30, ఏప్రిల్ 2012, సోమవారం

లక్ష్యం - గమనం - గమ్యం

అంతర్ముఖత్వమే లక్ష్యం. ఆత్మవిచారణే గమనం, ఆత్మసాక్షాత్కారమే పరమగమ్యం. (శ్రీ రమణమహర్షి)

జీవితం వేల సంవత్సరాల కాల పయనంలో దుమ్ము, ధూళి ఎంతో పోగుచేసుకుంది. ఆ ధూళి, దూసర కణాలు కొండలుగా పేరుకుపోయాయి. ఆ పర్వతం పేరు 'నేను' అనబడే మనస్సు. గతంలో వేల సంవత్సరాలుగా పేరుకుపోయిన ఈ మట్టి దిబ్బల బరువు మోయలేక జీవశక్తి కలవరపడుతుంది. ఆ బరువు నుండి, గతం నుండి స్వేచ్ఛ పొందడం మన జీవితానికి విముక్తి. పవిత్రత. జీవి స్వతంత్రం కావడమే జీవన లక్ష్యం. (శ్రీ దాదా)

మానవుని అంతరంగంలో దివ్యత్వం ఉంది. సచ్చిదానందం యొక్క నిప్పురవ్వ ఉంది. దైవశక్తి నిగూఢముగా ఉంది. దివ్యత్వం పట్ల దృఢవిశ్వాసంతో వ్యవహరిస్తే లక్ష్యాన్ని సాధించగలవు. గమ్యాన్ని చేరగలవు. (నాన్నగారు)

అయితే అందరికీ ముక్తి మాత్రమే లక్ష్యం కాకపోవచ్చు. వారివారి అభిమతం మేరకు వేరు వేరు లక్ష్యాలు ఉండవచ్చు. ఎవరి లక్ష్యం వారికున్నను లక్ష్యగమనం సరిగ్గా సాగించినవారే గమ్యంను చేరుకుంటారు.

మానవదేహం ఓ అద్భుతమైన యంత్రం. అందులో అనంతమైన శక్తి ఉంది. మనం మన శారీరక, మానసిక శక్తులలో చాలా కొద్దిభాగాన్నే ఉపయోగించుకుంటున్నాం. మనలో నిద్రాణమై ఉన్న పూర్ణశక్తిని జాగృతం చేయాలంటే మనకొక ప్రణాళికబద్ధమైన 'లక్ష్యం' ఉండాలి. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావలాగా గమ్యం లేకుండా సాగిపోతుంది. పుట్టాం, మరణించాం - అంతే తప్ప మానవజన్మ సార్ధకత ఏమీ ఉండదు. అందుకే ప్రతీ మనిషికి నిర్ధిష్టమైన, స్పష్టమైన లక్ష్యం కావాలి. ఒక చిన్న తాత్కాలిక అశాశ్వత ఆకాంక్ష అనేది లక్ష్యం కాదు. ఓ విశిష్టమైన, ఉన్నతమైన లక్ష్యంను ఏర్పరుచుకొని, దానిని సాధించాలన్న సంకల్పం చేసుకోవాలి. మన మానసికశక్తిని సంపూర్ణంగా ఈ లక్ష్యదిశలో ఉపయోగించి కార్యోన్ముఖులం కావాలి. 
గతంలో ఆ లక్ష్యదిశలో ముందడుగు వేసి విజయం సాధించినవార్ని మార్గదర్శులుగా తీసుకొని, వారి జీవన గమనంను అధ్యయనం చేసి స్ఫూర్తితో మన గమనం సాగించాలి. 
అన్నీ అనుకూలించినవారికి, గొప్పస్థితిలో ఉన్నవారికి, దైవానుగ్రహం ఉన్నవారికి మాత్రమే లక్ష్యసిద్ధి కలుగుతుందని, దేనికైనా పెట్టిపుట్టాలని, ప్రారబ్ధంలో ఉండాలని కొందరు వ్యాఖ్యానిస్తారు. కానీ లక్ష్యం సాధించిన గొప్పవారంతా తమ జీవిత ప్రారంభదశలోనే గొప్పవారు కాలేదు. సరైన మార్గంలో పాదం మోపి, సరైన గమనంతో ముందంజు వేస్తూ, సరైన మార్గదర్శుకుల సమక్షంలో అన్నీ నేర్చుకుంటూ, నేర్చుకున్నది ఆ దిశలో పయనిస్తున్నవారికి నేర్పుతూ, పట్టువదలని అవిశ్రాంత పరిశ్రమతో సాధన చేస్తూ, ఉన్నతస్థానంకు చేరి గొప్పవారైరి. వారు ఈ స్థితికి చేరుకోవడానికి ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ, తదేక నిశ్చల ధ్యాసతో కొన్ని ఏళ్ల సాధన చేసారన్న విషయాన్ని ముందుగా గుర్తించాలి. వారు పడిన శ్రమ, ఎదుర్కొన్న కష్టాలు, అధిగమించిన తీరు అన్నింటినీ అవగాహన చేసుకోవాలి. ప్రయత్నంలో అశ్రద్ధ పనికి రాదు. ఏదో ప్రయత్నం చేస్తున్నాం, మా ప్రారబ్ధం బాగాలేదు అని అనుకోకూడదు. ప్రారబ్ధం దేహానికే, ప్రయత్నానికి కాదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా ప్రయత్నం ఆపక లక్ష్యగమనం సరిగ్గా సాగించగలిగినప్పుడే గమ్యం చేరుకోగలం. 'చేతిలో పనిని శ్రద్ధగా చేయండి, ప్రేమగా చేయండి, నిష్కామంగా చేయండి, నిండు మనస్సుతో అంకితభావంతో చేయండి. అదే కర్మయోగం. అదే గీతోపదేశం. అదే గమ్యానికి చేర్చే విజయపధం'. 
లక్ష్య సాధనలో ఎన్నో కష్టాలు, గమనమార్గంలో అపజయాలు, అవరోధాలు సహజం. అటువంటిస్థితిలో ఆత్మస్థైర్యంతో అడుగులు వేయాలి. సీతాదేవి, శ్రీరాముడు లాంటి అవతారపురుషులకే కష్టాలు తప్పలేదు. భగవంతుడే ప్రక్కనున్న పాండవులుకు కష్టాలు తప్పలేదు. సత్యహరిచంద్రుడు, భక్తరామదాసు లాంటి మహనీయులు కష్టపరీక్షలు  ఎదుర్కోలేదా? వారి ముందు సామాన్య మానవుడెంత? బాధ, దుఃఖం, కష్టం ... ఇవన్నీ జీవితానికి కావాల్సిన శిక్షణను ప్రసాదించి తరలిపోతాయి. ఇవి స్థిరమైనవి కావు. గెలుపుబాటలో ఓటమి ఒక సోపానంగా పనిచేస్తుంది. రాత్రి గడిచి ఉదయం రాక తప్పదు. గమ్యానికి హఠాత్తుగా చేరుకోలేం, అవిశ్రాంత కృషివలనే చేరుకోగలం. 
 
