1, నవంబర్ 2011, మంగళవారం

భావశుద్ధియే జ్ఞానసిద్ధి (ఆచారాల అంతరార్ధం ఇదే)

అనేకనేక సాధనమార్గములు, యోగ పద్ధతులు అభ్యాస సూత్రములు వున్నను, వాటన్నింటినీ ఆచరించడం కొంత అసాధ్యముగా, కష్టతరముగా ఉండడంవలన బ్రహ్మభావచింతన వలనైనా తరించమని శాస్త్రాలు ఉద్భోదిస్తున్నాయి.
తానే బ్రహ్మమనెడి భావన కలిగియుండి, దేహాత్మ భావమును ప్రయత్నపూర్వకముగా శాశ్వతముగా విడిచిపెట్టి దినచర్యలు చేసుకుంటూ జీవించుటయే బ్రహ్మభావసాధన.
నేను ఫలానా అన్న దేహాత్మభావనను విడిచి, నేను బ్రహ్మమును అనెడి ఆత్మవాసనాభావమును శాశ్వతముగా మనస్సునందు యేర్పరుచుకొని, ఆ భావనతోనే జీవనక్రియలన్నిటిని జరుపుకొనుచుండవలెను.
మనోబుద్ధ్యా హంకార చిత్తాని నాహం, న శ్రోత్రం న జిహ్వ న చ ఘ్రాణ నేత్రం, న చ  వ్యోమ భూమిన్న తేజో న వాయు, శ్చిదానంద రూపః శివోహం శివోహం....
మనోబుద్ధ్యహంకార చిత్తములు నేను కాను. శ్రవణ జిహ్వలు కాని, నేత్ర ఘ్రాణములు కాని నేను కాదు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వి కూడా నేను కాదు. నేను శాశ్వతానందమును, చైతన్యమును, నేను శివుడును,శివుడును....... అన్నభావశుద్ధి కలగవలయును. 
నాహం దుఃఖీ న మే దేహో బంధః కో స్యాత్మనః స్థితః / ఇది భావరూపేణ వ్యవహారేణ ముచ్యతే //
నిత్యశుద్ధ స్వయంప్రకాశ జ్ఞాన స్వరూపుడైన నేను దుఃఖిని కాను, జన్మము లేనివాడనైన నాకు దేహమెట్లు కల్గును? సచ్చిదానంద లక్షణముగల ఆత్మ అయిన నాకు బంధమెక్కడిది? ఇలాంటి విచార భావరూప వ్యవహారములచే భక్తుడు ముక్తుడగుచున్నాడు.
అంతరశుద్ధికి ప్రధానమైనది భావశుద్దియే. భావం శుద్ధి అయినప్పుడే జ్ఞానం ప్రాప్తమగును.
భావతః సంవిశుద్దాత్మా స్వర్గం మోక్షం చ విందతి /
భావసంశుద్ధిగలఆత్మ స్వర్గమును, మోక్షమును పొందుచున్నది.
భావవృత్త్యా హి భావత్వం శూన్యవృత్త్యా హి శూన్యతా / బ్రాహ్మవృత్త్యా హి పూర్ణత్వం తధా పూర్ణత్వమభ్యసేత్ //
భావవృత్తి చేత భావత్వమును (అనగా జనుడు ఏయే భావన చేయుచుండునో, అలాంటి భావమును కల్గుటయు), శూన్య వృత్తిచే శూన్యత్వమును బ్రహ్మవృత్తిచే పూర్ణత్వంను  పొందుదురు. కనుక పూర్ణ బ్రహ్మభావనను అభ్యచించవలెను. అప్పుడే పూర్ణభావన ననుచరించి జ్ఞానము సిద్ధించును.
సనకాద్యాస్సదా జ్ఞానిన్ బ్రహ్మభావనయా యుతాః / జ్ఞానులగు సనకాది ఋషులు సదా బ్రహ్మభావన కలిగియుందురు.  జీవన్ముక్తి పొందగోరువారు సనకాదులవలె బ్రహ్మభావన కలిగియుండవలయును.
భావశుద్ధి: పరం శౌచం ప్రమాణం సర్వకర్మసు / చిత్తం విశోధయే త్తస్మా త్కిమన్యైర్బాహ్యశోధనై: //
భావశుద్దికన్న పరమగు శుద్ధి మరియొకటి లేదు. సమస్త కర్మలలో ఇదే ముఖ్యమగు ప్రమాణం. అట్లు చేయక బాహ్యంమాత్రము శుద్దిచేసుకొనిన ప్రయోజనం లేదు.
భావశుద్ధివిహీనానాం సమస్తం కర్మ నిష్ఫలమ్ / తస్మాద్రాగాదికం సర్వం పరిత్యజ్య సుఖీ భవేత్ // 
భావశుద్ధి సంపూర్ణముగా కలగనివారి సమస్త కర్మలును నిష్పలములు. అందువల్ల రాగాదులను మనోమాలిన్యములను పరిశుద్ధభావములతో పరిత్యజించి సుఖముగా వుండేలా ప్రయత్నించవలెను.
నిరంతరం 'అహం బ్రహ్మాస్మి' అనే నిశ్చల భావం కలిగియుండుటచే భ్రమరకీటక న్యాయమున బ్రహ్మత్వమును పొందుదురు.
వివిక్తదేశ ఆసీనో విరాగో విజితేంద్రియః / భావయే దేకమాత్మానం తమనంత మనన్యధీ: // 
సమస్త ఆశలను వర్జించి, ఇంద్రియములను వాటి వ్యాపారమునందు ప్రవేశింపకుండ   అణిచి, మనస్సును చలింపనీయకుండ  ఆత్మయందుంచి, ఆత్మయందు పరమాత్మభావన చేసుకొని ధ్యానించువారు బ్రహ్మప్రాప్తి పొందుదురు.
  • అందుకే మన పెద్దవారు పూజావిధానాలంటూ, ఆచారవ్యవహారాలంటూ కొన్ని పద్ధతులను నేర్పారు. వాటిని సునిశితముగా పరిశీలిస్తే అవన్నీ మొదట ఆధ్యాత్మిక సోపానములయి సాధన పెరిగేకొలది అవన్నీ మన భావశుద్ధత్వమునకే అన్నది అవగతమౌతుంది. ఏదైనాసరే ఓ విధిగా యాంత్రికముగా చేయకుండా అర్ధం గ్రహించి భావముతో చేయవలెను.
ఉదయం లేస్తున్నప్పుడు - 
                                
