http://www.sodhini.com

21, జులై 2026, మంగళవారం

స్కందుడు చరితం - పునరావలోకనం

ప్రతీ పురాణ కథకు మూడు స్థాయిల అర్థం ఉంటుంది :

1. స్థూలార్థం – జరిగిన కథ.

2. ధార్మికార్థం - మనం ఎలా జీవించాలో చెప్పే నీతి.

3. పరమార్థం (ఆధ్యాత్మికం) - మన అంతరంగంలో జరిగే సాధనా ప్రయాణం.

గత టపాలో కొంత వివరణ తెలుసుకున్నాం. తారకాసురుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడు నుండి వరం పొందడం, శివునికి పుట్టే కుమారుడు తప్ప మరెవ్వరూ నన్ను చంపలేరు" అని వరం కోరడం (ఆ సమయంలో సతీదేవి దేహత్యాగం చేసిన తరువాత శివుడు ఘోర యోగనిష్ఠలో ఉండేవాడు. ఆయనకు వివాహం, సంతానం కలిగే అవకాశం లేదని భావించి తారకాసురుడు ఆ వరం కోరాడు) వరగర్వంతో తారకాసురుడు మూడులోకాలనూ పీడించడం ..... తెలుసుకున్నాం.

⭐ రెండవ టపా "స్కందుడు చరితం" విశేషాలతో మీ ముందుకు ...

లోకరక్షణ కోసం సతీదేవి పార్వతీదేవిగా జన్మించడం, శివుణ్ణి భర్తగా పొందాలని సంకల్పించి, ఘోర తపస్సు చేయడం, మన్మథ దహనం, శివపార్వతుల కళ్యాణం, సనత్కుమారుడు గత జన్మలో వేదాలను రాక్షసులు దొంగిలించారనే కోపంతో చదవడం వల్ల, ఆ వాసనాబలమే ఆయనను మళ్లీ జన్మ ఎత్తేలా చేయడం, అలాగే శివ ప్రణాళిక వలన ఇంద్రాది దేవతలు మాయలో పడడం...ఇత్యాది విషయాలు తెలుసుకున్నాం.

✍️ ఈ టపా లింక్ : స్కందుడు చరితం

ఈ కథనాలు ద్వారా నేటి తరంవారు గ్రహించవల్సిన అంశాలు -

👍 లక్ష్యసాధనలో పట్టుదల (పార్వతీదేవి తపస్సు)

శివుడిని భర్తగా పొందాలనే లక్ష్యం కోసం పార్వతీదేవి ఎన్నో కష్టాలను ఓర్చి తీవ్రమైన తపస్సు చేసింది. 

💫 నేటితరానికి అన్వయం :

నేటి యువత తమ కెరీర్ లేదా జీవిత ఆశయాలను సాధించే క్రమంలో చిన్న చిన్న ఒడిదొడుకులకే నిరాశ చెందుతుంటారు. పార్వతీదేవి తపస్సులాగే, ఎంచుకున్న లక్ష్యం పట్ల స్థిరమైన సంకల్పం, ఎంతటి కష్టాన్నైనా తట్టుకునే పట్టుదల ఉంటేనే అనుకున్నది సాధించగలరని ఇది తెలియజేస్తుంది.

ఆత్మగౌరవం & దృఢత్వం: (శివనిందను నిరసించడం)

బ్రహ్మచారి వేషంలో వచ్చిన శివుడు తనను తాను తక్కువ చేసుకుని, వివాహం చేసుకోమని కోరినప్పుడు, పార్వతీదేవి ప్రలోభాలకు లొంగలేదు. శివనింద చేస్తున్నాడని తెలిసి ఆ వ్యక్తిని దూరం పెట్టడానికే నిశ్చయించుకుంది. 

💫 నేటితరానికి అన్వయం:

ఆధునిక సమాజంలో యువత సులభమైన మార్గాల వైపు, ప్రలోభాల వైపు ఆకర్షితులవుతున్నారు. తమ విలువలకు, ఆత్మగౌరవానికి భంగం కలిగించే విషయాలు ఎదురైనప్పుడు, పార్వతీదేవిలాగే దృఢంగా "నో" (No) చెప్పగలగడం, తమ లక్ష్య సాధనపైనే దృష్టి ఉంచడం అలవర్చుకోవాలి.
 
ఆలోచనల ప్రభావం - లా ఆఫ్ అట్రాక్షన్  (సనత్కుమారుని కల)

సనత్కుమారుడు గత జన్మలో వేదాలను దొంగిలించిన రాక్షసులపై పెంచుకున్న కోపం, భావోద్వేగాల వల్లే ఆయనకు రాక్షస సంహారం చేస్తున్నట్లు కల వచ్చింది. ఆ ఆలోచనా బలమే ఆయనను తదుపరి జన్మలో దేవసేనాధిపతిగా పుట్టేలా చేసింది. 