అణగదొక్కివేసే పరిస్థితుల మద్యలో వికసించి పెంపొందడమే విజయవంతమైన జీవితం. నిజమైన గొప్పతనం పైకి లేవడంలో లేదు, పడిన ప్రతీసారి పైకి దైర్యంగా లేవడంలోనే ఉంది. మన ధైర్యం, బలమే జీవనం, అధైర్యం, బలహీనతలే మరణం. (వివేకానంద)

ఉత్సాహ పూర్ణ ప్రయత్నంతో  సక్రమైన పద్ధతిలో సాధన చేస్తే లభించనిదంటూ ఏదీ ఈ జగత్తులో లేదు.(యోగవాసిష్టం)
ప్రయత్నంలో పొరపాట్లు మానవునికి సహజమే. పొరపాట్లుకు, పరాజయాలకు కృంగిపోకుండా అందుకు కారణం ఏమిటో తెలుసుకొని ఓరిమితో నిజాయితితో ప్రయత్నం కొనసాగించాలి. పట్టువదలని సాధనయే సత్ఫలితాన్ని ఇస్తుంది. చేయాల్సిన పనులు వాయిదా వేస్తూ, చివరిసమయంలో తొందరపడడం తగదు. నియమిత సమయంలో నిర్ధిష్టమైన పనిని చేయడమే కళ. మన లక్ష్య సాధనలో దృఢనిష్ఠ అవసరం. అంటే లక్ష్యసిద్ధికై మనం రూపొంచుకున్న నియమాలను నిత్యం నియమితరీతిలో  పాటించడమే నిష్ఠ.   గడిచిన ఈ దినం వెనక్కి రాదన్న వాస్తవాన్ని గుర్తించి, భూతభవిష్యాల చింతన మరచి ఈ క్షణంలో ధీరోదత్తంగా యశశ్శాలిగా పనిచేయాలి. ఏ పరిస్థితిలోనైన విద్య, వివేకం, విశ్వాసం, కష్టపడేతత్వం, నిజాయితీ, నిర్భీతి, చురుకుదనం, వ్యక్తిత్వవికాసం, క్రమశిక్షణ విడిచిపెట్టరాదు. ప్రతీ చిన్నపనిని శ్రద్ధగా చేయాలి. చిన్నపనే కదా అన్న అలసత్వం పనికిరాదు. దేనియందు ఉదాసీనత తగదు. గొప్ప పనులన్నీ చిన్నపనుల సముదాయమే. వేయి మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమౌతుంది. వేలాది పుటల గ్రంధమైన ఒక్క అక్షరంతోనే ప్రారంభమౌతుంది. మనం చేసే పనే మన వ్యక్తిత్వానికి సాక్షి.
 
