28, సెప్టెంబర్ 2015, సోమవారం

స్థూలం నుండి ప్రజ్ఞామయం వరకు - - - చక్రశుద్ధి - ఆనందసిద్ధి (చివరిభాగం)

ఇంతవరకు 'స్మరణ' యందు వివరించిన ఆరు చక్రాలను షట్చక్రములుగా పేర్కొంటారు. ఏడవది సహస్రారంగా వర్ణిస్తారు. ఇందు మొదటి ఆరింటి యందును ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణత చెంది, ఏడవది యగు సహస్రారమందు లయము చెందుటయే యోగం. ఇదియే మోక్షం. ఇదియే నిర్వాణం. ఇదియే అద్వైతస్థితి. 

ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమునూ, అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమునూ, స్వాధిష్టానం, మూలాధార చక్రములు తమోగుణమును వ్యక్తం చేయును. 
తమోగుణం దేహధాతువుల నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం వహించడమే కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తియే. 
రజస్సు వలన శరీరం నందలి వివిధ అవయములు పనిచేయుచున్నవి. ఇక సత్వం వలన గ్రహణశక్తి, వివేకం, విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును. ఈ మూడును మూడు లోకములుగా అంటే,  భూలోకం (తమస్సు), భువర్లోకం (రజస్సు), సువర్లోకం (సత్వం)లుగా  మనదేహంనందునూ, సౌరమండలం నందునూ ఏర్పడుచున్నవి. 

గత టపాల్లో మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు సహస్రారచక్రం గురించి తెలుసుకుందాం. 

సహస్రారచక్రం : -              
                                                   
సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖా సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ 

ఈ కమలం వేయిదళాలతో వికసించి యుంటుంది. అధిదేవత యాకిని. అకారాది క్షకారంత వర్ణమాల యోగినీగణం చేత సేవించబడుచున్నది. ఈమెకు సర్వాన్నం ప్రీతి. 
                                           

                                       
మస్తిష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం విశ్వాత్మ నివాసస్థానం. పరమాత్మ స్థానం. ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం. ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం. ఆత్మశక్తి అలరారే సుందర సుదర్శన చక్రం. విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ సహస్రారం. పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక. ఆనందమయకోశంతో సంబంధం. 

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - 
షట్చక్రాలు బలహీనపడతాయి. గ్రహణశక్తి లోపిస్తుంది. భూత వర్తమానాలోనికి పయనిస్తూ అలసిపోతుంటారు. కష్టదుఃఖాలు పొందుతుంటారు. పునర్జన్మలు తప్పవు. 
ఈ చక్ర మానసిక స్వభావం - 
ఈ చక్రం జాగృతయితే సాధకుడు అమరుడౌతాడు. పరమాత్మగా వ్యక్తమౌతాడు. తనకు తాను తెలుసుకుంటాడు. ఇది ఈశ్వరీయత స్థితి. ఈశ్వరత్వం పొందుతారు. 
ఈ చక్రమును శుద్ధిచేసుకోవాలంటే - 
తలపు, మాట, చేత యోగ్యంగా వుండాలి. క్రమశిక్షణ, ఆచరణ, విశ్వాసం కలిగియుండాలి. ధ్యానం, బ్రహ్మతత్త్వజ్ఞానం, స్థితప్రజ్ఞ (గతాన్ని తలవక, భవిష్యత్తు ఊహించక, వర్తమానంలో వర్తించడం అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించడం) ప్రశాంత వాతవరణం ఏర్పరచుకోవడం చేయాలి. ఇక ఈ చక్రంనకు అధిపతి గ్రహం 'సూర్యుడు'. ఋజువర్తన, నాయకత్వలక్షణాలు, అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణీయశక్తి, సునిశితమైన చూపులు, విశాలమైన నుదురు, ఎందులోనూ ఓటమిని పొందని, మాటపడని తత్త్వం, విభిన్నమైన ఆలోచనావిధానంతో విజయమును సాధించే కార్యదక్షత సూర్యుని లక్షణాలు. సాధన ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే సహస్రారం శక్తివంతమై, తద్వారా ఈ చక్రంతో అనుసంధానింపబడియున్న షట్చక్రాలు శక్తిసామర్ధ్యాలు కలిగియుండి మనజీవితములు  ఆనంద నందనవనములు అవుతాయి. 
ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి స్నానపానాదులు ముగించుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని, సూర్యోపాసన చెయ్యాలి. అంటే సూర్యకిరణాలు తాకిడిని అనుభవిస్తూ, సూర్యభగవానుని శక్తి మన సహస్రారం గుండా అన్నిచక్రాలయందు నిబిడీకృతమవుతున్నట్లు భావిస్తూ, ప్రశాంతచిత్తంతో కాసేపు ధ్యానించాలి. క్రమం తప్పని ఈ ఆచరణ వలన సూర్యభగవానుని శక్తి, గాయత్రి శక్తి మనకు లభించి తేజోమూర్తులవుతాం. 

కుండలినీశక్తి స్థూల శరీరం నుండి ప్రజ్ఞామయ శరీరం వరకు వ్యాపించియున్నది. ఈ శక్తిని చైతన్యవంతం చేయాలి. ఆయా చక్ర దేవతలను ప్రార్ధించాలి. {ప్రార్ధన అంటే దైవస్మరణ మాత్రమే కాదు, పూజగదిలో దేవుని పటాల ముందు దీపారాధన చేసి భగవంతుణ్ణి ఏదో ఒకపేరుతో నుతించడం, స్తుతించడం కాదు,  శ్లోకపూరితమైన అనుష్టానాలు కాదు. దేవుడు అంటే పటమో విగ్రహమో కాదు, దేవుడు అంటే గుడి లోనో, దివిలోనో ఉండేవాడు కాదు, పటమైనా, విగ్రహమైన, శ్లోకమైన, మంత్రమైన, నామమైన ... ఇవన్నియూ మన మనస్సును ఇహం నుండి పరం వైపు త్రిప్పడానికే అన్న నిజాన్ని అర్ధంచేసుకొని, దేహమే దేవాలయమని, అంతరాన్నే అంతర్యామి కొలువై వున్నాడని గ్రహించి అందుకు తగ్గ ప్రార్ధన చేయాలి}. ప్రకృతి సహజంగానే ప్రతీ మనిషికి కొంతశక్తి వస్తుంది. కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుకుని, వున్నశక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని పెంపొందించుకోగలగాలి. మనకేం కావాలో, మన గమ్యమేమిటో, ఏమార్గంలో పయనించాలో తెలుసుకుంటూ (శోధిస్తూ) సప్తచక్రాలను చైతన్యపూరితం చేయగలిగే సాధన చేయగలగాలి. ఈ విధమైన సాధనే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది.

ఈ విధంగా సాధన సాగిస్తున్న కొలది ...  ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పదంలో విశాలత, అందర్నీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవాతత్పరత, అన్ని పరిస్థితులలోనూ సంయమనం, స్థితప్రజ్ఞత అలవడతాయి. నేను అనెడి అహం నశిస్తుంది. 'నేను' అనెడి సంకుచిత స్వాభిమానమదృశ్యమైనచో అనంతమగు 'అహంబ్రహ్మస్మి' అనెడి ఉత్తమస్థితి తనంతటదియే సాక్షాత్కారమగును. అప్పుడు ఆనందం ఓ స్రవంతిలా ప్రవహిస్తుంది. పారమార్ధికంగా పురోగతి సాధించామన్నదానికి గుర్తు - ఆనందంగా ఉండటమే. సహజత్వానికి దగ్గరగా ఉండటమే. 
ఈవిధంగా సరైనరీతిలో సప్తచక్రాలను సాధన చేస్తే, సంసారం నందు తిరిగి జన్మింపరు. మూడులోకములయందు సయితం బద్ధులు కారు.  

