http://www.sodhini.com

31, జులై 2012, మంగళవారం

"మాటే మంత్రం"

కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్వలా 
న స్నానం నవిలేపనం నకుసుమం నాలం కృతామూర్థజా 
వాణ్యేకా నమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే 
క్షియన్తే ఖిల భూషణానిసతతం వాగ్భూషణం భూషణమ్ 

కిరీటాలు, భుజకీర్తులు, సూర్యచంద్రహారాలు, ఇతరత్ర నగలుగాని, పరిమళ భరితద్రవ్యాలతో స్నానం గాని, చందన సుగంథ వస్తువులు శరీరానికి అద్దుకోవడం వల్లగాని, సువాసనభరిత పుష్పహారాలు ధరించడం లేదా చిత్రవిచిత్ర రీతులలో కురులను దువ్వుకోవడం వల్లగాని పురుషోత్తమునికి అలంకారాలుగా అందాన్నివ్వవు. శాస్త్ర సంస్కారం చేత మధురమైనట్టి వాక్కు ఒక్కటే అతనికి గొప్ప అలంకారమై ప్రకాశిస్తుంది. 

అన్నింటి కంటే ఉత్తమజన్మ మానవజన్మ. సమస్త జీవరాశులలో మాట్లాడేశక్తి మానవునికే ఉంది. మానవుడు సంఘజీవి. అందరితో చక్కని సంబంధ భాంధవ్యాలు కలిగియుండి సామరస్యముగా ఉండడం చక్కటి సుగుణం. ఇందుకు కావాల్సింది ప్రధానంగా మృదుభాషణం.  
మనిషి యొక్క నిత్యమైన సత్యమైన వ్యక్తిత్త్వమును తెలియజెప్పేది అతని వాక్కే. అందుకే సంభాషణలో సభ్యత, సరళత, సంస్కృతి ఉండాలి. మన చుట్టూ ఉండే వాతావరణంను మన మాటలవైఖరి ద్వారానే నిర్మించుకుంటున్నాం. మన మాటలబట్టే మన చుట్టూ ఉన్నవారి ప్రవర్తన ఉంటుంది. 'ఈటెలపోటు కన్నా మాటలపోటు లోతైన గాయం చేస్తుంది'. కనుకనే పెద్దలంటారు 'నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందని'.
స్నేహంగానీ, వైరంగానీ, నిర్మలత్వంగానీ, కళంకంగానీ, పుణ్యంగానీ, పాపంగానీ, శాంతిగానీ, అశాంతిగానీ, ఔనత్యంగానీ, నీచత్వంగానీ, మంచిగానీ, చెడుగానీ అన్నీ మాటలబట్టే వస్తాయి. మాట మనస్సును నొప్పించనూ గలదు, ఒప్పించనూగలదు. 'గొడ్డలితో నరకబడిన చెట్టు మరల చిగిరిస్తుంది గానీ మాటలచే ముక్కలైన మనస్సు మరల అతుక్కోదు' అన్నది అనుభవజ్ఞుల మాట. ఉద్వేగం, ఉద్రేకం, హేళన లేకుండా ప్రియంగా మాట్లాడితే మనకీ దుఃఖముండదు ఎదుటివారికీ దుఃఖముండదు. ఎవ్వరినీ నొప్పించని వాక్కే మధురవాక్కు. మధురమైన వాక్కు మనుషుల హృదయాలను రంజింపజేస్తూ వశీభూతం చేసుకుంటుంది. కనుకనే 'మాటల చేత మన్నన పొందవచ్చు' నన్నది లోకోక్తి.
ఓ వ్యక్తి యొక్క సామాజిక అస్తిత్వ ఉత్ధాన పతనాలకు ప్రధాన కారణం ఆ వ్యక్తి మాటతీరే. మన వేదంలో, సనాతన ధర్మంలో "మంచి మాట" ఓ అంశమై ఉన్నది. 'భద్రం కర్ణేభి శృణుయామ దేవాః' (మా చెవులతో మంచి మాటలనే విందుము గాక). ఎలా జీవిస్తే, ఎలా ఆలోచిస్తే, ఎలా మాట్లాడితే కర్తృత్వబుద్ధిరూపంలో ఉన్న మాయనుండి విడుదల పొందగలమో అట్టి జీవనవిధానంను మన సనాతనధర్మం నేర్పుతుంది. చేతితో మంచిపనులు చేయాలి, నోటితో మంచిమాటలు మాట్లాడాలి.  చేసేపని, మాట్లాడేమాట ఎలా ఉండాలంటే అది మనకి శాంతినివ్వాలి, ఎదుటివారికి శాంతిని కలుగజేయాలి. ఆలోచనల్లోగానీ, పనిలోగానీ, మాటల్లోగానీ రాగద్వేషముల ప్రభావం ఉండకూడదు. అంతరంన చెడుభావనలు తొలగించుకుంటూ, మంచి తలపులు వచ్చేలా చూచుకుంటూ రాగద్వేషాలకు చోటులేకుండా మాట్లాడడంవలన అంతఃకరణశుద్ధి జరుగుతుంది. నిర్మలత్వం వస్తుంది. అప్పుడే వాక్శుద్ధి కలుగుతుంది. ఈ వాక్శుద్ధి ఆత్మసిద్ధికి దారి చూపిస్తుంది. ఆత్మజ్ఞానమనేది అంతఃకరణశుద్ధివలనే ప్రాప్తిస్తుంది. అంతఃకరణశుద్ధికి ప్రధమ సోపానం మధురవాక్కే. మృదువుగా సంభాషించడం సత్యాన్వేషకుడికి ముఖ్యాతిముఖ్యం.
శరీరానికి రోగాలు వచ్చినట్లే మనస్సుకీ కోపం, ఉద్రేకం, అసూయ అనే రోగాలు వస్తుంటాయి. మనస్సులో ఈ రోగాలున్నప్పుడు మాటల్లో అశాంతియే ఉంటుంది. శరీరానికి వచ్చే రోగాలు ఆ శరీరం మరణించినప్పుడు పోతాయి. మనస్సుకి వచ్చే రోగాలు మరుజన్మకు కూడా వచ్చేస్తాయి. అందుకే లోపలికి వెళ్ళే ఆహార విషయంలోనూ, బయటికి వచ్చే మాటల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులోనైనా, పొగడ్త విమర్శలప్పుడైనా నిలకడగా ఉండి ప్రసన్నంగా మాట్లాడడమే సాధనాబలం, సద్గుణం, సుసంస్కారం. గంగానదిలో నిప్పురవ్వలు వేసినా చల్లార్చుకొని గంభీరంగా సముద్రంలో కలిసిపోతుంది. అలాగే జీవనగమనంలో విమర్శలు, కోపోద్రిక్త సంఘటనలు వస్తూ ఉంటాయి. వాటిని అంటకుండా నిర్మలంగా ఆలోచిస్తూ, నిశ్చలంగా పనిచేస్తూ, నిదానంగా సరళంగా సహృదయతతో మాట్లాడగలిగినప్పుడు రజోగుణమును జయించి దేహతాదాత్మ్యపుభావన పోయి ఆత్మజ్ఞానం అందుతుంది. 
ప్రియంగా మాట్లాడితే అందరూ ఆనందిస్తారు. అటువంటప్పుడు మాటల్లో దారిద్యం ఎందుకు? (ప్రియవాక్య ప్రదానేనా సర్వేతుష్యంతి జంతవః / తస్మాత్ తదేవ వక్తవ్యం, వచనే కా దరిద్రతా //) పెదవులపై చిరునవ్వు చెరగకుండా పలికే మృదువైన మాట విశ్వాన్ని సైతం జయిస్తుంది. సరళమైనమాట స్నేహితులను సమకూర్చుతుంది. మృదువాక్కే ఇద్దరు వ్యక్తుల మధ్య స్తబ్థతను చీల్చి సాన్నిహిత్యమును పెంచుతుంది. మాట మాత్రమే మనిషిని మనీషిని చేస్తుంది. "వాజ్మాధుర్యాత్ నాన్యదస్తి ప్రియత్వం" వాజ్మాధుర్యమును మించి ప్రియమైనది లోకంలో మరొకటి లేదు. అందుకే ధర్మరాజు కూడా యక్షప్రశ్నల సందర్భంలో అంటాడు - "ప్రియవచన వాదీ ప్రియోభవతి" ప్రియవాది అయినవాడే అందరికీ ప్రియమైనవాడౌతాడు. అందుకే మనమూ మాట్లాడుదాం - నేర్పుగా, ఓర్పుగా, ప్రియంగా, హితంగా, మితంగా మాట్లాడుదాం.
అంతరంగ ఆలయాంతరంలో ఆ అనంతుడు ఆసీనుడై ఉండగా ఆ ఆలయకవాటాలుగా పెదవులున్నాయని, మనం మాట్లాడే మాటలన్నీ ఆ అనంతుని సన్నిధిలోనుండే వస్తున్నాయన్న భావన మనలో నిత్యమూ ఎరుకలో ఉంటే మృదుమధురభాషణ అలవడుతుంది. 
"మాటే మంత్రం" మహర్షుల నోటంటా వచ్చే ప్రతీమాట ఓ మంత్రమే. అంటే మనం జపిస్తున్న ప్రతీమంత్రం వారి నోటంట వచ్చిన పుణ్యమాటే. 
"మాటే స్తోత్రం" సద్భావనతో, ఆత్మీయంతో, ఆనందంతో, అమితభక్తితో, ఆరాధనతో అంతర్యామికై మాట్లాడే మాటలే భగవంతునికి స్తోత్రాలు. 