💫 నేటితరానికి అన్వయం:

🧠 ఎమోషనల్ ఇంటెలిజెన్స్ 

ఎంతటి జ్ఞానులకైనా కోపం లేదా భావోద్వేగం కలిగితే అది వారిని వెనక్కి నెడుతుంది. కాబట్టి భావోద్వేగాల నియంత్రణ చాలా అవసరం. మనం నిరంతరం ఎలాంటి ఆలోచనలు చేస్తామో, మన జీవితం కూడా అలాగే రూపుదిద్దుకుంటుంది (లా ఆఫ్ అట్రాక్షన్). ప్రతికూల ఆలోచనలు, కోపం, ద్వేషం మన ఉపచేతన మనస్సులో (Subconscious mind) భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ సానుకూల, ప్రయోజనకరమైన ఆలోచనలనే కలిగి ఉండాలి.

♦️ భావోద్వేగ నియంత్రణ

శివుడు తపస్సులో ఉన్నప్పుడు మన్మథుడు బాణం వేసి చలనం కలిగించాలని చూశాడు. శివుడు క్షణకాలం వికార భావానికి లోనైనా, వెంటనే తన అంతర్గత శక్తులతో (మూడవ కన్ను) ఆ కామాన్ని/ఆకర్షణను భస్మం చేసేశాడు. 

💫 నేటితరానికి అన్వయం:

నేటి డిజిటల్ యుగంలో యువత చుట్టూ ఎన్నో ఆకర్షణలు, పరధ్యానాలు (Distractions) ఉన్నాయి. క్షణికమైన ఆకర్షణలకు లోనై జీవితాలను పాడుచేసుకోకుండా, శివుని వలె బుద్ధి బలం, విచక్షణా జ్ఞానంతో (జ్ఞాన నేత్రంతో) ఆ ఆకర్షణలను తుంచివేసి, మనస్సును అదుపులో ఉంచుకోవాలి.

🎯 వ్యూహాత్మక ప్రణాళిక - నాయకత్వం (శివ మాయ)

శివుడు ఒకేసారి మూడు భిన్నమైన సమస్యలను లేదా ఇచ్చిన మాటలను (దేవతల రక్షణ, సనత్కుమారుని వాసనాబలం పోగొట్టడం, పార్వతి గర్భవాసం లేకుండా చేయడం) పరిష్కరించడానికి "శివమాయ" అనే ఒక చక్కని వ్యూహాన్ని (Strategic Planning) అమలు చేశాడు.

💫 నేటితరానికి అన్వయం:

ఆధునిక కార్పొరేట్ రంగంలో లేదా వ్యాపారాల్లో నాయకత్వ లక్షణాలు (Leadership Skills) చాలా ముఖ్యం. ఒక సమస్యను పరిష్కరించేటప్పుడు కేవలం స్వల్పకాలిక ప్రయోజనాలు చూడకుండా, అందరికీ న్యాయం జరిగేలా, దీర్ఘకాలిక వ్యూహాలతో (Multi-tasking & Strategic execution) ఎలా ముందుకు వెళ్ళాలో ఈ ఘటన వివరిస్తుంది.

👉 పరిస్థితుల వెనుక ఉన్న మర్మం:

మన జీవితంలో కొన్నిసార్లు మనం ఊహించని పరిస్థితులు తారసిల్లినా,  మనకు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు అనిపించినా, ఎందుకిలా జరుగుతుందని అనిపించిన, ఏదీ మన చేతుల్లో లేదనిపించినా... ప్రతి ఘర్షణ వెనుక, ఘటన వెనుక, మన స్వభావాలో, గతజన్మ సంకల్పాలో, విధి వ్రాతో, దైవ ప్రణాళికో లేదా ఏదో ఒక మంచి దాగి ఉంటుంది. 

🔱 సాధకుని అంతర్ముఖ ప్రయాణం: పురాణ పాత్రల వెనుక ఉన్న అసలు తాత్త్విక రహస్యం -

మన్మథ దహనం కథకు పరమార్థం తెలుసుకుందాం.

మన్మథుడు

మన్మథుడు కేవలం ఒక దేవత కాదు.