కరదర్శనం :- కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి / కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం // 
చేయి పైభాగాన లక్ష్మీ, మధ్యభాగమున సరస్వతి, చివరిభాగమున గౌరీదేవి వున్నందున ప్రాతః కాలమున ఈ శ్లోకం చదివి మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవలెను. (లేదా మూడుసార్లు శ్రీహరి, శ్రీహరి శ్రీహరి అని తలస్తూ  కరదర్శనం చేసుకోవలెను) [లక్ష్మీ,సరస్వతి,గౌరీదేవిలను దర్శనం చేసుకుంటున్న భక్తిభావం ఉండాలి]
భూప్రార్ధన :- సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే / విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే //
పాదస్పర్శతో భూదేవిని బాధిస్తున్నందుకు క్షమాపణ చెప్తూ కాలిని నేలకు  ఆన్చాలి. (లేదా పాదస్పర్శ క్షమస్వమే, భూదేవి నమోస్తుతే అనైన ప్రార్ధించవచ్చును) [క్షమాపణభావంతో నిజముగా నమష్కరించాలి]
ప్రాతః స్మరణ :- బ్రహ్మ మురారి స్త్రిపురాంతకశ్చ, భాను శ్శశీ భూమిసుతో బుధశ్చ / గురుశ్చ శుక్ర శ్శని రాహు కేతవః, కుర్వంతం సర్వే మమ సుప్రభాతమ్ // 
త్రిమూర్తులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు నాకు మేలు చేయుదురుగాక! [మేలు జరుగుతుందన్న నమ్మకభావన అనుభూతించాలి]
స్నానం :- గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి / నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు // 
[స్నానం అంటే హడావిడిగా నాలుగుచెంబులు పోసుకోవడం కాదు. ఇంట్లో స్నానం చేస్తున్నను పవిత్ర నదీజలములతో చేస్తున్నభావన పొందాలి. నదిదగ్గర చేస్తున్నప్పుడు 'ఇది విష్ణుపాదములనుండి ఉద్భవించి, శివుని జటాజూటం చేరి, అక్కడనుండి ఉరకలువేస్తూ, పరవళ్ళు త్రొక్కుతూ ఎందఱో దేవతలు, ఋషులు, మహర్షులు, యోగులు తపస్సాచరించిన పుణ్యభూమి హిమగిరులను తాకుతూ, కొండకోనలను, చెట్టుపుట్టలను స్పర్శించుతూ ఇక్కడ నదై ప్రవహిస్తుంది. ఆహా! ఎంతటి భాగ్యం.... ఇందు స్నానమాచరిస్తూ పునీతులమౌతున్నామన్న భావన ఉండాలి. అప్పుడే దేహశుద్ధితో పాటు మానసికశుద్ధి జరిగి మనస్సు నిర్మలమౌతుంది]
భాహ్యాభ్యంతరభేదేన శౌచం తు ద్వివిధం స్మృతమ్ / మృజ్జలాభ్యాం బహిశుద్ధి ర్భావశుద్ధి స్తదాన్తరమ్ //
బాహ్యాభ్యంతర భేదములచే శౌచం రెండువిధములుగా వుండును. జలముచే కలిగెడుశుద్ధి బాహ్యశుద్ది, నిర్మలభావము(భావశుద్ధి) చే కలిగెడుశుద్ధి అంతర శుద్ధి.
పూజావిధం :- చిత్రం, మృత్తిక, శిల, దారువు, లోహం.... దేనితో తయారైనదైనా దానిని భగవంతుని ప్రతిరూపముగా భావించి పూజిస్తాం. [ఈ రూపాలు మన ప్రగాడ  విశ్వాసభావనతో ఏర్పరుచుకున్నవి]
{న తే రూపం న చాకారో నాయుధాని న చాన్పదమ్ / తధ్కాపి పురుషాకారో భక్తానాం త్వం ప్రకాశాసే //