2, జులై 2012, సోమవారం

వ్యాస పూర్ణిమ - గురుపూర్ణిమ

ఆత్మను పరమాత్మను అనుసంధానం చేస్తూ, శిష్యుణ్ణి తరింపజేసేమార్గములో నడిపిస్తూ జీవైక్యస్థితిని అనుగ్రహించే సద్గురువులను పూజించేపండుగ "గురుపౌర్ణమి". గురుపౌర్ణమినాడు గురువుకు పాదపూజ చేయడం ముక్కోటిదేవతల్నీ ఒకేసారి పూజించడమౌతుందని శాస్త్రవచనం. 


శ్రీమహావిష్ణువు మొదట బ్రహ్మదేవునికి అందించిన సనాతనమైన, శాశ్వతమైన, జగత్సృష్టికి జగత్ర్స్తష్టకు ముందే ఉన్న పరమపావనమై అనాదిగా వున్నా ధార్మిక వేదవిజ్ఞానాన్ని మానవాళికి కూడా అందించాలన్న దివ్య సంకల్పంతో తన మనస్సు నుండి అపాంతరతముని సృష్టించాడు. అపాంతరతముడనగా లోపల ఉన్న చీకటిని (అజ్ఞానమును) పోగొట్టేవాడని అర్ధం. ఈ అపాంతరతముడే సకల వేదవిజ్ఞానమంతా మానవాళికి ప్రబోధించడానికి, సకల సూక్ష్మధర్మాలను తెలిపి ముక్తులను చేయడానికి, సమస్త విశ్వజనావళికి సనాతన ధర్మమార్గమును చూపించి పరమాత్మ వైపు దిశనిర్దేశం చేయాలని  శ్రీమహావిష్ణువు ఆదేశం మేరకు ప్రతీ మన్వంతరంలో ద్వాపరాంతంనందు జన్మిస్తున్నాడు. ఈ రీతిలో విష్ణువు దివ్యసంకల్పంచే కారణజన్ముడైన అపాంతరతముడు బ్రహ్మదేవును ద్వారా వేదాలను గ్రహించి, జగత్కల్యానంకై ఆ వేదాలను విభజించడం వలన వేదవ్యాసుడుగా ప్రసిద్ధితుడు అయ్యాడు. 'వేదాన్ వివ్యాస యస్మాత్ప వేదవ్యాస ఇతి స్మృతః' వ్యాసుడన్నది వ్యక్తినామం కాదు, అది ఆ వ్యక్తి చేసినపనులబట్టి ఏర్పడిన దివ్యనామం.

సుషువే యమునాద్వీపే పుత్రం కామమివాపరమ్ 
స్కాపి సత్యవతీ మాతా సద్యో గర్భవతీ సతీ //
యమునాద్వీపమున సత్యవతి సద్యోగర్భంలో మహాజ్ఞానతేజస్సంపన్నుడైన మహర్షి జన్మించాడు. ఈ ద్వీపంనందు జనించడం వలన కృష్ణద్వైపాయనుడుగా పేరు పొందాడు. సత్యవతీ, పరాశరుల పుత్రుడగుట వలన సాత్యవతేయుడు, పారాశర్యుడుగా పిలవబడ్డాడు. ఈ కృష్ణద్వైపాయనుడు హిమాలయాలలోని బదరికాశ్రమంలో సుదీర్హకాలం గొప్ప తపస్సు చేసినకారణంగా బాదరాయణుడుగా ప్రసిద్ధి పొందాడు. 

ఓం నమశ్శ్రుతిశిరః  పద్మషండమార్తాండమూర్తయే 
బాదరాయణసంజ్ఞాయ మునయే శివవేష్మనే //
వేదాంతములనెడు తామరల మొత్తములకు సూర్యబింబమైనవాడును, శుభకరమైన తేజమునకు ఆలయమైనవాడునగు, బాదరాయణుడను నామధేయము గల మునివర్యునకు నమస్కారం.
  
'వ్యాసో నారాయణో హరి:' వ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. 
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః 





జనులందరినీ ధన్యుల్ని చేయుటకై , ధర్మ, భక్తి, జ్ఞాన ఇత్యాది అమూల్య సంపదలను ఒసగిన వ్యాసమహర్షికి శతధా వందనములు.



ఆదికాలంలో వేదం అనేక శాఖలతో ఒకేరాశిగా 'ఏకాయనం' పేరిట విరాజిల్లుతూ వుండేది. కలియుగంలో మానవుల బుద్ధిశక్తిని, ఆయుష్షును పరిగణలోనికి తీసుకొని అందరికీ శ్రేయస్సు కల్గించేరీతిలో కలియుగవాసుల సౌలభ్యంకై బ్రహ్మ పరంపరాగతమైన ఏకాయనమైన వేదరాశిని కృష్ణద్వైపయానుడు తన తపఃశక్తితో 1131 శాఖలతో ఉన్న వేదరాశిని ఋగ్వేదం (21 శాఖలు), యజుర్వేదం (101 శాఖలు), సామవేదం (1000 శాఖలు), అధర్వణవేదము (9 శాఖలు)లుగా విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. తన శిష్యుల (పైలుడు, జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు) ద్వారా అందరికీ అందించాడు. అలానే సూతమహర్షి ద్వారా సకల పురాణసంపదను, శుకయోగి ద్వారా భాగవతాన్ని మానవజాతికి అందించాడు. మనం స్మరిస్తున్న ఈ కృష్ణదైపాయనుడు ఇరవైఎనిమిదవ వ్యాసుడు. అంతకుముందు గడిచిన 27 మన్వంతరాలలో వ్యాస పదవిని అలంకరించినవారు- 
౧.స్వయంభువు ౨.ప్రజాపతి ౩.ఉశనుడు ౪.బృహస్పతి ౫.సూర్యుడు ౬.యముడు ౭.ఇంద్రుడు ౮.వశిష్టుడు ౯.సారస్వతుడు ౧౦.త్రిధాముడు ౧౧.త్రివృషుడు (వృషభుడు) ౧౨.భరద్వాజుడు ౧౩.అంతరిక్షుడు ౧౪.ధర్ముడు ౧౫.త్రయారుణి ౧౬.ధనుంజయుడు ౧౭.కృతంజయుడు ౧౮.సంజయుడు ౧౯.అత్రి ౨౦.గౌతముడు ౨౧.హార్యాత్మకుడు ౨౨.వేణుడు (వాజిశ్రవుడు) ౨౩.సోముడు ౨౪.తృణబిందుడు ౨౫.భార్గవుడు ౨౬.శక్తి మహర్షి ౨౭.జాతుకర్ణుడు.


వేదంలో నిగూఢముగా ఉన్న విషయములను సర్వజనావళి శ్రేయస్సుకై సులభతరం చేసి అందించిన అనంతజ్ఞాన మహామహితాత్ముడైన వ్యాసమహర్షి పాదారవిందాలచెంత ప్రణమిల్లుతున్నాను. 



ఈ సమస్త ధార్మిక ఆధ్యాత్మికవిద్య అంతయూ వ్యాసుని నోటినుండి వెలువడిందే. 'వ్యాసోచ్చిష్టం జగత్సర్వం'.
వ్యాసుడు జన్మించిన ఆషాడ శుద్ధ పూర్ణిమను "వ్యాసపూర్ణిమ" / "గురుపూర్ణిమ" గా ఋషులు నిర్ణయించిన ఈ ఉత్కృష్ట పారమార్ధిక పర్వదినమునాడు,  ప్రశస్తమైన ప్రాచీనమునుండి వస్తున్న గురువులను సేవించుకునే ఆచార సాంప్రదాయాన్ని స్మరించుకుంటూ, అనంతమైన వైదిక ధార్మిక ధర్మసత్యాలను  అందించిన వ్యాసమహర్షికిని, వాటిని అవిచ్చిన్నంగా తరతరాలుగా సకలజనావళికి అందిస్తూ వస్తున్న గురుపరంపరలకు ప్రణమిల్లుతున్నాను. అందరూ సద్గురు కృపకు పాత్రులుకాగలరని ప్రార్ధిస్తూ - 



జగత్తుద్ధరణకై జ్ఞానవిజ్ఞాన సంపదను సమస్త జనావళికి అందించిన వ్యాసభగవానుకి నమస్కరిస్తున్నాను.





మునిం స్నిగ్దాంబుదాభానం వేదవ్యాసమకల్మషమ్
వేదవ్యాసం సరస్వత్యావాసం వ్యాసం నమామ్యహమ్ // 
                  
                  అందరికీ వ్యాసపూర్ణిమ (జూలై 3) శుభాకాంక్షలు! 