"మనస్సును మథించేవాడు"  మనః + మథ = మన్మథుడు. అంటే, కోరిక, ఆకర్షణ, సంకల్పం, ఇంద్రియాసక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే - మనస్సును కదిలించే ప్రతి వాసనా మన్మథుడే. మనస్సులో నిరంతరం పుట్టే కోరికలు, పాత అలవాట్ల తాలూకు ముద్రలనే (Impressions) వాసనలు అంటారు. ఇవే సాధకుడిని బాహ్య ప్రపంచం వైపు లాగుతాయి.

🏹 పుష్పబాణాలు -

మన్మథుని బాణాలు కఠినమైనవికావు, అవి పుష్పబాణాలు. మనల్ని బంధించేవి చిన్న కోరిక, చిన్న ప్రశంస, చిన్న పేరు, చిన్న గర్వం...ఇవే మనస్సును బంధిస్తాయి.

👁️ శివుడు మూడవనేత్రంతో దహించడం -

మూడవ నేత్రం అంటే జ్ఞానదృష్టి. జ్ఞానం ఉదయించినప్పుడు కామం భస్మమవుతుంది. మన్మథుడిని శివుడు ఖడ్గంతో చంపలేదు. జ్ఞానాగ్నితో దహించాడు.

👉 మన్మథుడు ఎందుకు మళ్ళీ పుట్టాడు?

ఇక్కడే శివతత్వం తెలుస్తుంది. మన్మథుడు పూర్తిగా నశించలేదు. అనంగుడు అయ్యాడు. "అనంగ"అంటే శరీరం లేనివాడు. 

దీని అర్థం ఏమిటి?

కోరిక శరీరంలో ఉండదు. మనస్సులో ఉంటుంది. అది కనిపించదు. కానీ పనిచేస్తూనే ఉంటుంది. సాధకునికి ఇది గొప్ప హెచ్చరిక.

⚜️ సాధకునికి అన్వయం -

సాధన ప్రారంభమైనప్పుడు మొదట పెద్ద కోరికలు తగ్గిపోతాయి. తర్వాత సూక్ష్మ కోరికలు వస్తాయి. "నన్ను గొప్ప సాధకుడని అనుకోవాలి", "నాకు సిద్ధులు రావాలి", "నాకు దర్శనం కావాలి"... అనంగుడు అంటే ఇవే. కనిపించడు కానీ, మనలో ఉన్నాడు.

  • మన్మథుడు = కామం(కోరికలు, వాసనలు)
  • మన్మథ దహనం = జ్ఞానాగ్నిలో కామ-క్రోధాది వాసనల శుద్ధి.

ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ ....  అని గీతాచార్యుడు చెప్పినట్లు... పొగ అగ్నిని కప్పినట్లు, దుమ్ము అద్దాన్ని కప్పినట్లు, గర్భం మావితో కప్పబడినట్లు, కామం (కోరిక) జ్ఞానాన్ని కప్పివేస్తుంది. 

🪷 శివుడు పార్వతిని వరించడం -

పార్వతి కోరిక వల్ల శివుణ్ణి పొందలేదు. తపస్సు వల్ల పొందింది. ఇది సాధకులకు గొప్ప బోధ.

దైవాన్ని కోరికతో పొందలేం. సమర్పణతో పొందాలి. 

🪷 శివపార్వతుల కళ్యాణం:

ఇది పురాణంలో ఒక వివాహం.

కానీ యోగంలో....

చైతన్యం మరియు జీవశక్తి కలయిక.

శివుడు (పురుషుడు): నిశ్చలమైన, నిర్గుణ, నిరాకార "శుద్ధ చైతన్యానికి" (Pure Consciousness) ప్రతీక. సాక్షీభూతుడు(Silent Observer).

పార్వతి (ప్రకృతి): చైతన్యశక్తి, నిరంతరం మారే "జీవశక్తికి" (Dynamic Energy) రూపం. సృష్టిలో కనిపించే రూపాలు, కదలికలు అన్నీ శక్తి స్వరూపాలే.

  • శివుడు = నిర్గుణ చైతన్యం
  • పార్వతి = చైతన్యశక్తి (కుండలినీ)

 శివ - శక్తి కలయిక = చైతన్య ఐక్యత

"శివ - శక్తికలయికమనలో కుండలినీశక్తిని జాగృతి అయి సహస్రారంలో కలిసే చైతన్యఐక్యత" 

సాధకుని అంతర్ముఖ ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టం శివ-శక్తి కలయిక. జగద్గురు ఆదిశంకరాచార్యులవారు చెప్పినట్లు శివుడు (చైతన్యం) మరియు శక్తి (శక్తి స్వరూపం) వేర్వేరు కావు.