మనలో వున్న సప్తచక్రాలను చైతన్యవంతం చేసే సాధనతో  స్థూలంనుండి  ప్రజ్ఞామయం వరకు పయనించి 'అహం బ్రహ్మస్మి' అన్న స్థితిని పొందడమే జీవన పరమావధి. 




18, సెప్టెంబర్ 2015, శుక్రవారం

"అచ్చంగా బాలగోవిందులు"

కొన్నిరోజుల క్రితం తిరుపతి వెళ్ళాం, నా మనవళ్ళు {మా అమ్మాయి సంతానం, మొదటపాప శ్రీమాన్వి (స్మరణ సందర్శులకు సుపరిచితం), రెండవసారి ఇద్దరు బాబులు (కవలలు), అభినవ్ రామ్, అభిజిత్ రామ్} బాబులిద్దరికి పుట్టుజుత్తు తీయించడానికి. 

పుట్టుజుత్తు తీసేసిన తర్వాత దర్శనానికి వెళ్తుండగా ఓ ఆమె వచ్చి నామాలు బాబులకు పెట్టి "అచ్చంగా బాలగోవిందులు"లా వున్నారు అని అనగా, 
                                              అచ్చంగా బాలగోవిందులు                

ఆహా! బాల గోవిందులు నా మనవళ్ళు అని అనుకోగా, మనసంతా ఆనందంతో నిండిపోయింది. 'ఇంతటి అదృష్టాన్ని అనుగ్రహించిన నీకు నేనెమివ్వగలను వేంకటేశా' అని అనుకోగానే నవ్వువచ్చింది. సర్వమూ తనదైన ఆ సర్వేశ్వరునికి  నేనిచ్చేది ఏముంటుందీ? మనసార నమస్కరించడం, పాహిమాం పాహిమామని ప్రార్ధించడం, శరణు శరణని వేడుకోవడం తప్ప... అని అనుకుంటుండగా, నాకెంతో ఇష్టమైన అన్నమయ్య సంకీర్తన గుర్తుకొచ్చింది. ఆ సంకీర్తన మదిలో కదులాడుతుండగా, శరణాగతి భావంతో  దైవాన్ని దర్శించుకోవడం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. 

ఇంతకీ నా మదిలో కదిలాడే ఆ సంకీర్తన ఏమిటో చెప్పనే లేదు కదా. ఆ పరమోత్తమ సంకీర్తన ఇదే - 

ఏ దుపాయము యే నిన్ను చేరుటకు / ఆదినంత్యములేని                                                                                                                        అచ్యుతమూరితివి 
వెలయ నీగుణములు వినుతించేనంటే /తెలియ నీవు గుణాతీతుడవు 
చెలరేగి నిన్ను మతి జింతించేనంటే / మలసి నీవచింత్యమహిముడవు
పొదిగి చేతుల నిన్ను బూజించేనంటే / కదసి నీవు విశ్వకాయుడవు 
అదన నేమైన సమర్పించేనంటే / సదరమై అవాప్తసకలకాముడవు 
కన్నులచేత నిన్ను గనుగొనేనంటే / సన్నిధి దొరక నగోచరుడవు
యిన్నిటాను శ్రీవేంకటేశ నీవు గలవవి / వన్నెల శరణనేవాక్యమే చాలు  

ఆదీ అంత్యమూ లేని అచ్యుతమూర్తివి అయిన నిన్ను ఉపాసించే మార్గం ఏదీ? నిన్ను చేరాడానికి ఉపాయం ఉందా? ఉంటే అది ఏదీ? అని అన్నమయ్య అంటూ ఇలా కీర్తించాడు -

నీ గుణములు కీర్తించుదామంటే నీవు గుణాలకన్నింటికీ అతీతుడవు. మదిలో నిన్ను గూర్చి చింతించుదామనుకుంటే నీకై చింతించుటకు సాధ్యంగాని అనంతమైన మహిమలు కలవాడివి. ఇక నా చేతులతో నిన్ను పూజిద్దామంటే, నీవు అందుకు సాధ్యంగాని విశ్వమయుడవు. మరి ఏదైనా నీకు సమర్పించుదామంటే, నీవు అన్నికోరికలు తీరినవాడివి. నా కన్నులతో నిన్ను చూద్దామంటే, నీవు అగోచరుడవు. అందువల్ల ఓ వేంకటేశా! అన్నింటా మేలైనది, నీకు శరణు అనడమే, నిన్ను శరణుపొందడమే. 
                                                          *****
                      
                                        

                              వావ్ ... బాలగోవిందులు ఇక్కడ బాలకృష్ణులయ్యరే!

నా మనవళ్ళు బాలగోవిందులై గుర్తుచేసిన అన్నమయ్య సంకీర్తన పైనది కాగా, బాలకృష్ణులై  గుర్తుచేసిన మరో సంకీర్తన యిది - 

ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు / వాని పట్టితెచ్చి పొట్టనిండా పాలు వోయరే 
గామిడై పారితెంచి కాగెడి వెన్నలలోన / చేమపూవు కడియాల చేయిపెట్టి 
చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార / వేమరు వాపొయె వాని వెడ్డువెట్టరే 
ముచ్చువలె వచ్చి తన ముంగిట మురువుల చేయి / తచ్చెడి పెరుగులోన తగవెట్టి 
నొచ్చెనని చేయిదీసి నొరినెల్ల జొల్లుగార / వొచ్చిలి వాపోవువాని నూరడించరే 
ఎప్పుడు వచ్చెనో మా యిల్లుజొచ్చి / పెట్టెలోని చెప్పరాని వుంగరాల చేయిపెట్టి 
అప్పడైన వేంకటేశుడా సపాలకుడు గాన / తప్పకుండా బెట్టె వాని తలకెత్తరే //

కుదురుగా కూర్చోక, ఉన్నచోట వుండక, ఆ వాకిట ఈ వాకిట, చెట్టూపుట్టా, సందూ గొందూ అనక అటూ ఇటు పరుగులు తీసే చిలిపికన్నయ్యను చూస్తూ గోపకాంతలు మురిపంగా ఇలా అనుకుంటున్నారట ... 

ఈ ముద్దులోచ్చే బాలుడు ఎక్కడివాడమ్మా, వాని పట్టితెచ్చి పొట్టనిండా పాలు పోయండే. 
వెన్నను కాజేద్దామని ఆరిందలా పరిగెట్టుకుంటూ వచ్చి కాగుతున్న వెన్నకుండలో తన కడియాల చేయిపెట్టి, చేయి చురుక్కుమని, చెక్కిట కన్నీరు కారుతుండగా, తన నవనీతచోరత్వం బయటపడకూడదని మనల్ని ఏమార్చుతూ చీమకుట్టిందని వాపోతున్న కృష్ణయ్యను ఊరడించరే ... 
దొంగలా వచ్చి తన బుజ్జిచేతిని చిలుకుతున్న పెరుగులోన పెట్టగా, కవ్వం తగలగా, చేయినొచ్చెనని నోరంతా జొల్లుకారెట్లు ఏడుస్తున్న ఈ కన్నయ్యను కాస్తా ఊరడించండ్రా  ... 
బాలకృష్ణుని చిలిపిచేష్టలు, రేపల్లే పడుచుల ముచ్చట్లూ, మురిపాలు ... ఎంతవిన్నా, ఎంతచదివినా ఆ ఆనందం తనివి తీరనిది. 
మొదటంతా తన భక్తులైన గోపకాంతల చెంత నవనీతచోరత్వం గురించి ఆ గోపికలు మురిపంగా చెప్పుకోవడంను అన్నమయ్య కీర్తించాడు. {భక్తుల భవబంధపాశాల విమోచన చేసే ఈ చోరత్వం వెనుక ఓ మర్మముంది. ఆ వివరణ