భగవంతునికి ప్రత్యేకముగా ఒక్క రూపముగాని, ఒక్క ఆకారముగాని, ఆయుధముగాని (శంఖు,చక్ర,డమరు మొదలగు), వైకుంఠ కైలాసాది ప్రత్యేక స్థలములుగాని లేనప్పటికిని భక్తవత్సలగుటచేతను, పరమకరుణాస్వరూపులగుటచేతను భక్తులయొక్క భావమును అనుసరించి అనేకరూపములను ధరించుచున్నారు. 
యే యధా మాం ప్రవద్యంతే తాంస్తదైవ భజామ్యహం ..... ఎవరు ఎలాంటి భావముతో నన్ను ఉపాసింతురో వారికాలాంటి భావముతో దర్శనమిత్తును.} 
దీపస్తుతి :- దీపం జ్యోతి: పరబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ / దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే // 
దీపజ్యోతే పరబ్రహ్మం. దీపజ్యోతే అన్ని తమో గుణాలని హరించేది. దీపం వల్లే సర్వం సాధ్యం. సంధ్యలో వెలిగే దీపానికి నమస్కారాలు. [దీపకాంతిలో తమోరజో గుణాలు హరిస్తాయన్న భావనతో స్థిరముగా పూజించవలెను]
పూజకు వినియోగించే పదార్దముల అంతరార్ధం :- కృష్ణభగవానుడు చెప్పిన పత్రం, పుష్పం, ఫలం, తోయంలకు అర్ధమేమిటంటే - పత్రం అంటే దేహం. ఈ శరీరమును వినియోగిస్తూ చేసే క్రియలను భక్తిభావముతో కృష్ణార్పణం చేయాలి.(ప్రారబ్ధకర్మనుండి విముక్తి కల్గుతుంది) పుష్పం అంటే హృదయం. పుష్పములా సున్నితముగా, సువాసనభరితంగా, స్వచ్ఛముగా వున్నా హృదయమును సమర్పించాలి. ఫలం అంటే కర్మఫలం. ఫలములో విత్తనములు వుంటాయి, అవి నాటితే తిరిగి చిగురిస్తాయి. అలానే కర్మల వలన జన్మించాల్సివస్తుంది. అలానే కర్మఫలాన్ని అనుభవించాల్సివస్తుంది. అలా కాకుండా త్రికరణశుద్ధిగా కర్మఫలాన్ని ఈశ్వరార్పణం చేస్తే కర్మబంధం తప్పుతుంది.(దీనివలన సంచిత, ఆగామి కర్మలనుడి విముక్తికల్గుతుంది) తోయమనగా భక్తిరసం. ఆరాధనతో, ఆర్తితో పరిపూర్ణ శరణాగతి భక్తిభావముతో మనస్సు ఉప్పొంగికార్చే ఆనందభాష్పాలను సమర్పించాలి. 
కొబ్బరికాయ :- కొబ్బరికాయ కొడుతున్నామంటే మన అహంకారమును వీడుతున్నామని. లోపలున్న తెల్లనికొబ్బరిలా మన మనస్సును సంపూర్ణముగా భగవంతుని ముందు పరిచామని. తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా మన జీవితాలని వుంచమని అర్ధం. కొబ్బరి బయటిభాగం మన శరీరమని, లోపలభాగం మన మనస్సని, మూడుకళ్ళు ఇడా,పింగళ, సుషమ్ననాడులని కూడా పెద్దలు చెప్తారు.
ధూపం :- సువాసనభరితమైన ధూపం మనలో వున్న చెడువాసనలను తొలగించాలని వెలిగిస్తాం.
హారతి :- కర్మవాసనలన్నియు కర్పూరముల పూర్తిగా క్షయింపబడాలని వెలిగిస్తాం. ఏ శేషములేకుండా భగవంతుని ముందు వెలిగించిన హారతి భగవంతునిలో కైకర్యం చెందినట్లుగా భక్తిభావంతో మనలోవెలుగుతున్నఆత్మ పరమాత్ముని యందు ఐక్యంకావాలని కోరుకోవడం. హారతిని కళ్ళకు అద్దుకోవడమంటే మన దృష్టి అంతర్ముఖం కావాలని.
భోజనమునకు ముందు :- అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లబే / జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి //
అన్నం బ్రహ్మరసో విష్ణు: భోక్తా దేవో మహేశ్వరః / ఇతిస్మరన్ ప్రభుం జానః దృష్టి దోషై: నలిప్యతే //
(ఏది భుజించినను భగవంతుని ప్రసాదముగానే స్వీకరించాలి)
