10, జూన్ 2021, గురువారం

గంగానది - స్ధల మాహాత్మ్యం

గంగాది పుణ్యనదుల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని చెప్తుంటారు కదండీ.

ఇలా పాపం పోతే వెళ్ళి మునిగేస్తే సరిపోతుంది...పాపం పోతుంది. సులభంగా పాపాలను ప్రక్షాళన చేసుకొని తరించే సౌలభ్యముంటే ప్రత్యేక పరిహారాలు సాధనలు ఎందుకు? 

అలాగని పాపాలు పోతాయని పెద్దలు శాస్త్రాలు చెప్పే మాటలు అసత్యమని అనలేం కదా. ఇందులో ఏదో రహస్యం ఉంది.

అదేరీతిలో చేసే దుష్కర్మలవలన కలిగే పాపాలు, పుణ్యనదుల్లో స్నానాలతో పోతే, మరి కర్మఫలం అనుభవించక తప్పినట్లే కదండీ. కర్మఫలం అనుభవించక తప్పదంటారు. మరి ఈ స్నానాదుల వలన అది సాధ్యమా? కర్మఫలలు తప్పించుకోగలమా?

అందరూ తమ తమ పాపాలను పుణ్యనదుల్లో వదిలేస్తే, ఆ పాపభారాన్ని నదులు ఎలా భరిస్తున్నాయి? 

మరో సందేహం - స్థల మాహాత్మ్యం గురించి. కొన్ని చోట్ల ధ్యానం బాగా కుదురుతుందని, కొన్ని స్థలాల్లో కుదరదని అంటారు చాలామంది. నిజంగా స్థల బేధాలు,   ఉంటాయా? స్థల మహత్మ్యం ఉంటుందా?

ఇవి మిత్రురాలు పద్మగారి సందేహాలు. పూర్తిగా సమాధానాలు తెలియకున్న తెలిసినంతలో తెలిపే ప్రయత్నం - 

పుణ్యనదుల్లో స్నానం చేస్తే పాపం పోతుందన్న పెద్దల మాట అసత్యం కాదు గానీ, వారు అది మాత్రమే చెప్పలేదు. కొనసాగింపుగా చాలా చెప్పారు. 

ప్రధమమున ఇక త్రికరణశుద్ధిగా దుష్కర్మలను చేయనని సంకల్పం చెప్పుకొని, మౌనంగా దైవస్మరణతో, కేవలం ధ్యేయాకారంలో నుండి మూడుమార్లు మునకలు వేయమంటారు. మొదటిసారి మునుగుట వలన స్థూలదేహ సంబంధ మాలిన్యం, రెండవసారి మునుగుట వలన సూక్ష్మదేహా సంబంధ మాలిన్యం, మూడవసారి మునుగుట వలన కారణదేహా సంబంధ మాలిన్యాలు తొలగును. లేనిచో స్థూల శరీర మాలిన్యమే పోతుందని వారు చెప్పినది గ్రహించాలి.

తపసాకర్మాభిచైవ ప్రదానేన చ భారతా |
పునాతి పాపమ్ పురుషః పూతశ్చేన్న ప్రవర్తతే ||                                 - శాంతిపర్వం.
తపస్సు, యజ్ఞకర్మ, దానం ద్వారా మనిషి
తన పాపకర్మలని కడిగివేసుకోవచ్చుకాని అలాంటి కర్మలని మళ్ళీ చేయకూడదు.

అటులనే నదుల్లో స్నానమాచరించినప్పుడు సంకల్పం ద్వారా భావసిద్ధి పొంది, పిమ్మట శాస్త్రనిషిద్ధకర్మలు ఆచరించక, శాస్త్రవిహిత కర్మలననుష్టిస్తేనే పాపాలు తొలగుతాయి.
                      

మనోవాక్కాయ శుద్ధానాం రాజంస్తీర్ధం పదే పదే |
తధా మలినచిత్తానాం గంగాఽ పి కీకటాధికా ||

మనోవాక్కాయ శుద్ధి గలవారు గొప్ప తీర్ధస్వరూపులు. మనోవాక్కాయ కర్మలు శుద్ధంగా లేనివారు గంగలో స్నానమాచరించినను మాములు జలమున మునిగిన ఫలితమే పొందుదురు.

ఇకకర్మఫలంఎప్పుడుతప్పుతుందంటే -

"కర్మ కర్మణా నశ్యతి" కర్మ కర్మతోనే నశిస్తుంది.

పుణ్యక్షేత్రయాత్రలు, తీర్ధస్నానాలు, ఉపవాసాదివ్రతాలు, దానాలు... మొదలగు సుకర్మలు వలన కొంత పాపం తొలగుతుందన్నమాట వాస్తవమే. 
భగవత్  ధ్యానం వలన మానసిక
పాపం, భజన సంకీర్తనలతో వాచిక పాపం, ఉపాసన,  అర్చన యజ్ఞాదుల వలన శారీరకంగా చేసే పాపాలు, దానాల వలన ధనం కోసం చేసే పాపాలు పోతాయని పెద్దలు చెప్తుంటారు. సత్కర్మల వలన దుష్కర్మల ఫలితం అనుభవించకుండా కొంత తగ్గించుకోవచ్చు. అటులనే దుష్కర్మల వలన ప్రాప్తించే కష్టనష్టాలని దుఃఖాన్ని తట్టుకునేశక్తినో, ఇతరుల చేయూత ద్వారా అధిగమించే ప్రాప్తాన్నో పొందవచ్చు.

మహాత్ముల సద్గురువుల దర్శనం, వీక్షణం, అనుగ్రహం ఉన్నను, ప్రారబ్ధ పాపకర్మలు తొలగుతాయి. అందుకు ఉదాహరణలు ... శ్రీపాద శ్రీవల్లభులవారు, వెంకయ్య స్వామి, సొరకాయ స్వామి, షిర్డి సాయినాధులు, మాతా అమృతానందమయి చరితములో భక్తుల అనుభవాలే. శ్రీపాదులవారు ఓ భక్తునికైతే కలలోనే ప్రారబ్ధఫలం అనుభవించినట్లు చేసి కర్మక్షయం చేసారు. 

ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః |
ఆత్మతీర్ధం న జానన్తి కధం మోక్షః శృణు ప్రియే ||

పరమశివుడు పార్వతీదేవికుపదేశించిన శ్లోకమిది. ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగునని తీర్ధ స్నానమునకై పరుగులెత్తెడు మానవులు భ్రమకు లోబడినవారు. ఆత్మజ్ఞాన తీర్ధంలో స్నానమాచరించని వారికి మోక్షమెటుల కలుగును?
                   

ఆత్మానదీ సంయమతోయపూర్ణా సత్యహ్రదా శీలతటా దయోర్మిః |
తత్రావగాహం కురు పాండుపుత్ర న హ్యన్యధా శుద్ధ్యతి చాన్తరాత్మా ||
 
భీష్ముడు ధర్మరాజునకు చెప్పినది ఇది ... 

ఓ పాండుపుత్రా! సంయమమను జలముతో నిండినదియు, సత్యమను అగాధము కలదయు, సుశీలమను దరి కలదియు, దయయను అలలు గలదియగు ఆత్మయను నదియందు స్నానమాచరించుము. వేరు ఏ విధములగు తీర్ధములలో స్నానమాచరించినను, అంతరాత్మ శుద్ధి కాజాలదు.

అలాగని తీర్ధక్షేత్రాల దర్శనం వలన మహత్తు ఉండదని కాదు. అచ్చట అనేక మహత్ములుందురు. వారి దర్శనం వలన మనలో మార్పు రావొచ్చు. అలాంటి సత్పురుషులు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తారని సందేహం వద్దు. గతంలో పుణ్యనదుల ఒడ్డున అనేక మంది మహర్షులు తపస్సు చేసినట్లు పురాణాది గ్రంధాల ద్వారా తెలుసుకున్నాం కదా. ఆ మహర్షుల తపశ్శక్తి ఇప్పటికీ సూక్ష్మంలో ఉంటుంది. సుగంధం అద్దుకున్న వస్త్రం ఆ సుగంధాన్ని పరిసరాల్లో ఎలా వెదజల్లుతుందో మహాత్ముల తపోమహిమ శక్తి అలానే అచ్చట ప్రకాశిస్తుంది. భక్తి వైరాగ్యములతో అక్కడికి పోవు పరిశుద్ధ హృదయులు ఆ పావన ఫలమందుకోగలరు.   

ఇక నదులు పాపభారాన్ని ఎలా మోస్తున్నాయ్... 
నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు. మిత్రురాలు విశాలను అడిగాను.

నదీమతల్లులు పాప భారాన్ని మోయలేనప్పుడు, పుణ్యాత్ములు వారి వద్దకు రావాలని కోరుకుంటారట...మహాయోగులు, సాధువులు, సిద్ధపురుషులు వచ్చి ఆయా నదులలో స్నానమాచరించి నపుడు ఆ నదులు ప్రక్షాళన అవుతాయి అని విన్నాను... అని మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ చదువుతూ, 'అవునా' అని యధాలాపంగా బయటకు అన్నాను. ఏమిటి 'అవును' అని ప్రక్కనే ఉన్న మావారు అడగడం...ఈ నదీస్నానాలు గురించి చెప్తూ, ఆ నదీమతల్లులు ఈ పాపభారం ఎలా మోస్తున్నయో... అని అనగానే - 
ఆ...నేను ఎక్కడ చదివానో గుర్తులేదు గానీ, నీలాగే గంగలో స్నానమాచరిస్తున్న ఒకరికి ఇదే సందేహం వచ్చి గంగానదినే అడిగాడట... అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాపభారం ఎలా మోస్తున్నావు తల్లీ...అని. అందుకా తల్లి మందహాసంతో - 
'నాయనా! నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను' అని బదులిచ్చిందట. 
వెంటనే, అయ్యో...అన్ని పుణ్యనదులు ఇంతేకదా...పాపాలన్నీ సముద్రంలోనే 
కలిపేస్తే... ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని సముద్రాన్నే అడిగాడు...ఎలా మోస్తున్నావు... ఈ పాపభారాన్ని అని. దానికా సముద్రుడు - 
'నేనెక్కడ భరిస్తున్నాను? ఆ పాపాలను వెంటవెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాలోనికి పంపిస్తేస్తున్నాను' అని బదులిచ్చాడట. అరే ... ఎంతో తేకగా కదిలాడే మేఘాలకు ఎంత విపత్తు వచ్చింది... అని అనుకుంటూ, ఓ మేఘమాలికల్లారా ఎలా భరిస్తున్నారు... ఈ పాపభారాన్ని అని అగగా, అవి పకపకా నవ్వి - 
'మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటికప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'...అని బదులివ్వగా...ఓహో...ఆ పాపలన్నీ మన  మీద పడి మనమే అనుభవిస్తున్నామన్నమాట. కర్మఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడట...అని చదివానని చెప్పారు. 'అవునా'... అని అనుకున్నాను మరల.
              

