3, సెప్టెంబర్ 2012, సోమవారం

ఆ నాలుగు ఏమిటంటే.........

మొన్న మా అమ్మాయి (అనుషా) ఓ ప్రశ్న అడిగింది. 
అమ్మా! సత్యయుగం(కృతయుగం)లో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది అని అంటారు కదా. ఆ నాలుగు పాదాలు ఏమిటమ్మా?
ఆ నాలుగు ఏమిటంటే.........
కృతే ప్రవర్తతే ధర్మశ్చతుష్పాత్తజ్జ నైర్ధ్రతః /
సత్యం దయా తపో దానమితి పాదాని భోనృప //
(ఈ శ్లోకం మహాభారతం లోనిదని జ్ఞాపకం)
కృతయుగమందు ౧.సత్యం ౨.దయ ౩.తపస్సు ౪.దానం అనునవి నాలుగు పాదములు. 
మా అమ్మాయి అడిగిన ఈ ప్రశ్నతో మరో జ్ఞాపకం నా మదిలో కదలాడుతుంది. అది -
ఓ మూడు నాలుగు సంవత్సరముల క్రితమనుకుంటాను (సరిగ్గా జ్ఞాపకం లేదు), తెలుగుచలనచిత్రరంగ ఉత్సావాలప్పుడు ప్రముఖనటుడు రాజేంద్రప్రసాద్ గారు ఇలా అన్నారు -
కృతయుగంలో మంచే తప్ప చెడు అనేదే లేదు, త్రేతాయుగంలో మంచి సముద్రానికి ఇవతల, చెడు సముద్రానికి అవతల ఉండేవి, ద్వాపరయుగంలో మంచి చెడు ఒకే కుటుంబంలో, ఒకే ఇంట ఉండగా, కలియుగంలో ఈ రెండూ ప్రతీ ఒక్కరిలో ఉన్నాయి అని! ఈ కార్యక్రమం టి.వి లో చూస్తూ 'ప్చ్..... కృతయుగంలో పుట్టిన బాగుండును, దురదృష్టం కొలది ఈ కలియుగమందు పుట్టాను కదా' అని నేను అంటుండగా, ప్రక్కనే ఉన్న మావారు  "అలా ఎందుకనుకోవడం? ఈ యుగమందైన సత్యయుగంలో ఉన్నట్లు ఉండవచ్చు. ఏ యుగమందు ఉండాలనుకుంటున్నావో ఆ యుగమునకు చెందిన ధర్మం ప్రకారం మన ప్రవర్తన మార్చుకుంటే సరిపోతుందని" అన్నారు.
నాకు అర్ధం కాలేదు మావారి మాటలు. కాస్త వివరంగా చెప్పండి అని అడగగా -
కృతయుగమందు ధర్మం - సత్యం, దయ, తపస్సు, దానం అను పాదాలపై నడిచేది. ఈ నాలుగు గుణములు కలవారు ఏ యుగమందున్నను సత్యయుగంలో ఉన్నట్లే.
త్రేతాయుగమందు ధర్మం - సత్యం లోపించి దయ, తపస్సు, దానములనెడి పాదములపై నడిచేది. ఈ మూడు గుణములు కలవారు ఏ యుగమందున్నను త్రేతాయుగంలో ఉన్నట్లే.
ద్వాపరయుగమందు ధర్మం -సత్యం, దయ లోపించి తపస్సు, దానములనెడి పాదములపై నడిచేది. ఈ  రెండు గుణములు పరిపూర్ణముగా కలవారు ఏ యుగమందున్నను ద్వాపరయుగమందు ఉన్నట్లే.
ఇక కలియుగమందు ధర్మం - సత్యం, దయ, తపస్సులు లోపించి కాస్తంత దానగుణం పైనే నడుస్తుంది. 
ఏ యుగమునందు నీవు ఉండాలనుకుంటున్నావో ఆ యుగమునకు చెందినట్లు నీ గుణసంపత్తిని పెంచుకో... 
అని వివరంగా మావారు చెప్తూ ఈ విషయాలన్నీ భారతంలో ఉంటాయి చదువు అని భారతమును నా చేతిలో పెట్టడం ఓ మధురమైన జ్ఞాపకం.

భారతంలో అనుశాసనికపర్వంలో ధర్మరాజు యుగములను గూర్చి అడిగిన ప్రశ్నకు భీష్ముడిట్లు సమాధానమిచ్చెను -
'మానవుల అంతఃకరణలను బట్టియే యుగములు మారును గానీ యుగమునుబట్టి మానవుల అంతఃకరణములు మారవు'.