భోజనము తర్వాత :- అగస్త్యం కుంభకర్ణంచ శమ్యంచ బడబానలమ్ / ఆహారపరిణామార్ధం స్మరామి చ వృకోదరమ్ //
ప్రయాణం :- జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః / అతవ్యాం నారసింహశ్చ సర్వతః పాతుకేశవః // 
నీటిబాధనుంచి వరాహావతారం, భూ సంబంధమైన బాధలనుంచి వామనావతారం, అడవుల్లోని బాధలనుంచి నరసింహావతారం, అన్ని బాధలనుంచి అన్ని అవతారాలకి మూలమైన శ్రీహరి రక్షించుగాక! (లేదా వనమాలీ గదీ శారజ్ఞి శంఖీ చక్రీ చ నందకీ / శ్రీమాన్ నారాయణో విష్ణు: వాసుదేవోభిరక్షతు // ; ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ / లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం // అని ప్రార్ధించవలెను)  
శయనవిధి :- రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం / శయనే యః స్మరేన్నిత్యం దుఃస్వప్నం తన్న నశ్యతి //  
ఈ ఆచారాల వెనుక ఆధ్యాత్మికశక్తి నిక్షిప్తమై వుంది. ఆధ్యాత్మిక తొలి సోపానాలు ఇవే. మేల్కొనే దగ్గరనుండి నిదురించేవరకు 'మనస్యేకం, వచస్యేకం, కర్మన్యేకం మహాత్మనాం' (మనస్సు, మాట, క్రియ ఈ మూడు ఒకదానికి ఒకటి సంబంధం సరిగ్గా కల్గియున్నాయో, లేదో సరిచూచుకుంటూ దినచర్య నిర్వర్తించాలి)
  • వీటన్నింటిని ఆచరించడంవలన భక్తిభావం పెరిగి క్రమేణ సత్వభావన స్థిరపడుతుంది. అటుపై తైలధారలా నిరంతర నామస్మరణ, జపం, మానసికపూజ, ధ్యానం అసంకల్పితముగా జరుగుతుంది. తద్వారా భావశుద్ధి పరిపూర్ణముగా కలిగి జ్ఞానం సిద్ధిస్తుంది. ఐతే ఈ శ్లోకములు, విధానములు తెలియనివారికి పరమాత్ముడు ప్రాప్తం కాడా? ప్రాప్తమౌతాడు... ఎలాగంటే - పూర్ణ భక్తిభావనతో మనకి తెలిసిన భాషలో మన భావనలను భగవంతునికి అర్పించినప్పుడు. మన భావననే ప్రార్ధనగా మలచగల్గినప్పుడు. ఉదాహరణకి: భక్త కన్నప్ప, తన ప్రేమైక భావనలతో పరమేశ్వరుని మెప్పించినట్లు. నిరంతర స్మరణ, అనన్య భక్తిభావన, సంపూర్ణ  శరణాగతి భక్తునికి వుండాలి. దీనికి ఓ నియమిత పద్ధతిగాని,  పరిమితిగానీ లేదు. ఎవరికి అనువైన పద్ధతిలో వారు సాధన కొనసాగించవచ్చు. కాకపొతే మనో, వాక్కు, కర్మేణ చేసే ప్రతీ క్రియయందు పరమాత్ముని చూడగలగాలి... సమస్తం సర్వాంతయామి సంకల్పమేనన్న స్థితప్రజ్ఞాభావంతో వుండగలగాలి... ప్రతీ అంకములో, ప్రతీ అంశములో, ప్రతీ అడుగులో, ప్రతీ క్షణములో, ప్రతీ వీక్షణములో, ప్రతీ చర్యలో, ప్రతీ మాటలో, ప్రతీ కదలికలో, ప్రతీ తలపులో, ప్రతీ చోటా పరమాత్మున్నే ద్యేయముగా వుండాలి... అంతే!  
  • ఇంతటి భావస్థితిలో వుండడం సాధ్యమైనా? కొంత కష్టమే అయినను అసాధ్యం కాదు. అభ్యాసం దృఢపడేవరకే కొంత అయోమయం, అటుపై అంతా ఆనందమే.  సాధ్యసాధ్యముల సందేహము వద్దు. ఫలితం గురించి ఆశ వద్దు. ఫలమేదైనా పరిపూర్ణ ప్రయత్నం మనది కావాలి.  
  • "ప్రయత్నం చేయక ఓడిపోవడం మరణించినట్లే. ప్రయత్నం చేస్తూ మరణించినను జయించినట్లే". 