నిజానికి మన సంస్కృతీ సంప్రదాయాలు, ఋషుల వచనాలు, గంగాప్రవాహం లాంటివి. మనోమాలిన్యాలను ఎప్పటికప్పుడు కడిగివేసి అంతరంగాన్ని పరిశుద్ధ చేయగల సమర్ధత గలవి. కానీ, మనం అది గ్రహించక గంగనే కలుషితం చేస్తున్నాం.     

ధ్యానం ఎక్కడ కుదురుతుందని శాస్త్రం చెప్తుందంటే -   

ఏకాంతే విజనే రమ్యే గుహాయాం పుణ్యభూమిషు | 
రహితే మశకైర్దంశై ర్దేవాయతనకే  పివా || సిద్ధక్షేత్రే మహాతీర్ధే ధ్యానసిద్ధిః ప్రజాయతే |
తత్ర సిద్ధాసనం బద్ద్వా ఋజుకాయస్తు || 

ఏకాంతమందును, జనశబ్దంలేని ఇంటియందును, మనోహరమగు స్థలమందును, కొండగుహ యందును, పుణ్యభూమియందును, దోమలాది వాటిచే బాధలేని చోటునను, ​దేవపూజాదులు చేయు స్థలమందును, సిద్ధ క్షేత్రమందును, పుణ్యతీర్ధ తీరమందును ధ్యానం చేయువారికి, నిర్విఘ్నముగా ధ్యానం కుదురుతుంది. ధ్యానసిద్ధి సిద్ధించును.

స్థల భేదాలుంటాయా?

మీ ఈ ప్రశ్న చూడగానే... 
శ్రీ మళయాళ స్వామివారు గుర్తుకు వచ్చారు. ఆ స్వామివారు ఈ విషయంపై కొన్ని ఘటనలను వివరిస్తూ... చక్కటి వివరణ ఇచ్చారు. వారి వివరణే ఇక్కడ తెలియజేస్తాను. 
స్థలకాలభేదములు లేనిచో పుణ్యభూమి, పుణ్యకాలం అని శాస్త్రాలలో ఎట్లు నిర్ధారించారు?
కాలమంతా ఒకేలా ఉంటే, శుభముహుర్తం దుర్ముహుర్తం, అమృతకాలం, రాహుకాలం, యమగండం ...అని జ్యోతిష్య శాస్త్రం ఎందుకు నిశ్చయిస్తుంది?
భూమి అంతటా ఒకటియే యైనను ఒక స్థలంలో శుద్ధజలం, మరియొక స్థలంలో ఉప్పునీరు, మరో చోట నీరే లేకుండుట మనం చూడుటలేదా? ఒక్కొక్క భూసారము ననుసరించి ఒక్కొక్క సస్యం, పైరు ఫలించుట మనమెరిగిన విషయమే కదా. కొన్నిచోట్ల పండ్లు మధురంగా, మరికొన్నిచోట్ల అవే పండ్లు సామాన్యంగా ఉండుట తెలిసిందే కదా. కొన్ని స్థలములలో గల జలము, ఆహారము సరిగ్గా లేనందున అచ్చట వారు రోగగ్రస్తులై యుండుట చూస్తున్నాం కదా.

శ్రీ శంకరాచార్యులవారు తన పరివార శిష్యులతో కలసి ధర్మప్రచారం చేస్తూ... దేశాటన జరుపుతూ, ఓ ప్రాంతానికి చేరిరి. అక్కడ నదిలో స్నానం చేసి కూర్చుండగా, ఒక సర్పం, ఒక కప్పకు నీడ కల్పించే దృశ్యం వారి కంట పడింది. సహజసిద్ధంగా బద్ధ శత్రువులైన పాము, కప్ప మధ్య పరస్పర మైత్రిభావమునకు కారణం ఆ స్థల  మాహాత్మ్యమేనని గ్రహించి, అది శృంగఋషి(ఋష్యశృంగ మహర్షి) తపస్సు చేసిన చోటని తెలుసుకొని, అక్కడే మొదటి మఠం నిర్మింపదలచి, శృంగేరి పీఠాన్ని స్థాపించారు.

విద్యారణ్యస్వాములవారు పూర్వాశ్రమమున మాధవాచార్యులవారుగా ఉన్నకాలమున - హరిహరరాయలు, బుక్కరాయలు కొందరితో కలసి, తుంగభద్రానది దక్షిణప్రాంతారణ్యమున వేటకై వెళ్ళిరి. అక్కడ ఒక చోట కుందేళ్ళు వేటకుక్కలను తరమడం చూసి, ఆశ్చర్యపడి ఆ విషయమును మాధవాచార్యులవారికి తెలపగా, అది సిద్ధి క్షేత్రమని, ఆ స్థల
మాహాత్మ్యం వలనే, కుందేళ్ళకు అంత శక్తి కలిగెననియు, అందుచే అక్కడ రాజధానిని నిర్మింపజేయించారని చెప్తారు. 

ఒక గ్రామ సమీపమున గల అడవిలోనికి, గొల్లపిల్లవారు ఎప్పటిలా ఆవులను మేపుకై తీసుకెళ్తూ, ఎప్పటికంటే కాస్త దూరంగా వెళ్ళిరి. అక్కడ ఓ సరోవరంతో పాటు దట్టమైన నీడగల వృక్షములు బహుళంగా ఉన్నాయి. పశువులకు నీరు త్రాగించి, ఎండ అధికంగా ఉండుటచే గోవులను ఆ వృక్షనీడలో కట్టి ఉంచి, వారూ భోజనం చేసి విశ్రమిస్తున్న సమయమున... ఆ మార్గమున వెళ్తున్న తొండను వారిలో ఒకరు కొట్టి చంపెను. అప్పుడే కాస్త దూరంలో, ఓ చెట్టునీడలో విశ్రమిస్తున్న ఒక గోపబాలుడు, అది చూసి లేచి కూర్చొని, గంభీరంగా ఇద్దరు పిల్లలను పిలిచి - అదిగో అతను అన్యాయంగా తొండను కొట్టి చంపెను. అతనిని బంధించమని చెప్పి, మిగిలిన నలుగురు పిల్లలను పిలిచి, మీరంతా చెంతన కూర్చొని, న్యాయాన్యాయములను
విచారణ చేయవలసిందిగా ఆజ్ఞాపించగా... ఆ నలుగురు ఆశీనులై, తొండను చంపిన హింసా విషయంపై ధర్మశాస్త్రచర్చలు చేసి, ఓ ప్రాణిని హింసించి చంపినందుకు మరణశిక్షే శిక్షయని తెలపడం... ఆ మొదటిబాలుడు, ఆ చెట్టు కొమ్మకు కట్టి ఉరితీయమని చెప్పడం... బంధించిన ఇద్దరూ, తొండను చంపిన బాలుడిని ఉరితీయడం...ఒకదాని వెంబడి ఒకటిగా ఇవన్నీ జరిగాయి. ఆ పిమ్మట వారు చీకటి పడుతుందని అచ్చట నుండి లేచి ముందుకు రావడం తమ మిత్రునిని ఉరివేయగా చనిపోవడం గుర్తించి, భయంతో వణికిపోతూ, బోరున ఏడుస్తూ గోవులను తోలుకొని ఊరిలోనికి వచ్చి విలపిస్తూ, జరిగింది అందరికీ చెప్పడం... ఇది విన్న గ్రామస్థులు ఈ విషయమును న్యాయాధిపతికి చెప్పడం... వెంట వెంటనే జరిగాయి. ఆ న్యాయాధిపతి ధర్మశీలుడు, సత్యవంతుడు, సూక్ష్మగ్రాహి కావడంతో, ఆ గోపబాలురందరూ అమాయకులు అని గ్రహించి, దీనికైదైన అసాధరణమైన కారణం ఉండవచ్చని తలచి, మరురోజున - ఆ పిల్లలు, పెద్దలతో కలసి ముందురోజున జరిగిన ఆ సంఘటనాస్థలికి వెళ్ళి, ఏం జరిగిందో యధాతధంగా వివరించమని చెప్పమనగా - ఆ పిల్లవారంతా పూర్వదినమున ఎచటెచట ఎవరెవరు ఎలా కూర్చున్నారో, అలా కూర్చొవడం, వెన్వెంటనే అంతవరకు ఏడుస్తున్న ఆ పిల్లవాళ్ళు గంభీరంగా మారడం మొదటివాడు రాజుగా, నలుగురు మంత్రులుగా, ఇద్దరు సేనకులుగా వ్యవహరించడం... ధర్మశాస్త్రములు పఠిస్తూ, ప్రాణహింసకు హింసయే ధర్మశాస్త్ర నిర్ణయమని, అనేక ప్రమాణములు ప్రస్తావిస్తూ, మంత్రులు మాట్లాడడం చూసి అందరూ విస్మయులైరి. అక్కడనుండి వారంతా లేవగానే, మాములుగా భయంతో వణకడం గమనించి ఆ స్థలమున ఏదైన మహిమ ఉండవచ్చని న్యాయాధిపతికి అనిపించి, అక్కడ త్రవ్వించగా... భూమియందు కొన్ని శాసన ఫలకలు, విక్రమాదిత్సుని సింహాసనం ఉచితాసనములుతో కూడిన దర్బారు కనబడెనట.