ధీరులైనవారు అసాధ్యమైన అవరోధాలను ఎదుర్కొని ధైర్యంగా నిరంతర పరిశ్రమతోనూ, అపారమైన ఆత్మవిశ్వాసంతోనూ, అనంతమైన సహనంతోనూ, అన్నింటిని అధిగమించి శ్రేయశిఖరాన్ని అధిరోహిస్తారు. 
మన లక్ష్యాన్ని సంకల్పించుకొని, అందుకుతగ్గ ప్రణాళికను రూపొందించుకొని, దానిని సాధించాలనే తీవ్రమైన తపన మనకుంటే మన ప్రగతికి మనమే శిల్పులం. 29, ఏప్రిల్ 2012, ఆదివారం

నమస్కారం

భగవంతుని ముందు తలవంచి చేతులు జోడించడమంటే -
చేతులు క్రియాశక్తికి, తల బుద్ధిశక్తికి ప్రతీక. బుద్ధి, క్రియాశక్తులను భగవంతునికి అర్పించడమే నమస్కారం.

20, ఏప్రిల్ 2012, శుక్రవారం

దేనికైనా "యోగం" ఉండాలి.....

ఉదయం మాఇంటిలో పనిచేస్తున్నామే ఇల్లు ఊడుస్తూ, తన కష్టసుఖాలను చెప్పుకుంటూ చివరగా ఈ మాట అంది - "దేనికైనా యోగం ఉండాలమ్మా" అని. 
అవును....నిజమే, దేనికైనా "యోగం" ఉండాలి.
యోగం అంటే?
పుట్టిన దెల్లను గిట్టక మానదు. గిట్టినది మరల పుట్టియే తీరును. (జాతస్య హి ధ్రువో మృత్యు: ధ్రువం జన్మ మృతస్య చ) ఇది అనివార్యమగు ప్రకృతి నియమం. 
పుట్టడం, కర్మానుబంధాలలో చిక్కుకోవడం, సుఖదుఃఖాలు అనుభవించడం... మరణించడం. 
తిరిగి పుట్టడం కర్మానుబంధాలలో చిక్కుకోవడం, సుఖదుఃఖాలు అనుభవించడం... మరణించడం.
దీనికి అంతం లేదా? పునర్జన్మ లేకుండా చేసుకోలేమా?
చేసుకోగలం, అంతమనేది ఉంది.
పుట్టి నశిస్తుంది కర్మానుసారం వచ్చే భౌతికదేహమేగానీ, ఆ దేహాన్ని ఆశ్రయించుకున్న ఆత్మకాదు. కానీ జనన మరణ పరిభ్రమణానికి కారణం ఈ ఆత్మే. తన స్వస్థానమైన అతీంద్రియ, అదృశ్య, అద్భుత చైతన్యశక్తిస్వరూపాన్ని (పరమాత్మని) గుర్తించి ఆ స్వరూపంలో ఐక్యమయ్యేంతవరకు ఇలా జనన మరణ చక్రాన్ని అంటిపెట్టుకొని తాను పరిభ్రమిస్తూనే ఉంటుంది. అంటే పరమాత్మలో ఐక్యమయ్యేంతవరకు ఎవరి ఆత్మకైన పునరపి జననం, పునరపి మరణం తప్పదు. ఆత్మ పరమాత్మలో ఐక్యమవ్వడమే మోక్షం. జన్మంటూ లేని ఈ మోక్షాన్ని పొందేదుకు ఏదైనా దారి ఉందా? ఉంది - అదే 'యోగ' సాధన. 
యోగసాధన ద్వారా జననమరణచక్రాన్ని జయించి మోక్షత్వం పొందవచ్చును. 
ఐతే యోగమంటే మోక్షమా? 
కాదు, కానే కాదు. 
మరి యోగమంటే ఏమిటి?
గమ్యస్థానమైన మోక్షాన్ని పొందడానికి ఓ ముఖ్య సాధనోపకరణమే "యోగం".
యోగం అంటే కలయిక. చిత్తం ఆత్మయందు కలయికయే "యోగం".
ఆత్మానుసంధానమే "యోగం".
స్వస్వరూపస్థితి అంటే 'నేను' అని లోపల తెలియజెప్పుతున్నది ఏదైతే ఉందో, దానిని తెలుసుకొని దానియందు లయించడమే "యోగం".