5 కామెంట్‌లు:

  1. మీకు శత సహస్ర కోటి నమస్కారాలు నిన్ననే

    ఇది చదివి మా అమ్మకు, అమ్మమ్మకు వినిపిచాను

    ఎంతో ప్రేరనాత్మకం గా ఉండి

    నా blog లో మీ data ను వినియోగించుకున్నాను

    మరింతమంది ఈ అమృతాన్ని గ్రోలేదరని (60 persons viewed)

    సీత రామాంజనేయ సంవాదం చూసాను చాల పెద్ద మహోత్కృష్ట గ్రంధం అని విన్నాను.

    ధన్యోస్మి తల్లి !!
    .......
    మీరు సత్సంగం నడుపుతున్నార?
    మీ గురువుగారు ఎవరు?
    ఎక్కడ ఉంటారు?
    వివరాలు తెలియజేయగలరు...

    నేను మీరు చెప్పిన ప్రతి అంశాన్ని అక్కడొక సారి ఇక్కడొక సరి
    ఒక మార్గం లో ఒకమారు వేరొక మార్గం లో ఇంకో మారు
    చూడటం చదవటం వినటం జరిగింది
    full fledged గా ఇదే తోలి సారి
    అన్ని రకాల సాధనా పద్ధతులకు సమన్వయము చేసి ఒక thesis ని చూడటం ఇదే ప్రధమం.

    Jai Sree raam

    http://endukoemo.blogspot.com/2011/11/holy-smarana.html

    ?!