యోగ శాస్త్రం ప్రకారం, ప్రతి మానవ శరీరంలోనూ ఈ కుండలినీ శక్తి (పార్వతి) వెన్నెముక దిగువన ఉన్న 'మూలాధార చక్రం'లో సుషుప్త చేతనలో (నిద్రపోతున్నట్టుగా) ఉంటుంది. శుద్ధచైతన్యం(పరమశివుడు) శిరస్సు భాగంలోని 'సహస్రార చక్రం'లో నిశ్చల స్థితిలో ఉంటాడు.

ఒక సాధకుడు ధ్యానం, భక్తి, ప్రాణాయామాల ద్వారా మూలాధారంలో ఉన్న శక్తిని (కుండలిని) మేల్కొలిపి, సహస్రారంలో ఉన్న శివుని వైపు నడిపిస్తాడు. ఆ శక్తి సహస్రారాన్ని చేరుకుని శివునితో లయమైనప్పుడు, సాధకుడిలో ద్వంద్వ భావాలు (నేను, నువ్వు అనే భేదాలు) నశించి "చైతన్య ఐక్యత" (సమాధి స్థితి లేదా మోక్షం) కలుగుతుంది.

శివుడు నిశ్చలత్వం అయితే, శక్తి చలనం. శివుడు జ్ఞానం అయితే, శక్తి ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే బలం. ఈ రెండింటి ఐక్యతే సృష్టికి మూలం, సాధకుడికి ముక్తి మార్గం. 

అర్ధనారీశ్వర తత్త్వం శివ - శక్తి కలయికకు అత్యంత ప్రసిద్ధ రూపం అర్ధనారీశ్వర రూపం.

సాధకుడు నిష్కల్మషమైన భక్తితో (పార్వతి తపస్సు) సాధన చేసినప్పుడు, అతనిలోని పవిత్రమైన బుద్ధి (సనత్కుమారుడు) మేల్కొంటుంది. మూడవ నేత్రం ద్వారా జ్ఞానాగ్ని రగిలి, మనస్సును కదిలించే కోరికలు (మన్మథ దహనం) భస్మమవుతాయి. ఆ స్థితిలో, శరీరంలోని జీవశక్తి పరమాత్మ చైతన్యంతో లయమవుతుంది. ఈ పరమానంద స్థితినే "శివ-శక్తి కలయిక" లేదా "చైతన్య ఐక్యత" అంటారు.

సనత్కుమారుడు 

నిత్యజ్ఞాని. అయినా ఒక కథలో రాక్షసులు వేదాలను దొంగిలించారనే కోపంతో వేదాలు అభ్యసిస్తాడు. ఈ కోపం బయటకు ధర్మకోపంలా కనిపించినా, లోపల కోపం కోపమే.అదే వాసనగా మిగిలింది.

🔅 వాసన ఎంత శక్తివంతం?

ఇదే కథలోని గొప్ప బోధ.

యోగవాసిష్ఠం  పదే పదే చెప్పేదిదే - వాసనలే జన్మకు కారణం.

మంచి వాసన ఆనందాన్నిస్తుంది. చెడు వాసన దుఃఖానికి తీసుకెళ్తుంది. కానీ, వాసన ఉన్నంతవరకు జన్మ ఉంటుంది. అందుకే సనత్కుమారుడి లాంటి మహాజ్ఞానికీ ఒక సూక్ష్మ వాసన పునర్జన్మకు కారణమైంది.

కోపం - సూక్ష్మవాసన

పైకి కనిపించకపోయినా అంతరంగంలో దాగి ఉండే అసూయ, క్రోధాలు సాధకుడి ప్రయాణాన్ని వెనక్కి లాగే సూక్ష్మ రూపాలు.

⚜️ సాధకునికి అన్వయం

"నేను కోపపడుతున్నాను కానీ, ధర్మం కోసమే" అని అనుకుంటారు. కానీ, ఈ కథ చాలా సున్నితంగా చెబుతుంది. కోపం ధర్మం పేరుతో వచ్చినా దాని ముద్రమనస్సులో పడుతుంది. కోపమే కాదు, ఏ భావ వాసనలు విషయంలోనైనా అప్రమత్తంగా ఉండాలి.

🔱 ఇంద్రాది దేవతలు మాయలో పడడం - శివప్రణాళిక :

ఇది కూడా అద్భుతమైన సంకేతం.

దేవతలు అంటే మనలోని ఇంద్రియాలు దైవగుణాలు సూక్ష్మశక్తులు... ఇవి కూడా మాయకు లోనవుతాయి. ఎందుకు?

