస్సును జయిస్తాడు. కానీ ఇంకా వీడని అహంకారం...'నేనే', నా సాధనతో జయించాననే అహంకారదర్పం. కరుణాంతరంగని కృపచే,
ఆ దర్పమూ దమించి, శుద్ధ సాత్త్వికంతో చిత్తశుద్ధి పొంది తద్వారా నాడీమండలం శుద్ధమై కుండలిని జాగృతి అయిన స్థితి యిది. హృదయగ్రంధి విచ్ఛేదమే జ్ఞానం. మనస్సు నశించే సాధనే యోగం.
'అహం బ్రహ్మాస్మి' అని చక్కగా తెలుసుకున్న స్థితి. ఇలా స్వాత్మ యందు నిలకడ పొందడమే 'సత్త్వాపత్తి'. ఇది సాధకుని నాల్గవ స్థితి.
అటు పిమ్మట అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి. ఈ స్థితిలో కూడా సాధకునికి పరీక్షలు తప్పవు.
ఇంద్రాది దేవతలు జీవునికింకను సుఖములయందు వ్యామోహం వుందా అని పరీక్షిస్తారు. ఇక్కడ కూడా సాధనాశక్తితో స్థిరుడై సాగిపోవాలి. అప్పుడే సాధకుని జీవప్రజ్ఞకున్న పరిమితి తొలగిపోతుంది. తాను వేరన్న భావం నశించి సమస్తముతోను ఒకటియై ఉండును.
పై నాలుగుస్థాయిల అభ్యాసంచే సత్యరూఢస్థితిని పొంది,అనాసక్తితో, తటస్థ దృష్టితో, సత్యద్రష్టుడై విషయవాసనా రహితమగు అసంగస్థితియందు యుండుటయే 'అసంసక్తి'. ఇది సాధకుని  ఐదవ స్థితి.
ఈ స్థాయికి చేరిన సాధకుడు, కర్మ సంస్కారములు పూర్తిగా భస్మమైపోయేంతవరకు శరీరంతో ఉండాలి కాబట్టి తిరిగి జనవాసంలోనికి వచ్చి సాటివారికై శ్రమిస్తూ అందరి పరిపూర్ణతకు ప్రయత్నిస్తాడు. 
సత్యదర్శనం పొంది, సమాధిస్థితికి చేరిన సాధకుడు, సంకల్పమాత్రంచేత ఆ స్థాయినుండి క్రిందకు వచ్చి ఇతరులకు మేలు చేయునట్టి స్థితి 'పదార్ధభావన'. 
(ఈ స్థాయికి చేరినా సాధకునికి, ఎన్నో సమాధానాలు దొరికినా, ఎంతో ఆధ్యాత్మిక పురోగతి సాధించిన కొన్ని సందేహాలు మిగిలి వుంటాయని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తుంటారు) ఇది సాధకుని ఆరవస్థాయి.

సప్తజ్ఞానభూమికలలో అర్జునుడు అనే సాధకుడు సాధించిన ఆరుస్థాయిల యోగసాధన కధనమే ఈ "కిరాతార్జునీయం". 


ఇప్పుడు మనకో సందేహం రావచ్చు. మరి జ్ఞానభూమికలో సప్తమస్థాయికి అర్జునుడు సాధించలేదా అని.
సాధించాడు..... ఎప్పుడు?
                                


కురుక్షేత్రమున యుద్ధారంభమునకు కాస్త ముందు. కృష్ణభగవానుడు అర్జునునకు గీతను ఉపదేశించి అతని సంశయములను తీర్చి జ్ఞానమును సంపూర్ణంగా అందించి శోకమోహములనుండి ఉద్ధరించాక ఏడవస్థాయిని సాధించెను.

కేవలం ఆత్మనిష్ఠలో అంటే జీవన్ముక్తస్థితిలో వుంటూ శేషజీవితాన్ని గడపడం. వీరికి సుఖదుఃఖాలుండవు. ప్రాప్తించిన కార్యములను అసంగత్వభావంతో చేస్తూ ముక్తులై యుందురు. ఇది 'తుర్యగ'స్థితి.ఇది సాధకుని సప్తమస్థితి.