యోగస్థః కురు కర్మాణి సజ్గం త్యక్త్వా ధనుంజయ 
సిద్ధ్యసిద్ధ్యోస్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే // (శ్రీమద్భగవద్గీత)
ధనుంజయా! యోగనిష్టుడవై నీ నిత్యకృత్యములను నిర్వహింపుము. కర్మలయందు సంగము, లేక ఆసక్తి వీడుము. సిద్ధించిన దానియందును, సిద్ధింపని దానియందును సమబుద్ధి కలిగియుండుటయే "యోగం". అంటే సమత్వమే "యోగం".
యోగశ్చిత్త వృత్తి నిరోధః (పతంజలి యోగసూత్రం)
అంతఃకరణ వృత్తుల నిగ్రహమే "యోగం". 
యోగమితి మన్యంతే స్థిరామింద్రియధారణమ్
ఇంద్రియములన్నియు లయించి తన స్వస్వరూపస్థితియందు స్థిరంగా నిలుచుటయే "యోగం". 
వృత్తిహీనం మనః కృత్వా క్షేత్రజ్ఞం పరమాత్మని 
ఏకీకృత్య విముచ్యతే యోగోయం ముఖ్య ఉచ్యతే //
మనస్సుయొక్క వృత్తులను నిగ్రహించి, ఆ మనస్సును ఆత్మయందు ఏకీభావం చేయుటయే ముఖ్యమైన "యోగం". 

యోగహీనం కధం జ్ఞానం మోక్షదం భవతి ధ్రువమ్   
తస్మాత్ జ్ఞానం చ ముముక్షుర్ధ్రుఢమభ్యసేత్ //
యోగం లేనిదే మోక్షదాయకమైన జ్ఞానం సిద్ధించుట కష్టం. ఈ కారణంచే ముముక్షువు అవ్వాలనుకునేవారు వీటిని తప్పకుండ అభ్యసించవలెను. 
యోగాత్సంజాయతే జ్ఞానం జ్ఞానాన్ముక్తి: ప్రజాయతే 
యోగం చేతనే శీఘ్రంగా జ్ఞానోదయమగును. జ్ఞానముచే ముక్తి సిద్ధించును.
     
ఈ విధమైన యోగసాధనవలన మనస్సు సమత్వభావనతో శుద్ధి అవుతుంది. శుద్ధైన మనస్సుతోనే భగవంతుడిని(శుద్ధ మనసై వాసుద్రష్టవ్యః) తెలుసుకోగలం. అప్పుడే ఆత్మ పరమాత్మలో సంలీనమై (తధశ్చ పరమాత్మనః సమవాయః) జననమరణములు మోక్షత్వమును పొందుతుంది.