 ఇక్కడ క్లిక్ చేసి చూడగలరు}. ఇంతవరకు కృష్ణయ్య బాలలీలలు తెలిపిన అన్నమయ్య చివరి చరణంలో ఇలా కీర్తించాడు  -

ఎప్పుడు వచ్చెనో మాయింట్లోనికి. వచ్చి పెట్టెలో చెయ్యి పెట్టెను. ఇక ఈ పెట్టెను తప్పకుండా అసమానుడైన వేంకటేశ్వరుని తలకెత్తరే ... అని అన్నమయ్య అనడంలో అంతరార్ధం అనంతం. 
ఇంట్లోనికి రావడం, పెట్టెలో చెయ్యి పెట్టడం, ఆ పెట్టెను భగవంతుని తలపై పెట్టమనడం ... కాస్తా ఆలోచిస్తే ఇందులో సూక్ష్మార్ధం అవగతమౌతుంది. 
ఆ సూక్ష్మార్ధం తెలుసుకునే ముందు ఓసారి మనసార అన్నమయ్యను స్మరించుకోవాలని వుంది. 
తాను తరించి, మనలనూ తరింపజేసే వాగ్గేయకారుడు "అన్నమయ్య". ఈయన సంకీర్తనలు వేదాంత భావగర్భితాలు. ప్రతీ కీర్తనలో వేదాంత రహస్యాలు, ఆధ్యాత్మిక సూచనలు వుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతీ సంకీర్తనలో బ్రహ్మతత్త్వ సారాంశముంటుంది. 

ఆధ్యాత్మిక సాధకుని ప్రయత్నంలో తొలుత ఎంతో అయోమయం, ఎన్నో అర్ధంకాని విషయాలు, అటుపై ఎంతోకొంత అస్థిరత్వం, అంతం అగుపించని అన్వేషణ, తీరం తెలియని పయనం, అంతర్యామిని కనుగొంటానా అన్న ఆవేదన, అనంతున్ని పొందాలన్న ఆరాటం, వీడని వాసనల వలన ఆందోళన, అన్నింటినీ వీడి మనస్సుని అధిగమించాలన్న పోరాటం ... ఇలా ఎంతో సంఘర్షణతో నలిగిపోతున్న మనస్సును చల్లగా తాకి, దారిచూపేవే అన్నమయ్య సంకీర్తనలు. సాధకునికి అన్నమయ్య ప్రతీ సంకీర్తన సదా స్మరణీయం.
అయితే, అన్నమయ్య పాటలు కొన్ని త్వరగా అర్ధం కావు. అందుకు కారణం - ఈయన వాడిన కొన్ని పదాలు నేడు మరుగున పడిపోయాయి. జన వ్యవహారికంలో లేవు. అయినను అవగాహన చేసుకోవడానికి ఒకింత ప్రయత్నం చేస్తే, ఆప్పుడు అవగతమౌతుంది ఈయన పలికిన పలుకెల్ల పదకవితై పరమాత్ముణ్ణి ఎలా మెప్పించ గలిగిందన్నది. 
పదకవితా పితామహుడయిన ఆన్నమయ్య విరచిత సంకీర్తనలు వేనవేలు. 
దాచుకో, నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి 
పూచి నీ కీరితి రూపు పుష్పములివియయ్యా 
ఒక్క సంకీర్తనే చాలు, ఒద్ధికై మము రక్షింపగ
తక్కినవి భండారాన దాచి ఉంచనీ ... అన్న ఆయన భావంలో అతిశయోక్తి లేదు. 
 
ప్రతీ పలుకు పారమార్ధిక పాటైన పదజీవనునికి పాదాభివందనాలు.  

ఇక పై సంకీర్తనలో ఆ చివరి చరణం యొక్క సూక్ష్మార్ధంను పరిశీలిస్తే - 

కర్మ చేయక క్షణమైనను జీవించలేం. ఉన్నస్థితినుండి ఉన్నతస్థితికి చేరుకోవాలనే ప్రయత్నమే ప్రతీ ప్రాణీ చేయు 'కర్మ'.  చేసే ప్రతీ కర్మ యొక్క ఫలితం మనస్సులో సూక్ష్మాతి సూక్ష్మమైన ముద్రను వేస్తుంది. దీనినే 'వాసన' అంటారు. ఈ వాసనలననుసరించే మనలో కోరికలు, తలపులు జనిస్తుంటాయి, పునర్జన్మలకు హేతువవుతుంటాయి. అందుకే ఈ వాసనలుగా పరిణమించే కర్మలు ఉన్నతంగా, అచ్యుతున్ని అందుకునేలా ఉండాలి. ఏ కర్మలాచరిస్తే అది 'వాసన'గా మనల్ని బాధపెట్టాక, బంధీ చేయక వుంటుందో, అటువంటి సత్కర్మలు సద్భావనతో ఆచరించగలగాలి. అటుపై ఆ సత్కర్మ ఫలితాన్ని ఆసక్తితో, ఓ సంపదగా మన మది అనే బోషానంలో దాచుకోక, ఆ బోషానాన్ని అంటే ఆ పెట్టెను ఆ అనంతున్నిపై పెట్టేస్తే ... అంతా ఆయనకే సమర్పించేస్తే ... మనసు వెదురుబొంగులా డొల్లవ్వదా, అది ఆ భగవంతుని చేతిలో పిల్లనగ్రోవి కాదా? ఇలా చేస్తే జీవితం సార్ధకం కాదా? ఈ ప్రయత్నం పరమాత్ముణ్ణి చేర్చదా? 
నిష్కామ కర్మయోగం అంటే ఇదే. దీనిని ఆచరిస్తే జన్మ పావనమౌతుందన్న సత్యాన్ని తెలియచెప్తుంది పై కీర్తనలో చివరి చరణం. 
                                                                                                                                                 అమ్మమ్మా! నేను కూడా కృష్ణునిలా తయారయ్యాను చూడు అని అంటున్న నా  చిట్టితల్లి శ్రీమాన్వి 

ఇంత చక్కటి సంకీర్తనలను స్మరించుకునేటట్లు చేసిన నా చిన్నారి మనవళ్ళుకు శుభాశీస్సులతో ఈ పోస్ట్ ను ప్రేమగా  వారికి అంకితమిస్తున్నా. 






    26, ఆగస్టు 2015, బుధవారం

    జీవాత్మ-పరమాత్మ --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి [ఆరవభాగం]


    గత టపాల్లో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధచక్రాలు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆరవచక్రమైన ఆజ్ఞాచక్రం గురించి తెలుసుకుందాం -
    ఆజ్ఞాచక్రం -
    ఐం హ్రీం శ్రీం హాం హం సశ్శివస్సోహం సోహం, సశ్శివ ఆజ్ఞాదిష్టాన దేవతాయై హాకినీ సహిత పరమాత్మస్వరూపిణ్యై నమః
    ఈ కమలం రెండు దళాలుతో వుంటుంది. మనోతత్త్వం. అధిదేవత హాకీని. ఈమె హ, క్ష అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమెకు పులిహార ప్రీతి. ఈమె మజ్జాధాతువునకు అధిపతి.
    భ్రూమధ్యమందు విలసిల్లే ఈ చక్రం మనలో 3,240 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఈ స్థానం మనస్సుకు మనకు సంధానం చేస్తుంది. ఇది ఈ శరీర మనే ఆలయానికి గర్భగుడి ద్వారం లాంటిది. 

