'ఏతే భౌమామ్మయా యజ్ఞాః తీర్ధ రూపేణ నిర్మితాః'
తీర్ధాలు భూమి మీద జలమయమైన యజ్ఞాలు. అందుచే బ్రహ్మదేవుడు వీటిని సృష్టించాడు.
తీర్ధాలు భూమి మీద జలమయమైన యజ్ఞాలు. అందుచే బ్రహ్మదేవుడు వీటిని సృష్టించాడు.
ఐతే ఈ తీర్ధస్నానముల వలన లభించేది
కాస్తంత పుణ్యం, పరమాత్మునిపై భక్తిభావం. అంతేకాని ఇవి సంపూర్ణముగా
మానవుణ్ణి తరింపజేయవన్నది పెద్దల అభిమతం.
కరములందు నమరు గంగాధరునిబట్టి
తీర్ధములకుబోయి తిరుగుచుండ్రు
వెన్నబట్టి నెయ్యి వెదికినచందంబు
విశ్వదాభిరామ వినురవేమ !
చేతిలో వెన్న పెట్టుకొని నేతికోసం
వెదుకుచున్నట్లుగా, చేతిలో పరమాత్మను పెట్టుకొని తీర్ధాలకు తిరుగుతూ
ఉంటారు. అంటే అంతర్యామి అంతరంగమునే ఉండగా అది గ్రహించక ఎక్కడో
తీర్ధక్షేత్రాలలోనే పరమాత్ముడు ఉన్నాడని భావించడం తగదని అర్ధం.
కాశిబోదు ననుచు గడకట్టగానేల
వాసితీర్ధములను వగవనేల
దోసకారికెట్లు దొరకురా యాకాశి
విశ్వధాబిరామ వినురవేమ !
కాశీకి
వెళ్ళాలని తీర్దాలు చూడాలని విచారించటం ఎందుకు? దోషకారికెట్లు పుణ్యం
లభిస్తుంది? అంటే మోక్షమనేది పుణ్యకార్యాలు చిత్తశుద్ధితో చేయడంవలన
వస్తుంది కానీ తీర్ధయాత్రలు చేయడంవలన కాదు.
పూర్ణమైన ముక్తి పొందలేడు
నీరుకోడి యెపుడు నీళ్ళను మున్గదా
విశ్వదాభిరామ వినురవేమ !
నీళ్ళలో మునిగి స్నానాలు, తపస్సు
చేస్తున్నంతమాత్రమున నిర్మలాత్మనుకానీ, పరిపూర్ణ ముక్తినికాని పొందలేరు.
నీటికోడి ఎప్పుడూ నీళ్ళలోనే ఉంటుంది, అంతమాత్రమున అది మోక్షమును పొందినట్లు
అవుతుందా?
మానసేష్వపి తీర్దేషు యో నరస్స్నాతి బాహ్యకే
జలే న హి భవే చ్చుద్దో యధా మాండూక కచ్చపౌ
మనశుద్ధిలేక
బాహ్యతీర్ధములయందు స్నానంచేయువారు శరీరమలినమును కడిగివేయుటచేత ఎంతమాత్రమూ
పరిశుద్ధులు కారు. నిరంతరం నీటియందు యుండు కప్ప, తాబేలు మొదలగువానివలె
శుద్ధులు కాలేరు.
అడవి తిరుగ లేదు అకసమున లేదు
అవని తీర్ధయాత్రలందులే
ఒడలుకుద్దిచేసి ఒడయని జూడరా
విశ్వదాభిరామ వినురవేమ !
భగవంతునికోసం
అడవులలోనూ, ఆకాశంలోనూ, తీర్ధయాత్రలు చేయడంలోనూ తెలుసుకోలేరు. శరీరాన్ని
కుదుట పరచుకొని పరమేశ్వరుణ్ణి పరికించాలి. అంటే భగవంతునికై ఎక్కడెక్కడో
తిరగనవసరంలేదు, ఉన్నచోటనే మనస్సుని కుదుట పరచుకుంటే పరమాత్ముడుని చూడగలరు.
తిరిగితిరిగి నరుడు మరులుకొనుటేగాక
అందువలననేమి యాశ గలుగు
నంతరాత్మ నిలుపునతడే పో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమ !
బ్రహ్మజ్ఞానం
సంపాదించాలని నరుడు తీర్ధయాత్రలు చేయడంవలన శ్రమ మిగులుతుంది గానీ
జ్ఞానోదయం కలుగుతుందన్న ఆశ లేదు. అంతరాత్మయందు దృష్టిని నిలిపినపుడే
బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అతడే బ్రహ్మ అవుతాడు.
తీర్ధములయందు స్నానమాచరించిన చాలు తరించిదురు అన్న మహర్షుల వాక్యములకు అసలర్ధం ఏమిటంటే -
తరింపజేయునదే తీర్ధం. దేనివలన జననమరణ భయంకరమగు భవసాగరం తరింప బడునో, దానికే తీర్ధమని అందురు. అయితే అటువంటి పరమగతిని అందిచ్చే తీర్ధంలు ఏవీ? ఎక్కడ ఉన్నాయంటే -
మానసా న్యపి తీర్ధాని వక్ష్యామి శృణు పార్ధివ /
యేషు సంయజ్నరః స్నాత్వా ప్రయాతి పరమాం గతిమ్ //
సత్యం తీర్ధం క్షమా తీర్ధం తీర్ధ మింద్రియ నిగ్రహః /
సర్వభూతదయా తీర్ధం తీర్ధమార్జవ మేవ చ //
దానం తీర్ధం దమస్తీర్ధం సంతోషస్తృప్తి రేవ చ /
బ్రహ్మచర్యం పరం తీర్ధ మక్రోధ స్తీర్ధముచ్యతే //
మనశ్శుద్ది: పరం తీర్ధం తపస్తీర్ధ మనుత్తమమ్ /
ఆచార్యోపాసనం తీర్ధం శౌచం తీర్ధ మనుత్తమమ్ //
వైరాగ్యం పరమం తీర్ధ మసక్తం విషయేషు చ
సుతీర్ధం సమచిత్తత్వం తీర్ధమాత్మని దర్శనమ్
సత్సంగతి: పరం తీర్ధం తీర్ధాన ముత్తమోత్తమమ్
(సత్యం
పలుకుట, క్షమ, ఇంద్రియ నిగ్రహం, సమస్త ప్రాణులయందు దయకలిగియుండుట, ఆర్జవం,
దానం, దమం, సంతోషం, తృప్తి, బ్రహ్మచర్యం, అహింస, అక్రోధం, మనశుద్ధి,
తపస్సు, ఆచార్యోపాసనము, శౌచం, వైరాగ్యం, విషయవిరక్తి, సమచిత్తత్వం,
ఆత్మనిదర్శనం ఇవన్నియూ సుతీర్ధములు).
ఈ
సద్గుణ సంపన్నత సర్వతీర్ధాల స్వరూపములు కావున ఇవియే సుతీర్ధములనబడును. ఈ
దైవీగుణ తీర్ధాలకై హిమాలయ గుహల్లోకి వెళ్ళనవసరం లేదు, సప్తసముద్రాలలో
ఈదనవసరం లేదు, పర్వతశిఖరాలపైకి పయనించనవసరం లేదు, అరణ్యాలులో తపస్సు
చేయనవసరం లేదు. బాహ్యమున వీటికి అన్వేషించనవసరం లేదు. ఇవన్నీ మన సహజగుణాలు. ఇవన్నీ అంతరంగమున
అంతర్లీనంగా ప్రవహిస్తున్న జీవధారలు. దైనందిక వ్యవహారాల్లో సదా దైవచింతనలో
ఉండి సాధనద్వార ఈ సద్గుణములను పల్లవింపజేస్తే ఎల్లలూ, ఆనకట్టలు లేని
చైతన్యగంగాధారలో మునకలేయవచ్చు, పరమపావనం కావచ్చు.
గంగాజల నిమగ్నోపి నైవ శుద్ధ్యాత్కదాచన
ఈ తీర్ధములయందు కాక మానవుడు
కోటిసంవత్సరములు అనగా అనేక సంవత్సరములు బ్రతికి యుండి గంగాజలమందు
ప్రతిదినమును మునకలు వేసినను ఎంతమాత్రమును పరిశుద్దుడు కానేరడు.
'చేతస్సు నిర్మలో తీర్ధం' నిర్మలమైన చిత్తమే తీర్ధస్వరూపం.
ఈ సద్గుణములతో అంతరంగం శుద్ధమైన దశలో హృదయమే నిర్మలమైన పవిత్ర గంగాది పుణ్యతీర్ధములుగా మారి ఆంతర్యంలో ప్రవహించి తరింపజేస్తాయి.