దక్షిణదేశమున పురందరమను పురమునందు దేవశర్మ అను బ్రాహ్మణుడొకరు వేదశాస్త్రముల నభ్యసించి, పంచయజ్ఞములను, అతిధిలను, మహర్షులను పూజించి అందరి అనుగ్రహం పొందినా, ఎన్నో పుణ్యకర్మలాచరించినా, మనఃశాంతిలేక దుఃఖపడుచుండెను.
కొంతకాలం పిదప అతని యింటికి శాంతచిత్తుడగు ఓ సాధువురాగా, ఆహ్వానించి, ఆదరించి, వారికి సత్కారముల నొనరించి, వినమ్రుడై, తన అశాంతి, దుఃఖముల గురించి అడిగెను. అంతటా - ఆ సాధువు, సౌపురనగరమున మిత్రవతుడను గొల్లవానిని కలువు. నీ మనస్సుకు శాంతి, తృప్తి కలుగుతుందని చెప్పగా, ఆ మాట ప్రకారం దేవశర్మ అక్కడికి వెళ్ళెను.
సౌపురనగర నదీతీరమున ఉన్న వనమున శిలాతలముపై మిత్రవతుడు కూర్చొని ఉండెను. ఆ వనమున జంతువులు జన్మసిద్ధమగు వైరం మరచి, ప్రేమతో వ్యవహరించడాన్ని వింతగా చూస్తూ, మిత్రవతున్ని చేరి నమస్కరించి, తన వివరములు వినయంగా తెలిపి, తన అశాంతి దుఃఖముల గురించి చెప్పి, దుఃఖవిమోచనం చేయమని దేవశర్మ కోరెను. ఇంతలో అచటికి ఒక మేకను పెద్దపులి తరుముకుంటూ రావడం వనంలోనికి వచ్చేసరికి భయం వీడి మేక, కడు కోపంగా భక్షింపకోరి వచ్చిన వ్యాఘ్రం శాంతంగా యూరకుండడం చూసిన దేవశర్మ ఆశ్చర్యంగా, ఇచ్చోటకి వచ్చిన తోడనే వైరం వీడి ఇలా శాంతంగా సఖ్యంగా వుండడానికి కారణమేమని అడగగా - 
ఈ వనమున బ్రహ్మదేవునిచే ప్రతిష్టింపబడిన త్ర్యంబక లింగమున్న దేవాలయం ఉంది. పూర్వము ఈ లింగమును సుకర్మయని విద్వాంసుడు ఆరాధిస్తుండెను. ఓసారి ఒక మహాత్ముడు అతిధిగా రాగా, అతనికి అతిధి పూజ చేసాక, ఆ అతిధి కేవలం ఫలహారివై ఇలా ఎందుకు భగవత్సేవ చేయుచున్నావని ప్రశ్నించగా -
అయ్యా! నాకు జ్ఞానం లేక మిగుల దుఃఖమును చెందుతున్నాను. జ్ఞానం పొందాలని తపన పడుతూ, ఎప్పటికైన ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడని విశ్వసిస్తున్నాను. మీరు నన్ను అనుగ్రహించడానికే వచ్చారేమోననిపిస్తుంది. మీరు అనుగ్రహించితిరేని ధన్యుడౌతానని అనెను. అంతటా ఆ అతిధి గీతా ద్వితీయాధ్యాయమును ఒక రాతిపై చెక్కి ఓయీ సుకర్మా! నీవు దీనిని అభ్యసింపుము. నీయభీష్టం నెరవేరునని చెప్పి, ఆశ్వీరదించి వెడలిరి. 
సుకర్మ, ఆ అతిధి చెప్పే విధంగా చేసిన కొలదికాలమునకే, అతని విచారం తొలగి, మనస్సు నైర్మల్యమును పొంది, జ్ఞానవంతులైరి. ఆ జ్ఞానవంతుడు సంచరించిన ఈ స్థలం శాంతితపోవనముగా మారడంతో ఇచ్చట అందరూ ప్రేమగా శాంతంగా ఉందురని మిత్రవతుడు తెలిపెను.
 
దీనిబట్టి మీకు అర్ధమయే ఉంటుంది...
స్థల బేధాలు, స్థల మాహాత్మ్యం ఉంటుందని. 
                 

అటులనే - మన దివ్య క్షేత్రాల స్థలపురాణాలను, అరుణాచలం గురించి శ్రీ రమణులు చెప్పినది... చదవితే, ఈ విషయం మరింత సుస్పష్టమౌతుంది.   

  
 

31, మే 2021, సోమవారం

కలడు కలండనెడువాడు కలడో లేడో...

అక్కడక్కడ అప్పుడప్పుడు వినబడే ప్రశ్నలు -


దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనిపించడు?
ఇటువంటి ప్రశ్నలు భగవంతునిపై ఆర్తితో అడిగేవారు కొందరయితే, సంసార  ఆవేదనతో అడిగేవారు కొందరు, ఇంకా ఏదో తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో అడిగేవారు మరికొందరు. నిజానికి ఈ ప్రశ్నలకు మనఋషులు, గురువులు, పెద్దలు...ఎందరో ఎన్నో విధాలుగా సమాధానం తెలిపారు. మన పురాణాలు, శాస్త్రాలు కూడా స్పష్టంగా సమాధానం తెలుపుతున్నాయి.  భాగవతంలో గజేంద్రుడు ఆర్తిగా ప్రార్ధనతో ప్రారంభించి, ఆవేదనతో "కలడు కలండనెడువాడు కలడో లేడో"...అని సందేహంతో ప్రశ్నించి, చివరికి సమర్పణాభావంతో(శరణాగతి) ఒదిగిపోయి, ఏ రీతిలో నారాయణుడిని దర్శించుకున్నాడో అందరికీ విధితమే. 

పుష్పే గంధం తిలే తైలం కాష్ఠేఽగ్నిం పయసి ఘృతం |
ఇక్షౌ గుడం తథా దేహే పశ్యా  త్మానం వివేకతః ||

పుష్పములో సుగంధం, నువ్వులలో నూనె, కట్టెలలో అగ్ని, పాలలో నెయ్యి, చెరకులో బెల్లము ఉన్నట్లుగా... దేహములో ఆత్మలా ఉన్న పరమాత్మను వివేకంతో దర్శించాలి.

మనలో పవిత్రంగా ఉన్న పరమాత్మను క్రియల్లోనే వెతకాలి. 
మనం చేసిన క్రియలచే ఎలాగున సుగంధం, నూనె, నిప్పు, నెయ్యి, బెల్లం ప్రత్యక్షముగా గోచరించునో, అలాగునే వివేకజ్ఞానంచే దేహంలో నుండు ఈశ్వరున్ని చూడగలం.  

రాయి ఒక ఉపకరణం. రాయి తనకు తానుగా శిల్పంగా మారదు. రాయిని శిల్పంగా మలచాలన్న సంకల్పం శిల్పికి రావాలి. శిల్పాన్ని నైపుణ్యంగా  చెక్కడానికి ఉలి లాంటి ఉపకరణాలు కావాలి. ఆ ఉలితో రాయిలో వ్యర్ధరాయిని తొలగిస్తూ, శిల్పాకృతికి ఉండాల్సిన రాతిని నేర్పుగా గుర్తిస్తూ, కృషితో శిల్పాన్ని వెలికి తీయాలి. అట్లే, దేహం కూడా ఓ ఉపకరణమే. దేవుణ్ణి చూడాలనే సంకల్పంతో, చిత్తశ్శుద్ధి అనే ఉపకరణంతో మనలో పేర్కొన్న అజ్ఞానం అనే వ్యర్ధాన్ని తొలగించి సాధనతో లోపలున్న దైవాన్ని గుర్తించి దర్శించాలి.

చిత్తశుద్ధి అంటే నీతి నియమాల జాబితా కాదు. చిత్తశుద్ధి అనేది మీరుండే తీరు. మీరు ఆలోచించే పద్దతి. ఇంకా మీరు ప్రవర్తించే విధానం.
                 - సద్గురు జగ్గీవాసుదేవ్
                

కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల వంటివి జయించినప్పుడే, అంతఃశుద్ధి కలుగుతుంది. అంతఃశుద్ధి లేని సాధన సత్ఫలితం ఇవ్వదు. రావణుడు, హిరణ్యకశిపుడు వంటి రాక్షసులు చేసిన సాధన ఎవరికీ సాధ్యం కాదు. కానీ; కామ క్రోధాలు జయించలేని కారణంగా, వారు పొందిన అద్భుతమైన వరాలు కూడా వారిని రక్షించలేకపోయాయి. అందుకే అంతఃశుద్ధి అనేది అత్యవసరం.  మనస్సు నిర్మలంగా ఉంటే అజ్ఞానం తొలగి నిశ్చలమైన అంతరంగమున అంతర్యామి గోచరిస్తాడు. కలుషిత మనస్సుతో చైతన్యాత్మను చూడలేం. 

శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్లు -

న తు మాం శక్యసే ద్రష్టు మనేనైవ స్వచక్షుషా | 
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ | |
     
ప్రాకృతములైన ఈ నేత్రములచేత విశ్వరూపధరుడనగు నన్ను చూచుటకు నీవు శక్తుడవు గావు. కావున అప్రాకృతమైన (దివ్య) నేత్రములిచ్చుచున్నాను. ఆ నేత్రములచే ఈశ్వరశక్తి చూడుము.

చిత్తైకాగ్రత, చిత్తశుద్ధి అనే దివ్యనేత్రాలతో పరమాత్మను చూడగలం.
సూర్యుడు సర్వత్ర సమానముగా భూమియందు ప్రకాశించుచుండినను స్వచ్ఛముకాని గోడ మట్టి రాయి మొదలగు వాటిలో ప్రతిబింబించుటలేదు.అలాగునే ఆత్మయు పరమాత్మయు సమానముగా అందరిలో వెలుగుచున్నప్పటికిని రాగద్వేష విషయాది దోషరహితమైన శుద్ధబుద్ధియందు మాత్రమే ప్రతిబింబించును. కావున చిత్తశుద్ధికై ప్రయత్నించాలి.
                   

సదా సర్వగతో ఽ ప్యాత్మా న సర్వత్రావభాసతే |
బుద్ధావేవావభాసేత స్వచ్ఛేషు ప్రతిబిమ్బవత్ ||
                                 - శ్రీ శంకర భగవద్పాదులు (ఆత్మబోధ)

ఆత్మ సర్వవ్యాపకమైనను, సర్వత్ర ప్రకాశించుట లేదు. పరిశుద్ధ దర్పణం నుండే బింబం గోచరమగులాగున, నిర్మలమైన బుద్ధి యందే ఆత్మ శోభించును.
                     

మనఋషులు, గురువులు, పెద్దలు ఏమని బదులిచ్చారో గుర్తుచేసుకుందాం ఓసారి -
ఒక భక్తుడు దైవం కోసం అన్వేషణ చేస్తూ, ప్రపంచ మంతా తిరిగాడుతుండగా, ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడగా... అప్పుడు ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది -

భక్తుడు: స్వామి! పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉంటాడు? 
మహర్షి: చిరునవ్వు నవ్వుతూ, ఒక మహా వృక్షం చూపించి, అది ఏమిటి నాయనా?
భక్తుడు: అది వృక్షం.
మహర్షి: ఓహో వృక్షమా! ఎలా వచ్చింది?
భక్తుడు: విత్తనం ద్వారా వచ్చింది స్వామీ.
మహర్షి: సరే, అక్కడ పలుగు ఉంది. తీసుకొని ఆ చెట్టు పునాది త్రవ్వు...
భక్తుడు: ఎందుకు స్వామి? మహావృక్షం కదా! త్రవ్వితే చచ్చిపోతుంది.
మహర్షి: చచ్చిపోతుంది కానీ, ఆ విత్తనం ఎలా ఉందో చూడాలని ఉంది.
భక్తుడు: అయ్యో స్వామీ! అదెలా సాధ్యం అవుతుంది? 
మహర్షి: విత్తనం నుండి చెట్టు వస్తుంది అన్నావు... విత్తనం చూడలేమా?
భక్తుడు: విత్తనమే చెట్టుగా మారింది.  చెట్టుకి విత్తనానికి తేడా లేదు. మొక్క మొలిచాక విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా స్వామీ...

మహర్షి: ఇదే నాయనా! నీ సందేహానికి సమాధానం.

విత్తనం అనేది పరమాత్మ. ఆ పరమాత్మే వృక్షం. అనగా వృక్షమనే  సృష్టి. సృష్టి వేరు, పరమాత్మ వేరు కాదు. ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు. సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము. కనిపించేదంతా పరమాత్మ మయమే.
                     