అహంకారం

✳️ మాయ - అహంకార పరీక్ష :

సాధనలో కొంత పురోగతి సాధించగానే 'నేను జ్ఞానిని' అనే అహంకారం తలెత్తుతుంది. ఈ అహంకారమే సాధకుడికి ఎదురయ్యే అతి పెద్దపరీక్ష(మాయ). 

మేమే చేశాం... అనే భావన. అందుకే శివుడు వారిని మాయలో పడనిస్తాడు.

👉 శివుడు మాయలో ఎందుకు పడవేస్తాడు?

శిక్షించడానికి కాదు. పరిపక్వం చేయడానికి.

గురువు కొన్నిసార్లు శిష్యుడిని వెంటనే లేపడు. పడనిస్తాడు. ఎందుకు? పడిపోయాక లేచినవాడు ఎప్పటికీ జాగ్రత్తగా ఉంటాడు.

ఇది ఏమి చెబుతోంది?సాధకుని జీవితంలో కూడా విఫలాలు అపజయాలు అవమానాలు అన్నీ కొన్నిసార్లు గురుకృపలో భాగమే. అప్పుడు అవి శాపాలు కాదు. సాధనకు సిద్ధం చేసే సోపానాలు.

సాధకుని ప్రయాణం -

ఆధ్యాత్మిక సాధనలో అడుగుపెట్టిన ఏ సాధకుడికైనా తన మనస్సే మొదటి శత్రువు, మొదటి మిత్రుడు! క్రింద ఉన్న ఉన్న చిత్రమును గమనిస్తే, మన అంతర్గత ప్రయాణంలో ఎదురయ్యే వికారాలు, వాటిని దాటి సాధించాల్సిన అంతిమస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతాయి.

దైవికశక్తులు :-

ఇది జీవుడు చేరుకోవాల్సిన మూల తత్వాన్ని (శివుడు/పరమాత్మ), దానికి తోడ్పడే దైవగుణాలను మరియు జ్ఞాన నేత్రాన్ని సూచిస్తుంది.

సాధనాంతర్యం :-

జీవాత్మ, పరమాత్మ వైపు సాగించే ప్రయాణంలో చేసే నిష్కల్మషమైన తపస్సు, బుద్ధి పవిత్రత మరియు ఆఖరున జరిగే చైతన్య ఐక్యతను ఇది చూపిస్తుంది.

అవరోధాలు ఫలితం :-

ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదురయ్యే మనో వికారాలు (వాసనలు, అహంకారం, కోపం) ఎలా నశిస్తాయో మరియు అంతిమంగా "జ్ఞానం" ఎలా ఉదయిస్తుందో కుమారస్వామి జననం వివరిస్తుంది.

పాత్రల విశ్లేషణ - సాధారణ కథ vs అంతర్గత తత్త్వం
పాత్ర / సన్నివేశం సాధారణ కథలో అర్థం సాధకుని అంతర్యాణంలో అంతరార్థం
శివుడు దేవదేవుడు / ప్రధాన దైవం పరమాత్మ (Pure Consciousness)
దేవతలు స్వర్గలోక వాసులు దైవగుణాలు (Divine Virtues)
మన్మథుడు ప్రేమ / కామ దేవత మనస్సును కదిలించే వాసన
శివుని మూడవ నేత్రం నుదుటిపై ఉన్న అగ్ని నేత్రం జ్ఞానం (Awakening)
పార్వతి హిమవంతుని కుమార్తె శక్తి (Dynamic Energy)
పార్వతి తపస్సు శివుని కోసం చేసిన సాధన శుద్ధ భక్తి (Pure Devotion)
శివ-శక్తి కలయిక అర్ధనారీశ్వర తత్త్వం / వివాహం చైతన్య ఐక్యత
మాయ భ్రమ లేదా లీలా విశేషం అహంకార పరీక్ష
సనత్కుమారుడు బ్రహ్మ మానస పుత్రుడు పవిత్రమైన బుద్ధి (Pure Intellect)
కోపం ఆగ్రహం / ఒక భావోద్వేగం సూక్ష్మ వాసన
కుమారస్వామి జననం కార్తికేయుని ఆవిర్భావం జ్ఞాన అవతరణ

తదుపరి టపాలో శివతేజస్సు అవతరణ, పంచభూతాల పాత్ర, కుమార సంభవం గురించి తెలుసుకుందాం.

19, జులై 2026, ఆదివారం

"ఇది కదా...స్కంద అనుగ్రహం" పునరావలోకనం

చాలా కాలం విరామం తర్వాత శాంతమ్మగారు కారణంగా బ్లాగును చూడడం అయింది. వారి కోరిక మేరకు అసంపూర్ణంగా ఆపేసిన సుబ్రహ్మణ్యస్వామి కథనాన్ని కొనసాగించే ముందు గత మూడు టపాల సారాంశంను వరసగా సంక్షిప్తంగా స్మరించుకుంటూ, అలానే ఆయా సన్నివేశాలు నేటితరం వారు, ఆధ్యాత్మిక సాధకులు ఎలా అన్వయించుకోవచ్చో ఒకసారి అవగాహన చేసుకుందాం. 