    ధ్యానమను స్థితిచేత ప్రకాశించు ఈ చక్ర కమలమందు రెండు దళాలు కలవని తెలుసుకున్నాం. ధ్యానమనగా ధ్యానింపబడు విషయం, ధ్యానించువాడు అను రెండు మాత్రమే కలిగిన స్థితి. 'హ'కారం, 'క్ష'కారం అను రెండు దళాలతో కూడిన ఈ పద్మం అదే స్థితిని సూచిస్తుంది. ద్యానింపబడు పరమాత్మ, ధ్యానించే జీవాత్మ మాత్రమే వుండే స్థితి. ఈ ధ్యానంను సాధన చేస్తే జ్ఞాననేత్రం తెరుచుకొని ఆత్మదర్శనం అవుతుంది. ఇది సంపూర్ణత్వాన్ని సిద్ధింపజేసే చక్రం. తద్వారా పొందే స్థితి బ్రహ్మత్వపు స్థితి. బ్రహ్మమే తానని తెలుసుకునే స్థితి. ఇక్కడ అన్నింటిని పరిత్యజించి జీవుడు బ్రహ్మభూతుడవుతాడు . సాధకుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. 

     'శ్వాస' ప్రక్రియకూ, ఆధ్యాత్మిక శక్తికీ చాలా సంబంధముంది. స్థూలశరీరానికి సంబంధించి లంగ్స్, తద్వారా హార్ట్, బ్లడ్ లో ఆక్సిజన్ సరిపడినంతగా సరఫరా చేయటానికి ఈ శ్వాస ప్రక్రియే ఆధారం. అందులోని  వొడిదుడుకులు సరిచెయ్యటానికి, దాని శక్తి యింకా పెంచటానికి ప్రాణాయామం ఎంతో తోడ్పడుతుంది. ఈ శ్వాస వలన వచ్చేశక్తి స్థూలశరీరానికి ఎంత అవసరమో, సూక్ష్మశరీరానికి కూడా అంతే అవసరం. మనం లోపలకు తీసుకునే గాలి మూలాధారం వరకు వెళ్ళి, తిరిగి పైకి వస్తూ స్వాధిష్టాన చక్రంలో చైతన్యం పొంది ప్రాణశక్తిగా, జీవశక్తిగా మారుతుంది. తద్వారా ఇడా పింగళ సుషుమ్నా నాడుల ద్వారా ఆజ్ఞాచక్రంకు చేరుతుంది. ఈ చక్రమే శ్వాస చంచలగతిని అదుపుచేసి క్రమక్రమంగా నిశ్శలం చేసి కైవల్యానికీ, మోక్షానికీ, జీవన్ముక్తికీ కారణమౌతుంది. ఈ చక్రాన్నే దివ్యనేత్రమనీ, జ్ఞానచక్షువనీ అంటారు. అలానే ఈ స్థానాన్నే త్రివేణీసంగమం అంటారు. 'త్రివేణిసంగమం' గురించి మరికొంత వివరణకై  ఇక్కడ చూడండి.  
    ఈ చక్రంనకు పంచకోశాలలో విజ్ఞానమయకోశంతో సంబంధం. శారీరక వ్యవస్థలోని రక్తప్రసరణవ్యవస్థతో సంబంధం.

    ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
    రక్తక్షీణత, రక్తస్రావం అను వ్యాధులు సంభవించును. వినాళ గ్రంధులవ్యాధులు, అధిక రక్తపోటు, ప్రేగులలో పుండ్లు లాంటి వ్యాధులు కలుగును.  
    ఈ చక్ర మానసిక స్వభావం -
    మూసుకుపోవడం వలన మానసిక స్థిరత్వం లేకపోవటం, కనులలో లోపాలు,క్షమాగుణం లేకపోవటం, నిరాశ నిస్పృహలతో కూడిన అలసట, అన్ని విషయాలయందు సందేహస్పదులు.  
    తెరుచుకుంటే మనసులో, దృష్టిలో స్థిరత్వం, ఏకాగ్రత వుంటుంది. సూక్ష్మ బుద్ధి అలవడుతుంది. వివేకానికి మూలమై సత్యాన్ని గ్రహించమని నిర్దేశిస్తుంది. ఆధ్యాత్మికమైన శక్తి, ఆలోచన, అంతరదృష్టిలను  పెంపొందిస్తుంది. నీటియందు మంచుగడ్డ కరిగిపోయినట్లు 'నేన'ను అహం అంతర్యామి యందు కరిగిపోవును. 
    ఈ చక్రమును శుద్ధిచేసుకోవడం ఎలా???
    శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
    ఈ చక్రంనకు హాకీని అధిష్టానదేవత. ఈమెకు పులిహార మందు ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే పులిహారను స్వీకరించుచూ, వ్యాధులను బట్టి అవసరమైనచో తగు ఔషదములను ఉపయోగిస్తూ 'ఓం' అను బీజాక్షరమును ధ్యానించువారికి ఈ వ్యాధులు నివారణ కాగలవు. ఓంకారం వేదమునకు మొట్టమొదటి బీజం. ఈ ఓంకారం వివరణకై ఇక్కడ ఓంకారం - 1&2చూడండి.
    ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
    నియంత్రణతో కూడిన భావనలు చేయడం అవసరం. ధారణ, ధ్యానం ఇందుకు ఉపకరిస్తుంది.
    ఈ చక్రమునకు అధిపతి గ్రహం చంద్రుడు. మనిషి మానసిక స్థితికి, ధన సంపాదనకు చంద్రుడు కారకుడు. చంద్రుడు ఎప్పుడూ ఒకేలా వుండడు. వృద్ధి క్షయాలు కలిగినవాడు. అందుకే జాతకంనందు చంద్రుడు సరిగ్గా లేకుంటే చంచల స్వభావం కలిగి వుంటారు. చంద్రుడు నీటికి కారకుడు. అందువల్ల మంచినీరు ఎక్కువగా త్రాగాలి. అలాగే చంద్రుడు తెలుపువర్ణమునకు సంకేతం కావున సాధ్యమైనంతవరకు తెలుపురంగు వస్త్రాలు ధరించడం, ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు వుండేలా అభ్యాసం చేయడం, మృదువుగా మసులుకోవడం చేస్తే చంద్రానుగ్రహం సాధించినట్లే. తత్ఫలితంగా ఆజ్ఞాచక్రం సానుకూలంగా పనిచేస్తుంది.
    తదుపరి చక్రం 'సహస్రారం' గురించి తదుపరి టపాలో ...

    21, ఆగస్టు 2015, శుక్రవారం

    మాటే మంత్రం --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి [ఐదవభాగం]

    అర్ధవంతమైన ఆదర్శవంతమైన జీవితానికి, నైతికవర్తనతో కూడిన జీవనానికి ఆధ్యాత్మిక పురోగామిత్యమే మార్గదర్శకంగా వుంటుంది. ఈ ఆధ్యాత్మిక పురోగతి ఎలా సాధ్యమో తెలియజేస్తున్నాయి మన శాస్త్రములు. శాస్త్రములు అంటే యోగులు, జ్ఞానులు స్వానుభవం బట్టి నిర్ణయించిన సరళధర్మములు. వాటిని అవగాహన చేసుకొని ఆచరిస్తే పారమార్ధికంగా పురోగతి సాధించవచ్చు.

    నా అవగాహన మేరకు మనలో ఉన్న సప్తచక్రములు గురించి, ఆ సప్తచక్రాలలో జాగృతి తీసుకువచ్చే సప్తగ్రహాలు గురించి తెలిపే ప్రయత్నం కొన్ని టపాలా ద్వారా తెలియజేస్తున్నాను. 