    రిప్లయితొలగించండి
  2. శరీరము లో . 24. ఇరవై నాలుగు తత్వాలతో కలిసి మాయఓ మనసా! • మాయ తన అఙ్ఞానాన్ని గురించి గ్రహించినవాడే నిజంగా తెలివైనవాడు

    శరీరము లో మనస్సు,బుద్ధి, చిత్తం, అహంకారం ఆత్మ .అంటారు. . అంటారు. )శరీరం లోపల,మనం బయట చూస్తున్న ప్రకృతి అంతటా వ్యాపించివున్న యోగులు ఆ ఆత్మ సూక్ష్మ మై చైతన్యం అమృతము అంటారు. ఆత్మ అంటారు. సూక్ష్మ తత్వమును సత్కర్మలు చేస్తూ వైరాగ్యముతో జీవించే యోగి మాత్రమే తెలుసుకోగలడు. అటువంటి యోగులకు కామము, క్రోధము, భయము, నిద్ర, లోభములు ఉండవు. యోగులు వాటిని వదిలి వేస్తారు. పండితుడు కామ సంబంధిత కోర్కెలను సంకల్పములను వదిలి కామమును జయిస్తాడు. సత్వగుణ సంపదతో నిద్రను, మోహమును జయిస్తాడు. గురువులను, పెద్దలను, పండితులను పూజించడము వలన లోభమును వదిలి వేస్తాడు. ఇంద్రియములను మనసు వాయివునిగ్రహించి జయిస్తాడు. యోగి దృఢమైన మనసుతో భయాన్ని జయిస్తాడు. ఏ ఒక్క ఇంద్రియము అదుపు తప్పినా యోగి యొక్క ప్రజ్ఞ మొత్తము నాశనం ఔతుంది. కనుక ఇంద్రియములమనసు అదుపులో ఉంచుకోవాలి. మనసును అదుపులో ఉంచుకోవాలి.
    ఇంద్రియ నిగ్రహము, రాగద్వేషములు, లోభములను పక్కన పెట్టే నేర్పు, దృఢమైన విద్య వీటి వలన కూడా పురుషుడు బ్రహ్మ పదమును పొంద వచ్చుప్రయత్న మీద ఇంద్రియములను నిగ్రహించ వచ్చు. మనస్సును నిగ్రహిస్తే ఇంద్రియము పని చేయడము మానివేస్తాయి. అప్పుడు బ్రహ్మప్రాప్తి పొందడము సులువు. బుద్ధి మన కనిపించదు, వినిపించదు కాని బుద్ధివలన మనము పరమాత్మను చూడగలము తెలుసుకోగలము
    చరాచరజగత్తులో అన్ని జీవరాశుల అందు భగవంతుడు ఆత్మ స్వరూపుడై వెలుగుతూ ఉంటాడు. ఆ పరమాత్మ అందు అన్ని జీవరాశులు సంచరిస్తున్నాయని తెలుసుకున్న వాడు పరబ్రహ్మపదమును పొందగలడు.
    శరీరము మృత్యువు పొంచి ఉంటుంది యోగి మాత్రమే తెలుసుకోగలడు అమృతము. మరాణానంరము పొందే స్వర్గ లోక అదియే అమృతము. పండితుడైన వాడు అన్నిటినీ సమానంగా చూస్తాడు. ఈ లోకాలను కాలము శాసిస్తుంది. కాలమును జయించిన వాడు పరబ్రహ్మ పదమును పొందగలడు.rathnam.sjcc@gmail.com

    రిప్లయితొలగించండి
  3. Mee posts chaalaavaraku eeroju chadivaanu. Mana aachaaraala antharaardhamulanu chakkagaa teliyajesharu. Thanks andi.

    రిప్లయితొలగించండి
  4. భగవ దాసక్తి యొనగూర్చు జగతి ' స్మరణ '
    భగవ దనుసర మార్గంపు జగతి ' స్మరణ '
    భగవ దారాధనా రూప జగతి ' స్మరణ '
    భగవ దనురూప సర్వస్వ జగతి ' స్మరణ ' .

    రిప్లయితొలగించండి
  5. మాస్టారు గార్కి,
    నమస్సులు.
    బాగున్నారా?
    మీ పద్యాలు సరళం, సూక్ష్మం, సుమధురం, సారమయం.
    అందరికీ అర్ధమయ్యేరీతిలో, అలతి అలతి పదాలతో అలరారే మీ పద్య శైలి అద్భుతం. మీ స్పందన నాకు అమూల్యం.

    రిప్లయితొలగించండి