25, జూన్ 2012, సోమవారం

సద్గురువు

మాయాజగత్తులో ప్రవేశించి అజ్ఞానంతో ప్రాకృతదారపుత్ర గ్రహదులయందు భవపాశంచే కట్టబడిన మానవుణ్ణి బంధవిమోచనమును చేసి హృదయలోతుల్లో నిక్షిప్తమైన జ్ఞాననిధిని వెలికి తీసుకురాగలవారు, భౌతికమైన స్వరూపాలకు అతీతమైన దైవానుభవం కల్గించేవారు, దేవాలయమనే దేహంలో దైవత్వాన్ని దర్శింపజేసేవారు, ఆత్మను పరమాత్మలో చేర్చగలవారే నిజమైన సద్గురువులు. 'తమసోమా జ్యోతిర్గమయా' అజ్ఞానమనే చీకట్లును పోగొట్టి జ్ఞానమనే వెలుగులను నింపే సమర్ధుడే సద్గురువు. 


'ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే' ఈశ్వరుడు, సద్గురువు, ఆత్మ ఒక్కటే. మూర్తి భేదభావమే తప్ప తేడాలేదు. 

స్వస్వరూపమును తెలియజేప్పేదే నిజమైన విద్య. ఇదే శాశ్వతానంద విద్య, ఆధ్యాత్మిక విద్య. ఇంతటి ఆధ్యాత్మికవిద్య గురుముఖతా రావాలి.
వేదన్తానామనేకత్వాత్ సంశయానాం బహుత్వతః / 
వేదాస్యాప్యతిసూక్ష్మత్వాత్ న జానాతి గురుం వినా //
వేతాంతమార్గములు అనేకములగుటచేతను, సంశయములు అనేకములగుటచేతను, తెలియదగిన బ్రహ్మము మిక్కిలి సూక్ష్మమగుటచేతను గురుదేవుడు వినా ఇది గోచారం కాజాలదు. 
భక్తుల కోరిక వలన  మానుషస్వరూపంలో(స్వభక్తేచ్చయా మానుషం దర్శయంతం) మానవులను తరింపజేయుటకోసం ఆ సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడు ప్రియభక్తునిపై కృప కలిగి, భక్తుని పరిపక్వస్థితిని బట్టి, వాని పురోభివృద్ధి కొఱకు తన దివ్యత్వాన్ని గురురూపంలో వ్యక్తపరుస్తాడు.  
మానవులు సృష్టిలో భగవంతున్ని స్వయంగా తమంతట తాముగా  చేరుకోలేరు. స్వప్రయత్నంతో భగవంతుడిని చేరుకోవడం కష్టం కాబట్టి గురువు ఆవశ్యకత తప్పనిసరి. 
గురువు నిశ్చయంగా అవసరం. గురువుతప్ప మరెవ్వరూ, బుద్ధి ఇంద్రియాలకు సంబంధించిన విషయకీకారణ్యం నుంచి మానవుణ్ణి బైటికి తీసి రక్షించలేరని ఉపనిషత్ పేర్కొంటుంది. సాధరణంగా సాధకులు తమ మనస్సులతో ఈశ్వరచింతన చేయుదురు. మనస్సు త్రిగుణాత్మకం. త్రిగుణములకు, మనోబుద్ధులకు అతీతమైన బ్రహ్మమును ఆత్మానుభవంగల ఆచార్యుని వలననే దైవతత్వం తెలుసుకోగలరు. 'తద్విజ్ఞానార్ధం స గురుమేవాభి గచ్చేత్సమిత్పాణి: శ్రోత్రియం బ్రహ్మనిష్టం' (ముండకోపనిషత్)  
భవబంధాలచే ఆత్మవిస్మృతి కలిగియున్న జీవునకు ఆత్మావభోధమును గలుగజేయువాడే గురుదేవుడు. నిరంతర నిశ్చల ఆత్మనిష్టాగరిష్టులై, అందరి యెడల, అన్నింటి యెడల, సర్వకాల సర్వావస్థల్లో, సర్వచోట్ల సర్వులయందు, స్థిరచిత్తులై సమదృష్టి కలిగియుండినవారే సద్గురువులని శ్రీరమణులు అంటారు. 
   
  

       
         వందే గురుపరంపర                                          
ఓం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ 
కర్త్రుభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః 
అధ్యాత్మవిద్యా సంప్రదాయకులైన ఉపనిషత్కర్తలకును, వంశ ఋషులకును, ఆదిబ్రహ్మ మొదలుకొని సకలమహాపురుషులకును, సద్గురుమూర్తికిని నమస్కారం.  

ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే 
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణమూర్తయే నమః 
ఓంకారవాచ్యులును, శుద్ధమైన జ్ఞానమే ఆకారంగాగల వారును, నిర్మలులును, ప్రశాంతులు నగు శ్రీ దక్షిణమూర్తికి నమస్కారం.

ఓం హయాస్యాద్యవతరైస్తు జ్ఞానసిద్ధా మునీశ్వరాః
కృతార్ధతాం గతాస్తం వై నారాయణ ముపాస్మహే 
హయగ్రీవమూర్తి మొదలైన యెవని అవతారములచే మునీశ్వరులు జ్ఞానసిద్ధులై కృతార్ధులైరో అట్టి శ్రీమన్నారాయణమూర్తిని ఉపాసించుచున్నాం.

ఓం వేదతత్వైర్మహావాక్యె ర్వసిష్టాద్యా మహర్షయః 
చతుర్భిశ్చతురా ఆనన్ తం వై పద్మభువం భజే 
వసిష్టాది బ్రహ్మరుషులు ఎవనియొక్క వేదసారమైనట్టి జీవేబ్రహ్మైక్య ప్రతిపాదకమగు (ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్త్వమసి, ఆయనాత్మ బ్రహ్మ అను) నాలుగు మహావాక్యములచే చతురులై మహాత్పదమును చెందిరో అట్టి పద్మజుడగు చతుర్ముఖబ్రహ్మను భజించుచున్నాను.

బ్రహ్మర్షిర్ర్బహ్మవిద్వర్యో బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః 
తపస్వీ తత్త్వవిద్యస్తు తం వసిష్టం భజే న్వహమ్ 
బ్రహ్మఋషియు, బ్రహ్మవిద్వర్యుడును, బ్రహ్మస్వరుపుడును, బ్రహ్మనిష్టులందు ప్రేమగలవాడును, తపస్వియు, తత్త్వవేత్తయును అయిన వసిష్టభగవానుని ప్రతిదినమును  భజించుచుందును.

యోగజ్ఞం యోగినాం పర్వం బ్రహ్మజ్ఞానవిభూషితమ్ 
శ్రీమద్వసిష్టతనయం శక్తిం వందే మహామునిమ్ 
యోగ మెరిగినవాడను, యోగులలో ఉత్తముడును, బ్రహ్మజ్ఞానం చేత అలంకరింపబడినవాడును, బ్రహ్మవిద్యా సంపన్నుడైన వసిష్టభగవానుని కుమారుడును, మహామునియును అగు శక్తికి నమస్కరించుచున్నాను.

ధర్మజ్ఞం ధార్మికం ధీరం ధర్మాత్మానం దయానిధిమ్ 
ధర్మశాస్త్రప్రవక్తారం పరాశరమునిం భజే
ధర్మం లెరింగినవారును, ధర్మముల నాచరించువారును, నిర్మోహమైన ధైర్యం గలవారును, బుద్ధిని స్వాదీనమందుంచుకొన్నవారును, ధర్మస్వరూపులును, దయాసముద్రులును, ధర్మశాస్త్రమును రచించినవారును అగు పరాశరమునిను భజించుచున్నాను.

కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతమ్ 
వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిమ్ 
వేదములను విభజించినవాడును, అన్నిలోకములవారి మేలును గురించి ఆసక్తి గలవాడును, వేదములనెడి పద్మములను వికసింపజేయుటలో సూర్యునివంటివాడును, శమము దమము మొదలైనవానికి స్థానమైనవాడును అగు కృష్ణద్వైపాయన మహామునికి (వ్యాసుడు) నమస్కరించుచున్నాను.

శ్రీపరాశరపౌత్రం శ్రీవ్యాసపుత్ర మకల్మషమ్ 
నిత్యవైరాగ్యసంపన్నం జీవన్ముక్తం శుకం భజే 
శ్రీపరాశరముని మనుమడును, శ్రీవేదవ్యాసభగవానుని కుమారుడును, ఏ విధమైన కల్మషం లేనివాడును, జీవన్ముక్తుడును అగు శుకమహామునిని భజించుచున్నాను.

ఓం మాండుక్య కారికాకర్తా యో భాతి బ్రహ్మవిద్వరః
శ్రీగౌడపాదాచార్యం తం ప్రణమామి ముహుర్ముహు:
బ్రహ్మజ్ఞానులలో శ్రేష్టుడైన యే మహానుభావుడు మాండుక్య కారికలను రచించినవాడై ప్రకాశించుచున్నాడో అట్టి గౌడపాదాచార్యులకు మాటిమాటికి నమస్కరించుచున్నాను.

ఓం యోగీశ్వరం వేదచూడం వేదాంతార్ధనిధిం మునిమ్ 
గోవిందభగవత్పాదాచార్యవర్య ముపాస్మహే 
యోగీశ్వరుడును, ఉపనిషదర్ధమునకు నిధియును, మననశీలుడును అగు గోవిందభగవత్పాదాచార్యులవారిని ఉపాసించెదను.