                          🔱 ఓం నమః శివాయ 🔱

కిరాతార్జునీయం - అంతరార్ధం

ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తే కిరాతార్జునీయం ఓ యోగసాధన. అది పరిశీలన చేసేముందు ఓసారి ఆ కధను తెలుసుకుందాం -
అరణ్యవాసం చేస్తున్న పాండవులను చూడడానికి వచ్చిన కృష్ణభగవానున్ని, ఈ కష్టకాలమునుండి ఎలా బయటపడతామని ధర్మరాజు ప్రశ్నించగా -
                                 
                           
కృష్ణభగవానుడు,
"ఎవరు మంగళం లన్నింటికీ కూడ అలవాలమో, ఎవరి అనుగ్రహం శుభాల్ని యిస్తుందో, ఎవరు ఆశీర్వాదిస్తే శ్రేయస్సు కల్గుతుందో, ఆ దయాళువయిన శివుడు గురించి తపస్సు చేయ"మని చెప్పెను.   

అటుపిమ్మట ఓసారి, 'వైరిబలం కంటే అధికబలం సంపాదించాలంటే శివకటాక్షం వుండాలనీ, అర్జునుడిని తపస్సు చేసి శివానుగ్రహంతో పాటు పాశుపతాస్త్రం పొందమనే వేదవ్యాసమునీంద్రులవారి సూచనతో, అర్జునుడు న అన్న అనుజ్ఞతో ఇంద్రకీలాద్రికేగి, తపస్సు ప్రారంభించెను.
                              

కొన్ని సంవత్సరాల తపస్సు పిమ్మట వృద్దబ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు వచ్చి, 'దేనికి తపస్సు చేస్తున్నావయ్యా' అని అడుగగా, శివునికై చేస్తున్నాను, నాకు పాశుపతాస్త్రం కావాలి అని అర్జునుడు చెప్పగా, మహాజ్ఞాని కృపాళువు అయిన శంకరుని అనుగ్రహం కల్గితే మోక్షమడగాలి గానీ, యుద్ధాలు, గెలుపోటములు,  గొడవలు లేని పరమపదం కోరకుండా, యుద్ధంలో వాడుకోవడానికి అస్త్రం అడుగుతావా ... అమాయకుడా అని ఇంద్రుడు అనగా, మా అన్నగారు శివానుగ్రహం పొంది పాశుపతాస్త్రం తెమ్మని చెప్పిరి. వారి మాట నాకు ఆచరణీయం. మధ్యలో వచ్చి సలహాలు ఇవ్వక, ఇక్కడనుండి వెళ్ళండి అని అర్జునుడు అనగా, అంతట నిజరూపంలో ఇంద్రుడు సాక్షాత్కరించి అర్జునుని క్షాత్రధర్మమును మెచ్చి, 
ఇకనుంచి పంచాక్షరి మంత్రంతో పార్ధివలింగమును పూజిస్తూ తపస్సు చేయమని చెప్పగా, ఆ ప్రకారంగా అర్జునుడు కఠోర తపానికై పూనుకున్నాడు. 
                     
                         
తపోదీక్ష పూనడంలో పాండవమధ్యముడి పట్టుదల అసామాన్యం, అప్రతిమానం. 
దినములు మాసములై, మాసములు సంవత్సరములై, తపోనిష్ఠలో సవ్యసాచి సడలక సాగిపోతుండగా, మెచ్చిన శివుడు కాస్త అర్జునుని శక్తిని పరీక్షించదలచి,  ముకాసురుడు అనే రాక్షసుడిని పిలిచి "నీవు అడవిపందిగా మారి అర్జునుడు తపస్సు చేసుకుంటున్న చోటుకి వెళ్ళి పెద్దగా రొద చేయమ"ని చెప్పగా, 
                         
                         
ఆ రాక్షసుడు పంది రూపమున వెళ్ళి పెద్దగా రొద చేస్తుంటే, ఆ చప్పుడుకి కళ్ళు తెరిచిన అర్జునుడు, వీడెవడో రాక్షసుడు అయి వుంటాడని తలచి, రాక్షసుడుని సంహరించ దలచి, ధనస్సు అందుకొని బాణం సంధించగా, 
తత్ క్షణమునే కిరాతక రూపధారి అయిన శివుడు సంధించిన బాణం పంది పృష్టభాగం నుండి శరీరం లోనికి వెళ్ళి దాని నోట్లోంచి బయటకు వచ్చి నేలపడగా, మరుక్షణంలో అర్జునుని బాణం పంది నోట్లోంచి శరీరంలోనికి వెళ్ళి పృష్టభాగం నుంచి వెలుపలికి వచ్చి నేలపై పడింది. అప్పుడు కిరాతకులుగా వచ్చిన ప్రమధగణములు మా నాయకుడు వేసిన బాణమిది, మా నాయకుడే పందిని చంపెను అని అనగా, 
లేదు లేదు, నేనే చంపానని అర్జునుడు... కాసేపు వాగ్వివాదం జరిగాక,  అంతటి మొనగాడు మీ నాయకుడు అయితే నాతో యుద్ధానికి రమ్మనిమని కిరీటి సవాలు చేయగా, 
                                 