ఈ సద్గుణములతో అంతరంగం శుద్ధమైన దశలో హృదయమే నిర్మలమైన పవిత్ర గంగాది పుణ్యతీర్ధములుగా మారి ఆంతర్యంలో ప్రవహించి తరింపజేస్తాయి.
'జ్ఞానమేవ పరం తీర్ధం' జ్ఞానమే ముఖ్యమైన తీర్ధం. భక్తిశ్రద్ధలుగల భావనాత్మకంబైన సద్గుణధ్యానయోగ సిద్ధంబగు జ్ఞానమే ఫలంకరంబైన తీర్ధంబగును.
ఆత్మానుభవజ్ఞానం అగు తీర్ధంనందు స్నానం చేసినవారే ముక్తిపొందుదురు. (ఉపనిషత్సార రత్నావళి)
చాన్నాళ్లకమ్మా.
రిప్లయితొలగించండిపూర్వం మహనీయులు అంతా తీర్థమ స్థలముల వద్ద నివశించేడి వారు కనుక తీర్థయాత్రలు ద్వారా సంవత్సరానికోమారయినా ఈ తీర్థ యాత్ర నెపంతో అలా సాధు సంత్ లను దర్శన మొనర్చుకోవటం జరిగేది అంతే కాక వారి సమ్ముఖం లో శ్రేయ మొనగోరు తాత్వికామ్శాలు కూడా విధిగా తెలుసుకోవటం జరిగేది, పైన చెప్పిన పద్యాలూ ఇతరములు అన్నీ కూడా కేవలము శుద్ధ జ్ఞానార్జన కోరేవారికి మటుకే, మనసు రజోగుణం చేత విక్షేపం చెంది, ఉన్న చోటనే సాధన చేస్తూ ఉండనీయక పలు చూట్లకు పోయేలా ప్రేరణ చేస్తూ ఉంటుంది, అందుకే అప్పుడు అలాంటి పురాకృత అభ్యాసం వలన ఏర్పడిన ఈ తీర్థ యాత్ర సంబంధిత వాసనలు ఈ సాధకుని జ్ఞాన విచారణ మార్గానికి ఆటంకం అవుతాయని తరువాతి కాలం లో అద్వైత సాంప్రదాయ పీటాల్లో ఇలా తీర్థ యాత్ర అథమాథమం అన్న మాట నిజమే కాని,
రిప్లయితొలగించండిఇక్కడ సర్వులు గమనించ వలసినది ఏమిటంటే, ఈ వ్యాసం కేవలం జ్ఞాన మార్గమును అవలంబించే వారికి మాత్రమె !!
జ్ఞానం అంటే ఏమిటి? సర్వే సర్వత్రా సర్వకాలాల్లో ఉన్నది భగవంతుడే, ఆ భగవంతునికి అన్యమేమీ లేదు. ఇదే జ్ఞానం అంటే!!
మరి భక్తో అలాకాదు స్వస్వరూపాను సంధానమే భక్తి అనే definition కుడా జ్ఞాన మార్గంలో వారిని ఉద్దేశ్యించి చెప్పినదే.
నిత్యం ప్రాపంచిక లంపటం లో చిక్కుకున్నవారికి తీర్థ యాత్ర ఆవశ్యకమై ఉన్నది, అది సరియైనదే ఒక స్థాయి వరకు,
మహనీయుల పాదం మోపిన పుణ్య స్థలి లో సంచరించుట ద్వారా, పుష్కర కాలంలో దివ్యమైన తీర్థాలలో స్నానమాచారించుట ద్వారా ఆ సమయం లో అశరీర సశరీర దివ్యాత్ముల సమాగమం జరుగుతుంటాయి కనుక
వీటిని నిషిద్ధం వలె భావించకూడదు అలానే ఇవే ముక్తిని ఇస్తాయి కాశిలో చనిపోవటం చేత కైలాసం సిద్ధిస్తుంది అనుకోవటం లో జ్ఞాన పరిపక్వత తప్పక ఉండాలి అప్పుడే నిజమైన కాశి అంతే తెలిసి ఎరుకతో శరీరాన్ని త్యజించటం చేత కైలాస సిద్ధి కల్గుతుంది.