నేటి యువత పురాణాలను కేవలం కథలుగా కాకుండా వారి జీవితానికి ఎలా పనికొస్తాయో గ్రహిస్తే, వేరేగా వ్యక్తిత్వ వికాస కోర్సులు, అశాంతి అసంతృప్తిలతో మానసిక థెరపీ అంటూ పరుగులు తీయనవసరం లేదు. 
అలానే సాధకులు కూడా పురాణ కథలను ముందుగా యథాతథంగా తెలుసుకోవడం, తరువాత ఆ కథకు సంబంధించిన తాత్త్విక వ్యాఖ్యానాలను అధ్యయనం చేయడం, చివరగా ఆ బోధను మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో ఆలోచించి ఆచరించడం చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు.

🌟 మొదటి టపా "ఇది కదా... స్కంద అనుగ్రహం" విశేషాలతో మీ ముందుకు!

అదితి దితిల ప్రవర్తన, తత్ఫలితంగా పొందే సంతానం, అలానే వజ్రాంగుని సత్త్వగుణ వైరాగ్యాలు, వరాంగి రజో తమోగుణాల స్వభావం, దితి వరాంగీలు దుష్టఆలోచనలతో సంతానం కోరుకోవడం, తారకుడు జననం, ముల్లోకాలను గడగడలాడించడం వరకు ఈ టపాలో తెలుసుకున్నాం.

✍️పై టపా లింక్ : ఇది కదా...స్కంద అనుగ్రహం

🧠 ఈ కథనం ద్వారా నేటితరం తెలుసుకోవాల్సిన అంశాలు

మానవ జీవన సంస్కారాలు ఎలా ఉండకూడదో, ఉంటే ఏమౌతుందో తెలియజెప్పే సన్నివేశాలు మొదటి టపా కథనంలో ఉన్నాయి.

⚡గర్భస్థ సంస్కారాల ప్రాముఖ్యత

ఒక బిడ్డ జననానికి, ఎదుగుదలకు కేవలం తల్లిదండ్రుల జీన్స్ మాత్రమే కాదు, తల్లి మానసికస్థితి, తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం కాబట్టి గర్భవతులు తమ తమ మనోభావాలు, తీసుకునే ఆహారం పుట్టబోయే బిడ్డలపై ఎంత ప్రభావం చూపుతాయో గ్రహించాలి. ప్రశాంతమైన వాతావరణం, మంచి ఆలోచనలు, మంచి ఆహారం, మంచిపుస్తకాలు చదవడం నేటి కాబోయే తల్లులకు ఎంతో అవసరం.

🔅 తప్పుడు సంకల్పం - తప్పుడు ఫలితం

శక్తి(వజ్రాంగుడు) మరియు కోరిక (వరాంగి) కలిసినప్పుడు ఒక ఫలితం పుడుతుంది. ఆ ఫలితం శుభమా అశుభమా అనేది కోరిక స్వభావంపై ఆధారపడి ఉంటుంది.
వరాంగి తనకు దుష్ట స్వభావి అయిన శక్తివంతమైన కొడుకు కావాలని కోరుకుంది కానీ, లోక కల్యాణం చేసే గుణవంతుడైన కొడుకు కావాలని కోరుకోలేదు. అందుకే తారకాసురుడు పుట్టాడు. (చివరకు అంతమయ్యాడు. ఎలా అన్నది ముందు ముందు తెలుసుకుందాం)

💫 నేటి తరానికి అన్వయం

మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని సంకల్పించుకున్నప్పుడు, ఆ సంకల్పం సత్సంకల్పమై ఉండాలి. కేవలం "విజయం, ధనం దర్పం" మాత్రమే ఆశించకూడదు. దాని వెనుక ఉన్న ఉద్దేశం (Intention) సమాజానికి మేలు చేసేదై ఉండాలి. స్వార్థంతో కూడిన తప్పుడు సంకల్పాలు చివరకు పతనానికి దారితీస్తాయి.