దేవుడు ఉన్నాడా - లేడా? అన్న సందేహం వచ్చిన వ్యక్తి, ఓ సద్గురువును సమీపించి,దేవుడు ఉన్నాడా? దేవుడుంటే చూపించమని వినయంగా ప్రశ్నించగా -

 
ఆ గురువు తన శిష్యుని పిలిచి, చెవిలో పంచదార కలిపిన నీరు ఒక గ్లాసుతో తెమ్మని చెప్పగా, శిష్యుడు తెచ్చాడు. అప్పుడు గురువు తనను ప్రశ్నించిన  వ్యక్తితో సంభాషించడం ప్రారంభించారు...  

గురువు: నాయనా! ఈ గ్లాసులో ఏముంది?
వ్యక్తి: మంచి నీరు.
గురువు: సరిగా చూసి చెప్పు, కేవలం మంచి నీరేనా?
వ్యక్తి: అవునండీ... కేవలం మంచి నీరే.
గురువు: అయితే, ఒకసారి త్రాగి చెప్పు.
ఆ వ్యక్తి నీటిని త్రాగాక..
గురువు: ఇప్పుడు చెప్పు, కేవలం నీరేనా?
వ్యక్తి: గురువు గారూ, ఇది పంచదార కలిపిన నీరు.
గురువు: మరి ఇందాక కేవలం మంచినీరే అని చెప్పావు. ఇప్పుడు పంచదార కలిపిన నీరని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావ్?
వ్యక్తి: ఎలా అంటే, అప్పుడు కేవలం నీటిని మాత్రమే చూసి, అందులొే కరిగి ఉన్న పంచదార కానరాక, అది కేవలం మంచినీరని పొరపడి చెప్పాను. కానీ, ఇపుడు నీటిని త్రాగాను. నీటియందలి పంచదార రుచి  అనుభవించిన మూలంగా ఇది పంచదార నీరని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.
గురువు: అంటే, అనుభవ పూర్వకంగా తప్పితే అది పంచదార నీరు అని నీవు తెలుసుకొేలేకపోయావ్ అంతేనా?
వ్యక్తి: అవునండీ.
గురువు: సరే, ఇపుడు నువ్వు త్రాగినది పంచదార నీరని ఒప్పుకున్నావు. అయితే అ నీటీలో పంచదార చూపించు.
వ్యక్తి: అది అసాద్యం కదండీ.
గురువు: ఏం ఎందుకని?
వ్యక్తి: పంచదార పూర్తిగా నీటితో కలసిపోయి ఉంది. దానిని వేరు చేసి చూపించలేం.

అపుడు ఆ గురువు "చూడునాయనా! నీవు నీటిని చూసి రుచి చూడకయే,  ఏవిదంగానైతే కేవలం మంచినీరే అని పొరపాటు పడ్డవో, అదేవిదంగా మనుష్యులు కేవలం బాహ్య ప్రపంచాన్ని చూస్తూ, వాటి సుఖాల్లో పడి దేవుడు లేనిదానిగా సృష్టిని చూస్తున్నారు. కానీ నీవు నీటిని త్రాగి, అందులోని తీపి రుచిని అనుభవ పూర్వకంగా తెలుసుకొని, అందులో పంచదార కలిసి ఉందని ఎలా గ్రహించావో, అలాగే ఎవరైతే తమ ప్రయత్నం ద్వారా దేవుని ఉనికిని తమ అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారో... వారికి దైవం ఉన్నదనే సత్యం తెలుస్తుంది. పంచదార నీరు త్రాగేవారికి తప్ప, మిగతా వారందరికీ అది మంచినీరే. దానిని త్రాగిన వాడికే దాని రుచి తెలుస్తుంది. అటులనే అనుభవించిన వారికే దేవుడున్న సత్యం తెలుస్తుంది. మిగతా వారికి అనుభవం లేక దేవుడు లేడని పలు సందేహాలుకు లోనౌతరు.

ఇంకా నీవు దేవుడుంటే చూపించమని అడిగావు కదా... ఏ విదంగానైతే నీవు, నీటితో కలసి పోయి ఉన్న పంచదారను నీటి నుండి వేరు చేసి చూపించలేవో, అదే విధముగా ఈ సృష్టంతా నిండి పోయి, సూక్ష్మాతి సుక్ష్మరూపంలో అణువణువూ వ్యాపించియున్న భగవంతుని ప్రత్యేకంగా వేరుచేసి చూపంచలేం.

సృష్టిలో ఉండే ప్రతీదీ భగవత్సరూపమే. జీవుని రూపంలో ఉండేది ఆ భగవంతుడే. రూప నామాలు ఎన్నైనా దేవుడు ఒక్కడే. వాడొక్కడే ఈ చరాచర సృష్టినంతటిని భరించి పోషించుచున్నాడు. నీవూ, నేనూ, ఈ చెట్టూ పుట్టా వాగూ వంకా అన్నీ భగవంతుని రూపాలే. కనుక దేవుని సర్వంతర్యామిగా తెలుసుకుని, ప్రపంచ సుఖాల పట్ల వ్యామెహం విడిచి దైవంపై ప్రేమ, విశ్వాసాలు కలిగి ఉండు. అర్హత పొందాక ఆ అనంతుడు అగుపిస్తాడు" అని చెప్పగా, ప్రశ్నించిన వ్యక్తి సందేహ నివృత్తి అయి ఆనందభరితుడై,  గురువుగారికి ప్రణమిల్లాడు.
                     
                    ఇదే రీతిలో ఓ విజ్ఞుడుకి పృచ్ఛకునికీ సంభాషణ సాగిందిలా -

పృచ్ఛకుడు: మీరు దేవుణ్ణి నమ్ముతారా?
విజ్ఞుడు: నమ్ముతాను.
పృ: అయితే మీకు దేవుడు కనిపిస్తాడా?
వి: నిస్సందేహంగా కనిపిస్తాడు.
పృ: సందేహస్పదంగా చూస్తూ... ఆహా! ఎప్పుడు... ఎక్కడ... ఎలా... మీకు కనిపించాడు?

స్వచ్ఛత తప్ప ఏ మాలిన్యమూ లేని పసిపాపాల చిరునవ్వుల్లో...

తనువు చిక్కి శల్యమైపోతున్నా,
నేల దున్ని పదిమంది ఆకలి తీర్చే అన్నదాతల స్వేదంలో...

జన్మభూమి ఋణం తీర్చుకొనుటకు
ప్రాణాలను సగర్వంగా అర్పించగలిగే వీర జవానుల దేశభక్తిలో...

శ్రమైక జీవన సౌందర్యానికి ఏకైక చిరునామా అయినా కార్మికుని శ్రమ ఆరాటంలో...

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హైందవ ధర్మాన్ని విడువక ఆచరణాత్మకంగా చూపే  గురువుల కర్మాచరణలో...

వేళకాని వేళ జనారణ్యంలో చిక్కుకున్న
ఆడబిడ్డను మృగాళ్ల బారిన పడకుండా, క్షేమంగా తన గూటికి చేరేందుకు సాయమందించే పుణ్యాత్ముల్లో...

తాను మరణపుటంచుల్లో ఉన్నప్పుడు,
అవయవదానం చేసి సాటి మనిషికి ప్రాణంపోసి, అమరత్వం పొందే త్యాగధనుల్లో...

ఇవ్వడమొక్కటి తప్ప, ఆశించడం తెలియని
ఈ ప్రకృతి రమణీయతలో...

ప్రకృతిలో పరోపకార్ధమై మెలిగే జీవరాశిలో...

ఈ పంచభూతాల్లో...

నాకెప్పుడూ దేవుడు కనిపిస్తూనే ఉంటాడు...
చూడాలే గానీ, మీకు కనిపిస్తాడు...అని నిర్మలంగా నవ్వుతూ విజ్ఞుడు చెప్పగా - 
పృచ్ఛకుడు నమస్కరిస్తూ, "మిత్రమా! నాకిప్పుడు నీలోనూ, నిర్మలమైన నీ చిరునవ్వులోనూ,  దేవుడు కనిపిస్తున్నాడు"... అని బదులిచ్చాడు.

చూసే దృష్టిబట్టే ఆ అనంతుని దర్శనం.

                           🕉 🕉 🕉  

తండులస్య యథా చర్మ యథా తామ్రస్య కాలిమా|
నశ్యతి క్రియయా పుత్ర పురుషస్య తథా మలః ||
జీవస్య తండులస్యేవ మలం సహజ మప్యలమ్ |
నశ్యత్యే వానసందేహః తస్మాదుద్యమవాన్భవ ||
                               - శ్రీ వసిష్ఠ మహర్షి (శ్రీయోగవాసిష్టము)        
                       
బియ్యం పుట్టునప్పుడు పొట్టు తౌడులతో కూడియుండును. రాగి చిలుముతో కూడి యుండును. దంచుటచే పొట్టు తౌడు పోయినట్లు, స్ఫుటముచే చిలుము తొలగినట్లు అనుష్టానంచే జీవుడను  శుద్ధుడగును. 
                  

పరిపూర్ణత అనేది ఆచరణ నుండి మాత్రమే వస్తుంది.
                       🕉  🕉  🕉

దేవుడు ఉంటే కష్టాలనుండి కాపాడడా? 

ఒక పండితుడు, జుట్టు బాగా పెరిగిందని క్షౌరశాలకి వెళ్ళగా, ఆ క్షురకుడు జుట్టు కత్తిరిస్తూ, పండితునితో ముచ్చటిస్తూ... 
పంతులుగారు, నాకు ఎప్పటి నుండో ఒక సందేహం...
దేవుడు ఉన్నాడా? దేవుడే ఉంటే, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు? నాతో పాటు లోకంలో, చాలామంది ఎన్నో బాధలు పడుతున్నారు. దేవుడు ఉంటే...ఇంత మంది బాధలుపడుతూ ఉంటే, చూస్తూ ఊరుకుంటాడా? వచ్చి కాపాడాలి కదా… అన్నాడు. అప్పుడు ఆ పండితుడు సరేగానీ, ఇప్పుడు నాతోపాటు మా ఇంటి వరకు వస్తావా...అని అడిగాడు. సమాధానం తెలుసుకోవాలన్న పట్టుదలతో ఉన్న క్షురకుడు సరేనని బయలుదేరాడు. అలా కొద్ది దూరం వెళ్ళాక , ఓ బజారులో గుంపులు గుంపులుగా ఉన్న జనాన్ని చూపిస్తూ, చూడు...ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు. వీరి జుట్టు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పొడుగ్గా, పొట్టిగా, చింపిరిగా ఉంది. వారందరి జుట్టు ఇలా అడ్డదిడ్డంగా ఉంటే, కత్తిరించక చూస్తూ నిల్చున్నావేమిటి... అని మందలించాడు. ఆ మాటలకు ఒకింత కోపంగా క్షురకుడు, ఏమిటండీ పంతులుగారు, జనానికి జుట్టు పెరిగితే, నేను ఊరంతా తిరిగి వీళ్ళందరి జుట్టు కత్తిరించాలా? వాళ్ళు నా దగ్గరికి వచ్చి మా జుట్టు పెరిగింది, కత్తిరించండి అని అడిగినప్పుడు కదా కత్తిరించగలను. దారిన పోయేవారిని ఆపి కత్తిరిస్తే, వాళ్ళు ఊరుకుంటారా? నన్ను తిడతారు, కొడతారు అని అన్నాడు.
అంతటా ఆ పండితుడు, ఏమయ్యా! ఈ జనాలు జుట్టు కత్తిరించుకోవాలనుకొని నీ దగ్గరికి వస్తే కదా, నీవు కత్తిరిస్తావు. అలాంటిది దేవుడు మాత్రం నీ దగ్గరికి వచ్చి నీ కష్టాలు తొలగించాలా? ఇదెక్కడి న్యాయం అని క్షురకుడుని అడిగాడు. నువ్వెలాగైతే నీ దగ్గరికి వచ్చినవారికి మాత్రమే జుట్టు కత్తిరిస్తావో, అలాగే దేవుడు కూడా అతని వద్దకెళ్లి మొర పెట్టుకుంటే, వాళ్ళ మొర ఆలకించి కాపాడుతాడు అని చెప్పాడు. అప్పుడు ఆ క్షరకుడు అయ్యా, నా సందేహం ఇప్పుడు నివృత్తి అయిందని ధన్యవాదాలు తెలిపాడు. 
                  🕉  🕉  🕉