17 కామెంట్‌లు:

 1. 'మానవుల అంతఃకరణలను బట్టియే యుగములు మారును గానీ యుగమునుబట్టి మానవుల అంతఃకరణములు మారవు'.
  అదే నిజం...
  మంచి పోస్టు భారతి గారూ!
  అభినందనలు...
  @శ్రీ

  రిప్లయితొలగించండి
 2. శ్రీ గారు!
  ఈ పోస్ట్ మీకు నచ్చి, మెచ్చి మీ స్పందనను తెలియజేసినందులకు ధన్యవాదములండి.

  రిప్లయితొలగించండి
 3. భారతి గారూ, నేనూ విన్నాను ఏ యుగంలో ఉన్నా మన ప్రవర్తనని ఇతర యుగాలకు అనుగుణంగా నడుచుకోవచ్చు.
  అలాంటి వారినే ఈ కాలంలో పుట్టాల్సిన వాడు కాదు అంటూ ఉంటారు.
  మీ రచనలు బాగుంటాయి ...మెరాజ్.

  రిప్లయితొలగించండి
 4. మెరాజ్ ఫాతిమా గారు!
  నా పోస్ట్స్ మీకు నచ్చుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించండి
 5. ఏ యుగ మందు గాని , యెపుడేనియు - సత్య ధర్మముల్
  పాయక జీవితాంత మొక పట్టుగ పూని చరించు వారి ని
  ర్ణాయక శక్తియే శుభ కరమ్మగు భారతి గారు! 'భక్తి సం
  ధాయక బుధ్ధి' యొక్కటియె ధర్మము సత్యము దాల్చి వెల్గెడిన్ .
  ----- సుజన-సృజన

  రిప్లయితొలగించండి
 6. 'భక్తి సంధాయక బుధ్ధి' యొక్కటియె ధర్మము సత్యము దాల్చి వెల్గెడిన్.
  ఇది యధార్ధమండి. చాలా చక్కగా చెప్పారు.
  ధన్యవాదాములండి మాస్టారు గారు!

  రిప్లయితొలగించండి
 7. చక్కటి విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.

  రిప్లయితొలగించండి
 8. ఇక మీబ్లాగు చదివితే పురాణాలలోని మంచి విషయాలన్నీ తెలుస్తాయి.మనిషి ప్రవర్తన కాలానుగుణంగా మారిపోతుంది అదే ప్రస్తుత ప్రపంచ సమస్య.మార్పు మంచి వైపుకు ఉండాలి కానీ వినాశనం వైపు దారితీయ కూడదు.

  రిప్లయితొలగించండి
 9. రవిశేఖర్ గారు!
  మీరన్నది నిజమే. మార్పు మంచి వైపుకు ఉండాలి కానీ వినాశనం వైపు దారి తీయకూడదు. చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించండి
 10. అమ్మా..
  నా స్నేహితురాలు మీ బ్లాగ్ గురించి
  చెప్తే వచ్చాను.
  ఈ పోస్ట్ నాకు బాగా నచ్చింది.
  మీకు వేవేల ధన్యవాదములు.
  మీ పోస్ట్ ఆచరణకు పురికొల్పేలా, ఇప్పటికే ఆచరిస్తున్నవారికి
  ప్రోత్సాహకరంగా ఉంది.
  రామకృష్ణ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీకు ఈ పోస్ట్ నచ్చినందుకు ఆనందంగా ఉందండి. స్మరణ బ్లాగ్ ని సందర్శించినందుకు ధన్యవాదాలండి.

   తొలగించండి
  2. ధర్మం నాలుగు పాదాల నడవడం అంటే ఏమిటో అనుకునేవాణ్ణి. మీవారు మీకు చెప్పిన విషయం మాకు అందించినందుకు ధన్యవాదాలాండి.

   తొలగించండి
 11. madam can you please post some articles about kruta yuga kings? and how there where ruling ..etc

  రిప్లయితొలగించండి
 12. ధర్మం యొక్క నాలుగు పాదాలు ఏంటని మా అబ్బాయి అడిగిన ప్రశ్నకు గూగుల్ లో ఈ పోస్టు దొరికింది ... చాలా బాగా వ్రాసారు

  రిప్లయితొలగించండి
 13. కృతయుగంలో అధర్మమే లేకుంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, వందల సంఖ్యలో ఇతర దానవులు ఎక్కడినుండి వచ్చారు? అమ్మవారు అన్ని రూపాలలో అంతమంది రాక్షసులను ఎందుకు చంపాల్సివచ్చింది? అన్ని కాలాలలో అన్ని చోట్లా మంచీ ఉన్నది, చెడూ ఉన్నది. మంచి క్రమేపీ తగ్గుతూ రావడం, చెడు క్రమేపీ పెరుగుతూ రావడం యుగధర్మాలను బట్టి జరుగుతుంది.

  రిప్లయితొలగించండి