హరలీలావతారాయ శంకరాయ వరౌజసే 
కైవల్యకలనాకల్పతరవే గురవే నమః 
ఈశ్వరుని లీలావతారమును, గొప్ప తేజస్సుగలవాడును, మోక్షమను ఫలం నిచ్చుటకు కల్పవృక్షంవంటివాడును, జగద్గురువు నగు శ్రీశంకరభగవత్పాదాచార్యులవారికి నమస్కారం.

ఓం సచ్చిదానందరూపాయ వ్యాపినే పరమాత్మనే 
నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే  
సత్ చిత్ ఆనందం అనునవివే స్వరూపముగా గలవాడును, వ్యాపకుడును, పరమాత్మస్వరూపుడును, వేదవేదాంతములచే తెలియదగినవాడును, దేహేంద్రియ మనోబుద్ధులకు సాక్షిగా ఉండువాడు నగు గురువునకు నమస్కారం.


  

9, జూన్ 2012, శనివారం

గురుభక్తి మహిమ


     
మహాగురుభక్తియు, గొప్పవిరక్తియు, తీవ్ర ఆధ్యాత్మిక జిజ్ఞాసగల ఒకానొక భక్తుడును ఒక బ్రహ్మనిష్టుల సభలో ఉపన్యసించ వలసినదిగా సభాకార్యనిర్వాహకులు కోరగా, వారికోరికను మన్నించి ఆ గురుభక్తుడు ముందుగా తన గురువర్యున్ని స్మరించుకొని శ్రీ గురుస్తోత్రమును జేయదలచెను. అయితే గురుదేవుడును ఎటుల స్తుతించిన బాగుండునని యోచిస్తూ, ముందుగా సూర్యునితో పోల్చుతూ చెప్పడానికి ప్రయత్నించెను.

                                      సూర్య దృష్టాంతము 


ప్రపంచంలోగల చీకటిని రహితమొనర్చి ప్రకాశమును కలుగజేసిడి సూర్యునితో గురుదేవున్ని పోల్చి వర్ణించిన బాగుండునని తలచెను. కానీ, అది సరికాదని అలా పోల్చడం గురుదేవునుని అవమానపరచడమే అవుతుందని తలచెను. ఏలననగా -
సూర్యుడు తమస్సును రహితంగా చేసి ప్రకాశమును కలుగజేయునది నిజమైనను సూర్యప్రకాశము భూగోళమున ఒకప్రక్క ప్రకాశమును, మరోప్రక్కన చీకటిగా యుండును. తన జ్ఞానప్రకాశంతో అంతటా ఒకేలా ప్రకాశించుచున్న సర్వవ్యాపకుడు అయిన గురుదేవుడును సూర్యునితో పోల్చడం తప్పని భావించెను. అంతేకాదు, సూర్యుడు పగలు మాత్రమే ప్రకాశించి రాత్రియందు ప్రకాశింపజాలడు. అలానే సూర్యుడు బయటప్రదేశమున మాత్రమే ప్రకాశించు శక్తిగలవాడే గానీ, జీవుల హృదయాంతరాళమున నిబిడమై యుండు అజ్ఞానతమస్సును రహితమొనర్చజాలడు. కానీ, గురుదేవుడు మనస్సులో నిబిడమై యుండు అజ్ఞానతమస్సును రహితమొనర్చగలడు. అంతేకాదు, దట్టమైన మబ్బులవలన, గ్రహణకాలంలోనూ సూర్యుడు మరుగునపడిపోవుచున్నాడు. స్వప్రకాశకుడగు గురుదేవుడు సర్వప్రకాశకుడు.కాబట్టి సూర్యునితో గురుదేవుడును పోల్చలేను అని చెప్పి -
అజ్ఞానతిమిరాంధస్య  జ్ఞానాంజనశాలాకయా / చక్షరున్మీలితం యేవ తస్మై శ్రీగురవే నమః //
ఈ రీతిలో గద్గదస్వరంతో స్తుతించి కాసేపు ఉపన్యసించడం ఆపెను.

                                    చంద్ర దృష్టాంతము 
కాసేపటికి మరల ఉపన్యసించ దలచెను. ఈసారి చంద్రునితో పోల్చదలిచెను. కానీ, అదీ సరికాదని భావించెను. ఏలననగా -
చంద్రుడు చల్లనివాడును, ప్రసన్నుడును అయినను చంద్రుడు యొక్క చల్లదనమును, ప్రసన్నత్వం ఎల్లప్పుడును ఉండుటలేదు. కానీ, నా గురుదేవుడు సదా చల్లదనమును, ప్రసన్నత్వమును కల్గియున్నవాడు. అంతేకాక, శుక్లపక్షమున వృద్ధియు, కృష్ణపక్షమున క్షయమున్ను చంద్రునికి కల్గుచున్నది. నా గురుదేవుడో... ఏ హెచ్చుతగ్గులు లేకుండా పరిపూర్ణుడై యున్నాడు. అంతేకాక, చంద్రునియందు కళంకం కలదు. నా గురుదేవుడు నిష్కళంకుడు. పరప్రకాశంతో ప్రకాశించువాడు చంద్రుడు. మరి నా గురుదేవుడో... స్వయంప్రకాశకుడు. సూర్యుని మాదిరిగా మేఘాలువలన, గ్రహణకాలంలో రాహుకేతువులవలన చంద్రుడు మరుగునపడుచున్నాడు. మరియు రాత్రినే చంద్రుని ప్రకాశముండును. కానీ, నా గురుదేవుడు రేయింబవళ్ళు ఒకే విధంగా వెలుగుచున్నవాడు. కావున చంద్రునితో నా గురుదేవుడిని పోల్చడం దోషమని చెప్పి -
అఖండమండలాకారం వ్యాప్తం యేవ చరాచరమ్ / తత్పదం దర్శితం యేవ తస్మై శ్రీగురవే నమః // 
అని స్తుతించి కాసేపు మౌనమయ్యేను.

                                సముద్ర దృష్టాంతము 
కాసేపటికి మరల ఉపన్యసించదలచెను. ఈసారి సముద్రముతో పోల్చదలిచెను. కానీ, ఆ పోలిక కూడా సరికాదని భావించెను. ఏలననగా -
సముద్రం అపారమని చెప్పబడినను సముద్రమునకు కూడా పారం గలదు. కానీ, నా గురుదేవుడు సర్వవ్యాపకత్వం కలిగినవాడు. సముద్రజలమంతయు లవణరసమైనది. త్రాగుటకు ఉపయోగపడదు. కానీ నా గురుదేవుని హృదయం క్షారోదకం కాదు, ఆ హృదయం అమృతమయం. జిజ్ఞాసువులు రేయింబవళ్ళు వచ్చి జ్ఞానామృతమును పానమొనర్చి తృప్తులగుచున్నారు. సముద్రన్తర్భాగమున రత్నాదులు ఉన్నప్పటికిని అనేక క్రూరములగు పాములు, మకరములు, త్రిమింగలాది జలచరజంతువులు కలవు. కానీ, నా గురుదేవుని హృదయాన్తరమున శాంతమనెడు రత్నములను, సహనముత్యములను, వైరాగ్యపగడములను ఉన్నవి. సముద్రంలో జీవులు ఒకదానిని ఒకటి హింసించి తింటుంటాయి. మా గురుదేవుని హృదయం ఏ ప్రాణిని హింసించని అహింసా ధర్మమయమై యున్నది. సముద్ర అంతర్భాగమున బడబాగ్నులున్నాయి, నా గురుదేవుని హ్రుదయాన్తర్భాగమున బ్రహ్మానందము, శాంతం, శివము ఉన్నవి. సముద్రములో ఎన్నో మాలిన్యములు కలిసియుండును. కానీ, గురుదేవుని హృదయంలో వేదసారమగు జ్ఞానం నిలిచియున్నది. కావున సముద్రంతో గురుదేవున్ని పోల్చలేనని చెప్పి -
సంసారవృక్ష మారూడాః పతన్తి నరకార్ణవే / యస్తానుద్ధరతే సర్వాంస్తస్మై శ్రీగురవే నమః // 
ఇలా స్తుతిస్తూ మరల మౌనమయ్యేను.