దీన్ని నేటి సమాజంలో చూస్తే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు సమాజానికి ఉపయోగపడే మంచి గుణవంతులు కావాలని కోరుకోవడం లేదు. కేవలం 'నా కొడుకు/కూతురు అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, సమాజంలో అందరినీ వెనక్కి నెట్టేసి కోట్ల రూపాయల ప్యాకేజీ సంపాదించాలి, నా దర్పం నిలబెట్టాలి' అని కోరుకుంటున్నారు. ఈ స్వార్థపూరితమైన పోటీ తత్వమే నేటి యువతలో విపరీతమైన ఒత్తిడికి, అశాంతికి కారణమవుతోంది. మనం కోరుకునే సక్సెస్ వెనుక పిల్లల ఆరోగ్యపూరిత ఎదుగుదల లేకపోతే, అది తారకాసురుడి లాంటి అహంకారాన్నే సృష్టిస్తుంది.

🔱 ఆధ్యాత్మిక అంతరార్థం

కశ్యప ప్రజాపతి

"కశ్యప" అనే పదానికి అనేక నిరుక్తులు ఉన్నాయి. తాత్త్వికంగా ఆయనను సమస్త జీవసృష్టికి మూలమైన చైతన్యబీజంగా చూస్తారు.

ఆధ్యాత్మికంగా చూస్తే - సాధకునిలో ఉన్న సృజనశక్తి.

అదితి

"అదితి" అంటే అఖండం, అవిభక్తం, అనంతం.

ఆధ్యాత్మికంగా చూస్తే - ఏకత్వ దృష్టి. అందరిలో పరమాత్మనే చూడటం.
అందుకే అదితి నుండి జన్మించిన ఆదిత్యులు వెలుగు, ధర్మం, క్రమం, దైవత్వానికి ప్రతీకలు.

దితి 

"దితి" అంటే విభజన.

ఆధ్యాత్మికంగా చూస్తే - నేను-నువ్వు అనే ద్వైతభావం. తత్ఫలితంగా పోలిక, అసూయ, ద్వేషం, ప్రతీకారం పుడతాయి.
ఇవి అసురసంపత్తికి బీజాలు.

వజ్రాంగుడు

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది.

వజ్రాంగుడు అసురకులలో పుట్టినా అతనిలో సత్యం, భక్తి, తపస్సు, వైరాగ్యం ఉన్నాయి. ఎక్కడ పుట్టినా, జన్మ కంటే గుణమే గొప్పదనడానికి తార్కాణం వజ్రాంగుడు.

వరాంగి

ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది.

వరాంగి బ్రహ్మచే సృష్టింపబడింది కానీ, పరిసరాల ప్రభావం, అసురుల నడుమ ఉండడం, వారు వండిన ఆహారం తినడం వలన రజో తమో గుణాలను పొందింది. ఫలితంగా లోకక్షేమం కోసం కుమారుడు కావాలి అని కాకుండా, ముల్లోకాలను గడగడలాడించే కొడుకు కావాలని కోరుకుంది. 

👉 వజ్రాంగుని భక్తి తపస్సు వైరాగ్యం ఎందుకు సరిపోలేదు?

ఇక్కడే కథలో అత్యంత గొప్ప బోధ ఉంది.

వజ్రాంగుడు సత్త్వగుణి కానీ, ధర్మవిరుద్ధమైన కోరిక కోరిన భార్యతో, నీ కోరిక సరైనది కాదు అని, మంచి చెడు వివరించలేదు, వారించలేదు. మరల బ్రహ్మ కోసం తపస్సు చేసి, భార్య కోరిక తీర్చడం తన ధర్మమని, అటువంటి కొడుకును ఇమ్మని అడిగాడే తప్పా, ఏం చేయమంటారు ఈ విపరీత కోరికకు అని అడగలేదు. అంటే, వివేకం ఒక క్షణం బలహీనపడింది.
సాధకునికి కూడా ఇదే ప్రమాదం. ఏళ్ల తరబడి సాధన చేసినా ఒక్క చిన్న అవివేకం మనస్సును దారి మళ్ళిస్తుంది. 

తారకుడు

వజ్రాంగుని తపోబలం, వరాంగి యొక్క ఆకాంక్ష, దితి యొక్క ప్రతీకారం. ఈ మూడూ కలిసి తారకాసురుడిని ఉత్పత్తి చేశాయి. అంటే, శక్తి + కోరిక + అహంకారం = అసురత్వం
తారకుడు కేవలం అసురుడు కాదు. తపో సంపన్నుడు. కానీ, తప్పుడు సంకల్పం, నాకంటే గొప్పవాడు లేడు, నేనే అందర్నీ జయించగలను,  నేనే అన్నీ సాధించగలను... అనే అహంకారం. ఇది సాధారణ అహంకారం కాదు, తపోశక్తి ఇచ్చిన అహంకారం. ఇదే అత్యంత ప్రమాదకరం.