    ప్రతీ చక్రానికీ, ప్రతీ గ్రహానికీ  శారీరక, మానసిక, లేక ప్రాపంచిక, పారమార్దికంగా విధులు ఉంటాయి. ప్రతీ చక్రకేంద్రమునకు ఉద్భోదనము, ఉత్తేజం కలిగించు శబ్దములు లేక అక్షరములు కొన్ని కలవు. వీటిని ఓ క్రమమైన పద్ధతిలో ఉచ్చరించుటవలన ఈ కేంద్రముల ప్రవృత్తిల యందు మార్పులు కలిగి ఆ చక్రాలలో తేడాలు సర్దుబాటుయగును. దానివలన వ్యాధులు నిర్మూలనమగును. ఈ బీజాక్షరములను సరైన పద్ధతిలో ధ్యానించడం వలన  అనారోగ్యములు తొలగడమే కాకుండా మానసిక వికారములు కూడా పోయి బుద్ధి వికసించును. అయితే ఈ విధమైన సాధన కష్టమని భావించేవారికి కొన్ని సులభమార్గములను మన యోగులు సూచించారు. గ్రహాలను సానుకూలపర్చుకోవడం ద్వారా, ధ్యానసాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమేనని తెలిపారు. గ్రహాలనుండి అనుగ్రహ ప్రవాహాన్ని స్వీకరించే శక్తి మనలో వున్న చక్రాలుకు వుంది. అందుకే గ్రహాలను సానుకూలంగా పనిచేయాలంటే ఏం చేయాలో సూచించారు. ఆ సూచన సద్గుణాల సాధన. ఈ విధమైన అంటే గ్రహాలను సానుకూలపరుచుకునే సాధన సాగించిన కొలదియు భక్తీ, ధ్యానం, చక్రజాగృతి, ఆత్మార్పణం ... ఇతరసుగుణములు ఒకటొకటిగా అంతరంగం నుండి వికాసం నొందును.  ధ్యానమంటే మనలో వున్న మాలిన్యాన్ని తొలగించుకోవడమే. ధ్యానం ద్వారా మాత్రమే మనస్సుకు వారసత్వంగా సంక్రమించిన స్వభావంనుండి విడుదల కావడం సాధ్యమవుతుంది. 

    గత నాలుగు టపాల్లో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత చక్రముల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఐదవ చక్రమైన విశుద్ధిచక్రం గురించి తెలుసుకుందాం -

    విశుద్ధిచక్రం - 
     
    ఐం హ్రీం శ్రీం రాం సోహం హంసశ్శివం: విశుధ్యధిష్టానదేవతాయై డాకినీ సహిత జీవేశ్వర స్వరూపిణ్యాంబాయై నమః

    ఈ కమలం 16 దళాలుతో ఉంటుంది. ఆకాశతత్త్వం. అధిదేవత డాకిని. ఈమె అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ, ఎ, ఏ , ఓ, ఔ , అం ,అః   అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమెకు పాయసాన్నమందు ప్రీతి. తెల్లని ఏనుగు (ఐరావతం) వాహనం.  

    కంఠప్రదేశం వెనుక వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 25,344 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. విశుద్ధి అంటే పవిత్రం (శుద్ధి) చేసేది అని అర్ధం. ఈ చక్రాన్ని సాధిస్తే పరమ పవిత్రులై, ఆత్మదర్శనానికి వున్న అడ్డంకులు తొలగించుకున్నవారై, తాము తెలుసుకున్నదానిని ఇతరులకు చక్కగా బోధించగలరు. ఈ చక్రంనకు పంచకోశాలలో విజ్ఞానమయకోశంతో సంబంధం.  జ్ఞానేంద్రియం చెవి. 

    ప్రతీ మనిషికి వాక్కు చాలా ముఖ్యమైనది. తనని తాను వ్యక్తపరుచుకోవటానికి వాక్కు చాలా అవసరం. మన సంస్కారమును తెలిపేది వాక్కే. అందుకే పెద్దలంటారు - 'బుర్ర(తల) విలువ నోరు చెప్తుంది' అని! ఊరికే మాట్లాడడం కాదు, చక్కగా మాట్లాడగలగాలి. మృదుభాషణం చక్కటి సంబంధ భాంధవ్యాలను నెలకొల్పుతుంది. పరుషవాక్కులు, వక్రభాషణం ఎన్నో అనర్ధాలను అంటగడుతుంది. మంచి స్నేహాలను, మంచి బంధాలను, సామరస్యవాతవరణం నుంచి దూరం చేస్తుంది. అలానే మాట్లాడకూడని సమయంలో మాట్లాడినా, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోయినా పొందవలసిన జీవితం చేజారిపోయినట్లే. ఇంత ముఖ్యమైన వాక్కుకు కారణం కంఠభాగంలో ఉన్న ఈ విశుద్ధచక్రమే. మాట ఎలా వుండాలంటే  ...  వివరణకై  ఇక్కడ చూడండి 

    ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
    ముక్కు, నోరు, గొంతు, చెవులు మున్నగు భాగములకు సంబంధించిన వ్యాధులన్నియూ ఈ చక్రం పరిధిలోనికే వచ్చును. థైరాయిడ్ సమస్యలు వచ్చును. మాటలు సరిగ్గా రాకపోవడం, ఎలర్జీ, ఆస్తమ, టాన్సిల్స్ మొదలైన వ్యాధులు కలుగుతాయి. సంతానలేమికి కూడా ఈ చక్రం కొంత కారణం. 

    ఈ చక్ర మానసిక స్వభావం:-
    మూసుకుపోవడం వలన భావవ్యక్తీకరణలో లోపం. వాక్కులో అనేక అపసవ్యాలు. ఊహాశక్తి లోపిస్తుంది. 

    తెరుచుకుంటే వాక్సుద్ధి. కవితాశక్తి, స్వర విజ్ఞానం, శాంతచిత్తం, శోకం లేకపోవడం, దీర్ఘాయువు. 

     విజ్ఞానమయకోశంతో సంబంధం ఉన్న ఈ విశుద్ధచక్రం ద్వంద్వాతీత చక్రం. చైతన్యపూరిత చక్రం. ఇక్కడకు చేరిన సాధకుడు ఆనందస్థితిని పొందుతాడు. ఈ ఆనందపారవశ్యంలో తదుపరి గమ్యాన్ని మరిచిపోకుండా ముందుకు సాగాలి. ఇక్కడే ఆత్మజ్ఞానం కల్గుతుంది. అహం నశిస్తుంది. నేను అనే తత్త్వం పూర్తిగా నశించి, నేను 'ఆత్మ'పరమై నా ఆత్మ అన్న భావం నుండి విశ్వాత్మ భావన లోనికి మారి, సాధకుడు కవి, వాగ్మి, బ్రహ్మజ్ఞాని అవుతాడు. భూత, భవిష్యత్తు, వర్తమానములను దర్శింపగలుగుతారు. జీవించుట తనకోసంకాక సృష్టి యందలి సకల జీవుల రూపంలలో నున్న పరమాత్మకొరకని తెలుసుకొని తదనుగుణంగా జీవిస్తాడు. విశ్వశ్రేయస్సును సాధించువాడగుటచే శోకం గానీ, రోగంగాని లేక చిరంజీవియై యుందురు. ఈ చక్రం శుభమును కోరువారికి, ఇంద్రియనిగ్రహం గలవారికి మోక్షద్వారం. 

    ఈ చక్రమందు పదహారు దళాల యందు అ నుండి అః వరకు గల పదహారు అక్షరములు పదహారు కళలు. అమావాస్య నుండి పౌర్ణమి వరకు గల చంద్రుని పదహారు కళలే ఈ పదహారు రూపములు. చంద్రుడు మాతృత్వమునకు, గర్భధారణకు అధిపతి. అమావాస్య సృష్టి లయమై యున్న స్థితిని, పౌర్ణమి సృష్టి పూర్తిగా వ్యక్తమైయున్న స్థితిని తెలియజేయును. 

    మరి ఈ చక్రమును ఎలా శుద్ధిచేసుకోవడం???
    శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
    ఈ చక్రంనకు డాకిని అధిష్టానదేవత. ఈమెకు పాయసాన్నం నందు ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే పాయసాన్నం స్వీకరించుచూ, వ్యాధులను బట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ, 'హం' అను బీజాక్షరంను ధ్యానించువారికి ఈ వ్యాధులు నివారణ కాగలవు. 

    ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే - 

    నిర్మలమైన నీలాకాశాన్ని చూడాలి. ఈ చక్రంపై మనస్సును నిలిపి ధ్యానం చేస్తూ ఉంటే మనస్సు ఆకాశంవలె పరిశుద్ధం అవుతుంది. నిర్మలమౌతుంది. 
    ఈ చక్రంనకు అధిపతి కుజుడు. ధైర్య సాహసాలకు సంబంధించిన గ్రహమిది. కుజుడు బాగా వేగం వున్నవాడు. పటుత్వం వున్నవాడు. అగ్నికి, ఆయుధాలకు సంబంధించినవాడు. ఎక్కడ స్థిరత్వముందో, ఎక్కడ కాళ్ళ క్రింద భూమి కృంగిపోతున్నా చలించని ఆత్మవిశ్వాసముందో, ఎక్కడ సూటిదనముందో, ఎక్కడ సమానత్వముందో అక్కడ కుజుని శక్తి అపారంగా వున్నట్లు అర్ధం. మనలో ఈ లక్షణములను అభివృద్ధి పరుచుకుంటే ఈ చక్రం సానుకూలంగా పనిచేస్తుంది. తద్వారా విశుద్ధి చక్రం సానుకూలం. 

    తదుపరిచక్రం 'ఆజ్ఞాచక్రం' గురించి తదుపరి టపాలో ... 


    23, జులై 2015, గురువారం

    ప్రేమమయం --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి [నాల్గవభాగం]

    గత మూడు టపాల్లో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక చక్రముల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నాల్గవ చక్రమైన అనాహతచక్రం గురించి తెలుసుకుందాం -

    అనాహతచక్రం :-
    ఐం హ్రీం శ్రీం శం హం సశ్శివస్శోహం అనాహతాదిష్టాన దేవతాయై రాకినీ సహిత సదాశివ స్వరూపిణ్యాంబాయైనమః 

    ఈ కమలం 12 దళాలు కలది. వాయుతత్త్వం. అధిదేవత రాకిని. ఈమె క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ  అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమె 'స్నిగ్ధోదన ప్రియా' అంటే స్నిగ్ధాన్నమందు ప్రీతి గలది. జింక వాహనం. 

    హృదయం వెనుక వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 19,440 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. అనాహతమంటే జీవశక్తిని నిరంతరం నిలిపి వుంచే స్థానం. ఆగని శబ్దబ్రహ్మం ఈ ప్రదేశంలో నినదిస్తూ వుంటుంది. ఈ శబ్దం రెండు వస్తువుల వల్ల ఉత్పన్నమైనది కాదు. అది అనాది శబ్దం. ఓంకార శబ్దం. ఈ చక్రాన్ని జయిస్తే సకలజీవరాసుల యెడల నిస్వార్ధమైన ప్రేమ ఉదయిస్తుంది. ప్రేమ ఓ దివ్యమైనశక్తిగా, విశ్వశక్తిగా నిరూపితమౌతుంది. ప్రేమ, దయ, కృతజ్ఞత, క్షమ అనేవి ఈ చక్రానికి సంబంధించిన అంశాలు. దిగువనున్న మూలాధారాది మూడుచక్రాలకు, ఎగువనున్న విశుద్ధాది మూడుచక్రాలకు ఈ అనాహతచక్రం ఇరుసుగా ఉండి రెండింటిని అనుసంధానిస్తూ పరిపూర్ణత్త్వంను కల్గించడానికి సూత్రదారిలా దోహదం చేస్తుంది. ఈ చక్రంనకు పంచకోశాలలో మనోమయకోశంతో సంబంధం. శారీరకవ్యవస్థలోని శ్వాసకోశవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం చర్మం. 

    ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
    చర్మవ్యాధులు, రక్తంనకు సంబంధిన వ్యాధులు, శ్వాసకోశవ్యాధులు, రక్తహీనత, గుండెజబ్బులు, న్యూమోనియా మొదలగు రుగ్మతలు కల్గుతాయి. వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. 

    ఈ చక్ర మానసిక స్వభావం :-
    మూసుకుపోవడం వలన ప్రేమరాహిత్యం, కఠినత్వం, ఒంటరితనం, వ్యర్ధ ప్రలాపనలు, మానసిక ఒత్తిళ్ళు. 

    తెరుచుకుంటే ప్రేమ, దయ, కృతజ్ఞత, సకల జీవరాసుల యెడ నిస్వార్ధప్రేమ, ఇంద్రియవిజయం, నిర్మాణాత్మక ఆలోచనలు , విశ్వజనీనత వికసించటం. 

    మనోమయకోశంతో సంబంధం ఉన్న ఈ చక్రమందే ఆశయాలు, భావాలు, లక్ష్యాలు, స్వప్నాలు ఏర్పడుతుంటాయి. ఆలోచనలు సమగ్రముగా, సక్రమముగా వుంటే ఇచ్చాశక్తి (విల్ ఫవర్) పెరుగుతుంది. సంకల్పబలం చేకూరుతుంది. వాక్శుద్ధి కలుగుతుంది. 

    మరి ఈ చక్రమును ఎలా శుద్ధి చేసుకోవడం???
    శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
    ఈ చక్రంనకు రాకినిఅధిష్టానదేవత. ఈమెకు స్నిగ్ధాన్నం నందు ప్రీతి. స్నిగ్ధాన్నం అనగా నేతితో కలిపిన అన్నం. ఈ చక్రం బలహీనంగా వున్నప్పుడు ఈ స్నిగ్ధాన్నం స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు  ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "యం" ధ్యానించువారికి ఈ నాడీమండలం వలన వచ్చేబాధలు నివారణ కాగలవు. 

    ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే - 
    ఇతరులకు హాని చేయకుండా వుండటం మాత్రమే కాదు, ఇతరులకు క్షేమం కల్గించటం అంటే ఇతరులకు మంచి చేయడం, అలాగే ఇతరులపట్ల ప్రేమానురాగాలు, ఆత్మీయత చూపాలి. అతిగా స్పందించడం ఈ చక్ర లక్షణం కాబట్టి సంపూర్ణ ఎరుకతో ధ్యానం చేయాలి. హాయి గొలిపే సంగీతం వినాలి. సేవాతత్పరత, క్షమాగుణం అలవర్చుకోవాలి. 
    ఇక  ఈ చక్రంనకు అధిపతి బుధుడు. ప్రతి ఆలోచననకు, ప్రతీ సంఘటనకు, ప్రతీ మాటకు అతిగా చలించడం, రకరకాల ప్రకంపనాలకు గురికావడంనకు కారణం ఈ బుధుడే. అతిగా చలించే స్వభావం బుధునిది. తీవ్ర ప్రతిస్పందన ఈ గ్రహ లక్షణమే. అందుచే అతి ఆలోచనలును, అతి తెలివిని తగ్గించుకొని, క్రమం తప్పని ధ్యానాబ్యాసం చేస్తూ, స్థిరంగా ఉండగలిగితే ఈ గ్రహం మనకు సానుకూలంగా పనిచేస్తుంది. తద్వారా ఈ చక్రం సక్రమముగా పనిచేస్తుంది. 

    తదుపరి చక్రం 'విశుద్ధచక్రం' గురించి తదుపరి టపాలో ... 