                          
కిరాతకరూపంలో శివుడు, ఎరుకతగా శక్తిస్వరూపిణి పార్వతీమాత రాగా, ఏదీ యుద్ధం చేయు, చూద్దామని పలికిన అర్జునునితో యుద్ధానికి దిగెను. టంకార హుంకారలతో బాణాలు సంధించుకుంటూ పరస్పర ద్వంద్వయుద్ధం చేసుకుంటూ శివుడు అర్జునుని త్రోసి అవతల పడేయగా, కోపావేశంతో అర్జునుడు తిరిగిలేచి తన ధనస్సుతో శంకరుని జటాజూటం మీద ఒక గట్టి ప్రహారం చేసాడు. అప్పుడు శంకరుడు ఇక యుద్ధం చాలించదలచి నిజరూప దర్శనమివ్వగా,  స్థానువైన అర్జునుడు తెప్పరిల్లి, 
ఈశ్వరా! పరమేశ్వరా! నేనే చంపానన్న అహంతో నిను గుర్తించక అజ్ఞానంతో నీతో యుద్ధానికి దిగాను. ఎంతటి కృప నాపై...నాచేత దెబ్బలు తింటూ మల్లయుద్ధం చేసావా...అని విలపిస్తూ పలువిధాల స్తోత్రం చేస్తూ పాదములమీద పడగా, ఇదీ నీ పూజగానే స్వీకరించాను. నీకు ఏం కావాలో కోరుకోమని శివుడు అనగా, పరత్పరా, అజ్ఞానినై అహంతో నీపై బాణములు వేస్తే అది నీకు పూజంటవా...నీ కారుణ్యంతో నా గుండె నిండిపోయిందని మరల పరమేశ్వరుని పాదములమీద పడిన అర్జునుడుని హత్తుకొని,
                                 

నీకు పాశుపతాస్త్రమును ఇస్తున్నాను,విజయీభవ అని శివుడు ఆశీర్వదించిను.

{అష్టదిక్పాలక దేవతలు (ఈశాన్యం-ఇసాన/ఈశ్వరుడు, తూర్పు-ఇంద్రుడు, ఆగ్నేయం-అగ్నిదేవుడు, దక్షిణం-యముడు, నైఋతి-నిరుతి, పశ్చిమం-వరుణుడు, వాయువ్యం-వాయుదేవుడు, ఉత్తరం-కుబేరుడు)}.
అర్జునుడు, దిక్పాధిపతి అయిన ఈశ్వరుని అనుగ్రహంతో పాశుపతాస్త్రం పొందడం వలన మిగిలిన దిక్కుల దేవతలు ప్రసన్నులై వరుసగా ఐందాగ్ని, ఆగ్నేయము, యామ్యాగ్ని రాక్షసము, వారుణము, వాయువ్యము, కుబేరము అను శక్తాస్త్రములను ప్రసాదించిరి.  
అటుపై ఇంద్రాది దేవతలు తమ లోకమునకు అర్జునుని తీసుకెళ్ళి సకల సౌఖ్యములు కలిగింతురు. జీవునికింకను సుఖములయందు ఇంకా వ్యామోహమున్నదా అను పరీక్ష జరుగును. ఊర్వశి వరించి వచ్చిన చలించక శాపం కూడా పొందిన తొణకక అది అజ్ఞాతవాసమున వర్తించునట్లు వరముగా మార్చుకొనెను. సకల సౌఖ్యములను త్యజించి తిరిగి తన సోదరులతో కలిసి అరణ్యవాసం చేయుటకు వచ్చెను.

                    🔱ఓం నమః శివాయ🔱 


ఇక ఈకధలో అంతరార్ధం తదుపరి టపాలో -