                      మహా మేరువు దృష్టాంతము 
కాసేపటికి ఆ భక్తపరాయణుడు మరల తన ఉపన్యాసమును ప్రారంభిస్తూ, ఈ సారి మహామేరువుతో పోల్చడానికి ప్రయత్నించెను. కానీ, అది కూడ సరికాదని భావించెను. ఏలననగా -
మేరుపర్వతం అక్కడక్కడ రత్నాలున్నను వట్టి మట్టి రాళ్ళగుట్ట. మేరువు ఏకప్రదేశమునకు పరిమితం. జ్ఞానం లేని జఢవస్తువు. మరి నా గురుదేవుడో.... జ్ఞానరత్నముల రాశిభూతుడై అంతటా  తిరుగాడు చైతన్యమూర్తి.  మేరువుపై పార్వతీపరమేశ్వరులు ఉండడంవలన పుణ్యం ప్రాప్తించింది. కానీ, నా గురుదేవుడు పకృతి పురుషులకు విలక్షణమగు శుద్ధశివస్వరూపుడు. మేరుగిరిపై సింహశార్దులాది భయంకరజంతువులు గలవు. నా గురుదేవుడు యందో, శాంతి, సత్య, కరుణాది అనేక సుగుణములే ఉన్నవి. మేరుగిరిపై అనేకమంది దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు తమ తమ భార్యలతో ఆసక్తితో క్రీడించుచుందురు. కానీ, నా గురువరుని ఆశ్రమమున అనేకమంది స్త్రీ పురుషులున్నను, వారందరునూ ఆత్మారాములై ఆత్మయందు రమించువారే గానీ విషయాసక్తులు కారు. మేరుగిరి యందుండి అనేక ప్రోతస్సులు ప్రవహించుచుండును. అవన్నీ వట్టి నీళ్ళే గానీ మరియొకటి కాదు. నా ప్రభువగు గురువు నుండి సదా జ్ఞానప్రవాహమే జరుగును. దానిని పానం చేసినవారికి మరల జననమరణములే ఉండవు. మేరుపర్వతం నుండి జాలువారు గంగాప్రవాహం కొంతసేపు దాహంను శమింపజేయును. కానీ నా గురుదేవుని ముఖరావిందం నుండి వెలువచుండు జ్ఞానగంగను పానంచేసిన వారికి ఏ కాలమందైనను తాపత్రయాగ్నిచే నేర్పడిన దాహముండదు. ఇత్యాది కారణములచే మేరుపర్వతంతో కూడా నా గురుదేవుడుని పోల్చడం తగదని చెప్పి -
అజ్ఞానేనాహినా గ్రస్తాః ప్రాణినస్తాచ్చికిత్సకః / విద్యాస్వరూపో భగవాంస్తస్మై శ్రీగురవే నమః //
అని స్తుతించి కాసేపు మరల మౌనమయ్యేను.

                                   అగ్ని దృష్టాంతము 
మరల తన గురువు మహిమ తెలపడానికి ఉపన్యాసంను ప్రారంభిస్తూ, ఈసారి అగ్నితో పోల్చడానికి ప్రయత్నించెను. కానీ, అది కూడా సరికాదని తలచెను. ఏలననగా -
అగ్ని కట్టెలను కాల్చివేయు శక్తి గలదైనను అజ్ఞానకాష్టమును దహింపజేయుశక్తి అగ్నియందు లేదు. నా గురుదేవుడో....అజ్ఞానేంధనమును భస్మమొనర్చుడు శక్తిమంతుడు. స్థూలమైన కట్టెలను అగ్ని బూడిద చేయగలదు గానీ సూక్ష్మమై జన్మజన్మాంతరములనుండి వచ్చుచుండు కర్మరాశియను కట్టెలను గురుదేవుడు జ్ఞానదృష్టి అనెడు అగ్నిచే భస్మమయముగా చేయును. మహారణ్యమును ఈ అగ్నిహోత్రుడు భస్మమొనర్చినను నొనర్చుగాక, కానీ అంతు కనబడని సంసారారణ్యమును నా గురుదేవుడు జ్ఞానాగ్నిచే భస్మం చేయును. ఎంత శుద్ధమైన యజ్ఞాగ్ని కాని, దక్షిణాగ్ని కాని, గార్హపత్యాగ్ని కాని, ఆహనీయాగ్ని కాని, సమిధలు వేయుచుండువరకు మాత్రమే జ్వలించుచుండును, లేనిచో నింపాదిగా చల్లారిపోవును. జ్ఞానాగ్ని స్వరూపుడగు నా గురుదేవును ప్రజ్ఞానాగ్ని ఎప్పుడూ నశించదు. కావున అగ్నితో నా గురుదేవున్ని పోల్చడం సరికాదని చెప్పి -
తాపత్రయాగ్నితప్తానామశాంతప్రాణినాం భువి / గురురేవ పరా గంగా తస్మై శ్రీగురవే నమః //  
అని స్తుతించి మరల కాసేపు మౌనమయ్యేను. 

                                 బ్రహ్మ దృష్టాంతము 
పిమ్మట మరల ఉపన్యచించడం ప్రారంభించెను. ఈసారి  గురుదేవున్ని బ్రహ్మదేవునితో పోల్చడానికి ప్రయత్నించెను. ఇది కూడా సరికాదని భావించెను. ఏలననగా -
బ్రహ్మదేవునికి శ్రీమన్నారాయణమూర్తి గురువని ప్రామాణికం కలదు ('యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, యోవై వేదాంశ్చప్రహిణోతి తస్మై'). తనపై ఓ గురువుండగా ఈ బ్రహ్మను స్వయంప్రకాశుడున్ను, స్వయంభువు అగు నా గురువుతో సమానముచేసి నేను స్తుతించలేను. అదియును గాక, ఎవరుగొప్పవారనే అహం స్పురణతో  అనలస్తంభంగా ఆవిర్భవించిన శివుని అది అంతంలు కనుగొనలేక దేనువుచేతను, మొగలిపువ్వుచేతను అసత్యం పలికించినవాడు, శాపం వున్నవాడు బ్రహ్మయని అందురు. మరి నా గురుదేవుడో... సత్యవంతుడు, అందరి శాపములను పోగొట్టువాడు. అదియునుగాక, సనక సనందన సనత్కుమార, సనత్సుజాతులను నలుగురు తీవ్ర బ్రహ్మజిజ్ఞాస మహాయోగులు జీవబ్రహ్మైక్యసందేహనివృత్తికై బ్రహ్మలోకం వెళ్ళి సరస్వతీదేవితో కూడిఉన్న బ్రహ్మనుకాంచి, తమ సందేహమును తీర్చే గురువు ఇతనుకాదని వెడలిరి. అన్ని సందేహములను తీర్చే నా గురుదేవుడిని బ్రహ్మతో పోల్చలేనని చెప్పి -
అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదాహినే / జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీగురవే నమః //
అని స్తుతించి మరల కాసేపు మౌనం వహించెను.

                                        విష్ణు దృష్టాంతము 
పిమ్మట మరల ఉపన్యసించ దలచి, ఈసారి గురుదేవున్ని విష్ణువుతో పోల్చడానికి ప్రయత్నించెను. ఈ పోలిక సరికాదని భావించెను. ఏలననగా -
తమ గురువుగా చతుర్ముఖ బ్రహ్మను స్వీకరించక వైకుంఠలోకంకి వెళ్ళిన సనకాది మహర్షులు లక్ష్మీదేవితో కలిసిఉన్న శ్రీమన్నారాయణమూర్తి దరి కూడా తమ సందేహనివృత్తి జరగదని తెలుసుకొని అచ్చటనుండి వెడలిరి. అంతేకాదు, బ్రహ్మ మాదిరిగా అసత్యం చెప్పకపోయినను అనలస్తంభం ఆది అంత్యంలను ఎరగనివాడు కావున సర్వజ్ఞుడైన నా గురుదేవున్ని విష్ణువుతో పోల్చలేనని చెప్పి -
భావారణ్యప్రవిష్టస్య దిజ్మోహభ్రాన్తచేతనః / యేవ సందర్శితః పన్దాస్తస్మై శ్రీగురవే నమః //
అని స్తుతించి మరల మౌనమయ్యేను.

                                      శివ దృష్టాంతము 
పిమ్మట మరల ఉపన్యసించ దలచి, ఈసారి శివునితో పోల్చడానికి సంకల్పించెను. సనకాదిమునిసత్తములు నలుగురున్ను తమ సందేహనివృత్తికై కైలాసమునకు వస్తున్న విషయమును పరమశివుడు ముందుగానే దివ్యదృష్టితో తెలుసుకొని, వారి సందేహములు తీర్చుటకై సర్వమును త్యాగమొనర్చి, విభూతి  రుద్రాక్షలను ధరించి ఓ వటవృక్షం యొక్క మూలమున వ్యాఘ్రాసనముపై  దక్షిణాభిముఖంగా సిద్ధాసనసీనుడై, చలించని బ్రహ్మదృష్టి గలవాడై, ప్రసన్నముఖారవిందుడై ధ్యానమయుడై కూర్చోండెను. ఇదియే దక్షిణామూర్తి యొక్క అవతార రహస్యం. సనకాది మునివర్యులు నలుగురును సర్వేంద్రియములను నిగ్రహపరచి ప్రత్యక్ చైతన్య బ్రహ్మస్వరూపమందు నిలకడకలిగి యుండునట్టి దక్షిణామూర్తి యొక్క స్థితిని జూచినవారై తమకు సరియైన గురువు ఇతనేనని నిశ్చయించుకొని ప్రణమిల్లిరి. అటుపై తమ సందేహములను తీర్చుకొని సనకాదులు దక్షిణామూర్తి మౌనబోధచే సర్వసంశయరహితులై, శివజీవైక్యస్వరూపులై గురుస్తోత్రం చేసి తమస్థానములకు తృప్తిగా తిరిగి వెళ్ళిరి, అని ఆనందంగా చెప్పి - 
శిష్యానాం జ్ఞానదానాయ లీలయా దేహదారిణే/సదేహేపి విదేహాయ తస్మై శ్రీగురవే నమః //
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే/వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః//
ఓమ్ నమః ప్రణవార్దయ శుద్ధజ్ఞానైకమూర్తయే/నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః//
అని దక్షిణామూర్తిని స్తుతిస్తూ గురుభక్తి మెండుగా గల ఈ పరమభక్తుడు గురుధ్యానం చేసి చేసి బ్రహ్మాకారస్వరూపుడగు గురుస్వరూపుడు అయ్యెను.