చివరగా మన వివేకనందుని అనుభవాన్నీ మననం చేసుకుందాం. ఒకనాడు నరేంద్రుడు రామకృష్ణపరమహంసతో, నాకు దేవుణ్ణి చూపించండి... అంటాడు. ప్రశ్నలో స్పష్టత, ప్రశ్నించేవారి దృఢత గుర్తించిన రామకృష్ణపరమహంసవారు తన పాదమును మెల్లగా నరేంద్రుని ఒడిలో ఉంచగా, సమాధి స్థితికి వెళ్ళి, కొంత సమయం తర్వాత బాహ్యస్మృతికి వచ్చెను. ఆ పిమ్మట సందేహాలు లేనిస్థితికి చేరెను. అనుభవజ్ఞానము కల్గేంతవరకే సందేహాలు. 
     
         సర్వేషు రమంతే ఇతిరామః    
          
అందరిలో రమించు దివ్య చైతన్యమే శ్రీరామచంద్రుడు.

విషయానురక్తిని విడిచి, ఆత్మానందంలో మునిగి, ఆత్మారాములై తరించమన్నదే ఋషుల వాక్కు. ఇదే జన్మ సాఫల్యత రహస్యం.

12, మే 2021, బుధవారం

నామ - మంత్ర వైశిష్ట్యం

మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఇది ఒకరి ప్రశ్న. 
చింతకాయలు రాలతాయో లేదో గానీ; చింత, చింతలు రాలిపోతాయి.
ఈ ప్రశ్నే కాదు, అప్పుడప్పుడు మంత్రానికి నామానికి సంబంధించి కొన్ని కొన్ని సందేహాలు కొందరిలో...
కొందరు అడిగిన, కొన్ని సందేహాలకు సమాధానాలే ఈ టపా.

ఈ సృష్టి కొన్ని శబ్ధాల అపూర్వ కలయిక. శబ్ధమే సృష్టి యొక్క సారం, ప్రాధమిక లక్షణం. మంత్రాలంటే శక్తివంతమైన శబ్ధతరంగాలు. శరీరం స్థూలమైతే, మనస్సు సూక్ష్మం. స్థూలమైన దానికంటే, సూక్షమైన దానికే శక్తి ఎక్కువ. శారీరిక శక్తి కంటే మానసికశక్తి చాలా గొప్పది. ఈ సూక్ష్మశక్తుల జాగృతికి మంత్ర శబ్ధతరంగాలు తోడ్పడుతాయి. దీని ప్రభావం... మన సూక్ష్మగ్రంధులపైన, షట్ చక్రాలపైన సూటిగా పడి జాగృతం అవుతాయి.

'మననాత్ త్రాయతే ఇతి మంత్రః'
మననం చేయడం వల్ల మనల్ని రక్షించేది మంత్రం.
మంత్రాలు కేవలం పదాల నిర్మితాలు కాదు, శక్తికి ప్రతిరూపాలు. ఋషులు అమోఘ తపశ్శక్తితో, భగవదాదేశంతో పలికినవే మంత్రాలు. విశ్వచైతన్యం దేవుడు/దేవతగా అవతరించినప్పుడు అతి సూక్ష్మంగా కనిపించే అతీంద్రియశక్తే మంత్రం. కొన్ని అక్షరాలా ప్రత్యేక ఉచ్ఛారణే మంత్రం. ఇది బీజాక్షరాలతో కూడినది. బీజంలో ప్రాణశక్తి  దాగి వుంటుంది. ఓంకారం చేర్చి ఆయా దేవదేవతల పేర్లతో బీజాక్షరాలను (ఐం శ్రీం హ్రీం క్లీం... ఇత్యాదివి) కలిపి జపించడంవలన కలిగే ఫలితం అనంతం. మంత్రాన్ని పదే పదే స్మరించడం వలన శబ్ధంలో నుంచి శక్తి ఉద్భవించును. అరణిని మధింప అగ్ని ఎట్లు జనించునో, అట్లు బీజాక్షరాలతో కూడిన మంత్రమును పలుమార్లు జపించుటచేత శక్తి ఉద్భవించును. అప్పుడే మంత్ర సిద్ధి, దేవతా సాక్షాత్కారం అగునని పెద్దలు చెప్తుంటారు. 
అందుకు ఉదాహరణ - 
మంత్రశక్తికి మానవరూపంగా పేరుగాంచిన శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు {(1896 -1990) గోరంట్ల గ్రామం, గుంటూరుజిల్లా} పదిసంవత్సరాల వయస్సులో, శ్రీ బాలాత్రిపురసుందరి మంత్రోపదేశాన్ని స్వీకరించి, ఆరేళ్ళపాటు నిష్ఠతో అనుష్టించి, మంత్రసిద్ధిని పొందారు. శ్రీవిద్యా ఉపాసకులు, మహాభక్తులు. ఒకరోజు మంత్రజపంలో ఉండగా, ఈయనను కలవడానికి కొంతమంది వారింటికి రాగా, ఆ ఇంట్లోనుండి ఓ బాలిక బయటికిరాగా, 'మీ నాన్నగారు లేరా...అమ్మా' అని అడగగా, పూజలో ఉన్నారు, ఒకగంట తర్వాత రండని బదులిచ్చింది ఆ బాలిక. కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తులు మరల వచ్చి మాట్లాడుతూ... మధ్యలో, 'మీ పాప చాలా ముద్దుగా వుంది, ఆ ముఖంలో ఎంత  తేజస్సో' ...అని చెప్పడం... మా ఇంట్లో పిల్లలెవరూ లేరే అని, ఆ వచ్చింది తన ఆరాధ్యదేవతైన బాలాత్రిపురసుందరి అని గ్రహించారు. వీరు కటికదారిద్ర్యాన్ని అనుభవిస్తున్న రోజులవి... ఒకసారి మూడురోజులు నిరంతరంగా అమ్మమంత్రాన్ని జపిస్తూ, ఇంట్లో అన్నీ నిండుకోవడంతో మంచినీళ్ళనే నైవేద్యంగా అర్పించి, నీరసంతో సొమ్మసిల్లగా, అమ్మవారే స్వయంగా ఆయనకు అన్నం తినిపించి, "ఇకమీదట నీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాను నాయనా" అని అభయమిచ్చింది ఆ తల్లి. 
మనకి తెలియకపోవచ్చు కానీ, అక్కడక్కడ ఇలాంటి భక్తులున్నారు.

భగవంతుని స్పురణ, స్మరణ, చింతనలకు దోహదపడే ఏ కర్మ అయినా మనస్సు శుద్ధికి ఒక సాధనే. 
                     

కలి ప్రభావం ఎంత ఎక్కువగా వున్నా, దాని బారినుండి తప్పించుకునే ఉపాయం మాత్రం చాలా సులువైనది, సరళమైనది, సూక్ష్మమైనది. కలియుగ వాసులకు చక్కటి దివ్యౌషధం - భగవన్నామపానం.
                     

పూర్వం ఋషులు యోగులు మహర్షులు ఏళ్ళ తరబడి సాధనలు చేయగా పొందే స్థితిని, కలియుగంలో కేవలం భగవన్నామ స్మరణ ద్వారా పొందవచ్చు. భవసాగరాన్ని అవలీలగా దాటవచ్చు. భవరోగాలనుండి సులభంగా విముక్తులం కావొచ్చు. అయితే అందుకు నామం పట్ల అమిత విశ్వాసం వుండాలి. 
"భగవన్నామ స్మరణతో భవసాగరాన్నే దాటవచ్చు, ఆ చిన్న ఏరుని దాటలేవా"... అన్న పండితుడి మాటలు విని, రోజూ నీటిపై నడుస్తూ, సకాలంలో పండితునికి పాలుపోసే పల్లెపడుచు విశ్వాసాన్ని గమనించండి. అలానే చోఖామేళా సాధనను చూడండి -
అనాటి కట్టుబాట్లు ప్రకారం చోఖామేళా అనే భక్తునికి దేవాలయ ప్రవేశ అర్హత లేదు (అస్పృశ్యుడని). ఆ కారణంచే తన తోటలో పాండురంగడికి చిన్న గుడి నిర్మించి, మంత్రాలు రాకపోయిన నామజపంతో అర్చించేవాడు. ఆ భక్తికి మురిసి పండరీనాధుడు చోఖామేళా నివేదించిన పెరుగును ఆరగించేవాడు. ఒకరోజు ఇంటికి గోడ కడుతుండగా, ప్రమాదవశాత్తూ గోడకూలి ఇతనితో పాటు మరికొందరు కూలీలు అసువులు బాసారు. ఆ ఇటుకుల మధ్య నుండి శవాలను తీసాక, వాటిని గుర్తుపట్టడం కష్టమైంది. భక్తుడైన చోఖామేళా పార్ధివదేహాన్ని తీసి సమాధి కట్టాలనుకున్నవారికి, ఆయన శరీరాన్ని గుర్తించడం ఎలా?... అని అనుకుంటున్న సమయానికి, అక్కడకు వచ్చిన నామదేవ్ "ఏ అస్థికల నుంచి విఠలా, విఠలా అనే నామం వినిపిస్తుందో, అదే చోఖామేళా దేహం" అని చెప్పడంతో, స్థానికులు ఆ దేహాన్ని గుర్తించి సమాధి చేసారు. అస్థికలే నామ స్మరణ చేసేయంటే ఎంతటి సాధకుడో కదా. (ఈ సమాధి ఆలయంకు ఎదురుగానే ఉంది).

మంత్రాలు మనో ప్రక్షాళనకు ఉద్దేశించబడినవే. మనశ్చాంచల్యాన్ని అరికట్టడానికి, తగినశక్తి సామర్ధ్యాలను సాధించడానికి సరైన మార్గం మంత్రజపం/నామ స్మరణం . 