17, ఏప్రిల్ 2012, మంగళవారం

సాధన -సాధకులు

                                                     సాధన
అంతరదృష్టితో అంతర్ముఖమై ఆంతర్యంలోనికి పయనిస్తేనే ఆత్మజ్ఞానం అలవడుతుంది. ఆత్మజ్ఞానం అలవడితేనే ఆత్మసాక్షత్కారం అవుతుంది. ఆత్మసాక్షత్కారం పొందుటకు చేసే ప్రయత్నమే "సాధన".
ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని, అనంతుడుని తెలుసుకోవాలన్న జిజ్ఞాస ప్రారంభమయ్యాక ఎన్నో సంఘర్షణలు, సందేహాలు. ఎలా పయనించాలి, ఏం చేయాలి, ఎలా సాధించగలను, ఎవర్ని ఆశ్రయించాలి.......ఓహో.... ఎన్నో ప్రశ్నలు. 
అయితే తమ తమ సంసారధర్మాలను, గృహధర్మాలను, లౌకిక భాధ్యతలన్నింటిని నిర్వర్తిస్తూ, పరమగమ్యంను చేరగోరు గృహస్థభక్తులుకు తమ దైనందికకార్యంలలో ఆధ్యాత్మిక సాధన  ఓ అంతర్భాగమై ఉండాలి.  
సాధనకు కావాల్సింది మొదటిగా మనో నియంత్రణ. వ్యవహారికంలో పూర్తి భావజాగృతిలో ఉంటూ, ప్రతీక్షణం ప్రతీ చిన్నపనిలో కూడా నాచే ఇది భగవంతుడే చేయిస్తున్నాడన్న భావనతో ఎరుకలో ఉండగలిగినప్పుడే మనోరహితస్థితి కల్గుతుంది. 
అటుపై కావాల్సింది అంతఃకరణశుద్ధి. ఇది  అలవడాలంటే అందుకు కావాల్సింది వివేకం (బ్రహ్మ సత్యం, జగత్తు మిధ్య అను సత్య దృఢ నిశ్చయజ్ఞానమే వివేకం. అనిత్యమైన ప్రపంచవిషయాలను విడిచిపెట్టి నిత్యమైన ఆత్మగురించి ఆలోచించడమే వివేకం), వైరాగ్యం (ఇహపర భోగాలపట్ల అభిలాష లేకపోవడం), శమం (మనోనిగ్రహం), దమం (చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహం), ఉపరతి (స్వధర్మానుష్టానం), తితిక్ష (శీతోష్ణ సుఖదుఃఖంలను సహించుట), శ్రద్ధ (దేనిచేత సద్వస్తువు తెలియబడునో అట్టి శాస్త్రంనందును, గురువాక్యంలందును సంపూర్ణ విశ్వాసం), సమాధానం (చిత్తంను ఏకాగ్రతలో ఉంచుట), ముముక్షత్వం (మోక్షం కావాలనే తీవ్ర కోరిక) భక్తి (స్వ స్వరూప అనుసంధానం అంటే నిదిధ్యాస), ధ్యానం (సత్యమైన ఏకవస్తువును  చింతించడం), సేవ (పరోపకారజీవనం), సమత్వం (శత్రుమిత్రులయందు, మానావమానములయందు, సుఖదుఃఖంలయందు, సర్వ పరిస్థితులయందు సమభావంతో ఉండుట), శౌచం (జ్ఞానవైరాగ్యంలనెడి మృత్తిక చేత మదిని క్షాళ నం కావించి, వాసనాత్రయంను నశింపచేసుకోవడం), దయ (దుఃఖితులయందు కృప), సజ్జనసాంగత్యం (భగవత్తత్త్వాన్ని గ్రహించే వారితో సాంగత్యం), ఋజువర్తనం (చక్కటి నడవడిక) ఏకాత్మభావన (అందరూ ఆత్మస్వరూపులే అన్న భావం) అభ్యాసం చేయాలి. ఈ అభ్యాస సమయంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, ఆనందాలు, ఆవేదనలు, సమస్యలు, సంఘర్షణలు, అనుభవాలు, అయోమయాలు..... అన్నీ ప్రాపంచిక జీవితానికి అన్వయింపబడి అగమ్యగోచరంగా, అలజడిగా అన్పించిన, ఎంతో అంతర్మధనం జరుగుతున్నా, ఇవన్నీ పారమార్ధిక జీవనంలో వైరాగ్యాన్ని, వివేకాన్ని, భక్తిని, పరమాత్మునిపై పరమప్రేమను పరిక్షించడానికి ఈశ్వరుడు పెట్టే పరిక్షలుగా భావించి సంకల్పమును చెదరనీయక, క్రుంగక, ప్రయత్నం వీడక ఫలితం ఆశించక, పయనం ఆపక, మరింత శ్రద్ధతో, పట్టుదలతో, సంయమనంతో, సమర్ధవంతంగా, ధీశాలిగా ముందుకు పోవడమే సరైన సాధన. బంగారానికి పుటం పెడితేగానీ ఆభరణం తయారుకాదు. పాత్రశుద్ధి ఉంటేగానీ పాలు కాచలేం. ఉలిదెబ్బలు పడితేగానీ విగ్రహం చేయడం కుదరదు. అలానే అనేక పరీక్షలు నెగ్గి సాధన చేస్తేగానీ అంతఃకరణ శుద్ధి కాదు. ఎవరికి వారే వారివారి సంస్కారముల ఆధారంగా సాధనామార్గంలను అనుష్టించి ఆత్మసాక్షాత్కారం కలిగేంతవరకు నిర్విరామ సాధన చేయాలి. అప్పుడే భవం నుండి భవ్యం వైపు వెళ్ళగలరు. 
                                                          సాధకులు  
త్రికరణశుద్ధిగా పై సాధనను ఆచరించినవారే సాధకులు. సదా సర్వప్రాణులను స్వాత్మ(తన ఆత్మ) యందు చూచునో, సర్వప్రాణులయందు ఆత్మను చూచునో వారే సాధకులు.  అనంతుని స్మరణ, ఆధ్యాత్మికతత్వ అవగాహన, అన్యవిషయ విస్మరణ, అనన్య చింతన, ఆత్మ విచారణ, అంతా ఆత్మయేనన్నఅచంచల భావనలను అలవర్చుకొని, అవరోధాలను అధిగమిస్తూ ఆజన్మ సాధన అహర్నిశలు చేసేవారే నిజమైన సాధకులు.  సత్కర్మలు, సదాచారణములు, సత్ శీలం , సత్ప్రవర్తన, సత్ వాక్కు, సన్మార్గం, సాత్వికాహారం, సమదృష్టి, సంయమనం, సందేహరహిత సాధన సాధకునికి అవసరం.