                                                                                 

4, జూన్ 2012, సోమవారం

మానసాది తీర్ధములు

 
 
 'ఏతే భౌమామ్మయా యజ్ఞాః తీర్ధ రూపేణ నిర్మితాః'
తీర్ధాలు భూమి మీద జలమయమైన యజ్ఞాలు. అందుచే బ్రహ్మదేవుడు వీటిని సృష్టించాడు. 
ఐతే ఈ తీర్ధస్నానముల వలన లభించేది కాస్తంత పుణ్యం, పరమాత్మునిపై భక్తిభావం. అంతేకాని ఇవి సంపూర్ణముగా మానవుణ్ణి తరింపజేయవన్నది పెద్దల అభిమతం. 
కరములందు నమరు గంగాధరునిబట్టి 
తీర్ధములకుబోయి తిరుగుచుండ్రు
వెన్నబట్టి నెయ్యి వెదికినచందంబు 
విశ్వదాభిరామ వినురవేమ !
చేతిలో వెన్న పెట్టుకొని నేతికోసం వెదుకుచున్నట్లుగా, చేతిలో పరమాత్మను పెట్టుకొని తీర్ధాలకు తిరుగుతూ ఉంటారు. అంటే అంతర్యామి అంతరంగమునే ఉండగా  అది గ్రహించక ఎక్కడో తీర్ధక్షేత్రాలలోనే పరమాత్ముడు ఉన్నాడని భావించడం తగదని అర్ధం.
కాశిబోదు ననుచు గడకట్టగానేల
వాసితీర్ధములను వగవనేల
దోసకారికెట్లు దొరకురా యాకాశి
విశ్వధాబిరామ వినురవేమ !
కాశీకి వెళ్ళాలని తీర్దాలు చూడాలని విచారించటం ఎందుకు? దోషకారికెట్లు పుణ్యం లభిస్తుంది? అంటే మోక్షమనేది పుణ్యకార్యాలు చిత్తశుద్ధితో చేయడంవలన వస్తుంది కానీ తీర్ధయాత్రలు చేయడంవలన కాదు.
నీళ్ళ మునుగువాడు నిర్మలాత్ముడు కాడు
పూర్ణమైన ముక్తి పొందలేడు
నీరుకోడి యెపుడు నీళ్ళను మున్గదా 
విశ్వదాభిరామ వినురవేమ !
నీళ్ళలో మునిగి స్నానాలు, తపస్సు చేస్తున్నంతమాత్రమున నిర్మలాత్మనుకానీ, పరిపూర్ణ ముక్తినికాని పొందలేరు. నీటికోడి ఎప్పుడూ నీళ్ళలోనే ఉంటుంది, అంతమాత్రమున అది మోక్షమును పొందినట్లు అవుతుందా?
మానసేష్వపి తీర్దేషు యో నరస్స్నాతి బాహ్యకే 
జలే న హి భవే చ్చుద్దో యధా మాండూక కచ్చపౌ
మనశుద్ధిలేక బాహ్యతీర్ధములయందు స్నానంచేయువారు శరీరమలినమును కడిగివేయుటచేత ఎంతమాత్రమూ పరిశుద్ధులు కారు. నిరంతరం నీటియందు యుండు కప్ప, తాబేలు మొదలగువానివలె శుద్ధులు కాలేరు.
అడవి తిరుగ లేదు అకసమున లేదు
అవని తీర్ధయాత్రలందులే 
ఒడలుకుద్దిచేసి ఒడయని జూడరా 
విశ్వదాభిరామ వినురవేమ !
భగవంతునికోసం అడవులలోనూ, ఆకాశంలోనూ, తీర్ధయాత్రలు చేయడంలోనూ తెలుసుకోలేరు. శరీరాన్ని కుదుట పరచుకొని పరమేశ్వరుణ్ణి పరికించాలి. అంటే భగవంతునికై ఎక్కడెక్కడో తిరగనవసరంలేదు, ఉన్నచోటనే మనస్సుని కుదుట పరచుకుంటే పరమాత్ముడుని చూడగలరు.
తిరిగితిరిగి నరుడు మరులుకొనుటేగాక
అందువలననేమి యాశ గలుగు
నంతరాత్మ నిలుపునతడే పో బ్రహ్మంబు 
విశ్వదాభిరామ వినురవేమ !
బ్రహ్మజ్ఞానం సంపాదించాలని నరుడు తీర్ధయాత్రలు చేయడంవలన శ్రమ మిగులుతుంది గానీ జ్ఞానోదయం కలుగుతుందన్న ఆశ లేదు. అంతరాత్మయందు దృష్టిని నిలిపినపుడే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అతడే బ్రహ్మ అవుతాడు.

తీర్ధములయందు స్నానమాచరించిన చాలు తరించిదురు అన్న మహర్షుల వాక్యములకు అసలర్ధం ఏమిటంటే -
  
తరింపజేయునదే తీర్ధం. దేనివలన జననమరణ భయంకరమగు భవసాగరం తరింప బడునో, దానికే తీర్ధమని అందురు. అయితే అటువంటి పరమగతిని అందిచ్చే  తీర్ధంలు ఏవీ? ఎక్కడ ఉన్నాయంటే -


 మానసా న్యపి తీర్ధాని వక్ష్యామి శృణు పార్ధివ /
యేషు సంయజ్నరః స్నాత్వా ప్రయాతి పరమాం గతిమ్ //

సత్యం తీర్ధం క్షమా తీర్ధం తీర్ధ మింద్రియ నిగ్రహః /
సర్వభూతదయా తీర్ధం తీర్ధమార్జవ మేవ చ //

దానం తీర్ధం దమస్తీర్ధం సంతోషస్తృప్తి రేవ చ /
బ్రహ్మచర్యం పరం తీర్ధ మక్రోధ స్తీర్ధముచ్యతే //

మనశ్శుద్ది: పరం తీర్ధం తపస్తీర్ధ మనుత్తమమ్ /
ఆచార్యోపాసనం తీర్ధం శౌచం తీర్ధ మనుత్తమమ్ //

వైరాగ్యం పరమం తీర్ధ మసక్తం విషయేషు చ  
సుతీర్ధం సమచిత్తత్వం తీర్ధమాత్మని దర్శనమ్ 
సత్సంగతి: పరం తీర్ధం  తీర్ధాన ముత్తమోత్తమమ్ 
 
(సత్యం పలుకుట, క్షమ, ఇంద్రియ నిగ్రహం, సమస్త ప్రాణులయందు దయకలిగియుండుట, ఆర్జవం, దానం, దమం, సంతోషం, తృప్తి, బ్రహ్మచర్యం, అహింస, అక్రోధం, మనశుద్ధి, తపస్సు, ఆచార్యోపాసనము, శౌచం, వైరాగ్యం, విషయవిరక్తి, సమచిత్తత్వం, ఆత్మనిదర్శనం ఇవన్నియూ సుతీర్ధములు).
ఈ సద్గుణ సంపన్నత సర్వతీర్ధాల స్వరూపములు కావున ఇవియే సుతీర్ధములనబడును. ఈ దైవీగుణ తీర్ధాలకై హిమాలయ గుహల్లోకి వెళ్ళనవసరం లేదు, సప్తసముద్రాలలో ఈదనవసరం లేదు, పర్వతశిఖరాలపైకి పయనించనవసరం లేదు, అరణ్యాలులో తపస్సు చేయనవసరం లేదు.  బాహ్యమున వీటికి అన్వేషించనవసరం లేదు. ఇవన్నీ మన సహజగుణాలు. ఇవన్నీ అంతరంగమున అంతర్లీనంగా ప్రవహిస్తున్న జీవధారలు. దైనందిక వ్యవహారాల్లో సదా దైవచింతనలో ఉండి సాధనద్వార ఈ సద్గుణములను పల్లవింపజేస్తే ఎల్లలూ, ఆనకట్టలు లేని చైతన్యగంగాధారలో మునకలేయవచ్చు, పరమపావనం కావచ్చు.

అతోన్యధా వర్తమానః కోటి సంవత్సరావధి 
గంగాజల నిమగ్నోపి నైవ శుద్ధ్యాత్కదాచన
ఈ తీర్ధములయందు కాక మానవుడు కోటిసంవత్సరములు అనగా అనేక సంవత్సరములు బ్రతికి యుండి గంగాజలమందు ప్రతిదినమును మునకలు వేసినను ఎంతమాత్రమును పరిశుద్దుడు కానేరడు.
 
'చేతస్సు నిర్మలో తీర్ధం'  నిర్మలమైన చిత్తమే తీర్ధస్వరూపం.
ఈ సద్గుణములతో అంతరంగం శుద్ధమైన దశలో హృదయమే నిర్మలమైన పవిత్ర గంగాది పుణ్యతీర్ధములుగా మారి ఆంతర్యంలో ప్రవహించి తరింపజేస్తాయి. 
'జ్ఞానమేవ పరం తీర్ధం' జ్ఞానమే ముఖ్యమైన తీర్ధం. భక్తిశ్రద్ధలుగల భావనాత్మకంబైన సద్గుణధ్యానయోగ సిద్ధంబగు జ్ఞానమే ఫలంకరంబైన తీర్ధంబగును.
ఆత్మానుభవజ్ఞానం అగు తీర్ధంనందు స్నానం చేసినవారే ముక్తిపొందుదురు. (ఉపనిషత్సార రత్నావళి)

23, మే 2012, బుధవారం

ఎందుకనీ?????