    15, జులై 2015, బుధవారం

    సాధనా లక్ష్యం --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి {మూడవభాగం}

    గత రెండు టపాల్లో మూలాధారం మరియు స్వాధిష్టాన చక్రాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మూడవ చక్రమైన మణిపూరక చక్రం గురించి తెలుసుకుందాం -


    మణిపూరకచక్రం :-
    ఐం హ్రీం శ్రీం వాం హం సస్సోహం మణిపూరాధిష్టానదేవతాయై లాకినీ సహిత వైష్ణవ స్వరూపిణ్యాంబాయై నమః 

    ఈ కమలం పది దళములు గల జలతత్త్వం కలది. అధిదేవత లాకిని. ఈమె డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ అను యోగినులచే ఆరాధింపబడుచున్నది. వాహనం పొట్టేలు.  'గుడాన్నప్రీతిమానసా /సమస్త భక్తసుఖదా లాకిన్యాంబ స్వరూపిణీ/ సర్వజనులకు సుఖాలు ఇచ్చే ఈ అధిదేవతకు బెల్లపు పొంగలి ప్రీతి. 

    బొడ్డునకు మూలంలో వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 4,536 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది.ఈ చక్రమందు ఉద్భవించే శక్తి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరంనకు అందిస్తుంది. ఈ చక్రంనకు పంచకోశాలలో ప్రాణామయకోశంతో సంబంధం. శారీరకవ్యవస్థలోని జీర్ణవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం నాలుక. పుట్టుట, జీవించుట, మరణించుట అను మూడు బిందువులతో కూడిన త్రికోణమే జీవసృష్టి. అట్లే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అను మూడు కేంద్రాలతో ఒక త్రికోణం ఏర్పడుచున్నది. ఈ త్రికోణమే భౌతికసృష్టికాధారం. ఈ మూడు చక్రాలు భౌతిక జీవితం సజావుగా సాగడానికి సహకరిస్తాయి. 

    ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - 
    అవయవములయందు నీరు చేరుట, నోటికి సంబందినవ్యాదులుకు కారణమౌతుంది. నియమాలు లేని ఆహారపు అలవాట్లువలన జీర్ణశక్తి మందగించి అజీర్తి, గాస్ట్రిక్ సమస్యలు కల్గుతాయి. ఉదరకోశ వ్యాధులు, గుండె బలహీనత, నిద్రలేమి, తలబరువు, కాలేయవ్యాధులు, అతిమూత్రవ్యాధి, రక్తక్షీణత, నేత్రవ్యాధులు కల్గుతాయి. 
    ఈ చక్ర మానసిక స్వభావం -
    మూసుకుపోవడం వలన కీర్తికండూతి, పెత్తనం చెలాయించాలనే అహం, అసూయ, అసహనం, దుడుకుతనం, క్రూరత్వం, కటుత్వం, స్వలాభపరులు, స్వార్ధపరులు.  తనను గురించి తాను తక్కువగా ఆలోచిస్తూ కుంగిపోవడం. 

    తెరుచుకుంటే లక్ష్యసాధన, ఆశయసిద్ధి, వ్యవహార దక్షత, ఉత్సాహం, ధనాపేక్ష, తన్ను తాను గౌరవించుకోవడం, ఆత్మవిశ్వాసం కల్గివుండడం, జీవితంలో అన్నింటా ముందడుగు. 
    ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది. అనుమానాల్ని నివృత్తి చేసుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ, అన్నింటినీ అవగాహనతో విశ్లేషించుకుంటూ, విశ్వాస, వివేక జ్ఞానంలను అలవర్చుకుంటూ ముందుకు సాగాలి. మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం, అపనమ్మకం రెండూ ఏర్పడేది దీనివలనే. 

    లక్ష్యసాధనకు ఉపయోగపడే చక్రం. లక్ష్యసాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ వుంటాయి. పరాజయాలు పలకరిస్తుంటాయి. ఇది సహజం. సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఆశావాదం పెంచుకొని, నిరాశావాదాన్ని మదినుండి తరిమివెయ్యాలి, చిన్న చిన్న అనారోగ్యాలని, అవరోధాల్ని, అవమానాల్ని కుంటిసాకులుగా చెప్పుకొని ఆగిపోక ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. ఓటమి అన్నది గుణపాఠమే గానీ, అంతిమతీర్పు కాదని గ్రహించాలి.   

    మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం???
    శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
    ఈ చక్రమునకు లాకిని దేవత. సర్వజనులకు సుఖాలునిచ్చే ఈ దేవతకు బెల్లపు పులగం ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే బెల్లపు పులగంను స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "రం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు. 

    ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే - 
    అనుభూతులను (ఆనందంగానీ, విచారం గానీ, దుఃఖం గానీ, ఆవేశం గానీ... ) లోపల దాచుకోకుండా సహజంగా బయటకు వెళ్లనీయాలి. దీర్ఘంగా శ్వాసించడం చేయాలి. 
    అలాగే ఈ చక్రంకు అధిపతి గురుడు. ఆరోగ్యంగా వుండాలన్న, సంపదలు కలిగి వుండాలన్న, సుఖంగా వుండాలన్నా, ఈ చక్రం బలంగా వుండాలి. సప్తచక్రాలలో ఈ చక్రం ప్రత్యేకంగా ప్రతిపత్తి కలది. అదే మాదిరిగా నవగ్రహాలలో గురుగ్రహం ఓ ప్రత్యేకమైన శుభగ్రహం. బ్యాంక్ బాలెన్సు నుండి మెంటల్ బాలెన్సు వరకూ ఆధిపత్యం ఈ గురుగ్రహనిదే. 
    చెడు అలవాట్లు జోలికి పోకుండా, ముందొకటి వెనుకొకటి మాట్లాడక, నాస్తికత్వం వదిలి, చక్కటి వ్యక్తిత్త్వంను అలవర్చుకుంటే ఈ గ్రహం, చక్రం సక్రమంగా పనిచేస్తాయి. 

    ముఖ్యగమనిక :-
    కొందరు ఈ చక్రం అగ్నితత్త్వం గలదిగా అనుకుంటారు. కానీ ఈ చక్రం జలతత్త్వంనకు సంబంధించినది. శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో చెప్పిన వర్ణన బట్టి ఇది జలతత్త్వం గలదిగా నిర్ధారణ చేసుకోవచ్చు. 

    తటిత్వం తం శక్త్యాతిమిర పరిపంథి స్పురణయా 
    స్పురన్నానారత్నాభరణ పరినద్ధేంద్రధనుషమ్ 
    తమశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్ 
    నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనమ్ 

    మణిపూరకమందున్న మేఘం శ్యామవర్ణము కలది. అనిర్వాచ్యమైనది. అంధకారంను పోగొట్టు మెరుపుతో గూడినది. నానావిధ రత్నాభరణములచేత చేయబడిన ఇంద్రధనస్సు కలది. ప్రళయాగ్నిచే తప్తంలైన ముల్లోకములను చల్లపరుచును. 

    తదుపరి చక్రం 'అనాహతం' గురించి తదుపరి టపాలో ... 


    6, జులై 2015, సోమవారం

    సాధనాసోపనం --- చక్రశుద్ధి -ఆనందసిద్ధి{రెండవభాగం}

    క్రిందటి టపాలో మొదటిచక్రమైన మూలాధారం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవచక్రమైన స్వాధిష్టానం గురించి తెలుసుకుందాం -

    స్వాధిష్టానచక్రం :-



    ఐం హ్రీం శ్రీం కాం సోహం స్వాధిష్టానదేవతాయై కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్యైనమః 

    ఈ కమలం ఆరు దళాలుగల అగ్నితత్త్వం కలది. అధిదేవత కాకిని. ఈమె బ, భ, మ, య, ర, ల అను యోగినులచే సేవించబడుతున్నది. వాహనం మొసలి. 'మేధోనిష్టా మధుప్రీతా బందిన్యాది సమన్వితా / దధ్యాన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణీ // మేధోదాతువునకు అధిష్టానదేవతయైన ఈమెకు పెరుగన్నం ప్రీతి.  
    స్వాధిష్టానం (స్వ + అధిష్టానం) తనను తానుగా సమాజంలో నిరూపించుకోవడానికి అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. అనేకజన్మలనుండి వెంటతెచ్చుకునే పాపపుణ్యాలను అనుభవంనకు తీసుకొచ్చే చక్రమిది. 