సత్ సంకల్పంతో, సద్గ్రంధంలు పఠనం  శ్రవణం మననం చేస్తూ,  సదా సత్యవస్తువుస్మరణ తోడుగా సద్గురువు సన్నిధిలో సాధన సక్రమంగా సాగించే సాధకునికి ఆత్మసాక్షాత్కారము సంప్రాప్తిస్తుంది. 

14, ఏప్రిల్ 2012, శనివారం

ఆలయదర్శనముల, అర్చనల ఆవశ్యకత


ఆలయము అంటే భగవంతుడిని ఓ వ్యక్తరూపంలో ప్రతిష్టించి ఆరాదించే ప్రదేశం.


సర్వాంతర్యామిఅయిన పరమాత్ముడు ఓ పరిధికి లోబడి ఓ ప్రదేశంనందే ఉంటాడా? అవతారపురుషుడు శ్రీరామచంద్రుడుచే ప్రతిష్టింపబడిన దేవాలయములు ఉన్నాయి. అలానే వసిష్ట, వ్యాస, భరద్వాజ, అగస్త్యాది మహర్షులచే ప్రతిష్టింపబడిన దేవాలయములు ఉన్నాయి. ఎందుకు వీరు దేవాలయాలు ప్రతిష్టించారు?
మనుజుల మనస్సు చంచలమై యుండు కారణముచే, మందబుద్ధి కలిగియుండుటచే, పరబ్రహ్మం సర్వవ్యాపియై ఉండినను అది అవ్యక్తమై యుండిన కారణమున దానిని జనులు గ్రహించలేరు. అందుచే జనుల హితార్ధమై భగవంతున్ని సాకారరూపంలో వ్యక్తంచేయడం జరిగింది. 
న తే రూపం న చాకారో నాయుధాని న చాస్పదమ్ 
తధాపి పురుషాకారో భక్తానాం త్వం ప్రకాశసే 
భగవంతునికి ప్రత్యేకముగా ఒక రూపంగానీ, ఒక ఆకారంగానీ, శంఖచక్రశూల డమరుకాది ఆయుధములుగానీ, వైకుంఠ కైలాసాది ప్రత్యేక స్థలములుగానీ లేనప్పటికిని భక్తవత్సలుడు అగుటచేతను పరమ కరుణాస్వరూపుడు అగుటచేతను, భక్తులయొక్క భావమును అనుసరించి రూపమును ధరించుచున్నాడు. 

సూర్యుని కిరణాలు అనంతమైన ఉష్ణశక్తిని కలిగివున్నాయి. చిన్న కాగితాన్ని ఎండలో పెడితే అది తనంతట తానుగా కాలిపోదు. కానీ ఓ కటకం ద్వారా సూర్యకిరణములను ఆ కాగితంపై కేంద్రీకరిస్తే కాలిపోతుంది. అలాగే సర్వవ్యాపి అయిన పరమాత్మ అనుగ్రహశక్తిని ఒకచోట కేంద్రీకృతం చేస్తూ నిర్మించేవే ఆలయములు. 
శివజ్ఞానం ద్విధా జ్ఞేయం సగుణం నిర్గుణం తధా
ఆదౌ సగుణమాశ్రిత్య పశ్చాన్నిర్గుణ మాచరేత్
అవ్యక్తమైన శివ స్వరూపం రెండు విధములుగా గ్రహింపదగినది. అవి సగుణ, నిర్గుణములు. మొదట సగుణోపాసన చేసిన తర్వాత తనంతటనే నిర్గుణమై పరిణమించును.