మనస్సు నిరంతరం ఏదో ఒకటి చింతించకుండా వుండదు. అది దాని స్వభావం.  పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది. అది ప్రకృతి నియమం. అందుకే మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడుఆలోచనలు చేరుకుంటాయి. అనేక విషయ వాసనలతో
నిండిపోతుంది. కావున నామం/ మంత్రం ద్వారా మనస్సుని తిప్పగలిగితే, అంటే అంతర్ముఖమైతే విషయ చింతన తగ్గుతుంది. 

ఎన్నో బాధ్యతలు, మరెన్నో సమస్యలు, అననుకూల పరిస్థితుల నడుమ సాగుతున్న సగటు గృహస్థులం. సంసారం సజావుగా సాగే వారికి, సంసారాన్ని త్యజించిన సాధవులకు జపధ్యానాలు గానీ, తీరికే దొరకని  మాకెలా సాధ్యమౌతుంది? 

హు.....భగవంతుని స్మరించడానికి సమయమే ఉండదు...ఇలా సమయం దొరకడం లేదని వాపోయేవారు ఒక్కసారి తమని తాము పరిశీలించుకొండి...తమ దినచర్యలో ఎంత సమయాన్ని అనవసర విషయాలకై వృధా చేస్తున్నారో గమనించండి. ఫోన్ మాట్లాడడానికి, టి.వి చూడడానికి, షికార్లు తిరగడానికి, కాలక్షేప కబుర్లుకు సమయముంటుంది కానీ, భగవన్నామ స్మరణకు మాత్రం సమయం ఉండదు కదా.
ఒకటి గుర్తించండి - గృహస్థులు రోజులో కొద్దిసమయం సాధనకు కేటాయిస్తే వచ్చే ఫలితం, రోజంతా సాధన చేసే సాధువుల ఫలితంకు సమానంగానే వుంటుంది. 'నిరంతరం భగవన్నామన్ని గానం చేసే నారదుడి కన్నా, ఉదయం నిద్ర లేస్తున్నే ఓసారి, తింటున్నప్పుడు ఓసారి, రాత్రి నిద్రపోయేటప్పుడు ఓసారి భగవన్నామన్ని స్మరించే రైతు గొప్పవాడు' అని పెద్దలు చెప్పిన కధ గుర్తు చేసుకొండి. మనస్సుంటే మార్గం వుండదా? అభ్యాసం చేస్తే ఏది సాధ్యం కాకపోదు. సంసార విధులను నిర్వర్తిస్తూ కూడా, మనస్సును భగవంతునిపై ఉంచడం అలవర్చుకోవచ్చు...ప్రయత్నించండి మరి. 
అలానే ఎక్కడో చదివిన ఓ కధను ఇక్కడ ప్రస్తావించాలని ఉంది. 
ఒక రోజు, ఓ ఆవు అడవిలో గడ్డి మేస్తుండగా, వచ్చిన పులిని చూసి పారిపోతూ, పులి బారినుండి తప్పించుకోవడానికి ఆ ఆవు ఒక నీళ్ళులేని, బాగా బురదగా ఉన్న చిన్న చెరువులో దూకేసింది. ఆ ఆవును తరుముకుంటూ వస్తున్న ఆ పులి కూడా ఆ తొందరలో బురదగా ఉన్న ఆ చెరువులో దూకేసింది. 
ఆ రెండు ఎంత ప్రయత్నించిన, ఆ నీళ్ళు లేని బురదతో ఉన్న ఆ చెరువులో నుండి బయట పడటం వాటి వల్ల కాలేదు.
ఆ పులి, ఆవు పైకి పంజా విసరాలని శతవిదాల ప్రయత్నించి విఫలమై, ఆ బురదలో నుండి తప్పించుకోలేక నిస్సహాయతతో "ఇప్పుడే నిన్ను చంపి తినేయాలని ఉంద"ని అంది కోపంగా.
అప్పుడా ఆవు, పులిని చూసి నవ్వి, ”నీకు యజమాని ఎవరైనా ఉన్నారా"? అనడిగింది.
పులి, ”ఏం మాట్లాడుతున్నావు. ఈ అడవికి యజమానిని నేనే! నాకు నేనే కదా యజమానిని” అని గర్వంగా గాండ్రించింది.
అప్పుడా ఆవు, ”నువ్వీ అడవికి రాజువే కావచ్చు. కానీ, ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకోలేని స్థితిలో ఉన్నావు కదా”అన్నది...నిదానంగా!
పులి, ”నీ పరిస్థితి అంతే కదా. నువ్వు కూడా ఈ బురదలో కూరుకుని ఉన్నావు కదా, ఆకలితో చస్తావు కదా”అన్నది.
అప్పుడా ఆవు,”నేను చావను”అన్నది నమ్మకంగా.
"ఈ అడవికి రాజునైన నేనే ఈ బురదలో కూరుకుని పోయి బయటకు రాలేక పోతున్నాను. నువ్వొక సాధుజంతువవు, బలహీనురాలివి, నీవు ఎలా బయటకు వస్తావు? నిన్ను ఎవరు రక్షిస్తారు” అన్నది పులి.
నిజమే, నన్ను నేను రక్షించుకోలేను. కానీ నా యజమాని నన్ను రక్షిస్తాడు. సూర్యాస్తమయం అవ్వడంతో, నేను ఇంటికి చేరక పోవడంతో, నన్ను వెతుక్కుంటూ వస్తాడు. నన్ను ఈ బురదనుండి పైకి లేపి నన్ను రక్షించి, మా ఇంటికి నన్ను తీసుకువెడతాడు.”అని  మెల్లగా చెప్పింది.
పులి స్థబ్దురాలై, దిగాలుపడిపోయింది.
సూర్యాస్తమయం కాగానే, ఆవు చెప్పినట్లు, దాని యజమాని వచ్చి, ఆవు దురవస్థ చూచి, ఆ బురదలో నుండి దానిని పైకి తీసి.  ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఆవు, యజమాని దయపట్ల ఎంతో కృతజ్జత మనస్సులోనే చెప్పుకుంది. ఆవు, దాని యజమాని, పులి దురవస్థకు చింతించారు. కానీ దాని దురహంకారం వారిని దానిని దగ్గరకు చేరనివ్వలేదు

దీనిని ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే - ఆవు శరణాగతి చేసినవారికి ప్రతీక. పులి సామాన్య మానవునిలో ఉన్న అహంకారపూరిత మనస్సుకు ప్రతీక. యజమాని మనం నమ్మిన భగవంతుడు.  బురద మన చుట్టూ ఉన్న ఆకర్షణలతో కూడిన మాయా ప్రపంచం. పులి ఆవును తరుముకు రావడం మన జీవిత పోరాటం అన్నమాట.
జీవిత పోరాటంలో అలసిపోయి, ఏమీ చేతకాక, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడే దైవాన్ని ప్రార్దించడం కాక, దైవం ఉన్నాడు అని ఎల్లప్పుడూ విశ్వసిస్తూ, దైవ నామస్మరణతో మనం శరణాగతి అయితే, దైవమయిన ఆ యజమాని జీవన సమరంలో మనం ఓడిపోతున్నప్పుడు,  నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు, ”నేనున్నాను” అంటూ వచ్చి మనలను పంకిలం నుండి లేవదీసి ఈ భవబంధాల నుండి విముక్తిని ప్రసాదిస్తాడు. 

ఓ కధను ఆధ్యాత్మిక కోణంలో విశ్లేషించడం బాగుంది. ఇది వ్రాసిన రచయితకు 🙏

నేను శివ భక్తురాల్ని. నిరంతరం శివ స్మరణమే. కష్టసుఖాలు సహజమని తెలుసు. కానీ ఈమధ్య బాధలసుడి...కష్టాలు చుట్టుముట్టేస్తున్నాయి. మీరు మతం మారితే, ఈ బాధలు తగ్గుతాయని కొందరు ప్రలోభపెడుతున్నారు. మనస్సు ఆశ పడుతుంది. మరోప్రక్క చిన్న గుంజాటన...ఏం చేయను... మతం మారనా? మంత్రం మార్చనా? నిజంగా నామ స్మరణముకు శక్తి ఉందంటారా?
ఈ మధ్యనే నాకు తెలిసిన ఒకామె నుండి వచ్చిన మెసేజ్ ఇది. మెసేజ్ బట్టి తను ఇబ్బందుల్లో ఉందని అర్ధమై, ఫోన్ చేసి మాట్లాడాను. కుటుంబ స్పర్ధలు, ఉమ్మడి ఆస్తుల గొడవలు, వయస్సురీత్యా బి.పి షుగర్ లాంటి బాధలు...దీనికి తోడు తన భర్తకు కరోనా.  
జీవితమన్నాక కష్టసుఖాలు సహజమేనని మీరే అన్నారు కదా. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి గానీ, ఇలా దిగులు పడడం మంచిదా? మతం మారితే కష్టాలు పోతాయా? ఆ మతంలోవారికి కష్టాలు రావా, లేవా? వారికి కరోనా రాదా? రాలేదా? బాధలో ఏదేదో ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. జవాబు మీకే దొరుకుతుంది. దైవ మంత్రం పట్ల, నామం పట్ల విశ్వాసాన్ని సడలనీయక, మరింత జపించండి. పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని విశ్వాసాన్ని సడలనీయకండి. మార్కేండేయుడిని యమపాశం నుండి తప్పించింది శివ మంత్రం కాదా? ద్రౌపదిని వస్త్రాపహరణం నుండి కాపాడింది కృష్ణ నామం కాదా? చిన్నతనంలో ఎన్ని కష్టాలు అనుభవించినా... హరి మంత్రాన్ని విడువక ప్రహ్లాదుడు, నారాయణ మంత్రంతో దృవుడు ఏ స్థితిని పొందారో గుర్తుకు తెచ్చుకొండి. వారిని మించిన కష్టాలా మనవి? మాధవుడే మానవునిగా జన్మించాక కష్టాలు ఎదుర్కోక తప్పలేదు. అలాంటిది ఎన్నో జన్మల ప్రారబ్దాలను మోస్తూ పుట్టిన మనకి కష్టాలు ఉండవా? 

ఆమె కాదు...ఆమెలా కొందరు ఇలానే భావిస్తారు. 
బాధలకు బెదిరిపోకూడదు. ​మనస్సును పరిపరి ఆలోచనలతో పరుగులు పెట్టించి వేదనను పెంచుకునేకంటే,  
బాగుచేసేందుకే బాధలొస్తున్నాయని భావిస్తే, విచారం తగ్గదా? అద్భుతమైన నగలా తయారవ్వడానికి ముందు బంగారం నిప్పులో ఎంతలా కాలిందో, ఎన్ని సమ్మెటపోట్లను భరించిందో గుర్తించండి. ఒక శిల, ఎన్ని ఉలి దెబ్బలు తిని దైవ విగ్రహంలా మారిందో ఆలోచించండి. నెగ్గి నిలబడే శక్తినిమ్మని కోరాలే గానే కృంగిపోకూడదు. 
                       