కనుక భక్తి మార్గంలో ఉన్నవారు, సాధక జీవితము కాక సాధారణ జీవనం జీవించేవారు ఇటువంటి నైమిత్తిక కర్మను పాటించ వలసి యున్నది
సాధకులు సైతము స్వ ఇచ్చా ప్రారబ్ధం వలన కాని పరేచ్చా ప్రారబ్ధము వలన కాని ఇలా తీర్థ యాత్ర చేయ వలసిన స్థితి ఏర్పడితే శరీర భావం తో కాక ఆత్మ భావం తో తీర్థ యాత్ర చేయుట చేత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి సంప్రాప్తించే సూచన జరుగవచ్చు !!
సాయిరాం !!
ఈ గమనిక మీ post కి విర్రుద్ధము కాదు, మరింత విచారణా యుక్త వివరణ మటుకే నని మనవి
మీ ఈ స్పందన ఈ పోస్ట్ కు విరుద్ధమని భావించడంలేదు. మీ ఈ అభిప్రాయముతో నేనూ ఏకీభవిస్తున్నాను. కాకపొతే నాకు తెలిసిన ఓ కుటుంబం ఆ మధ్య ఎన్నో వ్యయప్రయాసలుకోర్చి కాశీకి వెళ్లివచ్చి అసంతృప్తికి లోనుకావడం చూశాను. అంతేకాక, పుణ్యక్షేత్రాలకు వెళ్ళివచ్చిన కొద్దిరోజులవరకే ఆ భక్తిభావంలో ఉండి అటుపై ప్రాపంచికతకే ప్రాధాన్యత ఇచ్చేవారినీ చూస్తున్నాను. అలానే ప్రతీ సంవత్సరం తీర్ధయాత్రలు చేసే ఓ కుటుంబమువారు తమ తమ గుణములతో తమచుట్టూ ఉన్నవారిని అశాంతికి గురిచేస్తుంటే, వారి వలన ఇబ్బంది పడుతున్నవారు 'ఎన్ని తీర్ధయాత్రలు చేస్తేనేమో - వారి స్వభావం సరిగ్గా లేనప్పుడు?' అని వ్యాఖ్యానించడం విన్నాను, భక్తిని భాహ్యప్రదర్శనకే తప్ప అంతరజ్ఞానంకు వినియోగించినవారిని చూస్తున్నాను. ఉన్నచోటనే ఉండి వారి వారి సద్గుణములతో, భక్తిభావాలతో ప్రశాంతజీవనం సాగిస్తున్న వారిని చూశాను. ఇన్ని చూసిన నాకు ఏమిటీ తీర్ధయాత్రలపరమార్ధం అన్న ఆలోచన కల్గింది. భగవంతునిపై భక్తిభావం పెంపొందడానికి సోపానాలు ఈ తీర్ధయాత్రలు. ఈ తీర్ధక్షేత్రాలమహిమవలన కాస్తంత పుణ్యం కూడా వస్తుంది. కానీ, ఈ పుణ్యం ప్రారబ్ధంలో అనుభవంతో ఖర్చయిపోతుంది. తరింపజేసేదే తీర్ధమంటారు కదా, తరిగిపోయే పుణ్యంను ఇచ్చే తీర్దాలుగాక, తరింపజేసే తీర్దాలేవీ అన్న నా సందేహంకి సమాధానముగా వశిష్టమహర్షి దీలిపమహరాజుకు చెప్పిన పై శ్లోకంలు ఓ పుస్తకంలో చదివాను. సద్గుణసంపన్నుడు కాశీలో ఉన్న భగవంతుడిని తనలోనే చూసుకోగలడు. వేమన చెప్పింది ఇదే - 'కాశి కాశి యనుచు కడు వేడ్కతో బోదు, రందుగల్గు దేవు డిందులేడే?, ఇందునందుగలడు హృదయంబు లెస్సైన, విశ్వదాభిరామ వినురవేమ!'
తొలగించండిఓ సాధకుడు ప్రాధమికమైన తీర్ధయాత్ర స్థాయి సోపానమునకే పరిమితం కాకుండా అనేక ఆధ్యాత్మిక సోపానాలను తన సాధనతో అధిరోహిస్తూ జ్ఞానదిశలో పయనించాలన్నది నా అభిమతం. అందుకే నాకు తెలిసిన ఈ సమాచారమును పై పోస్ట్ లో పెట్టాను. మీ ఈ స్పందనకు ధన్యవాదములు.