దేవుడు నిర్గుణుడు, నిరాకారుడు అని గ్రహించినను సమస్త మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ సాకారంలోను, సగుణోపాసనలోనూ భగవంతుని ఉనికిని తెలియబరుస్తూ ఆలయనిర్మాణములు చేసి, అర్చనాదుల ద్వారా భక్తిని అలవర్చుకొని క్రమేనా జ్ఞానత్వమును పొంది జనులు ముక్తులవ్వాలని ఋషులు ఇవన్నీ ఏర్పరిచిరి.
పశురాత్మా స్వతంత్రశ్చ చిన్మాత్రో మలదూషితః
సమ్మూడో నిత్యసంసారీ కించిజ్జ్నోనీశ్వరో క్రియః 
జీవుడనగా పశుప్రాయుడు, పరతంత్రుడు, కించిజ్జ్నుడు, జ్ఞానమాత్రుడు, మాయామలముతో కూడినవాడు, జ్ఞానహీనుడు, నిత్యసంసారి, మందుడు, శక్తిహీనుడు, క్రియారహితుడు, స్వల్పగుణములచే మాయాబద్దుడు. కనుక ఈశ్వరకరుణలేక జీవునికి జ్ఞానం కలుగనేరాదు. కాబట్టి ఈశ్వరపూజ అత్యావశ్యకం.
శివార్చనవిహీనో యః పశురేవ న సంశయః 
స తు సంసారచక్రేస్మిన్ అజస్రం పరివర్తతే 
ఎవరు ఈశ్వరపూజార్చనాది కర్మములు చేయలేదో, వారు నిశ్చయంగా ద్విపాదపశువే. పూజార్చనాది పుణ్యకార్యములను చేయనివారు ఈ జననమరణ సంసారచక్రమందు సర్వదా తిరుగుచుండునే గానీ మోక్షమును పొందలేరు.
దేవాలయ దర్శనములు చేస్తున్నప్పుడు, దైవ విగ్రహంలు చూస్తున్నప్పుడు, దైవార్చన జరుగుతున్నప్పుడు మనస్సు ఓ విధమైన ప్రశాంతతతో భక్తిభావంలో తాదాత్మ్యం చెందుతుంది. కాబట్టి ఇవన్నీ మహర్షులు ఏర్పరిచిరి. సాధారణంగా సాధకునికి ప్రాధమికంగా భక్తిభావం కలుగుటకు, భౌతిక ప్రాపంచిక విషయములయందు నిరంతరం ఊగిసలాడే మనస్సును కొంతసమయమైన భగవంతునియందు లగ్నం చేయుటకు, నిశ్చల ధ్యాననిష్ట కుదురుటకు ఇవి ఎంతో ప్రయోజకరం. దేవాలయనిర్మాణముల ఉద్దేశ్యం ఇదే. ఆలయదర్శనమప్పుడు అక్కడ మనం చూసే ఆరాధనామూర్తిని దైవానికి ప్రతీకగా గుర్తించి నమ్ముతాం. తద్వారా దైవభక్తి ఏర్పడి విషయవాసనలు తగ్గుతాయి. భక్తిభావములను పెంచే వాతావరణం ఆలయప్రాంగణంలో ఉండడంవలన, ఇచ్చట జరిగే జపహోమ యజ్ఞయాగాదుల వలన ఆధ్యాత్మికశక్తి నిక్షిప్తమై ఉండడంవలన మనస్సు మనవశంలో ఉంటుంది, చెడు చింతనలు తొలగిపోతాయి. పవిత్రభావన, సత్వబుద్ధి, చిత్తశుద్ధి ఏర్పడతాయి.
ఆధ్యాత్మోన్నతికి, ఆత్మసాక్షాత్కారస్థితి కలుగుటకు సోపానములు ఇవే. ఓ పద్దతిగా జరిగే అర్చనాదులన్నియు భక్తిభావంను కల్గించేవే. ఆధ్యాత్మికభావంను దృఢపర్చేవే. అలానే నైవేద్య నివేదనలో కూడా భక్తిని పెంచే గొప్పభావం ఉంది. నైవేద్యం పెట్టి నివేదన చేస్తున్నప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతారు -
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే 
తేన త్వదంఘ్రి కమలే భక్తిం మే యచ్చ శాశ్వతీం 
గోవిందా! నీ వస్తువులు నీకే సమర్పిస్తున్నాను. వీనితో నీ చరణకమలాలపై శాశ్వతమైన భక్తి కలుగునట్లు ప్రసాదించు.