ఒకరంటారు - ఎంతలా ప్రార్ధించిన భగవంతుడు పలకడం లేదని. కానీ, వారు చేసిన ప్రార్ధన త్రికరణశుద్దిగా ఉందో, లేదో గుర్తించరు. మనస్సు చలించేవారికి, మాటిమాటికి సందేహించేవారికి, కుతర్కం చేయువారికి ఏ మంత్రమూ ఫలించదు. సాధకులకు శ్రద్ధ, విశ్వాసం ప్రధానం. యాంత్రికంగా జపం చేయకూడదు. యాంత్రికంగా చేస్తే ... మనకి , టేప్ రికార్డర్
కి తేడా ఉండదు కదా. సుందర చైతన్యానందులవారు అన్నట్లు - "పరిపూర్ణ విశ్వాసంతో కదలని ప్రార్ధనలు పరమాత్మను చేరలేవు. స్పందన లేని సాధనలు ప్రతిస్పందన నెలా దర్శిస్తాయి? ఆర్తి లేని భక్తి యొక్క ఆర్తనాదమును అచ్యుతుడు ఆలకించడు".  
విశ్వాసంతో ప్రార్ధిస్తే అనుమానంతో ఎదురుచూడకండి. 

ఒకోసారి త్రికరణశుద్దిగా మంత్రజపం చేసిన, ఎంతో తపనగా నామ స్మరణం చేసినా, కొన్ని ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు. అప్పుడు మన ప్రయత్నంకంటే, ప్రారబ్ధం బలీయంగా ఉందని గ్రహించాలి. విత్తనం, వేరు కనబడకపోయినా వృక్షం, ఫలం కనిపిస్తాయి. అలాగే - కారణమైన  ప్రారబ్ధ కర్మలు గోచరించకున్నా, వాటి ఫలాలు అనుభవాలుగా వస్తాయి. ఈ కర్మ-ఫల సంధానకర్త ఈశ్వరుడు.  ప్రారబ్ధ కర్మలు అనుభవించక తప్పదు. ఇటువంటప్పుడే భగవన్నామ స్మరణ విడవకుండా ఉండి, సంపూర్ణ శరణాగతి పొందితే భగవత్ అనుగ్రహముతో అనుభవించేఖర్మనుకూడా తప్పించుకోవచ్చు, మన ప్రారబ్ధాలను చాలా వరకూ క్షయం చేసుకోవచ్చు.
                    

మహాభారత యుద్ధంలో అర్జునుడిపై వేసిన బాణాలు అఖండమైన శక్తి వంతమైనవి. కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం చేత వాటి శక్తి పూర్తిగా పని చేయలేదు.
ఒకసారి శ్రీకృష్ణుడు యుద్ధానంతరం అర్జునుని రథాన్ని దిగమని చెప్పగా, అర్జునుడు దిగుతాడు, పిమ్మట కృష్ణుడు దిగుతాడు. అప్పుడు రథం భయంకరమైన శబ్దాలతో, అతి భయంకరమైన మంటలతో కాలిపోవడం చూసి అర్జునుడు భయంతో వణికిపోతుండగా, శ్రీ కృష్ణుడు చెపుతాడు ఇలా -
"ఇంతవరకు నేను ఈ రథంలో వున్నంతకాలం, ఎవరి బాణములు ఏమి చేయలేకపోయాయి. ఇప్పుడు నేను దిగాను... వాటి పని అవి చేస్తున్నాయ"ని!
మన కర్మలు కూడా అంతే, భగవంతుడు మనయందు ఉన్నత కాలం, ప్రారబ్ధ కర్మల ఫలితములను కొంతవరకే మనల్ని తాకుతాయి, వాటిని ఎదుర్కొంటాం, పూర్తిగా అవి అనుభవంలోనికి రాకుండా దగ్ధమైపోతాయి. 
అందుకే నిత్య నామస్మరణతో, భగవంతున్ని మనలో నిలుపుకోమని పెద్దలు చెప్తుంటారు.

ఈ దేవుడు గొప్పవాడా... ఆ దేవుడు గొప్పవాడా... లేదా దేవత గొప్పదా?  భక్తి మార్గం గొప్పదా... ధ్యాన మార్గం గొప్పదా?  ఈ మంత్రమా...ఆ మంత్రమా...ఏది గొప్పది?
రాముడా... శివుడా... కృష్ణుడా... అమ్మవారా ???
                    

ఊహు...ఈ మీమాంస వద్దు. అందరూ  ఏకదైవమైన పరబ్రహ్మ వ్యక్తరూపాలే. ఏ రూపంలో కొలిచినా దేవుడు ఒక్కడే. అలానే, అన్ని మార్గాలు భగవంతున్ని చేరుకోవడం కోసం మార్గ నిర్దేశం చేసినవే. అన్ని భగవంతుని అనుగ్రహసారం వచ్చినవే. ఏది ఎక్కువా కాదు, ఏది తక్కువా కాదు. ఎవరి అర్హతకు అణుగుణముగా వారిని ఆ మార్గంలో నిలుపుతాడు. ఎవరిని ఆరాధించిన, ఏ మార్గాన్ని అనుసరించిన చివరికి అనంత హృదయవాసంలో అణగవలసిందే. 
                         

19, ఏప్రిల్ 2021, సోమవారం

సదా స్మరణీయులు | సద్గురువులు (చివరిభాగం)

శ్రీ రాఘవేంద్ర గురుతీర్ధులవారు తమ సంచారంలో భాగంగా - 

బీజాపూర్ రాజ్యంలోని ఒక గ్రామానికి చేరి అక్కడ విడిది చేయగా, బీజాపూర్ నవాబు శ్రీ రాఘవేంద్రులవారి గురించి విన్న కారణాన, అనేక కానుకలను తన తరుపున గురుతీర్ధుల వారికి అర్పించి, వారి ఆశీస్సులు సదా ఆపేక్షిస్తున్నానని తెలిపి, అర్చించి రమ్మని తన వజీరులను ఆదేశించగా... ఆ వజీరులు శ్రీ రాఘవేంద్రులవారికి నవాబుగారి తరుపున కానుకలర్పించి, వారి మాటలను విన్నవించగా, శ్రీ స్వామివారు తమ ఆశీఃపూర్వకంగా మంత్రాక్షతల నిచ్చి, "మీ ప్రభువులు మాకు పంపిన కానుకలలో అమూల్య రత్నాభరణమును మా సీతమ్మతల్లికి అర్పించామ"ని చెప్పండి అంటూ, "అగ్నిదేవా! దీనిని నీవు మా తల్లి జగన్మాత సీతామాతకు మా బదులు సమర్పించమ"ని ప్రార్ధించి, 
ఆ రత్నాభరణమును అగ్నిలో వేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నవాబుగారు, అవమానంగా భావించి కోపోద్రిక్తుడై, మరొక వజీరును పిలిచి, 'శ్రీ స్వామివారిని దర్శించి, తాము శ్రీ స్వామివారికి సమర్పించిన అమూల్య రత్నాభరణం లాంటిది మరొకటి చేయించదలచామని చెప్పి, హారం తయారయిన తదుపరి ఆ హారమును తిరిగి పంపెదమని తెలియబరచి హారమును తీసుకురమ్మ'ని పంపించెను. నవాబుగారు మనస్సును గ్రహించిన గురువర్యులు చిరునవ్వుతో, "అలాగే"నని మూలరాముని పూజించి, "అగ్నిదేవా! మేము మాతల్లి సీతమ్మ కందించమని చెప్పి మీకిచ్చిన కంఠాభరణం నవాబు గారికి కావాలట. వారు అటువంటిదే మరొకటి చేయించుకునేందుకు ఇది నమూనగా కావాలట. దయచేసి దానిని తిరిగి ఇవ్వండి, మరల వారు హారమును తిరిగి ఇస్తే సీతమ్మ తల్లికి సమర్పించుకుంటాం" అని అంటుండగా -
                     

అగ్నిదేవుడు ప్రత్యక్షమై, ఆ కంఠాభరణాన్ని ఇవ్వడం...అందరూ నిశ్చేష్టులవ్వడం... స్వామివారు "ఈ హారాన్ని మీ ప్రభువులకు అందించండి" అని, ఆ హారమును వజీరు కివ్వడం... 
జరిగింది తెలుసుకున్న నవాబుగారు తన తప్పిదాన్ని గ్రహించి, వెంటనే బయలుదేరి శ్రీ గురుదేవుల దగ్గరికి వచ్చి, 'మాలాంటి అజ్ఞానుల కళ్ళు తెరిపించడం కోసం ఈ భూమిపై పుట్టారని, తన దురహంకారాన్ని క్షమించి, కరుణించండి ఈ దాసుడిని' అని శ్రీ చరణాలకు దాసుడై, కరుణామూర్తుల కరుణకు పాత్రుడై, ధన్యులైరి ఆ నవాబుగారు.

శ్రీ రాఘవేంద్ర తీర్ధులవారు చాతుర్మాసదీక్షలో ఉండగా - ఒకనాడు శ్రీవారు క్షేత్రదేవత, కులదేవత, జగజ్జననియైన దుర్గామాతను స్తుతించ... 
                        

ఆ తల్లి ప్రత్యక్షమై, "చిరంజీవివయ్యా నువ్వు! నాటి నరశింహావతార ప్రాదుర్భవానికి కారణభూతుడవైన మహావిష్ణు భక్త శిఖామణి ప్రహ్లాద భక్తవరదా! ఏం కోరి ఈనాడు ఇంతలా మమ్ము స్మరిస్తున్నావు? నీ సర్వవాంచితములు అప్రయత్నంగా నెరవేరుతున్న తరుణంలో, నన్ను పిలిచిన కారణమేమిటయ్యా? చెప్పు నాయనా"... 
లోకమాత, వేదరూపిణి, సకలలోకపావని, సర్వసృష్టి స్థితి లయకారిణి పలుకులకు పరవశించి భక్త్యాతిశయముతో, "ఓం నమో లోకపానీ విశ్వజననీ..." అంటూ అశువుగా స్తుతించి, అమ్మా! నువ్వు లోకమాతవు, భయనివారిణి దుర్గవు... నీ దర్శనం వలన ధన్యుడనైనాను. తల్లీ! నీ కృపాదృష్టి నర్ధించనివారు ఎవరూ వుండరమ్మా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విశ్వాన్ని సవ్యంగా నడిపిస్తున్నారంటే, అది నీ చలువే కదా. అనుక్షణం అందరూ మాతృదేవోభవ అని చెప్పే శృతివాక్యం నీవే కదమ్మా. సర్వ జగత్తుకు శక్తిప్రదాతమైన నీ కరుణా కటాక్షముల నర్ధించడానికేనమ్మా పిలిచాను. "తల్లీ! నేనిక్కడ బృందావన మొందాలని తలంచాను. నన్నూ, నా భక్తులను, సర్వులను, నీ బిడ్డలుగా తలచి వరదాయినివై, మమ్ము అనుగ్రహించాలి. బృందావన మందుండి నేను సల్పు భగవల్లీలా కార్యక్రమములకు నేను భాగమైనా, నా భాగ్యమై నువ్వు నన్నీ జగత్కళ్యాణ కార్యక్రమము నిర్వహించే సర్వశక్తిగా నిలవాలి.  బిడ్డగా నేను కోరింది ఇదేనమ్మా".....అని ప్రార్ధించగా, ఆ తల్లి, నాయనా! నిస్వార్ధముగా లోకసంరక్షణా దీక్షమూర్తివై, శ్రీహరి ఆదేశంతో సాగించే నీ భక్తజన పరిరక్షణా కార్యక్రమమునకు నా ఆశీస్సులు తప్పక లభిస్తాయి. నా అభయముద్రకు చిహ్నంగా, నీ బృందావన మహాద్వారమున మేషమస్తకమును ప్రతిష్టింప చేయుము. నీ అభీష్టన్ననుగ్రహించినట్లు నేనక్కడ నిలచి సర్వభక్తులను కాపాడతాను. ఇకమీదట ఈ మంచాల సకల మంత్రసిద్ధ క్షేత్రమై మంత్రాలయమై ప్రసిద్ధి గాంచుతుంది"... అని ఆనందంగా ఆ తల్లి ఆశీర్వదించెను.