కొందరిని చూస్తే మ్రొక్కాలనిపిస్తుంది, కొందరిని చూస్తే మొట్టాలనిపిస్తుంది.... ఎందుకనీ??? 
ఇది నా మిత్రురాలి నిన్నటి సందేహం. ఈ సందేహం తనది మాత్రమే కాదు, గతంలో అప్పుడప్పుడూ నాకూ ఈ సందేహం కల్గేది. 
ఒకొకరిని చూసిన మొదటసారే ఎప్పుడో ఎక్కడో చూసినట్లు, ఎంతో పరిచయం ఉన్నట్లు ఏదో ఆత్మీయతాభావానుభూతి.
ఒకొకరిని చూసినప్పుడు వారివలన ఏ ఇబ్బంది లేకున్నా ఏదో చిరాకుభావం. 
ఇది ఒకప్పటి నా అనుభవం -
మా వీధిలో ఇల్లుకట్టుకొని క్రొత్తగా గృహప్రవేశం చేసిన ఒకామెను చూసిన మొదటసారే ఏదో ఆత్మీయత! హృదయంలో అభిమానపు స్పందనలు! తనని అదే మొదటిసారి చూడడం...కానీ; ఎంతో పరిచయస్థురాలన్న అనుభూతి. ఏ జన్మలో బంధమో అన్న భావన. ఇలాంటి భావనలు ఎందుకనీ?
అలానే ఈ వీధిలో మరొకామెను చూసినప్పుడంతా ఎంతో చిరాకు. ఆమె నేను కన్పించినప్పుడంతా చిరునవ్వుతోనో, చిరుమాటతోనో పలకరించేవారు. కానీ; ఆమె వెళ్ళిన కొన్ని నిముషములు వరకు నాలో ఏదో అసహనం. ఇలా ఎందుకనీ?
అర్ధం కాలేదు, ఇలా ఎందుకన్న నా ప్రశ్నకు జవాబు తెలియలేదు.
(ఇది ఒకప్పటి నా అనుభవం అని ఎందుకన్నానంటే ఇప్పుడు ఈమె పట్ల నాకు చిరాకు లేదు. ఓ యదార్ధఘటన చదివి రియలైజ్ అవడంతో చిరాకు స్థానంలో చిరుఅభిమానం చోటుచేసుకుంది.
నేను చదివిన ఆ యదార్ధఘటన -
సెయింట్ తెరిస్సా ఆశ్రమంలో ఇతరులతో కలవకుండా ఎప్పుడూ చిరుబురులాడే ఓ సన్యాసిని ఉండేవారట. ఆవిడ అందరిపై ఆకారణముగా అరుస్తూ, మండిపడుతూ ఉండేవారు. ఆమెని మిగత అందరు సన్యాసినులు తప్పించుకు తిరిగేవారు. కానీ మధర్ తెరిస్సా మాత్రం ఆమెను ఆత్మీయంగా పలకరించేవారు. ఆమె చిరాకుపడిన మదర్ తెరిస్సా మాత్రం చిరునవ్వుతో మాట్లాడేవారు. ఇలా కొంతకాలం గడిచాక ఓ రోజు ఆ సన్యాసిని మదర్ తెరిస్సాను ఆపి 'అందరూ నన్ను దూరంగా చూస్తేనే తప్పుకుంటారు, మాట్లాడరు కానీ, నీవు నేను కన్పించినప్పుడంతా స్వచ్ఛంగా హాయిగా నవ్వుతూ ఆత్మీయంగా పలకరిస్తావు, నాలో నీకంత నచ్చింది ఏముందని అడగారు. అంతట "అందరూ నిన్ను చూస్తున్నారు, నేను నీ అంతరాత్మలో నిలిచి ప్రకాశిస్తున్న జీసస్ ని చూస్తున్నాను" అని బదులిచ్చారని చదివిన తర్వాత ఆకారణంగా నాలో చిరాకు కలగడం ఎందుకో తెలియకపోయినను అది తప్పనిపించి ప్రయత్నపూర్వకంగా ఆ భావంనుండి బయటపడ్డాను. ఆ ఘటన చదివిన దగ్గరనుండి నా  ప్రవర్తనలో మార్పు వచ్చింది. అప్పటినుండి నాకు నేనుగా ఆమెను అభిమానంగా పలకరించడం అలవాటు చేసుకున్నాను. ఈ రీతిలోనే నన్ను మంచిగా ప్రభావితం చేసిన ప్రార్ధన మరొకటుంది. అది అస్సిసీకి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ ప్రార్ధన -
ప్రభూ! నన్ను నీ శాంతికొక వాహికగా మార్చు
ద్వేషమున్న చోట ప్రేమ బీజాల్ని పాతనివ్వు
గాయాలు తగిలినచోట క్షమల్ని రాజిల్లు
సందేహాలు ముసిరినప్పుడు నమ్మకాల్ని ప్రసాదించు
నిరాశ మూసినవేళ ఆశను రగిలించు 
చీకటి కప్పిన సమయాన వెలుతుర్ని వెలిగించు 
బాధ పీడించిన వేళ ఆనందాన్ని రప్పించు
ఓ దివ్యమూర్తీ! నాకు మరేమీ కోరికలు లేకుండా చేయి
ఓదార్చబడడంకంటే ఓదార్చడానికీ
అర్ధంచేసుకోబడడంకంటే అర్ధంచేసుకోవడానికీ 
ప్రేమించబడడంకంటే ప్రేమించడానికీ నాకవకాశమివ్వు
ఇవ్వడంలోనే మనం పుచ్చుకోవడమూ జరుగుతుంది
క్షమిస్తున్నప్పుడే మనమూ క్షమించ బడతాం
స్వార్ధాన్ని చంపుకున్నప్పుడే మనం అనంతంలో పుడతాం)

ఐతే అలా అకారణ ప్రేమ, చిరాకులు ఎందుకు కల్గుతాయో అన్న ప్రశ్నకు సమాధానం సరిగ్గా తెలియదు. నిన్న నా మిత్రురాలు ప్రశ్నతో తిరిగి అదే ప్రశ్న నాలో - ఎందుకనీ?
బహుశా ఏ జన్మ ఋణానుబంధమో కారణం కావచ్చు. లేదా మనోభావనలకు దర్పణం ముఖం. త్రిగుణంలలో ఏ గుణం మనలో ఎక్కువగా ఉంటే ఆ గుణలక్షణం మన ముఖంలో ప్రస్ఫుటం అవుతుంది. అంటే సత్త్వగుణం ఎక్కువగా ఉంటే ప్రశాంతత, మంచితనం; రజోగుణం ఉంటే కోపం, అశాంతి; తమోగుణం ఉంటే బద్ధకం, నిద్రముఖంలా కన్పిస్తుంది. సత్త్వగుణం ఉన్నవారిని చూసినప్పుడు గౌరవభావంకల్గి మ్రొక్కాలనిపిస్తుంది. రజోగుణమున్నవారిని చూసినప్పుడు మొట్టాలనిపిస్తుందనుకుంటాను  అని నేను చెప్పగా అది కొంతవరకే సరైన సమాధానమంటూ - సరేలే, ఎవరైనా పెద్దవారిదగ్గర ఆరా తీస్తానులే అని తను అంది. అదిగో అప్పుడే 'ఆరా' అన్న పదం వినగానే నాలో ఏదో జ్ఞాపకం. అవును... నా చిన్నప్పుడు మా మాస్టారుగార్ని భగవంతుడు చుట్టూ ఆ కాంతి ఏమిటని అడిగాను. అప్పుడు మాస్టారుగారు ఆరా గురించి చెప్పారు. 
ఆరా:
భగవంతుని చుట్టూ ఉన్న ఆ కాంతివలయమును "ఆరా" అంటారని, ఆ ఆరా ప్రతీ ప్రాణి చుట్టుతా కంటికి కనపడని ఓ విద్యుదయస్కాంతవలయంలా ఉంటుందని చెప్తూ ఇంకా ఇలా చెప్పారు -
జీవరాసుల అన్నింటికీ దేహం చుట్టూ 'ఆరా'గా పిలవబడే కాంతివలయముంటుంది. ఇది ప్రాణిలో ఉన్న ఆత్మ యొక్క ప్రకాశం. ఈ కాంతి ఆత్మసాక్షాత్కారం అయిన మహర్షులు, యోగులు, జ్ఞానులు చుట్టూ ప్రకాశవంతంగా ఉంటుంది. సామాన్యుల దృష్టికి ఇది కనబడదు. సాధరణంగా మానవులకు శరీరం చుట్టూ ఈ వలయం ఐదు నుండి పది అడుగులవరకు ఉంటుంది. ఈ వలయంలోనికి ప్రవేశించిన మరోవ్యక్తి "ఆరా" ఆకర్షణలు పడతాయి. ఇలా ఒకరి 'ఆరా' మరొకరి 'ఆరా' దగ్గరకు వచ్చినప్పుడు ఆ రెంటికీ ఒకే గుణంగల లక్షణాలుంటే వారిద్దరూ స్నేహితులౌతారు, సన్నిహితులౌతారు, వారి మధ్య ఓ బంధం ఏర్పడుతుంది. అప్పుడు ఒకరికి ఒకరు తెలిసినట్లుగా ఆత్మీయులుగా భావిస్తారు. అలానే వేరు వేరు గుణాలుగల 'ఆరా' లక్షణాలు విభేదించినప్పుడు స్నేహం కుదరదు, వైముఖ్యం తప్పనిసరి. అలానే యోగులు, మహర్షులు చుట్టూ ఈ 'ఆరా' ఇరవైఐదు నుండి ముప్పది అడుగులమేర విస్తృతంగా, ధృడంగా ఉంటుంది. అందువలనే వారికి జనాకర్షణ శక్తి, అద్భుత శాంతిశక్తి ఎక్కువగా ఉంటుంది. 'ఆరా' బలహీనపడితే రోగాలబారినపడి వ్యాధిగ్రస్తులమౌతాం. 'ఆరా' పూర్తిగా శిధిలమైనప్పుడు ప్రాణం పోతుంది... అని చెప్పారు. మాస్టారుతో నా ముచ్చట్లన్ని ఎన్నో సంవత్సరములక్రితంనాటి జ్ఞాపకాలు. ఇప్పటిలా మంచివిషయాలు వెంటనే వ్రాసుకునే అలవాటు ఆనాడు నాకు అలవడలేదు. ఈ అలవాటు అప్పుడే ఉంటే ఈనాడు నాదగ్గర తరింపజేసే తరగని ఓ జ్ఞాననిధే ఉండేది. ప్చ్ .......!