ఈ విధమైన దర్శన, అర్చనాదుల ద్వారా పంచేద్రియములు, మనస్సు ఎలా భక్తిభావమునందు లయమౌతాయంటే -
దైవత్వమును, ఆధ్యాత్మిక వివరణత్వమును పొందుపరుస్తూ అద్భుతంగా నిర్మించబడిన ఆలయములను, దివ్యమంగళకరమగు భగవద్విగ్రహంను దర్శిస్తూ నేతేన్ద్రియములు భక్తిత్వంలో లయించును. సుగంధ ధూపవాసనలచే ఘ్రానేన్ద్రియం లయించును. ఓంకారం, గంటానాదం, శంఖారావం, మంత్రోచ్చారణలయందు కర్ణేన్ద్రియములు లీనమగును. భగవన్నామోచ్చారణల చేతను, తీర్ధాది ప్రసాదముల చేతను జిహ్వేంద్రియం లయించును. పరిమళమిళిత శీతలదాయకమగు పసుపుకుంకుమ చందనాదులచే త్వగింద్రియం శాంతంనొంది పవిత్రభావాలతో పులకరించును. పంచేంద్రియములు ఇలా ఒకే ధ్యాసతో భక్తిభావంనందు లయమైనప్పుడే మనస్సు కూడా పూర్తిగా ఏకాగ్రతతో యందు లయించును.
ఇలా ఏ చోట ఇంద్రియములు, మనస్సులకు ఏకాగ్రత కలుగునో ఆ చోటే దేవాలయం.
ఇలా ఏ చోట జీవాత్మను పరమాత్మలో లయంచేసేభక్తిభావం పెరిగి ఐక్యభావం కలుగునో ఆ చోటే దేవాలయం.
పరమాత్మునియందు అచంచలనమ్మకం, భక్తిభావం, శ్రద్ధాదులు కలగడానికే ఆలయదర్శనం.
పరమాత్మతో సఖ్యత ఏర్పరుచుకున్నందుకే ఆలయదర్శనం.
పరమాత్మతో జీవాత్మను అనుసంధానం చేసేదే అర్చన.
మనస్సు ఈశ్వరీయత్వంలో లయింపడానికే అర్చన.
ఆలయదర్శనములు, అర్చనలు అన్నీ అంతర్యామి అయిన అనంతుడు ఆత్మరూపియై ఆవాసమున్నచోటుని తెలుసుకోవడానికే. 
'మనస్యేకం వచస్యేకం, కర్మన్యేకం, మహాత్మనాం'. మనస్సు, మాట, క్రియా ఈ మూడు ఒకదానికి ఒకటి సంబంధం కల్గియుండాలంటే, ఆత్మజ్యోతిని దర్శించాలంటే, అంతర్గత ఆత్మశక్తిని జాగృతం చేయాలంటే ఈ అలయదర్శన, అర్చనాదులు తప్పవు. ఆధ్యాత్మికమార్గంలో పయనించే సాధకులు అన్ని ఇంద్రియాలను ప్రాపంచిక విషయాలనుండి తప్పించాలి. మనస్సును పూర్తిగా జయించాలి. ఇంద్రియాలు మనస్సు ఆధీనంలో, మనస్సు బుద్ధి ఆధీనంలో, బుద్ధి ఆత్మ ఆధీనంలో, ఆత్మ పరమాత్మ ఆధీనంలో ఉండాలి. ఇలా జరగాలంటే ప్రాధమికంగా ఈ సాధనలన్నియు ఆవశ్యకమే.
భగవంతునిరూపమును ధ్యానిస్తూ, షోడశోపచారములతో భగవంతున్ని సేవించుట ఆధ్యాత్మికసాధనలో ఓ శిక్షణ. చిల్లగింజచూర్ణంచే జలం ఎలా శుద్ధమగునో అలానే ఈ విధమైన సాధనలు వలన అంతఃకరణశుద్ధి అగును, చిత్తైకాగ్రత కలుగును, పుణ్యసంస్కారములు అలవడును. తద్వారా ప్రాపంచిక విషయములయందు విరక్తి కలిగి, వైరాగ్యం అలవడి తత్వజ్ఞానం అవగాహనై  జ్ఞానత్వం పొందడముతో ముక్తి లభించును. 

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఈశ్వరభక్తి

సర్వభూతేషు కారుణ్యం ప్రియభాషణమేవ చ /
సర్వభూతహితే శ్రద్ధా సాక్షాద్భక్తి: శివస్య తు //

సమస్తభూతములయందు కారుణ్యభావమును, అందరితో ప్రియముగా మాట్లాడుటయు, సకలప్రాణుల సౌఖ్యంకొరకు పాటుపడుటయు, సమస్తప్రాణుల యందు ప్రకాశించుచుండువాడు భగవంతుడేయని గ్రహించుటయుయే నిజమైన ఈశ్వరభక్తి.