    జననేంద్రియము వెనుకభాగమున వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 11,664 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఇది స్త్రీలల్లో ఓవరీస్ కు, పురుషులలో టెస్టిస్ కు ప్రాణశక్తినిస్తుంది. గర్భస్థశిశువుకు ప్రాణశక్తినిచ్చే చక్రమిదే.  జీవునకు తల్లి గర్భమునందు స్థానమేర్పడుటకు మూలాధారచక్రం కారణం కాగా, అటు తర్వాత పిండం భౌతిక శరీరంగా ఏర్పడుటకు కావాల్సిన ప్రాణశక్తిని ఈ చక్రమే ఇచ్చుచున్నది. 
    ఈ ప్రాణశక్తి వలనే శరీరవ్యాపారాదులు నడుచుచున్నవి. శరీరంలోని ఉష్ణోగ్రత ఈ చక్రంనకు సంబంధించినదే. జీర్ణశక్తి అధికమవ్వడానికి తోడ్పడుతుంది. ప్రాణవాయువు ఊపిరితిత్తులనిండా వ్యాపించటానికి ఈ చక్రం సహాయకారి అవుతుంది. ఈ చక్రంకు పంచకోశాలలో ప్రాణమయకోశంతో సంబంధం. శారీరక వ్యవస్థలోని విసర్జక వ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం కన్ను. రాజస తామస గుణాలతో వుంటుంది. పునరుత్పత్తి కు సహాయకారి.  దీనిలోశక్తి  చైతన్యరూపంలో మనిషిలో ప్రవహిస్తూ ప్రాణమయ కోశానికి శక్తినందిస్తుంది

    ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - 
    శారీరకంగా పాండురోగం, కంటిజబ్బులు, గర్భకోశ వ్యాదులు, జ్వరాలు లాంటి రుగ్మతలకు కారణమౌతుంది. 

    ఈ చక్ర మానసిక స్వభావం -
    మూసుకుపోవడం వలన మితిమీరిన కామవాంఛ. విషయసుఖాలపై ఆసక్తి, అపరాధభావన, దురాశ, క్రోధం, అనుమానం, ఉద్రేకం జూదరితనం, వివాదాస్పదతత్త్వం, నిరాశనిస్పృహలు.  
    స్వాధిష్టానం తెరుచుకుంటే సత్యం అవగాహన అవుతుంది.  జీవియందలి 'నేను' అను వ్యక్తిగత ప్రజ్ఞయే అహంకారం. అట్టి అహంకారంవలన జీవుడు తనను తానూ పరమాత్మ నుండి వేరుచేసుకొనుచున్నాడు. ఇది జీవియందు నేనున్నాను అను సంకల్పంగా పనిచేయుచున్నది. తానేమిటో మర్చిపోయిన మనిషి ఆ మరిచిపోయిన సత్యానికై బయట దొరుకుతుందని వెదుకులాడుతూ తపన చెందుతున్నాడు, బాహ్యంగా గోచరిస్తుందని భ్రమిస్తున్నాడు, బయట నుండి సంపాదించవచ్చని ఆరాటపడుతున్నాడు, బాహ్యంగా దర్శించవచ్చని తాపత్రయపడుతున్నాడు. ఓ చర్యలో, సంఘటనలో, సన్నివేశంలో, పరిచయంలో ఈ సత్యం లేదని, అది బయటనుండి రాదనీ, మనలోనుండే రావాలని, అంటే తనలో తానై ఈ సత్యం వుందన్న అవగాహనయ్యేది  ఈ చక్రశుద్ధి వలనే .  
    ప్రాణశక్తి చక్కగా ఆవిర్భవిస్తుంది. ఈ చక్రాన్నిఅధిగమిస్తే ఇంద్రియాలన్నింటిపైన నియంత్రణ కల్గుతుంది. 
    అలానే ఈ నాడీకేంద్రం  అంతర్గత సంస్కారానికి వేదిక. 

    మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం ???
    శాస్త్ర ప్రకారం పరిశీలిస్తే - 
    ఈ చక్రంనకు కాకిని దేవత.  మేధోదాతువునకు అధిష్టానదేవతయైన ఈమెకు పెరుగన్నం ప్రీతి.  ఈ చక్రం బలహీనంగా ఉంటే పెరుగన్నంను బలం కలుగుటకు స్వీకరించాలి. కాచిన పాలలో అన్నం వేసి తోడుపెట్టి ఉదయముననే ఆ పెరుగన్నం తినవలెను.వ్యాదులనుబట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ,  బీజాక్షరం "వం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు. 

    ఈ  చక్రంలో జాగృతి తీసుకురావాలంటే - 

    కరుణ, వాత్సల్యం, ప్రేమ, అనురాగం, మైత్రిల్లాంటి సద్గుణాలను అలవర్చుకోవాలి. అలాగే అహింసా వ్రతం(ఏ ఒక్కర్నీ మాటలతోగానీ, చేతలతోగాని నొప్పించి,బాధించే ప్రవృత్తి లేకుండా వుండడమే అహింస) ఆచరించాలి. 
    అలాగే ఈ చక్రమునకు అధిపతి శుక్రుడు. ఉల్లాసనికీ, మర్మాంగలకు, కామప్రకోపానికీ అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు విశేషించి స్త్రీల జబ్బులకు కారణభూతుడు. ఈ గ్రహం సానుకూలంగా వుండాలంటే - 
    హాయిగా నవ్వాలి. ఆనందంగా సంతోషంగా వుండాలి. సంగీతం, నాట్యం, రచన, హాస్యచతురత ఈ గ్రహపరిధిలోనివే. అందుచే యాంత్రికతకు భిన్నంగా మనస్సును రంజింపజేసే వినోదకార్యక్రమాలు, లలిత కళలలో పాల్గొంటూ, ఒకింత కళాపోషణ అలవర్చుకోవాలి. గాయత్రీ మంత్రాన్ని జపించడం, తాను నొవ్వక ఎదుటివార్ని నొప్పించక జీవించడం, మన భావాలు మరొకరికి భారం కాకుండా, బాధ కల్గించకుండా చూసుకోవడం లాంటివి ఆచరించగలిగితే శుక్రగ్రహం అనుగ్రహంతో స్వాధిష్టానం అనుకూలించి జాగృతి అవుతుంది. 




    ముఖ్య గమనిక :-
    కొందరు ఈ చక్రం జలతత్త్వం గలదిగా అనుకుంటారు. కానీ ఈ చక్రం అగ్ని తత్త్వంకు సంబంధించినది. శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరి లో తెలిపిన  పద్యం ఓసారి గమనిస్తే ఇది అగ్నితత్త్వం గలదిగా నిర్ధారణ చేసుకోవచ్చు. 
    తవస్వాదిష్టానే హుతవహ మధిష్టాయ నిరతం 
    తమిళేసంవర్తం జనని మహతీంతాం చ సమయాం 
    యదాలోకేలోకాన్ దహతి మహతి క్రోధకలితే 
    దయార్ద్ర యాదృష్టి: శిశిర ముపచారం రచయితి 
    అగ్ని తత్వానికి ఉత్పత్తి స్థానమగు స్వాదిష్టాన కమలమున ప్రళయాగ్ని జ్వాలారూపమైన శక్తి ద్యానింప తగినది. ప్రళయాగ్ని శక్తుల వలన జగములు భస్మమగును. భస్మములైన లోకములు మణిపూరక కమలమునందున్న భగవతి కృపచేత నిలుచుచున్నవి.

    తదుపరి మణిపూరక చక్రం గురించి తదుపరి టపాలో ...