17, మే 2012, గురువారం

జ్ఞాపకాల దొంతరలో మరో ముచ్చట - ఏడుచేపల కధ అంతరార్ధం.

వేసవికాలం....  ఉదయమంతా ఎప్పటిలా నేనూ, లావణ్య మా ఈడువారందరితో కల్సి ఒకటే అల్లరి. ఆటలూ, పాటలు, కబుర్లుతో గడిపేశాం. సాయంత్రమున పొలాల గట్లుపై పరుగులు. తోటలో మామిడికాయలు రైతుతో కోయించుకొని, ఇంట్లో పొట్లం కట్టుకొని తీసుకెళ్ళిన ఉప్పూ, కారముపోడిలో అద్దుకొని తినడం, కొబ్బరిబొండాలు దింపించుకొని త్రాగడం, లేత తాటిముంజులు పోటీలు పెట్టుకొని తినడం, బాగా ప్రొద్దు పోయేంతవరకు తిరిగి తిరిగి ఇంటికి చేరడం..... రాత్రికి ఆరుబయట నవ్వారు మంచాలుపై బొంతలేసుకొని మా తెలుగుమాస్టారు చెప్పిన కబుర్లు, ఆ అత్తయ్య (మాస్టారుగారి భార్య) తన మనవడుకు చెప్పే కధలు వింటూ పడుకోవడం ఓ అలవాటు. ఎప్పటిలా ఆ రోజు కూడా ఆరుబయట పడుకొని అత్తమ్మ చెప్పే కధని వింటున్నాం. అది ఏడుచేపల కధ. ఎన్నోసార్లు విన్న కధ, అయినా అత్తమ్మ చెప్తుంటే శ్రద్ధగా వింటున్నాం. కధ కంచికి, మనమింటికీ....అంటూ కధ పూర్తిచేసిన అత్తమ్మ - 
'అవునూ..... మన పురాణాల్లో ఉన్న కధలలోనే కాదు, మన పెద్దలు చెప్పిన కధల్లో, సామెతల్లో కూడా ఎంతో లోగుట్టు ఉంటుందని అంటారు కదా! మరి ఈ ఏడుచేపల కధలో కూడా ఏదైనా మర్మముందా? అని మాష్టారుగార్ని ఆవిడ అడిగారు. ఓ అందులో కూడా చక్కటి అంతరార్ధం ఉందని మాష్టారుగారు అనగానే అందరం గబాలున లేచి మాష్టారుగారి చుట్టూ చేరిపోయాం.
అందరికీ తెలిసిన కధే అయినా ఓసారి ఆ కధను మననం చేసుకుందాం. అటుపై మాస్టారుగారు ఏం చెప్పారో తెలుసుకుందాం.
అనగనగా  ఓ రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఎండలో పెట్టారు. అందులో ఓ చేప ఎండలేదు. ఇక ప్రశ్నలు మొదలయ్యాయి... 
చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డువచ్చింది. 
గడ్డిమోపా గడ్డిమోపా ఎందుకు అడ్డువచ్చావు? ఆవు మేయలేదు.
ఆవా ఆవా ఎందుకు గడ్డిని మేయలేదు? పాలేరు తాడు విప్పలేదు.
పాలేరా పాలేరా తాడు ఎందుకు విప్పలేదు? అవ్వ బువ్వ పెట్టలేదు.
అవ్వా అవ్వా బువ్వ ఎందుకు పెట్టలేదు? పిల్లవాడు ఏడుస్తున్నాడు.
పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావు? చీమ కుట్టింది.
చీమా చీమా ఎందుకు కుట్టావు? నా బంగారుపుట్టలో చేయిపెడితే కుట్టనా?
ఇది అత్తమ్మ చెప్పిన కధ. దీనికి మాస్టారుగారు ఇచ్చిన వివరణ -
 
 ఈ కధలో రాజు అనగా ఓ సాధకుడు. ఆ సాధకుని దేహంలో వున్న ఏడు చక్రాలు (మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారం) ఏడుగురు కొడుకులు. 
ఆ ఏడుగురు కొడుకులు వేటకి అంటే ధ్యానస్థితికి వెళ్ళిరి. ఏడు చేపలు తెచ్చారనగా తన ధ్యానంకు అవరోధమైన మనస్సు, అరిషడ్వర్గములు అని తెలుసుకున్నారు. సాధన అనే ఎండలో ఈ ఏడింటిని ఎండబెట్టారు. అందులో మనస్సనే చేప ఎండలేదు. ఎందుకెండలేదన్న విచారణ ప్రారంభమైంది.
మనసా, మనసా ఎందుకు ఎండలేదు? అవివేకం అడ్డు వచ్చింది.
అవివేకమా, అవివేకమా ఎందుకు అడ్డువచ్చావు? వివేకం మేయలేదు.
వివేకమా, వివేకమా ఎందుకు మేయలేదు?బుద్ధీ అనబడే పాలేరు మాయనే తాడుని విప్పలేదు.
బుద్ధీ, బుద్ధీ ఎందుకు విప్పలేదు? భక్తీ అనబడే అవ్వ జ్ఞానమనబడే బువ్వని పెట్టలేదు.
భక్తీ, భక్తీ ఎందుకు బువ్వ పెట్టలేదు? ప్రాపంచిక బంధాలు ఏడిపిస్తున్నాయి.
ప్రాపంచిక బంధాలూ, ప్రాపంచిక బందాలు ఎందుకు ఏడిపిస్తున్నారు? వైరాగ్యం కుట్టింది.
వైరాగ్యమా, వైరాగ్యమా ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో చేయి పెడితే కుట్టనా?
ఇప్పుడు ఈ కధను చివరనుండి మొదటకి జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలంటూ మాస్టారుగారు ఇలా వివరించారు -
పుట్ట అంటే వ్యక్తి దేహమని అర్ధం. నేలమీద కూర్చున్నప్పుడు దేహం ఎలా క్రింద విశాలంగా ఉంటుందో, పైకి పోనూ పోనూ ఎలా దేహం సన్నగా ఉంటుందో పుట్ట కూడా అదే మాదిరిగా క్రింద విశాలంగా, పైకి వెళ్తున్నకొలదీ సన్నగా ఉంటుంది. మానవదేహంలో నవరంద్రాలు ఎలా ఉంటాయో పుట్టకు కూడా ఎన్నో రంద్రాలు ఉంటాయి. ప్రతీ మనిషికీ ఎప్పుడో ఒకప్పుడు ఏమిటీ జన్మ అని అన్పిస్తుంది. అలా అన్పించినప్పుడు కొందరిలో ఆధ్యాత్మిక జిజ్ఞాస కల్గి అంతర్ముఖం అవుతారు. పుట్టలో చేయి పెట్టడమంటే ఆధ్యాత్మిక జిజ్ఞాసతో అంతర్ముఖం కావడం. అలా అంతర్ముఖం కావడం వైరాగ్యమనే చీమ కుట్టినప్పుడు కల్గుతుంది. వైరాగ్యం కల్గినప్పుడు ప్రాపంచిక బందాలు ఎంత దుఃఖపూరితమో గ్రహిస్తాడు. భక్తి  జ్ఞానమనే బువ్వని పెడుతుందని గ్రహించి బుద్ధితో మాయ అనే తాడుని విప్పుకుంటాడు. అప్పుడు వివేకం కల్గి అవివేకమనే అడ్డుని తప్పిస్తుంది. అప్పుడు అరిషడ్వర్గాలుతో పాటు మనస్సు కూడా ఎండి అంటే నశించి ధ్యానం బాగా కుదిరి కుండలినీశక్తితో సప్తచక్రాలు అధిరోహించిన సాధకుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. మానవుడే మాధవుడవుతాడు. 
                                                         కధ కంచికి, మనం జ్ఞానమింటికి.