💡 నేటి యువతకు అన్వయం :

దీన్ని నేటి యువ ఉద్యోగులకు అన్వయిస్తే ఒక వ్యక్తి ఎంతో కష్టపడి (తపస్సు లాగా) చదువుకుని ఒక పెద్ద కంపెనీలో సీఈఓ కావచ్చు, లేదా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు. కానీ ఆ సక్సెస్ తలకెక్కినప్పుడు 'నేనే గ్రేట్, నాకంటే గొప్పవాడు లేడు, నేనే అంతా సాధించాను' అనే అహంకారం వస్తుంది. సమాజంలో కొద్దిగా జ్ఞానం లేదా హోదా రాగానే ఇతరులను తక్కువ చేసి చూసే ఈ 'జ్ఞాన అహంకారం' లేదా 'కార్పొరేట్ అహంకారం' సరిగ్గా తారకాసురుడి ప్రవృత్తి లాంటిదే. దీనివల్ల ఎంతటి మేధావైనా పతనం కాక తప్పదు.

⚜️ సాధకుడుకు అన్వయం

ఒక సాధకుడు మొదట భక్తిని, సత్త్వగుణాన్ని పెంచుకుంటాడు. సాధనను ఓ తపస్సులా చేస్తాడు. సిద్ధత్వం వస్తుంది. కానీ, మనస్సులో సిద్ధులు ప్రాప్తించగానే, పేరు ప్రతిష్ఠ గుర్తింపు పట్ల చిన్న కోరిక మిగిలితే, అదే వరాంగి. ఆ కోరికను తపస్సు పోషిస్తే పుట్టేది తారకాసురుడు.ఇక అధోగతే. అహంకారం తలెత్తితే తారకాసురుడు (అజ్ఞానపు అహంకారం) పుట్టినట్లే. ఈ అజ్ఞానపు అహంకారం సాధారణ అహంకారం కంటే ప్రమాదకరమని యోగులు హెచ్చరిస్తారు.

🔱 సుబ్రమణ్యస్వామి ఎందుకు పుట్టాలి?

తారకాసురుణ్ణి విష్ణువు చంపలేదు, బ్రహ్మ చంపలేదు, దేవతలు చంపలేదు.....ఎందుకు???

ఎందుకంటే - ఆధ్యాత్మిక అహంకారాన్ని తొలగించేది బాహ్యశక్తి కాదు. అంతరశక్తి. అందుకు కావాల్సింది గురుగుహ జ్ఞానం. అందుకే శివుని జ్ఞానం శక్తితో కలిసి సుబ్రమణ్యస్వామిగా అవతరించింది.



🛐 ఈ కథ మొత్తం ఒక సాధకుని అంతర్యానమే -


పాత్ర / సన్నివేశం సాధారణ కథలో అర్థం సాధకుని అంతర్యానంలో అంతరార్థం
కశ్యపుడు సమస్త జీవసృష్టికి మూలం సాధకునిలో ఉన్న సృజనశక్తి (Creative Energy)
అదితి దేవతల తల్లి ఏకత్వ దృష్టి (అందరిలో పరమాత్మను చూడటం)
దితి అసురుల తల్లి ద్వైతభావం (నేను-నువ్వు అనే భేదం, అసూయ)
వజ్రాంగుడు సత్త్వగుణమున్న అసురుడు కఠోరమైన తపస్సు / తపోబలం
వరాంగి వజ్రాంగుని భార్య సాధన మధ్యలో వచ్చే స్వార్థకోరిక (ఆశ)
తారకుడు ముల్లోకాలను పీడించినవాడు సిద్ధుల వల్ల తలెత్తే అజ్ఞానపు అహంకారం
శివుడు & పార్వతి జగత్ పితరులు పరమ గురువు (చైతన్యం) & కృపాశక్తి
కుమారస్వామి శివపార్వతుల పుత్రుడు గురుకృపతో మేల్కొన్న ఆత్మజ్ఞానం
తారకాసుర వధ రాక్షస సంహారం సాధకునిలోని అజ్ఞాన నాశనం

ఇలా చూస్తే ఈ కథ సాధకుడు జీవితంలో సాగుతున్న ఆధ్యాత్మిక గమనంగా కనిపిస్తుంది.

ఇక తదుపరి భాగంలో... అంతటి శక్తివంతుడైన తారకాసురుడిని వధించడానికి కుమారస్వామి ఎలా జన్మించాడు? ఆ జననం వెనుక ఉన్న యోగ రహస్యం ఏంటి? వచ్చే టపాలో తెలుసుకుందాం!