తీర్ధసందర్శన పేరిట నాలుగు వూళ్ళు తీరగాలనే కాని. నిజమయిన తీర్ధయాత్ర సంకల్పం ఎనాడో మరుగున పడింది.డబ్బు పేరిగి,సౌకర్యాలు ఎక్కువ కావటముతో ఇది కూడ విపరీత మయిన రద్దిగా మారిపోయాయి.
రిప్లయితొలగించండిపోస్ట్ చాలా బాగుంది.
రమేష్ గారు,
తొలగించండిధన్యవాదములండి.
శ్రీ రామకృష్ణ బోధామృతం అంశం: తీర్థ యాత్రల వల్ల ప్రయోజనం పాతప్రతి పేజీనంబరు 116 :
రిప్లయితొలగించండి336. ప్రపంచం నాలుగు దిక్కులా తీర్థ యాత్రలు చెయ్యవచ్చు గాక, నీకేక్కడా పరమార్థం చేజిక్కదు. ఉన్నదంతా యిక్కడే (హృదయం)లో ఉంది.
337. తీర్థ యాత్రలు చెయ్యటాని కై అనేక మంది శిష్యులు గురుదేవుడికి తమ కోరికలను నివేదిన్చేవారు. అందుకు గురుదేవుడు యిలా అనేవాడు:
''మంచిది. ఇక్కడ (అంటే గురు సన్నిధి లేక స్వయంగా తనలోనే) పరమార్థాన్ని గాంచిన వ్యక్తికి అక్కడా (అంటే పుణ్య తీర్థాలలో) వుంది.
ఇక్కడ గాంచని వ్యక్తికి అక్కడా లేదు, లేదా హృదయంలోనే భగవత్ భావన కలవ్యక్తికి అది పుణ్య క్షేత్రాలలో మరింత వృద్ధి అవుతుంది. సుదృడ మౌతుంది. కాని హృదయంలో భక్తి లేని వ్యక్తికి తీర్థ యాత్రలలో ప్రయోజనం ఏమిటి? .......
((ఇవేళ ఉదయం శ్రీ రామ కృష్ణ బోధ మృతం రోజు మాదిరి తీయగానే ఈ వాక్యాలు కనిపించాయి.
మీ post చదివి నిన్నటి రేయి గడిస్తే ఈ వాక్య స్మరణ తో నేటి రోజు ఆరంభ మయ్యింది అందుచేత
ఇవి ఇక్కడ ఉంచ దలచి ఈ comment చేయు చున్నాను )))
- jai sairaam
చాలా బాగుంది ,కానీ తీర్ధయాత్రలు మనసికోల్లాసం తో పాటూ అక్కడి వాతావరణం మరియు కుటుంబ సమేతంగా వెళ్లినందువల్ల కుటంబసక్యత పెరుగుతుంది. అసలు ప్రతిమనిషి తనలో దైవం వున్నదని తెలుసుకున్నరోజు ,మనము పక్కవాడికి అపకారం చేయకూడదు అని తెలుసుకున్నరోజు వాడు ఎవరికీ మొక్కక్కరలేదు ,ఎ నదిలో స్నానం చెయ్యక్కరలేదు ,తన మనసుకే దండం పెట్టుకుంటే చాలు .నేను మీలాగా తెలివి గలవాడినికాను,ఏదో అనిపించింది రాసాను ,తప్పులుంటేమన్నించ ప్రార్థన .
రిప్లయితొలగించండిఆది గారు,
తొలగించండిబాగా చెప్పారు. ధన్యవాదాలండి.
ఉపనిషత్సార రత్నావళి
రిప్లయితొలగించండి''ఉపనిషత్సార రత్నావళి ''
ఈ వేళ సాయం సంధ్య సమయం లో నాకు ఈ గ్రంథము లభించింది
చాలా పాత ప్రతి
సరే సాఫ్ట్ కాపి దొరుకుతుందేమో అని గూగుల్ లో గాలిస్తే మీ ఈ లింక్ కి రావటం జరిగింది
నిజం గా భూమి గుండ్రం
''ఉపనిషత్సార రత్నావళి '' చాలా చక్కటి గ్రంధం. దైవానుగ్రహం ఉంటేగాని, ఇటువంటి పుస్తకాలు లభించవు.
రిప్లయితొలగించండి