పావన తుంగభద్రానదికి అవతల ఒడ్డున శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలిశారు. ప్రతీరోజూ గురువర్యులవారు తుంగభద్రపై నడిచి శ్రీ ఆంజనేయస్వామి దర్శించి, అర్చించి వచ్చేవారు. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కూడా శ్రీ రాఘవేంద్రుల వారు తమ దివ్యశక్తితో నేలపై నడిచినట్లే నీటిపై నడిచేవారు. 
                         

తపస్సంపన్నులైన గురుతీర్ధులవారికి ఒకనాడు ఆంజనేయుడు పంచముఖుడై దర్శనమిచ్చి వరం కోరుకోమంటే, "భవిష్యత్తులో తాము బృందావన ప్రవేశం గావిస్తున్నాం గనుక, మాయందు ప్రసన్నులైన మీరు, మా బృందావనాన్ని సందర్శించే సర్వభక్తజనులకు రక్షణగా వుంటూ, కృపాసిద్ధి ప్రసాదించమ"ని ప్రార్ధించగా, శ్రీ ఆంజనేయులు... "మీ బృందావనానికి ఎదురుగా స్వయంభుడనై అవతరించి, మీ అభీష్టం ప్రకారం మీ సర్వభక్తజనులను కాచి రక్షిస్తాన"ని అభయమిచ్చారు. 

ఒకసారి ఆశ్రమంలో రాఘవేంద్రయతీంద్రులు తత్వబోధ గావిస్తున్నారు. ఉన్నట్టుండి స్వామివారు తమ ఉపనిషద్వాణిని ఆపారు. అకస్మాతుగా ఎందుకాపారో తెలియని భక్తులు కారణం తెలియక ఆతృతగా చూస్తున్నారు. స్వామివారు తలపైకెత్తి ఆకాశాన్ని చూస్తూ, లేచి నిల్చున్నారు. ఏమీ అర్ధంకాక అయోమయంగా భక్తులూ నిల్చున్నారు. కొంతసేపు పిమ్మట శిష్యుల మనోభావములు గమనించి, "నాయనలారా! ఇవన్నీ దేవరహస్యాలు. కుశుమవర్తి శ్రీకృష్ణద్వైపాయన స్వామి మహాభక్తులు, సిద్ధపురుషులు. సర్వకర్మలను నిర్వర్తించుకొని మహత్తర జీవనం గడిపిన పుణ్యపురుషులు వారు. ఆ మహాపురుషులు నేడు తమ పాంచభౌతిక దేహాన్ని విసర్జించి, దివ్యదేహంతో విమానరూఢులై, ఆ శ్రీహరి సదనానికి పయన మవుతున్నాడు. ఇది గమనించిన మేము, ఆ మహాభక్త శిఖామణులకు అభివాదం చేసి నిల్చున్నాం. అపుడే మహాత్మా! మీరు శ్రీహరిపధాన్ని చేరుకుంటున్నారు, మరి మా మాటేమిటని అడిగాం. అందుకా ఆ భక్తశిఖామణులు తమ చేతి రెండు వ్రేళ్ళను ముమ్మారు చూపారు. విషయం అర్ధం చేసుకున్న మేము కాలానికి, ఆ మహాభక్త శిఖామణులకు తలవంచి మా సజీవ బృందావన సమాధికోసం ఎదురు చూస్తున్నామన్నారు.
ఇది విన్న శిష్యవర్గం, భక్తజనం కళవళ పడ్డారు. అమ్మో, శ్రీ గురుతీర్ధుల వారు మనల్ని విడిచిపెట్టే మాట... ప్రళయ ఝుంఝూ మారుతమై ప్రతిధ్వనించిందక్కడ. శ్రీ గురుసార్వభౌములు అతిత్వరలో బృందావనాంతర్గతులవుతున్నారన్న వార్త చూస్తుండగా, దావానంలా వ్యాపించింది. ఈ వార్త విన్న దివాన్జీ వెంకన్న పంతులు క్షణాల్లో బయలుదేరి వచ్చి, స్వామి అని బావురుమన్నాడు. "దీనికెందుకింత ఆందోళన? మీ కోసమే కదా, ఈ జీవసమాధి తీసుకునేదీ, ఇలా దేహదారినై ఉంటే ఏ కొంతమందినో రక్షించే మేము బృందావన స్థితులమైతే, ఎక్కడెక్కడ వారిని... తలచిన క్షణాన తక్షణం ఆదుకోగలము అని చెప్తున్న, గురువర్యుల మాటలను అడ్డం వస్తూ... 'మీరేం చేసినా, అది మాకోసమేనంటారు. ఇది భరించదగ్గ విషయమేనా మాకోసమైనా మీరీ పని చేయడానికి వీల్లేదు'...ఆపుకోలేని దుఃఖంతో, ప్రార్ధిస్తున్న వెంకన్నను వారిస్తూ... "చూడు నాయనా! ఇహలోక దృష్టిని కనుక విడిచిపెట్టగల్గితే, ఆ ఈశ్వరశక్తి...లోకసృష్టి సర్వము అర్ధం చేసుకోగలుగుతావు. ఇది దైవ నిర్ణయం. దైవ శాసనం. డబ్బై సంవత్సరాలు మా శరీరంతో భూలోకంలో వుండాలని, ఆ తదుపరి ఏడువందల సంవత్సరాలు బృందావన స్థితులమై వుండాలని నిర్దేశించిన పరమేశ్వరాజ్ఞను మనం ధిక్కరించగలమంటావా? కనుక దైవ ఆదేశం సర్వదా శిరోధార్యం. అందుకని, ఇతర చింతనలను విడిచి, మాకు అతిత్వరలో బృందావనం ఏర్పాటు చెయ్యమని శ్రీ గురుదేవులు ఆదేశించారు. 
                       

శ్రీ  రాఘవేంద్ర గురుతీర్ధులు వెంకన్నకు ఓ శిల చూపించి, ఈ శిల శ్రీరామ లక్ష్మణులు ఏడు ఘడియలకాలం విశ్రమించిన పవిత్ర శిల కాబట్టి, ఈశిలతో మాకు బృందావనాన్ని రూపొందించమని చెప్పిరి. మనస్సును చిక్కబెట్టుకుని శ్రీ గురుతీర్ధుల ఆజ్ఞకు బద్దుడై, శ్రీ గురు అఖండనామ స్మరణం చేస్తూ, అనుకున్న విధంగా బృందావన నిర్మాణం పూర్తిచేసాడు దివాన్ వెంకన్న. శ్రీ గురుతీర్ధులు బృందావన స్థితులయ్యే సమయం దగ్గర పడుతుంది. కాలమెంత కఠినమైనది, దైవమెంత నిర్దయుడని బృందావన ప్రవేశ వార్త విన్న ప్రతి ఒకరు గుండెలవిసేలా రోదిస్తూ, కుమిలిపోతున్నారు. శ్రీరాఘవేంద్ర తీర్ధులవారు తమ ఇహలోక బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని బృందావన స్థితులు కావాలి కనుక, తమ ఉత్తర పీఠాధిపతి నియమాకానికి నిశ్చయించి, తమ పూర్వాశ్రమ సోదరులైన శ్రీగురురాజాచార్యుల వారి పౌత్రులు శ్రీ వెంకన్నాచార్యుల వార్ని ఉత్తరపీఠాధిపతిగా నిర్ణయించి, సర్వభక్తజన, వైదిక, పండిత సమక్షంలో శాస్త్రవిధిన మంత్ర, ముద్రాధారణ మూర్తులను గావించి, పీఠాధిపతిగా ప్రకటించి, 'యోగీంద్రతీర్ధులు' గా నామమొసగి, మహాపీఠ సింహాసనాన్ని అలకరింపచేసారు. 

1671వ సంవత్సరం - 
మంత్రాలయ మహిమాన్వితులు, మహాసిద్ధులు, గురుసార్వభౌములు, సకల భక్తజన హృదయాంతర్వర్తులు, జగత్కళ్యాణ కారకులు, సద్ధర్మ మూర్తులు, ధర్మ రక్షాపరులు... శ్రీ రాఘవేంద్ర గురుతీర్ధుల బృందావన ప్రవేశం -

"ప్రియభక్తులారా! శ్రీహరి ఆదేశాన్ని శిరసావహించడం మన ధర్మం. సర్వభక్తజన ప్రియంకరుడైన శ్రీహరి మాకు సజీవ బృందావన ప్రవేశాన్ని ప్రసాదించారు. ఈ బృందావనంలో మేము ఏడువందల సంవత్సరాలు నిలిచే వుంటాం. క్షీణ శరీరంతో సర్వభక్తజనులను సేవింపలేమనే ఉద్దేశంతో శ్రీహరి మాకీ దివ్యావకాశాన్ని అనుగ్రహించారు. ధర్మబద్ధంగా దీక్షాయుతంగా మీరు సలిపే సర్వ కార్యక్రమములకు మా తోడ్పాటు ఆశీస్సులు ఉంటాయి. మన జ్ఞానచక్షువులను సక్రమమార్గంలో పయనింపచేసి మనం, మనతోపాటు మన తోటివారు పావనమయ్యేటట్లు చేసుకుందాం. గురు పరంపరగా సద్గురువులు ప్రవచించిన వాటిని, ఆచరించి తరించమన్న నా అభ్యర్ధనను ప్రతిఒక్కరూ స్వీకరించి, ధన్యచరిత్రులయి తరించండి, తరింపజెయ్యండి. ఓం తత్ సత్ !!!
ఇలా సద్బోధ నొసగి శ్రీ గురు సార్వభౌములు, సర్వులను కృపాదృష్టితో చూస్తూ, బృందవన ప్రవేశం గావించారు. 
                      

జీవ సమాధిగతులైరి.
  
ఓం శ్రీ గురురాఘవేంద్రాయ నమః 

పూజ్యాయ రాఘవేంద్రాయ, సత్యధర్మరతాయచ |
భజతాం కల్పవృక్షాయ, నమతాం కామదేనవే ||